ఇలా ఎందరున్నారు ?- 20
అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని. సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. అతన్ని నిలదీసేందుకు వెళ్ళిన సంకేత, ప్రస్తుతం అతను మరో అమ్మాయితో ఇదే ఆట మొదలు పెట్టాడని తెలుసుకుంటుంది. అనంత్ కు ఆక్సిడెంట్ అవుతుంది. అతనికి సేవలు చేస్తుంటుంది సంకేత. నీలిమను శ్రీహర్ష పెళ్లి, అనంత్ తో సంకేత పెళ్లి జరిగిపోతాయి. ఇక చదవండి... )
‘ జీవితం ఓ యుద్ధరంగం , పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంతవరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క ‘ అని ఎవరో అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ, అనంత్ రెస్యూమ్ ను తానే స్వయంగా తయారుచేస్తూ కూర్చుంది సంకేత.
బయటి నుంచి వచ్చిన అనంత్ కోపంగా ఆ రెజ్యూమ్ ను లాక్కున్నాడు. సంకేత కంగారుగా లేచి దాన్ని తన చేతిలోంచి లాక్కోబోయింది. అతను నెట్టగానే విసురుగా వెళ్లి గోడ మీద పడటంలో ముక్కు పగిలి రక్తం వచ్చింది. చేతితో తడిమి చూసుకుంది. తడి, తడిగా రక్తం... కంగారుపడి ఊపిరి బిగబట్టింది. చేతికి అంటిన రక్తం వైపు పిచ్చి చూపులు చూసింది. తేరుకోడానికి ఎక్కువ టైం పట్టకపోయినా యుగయుగాల బాధను ఆ క్షణమే అనుభవిస్తున్నట్లు విలవిలలాడింది.
ఎన్నో ఏళ్లుగా వేలవేల స్త్రీల కళ్లలో ఇదే మౌన ఘోష...నరాలను పిండేసే ఇదే మౌనవ్యధ... అమ్మాయిల అన్ని సరిహద్దులు చెరిపేసిన ఈ కాలంలో కూడా ఇదే హృదయ శోకం...లాలింపు,ఓదార్పు, ఓ చిన్న చిరునవ్వు లేని బీటలు బారిన భూమిలాంటి బ్రతుకు,ఆ బ్రతుకుతో సర్దుబాటు. భర్త పైకి కన్పించకుండా ముఖంలో రంగులు మార్చుకోవటం... ఈ పని ఒక్క సంకేతనే కాదు చాలామంది భార్యలు చేస్తున్నారు.
***
ఏదైనా చెప్పుకోడానికి తనకంటూ ఉన్న ఆత్మీయ నేస్తం నీలిమే సంకేతకి. ఫోన్ చేసి, మాటల్లో, “అవునూ! శివాని వుండేది మీ వీధిలోనేనటకదా! ఎప్పుడైనా వస్తుందా?” అడిగింది సంకేత.
“రాదు. తనలోకం తనదే! తనకెవరూ చెప్పేవాళ్లు కూడా లేదు ఎప్పుడు చూసిన లాప్ టాప్ తగిలించుకుని తిరుగుతూ కన్పిస్తుంది...” అంది నీలిమ.
“అవును! తను ఉద్యోగం చేస్తోంది కదా! అలాగే వుండాలి మరి...” అంది సంకేత. ఇప్పుడు ఉద్యోగం చేసే ఏ అమ్మాయి కూడా అంత ఎత్తులో కనిపిస్తుంది.తనొక్కతే అధఃపాతాళంలో వున్నానన్న బాధ కూడా లేకపోలేదు......
