ఒసే కమలా!!!
పెయ్యేటి శ్రీదేవి
' ఒసే కమలా! ఉదయమే బి.పి.టాబ్లెట్లు, సుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి. త్వరగా ఏ టిఫినో తగలెట్టి, కాసిని కాఫీనీళ్ళు నా మొహన పోస్తే, ఆ టాబ్లెట్లేవో మింగేడుస్తాను కదా? ఊ..........అబ్బా!' ఉదయం మొదలవుతూనే మరీ అంత అనారోగ్యం లేకపోయినా ఏదో వుందనుకుని, ఎక్కువగా ఊహించేసుకుని బాధపడిపోతూ దివాను మీద కూర్చుని అనవసరమైన మూలుగులు మూలుగుతూనే, ఓ చేత్తో రిమోట్ పట్టుకుని, టి.వి.లో వచ్చే భక్తి ప్రోగ్రాముల దగ్గిరనించి, వంట మాత్రం చెయ్యకపోయినా, మధ్యాహ్నం వంటల సందడులు, రాత్రి సీరియల్స్ దాకా అన్నీ చూసేస్తుంది. ఆ రిమోట్ ఎప్పుడూ ఆవిడ అధీనంలోనే వుంటుంది కనక మిగతా వాళ్ళెవరికీ వాళ్ళకిష్టమైన ప్రోగ్రాములు చూసే ఛాన్సేలేదు. ఆవిడ చూసే సీరియల్సు అన్నీ ఆవిడ జీవితకాలం దాటిపోకుండా పూర్తి చేయాలనే కోరిక ఆవిడకున్నా, ఆ సీరియల్సు ఎన్ని జీవితకాలాలకి ముగుస్తాయో ఎవరూ చెప్పలేని ప్రశ్న! ' ఒసే కమలా! లేచావా? నాకు నీరసం వచ్చేస్తోందే. ఏమిటో, రోగిష్టి బతుకైపోయింది. అందుకే అందరి మీదా ఆధారపడాల్సొస్తోంది. తిండి కన్నా మందులెక్కువై పోయాయి. మందు మింగాలంటే తిండి తినే వేసుకోవాలంటారు డాక్టర్లు. త్వరగా నా మొహాన్నింత తిండి పెట్టమ్మా.' ఎంతో శుభప్రదంగా గడపాల్సిన ప్రతి శుభోదయాన్ని తిట్లోదయంగా చేసి, ఇంకా షష్టిపూర్తి వయసు కూడా రాని అత్తగారి సుప్రభాత పలుకులకి ఉలిక్కిపడి లేచి, ' ఆ చెప్పేదేదో కొంచెం సున్నితంగాను, ప్రేమగాను చెప్పచ్చు కదా!' అని మనసులోనే అనుకుని, త్వరగా దంతధావనం చేసుకుని, చీరకొంగు నడుముకి దోపుకుని, అత్తగారికి కావలసినవి నిముషాల్లో చేసిపెట్టింది కమల. ఇంతలో తలుపు తోసుకుంటూ దూకుడుగా వస్తూనె, ' ఒసే కమలా! కాసింత కారప్పొడి, ఓ నాలుగు చెంచాల నేచుక్క వేసి, ఒక్క ఐదు ఇడ్లీలే పెట్టమ్మా. అదివరకైతే కనీసం పది ఇడ్లీలయినా లాగించేదాన్ని. కప్పుడు నెయ్యి పోసుకుని, కొంచెం వెన్న రాసుకుని, కారప్పొడిలో అద్దుకుని, కొంచెం శనగచట్నీ, సాంబారులో కూడా నంచుకుని, ఎంచక్కగా తిని, పెద్ద వెండిగిన్నెడు మీగడకాఫీ పీట మీద కూర్చుని కబుర్లు చెబుతూ తాగేదాన్ని. ఎవరి దిష్టి తగిలిందో ఏమో! ఇప్పుదు బాగా తిండి తగ్గిపోయిందే తల్లీ. మొన్న