శ్రీ దత్తాత్రేయ వైభవం - 3
శ్రీరామభట్ల ఆదిత్య
శ్రీపాదుల వారి జన్మించిన పిఠాపురంలో స్వామి వారి జీవిత చరిత్ర అయిన 'శ్రీపాద వల్లభ చరితామృతం' లో చెప్పబడిన విధంగా శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వారు ఒక భవ్యమైన ఆలయాన్ని నిర్మించారు. అలాగే శ్రీపాదులవారు తమ అవతార జీవితంలో ఎక్కువ కాలం గడిపిన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలోని కురవాపురంలో కూడా కృష్ణా నది ఒడ్డున ఒక దివ్యమైన ఆలయం ఉన్నది.
'శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం' పేరిట స్వామివారి జీవితచరిత్ర తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ మరియు ఆంగ్ల భాషల్లో లభ్యమవుతున్నది. ఇది నిత్య పారాయణ గ్రంథం మరియు ఈ దత్తక్షేత్రాలు ఎప్పుడూ ' దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర' అంటూ మారుమోగుతూ ఉంటాయి.
¤ ¤ ¤ శ్రీ నృసింహ సరస్వతి ¤ ¤ ¤
శ్రీపాద శ్రీవల్లభులు అంబికకు ఇచ్చిన వరం కారణంగా, అంబిక వచ్చే జన్మలో అంబా భవాని గా జన్మించింది. శ్రీ పాదుల వారు కూడా మరు జన్మలో శ్రీ నృసింహ సరస్వతిగా జన్మించారు.
మహారాష్ట్ర లోని వాషిం జిల్లాలోని కారంజ గ్రామంలో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మాధవ శర్మను అంబా భవాని పెండ్లాడింది. ఆ దంపతులకు 1378వ సంవత్సరంలో శ్రీనృసింహ సరస్వతి స్వామివారు జన్మించారు. ఈయనకు పూర్వాశ్రమ నామంగా తల్లిదండ్రులు నరహరి అని నామకరణం చేశారు.
నరహరికి ఐదేళ్ళ వయస్సు వచ్చినా మాటలు రాకపోవడంతో తల్లిదండ్రులు చాలా దుఃఖించారు. కొన్ని రోజుల తరువాత నరహరి సైగలతో తనకు ఉపనయన సంస్కారం చేస్తే మాటలు వస్తాయని చెప్పగా, మాధవ శర్మ అందుకు ఆనందించి నరహరికి ఉపనయన సంస్కారం చేస్తాడు. అన్నట్టుగానే ఉపనయనం అయిన తరువాత నరహరి సకల వేద శాస్త్రాలు వల్లించటం మొదలుపెట్టాడు. కొడుకు మాట్లాడడం చూసి మధవశర్మ దంపతుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.
ఎంతోమంది పండితులు,ఆచార్యులు నరహరి వద్ద వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చేవారు. ప్రతీరోజూ ఎంతోమంది నరహరి వద్దకు వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకునేవారు.ఇలా నరహరి చాలా ప్రసిద్ధిచెందాడు. సన్యాసం స్వీకరించి లోకోద్ధరణక కంకణం కట్టుకున్న నరహరి 1386వ సంవత్సరంలో నరహరి తీర్థయాత్రలకై బయలుదేరాడు. కొడుకు సన్యాసం తీసుకోబోతున్నాడని తెలిసిన అంబాభవాని కొడుకును వారించే ప్రయత్నం చేసింది. అప్పుడు నరహరి తన తల్లి తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుచేసి తన నిజరూప దర్శనం చూపించగా, నరహరి సాక్షాత్తు శ్రీపాదుల వారి అవతారమని గుర్తించిన అంబాభవాని కొడుకును సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
ఆలా తీర్థయాత్రలకై బయలుదేరిన నరహరి బద్రీనాథ్ ధామానికి చేరుకున్నాడు, తరువాత అక్కడ నుండి కాశీకి చేరుకున్నాడు.....
కాశీకి చేరుకున్న నృసింహ సరస్వతి అక్కడ వివిధ దేవాలయాలను దర్శించిన పిమ్మట శ్రీకృష్ణ సరస్వతి స్వామిని తన గురువుగా స్వీకరించారు. తరువాత 1388వ సంవత్సరంలో సన్యాసాన్ని స్వీకరించారు. గురువైన కృష్ణ సరస్వతి స్వామి నరహరికి సన్యాసాశ్రమ నామంగా 'శ్రీ నృసింహ సరస్వతి' అని పేరు ఉంచారు.
సన్యాసము స్వీకరించిన తరువాత వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించటానికి బయలుదేరారు స్వామి. అలా చాలా క్షేత్రాలు తిరిగి, 1416వ సంవత్సరంలో తిరిగి కారంజకు చేరుకున్నారు. అక్కడ తన పూర్వాశ్రమ తల్లీదండ్రులను కలిసి, మళ్ళీ 1418వ సంవత్సరం నుండి గోదావరి తీర ప్రాంత క్షేత్రదర్శనం ప్రారంభించారు. అలా 1420వ సంవత్సరంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన పర్లీ వైద్యనాథ్ కు చరుకున్నారు.
అక్కడ ఒక సంవత్సరం పాటు నివసించి. మళ్ళీ 1421వ సంవత్సరంలో ఔదుంబర క్షేత్రానికి చేరుకున్నారు.
అక్కడ కూడా ఒక సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ నుండి 1422వ సంవత్సరంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరాపూరుకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు సంవత్సరాల పాటు అనగా 1434వ సంవత్సరం వరకు ఉన్నారు. స్వామివారు అక్కడ చాలా కాలం ఉండడం చేత ఆ ప్రాంతానికి 'నరసిహవాడి' అని పేరు వచ్చింది. అదే కాలాంతరంలో 'నర్సోబావాడి'గా మారిపోయింది.
అక్కడ నుండి మళ్ళీ కర్ణాటకలోని గాణుగాపురానికి చేరుకున్నారు అక్కడ ఇరవైనాలుగు సంవత్సరాల పాటు అనగా 1458వ సంవత్సరం వరకు నివసించారు. ఈ క్రమంలోనే స్వామివారికి ప్రధాన శిష్యగణం తయారవడం విశేషం. వారే శ్రీమాధవ సర్వతి, శ్రీబాల సరస్వతి, శ్రీఉపేంద్ర సరస్వతి, శ్రీసదానంద సరస్వతి, శ్రీకృష్ణ సరస్వతి, శ్రీ సిద్ధ సరస్వతి, శ్రీ ధ్యానజ్యోతి సరస్వతి.... ( ఇంకా వుంది)
***
No comments:
Post a Comment