నీలిమ వెంటనే “ రావద్దని ఎవరొద్దన్నారు...కాని శివాని వాళ్ల అత్తగారిని సరిగా చూసుకోవటం లేదు. ఈశ్వర్ డ్యూటీకి వెళ్లగానే ఆమెను ముందున్న వరండా గదిలో వుంచి, మిగతా గదులకి తాళం వేసుకొని వెళ్తుందట... శివాని అత్తగారు గోపికమ్మ చాలా మెతక మనిషి. ఏ మాటాపైకి చెప్పుకోలేదు... ఆమెను కామెంట్స్ చెయ్యకుండా ప్రశాంతంగా వినేవాళ్లతో అయితేనే నాలుగు మాటలు మాట్లాడుతుంది. ఏది మాట్లాడినా రహస్యంగా కడుపులో వుంచుకునే వాళ్ళతోనయితే ఇంకోరెండు మాటలు ఎక్కువగా మాట్లాడుతుంది అంతే! అలాంటి గోపికమ్మను శివాని బయటిగదిలో వుంచిపోతే ఆవిడ పరిస్థితి ఎలా వుంటుంది చెప్పు? పెద్దవాళ్లు ఒక్కసారిగా తినలేరు. డాక్టర్లు కూడా వయసు పెరిగేకొద్ది,కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినమని చెబుతారు....అలా తినే అవకాశం వరండా గదిలో వుండే గోపికమ్మకి వుందా? అప్పటికీ ఒకరోజు ‘నేను వున్నాను కదా! తాళం ఎందుకు వెయ్యటం’ అని... అన్నదట..’ఎవరెవరో వస్తారు. లోపలంతా తిరిగి వెళ్తారు. మనవాళ్ళే అనుకుంటాం! వెళ్లేముందు ఏం పట్టుకుపోతారో తెలియదు. ఇద్దరం ఇంట్లో ఉండం కదా! అందుకే తాళం వేస్తున్నాను... ఏదైనా పొతే సంపాయించుకోగలమా? నీకేం ఎప్పుడు పోతావో తెలియని వయసులో వున్నావు. నీకు ఏది వున్నా, ఏది లేకపోయినా ఒకటే! మాకు అలాకాదుగా! ఇంకెప్పుడూ తాళం గురించి మాట్లాడకు. ప్రతిదీ వివరించి చెబితేనేగాని నీకు అర్ధం కాదు...’ అందట...కొడుక్కి పెళ్ళయ్యాక వచ్చిన ఈ మార్పుని గోపికమ్మ తట్టుకోలేకపోతుంది... అప్పుడప్పుడు వరమ్మ దగ్గరకి వచ్చి చెప్పుకుని బాధపడుతుంటుంది...”అంది నీలిమ.
ఏ తల్లిదండ్రులైనా తమ దేహం మీద పిల్లలతో నడిపించుకుని,ఆ పాదాల స్పర్శకి పులకిస్తుంటారు. కానీ ఆ తల్లిదండ్రుల జీవన నడక తగ్గి నిస్సహాయ స్థితిలో వున్నప్పుడు వాళ్ల కష్టాన్ని పిల్లలు గుర్తించడంలేదు. ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా ఒక తల్లికి బిడ్డనే అన్న విషయం మరచిపోతున్నారు...
గోపికమ్మనోరెత్తితేచాలు శివాని అక్కడెక్కడో దరఖాస్తు పెట్టుకొని నగరంలోవెలిసివున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి తీసికెళ్లి మా అత్తగారి వల్లనే మా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి’ అని అబద్ధం చెప్పి గోపికమ్మను ఇంట్లోంచి ఎల్లిపోయేలా చేస్తానని బెదిరిస్తోందట... గోపికమ్మ ప్రాణాలనుఅరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నట్లు తన బాధల్ని నాతో చెప్పకుంది. పైగా ఏడుస్తూ ఈ వయసులో నాకీ బాధలు, పోరాటాలు ఎందుకు అని జీవితంపట్ల విరక్తిని, నిరాశను పెంచుకుంది... ఆమెలో ఇప్పుడు కాసింత కూడా ఆశ లేదు... అదేం ఖర్మో ఇంట్లోనే కోడలు మాట విని కొడుకు నిర్లక్షం చేస్తున్నాడని అనుకుంటుంటే బయట ఫ్యామిలి కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళు కూడా కోడలి మాటే వింటారా? మా ముసలి వాళ్లను పట్టించుకోరా? అంటోంది దిగులుగా..ఆమెకు షుగర్, బి.పి. వున్నండువల్లనో, ఆర్దికలేమి వల్లనో ఇంకో పదేళ్ల వయసు మీదపడిన దానిలా కన్పిస్తోంది...ఆమెను చూడగానే ఎవరైనా “అయ్యో! పాపం అంటారు...” అంది నీలిమ.
