అన్నపూర్ణ - అచ్చంగా తెలుగు
అన్నపూర్ణ

శ్రీ పెయ్యేటి రంగారావు


          ' ఏమండీ, నాకు నరసాపురం వెళ్ళాలనుందండీ.  అక్కడ మన యింట్లోనే................' అన్నపూర్ణ కన్నులనించి ధారగా అశృవులు బుగ్గల మీదుగా జారుతూ దిండుని తడిపేస్తున్నాయి.రాజారావు బరువెక్కిన హృదయంతో వంగి ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.  తన పై కండువాతో ఆమె మొహాన్ని తుడుస్తూ అన్నాడు, ' అల్లాగే అన్నపూర్ణా!  ఇవాళే బయలుదేరదాం.'
రాజారావు క్షణం ఆలస్యం చెయ్యలేదు.  బంజారాహిల్స్ లోని అత్యంత విలాసవంతమైన గృహంలో వుంటున్న తన పుత్రరత్నం శేఖర్ ని సంప్రదించలేదు.  గుండెల్లోంచి దుఖం ఎగదన్నుకు వస్తోంటే బ్యాంకుకు పరిగెత్తాడు.  అక్కడి లాకర్లో తను ఎవరికీ తెలియకుండా భద్రంగా దాచిన ఐదుపేటల చంద్రహారం తీసాడు.  అక్కడి నించి బంగారం షాపుకెళ్ళి ఆ చంద్రహారాన్ని అమ్మేసాడు.  మూడు లక్షల డభ్భై అయిదు వేలు వచ్చింది.  మొలలో కట్టుకున్నాడు.  ఒక టాక్సీ మాట్లాడుకుని తిరిగి ఈవెనింగ్ విల్లా అని పేరున్న వృధ్ధాశ్రమానికి చేరుకున్నాడు.  గబగబా తనవి, అన్నపూర్ణవి బట్టలు రెండు సూట్ కేసుల్లో సద్దాడు.  అక్కడి అధికారులతో మాట్లాడి, నలుగురి సాయంతో అన్నపూర్ణని కారులోకి చేర్చాడు.  అందరికీ నమస్కారం చేసి తను కూడా కారెక్కాడు.  కారు హైవే మీదుగా నరసాపురం వైపు దూసుకుపోతోంది.
ఛీ, ఏమిటీ జీవితం!  ఎన్ని రహస్యాలని గుండెల్లో దాచుకు బ్రతుకుతున్నాడు తను?  నరసాపురంలో ఎనిమిది వందల గజాల్లో వున్న పూర్వీకులు కట్టించిన లంకంత కొంప తన కొడుకు అమ్మేస్తుంటే, మౌనంగా గుండెలు చిక్కబట్టుకుని, దస్తావేజుల మీద సంతకాలు పెట్టేసాడు.  కాని ఈ విషయం అన్నపూర్ణకి మాట మాత్రమైనా తండ్రీ కొడుకులు చెప్పలేదు.  చెబుతే ఆవిడ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఇంటిని అమ్మనివ్వదు.  అల్లాగని కొడుకు అమ్మేస్తుంటే తను అడ్డుపడితే, మర్నాటినుంచి తనకి, అన్నపూర్ణకి దొరికే ఆ నాలుగు మెతుకులు కూడా శేఖర్ దక్కనివ్వడు.  అందుకని మౌనంగా రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్ళి తను కూడా సంతకాలు పెట్టేసాడు.  ఐనా ఏం జరిగింది?  కొడుకు, కోడలు తమని ఏమన్నా ప్రేమగా చూసుకున్నారా?  ఈ వృధ్ధాశ్రమంలో చేర్చేసారు.
చిన్నప్పుడే తనకి తండ్రి చనిపోయాడు.  చదువు, సంధ్యలు లేని తన తల్లి పార్వతమ్మ అన్నీ తనే అయి తనని చదివించి, పెద్ద  చేసింది.  తనకి మంచి ఉద్యోగం వచ్చింది, ఇంక తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి.  మంచి సంప్రదాయమైన కుటుంబంలోని పిల్లని పెళ్ళి చేసుకుని ఇంటికి తెచ్చుకోవాలి, తన తల్లికి ఇంకనించి పూర్తిగా విశ్రాంతినివ్వాలి అనుకున్నాడు.  కాని ఏం జరిగింది?  తనకి ఉద్యోగం వచ్చిన పదిరోజులకే తన తల్లికి గుండె నెప్పి వచ్చింది.  ఆ రోజుల్లో నరసాపురంలో వైద్య సౌకర్యాలేమున్నాయి?  హడావిడిగా ఆయుర్వేదం డాక్టరు కొండలరావుగారిని పిలవడానికి బైటకెళ్ళబోతుంటే, తల్లి వారించి తనని దగ్గిరకి పిల్చింది.
' నాయనా!  హడావిడి పడకు.  నేను సంతోషంగా వెళ్ళిపోతాను.  ఈ ఇల్లు మీ నాన్నగారు రెక్కలు ముక్కలు చేసి కట్టించారు.  ఇందులో నీ పిల్లలు, నీ మనవలు, నీ మునిమనవలు, ఇల్లా ఎప్పటికీ మన వంశంవారే ఇందులో వుండాలని నా కోరిక.  మరొక విషయం.  నా మెడలో వున్న ఈ ఐదుపేటల చంద్రహారం పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నా మెడలో వేసారు.  ఇది వాళ్ళ అత్తగారు ఆవిడ మెడలో వేసారుట.  కాని నీ పెళ్ళయినాక ఈ చంద్రహారాన్ని నువ్వు మాత్రం మీ ఆవిడ మెడలో వెయ్యకు.  దీని ఖరీదు మూడు వందల రూపాయలు.  దీన్ని ఎవరికీ తెలీకుండా భద్రంగా దాచెయ్యి.  ఎవరికీ తెలిసే అవకాశం కూడా ఇంక లేదు కదా?  ఇంట్లో వున్నది మనిద్దరమే కదా?  తరవాత ఈ చంద్రహారం సంగతి నువ్వు కూడ పూర్తిగా మర్చిపో.  నీకు ఎన్ని ఇబ్బందిలొచ్చినా దీన్ని మాత్రం నువ్వు ముట్టుకోకు.  నీ వృధ్ధాప్యంలో నీకు ఏమన్నా తప్పనిసరి పరిస్థితులొస్తే అప్పుడు దీనిగురించి నువ్వు ఆలోచించు.' అంటూ పార్వతమ్మ గారు కన్ను మూసింది.
