సర్దుకుపోవాలి - అచ్చంగా తెలుగు

సర్దుకుపోవాలి

Share This

 సర్దుకుపోవాలి

మొనంగి ప్రవీణ 


ఉదయం హడావిడిగా క్యారేజీలు సర్దిన వెంటనే,మా వారు ఆఫీసుకి బయలుదేరుతూ  ‘’నాకు ఎదురురా” అని పిలుస్తున్నారు,ఆయనకు ఎదురువెళ్ళేలోగా మా అమ్మాయి స్కూలు ఆటో హారన్ మోగిస్తున్నాడు త్వరగా  రమ్మని. మా అమ్మాయికి టాటా చెప్పి , మా వారికి ఎదురు వెళ్ళి,లోపలికి వచ్చాను.

పొద్దున్న నుండి ఒకటే హడావిడి. ఆ బడలిక తీర్చుకోవడానికి మావారు ప్రేమతో కొని ఇచ్చిన కాఫీ కప్ లో వేడివేడి కాఫీ కలుపుకొని ,అలా సిప్ చేసుకుంటూ మా అపార్ట్మెంటు కారిడార్లోకి వచ్చి , నెమ్మదిగా  అటు ఇటు తిరుగుతుండగా మా పక్కింట్లో ఉండే రోజా బయటకు వచ్చింది అదే సమయంలో . ఆమె ఎందుకో దిగులుగా ఉండడం గమనించాను .