ఫోన్ పెట్టేసిన సంకేత ఆలోచనలో పడింది.
“ఏంటలా కూర్చున్నావ్! ఎంత పిలిచినా మాట్లాడవేం? ఇంతవరకు ఎవరితో మాట్లాడావు ఫోన్లో..? అడిగాడు అనంత్.
ఆమె చెప్పేలోపలే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని రిసీవ్ద్ కాల్స్ లో నెంబర్ చూశాడు. వెంటనే సెల్ ఫోన్ని కోపంగా ఆమె ఒడిలో పడేసి “పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ కూర్చోకపోతే, వెళ్ళి సరితక్కయ్య పిల్లలు వున్న రూమ్ క్లీన్ చెయ్యొచ్చు కదా! వాళ్లు తిని ఖాళీ చేసిన చిప్స్ ప్యాకెట్స్ ఫ్యాన్ గాలికి చిందరవందరగా పడి వున్నాయి. వెళ్లు!” అన్నాడు ఆర్డర్ వేస్తున్నవాడిలా చేయి చూపిస్తూ...
నిస్సత్తువ ఆవరించినట్లు అతని వైపు చూసింది.
“నాకెందుకో ఇవాళ పని చేయ్యాలనిపించటం లేదండీ! ఇలాగే కూర్చోవాలనిపోస్తోంది. మనసు కూడా బాగాలేదు. కావాలంటే ఓ గంట ఆగి క్లీన్ చేస్తాను’ అంది రిక్వెస్ట్ గా చూస్తూ...
“ఏం పనివుందని అంతకష్టం! ఇదో పెద్దపనా! కొందరు ఆడవాళ్లు చూడు ఎంతెంత హుషారుగా ఇంటిపని, బయటపని చేసుకుంటున్నారో...నీకు ఒక్క ఇంటి పనేగా వుండేది... ఇది కూడా చెయ్యలేవా? చెయ్యకపోతే ఎలా వస్తుంది...” అంటాడు నోటి దగ్గర ఆడిస్తూ ఇంతంత తింటావుగా అన్నట్లు....
సంకేత మాట్లాడలేదు.
“నీలిమ నీకు చెప్పిందో లేదో ఆమె చేసే డొనేషన్లను తట్టుకోలేకనే వాళ్ల అత్తగారు నీలిమ తాగాబోతున్న పాలలో విషం కలిపిందట. అది తాగగానే నీలిమ పడిపోయిందట. శ్రీహర్ష వెంటనే చేతుల మీద వేసుకొని హాస్పిటల్ కి తీసుకొచ్చాడు. మంచి ట్రీట్ మెంట్ ఇప్పించి బ్రతికించుకున్నాడు... ఆ టైములో నేను హాస్పిటల్లోనే వున్నాను” అన్నాడు.
“అక్కడెందుకున్నారు మీరు?” అడిగింది సంకేత ఆశ్చర్యపోతూ.
“శివానిది కూడా ఆదే కేస్! ఈశ్వర్ నాకు కాల్ చేసి నన్ను వెంటనే హాస్పిటల్ కి రమ్మన్నాడు... వెళ్లి చూడగా శివానిని పడుకోబెట్టి స్టమక్ వాష్ చేస్తున్నారు డాక్టర్లు! ఈశ్వర్ కి నిజంగా శివాని అంటే ఎంత ప్రేమ అంటే తను మాట్లాడేంత వరకు వాడ మంచినీళ్లు కూడా తాగలేదు...” అన్నాడు.
