శ్రీరామకర్ణామృతము - 7 - అచ్చంగా తెలుగు

శ్రీరామకర్ణామృతము - 7

Share This

శ్రీరామకర్ణామృతము - 7

                    డా.బల్లూరిఉమాదేవి.

 

61.శ్లో: కదా వా సాకేతే విమల సరయూ తీరపులినే
సమాసీనః శ్రీ మద్రఘుపతి పదాబ్జే హృదిభజన్
అయే రామస్వామిన్ జనకతనయా వల్లభ విభో
ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్.

తెలుగు అనువాదపద్యము:
మ:గురు సాకేతపురీ మనోజ్ఞ సరయూ కూలంబునన్ సైకతో
పరి భాగంబునఁగూరుచుండి రఘురాట్పాదంబుజాంతంబులన్
స్థిర వృత్తిన్ భజియింపుచున్ వరద యో సీతేశ ప్రత్యక్షమై
కరుణింపదగు నన్న ఘస్రములు నిక్కంబుమ్ నిమేషంబగున్.
భావము:అయోధ్య యందు నిర్మలమైన సరయూ నదీ తీరమందలి యిసుక తిన్నె యందు కూర్చుండి శ్రీరాముని పాదపద్మములు మనస్సున సేవించుచు,ఓ స్వామీ!శ్రీరామా! సీతకు ప్రియుడైన యోప్రభూ !రక్షించుమని మొరలిడుచు బహుదినములు నిమిషమువలె నెపుడు వెళ్ళబుచ్చగలవో.
62.శ్లో:కదా వా సాకేతే తరుణ తుఈ కాననతలే
నివిష్టస్తం పశ్యన్న విహత విశాలోర్ధ్వతిలకం
అయే సీతానాథ స్మృతజనపతే దానవజయన్
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్.
తెలుగు అనువాదపద్యము:
శా:సాకేతంబున నొక్కవేళఁదులసీ సంతానమధ్యస్థుడై
శ్రీ కల్యాణ ముఖంబునన్ దిలకమున్ జెల్వొందు నారాము హే
కాకుత్ స్థేశ!విదేహజాధిపతి!యో కౌసల్యపుత్రా!హరూ
నీకున్ మ్రొక్కు దినంబులున్నిమిషమౌ నీరేజపత్రేక్షణా.
భావము:అయోధ్యాపురమున లేత తులసీవనమునందుండి యవిచ్ఛిన్నమై విశాలమైన నిలువుబొట్టు గలిగినట్టి యా రాముని చూచుచు 'సీతాపతీ తలంచుకొను మనుష్యుల నేలువాడా!రాక్షసుల జయించువాడా! రక్షించుమ'ని బహుదినములను నిముసమును వలె నెప్పుడు వెళ్ళింపగలనో.
63:శ్లో: కదా వా సాకేతే మణిఖచిత సింహాసన తలే
సమాసీనం రామం జనక తనయాలింగిత తనుమ్
అయే సీతారామ త్రుటిత హరధన్వన్ రఘుపతే
ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్.
తెలుగు అనువాదపద్యము:
మ:తన సాకేత సభాంతరస్థలి లసద్రత్స్నోజ్జ్వలపీఠి భూ
తనయాలింగితుడై యొకప్పుడును మోదంబొప్ప నున్నట్టి రా
ముని నోహో శివచాపఖండన!ధరాపుత్రీపతీ ముంగలన్
గనుపట్టన్ దగునన్న ఘస్రంబులు నిక్కంబున్ నిమేషంబగున్.
భావము:అయోధ్యయందు రత్నములచే గ్రుచ్చబడిన పీఠమందు కూర్చొన్న శ్రీరాముని  సీతచే నాలింగనము చేసికొనబడిన దేహము గలవానిని 'ఓసీతారామా!శివధనుస్సును విరిచినవాడా!రఘుపతీ!రక్షించుమని బహుదినములు నిముసమువలె నెప్పుడు వెళ్ళించ గలనో.
64:శ్లో: మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ
వేద్యాం వేద్యాం కిన్నరీ బృందగీతం
గీతే గీతే మంజులాలాప గోష్ఠీ
గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్రః.