డాక్టరు దగ్గిరకెళితే తిండి తగ్గించాలన్నారు. అందుకే ఒళ్ళు తగ్గించుకోవాలని రెండు చెంచాల నేతిబొట్లు చల్లుకుని, అయిదిడ్లీలే తిందామని అనుకుంటున్నాను. శనగచట్నీ, సాంబారు కూడ మానేసాను. తిండి విషయంలో స్ట్రిక్టుగా వుండాలే అమ్మా! ఏమిటో, ఈ పాడుపొట్టకి ఏదో ఒహటి పడెయ్యకపోతే బండి నడవదు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం!' అంటూ ఇలా సినిమాలో సూరేకాంతం డైలాగులు మాట్లాడుతూ, అక్కమీద ప్రేమ వంకతో వచ్చి, స్వయాన అత్తగారి చెల్లెలు, పిన్నత్తగారయిన సుందరమ్మగారి దినవారీ ప్రభాతపలుకులవి! ఆవిడకి తిండిరంధి ఎక్కువ. అందుకే ఊబకాయమూ ఎక్కువే. నోటిధాటీ ఎక్కువే! అందుకే ఆవిడ ఎన్నిమాటలన్నా తిరిగి అనే సాహసం చెయ్యలేక ఆవిడ అడిగినట్లల్లా చేసిపెడుతుంది నొప్పించక తానొవ్వక తప్పించుకునే కమల. అసలత్తగారు ఒక్క సూరేకాంతంతో సమానమనుకుంటే, పిన్నత్తగారు రెండు సూరేకాంతాల పెట్టు. పక్క ఇంట్లో ఒక్కావిడే వుంటుంది. ఆవిడ చేసుకోలేక వారంలో అయిదురోజులు ఇక్కడే తిష్ట వేస్తుంది. ' ఒసే కమలా! కందిపొడి మిక్సీలో వేసాను. సహం అయింది. ఇంక తిరగనని మొరాయించింది. కొంచెం ఈ కందిపొడి మిక్సీలో వేసిపెట్టమ్మా.' అంటూ పక్కవీధిలో వుండి ఎప్పుడన్నా వచ్చే పెద్దాడబడుచు. ' ఒసే కమలా! ఒక్క రెండు చెంచాల కాఫీపొడి ఇయ్యమ్మా. ఇంత్లో రెండు చెంచాల కాఫీపొడే వుంది. కాఫీ చిక్కగా లేకపోతే మీ బాబాయ్ గారు అరుస్తారు.' అంటూ గోడవతల నించి మొహమాట పడుతూ రెండు చెంచాల కాఫీపొడే అడగలేక, అడగలేక అడిగే పక్కింటి పిన్నిగారు. ' ఒసే కమలా! త్వరగా టిఫిన్ పెట్టు. ఈరోజు ఆఫీసుకి త్వరగా వెళ్ళాలి. ఇన్‌స్పెక్షను వుంది.' అంటూ భర్త శేఖరం. ' వుసే కమలా! అవతల కాన్వెంట్‌కి టైమవుతోంది. గమ్మున ఈ షూస్ వెయ్యవే.' అంటూ నాలుగేళ్ళ కొడుకు కూడా ' ఒసే కమలా' అనేసరికి, కమలకి సహనం నశించిపోయి, చింటూని చిన్నగా ఒక దెబ్బ వేసింది. ' ఏరా బడుధ్ధాయ్! అమ్మా అని పిలవలేవూ? నీక్కూడా ఒసే కమలానేనా? తప్పు, అల్లా పిలవకూడదు. అమ్మా అనే పిలువు.' ' ఏం, అందరూ నిన్ను ఒసే కమలా అని పిలుస్తే తప్పులేదు కాని నేను పిలుస్తే తప్పేంటి? నానమ్మ, సుందరమ్మ బామ్మ, పెద్దత్త, నాన్న, నీ పక్కింటి పిన్నిగారు, ఎదురింటి ఆంటీ, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య - అందరూ ఒసే కమలా అనే పిలుస్తున్నారు కదా? వాళ్ళనేం అనవు గాని నామీదే ఎందుకు అరుస్తావు? అసలు చిన్నపిల్లలంటే అందరికీ లోకువే. ఇకనించీ ఈ పెద్దాళ్లతో యమ స్ట్రిక్టుగా వుండాలి.' అంటూ వాడనే ముద్దుమాటలకి వచ్చే నవ్వునాపుకుని ఏం మాట్లాడలేకపోయింది. వాడికో పట్టాన సమాధానం ఎలా చెప్పాలో కుదరక కమల బాధగా ఊరుకుంది. ఒక్కోసారి అత్తగారు కొడుకుని ' శేఖరం' అని పిలుస్తూంటే, ' ర ' వత్తు పలకలేని వీడూ ' సేకలం' అనే పిలుస్తాడు. అందరూ గట్టిగా కేకలేసి అలా పిలవకూడదంటే, ' నాన్నా' అంటాడు. కాని ఎంత చెప్పినా అమ్మా అని పిలవమంటే మాత్రం పనికిమాలిన తిక్క ప్రశ్నలు వేసి వేధిస్తాడే కాని, ఎంత అరిచి గీపెట్టినా అమ్మా అని పిలవడు. కమలకి అమ్మా అని పిలిపించుకోవాలనే కోరిక తీరటం లేదు. రేపు పెళ్ళయినా, వాడి పెళ్ళాం ఎదురుగా ' ఒసే కమలా' అనే పిలుస్తాడో ఏమిటో ఖర్మ! ఐతే వీడికి తోడు మనవడు కూడా వస్తే.......... ' ఒసే కమలా! నాకీ షూస్ వేసిపెట్టవే. మా జానకిని వెయ్యమంటే బొత్తిగా నా మాట వినటం లేదు.' ' జానకెవర్రా? బొడ్డు కోసి పేరు పెట్టావా?' ' ఎవరా? అదేంటల్లా అడుగుతావు? నీ కొడుకు పెళ్ళాం పేరు జానకి కదా?' ' తప్పురా. జానకి అనకూడదు. మమ్మీ అనాలి. లేకపోతే చక్కగా తెలుగులో అమ్మా అను. ఇంకా బాగుంటుంది.' ' ఏం, నువ్వూ జానకీ అనే పిలుస్తున్నావు కదా? అమ్మా అని, మమ్మీ అని అంటున్నావా?' ' ఒసే కమలగారూ! నే వేసుకోమన్న షూస్ వేసుకోవటల్లేదు. అందుకే వాడు నీ దగ్గిరకొచ్చి ఇంకో షూ వెయ్యమంటున్నాడు. ఒసే కమలా! వెయ్యకండి. ప్రతీదీ వాడు చెప్పినట్లే చెయ్యాలంటాడు.'
_____________________
' ఒసే కమలా! ఏమిటాలోచిస్తున్నావు? ఆఫీసు టైమవుతోంది. లంచ్‌బాక్సు రెడీ చేసావా?' ' ఒసే కమలా! కాఫీ చల్లగా వుంది. కొంచెం వేడి చేసియ్యమ్మా.' అత్తగారు. ' ఒసే కమలా! ఇవాళ శనివారం భోజనం ఎలాగూ చెయ్యను. కొంచెం కొబ్బరికోరు, జీలకఱ్ఱ, అల్లంముక్కలు వేసి ఉప్పుడుపిండి చెయ్యమ్మా.' ఓ పక్క ఉదయం కంచం నిండా టిఫిన్ లాగిస్తూనే, సాయంత్రం ఫలహారం కోసం ఆరాటపడే పిన్నత్తగారి తిండిపలుకులవి. ' ఒసే కమలా! మిక్సీ పాడవలేదమ్మా. నేను కంగారులో చూసుకోలేదు. కరెంటు పోయింది. అందుకే కందిపొడి మధ్యలో ఆగిపోయింది.' అయోమయపు