సంకేత మాట్లాడకుండా ‘అందరు మీలాగే వుంటారా’ అని మనసులో అనుకుని “శివాని ఎందుకలా చేసింది. వాళ్ల అత్తగారితో ఏమైనా ప్రాబ్లమా?” అంది.
“ప్రస్తుతం శివాని ప్రాబ్లం వాళ్ల అత్తగారు కాదు. శివానికి ప్రెగ్నెన్సీ కన్ ఫం అయిందట. అది తెలిసి ఈశ్వర్ సంతోషిస్తుంటే వెంటనే అబార్షన్ చేయించుకుంటానని, హాస్పిటల్లోనే వుండిపోయిందట. ఈశ్వర్ కి కాల్ చేసి సంతకం పెట్టి వెళ్లమని చెప్పిందట...దానికి ఈశ్వర్ ఒప్ప్పుకోలేదట... దానితో శివాని అహం దెబ్బతిని నెయిల్ పాలిష్ రిమూవర్ తాగిందట... దాని ప్రభావం వల్లనో లేక మరే కారణం వల్లనో తెలియదు కాని శివానికి నిజంగానే అబార్షన్ అయింది. అది తెలిసి ఈశ్వర్ బోరున ఏడ్చాడు. మీ ఆడవాల్లెందుకో మా మగవాళ్లను అర్ధం చేసుకోరు. సమయం, సందర్భం లేకుండా ఏడిపిస్తూనే వుంటారు. నువ్వు మాత్రం తక్కువనా! తాగితే తాగోద్దంటావ్! ఏది చేసినా జూదం అంటావ్! నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు శివానీలాగే చేస్తాను చూడు! లేకుంటే నీకు నా విలువ తెలిసిరాదు” అన్నాడు....
అతను ఏది మాట్లాడినా ఆమెను బెదిరించి గ్రిప్ లో పెట్టుకునే విధంగానే మాట్లాడుతాడు. అలా మాట్లాడిన ప్రతిసారి ఆమె నవనాడులు క్రుంగిపోతూవుంటాయి.
***
అనంత్ దాస్ వద్ద నగలు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్లాడు. దాస్ వద్ద అతను చాలా అప్పులు చేస్తున్నాడు.
రాత్రి శ్రీహర్ష నీలిమతో ఇదంతా చెప్పి ఆ తర్వాత కొద్దిగా నవ్వి ‘నీలిమా! అనంత్ బాధల్లో ఉన్నాడని దాస్ కి పరిచయం చేశాను. దాసేమో తనకి సంకేత మీద వున్న ఫీలింగ్ అంతా అనంత్ మీద చూపిస్తున్నాడు. చివరికి అనంత్ చేతిలో దాస్ ఏమవుతాడో దేవుడికే తెలియాలి...!” అన్నాడు.
ఇదంతా సంకేతకి చెబితే బావుండదని మౌనంగా వుంది నీలిమ.
***
గోపికమ్మ మౌనంగా కూర్చుని ఆలోచిస్తోంది. నీలిమలో , సంకేతలో ఉన్న సుగుణాలు శివానిలో ఎందుకు లేవు... ఓర్పు సహనం వుంటేనే కదా ఆడవాళ్లు తమ వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారు. తన కొడుకు ఈశ్వర్ బ్రతుకు శివాని చేతిలో పడి దుఃఖమయం అయింది కదా! అసలు శివానిని చేసుకోకుండా వుంటే తన కొడుకు బ్రతుకు బాగుండేదేమో’ అని మనసులో అనుకుంటూ ఆ బాధను ముఖంలో కన్పించకుండా జాగ్రత్తపడాలని చూసింది. అయినా - .వరమ్మకి దొరికిపోయింది.
