బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారితో ముఖాముఖి
భావరాజు పద్మిని
మనకు ఎన్ని కళలు ఉన్నా, ఎంత ప్రతిభ ఉన్నా, అదంతా కేవలం దైవదత్తమే, పరిపూర్ణ దైవానుగ్రహమే. నిజమైన మానవ జీవిత పరమార్ధం మనలో జ్యోతిగా ప్రకాశిస్తున్న ఆ పరంజ్యోతిని తెలుసుకుని, ఆయనను చేరే దిశగా పయనించడమే. అయితే ఈ పధంలో ఊరించే అనేక మాయాశక్తులు ఉంటాయి. వీటన్నింటినీ త్వరితగతిన దాటుకుని, తన జీవితాన్నిదైవదత్తం చేసి, సనాతన ధర్మ ప్రచారానికి పలువిధాలుగా కృషిచేస్తున్న పూజ్యగురుదేవులు - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం.
నమస్కారమండి. మీరు పండిత కుటుంబంలో పుట్టారని విన్నాను. మీ బాల్యం ఎలా గడిచింది? మీ తల్లిదండ్రులు మీకు ఎటువంటి విలువలను నేర్పించారు?
అమ్మా, శుభం తల్లీ. మా పూర్వీకులు మహాపండితులు. మా నాన్నగారు బ్రహ్మశ్రీ రామమూర్తి శర్మగారు సంస్కృతాంధ్రపండితులు. పురాణ, వేదాంత శాస్త్రాలలో నిష్ణాతులు. మా అమ్మగారు శ్రీమతి రమణమ్మగారు.
మానాన్నగారివద్ద నేను సంస్కృతాంధ్రాలు, పురాణ వేదాంత విద్యల్ని అభ్యసించాను. భగావద్భావంతో జీవిస్తూ, ధర్మ-జ్ఞానాలను ఆర్జిస్తూ జీవించాలి- అనేది మా తల్లిదండ్రులు మాకు నేర్పిన విలువలు. జ్ఞానసమపార్జనతోపాటు, తెలుసుకున్న ఆర్ష విజ్ఞానాన్ని సాధనలోకి తీసుకురావాలి- అనేది మా నాన్నగారు మాకు చేసి చూపిన పాఠం. నిరాడంబర జీవనం, ఉదాత్త ఆలోచన-అనేది మా పూర్వీకుల శైలి. అవే ఆదర్శాలుగా నేర్చుకున్నాం.
సాహిత్యం పట్ల మీకు చిన్నప్పటి నుంచి మక్కువ ఉండేదా? ఆర్ధిక శాస్త్రంలో ఆనర్స్ పట్టా పొందిన మీరు, సాహిత్యం వైపుకు మరలడం ఎలా జరిగింది?
బాల్యం నుండి సాహిత్యాసక్తి ఉంది. సంప్రదాయ సాహిత్యాన్ని నాన్నగారి నుండి అభ్యసించాక,కళాశాల రోజుల్లో ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేశాను. నాటి ఆధునిక కవులు శ్రీదేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, సి.నా.రె, జాషువా,ఆరుద్ర – వీరి రచనలతో పాటు, సముద్రాలు, ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గార్ల సినీవాజ్మయం కూడా నన్ను ప్రభావితం చేశాయి. అదే విధంగా కొంత ఆంగ్ల సాహిత్యాన్ని ఒరియా వాజ్మయాన్ని కూడా చదువుకున్నాను. సాహిత్యాన్ని ఆశక్తిగా, శ్రద్ధగా అధ్యయనం చేయడమేకాక గేయ,వచన సాహిత్యం కొంత రచించడం కాలేజీరోజుల్లోనే జరిగింది. ఛందోబద్ధ కవిత్వాన్ని క్రమంగా నేర్చుకొని ఆ రోజుల్లోనే వివిధ వృత్తాల్లో పద్యాలు రచించాను. అందులో అభ్యుదయ, భావ కవిత ధోరణులు ఎక్కువ.
