మా బాపట్ల కధలు – 4
చెక్క రిక్షా
భావరాజు పద్మిని
సూర్యలంక సముద్రతీరం. అప్పుడే సూర్యుడు నడినెత్తికి పాకుతున్నాడు. ప్రచండ సూర్య కిరణాలకాంతి సముద్రంమీద పడడంతో సముద్రమంతా బంగారం పోతపోసినట్లు మెరిసిపోతోంది. ఒడ్డున ఇసుకలో గుడి కడుతూ కూర్చున్న 12 ఏళ్ళ రాజు, ఎందుకో తన తాత మునెయ్య వంక చూసాడు. ఆశ్చర్యం ! మునెయ్య కళ్ళలో మరో సంద్రం ఉప్పొంగుతున్నట్టు, ఒకటే కన్నీరు ఉబుకుతోంది. అతని చూపంతా కాస్త దూరంలో ఉన్న తన చెక్క రిక్షా మీద ఉంది.
“ఏంది తాతా ఏడుస్తాఉండావు ? రిచ్చా ఈడనే ఉందిగా , ఏడవమాకు. ఏమైనాదో నాతో చెప్పవూ?”
“కాలం మారినాదంట రా. ఇప్పుడీ రిగషాలు ఎవోల్లూ ఎక్కట్లేదట, మీ అయ్య ఈ రిచ్చా అమ్మేసి, అప్పు జీసి ఆటో కొంటాడంత,” అన్నాడు బాధగా.
“అమ్మితే ఏం లే తాతా, అప్పుడు మనం దారంతా ఈ రిగశా తొక్కుకు రావక్కర్లేదు, చక్కా, అందరం ఆటోలోనే రావచ్చుగా. ఆటో తోల్తే, ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయ్ గందా. నాకెలాగూ సదువబ్బలేదు, నేనూ ఈ రిచ్చా మానేసి, ఆటో తోల్తా.”
“అదిగాదురా రాజుగా, నామాటుకు ఇది రిచ్చా గాదురా... మా అమ్మరా ఇది...” మునెయ్య ఆపై మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడవసాగాడు.
రాజుకు చాలా బాధేసింది. ఎన్ని సుడిగుండాలున్నా ,ఎన్ని ఆటుపోట్లున్నా, కడుపులో బడబాగ్నిని దాచుకుని, గంభీరంగా ఉండే ఈ సంద్రంలా మునెయ్య కూడా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అలాంటిది ఈ రోజు చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు రాజుకి.
“ఊర్కో తాతా, చిన్న పిల్లాడిలా ఏందిది ? సరేగాని, రిచ్చా అమ్మెలాగా అవ్వుద్దీ? సెబుతావా ?”
“సెప్తా రా. ఇలా కూకో మరి, నీకైనా నా బాద సెబితే నా గుండె బరువు తీరుతాది, “ అంటూ రాజును దగ్గరగా కూర్చోపెట్టుకుని, వాడి తల నిమురుతా ఇలా చెప్పసాగాడు మునెయ్య.
“ఇలా సూడు రాజు, పెతి వోళ్లకి బద్రంగా దాచుకునే కొన్ని వస్తువులు ఉంటాయి. అవి వస్తువులు కాదురా. తిరనాల్లో అమ్మే తాటాకు పూలలాంటి వాడిపోని గాపకాలు. వొళ్ళ జన్మలతో ముడివేసుకున్న ఎన్నెల దారాలు. అందుకే ఆ వొస్తువుల ఇలువ, అనుభొవించే ఆ మడుసులకు తప్ప వేరేటొల్లకి తెలవదు. వాటికి వెల కట్టలేము కూడా ! చిన్నోడివి, నీకింకా ఇదంతా తెల్సుకోడానికి కాలం పట్టుద్ది...” అంటూ ఉండగా రాజు కడుతున్న ఇసుక గుడిని ఓ పెద్ద అలొచ్చి తీసుకుపోయింది. అంతే, రాజు దిగాలు పడిపోయేడు.
