సింహస్థ -2016
ఉజ్జయిని – కుంభమేళా
పోడూరి శ్రీనివాసరావు, హైదరాబాద్
ఈసారి కుంభమేళా, సింహస్థ -2016 పేరుతో – ఉజ్జయినిలో ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకు జరుగుతోంది. ఈ కుంభమేళాను ‘మహా కుంభమేళా’ అని చెప్తారు. నెలరోజులపాటు శిప్రానది ఒడ్డున, ఉజ్జయినిలో జరుగుతున్న ఈ మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కుంభమేళా అన్నది 12 సంవత్సరముల కొకసారి వస్తుంది.
దేవదానవులు అమృతమధనం కోసం, మందర పర్వతాన్ని కవ్వంగా సర్పరాజు వాసుకిని కవ్వపుత్రాడుగా చేసుకుని పాలసముద్రం చిలికారు. అమృతం ఉద్భవించడానికి ముందు లక్ష్మీదేవి, కామధేనువు,కల్పతరువు, మొదలైన అద్భుత విశేషాలతో పాటుభయంకరమైన హాలాహలము కూడా ఉద్భవించింది. భయకంపితులై, కకావికలై పరుగులిడుతున్న దేవదానవులను నిలువరించి, పరమశివుడు - అభయంకర కాలకూట విషం – హాలాహలాన్ని స్వీకరించి, మింగిన హాలాహలం కడుపులోకి వెళ్లకుండా కంఠంలోనే ఆపుచేసి, గరళకంఠడు అయినాడు.
తరువాత ఉద్భవించిన అమృతం కోసం దేవదానవులు పెనుగులాటకు సిద్ధపడ్డారు. వారిని శాంతపరచి, సమాధానపరచి, శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారరూపుడై అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచగలగడంలో సఫలీకృతుడైనాడు.
దేవదానవులు అమృతభాండం కోసం పెనుగులాడుతుండగా, కొన్ని చుక్కలు అమృతభాండం నుంచి తొణికి ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ (అలహాబాదు) హరిద్వార్ లలో రాలిపడ్డాయట. అమృతకుంభం నుంచి, ఈ నాలుగు ప్రదేశాలలో ‘కుంభమేళా’ జరుగుతుంది. భారతదేశంలోని మిగతా నదులకు,పన్నెండు సంవత్సరాల కొకసారి పుష్కరాలు జరుగుతాయి. పుష్కరం అనగా పన్నెండు సంవత్సరాలు.
మిగిలిన నదులన్నిటికీ పుష్కరాలు జరుగుతాయి కానీ, కుంభమేళాలు జరగవు. అదే విధంగా అమృత బిందువులు తొణికిన ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ, హరిద్వార్ లలో కుంభమేళాలు జరుగుతాయి కానీ, పుష్కరాలు జరుగవు. పుష్కరాలు పన్నెండు రోజులు జరుగుతాయి, కానీ కుంభమేళాలు నెలరోజుల పాటు జరుగుతాయి. అమృతపు బిందువులు తొణికిన ఈ నాలుగు ప్రదేశాలనూ – “అమృత క్షేత్రాలు” అంటారు.
సకల నదులకూ అధిపతి అయిన బృహస్పతి , వివిధ గ్రహాలతో, వివిధ రాశులలో కలిసినపుడు పుష్కరాలు గానీ, కుంభమేళాలు గానీ జరుగుతాయి. బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నపుడు ఉజ్జయినిలో పూర్ణ కుంభమేళా జరుపుతారు. అష్టాదశ శక్తిపీఠం, స్వయంభూగా వెలసిన మహాకాళేశ్వరుని నిలయమైన ఉజ్జయినిలో పూర్ణ కుంభమేళా దర్శించగలగడం ఒక గొప్ప అనుభూతి.
వేకువ ఝామున జరిగే “భస్మహారతి” ఒక మహా అద్భత అపూర్వ దృశ్యం. మహాకాళేశ్వరుణ్ణి బూడిదతో ఆరాధించి, భస్మ హారతి ద్వారా అలరించడం సేవించడం – చాలా దొప్ప మనోహరదృశ్యం.
ఒక ప్రత్యేక పూజారి ఈ భస్మాన్ని సేకరించి, ఆ భస్మాన్ని శ్రీ మహాకాళేశ్వరుని సేవలో వినియోగించడం, ఆ సేవను దర్శించ గలిగే భాగ్యం పొందడం – సామాన్య విషయం కాదు. ఈ భస్మాన్ని సేకరించడం కోసం, ప్రతీరోజూ – ఆ రోజు దహనం చేయబడిన శవం తాలూకు బూడిదను, ఆ రోజు మహా కాళేశ్వరుని సేవలో వినియోగిస్తారు. అంటే ప్రతిదినం జరిగే శ్రీ మహాకాళేశ్వరుని భస్మహారతి సేవలో – ఆ రోజే దహనమైన శవం నుంచి సేకరించిన బూడిదను వినియోగిస్తారన్నమాట. ప్రతీరోజు...తన సేవకోసం...తన హారతి కోసం...ఆ మహాకాళేశ్వరుడే – ఆ పరమశివుడే – రోజు కొక శవం దహనమయ్యేటట్లు, ఆ పరమశివుడే ఏర్పాటు చేసుకన్నాడంటే ... ఇది సృష్టి విచిత్రం కాక మరేమిటి?