తెలుగు అనువాదపద్యము:
చ:పొలుపగు మార్గమార్గముల భూజములందలి రత్నవేదికా
స్థలముల కిన్నరీతతులు తానలయాన్విత గానవైఖరిన్
సలలితమైన గోష్ఠియెడ సన్నుతి జేతురు రామచంద్రనీ
విలసిత సత్కథామృతము వేడ్కను గ్రోలెడు చిత్తవృత్తులై.
భావము:శ్రీ రామమూర్తీ!ప్రతిమార్గమందు చెట్లయొక్క రత్నపు టరుగులందు కిన్నెర స్త్రీలపాట,ప్రతిపాట యందు మృదువైన వాక్యప్రసంగము,ప్రతిప్రసంగమున నీకథ గలదు.
65:శ్లో:వృక్షేవృక్షే వీక్షితాః పక్షిసంఘాః
సంఘే సంఘే మంజులామోద వాక్యం
వాక్యే వాక్యే మంజులాలాప గోష్ఠీ
గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్రః.
తెలుగు అనువాదపద్యము:
ఉ:భూరుహభూరుహంబునను బొల్పుగ నున్నఖగ వ్రజంబు లిం
పారగ మంజులోత్కరములైన సుభాషలయందు వేడ్క బెం
పారిన రమ్యగోష్ఠియెడ సంచితమైన భవత్కథాసుధా
సారమె కర్ణపర్వముగ సన్నుతి జేయును రాఘవేశ్వరా.
భావము:శ్రీరామమూర్తీ!ప్రతి చెట్ట నందును పక్షిసమూహములు కనిపించుచున్నవి.ప్రతిసమూహము నందును మృదువైన మధుర వాక్యము గలదు.ప్రతివాక్యమందు మృదువైన ప్రసంగముగలదు.ప్రతి ప్రసంగము నందును నీ కథ గలదు.
66:శ్లో :శ్వేత పుష్పక మారుహ్య సీతయా సహ రాఘవ!
సుగ్రీవాది భవద్భక్తై ర్మనో మధ్యే రమస్వమే.
తెలుగు అనువాదపద్యము:
మ:సితవిభ్రాజిత పుష్పకంబున ధరాసీమంతినీ పుత్రికా
శ్రిత వామాంకుడవై రఘూద్వహ రమా చిత్తేశ దైత్యేశ మా
రుత పుత్రాది సమస్తభక్త జనులారూఢిన్ బ్రవేష్టింప న
ద్భుత రమ్యాకృతివై మదీయమగు చేతోవీథి గ్రీడింపవే.
భావము:ఓ రామా!సీతతోగూడ తెల్లని పుష్పకమెక్కి సుగ్రీవాది భక్తులతో నామనస్సున విహరింపుము.
67:శ్లో:దోర్భిః ఖడ్గం చ శూలం డమరు మసిధనుశ్చారు బాణం
శంఖం చక్రం చ ఖేటం హలముసల గదాభిండివాలం చ పాశం
విద్యుద్వహ్నీంశ్చ ముష్టిం త్వ భయవరకరం బిభ్రతం శుభ్రవర్ణం
వందే రామం త్రినేత్రం సకల రిపు కులం మర్దయంతం ప్రతాపైః.
తెలుగు అనువాదపద్యము:
మ:శరచాపాసి కుఠార ముద్గర గదా చక్రాంబు భూభిండివా
లరుచి స్ఫారకృశాను ముష్టి హలశూలప్రాస ఖేటాదులన్
కరసంఘంబుల దాల్చి నిర్భయకరాఖ్యంబున్ బ్రకాశింప బాం
డుర వర్ణంబుఁద్రినేత్రముం గలిగి తోడ్తో  శత్రులం ద్రుంచు శ్రీ
కరుడౌ రామున కెల్లకాలము నమస్కారంబు లర్పించెదన్.
భావము:ఈపద్యమునందురాముని రుద్రరూపమునువర్ణించినాడు.భుజములచేత కత్తి,త్రిశూలము,డమరుకము,చిన్నకత్తి.విల్లు,బాణము,గొడ్డలి,శంఖము,చక్రము,డాలు,నాగలి,రోకలి,గద,భిండివాలము,పాశము,మెరుపునుబోలినయగ్ని,పిడికిలి,అభయమును హస్తమునందు కలిగినట్టియు,తెల్లని రంగు కలిగి మూడు కన్నులు గలిగినట్టియు,ప్రతాపములచేసర్వశత్రువులనునలిపివేయునట్టియు,రామునకు నమస్కరించుచున్నాను.