అది జరిగిన సంవత్సరానికి అన్నపూర్ణ , ధర్మపత్నిగా తన జీవితంలోకి ప్రవేశించింది.  తన తల్లి మొదటి కోరికని మాత్రం తను తీర్చలేకపోయాడు.  ఐతే ఆవిడ రెండో కోరక మేరకే తను ఇంతవరకు నడుచుకుంటూ వచ్చాడు.  ఆవిడ అన్నట్లుగానే ఈ వృధ్ధాప్యంలో తనకి ఈ చంద్రహారం ఉపయోగపడింది.  ఆ రోజుల్లో మూడు వందలు చేసిన ఈ చంద్రహారం ఇప్పుడు తనకి అయాచితంగా మూడు లక్షల డభ్భయి అయిదు వేలు సంపాదించి పెట్టింది!
కారు నరసాపురం వైపు సాగిపోతోంది.
*************************** 
          అన్నపూర్ణ కారులో మగతగా పడుకుని వుంది.  రాజారావు అప్పుడప్పుడు మంచినీళ్ళతో ఆమె గొంతు తడుపుతున్నాడు.  అన్నపూర్ణకి కళ్ళముందు తన బాల్యం, కౌమారం, యవ్వనం అంతా సినిమారీలులా తిరుగుతోంది. 
************************* 
          అన్నపూర్ణ తండ్రి సోమశేఖరంగారు నరసాపురంలో పేరున్న జమీందారు.  వాళ్ళది పెద్ద ఉమ్మడికుటుంబం.   ఆ యింటిలో వారు, వారి కుటుంబం, వారి చెల్లెలు, వారి పిల్లలు, వారి తమ్ముడు, ఆయన పిల్లలు, వారి చనిపోయిన పెదతండ్రిగారి అబ్బాయి కిష్టుడు, ఆయన పిల్లలు మొత్తం నాలుగు కుటుంబాలు ఆ యింట్లో వున్నారు.  ఆయన భార్య పేరు లలిత.  ఆ దంపతులకి ఇద్దరు అబ్బాయిల తర్వాత కలిగిన మూడవ సంతానం అన్నపూర్ణ.  అన్నపూర్ణ అంటే ఇంటిల్లిపాదికి మహా గారం.  ఆమెని చిట్టిదేవతలా అందరూ చూసుకునేవారు.  అందరూ వంతులు పడి మరీ ఆమె చేతులకు గోరింటాకు పెట్టేవారు.  తరవాత ఆమె చేతులు కడిగి, ' అబ్బ!  ఎంత ఎర్రగా పండిందే!  నిన్ను నీ మొగుడు అపురూపంగా చూసుకుంటాడే పూర్ణా!' అంటూ ఆమె బుగ్గలు పుణికి ముద్దులాడే వాళ్ళు.ఆ రోజు అట్లతద్దె. లలితమ్మగారు కూతుర్ని తెల్లవారుజామున నాలుగున్నరకే లేపి నెత్తి మీద నూనె పెట్టి ఆశీర్వదించి తలంటు పోసి పట్టు పరికిణీ, జాకెట్టు వేసింది.  మెడలో ముత్యాలదండ వేసింది.  చేతులకి రెండు జతల బంగారు గాజులు వేసింది.  తర్వాత ఇంట్లోకి తీసికెళ్ళి నూపప్పు పొడి అన్నంలో కలిపి అన్నపూర్ణకి ఆప్యాయంగా తినిపించింది.  అన్నపూర్ణ హడావిడిగా బైటకు పరిగెట్టబోతుంటే, మరికొంచెం అన్నంలో గడ్డపెరుగు పోసి కలిపి, మాగాయ నంచిపెట్టి, బలవంతంగా ఆమె నోట్లో నాలుగు ముద్దలు కుక్కింది.  తరవాత గోరువెచ్చని నీళ్ళతో ఆమె నోరు కడిగింది.  అంతే, అన్నపూర్ణ తుర్రున బైటికి పరిగెత్తింది.
ఇంక స్నేహితురాళ్ళతో కలిసి ఒకటే హడావిడి.  ' అట్లతద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అని పాడుకుంటు గంతులేసారు.  కాసేపు ఉప్పాట ఆడుకున్నారు.  కాసేపు ఉయ్యాలలూగారు.  తెలతెలవారుతుండగా అలిసిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ నిద్రపోయింది అన్నపూర్ణ.
అన్నపూర్ణకి ఎనిమిది ఏళ్ళు.  కాని ఆకళింపు బాగా ఎక్కువ.  లలితమ్మగారి అలవాట్లు, భక్తి, బంధువులని ఆదరించే విధానం అన్నీ ఆమెకు బాగానే సంక్రమించాయి.  తల్లి వంటయింట్లో సతమతమవుతూంటే తనంతట తనే చొరవగా వంటింట్లోకి వెళ్ళి కూరలు తరిగి ఇస్తుంది.  ఎప్పుడన్నా పనిమినిషి రాకపోతే గబగబా ఇల్లంతా ఊడ్చేసి, అంట్లన్నీ తోముతుంది.  నీకెందుకే, పోయి చదువుకోక అని తల్లి కసిరినా పట్టించుకోదు.  లలితమ్మకి అన్నపూర్ణని చూస్తే బాలాత్రిపురసుందరిని చూసినంత భక్తి కలుగుతుంది.  'అమ్మా, నాకోసం ఈ ఇంట్లో అన్నపూర్ణగా వెలిసావా తల్లీ?' అని మనసులోనే అనుకుంటూ వుంటుంది.
