నాకు నచ్చిన కథ--స్వర్ణయోగం
(శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు )
టీవీయస్.శాస్త్రి
ఈ కథా రచయిత శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు ప్రాచీనులలో ప్రాచీనులు,ఆధునికులలో అత్యాధినికులు.ఒక విధంగా చెప్పాలంటే వీరు ప్రాచీన ,ఆధునిక కవుల మధ్య వారధి లాంటి వారు.
సాంప్రదాయ పద్యాలు,కథలు,వాటితోపాటుగా వచన కవితలెన్నో కూడా వ్రాశారు.ఇలా చాలా సాహితీ ప్రక్రియలను ఒంటిచేత్తో నడిపిన గొప్ప దార్శనికుడు ఈయన!ఈ నాటికీ వీరు వ్రాసిన కవితలు, కథలు చదువుతుంటే,నాకనిపిస్తుంది--ఈ నాటి సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజుల్లోనే ఎలా వ్రాయగలిగారా? అని ఆశ్చర్యం వేస్తుంది.చిన్నకథకు 'కథానిక' అని నామకరణం చేసిన 'కథానికల నాన్న' శ్రీ శాస్త్రి గారు.వీరు చాలా కాలం కావలిలోని జవహర్ భారతి కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేసి అక్కడే రిటైర్ అయ్యారు. వీరి స్థలం విశాఖజిల్లాలోని మాడుగుల అనే గ్రామం.
కథానికల నాన్న అయిన శాస్త్రి గారు 1987 లో కీర్తిశేషులయ్యారు.వారి సంతతి అయిన కథానికలు దినదినాభివృద్ధి చెందుతూ గొప్ప ఖ్యాతిని తెచ్చి పెట్టాయి తమ సృష్టి కర్తకు. 'స్వర్ణయోగం' అనే ఈ కథ వ్రాసి షుమారు 60 సంవత్సరములకు పైగా అయ్యింది.అయితే ఇందులోని కథాంశం నేటి సమాజానికి కూడా పూర్తిగా వర్తిస్తుంది.బూడిద నుండి బంగారం సృష్టిస్తామని చెప్పే స్వామీజీల వల్ల నేడు కూడా చాలా మంది మోసపోతున్నారు.విశేషమేమంటే వీరిలో చాలామంది విద్యాధికులే! IAS ,IPS ఉద్యోగులు కూడా ఇటువంటి దొంగ స్వాముల పట్ల అభిమానం చూపించటం మనం చూస్తూనే ఉన్నాం.ఇటువంటి దొంగ స్వాముల వల్ల అత్యాశపరులైన కొంతమంది ఎలా మోసపోతారో చెప్పిన కథ ఇది. కథ చదవండి! మీకే తెలుస్తుంది ఈ కథలోని గొప్పతనం.
********
ఆ ఊరికి ఆయన పెద్ద జమీందారు.అంతే కాదు చేతికి వెన్నెముకలేని దాత.ఆయనకు అంతులేని ధనసంపద ఉంది. ఇక ఆయనకున్న బంగారాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ధనవంతుడే కాదు గుణవంతుడు కూడా. ఇంట్లో బంగారం ఉంటే సరిపోదు.బంగారం లాంటి మనసు కూడా ఉండాలి.ఇటువంటి లక్షణాలు ఆయనలో ఎన్నో ఉన్నాయి.అందుచేతనే ఊరి జనమంతా ఆయనను దేవుడిగా చూస్తుంటారు.ఆ గ్రామంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా ప్రజలు ఆయన సహాయంకోసం వస్తారు.ఆ సమయంలో ఆయన వద్ద ఏముంటే అది ఇచ్చి వారిని పంపించేవారు.బంగారంలాంటి మనిషి కనుక,ముందుగా ఆయన చేయి మెడలోని గొలుసు మీదకే వెళ్ళుతుంది.వెంటనే ఆ గొలుసును తీసి ఇచ్చేస్తారు.
ఇలా చాలా బంగారం కరిగిపోయింది.ఒక రోజు ఎవరో శుభవార్త చెప్పటానికి వారి వద్దకు వస్తే,జమీందారుగారి చేయి తటాలున అలవాటు ప్రకారం మెడమీదికి వెళ్ళుతుంది. ఎంత తడుముకున్నా బోసి మెడే కనపడుతుంది.అలాగని అంతా ఊడ్చిపెట్టు కొని పోయిందనటానికి కూడా వీల్లేదు.అయితే ఇదివరలో ఇచ్చినట్లు ప్రస్తుతం మాత్రం ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఆయనకు బంగారమంటే పిచ్చి వ్యామోహం కూడా!ఆయన దగ్గర నమ్మకంగా పనిచేసే వెంకటస్వామి అనే వ్యక్తి మంచి పనివాడే కాకుండా యజమాని పట్ల చాలా విశ్వాసం,వినయ విధేయతలతో
ఉండేవాడు.అతని ఎదుట ఎవరైనా జమీందారు గారిని గురించి చెడుగా మాట్లాడినా సహించడు.యజమాని పరిస్థితిని పూర్తిగా గమనించాడు వెంకటస్వామి.ఒకరోజు యజమాని కాళ్ళ వద్ద చేతులు కట్టుకొని కూర్చొని ఇలా చెబుతాడు----దొరా!ఈ రోజు నేను మన మామిడితోటకు వెళ్ళితే,ఆ తోటలో 'సువర్ణ రేఖ'( అదో జాతి మామిడి వృక్షం)చెట్టుకింద ఒక సాములోరు కళ్ళు మూసుకొని ఏవో ప్రార్ధనలు చేయటం చూశాను.గొప్ప తేజస్సుతో ఉన్నాడు.ఆయన తల చుట్టూ గుండ్రంగా ఏదో కనపడుతుంది.నన్ను చూడగానే కళ్ళు తెరచి
'ఒరే!వెంకీ! అని పిలిచారు.నా పేరు పెట్టి పిలవగానే ఈ సాములోరు చాలా గొప్పవాడనిపించింది. నాతో ఇలా అన్నారు- 'మీ ఊళ్ళో బంగారం చేయించుకునే వాళ్ళు లేరా!మేము ఈ ఒక్క రోజే ఉంటాం. ఈలోపు ఈ ఊరిలో ఎవరికైనా కనీసం ఒక మణుగు బంగారం ఇవ్వాలనిపిస్తుంది నాకు.'