గోపికమ్మచేతిపై తన చేతిని వుంచి “చూడూ శివాని అబార్షన్ చేయించుకుందని నువ్విలా ఎంత బాధపడినా చేజారి పోయినవి తిరిగి వస్తాయా!... మాతృత్వం కాపాడుకోవాలన్నా, ఆ మాధుర్యాన్ని అనుభవించాలన్నా నీ చేతిలో ఏముంది... అది ఆ శివానికి అర్ధం కావాలి. తన కెరీర్ కి పుట్టబోయే బిడ్డ అడ్డు అనుకుందేమో! నువ్వు కూడా అర్ధం చేసుకో! ఆ మాత్రం స్వేచ్చ నాకు లేదా? అని ఆ అమ్మాయి కూడా అనుకోవచ్చు కదా! అంతా మన వైపునే మనం ఎందుకు ఆలోచించుకోవాలి...?అంతామనకి అనుకూలంగానే వుండాలని ఎందుకనుకోవాలి?” వరమ్మ నెమ్మదిగా. “అదికాదు పిన్నీ! నిన్న మా చెల్లెలు కూతురు శ్రావ్య నా వైపున మాట్లాడకుండా వుండివున్నా ఈశ్వర్ కి శివాని గురించి టీ.విలో కన్పించేది కాదేమో! ఇప్పుడు పొయ్యేది వాడి కాపురమేగా!” అంది బాధగా చూస్తూ...
“నీ గురించి ఏమాత్రం ఆలోచించని ఆ కొడుకు గురించి ఇంకా ఎందుకు అలోచించి నీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూవ్! తింటున్నాప్రశాంతంగా తినవు. యోగా చేయ్యమన్నా చెయ్యవు. నిద్ర సరిగాపోవు. ఎప్పుడు చూసినా ఈశ్వర్, శివానీల గురించే ఆలోచిస్తున్తావ్! ఏమిటో నిన్ను మార్చటం నావల్ల కావటంలేదు” అంది వరమ్మ విచారంగా చూస్తూ...
అక్కడే వున్న నీలిమకు, సంకేతకు వాళ్ల మాటలు అర్ధంకాక ‘అసలేం జరిగింది? టీ.వీలో కన్పించటం ఏమిటి? మీరేం మాట్లాడుకుంటున్నారు? కాపురం పోవటం ఏమిటి?” అని ఇద్దరు ఒకేసారి అడిగారు.
గోపికమ్మ చెప్పాలా వద్దా అని అనుకుంటూనే ముఖన్ని దిగులుగా పెట్టి "అదేదో టీ.వీలోచూశాడట... అవేమైనా నాకు అర్ధమవుతాయా! చస్తాయా! వాడేమో ‘కళ్లతో చూశాక ఇక నమ్ముతానా? అది నాకు వద్దు. ఇన్నిరోజులు మా అమ్మమీద చాడీలు చెప్పింది. అవన్నీ నిజమే అనుకున్నాను... ఇప్పడు ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేను'అంటున్నాడు. గొడవలు పెట్టుకుని ఒకరికి ఒకరు దూరమవుతారేమోనని బాధగా వుంది” అంది.
నీలిమ సంకేతవైపు చూసి "ఇప్పడు చెప్పు! బాధలులేని వాళ్లువున్నారా?" అంది మెల్లగా ఆమెకి మాత్రమే వినబడేలా.
సంకేత అదేం పట్టనట్లు వెంటనే నీలిమ చేయిపట్టుకొని నీలిమవాళ్లబెడ్రూంలోకి లాక్కెళ్లింది.
నీలిమకు అర్ధంకాక సంకేతనే చూస్తోంది. సంకేత ఆత్రుతగా "అసలేం జరిగిందో శివానీకి ఫోన్ చేసి కనుక్కుందాం!" అంది.
“నా దగ్గర శివాని నెంబర్లేదు. గోపికమ్మ దగ్గరవుంటుంది వెళ్లి అడగనా?” అంది నీలిమ.
"వద్దు. రాని దగ్గర రెండు, మూడు నెంబర్లుంటాయి. నాకో నెంబర్ గుర్తుంది చెబుతాను...." అని సంకేత అనగానే...
సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని "చెప్పు నెంబర్” అంది నీలిమ.
సంకేత చెబుతున్న నెంబర్ని అతివేగంగా నొక్కి దయాల్ చేసింది నీలిమ.
