అన్నమయ్య పదం పరమార్థం - సటకాడు - అచ్చంగా తెలుగు

అన్నమయ్య పదం పరమార్థం - సటకాడు

Share This
 అన్నమయ్య పదం పరమార్థం - సటకాడు

డా.తాడేపల్లి పతంజలి 

                  
కొన్ని పదాలను పలికే విధానం అనుసరించి అర్థం మారుతుంటుంది.సటకాడు(మాయగాడు) అనే పదం కూడా అటువంటిదే.మధుర భక్తిలో వేంకటేశుడనే నాయకునితో , అన్నమయ్య ఒక నాయికగా మారి సరసాలడుతున్నాడు. “మాయగాడా”! అని స్వామిని పిలుస్తున్నాడు.మాయ కలవాడు మాయగాడు. మోసగాడా ! అని  సటగాడు పదానికి  పైకి వ్యావహారికంగా ఒక అర్థం కనిపిస్తుంది.మాయను కల్పించేవాడు దేవుడు.  ఆ ఆర్థంలో “దేవుడా ! అని అంతరార్థం.
          ఈ కీర్తనలొ ఒక పాదం పూవులా మెత్తగా గుచ్చుకొంటుంది. ఇంకొక పాదం మెచ్చుకొంటుంది. అన్నమయ్య మాయగాడు అనటానికి వాడిన సటగాడు పదాన్ని ఆయన కీర్తనలో దర్శించి పరవశిద్దాం.
పల్లవి:     ఏలోయి సటకాఁడ యెఱఁగనా నీసుద్దులు
                పోలించి యాపెవలపు పూసేవు నా మీఁదను
చ .1:       పువ్వుల చెండున వేసెఁ బొరుగున నుండి చెలి
                ఇవ్వల నాదిక్కు చూచే వేమీ నీవు
                నవ్వేవు నీకితవైతే నాచేతి కిటు చూపు
                నివ్వటిల్ల నిజాలకు నే వేసేఁగాని
చ .2:       కుంకుమ నీపైఁ జల్లె కొలుపుననున్నకాంత
                అంకెల నాచేయి దట్టే వప్పటి నీవు
                జంకించే వంతగలితే నింకా నదే నాకు నిమ్మా
                కొంకుగొసరెల్లాఁ దేర కోరి చల్లే నిపుడు
చ .3:       మెచ్చి నిమ్మపంటఁ జిమ్మె మేడమీఁదనున్నసతి
                కొచ్చి యడిగి కాఁగిటఁ గూడేవు నన్ను
                పచ్చిగా శ్రీవేంకటేశ బత్తి నాపైఁ గలిగితే
                మచ్చిక నదె ఇచ్చితే మరివేసే నిన్నును (రేకు: 0859-4 సం: 18-351)

అర్థ తాత్పర్యాలు

పల్లవి:  ఏమోయి మాయగాడా ! వేంకటేశ్వరా ! నీ మంచి మాటల సంగతి నాకు తెలియదా? !( నువ్వు మంచి మాటలు మాట్లాడవని భావం)నాతో ఆమెకు పోలికచెప్పి , ఆమె వలపు నామీద పూస్తున్నట్లు నన్ను భ్రమింపచేస్తావా?( నిజానికి నా మీద తమరికి ప్రేమలేదని వ్యంగ్యం)
చ .1:   ఏమిటయ్యా సోగ్గడా ! ఆవిడెవరో – నీ పక్కనే ఉండి నీపైన పువ్వుల చెండు వేసి, వేసింది తాను కాదన్నట్లుగా                            ముభావంగా ముఖం పెట్టుకు కూర్చుంది.
                   ఆ పూలబంతి  ఏదో  నేను వేసినట్లుగా నా వైపు చూస్తావేమిటి స్వామీ !
                   అదిగో నవ్వుతావేమిటి? నీకు అంత  ఆవిడగారు హితమయితే (ఇతవైతే) నా చేతికి  అందేటట్లుగా  ఆవిడని ఒక్కసారి                     చూపించు.
                 అసలు నిజాలేమిమిటో  బాగా ప్రకాశిస్తాయి. (నివ్వటిల్లు) నేను వేసానో, ఆవిడ వేసిందో- తెలుస్తుంది.
చ .2:                 నీ కొలువులో(సేవ) ఉన్న ఒక అమ్మడు నీమీద  కుంకుమ  చల్లింది .
                    ఆవిడ కుంకుమ చల్లితే సమీపంలో ఉన్న నా చేతిని – అప్పుడు నువ్వు ఉండలుచేసినట్లు మెలితిప్పావు.(దట్టేవు)
                    నన్ను బెదిరించావు కదా (జంకించేవు).  ఇంకా ఆవిడగారు  అంతగా నీ మనస్సులో కలిసుంటే- (కలితి) అదే- ఆ               కుంకుమనే నాకు కూడా   ఇయ్యవయ్యా!
                    సంకోచము( కొంకు కొసరు) మొత్తము తేటబడేటట్లుగా – నీమీద ఆ కుంకుమను ఆవిడగారు చల్లినట్లు నేను కూడా             ఇప్పుడే  చల్లుతానయ్యా!అప్పుడయినా నీ ప్రేమకు నేను దగ్గరవుతనేమో !
చ .3:              అదుగో ! ఆ మేడ మీద ఉన్న అమ్మడు నిన్ను మెచ్చుకొంటూ నిమ్మపండ్లను( నిమ్మపంట)  నీ మీద చల్లింది.
                    నన్ను తొలగమని అడుగుతావు(కొచ్చి) అంతలోనే నన్ను కౌగిటలో కలిసావు(కూడేవు)
                    శ్రీ వేంకటేశా ! అచ్చంగా  (పచ్చి) భక్తి  నా మీద కలిగితే
                    మోహముతో(మచ్చిక) అదిగో (అదె) ఇవ్వాలిసినది ఇచ్చావు.మరి – ఏంచెప్పమంటావ్ స్వామీ !నాతో పాటు నిన్ను           కూడా ఆ అమ్మడు చిన్నగా తగిలీతగనట్లుగా కొట్టింది( వేసె) .
                   నా కౌగిలిలో ఉన్నావ్ కదా తండ్రీ ! ఈ చిన్నపాటి దెబ్బలు తప్పవు.

ముగింపు

ఎందుకండీ ! ఈ నాయికా నాయకుల గొడవ.. హాయిగా “దేవా”! అని ఒక ఆధ్యాత్మిక కీర్తన  అన్నమయ్య వ్రాయవచ్చు !  అని మనకు ప్రశ్న రావచ్చు.చనువు  శృంగారంలో జాస్తి.  మీరు అన్నప్పుడు హృదయాల మధ్య ఎడం ఉంటుంది. శృంగారంలో నువ్వు  అని సంభాషణ మొదలుపెట్టినప్పుడు స్వామి –  బాగా దగ్గరగా వచ్చి అంతరంగంలో కొలువు  తీరతాడు.అందుకే- ఆ దగ్గరితనం మనకు కల్పించటం కోసమే –అన్నమయ్య శృంగార కీర్తనలు రచించాడు. దేవుడిని   “సటకాడా”! అన్నాడు.
స్వస్తి.

No comments:

Post a Comment

Pages