“చూసినావా, ఆ ఇసుక గుడి కట్టేతప్పుడే అది నిలవదని, కొట్టుకు పోతాదని నీకు తెలుసు. అయినా, ఒక్క నిముసం ఇసుక పోతపోసినందుకే అది నీ సొంతమని, కొట్టుకుపోయిందని నువ్వు దిగాలు పడతా ఉండావు. ఇసుంటిదే రా మడిసి జీవితం. ఏదీ తనది కాదని తెలిసినా, ఏదీ మీదకి అట్టుకుపోలేమని తెలిసినా, అన్నీ తనకే కావాలని వెర్రి ఆశ. పది నిముసాలు కట్టిన గుడి మీదే నీకంత మమకారముంటే నా జన్మంతా ముడేసుకున్న ఈ రిచ్చా మీద నాకెంతుండాలి రా అయ్యా ?”
“నిజవే తాతా, ఈ రిచ్చా చానా గొప్పదయ్యుంటది. మన రిచ్చాల్లోంటివే అన్ని ఊళ్లలో ఉంటయ్యా ?”
“నేను చానా ఊళ్లు తిరిగానురా అయ్యా. కాని, మన బాపట్లలో రిచ్చాలాంటివి ఏడా కనరావు. గూడు రిచ్చాలు, బండి రిచ్చాలు, బుల్లి గూడు రిచ్చాలు ఉంటావే గాని, మనూళ్ళోలాంటి విసాలమైన సిమ్మాసనం లాంటి రిచ్చాలు ఏడా లేవురా. కాత్త లావుపాటి వోల్లైతే ఆ రిచ్చాలలో పట్టక ఒగటే ఇరుకు తిప్పలనుకో. మీద ఆ ఆకాశం ఎంత విశాలంగా ఉందో, కిందీ రిచ్చా గూడా అంతే ! ఎండకు ఎండ, వానకు వాన, గాలికి గాలి, ఎన్నెలకు ఎన్నెల... ప్రకృతి తల్లితో గొప్ప విడరాని సమ్మందం ఉందిరా మన రిచ్చాలకి. ఐదారుగురు దర్జాగా కూకోవచ్చు, సామాన్లతో సహా. బస్సునాగా ఇక్కడే అగుద్ది, అన్న బాదనేదు. ఎక్కడ అవసరముంటే అక్కడే ఎక్కచ్చు, దిగచ్చు.
సదూకోడానికి మనూరు వచ్చేతోల్లంతా “ఏంటి ఇది రిచ్చానా? సామాన్లు మోసేది కదూ ! పడిపోతేనో, వామ్మో నేనెక్కను.. అనే కాడ్నుంచి, ‘రిచ్చా అంటే, మా బాపట్ల రిచ్చానే. ఎంచక్కా కదిలే మారాజ కురిసీ లాగుంతాది. బస్సు వద్దులే రారా, గాలి పోసుకుంటూ హాయిగా రిచ్చాలో పోదాం...” అనే దాకా తేలిగ్గా వొచ్చేసేవారు. అదీ మన రిచ్చాల గొప్పతనం.
మాయమ్మను పెళ్లి జేసుకునే ముందే మా నాయన ఈ రిచ్చా గొన్నాడంత. వోల్లిద్దరి పెళ్లి పల్లకీ ఇదేనంత. ఇందులోనే మాయమ్మను ఊరేగిస్తా తెస్తాంటే ఊరంతా సంబరంగా చూసారంట, మాయయ్య సేప్పేతోడు. రిచ్చా తొక్కి వచ్చిందే వోళ్లకు తిండి. పెళ్లై పదేళ్ళైనా వోళ్లకు పిల్లలు పుట్టలేదని, ఓ పాలి కర్లపాలెంలో ఎవరో సాములోరు వస్తే, ‘మునెయ్య బాబూ మాకు బిడ్డ పుడితే నీ పేరే ఎట్టుకుంటాం ,’ అని ఆరి కాళ్ళ మీన పడినారంత. తర్వాత నేను మాయమ్మ కడుపున బడ్డాను.