అవతలవైపు నుండి శివాని "హలో ..” అంది నీలిమ వెంటనే సెల్ ఫోన్ సంకేత చేతిలో పెట్టి “మాట్లాడు” అంది.
సంకేత ఆ సెల్ ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకొని “సంకేతను మాట్లాడుతున్నా... ఎక్కడున్నావ్ శివానీ?” అంది.
“ఆఫీస్ లో వున్నాను. ఇంత కాలానికి గుర్తొచ్చానా!నువ్వెక్కడున్నావ్?" అడిగింది శివాని.
ఎక్కడో వున్నాన్లే! నువ్వేంటి టి.వి.లో కన్పించావట...ఏం చేశావు ఎవడినైనా లేపెశావా? అసలే ఈ రోజుల్లో టీ.వీ.వాళ్లకు ఏది తెలిసినా బ్రేకింగ్ న్యూస్ గా మార్చేస్తున్నారు. మొత్తం జీవితాన్నే అందరి డ్రాయింగ్ రూముల్లోకి తీసికెల్తున్నారు...నాకీ మధ్యన టీ.వి. చూసే అలవాటు పూర్తిగా తగ్గిపోయింది. ఇంతకీ ఏం చేశావో త్వరగా చెప్పవే!” అంది సంకేత ఉద్వేగంగా.
శివాని ఏం చెప్పబోతుందో నీలిమ కూడా వినాలని లౌడ్ స్పీకర్ ఆన్ చేసింది సంకేత. నీలిమ ఉత్కంఠతో శివాని చెప్పబోయేదాని గురించి ఎదురుచూస్తోంది.
“ నేనేం చేశానే! టీ.వీ లో కన్పించటం ఏంటి? అసలు ఏమి విని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనంత్ నీ బ్రెయిన్ మొత్తం పిండేసినట్లున్నాడు...అందుకే ఇలా వాగుతున్నావ్!”అంది శివాని గట్టిగా. అసలే శివాని వాయిస్ అరిచినట్లు వుంటుంది...లౌడ్ స్పీకర్ ఆన్ చేసి ఉండటంతో హాల్లోకి విన్పిస్తుందేమోనని కంగారుగా వెళ్లిబెడ్ రూమ్ డోర్ మూసింది నీలిమ....
శివాని మాటలు వినాలని తిరిగి సంకేత దగ్గరకి వచ్చి నిలబడింది. “మా అత్తగారి వల్లనే నాకూ ఈశ్వర్ కు గొడవలొచ్చాయి. అంతకు ముందు నేను ఎలా చెబితే అలా వినేవాడు. నా గురించి అసలు పట్టించుకునేవాడు కాదు. నాకో భార్య ఉంది. తను కూడా నాలాగే ఉద్యోగం చేస్తుంది. తన జీవితం తనది, నా జీవితం నాడి అన్నట్లే ఉండేవాడు. చాలా విశాలహృదయంతో కూడా ఆలోచించేవాడు.మన క్లాస్ మెట్ శ్రావ్య లేదూ! అదే నా కొంపముంచింది. అది ఈశ్వర్ కి కజిన్....గోపికమ్మకి స్వయాన చెల్లెలు కూతురు... నన్ను తన స్నేహితురాలని కూడా చూడకుండా నాకో సమస్యను తెచ్చిపెట్టింది".
శ్రావ్య వల్ల సమస్యనా! నమ్మలేకపోతున్నాను.... ఊ తరువాతఏం జరిగిందో చెప్పు!” అంది సంకేతతొందరపడుతూ.
“ఏం జరిగింది...శ్రావ్యనా ఫేస్ బుక్ పాస్వర్డ్ ఈశ్వర్ తో చెప్పంది..” అంది కోపంగా శివాని.
అదెలా సాధ్యం? అంత అవసరం ఏమొచ్చింది?" అంది సంకేత.