ఈ భస్మహారతి కోసం, కొన్ని టికెట్లు ఆన్ లైన్ లో – కొన్నిటికెట్లు టికెట్ కౌంటర్ వద్ద లభిస్తాయి – అవీ పరిమితంగానే. ఆ టికెట్లు కౌంటర్ లో లభించాలంటే, భక్తులు స్వయంగా తమతమ గుర్తింపు కార్డులతో కౌంటర్ వద్ద ఉదయమే నిలబడి, ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది – అది కూడా ఉదయం 7 గంటల కల్లా. 7-౩౦ కు ఆఫీసు తెరిచాక, పత్రాలు స్వీకరించి, దృవీకరణ పత్రాలు పరిశీలించి తరువాత, మన మిచ్చిన పత్రాలు కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారు. కొన్ని గంటల తరువాత – మరుసటి తోజు ఉదయం జరగబోయే భస్మహారతి దర్శనానికి మనకు అనుమతి లభించిందా లేదా... అన్న సమాచారం మన మొబైల్ కు SMS వస్తుంది. అంటే... ఎన్నో కష్టనష్టాల కోర్చి, ఇబ్బందులకుగురై, ఉదయమే సంబంధిత పత్రాలు, గుర్తింపుకార్డులు జమచేసినప్పటికీ కూడా... మనకు భస్మహారతి దర్శనానికి అనుమతి లభిస్తుందన్న గ్యారంటీ లేదన్నమాట.
ఉజ్జయిని నగరం గుండా ప్రవహిస్తున్న ‘శిప్రానది’తీరం వెంబడి ఈసారి ‘సింహస్థ – 2016’
జరుగుతుందన్నమాట. ఈ శిప్రానదినే , క్షిప్రానది అని కూడా అంటూ ఉంటారు.
జరుగుతుందన్నమాట. ఈ శిప్రానదినే , క్షిప్రానది అని కూడా అంటూ ఉంటారు.
శిప్రానది ఎంత పవిత్రమైనది అంటే, వరహావతారంలో మహావిష్ణువు హృదయం నుంచి ఈ పవిత్ర శిప్రానది ఉద్భవించిందని చెబుతారు. వింధ్యపర్వతాలలో, మధ్యప్రదేశ్ లో గల ధర్ ప్రాతానికి పడమరవైపు, జన్మించి సుమారు 195 కి.మీ. ప్రవహించి – మధ్యప్రదేశ్ – రాజస్థాన్ సరిహద్దులో గల మదసోర్ లో, చంచల్ నదిలో కలుస్తుంది.
శిప్రానది, వరహావతారంలో విష్ణుమూర్తి హృదయం నుంచి ఉద్భవించిందన్న పురాణ కథనం ఒకటయితే – శిప్రానది ఆవిర్భావం గురించి మరో పురాణ కథ కూడా ఉంది.
బ్రహ్మకపాలం చేత బుచ్చుకుని, పరమశివుడు భిక్షాటనకు బయల్దేరగా, ఒకనాడు ఆయనకు ఎక్కడా భిక్ష దొరకలేదు. చివరకు వైకుంఠం చేరి, విష్ణుమూర్తిని భిక్ష అడిగాడు. శ్రీ మహావిష్ణువు భిక్షకై వచ్చిన పరమశివుని తనచూపుడు వేలితో చూపిస్తూ... పరుషంగా మాట్లాడట. ఆ మాటలకు కోపగించిన సదాశివుడు, తన త్రిశూలంతో విష్ణుమూర్తి చూపుడు వేలును ఖండించాడట. ఆ తెగినవేలు నుండి ధారగా కారిన రక్తంతో పరమశివుని చేతిలోని భిక్షాపాత్ర (బ్రహ్మకపాలం) నిండి, పొంగి ప్రవహించిందట. ఆ పాత్రనిండి, ధారగా కారిన రక్తమే – ‘శిప్రానది’ గా మారిందని – మరో పురాణ కథనం.
పరమ పవిత్రమైన ప్రసిద్ధ మహాకాలేశ్వరుని నిలయమైన ‘ఉజ్జయినీ పట్టణం’ శిప్రానదీ తీరానికి కుడివైపున ఉంది. అదే విధంగా పురాణాల్లో పేరు గాంచిన ‘సాందీపముని ఆశ్రమం’ కూడా ఈ శిప్రానదీ ఒడ్డునే ఉంది. శ్రీ కృష్ణ పరమాత్ముడు, బలరాముడు, కుచేలుడు- ఆదిగా గల శ్రీకృష్ణుని బాల్యస్నేహితులు ఈ సాందీపముని ఆశ్రమంలోనే, విద్య నభ్యసించారని పురాణ కథనం. ఇవేగాక మరెన్నో పుణ్యస్థలాలు ఈ శిప్రానదీ తీరాన్నే ఉన్నాయి.