ఆడబడుచు ఫోను చేసి చెప్పింది ఓ పక్క యమా పనిబిజీలో వుంటే. ' ఒసే కమలా! మీ బాబాయ్ గారు కాఫీపొడి తెచ్చేసారు. ఇదిగోమ్మా నువ్విచ్చిన కాఫీపొడి.' అంటూ ఆ రెండు చెంచాల కాఫీపొడి నిజాయితీగా ఇచ్చేస్తూ, ' ఇవిగో, వంకయలు దొడ్లో కాసాయి. కూర వండు. లేతగా వున్నాయి. గుత్తివంకాయ చేస్తే అదిరిపోతుందనుకో.' అంటూ ధాతృత్వం వెళ్ళబోసుకుంటూ పక్కింటి పిన్నిగారు. ' ఒసే కమలా! ఏమిటీ ఆలోచిస్తున్నావు? నా వాచీ కనబడటల్లా. త్వరగా వెతికియ్యి.' ' ఉసీ కమలా! ఏమిటే తెగాలోచించేస్తున్నావు? ఓ కాలికే షూ వేసావు. రెండో కాలికేదీ? ఆటో వచ్చేసిందే. తొరగా నన్ను రెడీ చెయ్యవే.' రేపు వాడు పెద్దయ్యాక, పెళ్ళయ్యాక కూడా ' ఒసేయ్ కమలా!' అని పిలవడమే కాక, వాడి కొడుకు, వాడి పెళ్ళాం కూడా ' ఒసే కమలా!' అనే పిలుస్తారా? అవన్నీ ఊహించుకుని బాధ పడింది కమల. వాచీ కోసం ఇల్లంతా వెతికి వెతికి ఆఫీసుకెళ్ళే కంగారులో వాచీ చేతినే పెట్టుకుని, వాచీ దగ్గిర్నుంచీ కళ్ళజోడు దాకా ప్రతిపనీ పెళ్ళాం మీదే ఆధారపడే భర్తకి లంచ్‌బాక్సు ఇచ్చి ఆఫీసుకి పంపింది. సుపుత్రుడిక్కూడా ఇంకో కాలికి షూ వేసి వాడికి టిఫీన్ తినిపించి, లంచ్‌బాక్స్ ఇచ్చి కాన్వెంటుకి పంపింది. కమల అత్తగారి పని చూసి, పిన్నత్తగారికి కూడా ఇప్పుడే ఉప్పుడుపిండి కూడా చేసిపెట్టేసి, ఇంటో పనంతా పూర్తి చేసుకునేసరికి ఒంటిగంటయింది. మొన్ననే మూడేళ్ళు నిండి నాలుగో ఏడులోకి అడుగుపెట్టి, ' ర ' కూడా సరిగా పలకలేని తన చంటికొడుకు చింటూగాడి చేత అమ్మ అనో, మమ్మీ అనో పిలిపించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ, కొంచెంగా సరుకులు, కూరలు తెచ్చుకుందామని బేగ్ తీసుకుని బైటకి రాబోతుండగా............... ' ఒసే కమలా! ఈరోజు స్టార్ మహిళ ప్రోగ్రాం చూసావా? అందులో నేనున్నాను. అందులో స్టార్ మహిళను కూడా నేనే. సుమ ఎంత బాగా మాట్లాడిందనుకున్నావు? నిన్ను కూడా ఆరోజు షూటింగ్‌కి రమ్మన్నాను. నీ కొడుకుని చదివించాలంటూ రానన్నావు. ఆఁ .......అన్నట్లు ఇవాళ ఫ్రెండ్‌షిప్‌డే కదా? సుమ నీకిష్టమైన స్నేహితులు ఎవరు అని అడిగితే నీ పేరే, కమల అని చెప్పాను. ఇదుగో ఈ బహుమతి వచ్చింది. ఒసేయ్ కమలా! నేనింత వాగుతుంటే ఏం మాట్లాడవేం? అసలేమైందే నీకు? ఏంటాలోచిస్తున్నావు?'
