గోదావరి నుంచి సబర్మతి వరకు- 3 - అచ్చంగా తెలుగు

గోదావరి నుంచి సబర్మతి వరకు- 3

Share This

గోదావరి నుంచి సబర్మతి వరకు- 3

అవని


(జరిగిన కధ : ట్రైన్ లో ప్రయాణిస్తూ, తనతో పాటు వస్తున్న వృద్ధ దంపతులతో మాట కలుపుతుంది ప్రణవి. అహ్మదాబాద్ లో శాస్త్రీయ సాంకేతిక సదస్సులో కృష్ణమోహన్ ప్రసంగాన్ని అంతా ముగ్ధులై వింటారు. వేదాధ్యయనం చెయ్యాలన్న కోరిక ఉన్నవారికి ఉచితంగా విద్యను బోధిస్తూ ఉంటారు విష్ణుశర్మ గారు.) 
" ఏంటి..ఆంటీ ..నిద్ర బాగా పట్టిందా..? "చనువుగా అడిగింది ప్రణవి.
" పరవాలేదమ్మ..ఎలాగైనా ..ఇంట్లోలా వుంటుందా..చెప్పు.." అంది నవ్వుతూ ఆమె.
కొంతసేపు అలా కబుర్లు చెప్పుకున్న తర్వాత,కాస్త అల్పాహారం తిని మళ్ళీ బెర్త్, మీదకి వెళ్ళి పడుకుంది ప్రణవి.
అలా కొంతసేపటికి గత స్మృతుల్లోకి జారుకుంది.
***
" చెప్పు..బాబీ..నేనంటే నీకెందుకింత ఇష్టం.." సూటిగా అడిగింది ప్రణవి.
" ఇష్టం..ఇష్టం ..అనేమాట చాలా చిన్నది..నువ్వంటే ప్రాణం,పిచ్చి,ఫేషన్..వాట్ నాట్ ఎవ్రీథింగ్.." అన్నాడు అంతుపట్టని ఆవేశంతో.
" అదే..ఎందుకు.." సున్నితంగా అడిగింది.
" అమ్మని చూస్తాం..ఆరాధిస్తాం,అక్కని చూస్తాం..అభిమానిస్తాం,చెల్లిని చూస్తాం..అంతులేని అనురాగంతో సాకుతాం...ఇవన్నీ ప్రేమలోని విభిన్న భావాలేకదా.ఈ భావాలన్నీ కలిపితే వచ్చే ఓ అనిర్వచనీయమైన అనుభూతే నిన్ను చూస్తే కలుగుతుంది...దాని పేరు ఏదైనా కావొచ్చు." చెప్పాడు త న్మయత్వంతో.
ఒక్క క్షణం మూగబోయింది ప్రణవి.
" నేనంటే అంత ఇష్టమా.." రెట్టించి అడిగింది.
" ముందే చెప్పాను..ఇష్టంకాదది..ప్రాణమని..నాలోని అణువణువు అదే చెప్తుంది." చెప్పాడు బాబీ.
" మీటికెట్ చూపించండి" అడిగాడు టికెట్ కలెక్టర్..
ఆ పిలుపుతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చింది.
తన మొబైల్ లోని ఈ టికెట్ చూపించింది.
కాసేపు మళ్ళీ అలా ఆ బెర్తుమీద అలా అటూ,ఇటూ దొర్లింది..ఏం తోచలేదు.తన దగ్గరున్న x123 నవల చదువుదామని ఆ పుస్తకం తీసింది.అందులో తనకి బాబీ రాసిన విలువైన ఉత్తరం కనిపించింది.తనకి ఎప్పుడు బాధ కలిగినా,జీవితం మీద ఎప్పుడు నిరుత్సాహం కలిగినా ఆ లేఖ చదివితే చాలు వెయ్యి టన్నుల శక్తి తనలో ప్రవహించినట్టు వుంటుంది.అది బాబీ అక్షరాల్లోని మేజిక్.అవి తనని ఎంత ప్రభావితం చేసినా ఎప్పుడూ అంత త్వరగా బయట పడకపోవడం ప్రణవి లోని మరో కోణం.