పురుటి నొప్పులొచ్చి, మాయమ్మను రిచ్చా మీన పడుకోబెట్టి, పెద్ద కోర్టు ఎదురుగా ఉన్న కేసంమూర్తి డాటరారి కాడికి తీస్కపోతాఉంటే, ఈ రిచ్చా మీనే నేను పుట్టినానంత. అప్పటి సంది ఈ రిచ్చానే నా ఉయ్యాల, ఇదే నా ఆటబొమ్మ, రిచ్చాలో కూకోబెట్టి తిప్పితే గాని, బువ్వ తినేటోడ్నికానంట. అందుకే అయ్య అలసిపోయి నిద్దరోతే, అమ్మే ఎవల్లూ సూడకుండా కాస్త దూరం రిచ్చా తొక్కి, బువ్వ తినిపించేదంట.
మన బాపట్లలో ఇదివర్లో ఇన్ని కాలేజీలు లేనప్పుడు, ఎక్కువ రద్దీ ఉండీది ఏడాదిలో రెండు సార్లే. వైసోఖ మాసంలో బావొంనారాయణ సామి తిరనాల్లకి, కార్తీక మాసంలో వనబోజనాల కోసం సముద్ర . వీటికే పక్కూల్లనుంచి ఎక్కువ జనం వచ్చేతోల్లు. అప్పుడిగ రిచ్చా ఖాళీ ఉంటే ఒట్టు. బస్టాండు, రైల్ టేశను,నుంచి బావనారాయణ సామి గుడి కాడికి, సూరేలంక సముద్దరానికి తిరుగుడే తిరుగుడు. ఓ పాలి బావనారాయణ సాములోరి తిరనాల్లో నేనెక్కడో తప్పిపోనానంత. ఎంత వెదికినా దొరక్కపోయేతలికి, అమ్మా నాన్నా ఏడుస్తా బావనారాయణ సాములోరికి మొక్కుకున్నారంత. తీరా అంతా వెతికి అలిసిపోయి, రిచ్చా ఉన్నకాడికి వచ్చి సూత్తే... నేను ఈ రిచ్చా కిందే, చేతిలో తింటున్న జీడితో సుకంగా నిద్దరోయి ఉన్నానంత. అమ్మా, నాన్న ఇక నేను ఏడకెల్లినా, ఈ రిచ్చా కాడనే జిక్కుతానని నవ్వుకుని, సామికి మొక్కు తీర్సుకున్నారంత.
ఈ సంగతి వినగానే కిసుక్కున నవ్వాడు రాజు. “భలే తాతా, బాగా దాక్కున్నావే. అయితే, ఈ రిచ్చా నీ బయటి పాణం అంటావ్?” అంటూ అడిగాడు తాతవైపు చూస్తూ.
“అంతేరా. అలా నాతో పాటుగా పయానం సాగించింది రా ఈ రిచ్చా. నాకు 14 ఏల్లనగా మా అయ్య పాము కాటుకు చనిపోయాడు. అప్పుడు ఈ రిచ్చాలోనే ఆఖరు యాత్రకు తీసుకు వెళ్లాను. ఇంట్లో చావుకి, పుట్టుకకి, శుభానికి, అన్నిటికీ ఓ రధంలాగయ్యిందిరా ఈ రిచ్చా. ఇది వస్తువు కాదురోరేయ్, మనింట్లో పెద్ద, ఇంటి మనిషి. “ ఆత్రంగా చెబుతూ, బాధతో ఓ నిముషం ఆగాడు మునెయ్య.
“తాతా, మరి మీ అయ్య పోయాకా, నువ్వెలాగ బతుకీడ్చినావు?” తాత గడ్డం పుచ్చుకు కుదుపుతూ అడిగాడు రాజు.