జనవరి నెలలో రైతు అఖిలాండం ధాన్యం బస్తాలతో వచ్చి గాదె నింపుతాడు.  అతడు రాగానే, అన్నపూర్ణ గబగబా లోపలినించి చల్లని మజ్జిగలో కాస్తంత నిమ్మకాయ పిండి, రవ్వంత ఉప్పు వేసి, పెద్దగ్లాసు నిండా తీసుకువచ్చి ఇస్తుంది.  అఖిలాండం ఆనందంగా ' మా బంగారు తల్లి, నువ్వు కాశీ అన్నపూర్ణవేనమ్మా.  వెయ్యేళ్ళు చల్లగా వుండు తల్లీ.' అని దీవిస్తూ ఆ గ్లాసు అందుకుంటాడు.  అతడు తెచ్చిన ధాన్యం కంకుల కుంచెలు హాలులోను, లోపల మండువాలోను దూలాలకి వేలాడగడుతుంది అన్నపూర్ణ.  రోజూ పిచికలు కిచకిచమంటూ తమ భాషలో అన్నపూర్ణకి వేలదీవెనలు అందిస్తూ ఆ కంకులున్న గింజలు కొరికి తీసుకుపోయి గూళ్ళలో వున్న తమ పిల్లల నోట్లో పెడుతూ వుంటాయి.  ఆ సన్నివేశం చూడడం అన్నపూర్ణకి చాలా ఇష్టం.  అఖిలాండం గాదెలో బస్తాలు సర్దడం అయిపోగానే, అతడికి అరిటాకు వేసి చక్కగా అన్నం వడ్డిస్తుంది అన్నపూర్ణ.  ఎందుకంటే ఆ సమయంలో లలితమ్మగారు మడితో వుంటారు.
వేసంకాలం వచ్చిందంటే బండిలో తాటిముంజెలు వేసుకుని వస్తాడు అఖిలాండం.  ఇంక ఆ రోజు పిల్లలకి పండగే.  అతడు తాటికాయలు కత్తితో కొట్టి, ఒక్కొక్క ముంజె పిల్లలకి ఇస్తూంటే, వాళ్ళు కేరింతలు కొడుతూ చూపుడు వేళ్ళతో ముంజె కన్నులు పొడిచి రసం తాగుతూ తినేస్తారు.  ఆ సందడి అయింతరవాత లలితమ్మ గారు పిల్లలందరికీ తలో కొబ్బరిముక్క ఇస్తారు.  అందువల్ల ముంజెలు అరుగుతాయట.
రోజూ తెల్లవారకుండానే పనిమనిషి రాముడు వచ్చి వాకిలి చిమ్మి, ముగ్గు పెట్టి, ఇంటి పనంతా చేసేస్తుంది.  మళ్ళీ సాయంత్రం వచ్చి, లాంతర్లు తుడిచి, వాటిల్లో కిరసనాయిలు పోసి సిధ్ధం చేస్తుంది.  పొట్టుపొయ్యిల్లో రంపంపొట్టు గూటంతో కూరి రెడీ చేస్తుంది.  పాల దాలెలో కచికలు తీసేసి, పిడకలు పేరుస్తుంది.  ఆవులు, గేదెల పాకలో చీపురుతో శుభ్రం చేసి వాటికి ఎండుగడ్డి, కాసిని జనపకాడలు వేస్తుంది.  రాముడు రాగానే ఆవులు అంబా అంటూ మోర పైకి చాస్తాయి.  రాముడు ప్రేమగా వాటిదగ్గరకి పోయి గంగడోలు గోకుతుంది.  వాటి గంగడోళ్ళలో వున్న గోమారుని ఏరి పారేస్తుంది.
ఇక ఆదివారం వచ్చిందంటే పిల్లలకి గాబరాయే.  లలితమ్మగారు బలవంతంగా అందర్నీకూచోబెట్టి మాడు మీద దీవిస్తూ నూనె పెడుతుంది.  తరవాత సున్నిపిండిలో పసుపు వేసి వాళ్ళ వళ్ళు బాగా నలుస్తుంది.  అప్పుడు అందరికీ కుంకుడురసంతో తలంటి పోస్తుంది.  వాళ్ళకి కళ్ళలో కుంకుడురసం పడి మంటగా వుంటే నోట్లో ఒక ఉప్పరాయి వేస్తుంది.  కన్ను మండితే ఉప్పరాయితో తగ్గడవేమిటో మరి!
నెలకొక సారి పిల్లలందర్నీ తెల్లవారుజామున కూచోబెట్టి వంటాముదం బలవంతంగా తాగిస్తుంది.  వాళ్ళు బలవంతంగా ముక్కు మూసుకుని గుటకలేయగానే వాళ్ళకి పిసరంత చింతపండు ఇస్తుంది.  అది చప్పరిస్తే వికారం వుండదుట.  మళ్ళీ పొద్దున్న ఎనిమిది గంటలకి వాళ్ళందరి చేతా వేడి వేడి చారు తాగిస్తుంది.  ఆ రోజు వాళ్ళకి వేడి వేడి అన్నంలో కారప్పొడి కలిపి పెడుతుంది.  తరవాత చారు కలుపుతుంది.  వాళ్ళు ఆ రోజు మజ్జిగ అన్నం తినకూడదుట.  పిల్లలందరూ ఆముదం తాగడానికి నానా హడావిడీ చేస్తుంటారు.  లలితమ్మ వాళ్ళని బతిమాలి, కేకలేసి బలవంతంగా తాగిస్తుంది.  అన్నపూర్ణ మాత్రం తనకిచ్చిన ఆముదం గ్లాసుని పైకి ఎత్తిపెట్టుకుని గటగటా రెండు గుక్కల్లో తాగేస్తుంది.  లలితమ్మ ఆశ్చర్యంగా అన్నపూర్ణ కేసి చూస్తూ, ' నీకు వికారమనిపించదే?' అని అడిగితే, అన్నపూర్ణ నవ్వుతూ, ' ఆవకాయ అన్నంలో మీగడ నంచుకుంటూ ఆనందంగా తింటానుగా.  అలాగే ఆముదం ఇచ్చినా ఆనందంగా తాగాలి.  నువ్వేం చేసినా మా మంచి కోసమే కదమ్మా.' అంటుంది.  లలితమ్మ అన్నపూర్ణ మాటలు విని అబ్బురపడుతుంది.