“ఏమొచ్చింది అంటే ఏం చెప్పాలి! ‘ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వి పెద్దమ్మని బాగా చూసుకోలేవా? నీ భార్య ఆమెకు తిండి సరిగా పెట్టటం లేదట. అదయినా తెలుసా నీకు...” అని ఈశ్వర్ తో శ్రావ్య అందట దానికి ఈశ్వర్ ‘నా భార్య తిండి ఎందుకు పెట్టదు. శివాని అలసిపోయి ఇంటికొస్తే అమ్మ తన పనులు ఎక్కువగా చెప్పి విసిగిస్తోందట’ అన్నాడు. ‘పెద్దమ్మ అలా ఏం చెయ్యదు. అవన్నీ అబద్దాలు. పెద్దమ్మ తనకి అడ్డుగా వుంది. అందుకే నీతో శివాని అలా చెప్పింది. శివాని నా ఫ్రెండ్ అని నేను వూరుకుంటే ఇక్కడ పెద్దమ్మకి అన్యాయం జరుగుతుంది. శివాని ఎలాంటిదో నీకు తెలియాలి అంటే తన పేస్ బుక్ నీవు తప్పకుండా చూడు.’అందట.
ఇలా మాట్లాడితే ఏ మగవాడికైనా ఏమనిపిస్తుంది. బుర్ర వేడెక్కదా? వేడెక్కడమే కాదు. బుద్దిహీనుడై వెర్రెక్కి చిందు లేశాడు ఈశ్వర్.
శ్రావ్య ను పట్టుకుని వదలకుండా ‘నువ్వేం మాట్లాడుతున్నావో స్పష్టంగా చెప్పు! అసలే నా ఉద్యోగం రాత్రి వేళలో చేసేది! రాత్రంతా ఏం జరుగుతుందో చెప్పు!” అన్నాడు. శ్రవ్య ఏం చెప్పిందో ఏమో నా మీద ఎంతో నమ్మకం ఉంచుకున్న ఈశ్వర్ నన్ను నెగెటివ్ చూడటం మొదలుపెట్టాడు. అతను రాత్రంతా పనిచేసి వచ్చి ఉదయం నేను పనిలోకి వెళ్లబోయే ముందు ప్రశాంతంగా నిద్రపోకుండా విసిగించటం చేస్తున్నాడు... నాకు మండి ‘మీ ప్రవర్తన నాకు ఇబ్బందిగా వుంది. అసలేమను కుంటున్నారు. మీరు పెడుతున్న ఇబ్బంది వల్ల రోజూ మధ్యాన్నం భోజనం కూడా చెయ్యటం లేదు. పని ఒత్తిడి వల్ల ప్రతిరోజూ ఎక్కువ సమయం ఇంట్లో సిస్టం మీద కూడా పని చేయాల్సి వస్తోంది. నిద్ర లేకపోవటం వల్ల నీరసం వస్తోంది... అర్ధం చేసుకోరేం?” అన్నాను.
“నువ్వు సిస్టం ముందు కూర్చుని చేసే పనేంటో నాకు తెలియదని గేమ్ ప్లే చేస్తున్నావా? నేనంత వెధవననుకుంటున్నావా? అసలు నాకీ విషయం ముందే తెలిసి వుంటే నిన్ను పెళ్లి చేసుకునేవాడినే కాదు. శ్రావ్య కూడా చెప్పలేదు. మనసులో పెట్టుకుని మోసం చేసింది. ఇప్పుడు మా అమ్ము బయటకు పంపావని అసలు రహస్యం బయట పెట్టింది. అందరూ దొంగలే!” అన్నాడు.
“మీరు నన్ను అవమానిస్తున్నారు” అన్నాను.
“చట్! నోర్మూయ్! నీ కసలు అవమానం అంటే ఏమిటో తెలుసా? నీటి, నియమాలు ఉన్నాయా? ఇప్పటికీ బుద్దిలేకుండా నీ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతావా? అందుకు అడ్డు అనేగా మా అమ్మకు తిండి పెట్టకుండా వున్నావు సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటున్నావు” అన్నాడు వ్యంగ్యంగా.
