అజరామర సూక్తి
చెరుకు రామమోహనరావు
न हिम्सां कुरुते साधुर्न देवः सृष्टिनाशकः
-सुभाषितरत्नभाण्डागार
న మాతా శపతే పుత్రం న దొషం లభతే మహీ
న హింసాం కురుతే సాధుర్న దేవః సృష్టినాశకః
-సుభాషితరత్నభాణ్డాగారము
తల్లి తన తనయుని శపించదు.ధరిత్రికి అనగా భూమికి ఎటువంటి దోషము అంటదు. సజ్జనులు ఏ పరిస్థితిలో కూడా ఇతరులను హింసించరు.భగవంతుడు సృష్టి నాశము చేయడు.
ఈ సుభాషితము నిజానికి సులభ గ్రాహ్యము. కానీ మనసు పెట్టి చదివిన తరువాత నాలుగు మాటలు వ్రాయవలెనని అనిపించినందువల్ల వ్రాస్తున్నాను. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రము లో
పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః
పరం తేషాం మధ్యే విరల విరలోzహం తవ సుతః
మదీయోzయం త్యాగః సముచిత మిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి
అమ్మా విశ్వమాతా నేను నీకు చేసిన సేవ ఏదీ లేదు.ధనకనక వస్తువాహనాది కానుకలను సమర్పించినదీ లేదు . కానీ నీవు నాపై ఎంతో అనురాగాన్ని చూపించుతావు తల్లీ. ఈ జగతిలో కుపుత్రులు కొల్లలుగా కనిపించవచ్చును గానీ కుమాత కానరానే కానరాదు కదా !
తల్లి గుణమును వర్ణించుటకు, ప్రపంచ భాషళ అలంకారాలు అన్నీ కలిపినా సాధ్యము కాదు.
నేటి 'సుపుత్రులు' అందుకేనేమో తల్లిదండ్రులకు వృద్దాశ్రమములను స్థావరములుగా చేసి తమ కృతజ్ఞతను చాటుకొంటున్నారు.
ఇక భూమిని గూర్చి చెప్పవలసివస్తే భూసూక్తము లోని మొదటి మంత్రము ఈ విధంగా వుంది.
హరి: ఓం ||
భూమిర్భూమ్నా ద్యౌర్-వరిణా అంతరిక్షం మహిత్వా | ఉపస్థేతే దేవ్యదితే గ్నిమన్నాదమన్నాద్యాయాదదే|| 1 ||
ఓ భూమాతా!నీ ఖనిజ సంపద అపారము అనంతము.అందుకే నీవు భూమివైనావు. నీ ఔన్నత్యము,నీ పొడవెడల్పులగూడి విస్తారమైన నీ వైభవము జగన్నుతము . ఈ విశ్వమే నీవు. ఓ దేవీ! అకారణ కరుణ
( నిర్హేతుక దయ ) మరియు (అజ్ఞాత నిగ్రహము) అకుంఠితక్షమా వైఖరి కలిగిన నీ సమీపంలోని ఉండటం ద్వారా మాకు నీ సహాయం సదా సిద్ధించుతూవుంది. నీవు 'అదితి' వి అంటే హద్దులు లేని దానివి (న+దితి)జగన్నుతవు.
ఎంత త్రవ్వినా ఎంత ఆశుద్ధమును మోసినా మాకు సస్యములు ఖనిజములు,నీరు,నిప్పు ,గాలి అన్నీ ఇస్తూనే వుంటావు.
అట్టి యాతల్లిని ఏదోషమూ అంటదు గావుననే అన్ని సుఖాలను మనకు సమకూరుస్తూవుంది.
ఇక సజ్జనుని గూర్చి. భాగవత పురాణములోని నవమ స్కందములో రంతిదేవుని చరిత్రము చదివితే ఈ క్రింది విషయము తెలియవస్తుంది : నత్వహం కామయే రాజ్యం.
న స్వర్గం, నా పునర్భవం.
కామయే దుఃఖ తప్తానాం
ప్రాణినా మార్తి నాశనం.
నేను రాజ్య సంపద కోరను. స్వర్గము ప్రాప్తింప జేయమని కోరను. జన్మ రాహిత్యము వాంఛింపను. సంసార దుఃఖ సంతప్తులైయున్నవారికడనుండి వారి ఆర్తిని బాపి, వారి దుఃఖమును పోగొట్టమని మాత్రము కోరుదును.
సజ్జనుల ఆలోచనాలు ఏ విధంగా ఉంటాయో చూడండి. అదే దుర్జనుడు ఎవరైనా దారిలో రూపాయి బిళ్ళ పారేసుకొంటే వగిరించుతూనైనా పరుగెత్తుకోనిపోయి అతనికి ఇచ్చి తన నిప్పు లాంటి నిజాయితీ చాటుకొంటాడు. అదే వెయ్యి రూపాయలైతే నిజాయితీని నిప్పులో పడవేసి వెయ్యి జేబులోనుంచుకొని మిన్నకుంటాడు.
ఇక పరమాత్మ సృష్టి కర్త సృష్యి భర్త ఐనపుడు సృష్టిహర్త ఎట్లు కాగలుగుతాడు. మట్టితో తానూ చేసిన కుండ నెరెలు చీలిందంటే దానిని పగులగొట్టి కుంభారుడు మళ్ళీ మంచిది చేసినట్లే ఎప్పుడు ధర్మము బీటలు బారుతుందో అప్పుడు దానిని త్యజించి క్రొత్తది తయారు చేస్తాడు. అదేకదా పరమాత్మ భగవద్గీత లో చెప్పింది.
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్తానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం
కాబట్టి పరమేశ్వరుడు దయుడే గానీ లయుడు కాదు
No comments:
Post a Comment