అని చెప్పి వెంటనే కళ్ళు మూసుకున్నారు.బోసిమెడతో ఉన్న జమీందారు చటుక్కున అప్రమత్తుడయ్యాడు. ప్రస్తుతం ఆయనకు కావలిసింది బంగారమే!దైవ మహిమ కాక పోతే మంచి సమయంలో స్వామి నా తోటలోకి రావటం ఏమిటీ ?సువర్ణరేఖ చెట్టు క్రింద కూర్చోవటం ఏమిటీ ?అడగకుండానే మణుగు బంగారం ఇస్తాననటం ఏమిటీ ?మళ్ళీ తనకు మంచిరోజులు రాబోతున్నందుకు సంతోషంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్వామిని కలవాల్సిందే నని జమీందారు గారు గట్టి నిర్ణయం తీసుకున్నారు.జమీందారుగారు వెంకటస్వామిని తగిన ఏర్పాట్లు చేయమని పురమాయించారు.అందుకు వెంకటస్వామి ఇలా అన్నాడు--
'
దొరా!సాములోరు స్త్రీ ముఖం చూడరు.పచ్చి బ్రహ్మచారి. ఎవరి ఇంటికీ రాడు.మన ఇంటికి కొద్ది దూరంలో ఏదన్నా వసతి ఏర్పాటు చేద్దాం
!' అని చెబుతాడు.అలానే ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి.స్వామి వారిని చూడటానికి తండోపతండాలుగా జనం వస్తున్నారు. స్త్రీలు తాము
ఎందుకు స్త్రీ పుటక పుట్టామా! స్వామి వారి దర్శన భాగ్యం తమకు లేకపోయినందుకు తమ్ము తామే నిందించుకుంటున్నారు.బూడిద నుండి బంగారం తీసే సమయం దగ్గరికి వచ్చింది.పెద్ద హోమగుండం ఏ ర్పాటు చేశారు.హోమజ్వాలలు చూసి జనం తరిస్తున్నారు.ఇటువంటి సమయంలో స్వామి జమీందారుని పిలిచి---రాజా ఆఖరి నిమిషంలో ఒక ఆటంకం ఏర్పడింది.
పెద్ద ఇబ్బంది ఏమీ లేదు.ఇదిగో ఇటు చూడు -- పులి నాలుక,లేడి కన్ను,కుందేటి చెవి,చిలక రెక్క లాంటి వాటిని పసర్లతో కలిపి ఈ హోమగుండం మీద ఒక ఘటం పెడుతున్నాను.
అర్ధరాత్రి పరపురుషుని స్పర్శ తగలని కన్య నిలువెత్తు బంగారంతో సర్వాలంకారాలు చేసుకొని వచ్చి ఈ హోమగుండం మీది ఘటాన్ని వంటరిగా వచ్చి తాకాలి.ఎవరైనా ఆసమయంలో ఆ కన్య వెంట ఉంటే వారి తల వేయి ముక్కలవుతుంది.కనుక కన్యను ఒంటరిగానే పంపాలి
అని స్వామి చెబుతాడు.జమీందారు గారు ఆలోచనలో పడ్డారు.బూడిద బంగారం కావటానికి స్వామి వారు చెప్పిన షరతును గురించి ఆలోచిస్తున్నారు. పరపురుషుని స్పర్శలేని కన్య అని ఎవరినో నమ్మటానికి జమీందారు గారి మనసు ఇష్టపడటం లేదు.ఆఖరికి మనసు కుదుట పరచుకొని,తన కూతురినే ఈ పనికి పంపటానికి నిశ్చయించుకొని తగిన ఏర్పాట్లు పూర్తిచేశారు.అలాగే జమీందారు గారి కూతురు స్వామి వారి వద్దకు వంటినిండా బంగారంతో వంటరిగా వెళ్ళింది.
తెల్లవారుతుంది, కానీ కూతురు ఇంటికి తిరిగి రాలేదు.
స్వామి వారు విడిది చేసిన మందిరానికి జనం వెళతారు. ఊరంతా ఒకటే గగ్గోలు.బంగారంలేదు,స్వామీ లేడు,జమీందారు గారి అమ్మాయి లేదు.బూడిద మాత్రం మిగిలింది! ఈ వార్త విన్న జమీందారు గారి భార్య స్పృహ తప్పి పడిపోయింది.జమీందారు గారు చెప్పిన మీదట జనం కర్రలు తీసుకొని బయలు దేరారు వెంకటస్వామిని వెదకటం కోసం.వాడు ఎక్కడున్నాడని వెతుకుతారు, వాడు హోమం మొదలు కాగానే కనిపించకుండా వెళ్లిపోయాడు. ఇదీ కథ! చదువుతుంటే ఈ రోజు టీవిలో చూస్తున్న తాజా వార్తలాగా ఉంది కదూ! గొప్ప రచయితల కథలు అలానే ఉంటాయి.
No comments:
Post a Comment