అయితే విశ్వనాథసత్యనారాయణగారి సాహిత్యం చదివాక, మనదేశంపై, ధర్మంపై నాకు మరింత గౌరవం పెరిగింది. దానికి తోడు అన్నమయ్య, త్యాగయ్యల రచనలు ఆ వయస్సులోనే చాలాభాగం పరిశీలించాను. వాటి ప్రభావంతో సంకీర్తనలు, పద్యాలు వ్రాసుకున్నాను.
కానీ-సాహిత్యం అభిరుచికీ, స్వాత్మానందానికే అనే భావంతో, వృత్తిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికశాస్త్రం ఆనర్స్ చదువుకున్నాను. అందులో ర్యాంక్ వచ్చినప్పటికీ, సాహిత్యాభిరుచి వలన ఈ పరమైన రంగాలోకే వచ్చాను.
సినీరంగంలో మీరు కొన్ని పాటలను రాసారు కదా. సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
పత్రికారంగం నుండి సినీరంగంలోకి ప్రవేశించాను. మంచి కవిత్వాన్ని చెప్పిన సినీకవుల వల్ల నేనూ ఆ రంగానికి ఆకర్షితుడనయ్యాను. సినీరంగంలో సంగీత దర్శకులు కోటిగారు ప్రధానంగా నన్ను ప్రోత్సహించారు. వారి వల్లనే ‘పెదరాయుడు’లో మొదటి పాట వ్రాశాను. తరువాత అతితక్కువకాలంలో చాలా సినిమాలకు వ్రాసి ఒక స్థిరత్వాన్ని సంపాదించుకున్నాను. అయితే ఆ సమయంలో కూడా నా శాస్త్ర, సాహిత్యాధ్యయనం, అనుష్టానం మానలేదు.
మరో ఆశ్చర్యం – అనేక రకాల సినీగీతాలు వ్రాసినా మొదటి పాట (పెదరాయుడు – ఢమఢమఢమఢమ గుండె ఢమరుకం మ్రోగె, మధ్యలో ‘మంజునాథ’ చిత్రగీతం (ఈ పాదం పుణ్య పాదం) చివరి చిత్రం ‘స్వరాభిషేకం’ (రమావినోదివల్లభ) – మూడు శివగీతాలే. మధ్యలో ఇతర గీతాలు ప్రసిద్ధినొందినవి చాలా ఉన్నాయి. సినీరంగంలో మంచి మనుషులు, మేధావులు, వారి స్నేహం నాకు చాలా తృప్తి నిచ్చింది.
పత్రికా సంపాదకులుగా ఉన్నమీరు ప్రవచనాల వైపు మొగ్గు చూపేందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరిస్తారా ?
ఒక ప్రసిద్ధినొందిన తెలుగు వార – మాస పత్రికల్లో నేను ఉపసంపాదకుడిగా (సినీరంగానికి పూర్వం) కొంతకాలం పనిచేశాను. వృత్తిగా, వివిధరకాల రచనల ద్వారా నా రచనాశక్తిని ప్రదర్శించినా, ప్రవృత్తిగా ఆధ్యాత్మిక విజ్ఞాన సముపార్జన, సాధన నాడు కూడా నా జీవితంలో ప్రధాన భాగాలు.
ఈశ్వరానుగ్రహం వలన కొన్ని ప్రవచనాలు చేసే అవకాశం లభించింది. ఒక ఉత్సాహంగా, ఆత్మతృప్తి కోసం చేసిన ప్రవచనాలు ఎందరికో నచ్చి, క్రమంగా చెన్నై లో అడపాదడపా చేస్తున్న ప్రవచనాలు కొందరు ప్రముఖులు వినడంతో జీవితం ఒక మలుపు తిరిగింది.