డిశంబరు నెలలో ధనుర్మాసం వచ్చిందంటే అన్నపూర్ణ కూడా తల్లితో సమానంగా తెల్లవారుజామున నాలుగింటికే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసేస్తుంది.  ఆ తరవాత పట్టుపరికిణీ వేసుకుని తల్లితో పాటు ఎంబెరుమన్నార్ కోవెలకు వెడుతుంది.  అక్కడ అర్చకులు తెల్లవారుజామునుంచే పూజలు మొదలుపెడతారు.  భక్తిగా తను పళ్ళెంలో పెట్టుకుని తీసుకు వెళ్ళిన బియ్యం, అగరువత్తులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు పూజారిగారికిస్తుంది.  ఆయన సంకల్పం చెప్పిన తరువాత వాళ్ళకి వింజామరలు ఇస్తారు.  వాళ్ళు ఓం ఓం అనుకుంటూ భక్తిగా వింజామరలు వీస్తుంటే అష్టోత్తర నామాలతో విష్ణుమూర్తికి అర్చన పూర్తి చేసి, వాళ్ళకి ఒక కొబ్బరి చెక్క, అరటిపళ్ళు ఇస్తారు.  అప్పుడు ఇంటికి వస్తారు.  మళ్ళీ అన్నపూర్ణ ఎనిమిది కొట్టగానే కోవెలకి పరిగెడుతుంది.  అక్కడ పూజలు పూర్తి అయి ప్రసాదం నివేదన చేసి అర్చకులు భక్తులకి ప్రసాదాలు పంచిపెడతారు.  అన్నపూర్ణ భక్తిగా ఆ ప్రసాదం తీసుకుంటుంది.  అక్కడినించి పిల్లలు, పెద్దలు అందరూ కోర్టువీధిలో వున్న పెయ్యేటి శ్రీనివాసరావుగారి ఇంటికి వెడతారు.  ధనుర్మాసం మొత్తం ఆయన ఇంట్లో గుళ్ళో లాగే అర్చనలు జరుగుతాయి.  ఆయన రోజుకొక ప్రసాదం పంచిపెడతారు.  ఒకరోజు కట్టెపొంగలి, ఇంకో రోజు పులిహోర, మరో రోజు దధ్యోజనం, మరొక రోజు చిట్టిగారెలు ఇలా నెలంతా ప్రసాదాలు పెడతారు.  అక్కడ ప్రసాదం కూడా తీసుకుని భక్తిగా నోట్లో వేసుకుని అప్పుడు ఇంటికి వచ్చి, హడావిడిగా అన్నం తినేసి స్కూలుకి పరిగెడుతుంది అన్నపూర్ణ.
వాళ్ళ ఇంట్లో వినాయక చవితినుంచి సంక్రాంతి వరకు అన్ని పండగలూ చాలా ఘనంగా చేస్తారు.  సంక్రాంతికి ఇంటిల్లిపాదికీ కొత్తబట్టలు కుట్టిస్తారు సోమశేఖరంగారు.  అంతేకాదు, ప్రతి సంక్రాంతికి రైతులకి, పాలేర్లకి, పనిమనుషులకి కూడా ఘనంగా బట్టలు పెడతారు.  వారింట్లో పనిచేసే పనివారు తమకింత జీతం కావాలని ఎప్పుడూ అడగరు.  అలా అడిగే అవకాశం కూడా సోమశేఖరంగారు వాళ్ళకివ్వరు.  వాళ్ళ ఇంట్లో ఏం అవసరం వచ్చినా కనిపెట్టుకుని తీరుస్తూ వుంటారు.  అలాగే వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే మంగళసూత్రాలు, పెళ్ళికూతురికి పట్టుబట్టలు సోమశేఖరంగారి ఇంటినించే వెళ్తాయి.
ఉగాదికి లలితమ్మగారు చెరుకుముక్కలు, బెల్లం, చింతపండు రసం, వేపపువ్వు మొదలైనవన్నీ వేసి ఉగాదిపచ్చడి చేస్తారు.  పిల్లలు స్నానాలు చేసి, కొత్తబట్టలు వేసుకుని, ఆవిడ పెట్టిన ఉగాది పచ్చడి ఇష్టంగా తిని, అప్పుడు ఫలహారాలు చేస్తారు.
వినాయకచవితికి సోమశేఖరంగారు ముందురోజే బజారునించి నాలుగు పాలవెల్లులు, నాలుగు వినాయకుడి మట్టి విగ్రహాలు, పత్రి, పువ్వులు, కొబ్బరికాయలు మొత్తం సరంజామా అంతా తీసుకువస్తారు.  రాత్రి పనంతా అయిపోయాక లలితమ్మగారు జాగ్రత్తగా పూజగది కడిగి, ముగ్గులు పెట్టి, పాలవెల్లులు కట్టి, విగ్రహాలు పెట్టి అప్పుడు పడుకుంటారు.  పిల్లలు తెల్లవారి లేచి చూసేసరికి అక్కడ వినాయకుడి పూజకి సర్వం సిధ్ధంగా వుంటుంది.  వాళ్ళు కేరింతలు కొడుతూ వెళ్ళి తలంట్లు పోసుకుని, మడిబట్టలు కట్టుకుని పూజకు సిధ్ధపడతారు.  పురోహితుడు ఎనిమిదింటికల్లా వాళ్ళింటికి వచ్చి, విఘ్నేశ్వరుడికి సహస్రనామ పూజ చేయించి, వ్రతకథ చెప్పి అందరికీ అక్షంతలు వేసి, వారిచ్చిన దక్షిణ తీసుకుని వెడతాడు.