అసలే చికాకుగా వున్న కమలని స్నేహితురాలు వసుంధర కూడా ' ఒసే కమలా!' అనేసరికి ఆమె మీద విరుచుకుపడింది. ' ఏం? నీకూ నేను ' ఒసే కమలా' నేనా? ఉదయం లేచింది మొదలు, ' ఒసేయ్ కమలా! కాఫీ నామొహాన తగలెయ్ ' అంటూ అత్తగారు, ' ఒసేయ్ కమలా! ఒక్క అయిదిడ్లీలే పెట్టమ్మా' అంటూ పిన్నత్తగారు, ' ఒసే కమలా!' అంటూ కరెంటు పోతే కూడా తెలుసుకోలెక మిక్సీ పాడయిందనుకుని, కందిపొడి మిక్సీలో వేయమనే ఆడబడుచు, ' ఒసే కమలా!' ఒక్క రెండి చెంచాల కాఫీపొడో, కప్పు కందిపప్పో ఇమ్మని గోడవతలనించి అరిచే పక్కింటి పంకజమ్మగారు, ' ఒసే కమలా! నా వాచీ చూసిపెట్టు, త్వరగా టిఫిన్ పెట్టు ' అంటూ ఆజ్ఞలు జారీ చేసే భర్తగారు.........' ఉసే కమలా! త్వరగా కాన్వెంటుకెళ్ళాలి. ఈ షూస్ వేసి టై కట్టవే' అంటూ సుపుత్రుడు.........., ఇప్పుడు ' ఒసే కమలా!' అంటూ నువ్వూ, ......అబ్బబ్బ! విసుగొచ్చేస్తోంది. ప్రతివాళ్ళకీ ' ఒసే కమలా ' నైపోయాను. కొడుకు ' అమ్మా' అని పిలవటల్లేదన్న బాధతో, చిన్నప్పట్నించీ స్నేహంగా వుండే స్నేహితురాలు వసుంధర మీద విరుచుకు పడింది కమల. కమల కోపానికి తెల్లబోయింది వసుంధర. వెంటనే తేరుకుని కమలతో వున్న స్నేహంతో ఆమె బాధని అర్థం చేసుకుని అంది, ' అదేమిటే కమలా! ఈ మాత్రానికే అంత బాధ పడిపోతావెందుకు, ఏదో జరగరాని ఘోరం జరిగినట్టు?' ' ఏమిటీ? నీకు ఈ మాత్రంగా అనిపిస్తోందా? మీరరందరూ ' ఒసే కమలా!' అంటుంటే వాడూ అలాగే పిలుస్తున్నాడు. రేపు వాడి పెళ్ళయి, వాడి కొడుకు కూడా ఇదే అలవాటయి, ' ఒసే కమలా!' అంటాడు. కోడలు కూడా, ' ఒసే కమలగారూ!' అన్నా ఆశ్చర్యం లేదు. అదే నాబాధ. ఊహించుకుంటేనే భయంగా వుంది. ఇది నీకు చిన్న విషయంగా అనిపిస్తోందా?' ' అంత దూరం ఆలోచించలేదు కమలా! వీడింకా చిన్నపిల్లాడేగా? నిదానంగా నేర్పచ్చులే. ఐనా ఇది అందరిళ్ళలోనూ వుండే సమస్యే. పిల్లలందరూ పెద్దవాళ్ళు ఎలా వుంటే వాళ్ళూ అలాగే నేర్చుకుంటారు. ఐనా ఇప్పుడు సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ తండ్రుల్ని, తల్లుల్ని పిల్లలు పేర్లు పెట్టే పిలుస్తున్నారు. ఆమధ్య కురుక్షేత్రం సీరియల్ లో పెద్ద కొడుకే మరి, పెళ్ళయినా, తల్లిని ' జానకీ' అనే పిలిచాడు. ఏదో సినిమాలో కూడా చంద్రమోహన్‌ని కూతురు ' సుబ్బూ' అని పిలుస్తుంది. ఇంకోటేదో సినిమాలో హీరో ' రాజేశ్వరీ! మీ ఆయనెక్కడ?' అని తల్లినడుగుతాడు. రోజులూ అలాగే మారిపోతున్నాయి. ప్రతిదానికి నువ్వు పట్టించుకుని అనవసరంగా బాధపడకు.' ' ఏమోనే వసూ! సినిమాలూ, సీరియల్సూ అంటే వేరు. వాళ్ళలా తీస్తున్నారు. ఇంటో కూడా అలాగే పిలిచినా తప్పులేదని నువ్వెంత సమర్థించినా, నా మనసంగీకరించటల్లేదే. ఇప్పటికే అమ్మ, నాన్న అనే మన తెలుగు పిలుపులు పోయి, మమ్మీ, డాడీ అని ఇంగ్లీషు పిలుపులొచ్చాయి. ముందర ముందర ఇంగ్లీషు పిలుపులు కూడా పోయి, అమ్మ నాన్నలని పేర్లు పెట్టి పిలుస్తారేమో! నీకో విషయం తెలుసా? ఫారిన్‌కంట్రీస్‌లో ఉపాధ్యాయుల్ని పిల్లలు పేర్లు పెట్టే పిలుస్తారట! రాను రాను మన సంస్కృతి, సంప్రదాయాలు ఏవిధంగా మారబోతున్నాయో! సరే, ఇప్పుడవన్నీ ఎందుకు గాని........వాడెదురుగా ఎవరూ నన్ను ' ఒసే కమలా!' అని పిలవకూడదు. దీనికేదో ఆలోచించాలి.' ' ఐతే ఏంచేయమంటావు? నిన్ను మమ్మీ అనో, అమ్మా అనో పిలవమంటావా నన్ను కూడా? ఐతే అందరి చేతా అలాగే పిలిపించుకో, నీ కొడుకు చేత అమ్మా అని పిలిపించుకోవడం కోసం. ఇప్పుడు నీ మనసేం బాగాలేదు గాని, మళ్ళీ వస్తా.' అంటూ కోపంగా వెళిపోయింది వసుంధర.