“ఈ రిచ్చానే అన్నం పెట్టినాది రా. అలంకార్, అన్నపూర్ణ సినిమా టాకీసు వోళ్లకి కొత్త సినెమాలొస్తే, రిచ్చాకు మైక్ కట్టుకుని, ఊరంతా టముకేసేందుకు మడిసి కావాల్సి వొచ్చేది. అలా పిల్సినప్పుడు వోళ్లకి పని జేస్తానే, స్కూల్ పిల్లల్ని దింపే పని ఎట్టుకున్నాను. అలాగొచ్చినదే మాకు బువ్వ పెట్టేది. నెమ్మదిగా ఒంట్లో బలం, కాళ్ళలో సత్తువ పెరిగాకా... బాపట్ల నుంచి అటు కర్లపాలెం వైపు నందిరాజుతోటకి, ఇటు సూర్యలంక వైపు ముత్యపాలెం దిక్కుకి, సముద్రానికి, ఇటు పెదనందిపాడు, జిళ్ళేళ్ళమూడి అమ్మ వైపు, అటుగా చీరాల వైపు వెదుళ్ళపల్లి వైపు రిచ్చా నడిపేతోడ్ని. నీకో సంగద్దేలుసా, మీ బామ్మ నా రిచ్చా మీనే కలిసింది.” అంటూ ముసిముసిగా నవ్వుతూ ఆగాడు మునెయ్య.
అప్పటికి తాత నవ్వినందుకు సంబరపడుతూ, “అవునా తాతా, ఎలాగో చెప్పవూ ?” అని అడిగాడు హుషారుగా.
“ఓ తెల్లారి నందిరాజు తోటకు గుత్తకి బేరం మాటాడుకుని, దింపేసి వెనక్కి వస్తాండా. పొద్దెక్కుతా ఉండడంతో ఎవరూ లేరు. దార్లో మజ్జానం తినాల్సిన టిఫిను కారీతో చెయ్యి చాపి, ఆపింది ఒకమ్మాయి. చిలకాకుపచ్చ లంగా ఓణీ వేసుకుంది. అప్పట్లో పొలం కూలీ పన్లకు వెల్లేతోల్లు ఇలాగే టిఫిను కారీతో సహా ఎక్కేవోల్లు. పోతాంటే పాట పాడ్డం మొదలెట్టింది. ఆహా, ఏం గొంతు, పొద్దుటే సెవుల్లో అమృతం పోసినట్టు అయినాది. పాట బాగుందని సెప్పగానే... చనువు తీసుకుని, “అబ్బాయా, ఎప్పట్నుంచో సరదా, ఓ పాలి నీ రిచ్చా తొక్కనీవా , ఎవోల్లూ లేరుగా !” అనడిగింది. పోన్లేమ్మని ఇచ్చాను, రిచ్చా తొక్కుతూ చిన్న పిల్లలా సంబరపడిపోయింది. ఆ నవ్వును, ఆ మడిసినీ జన్మంతా చూడాలని అనిపించినాదిరా. ఆ సంగతే మీ బామ్మనడిగితే, ‘వాల్లయ్య ఒప్పితే మనువాడతాను’ అంది. ఎమ్మటే పెద్దల్ని వెంటేసుకుని వెళ్లి, మాట్లాడి, పెళ్లి కాయం చేసుకున్నా. నేనెప్పుడు రిచ్చా తొక్కినా ఉబుకుతున్న నా నరాల్ని, పొంగుతున్న కండల్ని చూసి, మురిసిపోయేదిరా మీ బామ్మ. ఒకటా రెండా, ఈ రిచ్చాతో నాకు ఎన్నో అనుబవాలు. మూడేళ్ళ కిందట మీ బామ్మ పోయినా ఈ రిచ్చాలోనే ఆమెను చూసుకుంటా, ఆ గాపకాలన్నీ తల్సుకుంటా బతుకుతన్నాను. అడపా దడపా వచ్చిన బేరాల డబ్బులు మీ అయ్యకు ఇస్తాన్నా కూడా. నా ఒంట్లో సత్తువున్నంత దాకా రిచ్చా తొక్కి, ఇస్తానే ఉంటాను. అయినా, సరిపోవని, మీయయ్య హొటేలులో చేసినా డబ్బులు చాలవని, ఇలాగా రిచ్చా అమ్మి, ఆటో కొంటే, బాగా డబ్బులోత్తావని అనుకుంటున్నాడు. “ ఒక్క క్షణం ఆగి, మళ్ళీ చెప్పసాగాడు మునెయ్య.
