శృతిర్మాతాః , లయః పితాః అని శృతి, లయలను జననీజనకులుగా అభివర్ణించింది మన శాస్త్రీయ సంగీతం...లయ సంబంధమైన వాయిద్యాలలో ఒక విద్వత్తు సంపాదించాలంటే చాలా సంవత్సరాల సాధన, కృషి, సంపూర్ణ శారదానుగ్రహం ఎంతో అవసరం.అలా శ్రీ శారదా మాత సంపూర్ణానుగ్రహం వలన ఘటం వాయించడంలో ఒక విసిష్ట శైలిని,తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గొప్ప ఘట వాయిద్య విద్వాంసులు తేటకుడి హరిహర వినాయక్రాం గారు. విక్కు వినాయక్రాం గా సంగీత ప్రపంచమంతటికీ సుపరిచితులులైన వీరు....ఘట వాయిద్య లయవిన్యాశాలకు వీరికి వీరే సాటి,మేటి అని అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మోర్సంగ్,మృదంగ,గోటు వాయిద్యాలలో ప్రఖ్యాత విద్వాంసులు,ఎందరో ప్రఖ్యాత సంగీత విద్వాంసులకు ఉత్తమ గురువు అయిన కళైమామణి శ్రీ టి.ఆర్.హరిహర శర్మ గారికి 1944 వ సంవత్సరం ఆగష్టు నెల 11వ తేదీన జన్మించారు. నిరంతరం మృదంగధ్వనులు వినిపించే ఇంటిలో జన్మించడం వలన సహజం గా చిన్నతనం నుండే వాటిని అభ్యసిస్తూ వచ్చారు. మొట్టమొదట వీరు మృదంగాన్నే అభ్యసించడం మొదలుపెట్టినప్పటికీ వీరికి ఘటం అంటే ఎందుకో తెలియని ఇష్టంగా ఉండేదట.అయితే ఆరోజుల్లో ఘటం కన్నా మృదంగ విద్వాంసులకు ఎక్కువ ఆదరణ లభించేదట. అలాంటి రోజుల్లో ఘటాన్నే ఎన్నుకుని దాన్ని నిరంతరం సాధన చేసి దాన్ని వాయించిన విశిష్టమైన తీరుకి ఆ వాయిద్యానికి తనద్వారా విశ్వవిఖ్యాత గుర్తింపుని తెచ్చిపెట్టిన వ్యక్తి శ్రీ విక్కు వినాయక్రాం. వినాయక్రాం గారి కచేరీల మహాప్రస్థానం 13వ ఏటనే ప్రారంభం అయ్యింది.1957లొ మొట్టమొదటి సారిగా తమిళనాడులోని ట్యూటికార్న్ లోని శ్రీరామనవమి ఉత్సవాలలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు వి.వి సదగోపన్ గారితో కచేరీ చేసారట. ఇక అప్పటినుండీ ఆకాలం నాటి మేటి సంగీత దిగ్గజాలైనటువంటి చెంబై వైద్యనాథ్ భాగవతార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం, మధురై మణి అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి మరియు శ్రీ మహరాజపురం సంతానం వంటి వారందరికీ విరివిగా విక్కు వినాయక్రాం గారే పక్క వాయిద్యం గా ఘటం వాయించేవారు. ఇదిలా ఉండగా ఈ కచేరీల విజయ పరంపర మన దక్షిణ భారతదేశంలో కొనసాగుతూ ఉండగా ఆయన ప్రపంచమంతా తెలియడానికి కారణమైనది మాత్రం 70వ దశకంలో ఆయన ఉస్తాద్ జాకిర్ హుస్సైన్(తబల), జాన్ మెక్లాగ్లిన్(గిటార్),ఎల్.శంకర్
(వయొలిన్), లతో కలిసి శక్తి మ్యూసిక్ బ్యాండ్ లో చేరడం.ఇక ఆతరువాత కాలంలో శక్తిబ్యాండ్ లో ప్రతీఒక్కరూ తమ శక్తిని ఎలా ప్రదర్శించారంటే పాశ్చాత్య శ్రోతలందరూ ఈ బ్యాండ్ విజృంబణకి ఉర్రూతలూగేవారు.ఓసారి శక్తిబ్యాండ్ గురించి వినాయక్రాం గారు ఏమన్నారంటే "ప్రపంచమంతా ఒప్పుకుంది మా శక్తి యొక్క సంగీతం అనూహ్యమైనదని.అయితే ఈ బ్యాండ్ ద్వారా మేము చేస్తున్న సంగీతానికి పునాదంతా మన శాస్త్రీయ సంగీతం యొక్క అపూర్వ రాగాలలోనే ఉంది.అయితే ఫ్యూషన్ మ్యూసిక్ లోకి అడుగుపెట్టే అవకాశం నాకు శక్తి ద్వారానే లభించింది...