శిప్రానది గురించి ప్రాచీన భారత గ్రంథాల్లోనేగాక, బుద్ధుని జాతకకథలలోనూ, వాటికి సంబంధించిన గ్రంథాలలోనూ, జైన సంబంధిత గ్రంథాల్లో కూడా ప్రస్తావించారని, చరిత్ర గ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది.
శిప్రానదీ స్నానం పరమ పాతకనాశనమని చెబుతారు. కొందరు అయ్యప్ప భక్తులు, శబరిమల దర్శనానికి వెళ్ళేటపుడు, ముందుగా శిప్రానదిలో స్నానమాచరించడం కూడా జరుగుతుంది.
శబరి గిరీశుడ్ని దర్శించుకోవడానికి ముందు శిప్రానది వద్ద పితృతర్పణాలు వదలడం కూడా జరుగుతుంది. కొందరు శ్రాద్దకర్మలునిర్వహించడానికి కూడా శిప్రానదీ తీరానికి వస్తూ ఉంటారు. అంతటి గొప్పనది – శిప్రానది.
కుంభమేళాలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి ముందే ‘నాగబాబాలు’ మొట్టమొదట స్నాన మాచరిస్తారు. ఆ తర్వాతే మిగిలిన భక్తులు పవిత్ర స్నానం చేయడానికి అనుమతిస్తారు. నాగబాబాలు, మిగిలిన సాధుపుంగవుల స్నానానంతరమే – మిగిలిన భక్తులకు స్నానాలకు అనుమతి.
కుంభమేళా ప్రారంభోత్సవానికి ముందుగా చేసే ప్రథమ పవిత్ర స్నానాన్ని ‘సాహీస్నాన్’ అంటారు. ఈసారి ప్రథమ సాహీస్నాన్ 22-04-2016 న రెండవ పవిత్ర సాహీస్నాన్ 09-05-2016 న, మూడవ పవిత్ర సాహీస్నాన 21-05-2016 న జరుపుతారు.
ఉజ్జయిని నగరంలోని దర్శనీయస్థలాలు – శ్రీ మహాకాళేశ్వర్ మందిర్, బడే గణేష్ మందిర్, హరసిద్ధి మాతా మందిర్, శ్రీ చార్ ధామ్ మందిర్, శ్రీ క్షిప్రానదీ తీరం, శ్రీ రాజావిక్రమాదిత్య మందిరం.
ఉజ్జయినీ నగర నమీపంలో, నగరం వెలపల గల దర్శనీయ స్థలాలు – శ్రీ మంగళనాథ్ మందిర్, శ్రీ సిద్ధవట్ మందిర్, శ్రీ కాలభైరవ్ మందిర్, శ్రీ మహాకాళికా మందిర్, శ్రీ భక్త్ హరిగుహ, శ్రీ సాందీపని ఆశ్రమం.
దేనికదే మహత్త్వపూర్వకమైన దర్శనీయమైన పవిత్ర స్థలాలు.
మేము బసచేసిన భోపాల్ (ఉజ్జయినికి సుమారు 213 కి.మీ. దూరం – 4 గంటల ప్రయాణం) మధ్యప్రదేశ్ రాజధాని. దానిని ‘సిటీ ఆఫ్ లేక్స్ ‘ అని కూడా పిలుస్తారు. పెద్ద సరస్సు (సుమారు 40 కి.మీ మేర వ్యాపించినది) భోపాల్ లో ఉంది. మానవ్ సంగ్రహాలయ్ అని, అనాదికాలం నుంచి మానవ జీవనం ఎలా ఉండేదీ అన్నవిషయంపై వారు నివసించిన గృహముల నమూనా, వారు వాడిన భోజన పాత్రలు, ఆయుధాలు, ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబందించిన విశేషాలతో నిర్మించబడిన చక్కని మ్యూజియం కూడా ఉంది. ఊర్లో అందమైన ఉద్యానవనాలు మనల్ని ఆనంద పరుస్తూ ఉంటాయి. ఊరికి 15కి.మీ దూరంలో నిర్మితమైన మహాలక్ష్మీ మందిరం (సుమారు రెండేళ్ళ క్రితమే నిర్మించారు) చాలా సుందరంగా ఉంటుంది. అలాగే 20 కి.మీ దూరంలో ఉన్న భోజ్ పురి శివాలయం చాలా ప్రసిద్ధి కెక్కింది. ఏకశిలతో సుమారు 40 అడుగుల శివలింగం (నేలమట్టం నుంచి చూస్తే – పానపట్టం, శివలింగం అంతా సుమారు 60 అడుగల ఎత్తు ఉంటుంది) తప్పక దర్శించ వలసినది.
(సశేషం...)
No comments:
Post a Comment