****
' మమ్మీ! కొంచెం కాఫీ ఇయ్యమ్మా, మందులేసుకోవాలి.' అత్తగారు. ' మమ్మీ! ఇవాళ పూరీలు చేసినట్టున్నావు. ఆలూకూర కొంచెంగా వేసి నాలుగే పూరీలు పెట్టమ్మా.' పిన్నత్తగారు. ' మమ్మీ! మా ఇంట్లో ఫ్యూజెందుకో పోయింది. నిన్నట్నించీ కరెంటు లేదు. మీ అన్నయ్యగారేమో కేంపుకెళ్ళారు. నాకేమో ఫ్యూజు వెయ్యడం రాదు. కొంచెం ఈ ఇడ్లీపప్పు మిక్సీలో ఆడిపెట్టమ్మా.' ఆడబడుచు. ' మమ్మీ! ఇవాళెందుకో పాలు విరిగిపోయాయి. ఓ కప్పుడు పాలు ఇయ్యమ్మా కాఫీలోకి. తెప్పించాక ఇచ్చేస్తాలే.' పక్కింటి పిన్నిగారు. ' మమ్మీ! నా కళ్ళజోడు కనిపించటల్లా. కొంచెం వెతికియ్యి.' కళ్ళజోడు కళ్లనే పెట్టుకుని ఆఫీసుకెళ్ళే కంగారులో మతిమరుపు భర్త. ' మమ్మీ! కాన్వెంటు కి టైమయింది. త్వరగా ఈ షూస్ వెయ్యి.' సుపుత్రుడు రవి. అమ్మయ్య! తన కొడుకు అమ్మా అనకపోయినా, ' ఒసే కమలా' అనడం మానేసి, ' మమ్మీ' అని పిలుస్తున్నాడు. ఆనందపడిపోయింది కమల. ' ఐతే అందరూ మమ్మీ అని పిలవాలా?' అని విసుక్కుంటూ వెళిపోయిన వసుంధర మాటల్ని అమలు పరిచింది కమల. అందరూ మమ్మీ అని పిలుస్తుంటే వాడిచేతా మమ్మీ అని పిలిపించుకోవచ్చని ఆలోచించి, అందర్నీ ' మమ్మీ' అని పిలవమంది. కాని తన భర్త తనని మమ్మీ అని, తను భర్తని డాడీ అని పిలవాల్సొచ్చింది. ఇప్పుడు ఆ పిలుపులే వాళ్ళకలవాటుగా మారాయి. భర్తని డాడీ అని కమల, కమలని మమ్మీ అని భర్త పిలుస్తుంటే, వింటున్న అందరికీ వింతగా అనిపించి, ఇంటికి కొత్తగా వచ్చిన అతిథులు ' అదేమిటలా పిలిపించుకుంటున్నారు?' అని అడిగిన దానికి వాళ్ళకి భోజనం వడ్డిస్తూ కమల జరిగినదంతా చెప్పింది. (పిల్లల స్వభావం ఎలా వుంటుందో కథంతా ఊహించి రాసినదే అయినా చివరిపేరా నిజంగా ఒకింట్లో జరిగింది. అందుకే ఎండింగ్ అలాగే రాసాను.------------రచయిత్రి.)
No comments:
Post a Comment