మా ఈ సమూహంలో ఒకరి స్వాతంత్ర్యాన్ని ఇంకొకరు గౌరవించడం వల్లనే ఈ అద్భుతాలని సృష్టించగలిగాము అంటూ శక్తి బ్యాండ్ ని "గాడ్ ఫాథర్ ఆఫ్ ఫ్యూషన్ మ్యూసిక్ " గా అభివర్ణించారు. ప్రపంచమంతా కేవలం కచేరీలు చెయ్యడానికే కాదు ఓ ఉత్తమ గురువు గా ఎంతో అనుభవంతో ఎన్నో విశ్వవిద్యాలయాలు కూడా వీరు పర్యటించారు. ఉదా:సెంటర్ ఫర్ వరల్డ్ మ్యూసిక్ (బెర్క్లీ ..క్యాలిఫోర్నియా)లో కొంత కాలం అధ్యాపకులుగా పనిచేసారు.నుదుటిపై విభూతి,కుంకుమ ఎర్రటి అంచున్న తెల్లపంచె,తెల్లటి చొక్కాతో చూడగానే దక్షిణ భారతదేశ సత్సాంప్రదాయ కుటుంబ వ్యక్తిగా అర్ధం అయ్యే ఈయన అక్కడ సంగీత పాఠాలు చెప్పేరంటే విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్త్ అన్నది అక్షర సత్యం అన్నమాట కాదు ఉన్నమాటే అనిపిస్తోంది. ఆయన చాలాసార్లు ఎమన్నారంటే “శక్తిలో చేరకముందు నేను కేవలం భారతీయులకే తెలుసు కాని ఆతరువాత అంటే శక్తిలో నా ఘటం వాయిద్యం విన్నాక కేవలం దక్షిన భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీలకే పరిమితమైన ఘటాన్ని యావత్ప్రపంచం ఓ ముఖ్య వాయిద్యం గా గుర్తించింది”.ఈ విధంగా వినాయక్రాం గారు ఘటానికే ఓ చరిత్రనే సృష్టించారు. ఇక వీరి జీవితంలో ఇంకో మైలు రాయి విశ్వవిఖ్యాత సంగీతజ్ఞుడు మికీహార్ట్ "ప్లానెట్ డ్రం" అనే వరల్డ్ మ్యూసిక్ ఆల్బంలో ఘటం వాయించడం.మిక్కీ హార్ట్ ప్రపంచంలో ఉత్తమ లయ విద్వాంసులందరినీ తన డ్రంస్ తో సమన్వయ పరిచి "ప్లానెట్ డ్రం" అనే ఆల్బం రూపొందించారు.ఈ ఆల్బం లో మన భారతదేశం నుండీ ఉస్తాద్ జాకిర్ హుస్సైన్(తబల)విక్కు వినాయక్రాం (ఘటం మరియు మోర్సంగ్) వాయించారు.ఈ ఆల్బం 1991వ సంవత్సరానికి "గ్రామ్మి అవార్డ్ ఫర్ వరల్డ్'స్ బెస్ట్ మ్యూసిక్ ఆల్బం "పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డ్ అందుకున్న తొలి దక్షిణ భారతీయుడిగా అపూర్వ గౌరవాన్ని ఎనలేని కీర్తిని,ఖ్యాతిని కూడా గణించారు వినాయక్రాం గారు. వినాయక్రాం ఎంత ఉదార్త హృదయం ,దైవ భక్తి ఉన్నవారంటే ఈ అవార్డ్ ద్వారా తనకు లభించిన ధనం అంతా "శ్రీ కంచి కామ కోటి పీఠానికి " ఇచ్చివేసారు. శక్తి తోనే కాక వీరు జె.జి.లయ అనే ఇంకో బ్యాండ్తో కూడా కలిసి ఉన్నారు.వారి జీవితం లొ మరిచిపోలేని ఇంకో సంఘటన సాక్షాత్తు సరస్వతీ స్వరూపమైన శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారితో కలిసి 1966 లో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటి శాస్త్రీయ సంగీత కచేరీ చెయ్యడం. అలాగే తాను ఎల్.శంకర్(వయొలిన్),జాకిర్ హుస్సేన్ (తబల) వీరు ముగ్గురు కలిసి అభేరి రాగం పై చేసిన రాగం-తానం-పల్లవి ఆల్బం 1996లో 38వ గ్రామ్మీ అవార్డ్లకి నామినీ గా కూడా వెళ్ళింది. వయస్సు రీత్యా డేబ్భయ్యో పడిలో ఉన్నప్పటికీ ఇప్పటి యువతకి కూడా ఈయన కచేరీలంటే ఎంతో అభిమానం అందుకే 2013వ సంవత్సరం ఎన్.ఐ.టి.రూర్కీ విధ్యార్ధులు వారి వార్షికోత్సవ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా విక్కు వినాయక్రాం గారి కచేరీ ఏర్పాటు చేసారు.