దీపావళి వస్తోందంటే ఇరవై రోజుల ముందునించే సోమశేఖరంగారి ఇంట్లో సందడి మొదలవుతుంది.  పాత కాగితాలతో మతాబా గొట్టాలు తయారుచెయ్యడం, ఇంట్లో మందుగుండు నూరి మతాబాల్లోను, చిచ్చుబుడ్లలోను కూరడం చేస్తారు.  పిల్లలంతా సందడిగా తలో చెయ్యి వేస్తారు.  దీపావళిరోజు పిల్లలందరికీ తలో అయిదురూపాయలు ఇస్తారు.  వాళ్ళంతా బిలబిలమంటూ బజారుకి వెళ్ళి, కాకరపువ్వొత్తులు, అగ్గిపెట్టెలు, భూచక్రాలు, కరెంటుతీగలు, పాముబిళ్ళలు మొదలైనవన్నీ కొనితెచ్చుకుని పగలంతా ఎండబెట్టుకుంటారు.  సాయంత్రం కాగానే లలితమ్మగారు ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసి, తర్వాత తులసికోట దగ్గిర ప్రమిదెలు వెలిగించి పెట్టి, ఆ పైన అరుగులమీద దీపపు ప్రమిదెలు పెడతారు.  అప్పుడు గోగుకాడలకి చివర గుడ్డలు చుట్టి నూనెలో ముంచి వెలిగించి పిల్లలకిస్తారు.  వాళ్ళు ' దిబ్బూ దిబ్బూ దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి అంటూ దివిటీలు కొడతారు.  ఆ తర్వాత లోపలికి వెళ్ళి లలితమ్మగారు తినిపించిన స్వీట్లు తిని హడావిడిగా బాణసంచా కాల్చడం మొదలుపెడతారు. సోమశేఖరం గారు, లలితమ్మగారు, అందరూ బైటికి వచ్చి పిల్లలు బాణాసంచా కాలుస్తూంటే చూస్తూ ఆనందిస్తారు.  మధ్య మధ్యలో పిల్లల్ని, ' ఒరేయి జాగ్రత్త, ఆ చిచ్చుబుడ్డికి మరీ దగ్గరికి వెళ్ళకు, అమ్మాయ్, నీ పరికిణీ జాగ్రత్త.  కాస్త పైకి దోపుకో' అంటూ హెచ్చరికలు చేస్తూ వుంటారు.  రాత్రి తొమ్మిదింటి దాకా ఆ హడావిడి నడుస్తూనే వుంటుంది.  ఇంక చాల్లెండర్రా అని పెద్దలు అంటున్నా, ' అమ్మా, ఈ ఒక్క మతాబాయేనే, ఈ ఒక్క అగ్గిపెట్టేనే.' అంటూ బేరాలాడి, చివరికి ఎల్లాగో ఇంట్లోకి వచ్చి నాలుగు మెతుకులు తిని హాయిగా పడుకుంటారు.  తెల్లవారితే రోడ్లన్నీ టపాకాయల తాటాకులతోటి, ఔట్ల కాగితాలతోటి, కాలిపోయిన చిచ్చుబుడ్లతోటి నిండి వుంటాయి.
ఇలా ఏ పండగయినా సోమశేఖరంగారి ఇంట్లో అతివైభవంగా చేస్తారు.
ఇంక ఊరగాయల సీజను వచ్చిందంటే వారింట్లో హడావిడే హడావిడి.  సోమశేఖరం గారు శనివారం పాలకొల్లు సంతకి వెళ్ళి మాగాయకాయకి, ఆవకాయకి నాలుగేసి వందల చొప్పున, ఎనిమిది వందల మామిడి కాయలు తీసుకు వస్తారు.  పది కాగానే వంటలు పూర్తి చేసుకుని భోజనాలు చేసేసి ఇంక అప్పుడు ఆ బృహత్కార్యానికి తెర లేపుతారు.  ఎదరింటినించి సుభద్రమ్మ, పక్కింటినించి మాణిక్యాంబ, మరో పక్కింటినించి మార్వాడీల అమ్మాయి బాదామి అందరూ బిలబిలమంటూ వచ్చి చేరిపోతారు.     గుండిగల్లో నీళ్ళు పోసి కాయలు నీళ్ళలో వేస్తారు.  పిల్లల్లో కొందరు ఆ కాయలు తీసి గుడ్డతో తుడుస్తారు.  మరికొందరు ముచికలు చాకుతో కోసి వస వస్తూంటే గుడ్డతో శుభ్రంగా తుడుస్తారు.
సోమశేఖరంగారి పాలేరు దాసు, రైతు అఖిలాండం, పనిమనిషి రాముడు అందరూ గుమిగూడతారు.   నాలుగు ఆవకాయ కత్తిపీటలు వేసుకుని కూర్చుంటారు. ఆవకాయకి కాయలు చకచకా ముక్కలు కింద నరుకుతారు.  పిల్లలు మళ్ళీ ఆ ముక్కలు తీసుకుని చాకులతో ఆ ముక్కల్లో వున్న జీడి తీసేసి, పొరలు గీకేస్తారు.  ఆడవాళ్ళు ఆల్చిప్పలు తెచ్చుకుని కూర్చుంటారు.  వాళ్ళందరూ పోటాపోటీగా మాగాయకి మామిడికాయలకి చెక్కులు తీసేస్తారు.  సాయంత్రానికల్లా యజ్ఞం పూర్తవుతుంది.  లలితమ్మగారు మడి కట్టుకుని ఆవకాయ, పులిహార ఆవకాయ, కారపు ఆవకాయ, మెంతి ఆవకాయ, శనగల ఆవకాయ, పెసర ఆవకాయ, నువ్వుల ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, ఇల్లా రకరకాల ఆవకాయలు కలుపుతారు.  అల్లాగే మాగాయకి ముక్కలు బాగా ఎండబెట్టి మాగాయ, కోరు మాగాయ, నూనె మాగాయ, వెల్లుల్లి మాగాయ, తొక్కుడుపచ్చడి లాంటి ఎన్నో రకాలు తయారుచేస్తారు.  వాటినన్నింటినీ పెద్ద పెద్ద జాడీల్లో నింపి వంటింట్లో మిద్దె మీద భద్రపరుస్తారు.   మళ్ళీ సమయానుసారంగా వాటిని కిందకి దింపి అందులో నూనె పొయ్యడం లాంటివి చేస్తారు.  ఊరగాయల్లోకి నూనె వాళ్ళు బజారునించి కొని తీసుకు రారు.  పిల్లలు గానుగకు వెళతారు అక్కడ గానుగ మీద కూచుని పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తారు.  సాయంత్రం దాకా కూర్చుని గానుగ ఆడించిన పప్పునూనె తీసుకు వస్తారు.  ఆ నూనె మాత్రమే ఊరగాయలకి వాడతారు.  వారానికి సరిపడా ఊరగాయలు మిద్దె మీంచి మడిగా దింపి చిన్న జాడీల్లో పెడతారు.  పిల్లలు చద్ది అన్నం తినేటప్పుడు ఆ చిన్నజాడీల్లో ఊరగాయలు తీసుకుంటూ వుంటారు. ఊరగాయలు పెట్టడం పూర్తవగానే పక్కిళ్ళవాళ్ళకి, బంధువులకి కూడా కాస్త కాస్త మచ్చుకి పంపిస్తారు.వేసంకాలంలో గూట్లో తరవాణి పెడతారు.  పిల్లలు పొద్దున్న ఆ తరవాణి అన్నంలో వెల్లుల్లి ఆవకాయ కలుపుకుని, పప్పునూనె వేసుకుని ఇష్టంగా తింటారు.