ఆ రోజు తను బాధతో ఫోన్ చేసిన మరుక్షణం మరో అరగంటలో మెయిల్ చేసాడు తను.తనెప్పుడూ అంతే ఎవరు ఏదడిగినా కాదు,లేదు అనని తత్వం.అందులోను నాకైతే వేరే చెప్పక్కరలేదు.కానీ తను రాసిన అక్షరాలు ఎవరు చదివినా వారికి అవి జీవాన్ని పోస్తాయి.
నెమ్మదిగా ఉత్తరం తీసి చదవడం ప్రారంభించింది..
****
" ప్రేమంటే అమృతం,అజరామరం,శాశ్వతం.."
ఆద్యంతమూలేని అమరానందమే ప్రేమ,
ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ,
ప్రేమ దివ్య భావమూ..ప్రేమ దైవ రూపము,
రోజులెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే..
మంచితనానికి ఓ రూపాన్ని గీయాల్సివస్తే ఆ రూపం పేరు నువ్వే.అంతులేని ప్రేమని పంచి,ఆనందపు అంచుల్లో విహరింపచేసి,నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించేది నువ్వే.
మనిషి జీవితంలో ఎత్తు,పల్లాలు సహజం.రోడ్డు మీద నడిచే మార్గంలో రాల్లుండొచ్చు,పూలుండొచ్చు.ఏది గుచ్చుకున్నా ఒకేలా స్పందించగలగడం మహాత్ముల లక్షణం.రాళ్ళు గుచ్చుకున్నప్పుడు నొచ్చుకోవడం,పూలు గుచ్చుకున్నప్పుడు గంతులేయడం మనిషి లక్షణం.ప్రతి మహాత్ముడు ముందు మనిషే.ఎవరూ అతీతులు కారు.
అనుకోకుండా నా జీవితంలోకి ప్రవేశించింది నువ్వు.నువ్వే నా ప్రపంచం అనేలా చేసుకున్నావు.నన్ను నీ ప్రపంచంలోకి తీసుకెళ్ళావు.మనిషికి సున్నితత్వం స్వభావ సిద్ధం.గుండె గాయాల్ని కొంతవరకు మాత్రమే తట్టుకోగలదు.
ఉప్పెనలే వచ్చినా,ఉధృతాలే జరిగినా,ప్రళయాలే వచ్చినా,ప్రకంపాలే చుట్టుముట్టినా ఒద్దికగా,ధైర్యంగా,నిశ్చలంగా,నిర్భేధ్యంగా వుండగలగడమే మహా ధీరత్వం.
జీవితమనే ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు,సుడిగుండాలు,అడుగడుగునా సమ్మెటపోట్లు..జీవితమంటే ఇలా కూడా వుంటుందీ అనేంతలా ఓ వైపు,..ఆ ప్రయాణంలో అప్పుడప్పుడు చిన్న,చిన్న ఆనందాలు,మరిచిపోలేని అనుభూతులు,మధురమైన అనుభవాలు మరోవైపు..
ఈ జీవిత చదరంగంలో నీ పరిచయం కూడా అలాంటి మేలిమలుపులాంటిదే.
అంతులేని అనురాగం ఓవైపు,గుండెను తట్టిలేపే గాఢత మరోవైపు,నేనెప్పుడు నీతోనే వున్నాననే భరోసా మరోవైపు కలిసి అద్వితీయమైన నమ్మకాన్ని కలిగించాయి.
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి.సమాజాన్ని ఎదిరించాలి.ఎదురుపడి ప్రశ్నించాలి.ప్రశ్నించలేకపోయినా పోరాడాలి.అదే జీవితం.జీవిత పోరాటంలో ఎదగాలి.కానీ దానికి మనం సక్రమ మార్గంలోనే ప్రయాణించాలి.ఇది ఓ జీవన వేదం.