“ఓరయ్యా రాజు, డబ్బులోత్తాయని ఒంట్లో రగతాన్ని,కిడ్నీల్ని, లివరును అమ్మే రోజుల్రా ఇయ్యి. అవన్నీ ఇత్తాంటే మడిసి యెంత బాద పడతాడో తెలీదు గాని, నా పానానికి పాణం లాంటి ఈ రిచ్చాని, మనింటి అన్నపూర్ణ లాంటి ఈ రిచ్చాని, అమ్ముతానంటే ఓపలేకున్నానురా. మూడుకాళ్ల ముసలిని, నాకోపిక తగ్గిందని నన్ను బందిలదొడ్డికి అమ్మేయ్యనేదు కదరా. ఎక్కడో మీఇంట్లో మూలాన ఇంత చోటిచ్చి, అంత బువ్వేడతన్నారు గందా. కాని, ఈ రిచ్చా ఏమి బరువైనాదిరా? తిండి పెట్టేదే కాని, తినేది గాదు గదరా. ఇదమ్ముతానంటే బతికుండగానే ముక్కలు ముక్కలుగా కోసినంత బాధ ఐతాందిరా. ఈ గోరం చూసేకంటే ఆ సముద్రంలో దూకి చచ్చేది మేలురా!” ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా లేచి, సముద్రం వైపు అడుగులు కదిపాడు మునెయ్య. చేతిలో రిక్షా సామాన్లు కట్టే గట్టి తాడుందని కూడా మర్చిపోయాడు. తాతను ఆపేందుకు పరుగులు పెట్టాడు రాజు.
ఇంతలో “అయ్యో, అయ్యో, నా బిడ్డ మునిగిపోతున్నాడు, ఏడేళ్ళ బిడ్డ, కాపాడండి, కాపాడండి... అయ్యో దేవుడా... రక్షించండి” అన్న ఆర్తనాదాలు వినవచ్చాయి. సూర్యలంక సముద్రం సుడిగుండాలకు పెట్టింది పేరు. ప్రతి కార్తీక మాసంలో ఒకటి రెండు ప్రాణాలైనా గాల్లో కలిసిపోతాయి. ఇటువంటి సంఘటనలు అక్కడి వాళ్లకు అలవాటే.తాతా మనవాళ్ళు కంగారుగా అరుపులు వినవచ్చిన వైపుకు వెళ్ళారు.
క్షణం ఆలస్యం చెయ్యలేదు రాజు, సముద్రంలోకి దూకబోయాడు. చిన్నప్పటి నుంచి జాలరి కుర్రాళ్ళ సావాసం వల్ల, చదువెగ్గొట్టి, సముద్రానికి వచ్చి, చేపలు పట్టుకు కాల్చుకు తిని బతకడం వల్ల, అతను గజ ఈతగాడిగా మారాడు. అలల వడి, పోటు, ఎదురీత రాజుకు బాగా తెలుసు. ముందుకు ఉరకబోతున్న మనవడిని ఆపి, అతని నడుముకు తన చేతిలో ఉన్న తాడును కట్టాడు మునెయ్య. బాణంలా సముద్రంలోకి దూసుకెళ్లాడు రాజు. బిడ్డ మునిగిన దిశగా వెళ్లి, ఊపిరి బిగబట్టి లోతుకు వెళ్లి చూసాడు. ఓ ఐదు నిముషాల తర్వాత, అలల్లో మునుగుతూ తేలుతూ, కనిపించాడు పిల్లాడు. అంతే, వాడి జుట్టు గాట్టిగా అంది పుచ్చుకుని, తాతకు తాడు లాగమన్నట్లు సైగ చేసాడు. ఒడ్డుకొచ్చిన బాలుడికి ప్రాధమిక చికిత్స చేసి, భయంతో మింగిన నీళ్ళని పొట్ట నొక్కి బైటికి తీసేసరికి, వాడు లేచి కూర్చున్నాడు. “అమ్మా,” అంటూ గట్టిగా భయంతో వాళ్ళమ్మను హత్తుకున్నాడు.