రోజా నాకన్నా వయస్సు లో పెద్దది అయినా మేము మంచి స్నేహితులమయ్యాము. రోజా కి ఇద్దరు పిల్లలు. అబ్బాయి బెంగుళూరులో సాఫ్ట్ వేరు కంపెనీలో ఉద్యోగము చేస్తున్నాడు . అమ్మాయికి ఆరు నెలల క్రితమే వైభవముగా పెళ్లి చేసి పంపించారు . అల్లుడుకి  ఢిల్లీ లో ఉద్యోగము .
                 ఏమయ్యింది రోజా అలా విచారముగా ఉన్నావు అని అడుగుతుండగానే ‘హాయ్!  ఆంటీ’ అంటూ నా గొంతువిని వాళ్ళ అమ్మాయి సోనల్ బయటకి వచ్చి పలౌకరించింది . నేను ఆశ్చర్యపోయాను సోనల్ ని చూసి .
“హాయి సోనల్ ఎప్పుడువచ్చావు?” అని అడిగాను .
వెంటనే రోజా “ఎందుకు వచ్చావు అని అడుగు”’అని అన్నది ఏడుస్తూ ………..
తల్లి మాటలకి  సోనల్ విసురుగా లోనికి వెళ్లిపోయింది . నాకేమీ అర్దంకాలేదు . కొంచెం కంగారూ ,ఆశ్చర్యము కలిగాయి.
రోజానీ ఓదారుస్తూ “ఏమి జరిగింది?” అని ,మా ఇంటికి తీసుకొని వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి అడిగాను.
సోనల్ తన భర్తతోఉండలేకపోతున్నానని చెప్పి వచ్చేసింది అని రోజా చెప్పగానే నాకు షాక్ లాగా అనిపించినా
“ఏమి ఎందుకట’’ అని బయటకి గంభీరముగా ఉంటూ అడిగాను
అదే నేను అడిగితే సర్దుకుపోలేకపోతున్నానని తేలికగా తీసిపారేస్తున్నది నన్నేమి చేయమంటావు చెప్పు అని నన్ను పట్టుకుని ఏడిచింది.
సరే నేను సోనల్ తో మాట్లాడతాను అని చెప్పి రోజాని పంపించానే కాని నా కళ్ల ముందు మా దూరపు బందువు కదలాడుతున్నది ...
***
ఇది జరిగి రెండేళ్ళు అవుతుంది, నాకు వరుసకి అత్త కూతురు,పేరు రాగిణి ,అందముగా ఉంటుంది. మా అత్తకి గారాలపట్టి రాగిణి . ఆర్థికంగా ఫరవాలేదు ఉన్నంతలో గుట్టుగా సంసారము చేసుకుంటున్నారు ,
అందరిలాగానే రాగిణీకి యుక్తవయస్సు రాగానే కలిగిన కుటుంబంలో ఇచ్చి వివాహము చేశారు. కూతురు పెళ్లిచేసుకుని అత్తవారింటికి వెల్ళిందే  కాని అక్కడ సర్దుకుపోలేకపోయింది . తల్లి చేసిన గారాబము వలన అత్తింట్లో ఏది కోరినా వెంటనే దక్కకపోయేసరికి తనను నిర్లక్ష్యము చేస్తున్నారంటూ భర్త మీద అలిగేది .మొదట్లో భర్త పోనీలే పెళ్లి అయిన కొత్త కదా అని సరిపెట్టుకున్నాడు కానీ రాగిణి ప్రవర్తన రోజు రోజుకీ భర్తకి వింతగా అనిపించసాగింది . తను కోరిన ప్రతీదీ తీర్చాలంటూ మొండికేసేది ,భర్త ఆఫీసుకి బయలుదేరుతుంటే లేచేది . అత్త కూడా కొత్త కోడలు కదా అని ఊరుకునేది.  కొన్నిసార్లు తొందరగా లేవాలి అని నచ్చజెప్పేది . కాఫీ కలుపుకోవడము రాదు సరికదా అత్త కలిపి ఇస్తే మా అమ్మలాగా చెయ్యలేదంటూ విసుగుకునేది .
 రాత్రి పూట అందరూ కలిసి భోజనము చేస్తుంటే అలా నచ్చక రాగిణి ఏదో ఒక గొడవ పెట్టుకునేది. తన తల్లికి  మాటిమాటికి  ఫోన్ చేసి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని ఫిర్యాదు చేసేది.  కోరినవన్నీ వెంటనే ఇచ్చి గారాబము చేయడం వలన , సుకుమారముగా పెంచడము వలనే కూతురు ఈ రోజు ఇలా ఫిర్యాదు చేస్తుందని రాగిణి తల్లికి  అర్థము కాలేదు . అలా అని కూతురికి సర్దుకుపోవాలని చెప్పనూలేదు. అల్లుడితో మాట్లాడింది . ఏవేవో చిన్నచిన్నవి వస్తుంటాయి కదా అత్తయ్యామీరేమీ కంగారుపడకండి అని చెప్పాడే  కానీ అతని  మనస్సు ప్రశాంతముగా లేదు . ఏపని చెయ్యమని చెప్పినా ‘’నేనెవరనుకున్నారు,మా తాత ఎవరో తెలుసా ,అతను ఎంత ధనవంతుడో తెలుసా మేము ఒకప్పుడు ఎలా బ్రతికేవాళ్ళమో తెలుసా ,నేను పని చెయ్యాలా?” అంటూ  మాట్లాడేది .
భర్త ,అత్త రాగిణి ప్రవర్తనతో విసిగిపోయారు. ఒక రోజున రాగిణిని పుట్టింట్లో దించి అత్తగారితో ‘’మీ అమ్మాయిని
మీ ఇంట్లోనే ఉంచుకోండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు .  భర్త వదిలిన కొద్దిరోజులకే తెలిసింది రాగిణికి  తను
గర్భవతినని . ఆమే తల్లిదండ్రులు అంటే మా అత్త, మావయ్య ఎన్ని సంప్రదింపులు జరిపినా రాగిణిని తీసుకువెళ్ళటానికి ఆమె భర్త అంగీకరించలేదు విడాకులు కోరాడు. ఇంత జరిగినా రాగిణిలో ఎటువంటి మార్పు రాలేదు. కోర్టు విడాకులు మంజూరు చేసింది.
 రాగిణికి ఆడపిల్ల పుట్టింది. ఆమె   పుట్టింట్లో తన అన్నవదినతో కూడా సర్దుకుని ఉండలేక,చిన్న గది  అద్దెకు తీసుకుని తను చిన్న పాప తో వంటరిగా ఉండటం మొదలుపెట్టింది.
రాగిణి భర్త తిరిగి కోర్టులో కేసు వేశాడు తన బిడ్డను తనకు ఇప్పించమనీ , తన జీవితాన్నే సరిగ్గా చూసుకోలేని రాగిణి తన బిడ్డని సరిగ్గా ఎలా పెంచుతుందని . ప్రస్తుతము ఆకోర్టు కేసులు ,వాయిదాలు జరుగుతున్నాయి .
  కూతురిని నేను అల్లారుముద్దుగా ఏ కష్టము రాకుండా పెంచుతున్నానని అనుకున్నానే కానీ జీవితములో నలుగురితో ఎలా కలిసి మెలసి ఉండాలి ,ఎలా సర్దుకుపోవాలి,ఇలాంటి జీవిత సత్యాలను చెప్పడము మరిచాను అని ఈ మధ్య మా అత్త ,మా అమ్మానాన్నల దగ్గరకి వచ్చి చెప్పుకుని విలపించిదట. మా అమ్మ చెప్పింది సంక్రాంతికి నేను వెళ్ళినపుడు, ఫోన్ ఎంతసేపటినుండి మ్రోగుతుందో తెలియదు . ఆ శబ్దానికి ఒక్కసారి ఉలిక్కిపడి ఆలోచనలనుండి బయటకు వచ్చి ఫోన్ ఎత్తాను . మావారు టిఫిన్ బాగుందని చెప్పడానికి చేశారు .
           రాగిణి జీవితంలా  అవకూడదు సోనల్ జీవితము. ఆమెతో  ఎలా అయినా మాట్లాడాలి. సోనల్ కి  నా దగ్గర చనువే కాబట్టి ఆమె ప్రవర్తన మార్చుకోమనీ , యోగ్యుడైన భర్తా ప్రేమించే అత్తమామలు చక్కటి సంసార జీవితం .......వీటిని మూర్ఖత్వంతో , అనవసరమైన మిడిసిపాటుతో దూరం చేసుకోవద్దని జీవితం అన్నాకా ‘ సర్దుకుపోవాలి’ అని చెప్పాలి అనుకుంటూ నా దినచర్యలో మునిగిపోయాను.
***

No comments:

Post a Comment

Pages