ఇక అంతర్వేది తీర్థానికి వెళ్ళడం అంటే అదొక చక్కని అనుభవం.  పెద్దాళ్ళందరూ రక్షణకవచంలా నిలబడి పిల్లల్ని జాగ్రత్తగా తీసికెడతారు.  గోదావరిలో లాంచీలు ఒడ్డు దాకా రాలేవు.  అందుకని వడ్డు నించి లాంచీల దాకా కర్రలు, తాటాకులతో తాత్కాలికంగా వంతెన నిర్మిస్తారు.  వంతెన చివర పెద్దపడవని నిలిపేసి వుంచుతారు.  ఆ వంతెన మీదుగా పడవ మీదకి చేరి, అక్కడి నించి ఆగివున్న లాంచీలోకి వెళ్ళాలి.  ఏడు మైళ్ళ ప్రయాణం చాలా సరదాగా సాగుతుంది.  అంతర్వేదిలో అంతా ఇసకపర్ర.  ఆ ఇసకలోంచి నడుచుకుంటూ గుడికి చేరుకుంటారు.  దారిలో చెరుకుపానకం కొని పిల్లలందరికీ ఇప్పిస్తారు.  అంతర్వేదిలో తీర్థం రోజుల్లో సత్రవులు వెలుస్తాయి.  అవి కులాలవారీగా కూడా వుంటాయి.  ఆ సత్రవులలో ఉచితంగా భోజనాలు పెడతారు.  దారి పొడుగూతా చలివేంద్రలు వుంటాయి.  కుండల్లో చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ వుంచి ప్రయాణీకులకి ఉచితంగా ఇస్తూ వుంటారు.  మొదటిరోజు కళ్యాణం జరుగుతుంది.  రెండవరోజు, అంటే భీష్మైకాదశి నాడు రథోత్సవం జరుగుతుంది.  ఆ రథోత్సవానికి మొగల్తూరు రాజవంశస్థులొకరు, మహారాజుల దుస్తులలో వచ్చి, నరసింహస్వామికి నమస్కరించుకుని రథం పైన చెయ్యి వేస్తారు.  ఆ తర్వాతే రథాన్ని కదిలిస్తారు.అది అక్కడి ఆచారం.  తీర్థానికి ఎక్కడెక్కడినించో జనం రైళ్ళలోను, బస్సులలోను నరసాపురం చేరుకుని, అక్కడినించి లాంచీల మీదుగా అంతర్వేది చేరుకుంటారు.  అన్నపూర్ణ రెండు సంవత్సరాలు తను చదువుతున్న టైలరుహైస్కూలు తరఫున స్కౌటుగా అంతర్వేది వెళ్ళి స్వఛ్ఛందసేవ చేసింది.
అన్నపూర్ణ కార్తీకమాసంలో లలితమ్మగారితో కలిసి తెల్లవారుజామున గోదావరికి వెళ్ళి నెలపొడుగూతా స్నానాలు చేసేది.  ఆమెకు గోదావరిని చూస్తే హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది.  ఆమెకు ఎనిమిదేళ్ళు వచ్చినప్పుదు గోదావరికి పుష్కరాలు వచ్చాయి.  పుష్కరాలలో రోజూ గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేది.  ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళందర్నీ తీసుకుని గోదావరికి తీసికెళ్ళి నాటుపడవ మీద షికారుకి వెళ్ళేది.
అర్థరాత్రి ఇంటికి ఎవరన్నా చుట్టాలొస్తే లలితమ్మగారు అనే మొట్టమొదటి మాట, ' కాళ్ళు కడుక్కోండి.  భోంచేద్దురుగాని.'  లలితమ్మ అతిథుల్ని ఆదరించే పథ్థతి అన్నపూర్ణకి చాలా నచ్చేది.  ఒకసారి తల్లితో అంది, ' అమ్మా!  నీకు గోదావరికి తేడా లేదమ్మా.  గోదావరి కూడా నీలాగే అందర్నీ ఎంతో ప్రేమతో ఆదరిస్తుంది.'
లలితమ్మ నవ్వేసి అంది, ' నీ మొహం లేవే.'
అన్నపూర్ణ టైలరుహైస్కూలులో  ఎస్.ఎస్.ఎల్.సి. దాకా చదివింది.  ఎస్.ఎస్.ఎల్.సి.లో ఆమెకు మంచి మార్కులు వచ్చాయి.  తరవాత ది నర్సపూర్ కాలేజిలో ఇంటర్మీడియేట్ చదివింది.  ది నర్సపూర్ కాలేజి స్థాపనకు యర్రమిల్లి నారాయణమూర్తిగారు విశేషమైన కృషి చేసారు.  అందువల్ల ఆ కళాశాలకు తర్వాత శ్రీ యర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల అని పేరు మార్చారు.  ఐతే ఆ తర్వాత ఆమెని పై చదువులు చదివించడానికి సోమశేఖరం గారు ఒప్పుకోలేదు.  మంచి సంబంధం వచ్చిందని అన్నపూర్ణకి పెళ్ళి చేసేసారు.  ఆమె పెళ్ళి చూపులు కూడా గమ్మత్తుగా జరిగాయి.  రాజారావుకి తలిదండ్రులు లేరని, ఐనా  మంచి బుధ్ధిమంతుడని, మంచి ఉద్యోగంలో వున్నాడని, ఏ దురలవాట్లు లేవని, కుటుంబం చాలా సంప్రదాయమైనదని మధ్యవర్తి చెప్పేసరికి ఒక మంచిరోజున వాళ్ళ ఇంటికి సోమశేఖరంగారు వెళ్ళి మా అమ్మాయిని చూసుకోడానికి రండని ఆహ్వానించి వచ్చారు.  వాళ్ళు పెళ్ళి చూపులకొచ్చారు.  అన్నపూర్ణకి ముస్తాబు చేసి తీసుకువచ్చి చాప మీద కూర్చోబెట్టారు.  అందరూ ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు.  అన్నపూర్ణ వంచిన తల ఎత్తలేదు.  తల వంచుకునే అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది.  పాట పాడమన్నారు.  తల వంచుకునే ' నీ దయ రాదా, రామ నీ దయ రాదా ' అన్న త్యాగరాజ కీర్తన పాడింది.  అందరికీ పిల్ల నచ్చింది.  అబ్బాయి నీకు నచ్చాడా అని ఎవరూ అన్నపూర్ణని అడగలేదు.  ఆమెకి ఆ పట్టింపూ లేదు.  తలిదండ్రులు ఏం చేసినా తన మంచి కోసమే కదా అనుకుంది.  అబ్బాయి అందాలు, చందాలు చూసి పెళ్ళి చేసుకోడానికి తనేమన్నా చక్రవర్తి కూతురా, ఇదేమన్నా స్వయంవరమా అనుకుంది.  అంతే, ఆమెకు రాజారావుతో పెళ్ళి జరిగిపోయింది.  రాజారావు వాళ్ళు కూడా నరసాపురం లోనే వుంటారు.  ఉన్న ఊళ్ళో సంబంధం, పిల్ల కళ్ళెదుర వుంటుంది, వచ్చిపోతూ వుంటుంది అని సోమశేఖరం గారు సంబరపడ్డారు.  రాజారావు కూడా బహుయోగ్యుడు.  అన్నపూర్ణని కళ్ళలో పెట్టుకుని చూసుకునే వాడు.