ఆనందంగా అటువైపే చూస్తున్న రాజు దగ్గరకు వచ్చి, “బాబూ, ఏ తల్లి కన్న బిడ్డవో, ప్రాణాలకు తెగించి, నా బిడ్డను కాపాడావు. లేక లేక కలిగిన నలుసు. ప్రాణాలన్నీ వీడి మీదే పెట్టుకు బ్రతుకుతున్నాను. ఒక్కక్షణం నీళ్ళలో చెయ్యి విదిలించుకున్నాడు, తీరా చూస్తే, మునిగిపోతున్నాడు. ఇవాళ వీడు చనిపోయి ఉంటే, నేనూ ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. మాది పిఠాపురం జమిందారీ కుటుంబం, చుట్టపుచూపుకు పక్కూరొచ్చి, అక్కడనుంచి సముద్ర స్నానానికి వచ్చాము. సమయానికి ఆ ఏడుకొండలవాడు పంపినట్టు వచ్చిన నీకు, ఆ ఏడుకొండల స్వామికి ఇచ్చినట్టు నిలువు దోపిడీ ఇస్తున్నాను, కాదనకు,” అంటూ తన ఒంటిమీద ఉన్న హారాలు, రవ్వల దుద్దులు, ఉంగరాలు, గాజులతో సహా రాజు చేతిలో పోసింది ఆవిడ. వద్దని వారించబోయిన తాతా మనవళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది. “బాబూ, తల్లిపేగు మీకు తెలీదు, బిడ్డ ప్రాణాలు పొతే, ఆ తల్లి జీవచ్చవంతో సమానం, అప్పుడీ నగలన్నీ మట్టి బెడ్డలతో సమానం. మీ ఋణం ఎంతిచ్చినా తీరదు, “ అంటూ నగలు అప్పగించి, వద్దన్నా ఓ నోట్లకట్ట చేతిలో పెట్టింది. చివరికి దూరంగా ఖరీదైన కారెక్కి వెళ్ళిపోతున్న వాళ్లకి వీడ్కోలు పలుకుతూ కాసేపు అలాగే ఉండిపోయారు వాళ్ళు.
“తాతా ! చూసావా, ఇక నువ్వు చావక్కర్లేదు. నీ బాధకు నీ ఇంటిపెద్ద, ఈ రిచ్చా గుండె కరిగిపోయి వొరమిచ్చినాది. ఇదిగో, ఈ నగలమ్మి, నాన్నకు ఆటో కొందాము. మిగిలిన దాంతో, మన ఇంటి బయట ఈ రిచ్చాకు చిన్న పాక వేద్దాము. నీ రిచ్చా తల్లిని నేను తొక్కుతా తాతా. నా జన్మంతా నా పాణం లాగా, బద్రంగా చూసుకుంటా. సరేనా, ఇక పోదామా ?” అన్న మనవడిని ఆప్యాయంగా హత్తుకుని, రిక్షా మీద కూర్చోబెట్టుకుని, ఇంటిదారి పట్టాడు మునెయ్య.
***
heart touching.station to suryalanka beach okkasari kallamundu kadilindi. miss you bapatla...
ReplyDelete