ఈ జీవన ప్రయాణంలో ప్రతీ చోటా దెబ్బలు తగులుతూనే వుంటాయి.మొదట నొప్పిగా మొదలై..చివరికి స్పర్శ కోల్పోయేలా మొద్దుబారుతుంది.అలాంటి సందర్భాల్లో నమ్మకం ఓ భరోసానిస్తుంది.
ఈ లోకంలో మంచితనం,మనిషితనం నిర్జీవమైపోకుండా వుండాలంటే నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం.ప్రతీ సమస్యని వాణిజ్యధోరణిలో చూడటం మానవీయకోణం కాదనేది నా అభిప్రాయం.ప్రేమలు,అభిమానాలు,ఆప్యాయతలు అనే పదాలకి చాలా గొప్ప విలువుందనేది నా అభిమతం.ఆప్యాయతలకి లెక్కలు వేసి తూకాలు వెయ్యలేం.
జీవితపు అంచులు చేరేవరకు మనం ప్రయాణం చేస్తూనే వుండాలి.ఎందుకంటే తోవంటూ వున్నాక ఏదోలా నడవాలి.నడుస్తూనే వుండాలి.ఊపిరి వున్నంతవరకూ బతుకుతూనే వుండాలి.ఈ సువిశాల విశ్వంలో ఏదో మూల గాలి పీలుస్తూనే వుండాలి.ఇది జీవిత సత్యం.
సమస్యలెన్ని చుట్టుముట్టి,మూకుమ్మడిగా దాడి చేసినా ,అంచుల్లేని అధపాతాళానికి జారిపోయినా,బతుకుబండి ఇరుసుల్లో కూరుకుపోయినా,మొక్కవోని ధైర్యంతో తిరిగి నిలబడాలి.జీవనపోరాటంలో ఆఖరి ఘడియ వరకు ఆస్వాదిస్తూనే వుండాలి.అన్ని జీవితాలు,అందరి జీవితాలు ఒకేలా వుండవు.అందరికీ భోజనానికి వడ్డించిన విస్తర్లే దొరకవు.మన వంట మనమే వండుకోవాలి.దానికోసం మనమే కష్టపడాలి.రాళ్ళని,రప్పలని పిండి చేయాలి.చేతులు కందొచ్చు,కళ్ళు తిరగొచ్చు,అలసట కమ్మొచ్చు,కన్నీళ్ళ కార్చిచ్చు రగలొచ్చు.అయినా తిరిగి నిలబడాలి.ఈ విషయాన్ని మాత్రం మరవకూడదు.కష్టమొచ్చిన ప్రతీ సారి ఇదే పాఠం..మళ్ళీ..మళ్ళీ..జ్నప్తికి తెచ్చుకొని,కావాలంటే మళ్ళీ,మళ్ళీ చదువుకొని..
ఈ జీవితపు బండి ఎలా వెళుతోంది..అర్ధం కాని అయోమయం.,ఓ తెలియని గందరగోళం..అంధకారంలో లేం మనం..అయినా ఈ తెలియని చీకట్లేంటో మనకి అర్ధం కావు..
ఈ ప్రపంచంలో గురువులు జ్నానజ్యోతిని వెలిగిస్తారంటారు.ఈ లోకంలో ఎంతోమంది గురువులు మరెంతోమందిని జ్నానమార్గంవైపు పయనించేలా చేసి దారిని చూపారంటారు.
ఒక మనిషి మనకి మంచిని చెబుతున్నప్పుడు,మంచి మార్గాన్ని చూపిస్తున్నప్పుడు,ఆ చిటికిన వేలు పట్టుకొని వెనక నిశ్శబ్ధంగా నడుస్తూ వెళ్ళడం ఓ మహానుభూతి.వెదకాల్సిన మార్గంకోసం మహా న్వేషణకి శ్రీకారం.కానీ అన్ని మజిలీలు,అన్ని అధ్యాయాలు ఒకేలా వుండవు.
అక్షరం అంటే ఒక గొంతులోని ఆలోచన కాదు...లక్షల గొంతుకుల ఆలోచనల సమాహారం..అన్నారు.అక్షరమంటేనే క్షరం లేనిది(నాశనం కానిది).అందుకే దాని వులువ అనంతం.వెయ్యి మాటల కన్నా ఒక అక్షరం విలువైనది.మాట తూటాలాంటిదైతే,అక్షరం ఫిరంగిలాంటిది.దీనికి వాడి,వేడి ఎక్కువే కాదు..దీని ప్రయాణపు దూరం కూడా ఎక్కువే.