అప్పుడప్పుడే (1999 ) వస్తున్న ప్రైవేట్ టి.వీ.చానల్స్ నా ప్రవచనాలను ప్రసారం చేశాయి. వాటికి ప్రజాదరణ లభించడంతో నన్ను పలు ప్రాంతాల నుండి ప్రవచానార్ధం ఆహ్వానించారు. నా మనసుకి నచ్చిన ఈ పనికే ప్రాధాన్య మిచ్చి సినీరంగాన్ని విడిచి పెట్టాను. అధ్యయనం, అనుష్ఠానం, ప్రవచనం – ఈ మూడింటితో భాగవన్మయంగా బ్రతుకుతూ ధన్యుడనయ్యాను. ఇదంతా ఈశ్వర కృప.
సద్గురు శివానందమూర్తి గారి ప్రభావం ఎంతవరకు ఉంది. వారు మీకు సూచించిన జీవనమార్గం ఏమిటి?
నాకు విద్యాగురువు మా నాన్నగారు. ఉపాసనా గురువు శ్రీ మహాదేవానందనాథులు. స్ఫూర్తి గురువు సద్గురు శివానందమూర్తిగారు. నా మాటకి,ఆర్షధర్మానురక్తికి ఒక దిశని చూపించి, ఆ వైపు నన్ను నడిపించినది, నడిపిస్తున్నది శివానంద మూర్తిగారే.
నిర్మలమైన అంతఃకరణ, భగవదున్ముఖమైన జీవనం, మొదలైన ధార్మిక విలువలన్నిటికీ నా ఆదర్శం వారే. నిరంతరం వారిని స్మరిస్తూ, ఆ స్పూర్తిని నిలుపుకొనే ప్రయత్నం చేస్తుంటాను.
మన సనాతన ధర్మం యొక్క విశిష్టతనుగురించి చెప్పండి.
దీని పేరే దీని విశిష్టతను తెలియజేస్తుంది. సనాతనమంటే ‘శాశ్వతం’ అని అర్ధం. ఇది శాశ్వతమైన ధర్మం. సూర్యచంద్రులు, పంచభూతాల వలే ఇది నిత్యం, సత్యం. మహర్షులు యోగశక్తితో, తపశ్శక్తితో దర్శించిన శాశ్వతసత్యాల సమాహారమే సనాతనధర్మం. ఇది వేద – వేదాంత – పురాణ – ఇతిహాస – ధర్మశాస్త్ర – యోగ మంత్రం శాస్త్రాల ద్వారా వ్యాప్తి నొందింది.
నిష్కపట, నిర్మల హృదయంతో పరిశీలించిన ఎవరికైనా స్పష్టమయ్యే అంశం – ఈ సనాతనధర్మమే – సంపూర్ణ మానవునిగా మనల్ని తీర్చి దిద్ది చరితార్ధం చేస్తుంది.
సనాతన ధర్మంపై ఇన్ని రకాల దాడులు జరగడానికి, మన ఆదిగురువుల కాలమానం విషయం దగ్గరనుంచి, ఒక సందిగ్ధతను నెలకొల్పి, అన్నీ తారుమారు చేసే కుట్రలు జరగడానికి కారణాలు ఏమిటి?
కొన్ని ఏళ్ల క్రితమే పరాయివాళ్లు ఈ దేశంపై దాడిచేసి – హిందువులు హిందువులుగా జీవించడానికి వీలులేని పరిస్థితులు కల్పించారు. క్రమంగా మనదైన పరంపర, అధ్యయనం, అవగాహన లుప్తమయ్యాయి.
ఇక్కడ దేశీయ ధర్మాన్ని, జ్ఞానాన్ని, సంస్కృతిని నిరంతరం ధ్వంసకాండతో కాలరాయడం జరిగింది. దీనివల్ల మనచరిత్ర వక్రీకరించడం, ఆనవాలు లేకుండా చేయడం లాంటివి జరిగాయి. పరాయి దాడులేగాక, పరాయితనంపై మనవారి మోహం కూడా నిర్లక్ష్యానికి కారణమయ్యింది. ఈ నిర్లక్ష్యం స్వాతంత్ర్యానంతరం మరింత పెరగడం వల్ల – జరుగుతున్న, జరిగిన కుట్రల్ని గమనించడం లేదు. ఇవే సందిగ్ధతలకు ,ఆత్మ విసృతికి కారణాలు.