అన్నపూర్ణ పెళ్ళి చేసుకుని కాపురానికి వెళ్ళిన తర్వాత ఆరిందాలా మారిపోయింది.  తన కళ్ళముందు తన తల్లి లలితమ్మ జీవించే విధానమే కనబడేది.  ఆవిడ లాగే తనుకూడా మంచి పేరు తెచ్చుకోవాలనుకునేది.  అత్తవారి ఇంట్లో అందరికీ తలలో నాలుకలా మెలిగేది.
రోజులు మారిపోయాయి.  గంపెడు బిడ్డలతో, సౌభాగ్యవతిగా జీవించమ్మా అనే రోజులు పోయాయి.  మేమిద్దరం, మాకిద్దరు అనే ప్రచారం ఊపందుకుంది.  ఇద్దరు పిల్లలు పుట్టగానే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోమని ప్రభుత్వోద్యోగులు ఇంటింటికి వెళ్ళి చెవినిల్లు కట్టుకుని పోరేవారు.  అలాగే రాజారావు కూడా ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టగానే ఇంక పిల్లలు పుట్టకుండా ఆపరేషను చేయించేసుకున్నాడు.  వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దయ్యారు.  ఆడవాళ్ళకి చదువెందుకు అనే మనస్తత్వాలు మారాయి.  రాజారావు తన కూతుర్ని డాక్టరీ చదివించాడు.  ఆమె మరొక డాక్టర్ని ప్రేమించి పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడింది.  ఇక ఆయన సుపుత్రుడు శేఖర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు.  అతడు హైదరాబాదులో ఉద్యోగం చేసేవాడు.  తలిదండ్రుల్ని హైదరాబాదు రమ్మని పోరి పోరి తీసికెళిపోయాడు.  అక్కడ ఒక అపార్ట్ మెంట్లో కాపురం.  చాలీచాలని అగ్గిపెట్టె గదులు, ఒక ఇరుగు లేదు, ఒక పొరుగు లేదు, ఎవరికి వారు తెల్లవారితే ఉరుకులు, పరుగులు.  మనుగడ కోసం జరిపే పోరాటం!  ఒక చుట్టాల రాకపోకలు లేవు, ఒక పండుగ లేదు, ఒక పబ్బం లేదు.  ఒక వినాయక చవితి వస్తే మొక్కుబడిగా పొద్దున్న కూచుని కేసెట్ ఆన్  చేసుకుని పూజ కానిచ్చేస్తారు.  ఒక శ్రావణ మాసం వస్తే పేరంటానికి పిలిచేవాళ్ళెవరూ లేరు.  దానికి బదులు ఒకరిద్దరు ముత్తైదువులే వాళ్ళ అపార్ట్ మెంట్ కి వచ్చి, అన్నపూర్ణకి కాళ్లకి పసుపు రాసి శనగలు ఇచ్చి, నమస్కారం చేసి పోయేవారు.  నరసాపురంలో వున్నప్పుడైతే పర్వదినాల్లోను, కార్తీకమాసం నెలరోజులు, పుష్కరాలప్పుడు గోదావరిస్నానాలు చేసేది.  రోజూ ఎంబెరుమన్నార్ కోవెలకి వెళ్ళి భగవద్దర్శనం చేసుకుని వచ్చేది.  సాయంత్రాలు పురాణకాలక్షేపాలకెళ్ళేది.  అప్పుడప్పుడు తమ ఇంట్లో సామూహిక విష్ణు సహస్రం, లలితా సహస్రం పారాయణ ఏర్పాటు చేసి వచ్చిన అందరికీ భోజనాలు పెట్టి, జాకెట్టు గుడ్డలిచ్చి పంపేది.  ఇప్పుడవేం లేవు.  అలా రోజులు గడిచినా బాగుండేది.  కాని రాజారావు, అన్నపూర్ణ వాళ్ళ ఇంట్లో వుండడం శేఖర్ భార్యకి నచ్చలేదు.  ఏమిటీ ముసలి పీడ అంటూ అస్తమానూ చీదరించుకునేది.  మనవడు, మనవరాలు కూడా ఎప్పుడూ తాతయ్యతో గాని, బామ్మతో గాని సరదాగా ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు.  ఎంతసేపూ ఐ పాడ్ లు దగ్గర పెట్టుకుని  దీక్షగా వాటిలోకి చూస్తూ, ఏవేవో మీటలు నొక్కుతూవుంటారు.  శేఖర్ భార్య ఇందుమతి కూడా ఉద్యోగం చేస్తోంది.  పొద్దున్నే పిల్లలు స్కూలుకి స్కూలు బస్సులో వెళిపోతారు.  శేఖర్, ఇందుమతి వాళ్ళ కార్లలో ఆఫీసులకి వెళిపోతారు.  ఇంక అక్కడినించి సాయంత్రం దాకా అన్నపూర్ణ బిక్కు బిక్కుమంటూ గడిపేది.  ఒక సుప్రభాతాన శేఖర్ తలిదండ్రుల్ని తన కారులో తీసికెళ్ళి ఈవెనింగ్ విల్లా అన్న వృధ్ధాశ్రమంలో చేర్చేసి చెయ్యి కడిగేసుకున్నాడు.