అన్ని కధలకు ముగింపు ఒకేలా వుండదు.అన్ని జీవితాలకి ముగింపు కూడా ఒకేలా వుండదు.మంచి ముగింపు వున్న కధలు జీవితానంతరం కూడా మాట్లాడతాయి.అర్ధం,పరమార్ధంతో సార్ధకత కలిగిన జీవితాలు కూడా కలకాలం గుర్తుంటాయి.
ఉన్న చిన్న జీవితంలో పదిమందికి మంచిని మాత్రమే చేసి,ఎవరికీ,ఎప్పుడూ,ఎక్కడా..చెడుని,హానిని చేయకుండా బతికితే ఈ లోకంలో అది ఒక మంచి జీవితమే.
జీవితాన్ని వాస్తవిక కోణంతో చూడు,ఆశావహ దృక్ఫధంతో చూడు..రంగులమయంగా కనిపిస్తుంది.ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనేవుండు.ప్రయత్నంతో పోయేదేమిలేదు.ప్రయత్నమే లేకుండా పోతే..నిన్ను నువ్వు ఎంత నిందించుకున్నా ప్రయోజనం వుండదు.
ఏదైనా..నీకు ఇవ్వడమే కాని,తీసుకొనే తత్వంలేని మహోన్నత వ్యక్తిత్వం నీ సొంతం.మధుర భాషణం,స్మ్రృత్యంగమ సుందర చిరు దరహాసం,మూర్తీభవించిన మానవత్వం నిన్నో విశిష్ట వ్యక్తిగా నిలబెడతాయి.
ప్రణవి అంటే గలగలపారే గోదారి..నిండు పున్నమినాటి జాబిలి..కష్టం వస్తే కన్నీరు కారిందా..ఎంతైనా మనుషులం కదా..మానులం కాదు.కానీ ఆ కన్నీళ్ళే శాస్వతం కాదు.అది తెలుసుకుంటే చాలు.ఈ లోకంలో భాధలు లేనివాడెవడు,సమస్యలు లేని వారు ఎవరు.? అందరూ అలా రైల్వే ప్లాట్ ఫాం మీద జనాల్లా అలా నడుస్తూ వెళతూ వుంటారు.ఇదీ అంతే.మనిషి అనే వాడు వున్నంతవరకు ఎదో ఒక దానితో ముడివేసుకొనే తిరగాలి..అది అంతే..సృష్టిలోని ఓ మేజిక్ లాంటిది.
నేటి బాల్యం తీసుకో..పుస్తకాల బస్తాలు మొయ్యడంతోనే గడిచిపోతోంది.కొంచెం వయసొచ్చాక పోటీ ప్రపంచంలోకి పరుగులు..తర్వాత ఉద్యోగం,పెళ్ళి,సంసారం,బాధ్యతలు..మరికొంత నడుం వంగాక రోగాలు,ఆసుపత్రులు,..ఇలా,ఇలా..గడిచిపోతున్నాయి జీవితాలు.
ఐతే ఈ చిన్న ప్రపంచంలో మనవి అనబడే సొంతాలు,అనుభవాలు,అనుభూతులు మనకే సొంతం..అవి ఎవరి వారికే ప్రత్యేకం..అలా తీపి గుర్తులు తలుచుకుంటూ ముందుకుపోవాలంతే..లేకపోతే డిస్చార్జ్, ఐపోతాం.ఆ నిరాశ,నిస్పృహలు మనిషిని కుంగదీస్తాయి.అవి ఒకోసారి తట్టుకోలేని స్తితికి తీసుకెల్తాయి..
నీకు ఇంతలా చెప్పాల్సిన అవసరంలేదని నాకు తెలుసు..ఎందుకంటే..ఎంతైనా నువ్వు..నువ్వే..సూక్ష్మగ్రాహివి..టైటిల్ కార్డు దగ్గరే ముగింపు చెప్పగలదానివి..ఐనా నీకంత కష్టమే వస్తే నేను వూరుకోగలనా..
ప్రస్తుతానికి ఈ లేఖకో చిన్న విరామం..
(సశేషం..)

No comments:

Post a Comment

Pages