వేదం కాలములో స్త్రీలు కూడా వేదవిద్య అభ్యసించేవారు అని అంటారు. మరి రాను రానూ అది ఎందుకు నిలిపిఎయబడినది.
’వేదం’అనే పేరుతో ఉన్న గ్రంథరాశి మాత్రమే ‘వేదవిద్య’కాదు, "ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్” వేదవిజ్ఞానమే ఇతిహాస పురాణధర్మశాస్త్రాల ద్వారా సామాన్యులకు చేరువచేశారు ఋషులు.
ఆ విజ్ఞానం స్త్రీలు, పురుషులు,సామాన్యులు అందరూ అందుకోగలిగారు. మంత్రంస్వరూపమైన వేదభాగాన్ని మాత్రం ప్రత్యేక జీవనవిధానం, పరంపర కలవారు విశేష సంస్కారంతో అధ్యయనం చేసి కాపాడారు. ఆ పద్ధతివల్లనే వేదవిద్య యథాతధంగా స్వస్వరూపంలో పదిలమయింది.
అత్యంత ప్రాచీనకాలంలో స్త్రీలు ఏవిధంగా వేదాధ్యాయనం చేశారో తెలియని కాలమిది. అసలు వేదపండితుల కుటుంబాలే వేదవిద్య వదిలివేసిన తరుణంలో – ఆనాటి కాలపు స్త్రీ వేదాధ్యయన విధానం తెలిసే అవకాశం లేదు.
మునుపే చెప్పినట్లు – పరాయిదాడులు కూడా ఒక కారణంగా ఆ పరంపర దెబ్బతిని ఉండవచ్చు. వేదవిద్యను అభ్యసించకున్న వేదసంప్రదాయపు కుటుంబాల్లో స్త్రీలకు కూడా ఆ విజ్ఞానం సహజంగానే అలవడేది. పురాణేతిహాసాది విద్యల్లో ప్రావీణ్యం పొందినవారూ ఉన్నారు.
మడి ఆచారాలు దైవారాధనలో అవసరమా? చిత్త శుద్ధిలేని శివపూజలేలరా అన్నారు కదా!
.చిత్తశుద్ధి కోసమే మడి ఆచారాలు.
ఒక పోలీసు, ఒక డాక్టరు వారి యూనిఫారాలు, నియమాలు లేకుండానే బాధ్యతలను చక్కగా నేరవేర్చవచ్చు. కాని ఆ నియమాలు వదలరాదు. వాటిని పాటించవలసిందే. దేవతలతో వ్యవహరించే యజ్ఞయాగార్చనాదులలో కొన్ని శుచినియమాలు అవసరం. ఆపరేషన్ చేసే వైద్యునికి, ఆ చికిత్సాగృహానికి ఉన్న నియమాల వంటివే ఇవి. నామస్మరణకి, ధ్యానానికి కంటే అర్చనక్రతువులకి సదాచారం అవసరం.
మంత్రము అంటే కొద్దోగొప్పో తెలుసు కానీ తంత్రము అంటే ఏమిటి అని కాస్త తెలుపుతారా?
ఒక దేవతకి శబ్దరూపం మంత్రం. దానిని ఎలా జపించాలి? ఆ దేవతని ఎలా ఆరాధించాలి? ఏ ఏ ద్రవ్యాలు సమకూర్చాలి? ఏ ఏ నియమాలు పాటించాలి? – మొదలైన సాంకేతిక విజ్ఞానాన్ని, ప్రక్రియా విధానాలనీ భోధించే శాస్త్రం తంత్రం.
‘తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇతి తంత్రం’ –దీనికి నిర్వచనం దేనిద్వారా జ్ఞానం విస్తారంగా చెప్పబడుతుందో దానిని ‘తంత్రం’ అంటారు. ఒక విధంగా చెప్పాలంటే దేవతోపాసనకు సంబంధించిన ‘టెక్నికల్ నాలెడ్జ్’ (సాంకేతిక జ్ఞానం) తంత్రం.