తర్వాత ఒక్క సంవత్సరానికే బంజారాహిల్స్ లో మంచి విలాసవంతమైన భవనాన్ని కొనుక్కుని అందులోకి మారిపోయాడు.
*************************** 
           అన్నపూర్ణ ఆరోగ్యం వృధ్ధాశ్రమంలో రోజు రోజుకీ క్షీణించసాగింది.  ఆమెకి దైహిక ఆరోగ్యం మాట ఎల్లా వున్నా, మనోవేదన రోజురోజుకీ ఎక్కువైపోయి మంచానికి అతుక్కుపోయింది.  ఆమెకి గోదావరి అంటే ప్రాణం.  తన కన్నతల్లిని, గోదావరిని అమితంగా ప్రేమిస్తుందామె.  నరసాపురంలో, తన ఇంట్లో వుంటూ, గోదావరి స్నానాలు చేసుకుంటూ, ఆ ఎంబెరుమన్నార్ కోవెలలో భగవద్దర్శనం చేసుకుంటూ, పురాణకాలక్షేపాలు వింటూ, తన ఇంట్లో అప్పుడప్పుడు సామూహిక విష్ణుసహస్ర నామ స్తోత్ర, లలితా సహస్ర పారాయణలు చేయిస్తూ, కాలం వెళ్ళదీస్తూ, చివరికి ప్రశాంతంగా ఏ ఆసుపత్రి మొహమూ చూడకుండా కన్ను మూయాలని ఆమె కోరిక.  అదే చెప్పలేక, చెప్పలేక మొగుడితో చెప్పుకుంది.
******************
          అన్నపూర్ణ మగతగా అడిగింది, ' ఏమండీ, ఇంకా నరసాపురం రాలేదా?'రాజారావు బాధగా అన్నాడు, ' వచ్చేసాం పూర్ణా.  ఇప్పుడే లాకూలు దాటాం.  అదుగో, కిరసనాయిలు పంతులుగారి పెట్రోలు బంకు.'
' ఐతే ముందు గోదావరి గట్టుకి తీసెకెళ్ళండి.  ఒక్కసారి గోదావరిని కనులారా చూసి, తర్వాత ఇంటికెళ్దాం.'
కారు గోదావరీ తీరానికి చేరుకుంది.
' ఏమండీ, కొంచెం నన్ను లేవదీయండి.'
రాజారావు నెమ్మదిగా ఆమెని లేవదీసి తనకి ఆనించుకున్నాడు.  అన్నపూర్ణ ఎంతో ఆనందంగా భర్తకు ఆనుకుని, కనులారా గోదావరిని చూసింది.  ' నారాయణా,  నారాయణా, నారాయణా! ' అంది.
రాజారావుకి అనుమానమొచ్చింది.  తన భార్య పరాకు మాటలు మాట్లాడుతోందా?.................  అన్నాడు, ' పూర్ణా, నారాయణ ఎవరు?  నేను నీ రాజాని.'
అన్నపూర్ణ నిండుగా నవ్వింది, ' నా రాజా!  నా....నా.........నారాయణా! ' అంటూ రాజారావు వళ్ళో తల వాల్చేసింది.
రాజారావు ఇంట్లో అన్ని కార్యాలు చేయించే పురోహితుడు కారు ఆగడం చూసి, ఎవరో స్నానానికి వచ్చారనుకుని, సంభావన దొరుకుతుంది కదా అని కారు దగ్గిరకి వెళ్ళాడు.  అందులో రాజారావుని చూసి సంభ్రమాశ్చర్యాలతో, ' ఎవరూ, రాజారావుగారా?  ఏమిటీ. అకస్మాత్తుగా ఊడిపడ్డారూ?  అమ్మగార్ని కూడా తీసుకు వచ్చారే?' అంటూ అన్నపూర్ణ పరిస్థితి చూసి దిగ్భ్రమ చెందాడు.
         **********************
          దహనకాండ ముగిసింది.  మూడవరోజున అన్నపూర్ణ అస్తికలను ముంతలో భద్రపరిచాడు రాజారావు.  పదిరోజులూ శ్రధ్ధగా కర్మకాండ తనే జరిపి, బ్రాహ్మలందరికీ ఘనంగా దానాలు, సంభావనలు సమర్పించాడు.  ఇంకా అతడి దగ్గర మూడు లక్షలు మిగిలాయి.  అన్నపూర్ణ చదివిన టైలరుహైస్కూలుకి వెళ్ళి ఆ డబ్బు సెక్రెటరీ అండ్ కరెస్పాండెంట్ కిచ్చి, తనే దగ్గరుండి బ్యాంక్ లో టైలరు హైస్కూల్ పేరు మీద, తన పేరుమీద జాయింటుగా డిపాజిట్ చేయించాడు.  ఆ డబ్బు మీద వచ్చే వడ్డీని  ప్రతి సంవత్సరం ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులకి అన్నపూర్ణ పేరుమీదుగా ఉపకార వేతనంగా ఇమ్మని ఆదేశించాడు రాజారావు.  తరవాత తృప్తిగా అన్నపూర్ణ అస్తికలున్న ముంత తీసుకుని ప్రయాగకు ప్రయాణమయ్యాడు.
********************
          తర్వాత రాజారావు ఏమయ్యాడో, ఎక్కడ స్థిరపడ్డాడో ఎవరికీ ఏమీ తెలియదు.  ఎవరూ అతడి గురించి పట్టించుకోనూ లేదు.ఐతే ఏడాదికొక్కసారైనా టైలరు హైస్కూలు వార్షికోత్సవాలలో అన్నపూర్ణగారి పేరు ఇప్పటికీ వినబడుతూనే వుంటుంది.
********************

No comments:

Post a Comment

Pages