ప్రేరణ
భావరాజు పద్మిని
"జీవితంలో కేవలం విజయం సాధించడంవల్ల ఉపయోగం లేదు. ఎవరి జీవితాన్నైనా మెరుగు పరిచేలా మీరు ప్రేరణ కలిగించారా? అయితే మీరు విజయాన్ని సాధించినట్లే !" - అన్న గురువాక్యాలు నా మనసులో ముద్రించుకుపోయాయి.
"నిజంగా ఒకరికైనా, నేను ప్రేరణ కలిగించి ఉంటానా? " అని నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉంటాను. కళ రూపంలోనో, సేవ రూపంలోనో, ఆచరణ రూపంలోనో, ఏదో ఒక విధంగా ఇతరులకు ఆదర్శంగా నిలవకోపోతే ఇక నా జీవితానికి సార్ధకత ఏముంటుంది ?
అప్పట్లో కాస్త ఖాళీగా ఉన్నప్పుడు నేను చేసే చిన్న చిన్న సేవల గురించి ఫేస్బుక్ లో పోస్ట్ లు రాసేదాన్ని. అది దానాలు చేసామని, గొప్పలు కొట్టుకోడానికి కాదు, "ఇలా మీరు కూడా చెయ్యవచ్చు," అని ఇతరులకు ప్రేరణ కలిగించడానికి మాత్రమే. అందులోనూ, అన్నీ రాయను. అక్షరాలు మనసు దాటి గువ్వల్లా ఎగిరేంత వరకే, రచయతకు ప్రసవ వేదన. చెప్పాలి అనుకున్నది చెప్పాకా, వారి బాధ్యత తీరిపోతుంది. ఇక ఆ అక్షరాల గువ్వలు ఏ గుండె గూటికి చేరి నిక్షిప్తమైపోతాయో, ఎవరికి ఏ విధంగా ప్రేరణ కలిగిస్తాయో, తలచుకుంటే, ఆశ్చర్యం కదా ! ఇటువంటప్పుడే , అక్షరం ఆయుధం కంటే పదునైనది అనిపిస్తుంది.
"ఉన్నంతలో పంచడమే సేవ" - దానం చేసేందుకు కావలసింది డబ్బు కాదు, మనసు - అన్న అంశంపై నేను వ్రాసిన పోస్ట్ లు చదివి, ఒకరు ఇలా ఫేస్బుక్ లో పర్సనల్ మెసేజ్ పెట్టారు - "ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు. మీరు చెప్పిన విధంగా బీద పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచి పెట్టాను. నిజంగా ఆ ఆనందాన్ని, తృప్తిని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేము, మీకు సహస్ర వందనాలు." ఆ తర్వాత నేను ఈ వ్యాసాలు రాసిన సంగతే మర్చిపోయాను.
ఈ మధ్యనే మరొకరు ఇలా రాసారు -" మీ స్పూర్తితో ఇవాళ ఇంట్లోనే అల్పాహారం చేయించి, బీద వారికి పంచిపెట్టాను, ఎంతో ఆనందం కలిగింది. సేవామార్గంలో నాకు స్పూర్తి మీరే." అప్పుడెప్పుడో, కొన్నేళ్ళ క్రితం రాసినా, ఈ అక్షరాలు పాతబడిపోలేదు, మనస్సులో ముద్రించుకుపోయాయి.
ఇల్లు, పిల్లలు, సంసారంతో బావిలో కప్పలా బ్రతుకుతున్న నేను, ప్రతిభ అడవిగాచిన వెన్నెల కాకూడదని, దైవానుగ్రహంతో స్వంత మార్గాన్ని ఏర్పరచుకున్నాను. ఎన్ని సవాళ్లు, ఇబ్బందులు ఎదురైనా పరిపూర్ణ గురుకటాక్షంతో, పట్టు వదలక ముందుకు సాగుతున్నాను. నన్ను చూసి, ఎంతోమంది గృహిణులు ముందడుగు వేసారు. నాలా రాయాలని, నాలా రేడియోలో మాట్లాడాలని, నాలా మంచి పనులు చెయ్యాలని, ఎంతోమంది నాకు తెలీకుండానే ప్రేరణ పొంది ముందుకు వస్తున్నారు. ఇదంతా "మంచి మాట, పని, కళ" కు ఎన్నేళ్ళు గడిచినా అపజయం లేదని నిరూపిస్తుంది. అందుకే, గడచిన గతాన్ని ఘనవిజయంగా భావించి, భుజాలు తట్టుకుని ఆగిపోకుండా, దేనికీ కర్తృత్వం వహించి పొంగిపోకుండా ముందుకు సాగుతుంటే, అన్నీ దైవమే సమకూరుస్తారు. ఒకరికి ప్రేరణగా , ఒకరి కలలు విప్పుకుని, మనల్ని ఆరాధనగా చూసేలా, ఒక "ఐకాన్" లాగా మిగిలే ప్రయత్నం చేద్దాము.
మీ అభిమాన బలంతో, ప్రోత్సాహంతో సాగిపోతున్న "అచ్చంగా తెలుగు అంతర్జాల మాస పత్రిక " 27 వ సంచికలో ఒక వరం లాంటిది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పరిచయం. ఇవి కాకుండా ఏడు కధలు, పంచె వన్నెల ఐదు సీరియల్స్, సాహితీ దిగ్గజాల గురించిన వ్యాసాలు, ఎన్నో పప్రత్యేక శీర్షికలు, పరిచయాలు, నవరసభరితంగా ముస్తాబై మళ్ళీ మీ కోసం వచ్చేసాయి.
ఆశీర్వదించండి, దీవించండి.
కృతజ్ఞతాభివందనలతో
మీ
పద్మిని.
No comments:
Post a Comment