ఈ కాలము ముఖ్యముగా గాయత్రీ మంత్రాన్ని పాటగా పాడుతూ కేసెట్లు రిలీసు చేస్తూవున్నారు . ఆ విధముగా చేయ వచ్చా? ఈ మంత్రాన్ని స్త్రీపురుషులు అంతా చదవవచ్చా?
’మంత్రం’ – అనే మాటకి "మననాత్ త్రాయతే ఇతి మంత్రః - అని అర్ధం మననం చేయవలసింది మంత్రం. బయటికి వినబడేటట్లు చదివితే ‘అధమం’. పెదవి కదుపుతూ చదివితే ఉపాంశువు అంటారు. ఇది ‘మధ్యమం’ – మనస్సులో జపిస్తే ‘ఉత్తమం’
మౌనంగా జపించే మంత్రాన్ని పాటగా వినిపించడమే అశాస్త్రీయం. శాస్త్ర విరుద్ధం ప్రమాదకారి. సంకీర్తనలు, సూక్తులు ,శ్లోకాలు లక్షల సంఖ్యలలో ఉన్నాయి, వాటిని రికార్డ్ చేయవచ్చు. ధ్వని ముద్రికలుగా విడుదల చేయవచ్చు.
కానీ మంత్రాన్ని కేసెట్లుగా, సిడిలుగా విడుదల చేయరాదు. పాటలుగా భజనలు చేయరాదు. భజనలకి చాలా కీర్తనలు ఉన్నాయి కదా? మంత్రాల మర్యాదలని అతిక్రమించడం ఎందుకు. మంత్రం మహిమాన్వితమే అయితే, ఆ మహిమ మర్యాదవల్లనే లభిస్తుంది.
కేవలం ఉపనయన సంస్కారం పొందినవారు, బ్రహ్మోపదేశం పొందిన వారు గాయత్రిని జపించాలి. ఇతరులు జపించదగిన గాయత్రీ సమాన మంత్రాలు చాలా ఉన్నాయి. వాటిని విజ్ఞుల ద్వారా పొంది అందరూ జపించవచ్చు.
స్వాములుగా వ్యవహరించే కొందరు శివ కేశవ భేదముతో శివుని విష్ణువుయొక్క అనుచరునిగా చూస్తారు. ఇటీవలి విష్ణ్వాలయాలలో ప్రతిష్ఠ చేసిన వినాయకుని వద్దకు వెళ్లారు, కానీ వినాయకునికి నామాలు పెట్టే బొమ్మలు తప్పు, విష్ణువు ఆరాధనలో విష్వక్సేనుడు తప్ప వినాయకుడు లేడు అని చెప్పారట. ఇది సనాతన ధర్మ అవలంబకులకు అవసరములేని అనుమానములస్ను రేకేత్తించుట కాదా!
పరస్పర వైషమ్యాలు ఎప్పుడూ ప్రగతికి విరోధాలే. సనాతనధర్మంలో ఈ విద్వేషాలు పెద్ద విఘాతాలే. శివకేశవభేదం కూడదని శాస్త్రాలు, విజ్ఞులు చెప్తూనే ఉన్నారు.
అయితే కొన్ని సంప్రదాయాలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ సంప్రదాయాల వాళ్లు వాటిని పాటిస్తారు. వైష్ణవసంప్రదాయంలో విష్ణుపార్షద గణాలకు పతి విష్వక్సేనుడు. గణపతి తత్వాన్ని ఆ రూపంగా ఆరాధిస్తారు వైష్ణవులు. అది సమంజసమే. కానీ వినాయకుడు లేడని విఘ్నేశ్వరుడిని హేళన చేయడం తప్పు. విష్వక్సేనుడు వారి గణపతి.
తమ సంప్రదాయాల్ని తాము పాటిస్తూ ఇతర సంప్రదాయాల్ని గౌరవించడమే అసలైన సత్సంప్రదాయం – అని అన్ని సంప్రదాయాలవారు జ్ఞప్తిలో ఉంచుకుంటే ధర్మం క్షేమంగా ఉంటుంది.