68:శ్లో:దురిత తిమిర చంద్రో దుష్ట కంజాత చంద్రః
సురకువలయచంద్రః సూర్యవంశాబ్ధి చంద్రః
స్వజననివహచంద్రః శత్రు రాజీవ చంద్రః
ప్రణతకుముద చంద్రః పాతుమాం రామచంద్రః
తెలుగు అనువాదపద్యము:
చ:కలుషిత మిశ్ర చంద్రుడరికంజ సుధాంశుడు దేవకైరవో
జ్జ్వల శశి సారసాప్తకుల వార్ధి మృగాంకుడు సంశ్రితోత్కరో
త్పలవిధుడల్ప కంజసితభానుడు నైజ జనైక సేవ్యుడున్
విలసిత వీరుడైన రఘువీరుడు సత్కృప నన్ను బ్రోవుతన్.
భావము:
పాపము లనెడి చీకటికి చంద్రుడైనట్టియు,దుర్మార్గులనెడు పద్మములకు చంద్రుడైనట్టియు,దేవతలనెడి కలువలకు చంద్రుడైనట్టియు,సూర్యవంశమను సముద్రమునకు చంద్రుడైనట్టియు..తనజన సమూహమునకు చంద్రుడైనట్టియు, శత్రువులనెడి పద్మములకుచంద్రుడైనట్టియు,నమస్కరించువారనెడి కలువలకు చంద్రుడైనట్టి రాముడు నన్ను రక్షించు గాక.(చంద్రుడు పద్మములను,చీకటిని బాధించును.కలువలను సముద్రుని వృద్ధి చేయునని భావము)
69.శ్లో:కల్యాణదం కౌశిక యజ్ఞపాలం కళానిధిం కాంచన శైల ధీరం
కంజాత నేత్రం కరుణాసముద్రం కాకుత్ స్థరామం కలయామి చిత్తే.
తెలుగు అనువాదపద్యము:
ఉ:చారుకళానిధిన్ విమలసారస పత్ర విశాలనేత్రు బృం
దారక శత్రు జైత్రు శుభదాయకుఁగౌశికు యజ్ఞ రక్షకున్
గారుణికాగ్రగణ్యుఁబరుఁగాంచనభూధరధీరు శూరునిన్
శ్రీరఘురామునిన్ హృదయసీమఁగనుంగొనుచుందుఁబొందుగన్.
భావము:శుభముల నిచ్చునట్టియు,విశ్వామిత్రుని యజ్నమేలినట్టియు,శాస్త్రములకు స్థానమైనట్టియు,మేరువుతో తుల్యమైన ధైర్యము గలిగినట్టియు,పద్మముల వంటి కన్నులు కలిగినట్టియు,దయకు సముద్రుడైనట్టియు.,కాకుత్ స్థ వంశస్థుడైనట్టియు రాముని చిత్తముననెంచుచుందును.
70.శ్లో:వాల్మీక స్మృతిమందరేణ మథితః సీతారమా సంభవః
సుగ్రీవాంగద జాంబవాది పతగః సౌమిత్రి చంద్రోదయః
వాతోత్పన్నమణిర్విభీషణసుధః పౌలస్త్య హాలాహలః
శ్రీరామాయణదుగ్ధ వార్ధి రమలో భూయాత్ సుఖ శ్రేయసే.
తెలుగు అనువాదపద్యము:
శా:ఆవాల్మీకి మనోగిరి ప్రమతిథంబై సీతయే లక్ష్మి సు
గ్రీవాదుల్ సురభూరుహాదులు దశగ్రీవుండు హలాహలం
బా వాతాత్మభవుండు రత్నము సుమిత్రాపత్యముజంద్రుండా
దేవారాతి సహోద్భవుండు సుధయై దీపించు రామాయణంబే విఖ్యాత సుధాబ్ధియై యొసగు సత్ప్రేమాభిలాషార్థముల్.
భావము:వాల్మీకి మునియొక్క బుద్ది అను మందర పర్వతముచే తరచబడినట్టియు,సీత యను లక్ష్మి కలిగినట్టియు,సుగ్రీవుడు,అంగదుడు,జాంబవంతుడు మొదలగు వారనెడి కల్పవృక్షాదులు కలిగినట్టియు,లక్ష్మణుడను చంద్రోదయము గలిగినట్టియు,ఆంజనేయుడనెడి చింతామణి కలిగినట్టియు,విభీషణుడను నమృతము కలిగినట్టియు,రావణుడను కాలకూటము గలిగినట్టియు రామాయణమను పాలసముద్రము సుఖము కొరకు నగుగాక.

No comments:

Post a Comment

Pages