ఆ కచేరీ యువతీ యువకులను ఎంతగానో అలరించింది.వినాయక్రాం గారి విశిష్టత ఏమిటంటే ఒక ఘటం పై ఒక దెబ్బ కొట్టి ఇంకో దెబ్బ కొట్టేలోపు ఘటాన్ని పైకి విసిరి మళ్ళీ చేత్తో పట్టుకోగల సమర్ధులు అలా ఎన్నిసార్లు చేసినా లయ ఏమాత్రం తప్పనివ్వని లయబ్రహ్మ ఆయన. తబలాకి జాకిర్ హుస్సేన్ ఎంత విశ్వవిఖ్యాత గుర్తింపు తెచ్చారో ఘటానికి మన విక్కు వినాయక్రాం అంత గుర్తింపు తెచ్చారు. నేను ఘటాన్ని నా జీవాధారంగా భావించి నేర్చుకోలేదు.అంటే సంపాదన కి నేర్చుకోలేదనీ ఘటమే నా జీవితంగా సాధన చేసానని ఎన్నో ముఖాముఖీ సమావేసాలలో చెప్పియున్నారు. ఘటం పై ఆయనకు గల అభిమానానికి ఇదే పరాకాష్ట. మొట్టమొదటిసారిగా 1988లో ఘట వాయిద్యనికి గాను సంగీతనాటక అకాడమీ అవార్డ్ అందుకున్నారు 2000వ సంవత్సరంలో ఉస్తాద్ హఫిజ్ అలీ ఖాన్ అవార్డ్ (హఫిజ్ అలీ ఖాన్ ప్రఖ్యాత సరోద్ వాదకులు,పద్మ భూషణ్ బిరుదాంకితులు) గ్రామ్మీ అవార్డ్ పొందిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు. 2002వ సంవత్సరంలో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ 2012లొ సంగీతనాటక అకాడమీ ఫెలోషిప్ (కళలకు సంగీత నాటక అకాడమీ ఇచ్చే అత్యున్నత పురస్కారం) 2014లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ కంచి కామ కోటిపీఠం ఆస్థాన విద్వాంసునిగా ,శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిచే ఘటం నాగమణి అనే బిరుదును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంచే కళైమామణి బిరుదును పొందిన ఘన విద్వాంసులు. విక్కు వినాయక్రాం ప్రస్తుతం దేశ విదేశాలలో అనేక కచేరీలు చేస్తూన్నప్పటికీ చెన్నయి నగరంలో వారి తండ్రి గారు 1956లో స్థాపించిన శ్రి జయ గణేష్ తాళ వాద్య విద్యాలయానికి ప్రధాన అధ్యాపకులగా వ్యవహరిస్తున్నారు.అంతేకాక మృదంగం నేర్చుకునే అభిమానులకోసం"థె ఆర్ట్ ఒఫ్ మృదంగం"అన్న పుస్తకం ఆంగ్లంలో "మృదంగ పదబోధిని " అనే పుస్తకాన్ని తమిళంలోనీ రచించారు. వీరికి ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు సెల్వగణేష్ ప్రఖ్యాత కంజీరా విద్వాంసులు.చిన్నకుమారులు ఉమాశంకర్ తండ్రి గారి వలె ఘట వాయిద్య విద్వాంసులు.వీరిరువురూ దక్షిణభారతదేశంలోనే కాక తండ్రిగారివలే ప్రముఖ పాశ్చాత్యులతో కూడా పనిచేస్తున్నారు.సెల్వగణేష్ గారు తండ్రి గారికి శ్రీ జయ గణేష్ తాళ వాద్య విద్యాలయం నడపడంలో, యువ లయ విద్వాంసులను తయారు చెయ్యుటలోను సహకరిస్తున్నారు. ఘటం వాయించడం తప్ప నాకు ఇంకేమీ రాదు...ఆ వచ్చినదాన్ని ప్రేమిస్తూ ఇదిగో ఇలా మీ ముందు ప్రదర్సిస్తున్నాను అంటూ... కచేరీలలో ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో "శభాష్" అంటూ పక్క వాయిద్యాలవారిని ప్రోత్సహించే మన తేటకూడి హరిహర వినాయ్కరాం ("విక్కు వినాయకరాం" ) ఇంకా ఆ సంగీత సరస్వతి సేవ చేస్తూ ఆయన తరిస్తూ మనలిని తరింపచేసేలా ఆయానకు ఆ శారదామాత ఆరోగ్యముతో కూడిన ఆయిష్షును ప్రసాదించాలని ప్రార్ధిద్దాం.
No comments:
Post a Comment