మీ జీవితగమనాన్నిపరిశీలిస్తే, మీరు కోరినవన్నీఊహించనంత వేగంతో దైవం సమకూర్చి, మిమ్మల్ని తన మార్గంలోకి మళ్ళించారు అనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు?
నిజమే. కేవలం దైవం మీద ప్రీతి మాత్రమే ఉన్న నాకు, ఆయన దయవల్ల సాధనకు కావలసినవన్నీ సమకూరాయి. ఆయనే తనవైపు మళ్ళించి నడిపిస్తున్నారనే భావం అనుక్షణం నాకుంది. శివానుగ్రహ లీలకి నా జీవితమే ఒక ఉదాహరణ.
భగవంతుడికి ప్రీతి కలిగించేది ఏది? ఆయన అనుగ్రహాన్ని, దయను పొందడం ఎలా ?
ధర్మబద్ధంగా జీవించడడానికి ప్రయత్నించడమే భగవంతునికి ప్రీతి కలిగించే అంశం – అని ఋషుల మాట. ఫలితమే కాదు – ప్రయత్నము కూడా ఈశ్వరశక్తి వల్లనే ఉంటుందనే స్పృహ చాలా అవసరం. మన నిర్వాకాలేమీ లేవు.
నిష్కపటంగా సత్కర్మని ఆచరిస్తూ – అలా ఆచరించే శక్తి భగవంతునిదేననీ, ఆయనను అర్పణబుద్ధితో స్మరిస్తుంటే అనుగ్రహం లభిస్తుంది.
'ఋషిపీఠం' ఆధ్యాత్మిక పత్రిక నెలకొల్పడం వెనుక ఉన్న కారాణాలు చెబుతారా?
భారతీయమైన ఆర్ష విద్యలు, జీవితపు విలువలు, సంస్కృతి, అపారవిజ్ఞానం – వీటన్నిటినీ నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 17 ఏళ్ల క్రితం (1999) స్థాపించినది ‘ఋషిపీఠం’. ఈ పేరుకి ‘భారతదేశం’ అనే అర్ధం. అనాదిగా ఈ దేశ ఋషులు అందించిన వివిధశాస్త్రాలు, జీవనవిధానాలు, ఏ కాలనికైనా, ఎవ్వరికైనా ప్రయోజనకరమైనవే, వాటిని అందించాలనే లక్ష్యమే దీని స్థాపనకు మూలం.
గీతాప్రెస్ వారి ‘కల్యాణ్’, భవన్స్ వారి ‘జర్నల్’ లాంటి భారతీయ విజ్ఞానవేదిక తెలుగువారికి లభించాలని ఒక కోరిక కూడా దీనికి ప్రేరణ.
శాస్త్రాలను ఔపాసన పట్టిన మీరు, అసలు మనిషి జీవితం యొక్క పరమార్ధం ఏమిటో చెబుతారా?
’ఔపోసన’ అనేది పెద్దమాట. సముద్రమంత శాస్త్ర విద్యలో గురువుల దయవల్ల నేర్చిన కొద్దిపాటి జ్ఞానం, నన్ను పరమార్ధసాధన వైపు నడిపిస్తోంది. నిరంతర అధ్యయనంతో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ – ధర్మాన్ని ఆచరిస్తూ, స్పూర్తినిస్తూ, ధర్మబద్ధంగా లభించిన వాటిని స్వీకరిస్తూ, ఈశ్వరోన్ముఖంగా సాగడమే నిజమైన జీవనరీతి.
ప్రతివ్యక్తిలో ఉన్నది అనంతమైన ఈశ్వర చైతన్యం. దానిని తెలుసుకొని దానితో తాదాత్మ్యం చెంది – అంతటా ఉన్నది అదే నని అనుభూతిని పొందడమే జీవితం యొక్క పరమార్ధం. ‘ఈశావాస్యమిదం సర్వం’ –అనే ఉపనిషద్వాక్య తాత్పర్యమిదే !
***
No comments:
Post a Comment