అతని మాటల్లోని వ్యంగ్యానికి హిస్టీరియా వచ్చిన దానిలా అయ్యాను.
“ప్రస్తుతం నాకు అసలు బాయ్ ఫ్రెండ్స్ లేరు. మీరనుకునే తప్పేమీ నేను చెయ్యటం లేదు. మీరు రాత్రివేళ ఆఫీసు కెల్లాక ఒంటరిగా అన్పించి కొన్నిసార్లు గతంలో నేనున్న హాస్టల్లో ప్రస్తుతం ఎం.టెక్. చేస్తున్న మా ఫ్రెండ్స్ వుండడం వల్ల వెళ్ళి పడుకున్నాను. అంతే! అది తెలిసి మీరేమైనా అనుమానిస్తున్నారేమో!” అన్నాను గట్టిగా.
అతను నమ్మలేదు. నా పేస్ బుక్ ఓపెన్ చేసి నేను ఎవరెవరికి చాటింగ్ చేశానో చూపించాడు. పెళ్ళయ్యాక భర్తకి తెలుస్తుందని భయం ఉన్నదానివేనా! అన్నాడు అని ఆగింది శివాని.
టీవీలో కన్పించిందని గోపికమ్మ అనటం, సిస్టమ్లో ఫేస్ బుక్ చూడటమే అని అర్థమైంది వాళ్లకి. సంకేత ఏం మాట్లాడలేదు. నీలిమ వింటోంది.
శివాని కొద్దిగా ఊపిరి పీల్చుకుని “అసలు నా ఫేస్ బుక్ కోడ్ తనికి ఎలా తెలిసిందో ముందు నాకు అర్ధం కాలేదు. నిజానికి నాకే గుర్తులేదు ఆ నంబరు . ఒకప్పడు నా ఫేస్ బుక్ నెంబర్ క్రియేట్ చేసింది శ్రావ్యనే ఆ విషయం ఇద్దరం మరచిపోయాం. అవసరాన్ని బట్టి శ్రావ్య దాన్నిబయటికి తీసి నన్ను బుక్ చేసింది...నేను అప్పట్లో చాటింగ్ ద్వారా ఇచ్చిన మెసేజ్ లు డిలీట్ చెయ్యకపోవటం నాదే తప్ప.... కానీ ఇప్పడుఏ తప్పు చెయ్యట్లేదు.ఎవరితోనూ చాటింగ్ చెయ్యట్లేదు. నన్ను నమ్మకుండా ఘోరంగా బాధపెడుతున్నాడు. కాని ఈశ్వర్ చాలా మంచివాడు.
అలా అని అతను ద్వేషిస్తున్నా అతన్నే కావాలనుకునేంత అవసరం నాకేం లేదు... అయినా నేను కావాలనుకున్నా అతను నన్ను కావాలనుకోవాలిగా ? అందుకే తప్పనిసరై అతన్ని వద్దనుకున్నాను. లాయర్ని కలిశాను...” అంది.
సంకేత తేరుకుని “ ఎంత ఈజీగా చెబుతున్నావే... బాయ్ ఫ్రెండ్ ని మార్చినట్లు మొగుడ్ని మారుస్తావా?” అంది.
“ఇద్దరు కలిసి వుండే టప్పుడు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి బాధను ఒకరు పంచుకోవాలి కాని పుట్టుపూర్వోత్తరాలు లాగి వెనకటి జన్మలో కూడా నా భార్యవే అయి వుండాలి అంటే ఇదెలా కుదుర్తుంది? నేనేదో నాకో భర్త ఉంటె బాగుండు అని రాజీపడ్డాను. కాని రాత్రివేళల్లో ఉద్యోగం చేసే అతనితో నాకేం సుఖం వుంటుంది చెప్పు! నేను కూడా పగలంతా బయట ఉద్యోగం చేసి వచ్చి రాత్రుళ్లు నిద్రపోవడమేగా! అందుకే 13బి ప్రకారం అతనితో విడిపోవాలనుకుంటున్నాను” అంది.
(సశేషం)
No comments:
Post a Comment