జగన్నాథ వైభవం - అచ్చంగా తెలుగు

జగన్నాథ వైభవం

Share This

జగన్నాథ వైభవం 

(06 -07-2016 నుండి 15 -07-2016 )

శ్రీరామభట్ల ఆదిత్య 


ఆషాఢ శుద్ధ విదియ మొదలు శుద్ధ ఏకాదశి వరకు బలభద్ర, సుభధ్ర, జగన్నాథుల రథయాత్ర ఉత్సవాలు ఒడిషా రాష్ట్రంలోని పూరీలో కన్నుల పండుగగా జరుగుతాయి. పూరీలో వెలసిన శ్రీకృష్ణమూర్తే జగన్నాథుడు. సువిశాలమైన ప్రాంగణములో కళింగ దేవాలయ శైలిలో కట్టబడిన మనోహరమైన మందిరములో జగన్నాథుడు,బలరామ, సుభధ్రా సమేతుడై శోభిల్లుతున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద రథయాత్రగా పేరుపొందిన ఈ రథయాత్ర భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు తలమానికం.
దుఃఖభంజనకు, పాపహరణకు నారాయణుడు ప్రతి ఏటా రథారూఢుడై పురీ నగరవీథుల గుండా ఊరేగుతూ గుండిచా ఉద్యానవనమందిమైన 'గుండిచా ఆలయానికి' చేరుకుంటాడు. అక్కడ తొమ్మిది రోజులపాటు భక్తులకు దర్శనమిస్తూ వారి పాపాలను పటాపంచలు చేస్తుంటాడు. ఈ యాత్రనే గుండిచా యాత్రగా అని కూడా అంటారు.
రథయాత్రలో ముగ్గురి దేవతలకూ మూడు విడి రథాలు ఉంటాయి. పీతాంబరధరుడైన జగన్నాథుడు ఎరుపుపై పసుపు రంగుతో శోభితమైన రథముపై ఊరేగుతాడు.ఈ రథాన్నే " నందిఘోష " అని అంటారు.
అగ్రజుడైన బలభద్రుడు ఎరుపుపై నీలం రంగుతో మెరిసే రథముపై ఊరేగుతాడు. ఈ రథాన్నే " తాళధ్వజ " అని అంటారు. సుభద్రా దేవిని ఎరుపుపై నలుపు వర్ణంతో భాసిల్లే రథముపై ఊరేగేస్తారు. ఈ రథాన్నే " ద్వర్పదళన లేదా పద్మదళన " అని అంటారు. జగన్నాథుని రథం నలభై ఐదు అడుగులు, బలభద్రుని రథం నలభై నాలుగు అడుగులు, సుభధ్ర రథం నలభై మూడు అడుగుల పొడుగు ఉంటాయి. నందిఘోషకు 16 చక్రాలు, తాళధ్వజకు 14 చక్రాలు, ద్వర్పదళనకు 12 చక్రాలుంటాయి.
ప్రతి సంవత్సరము పాత రథాలను భిన్నంచేసి, కొత్తగా రథాలను తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒడిషా వాసులకు అత్యంత శుభకరమైన రోజుగా భావించే అక్షయ తృతీయనాడు కొత్త రథాల తయారు మొదలు పెడతారు. పురీ మహారాజు ఇంటి ముంగిట మొదలవుతుంది తయారి ప్రక్రియ. ఇదే రోజు 3 వారాలపాటు జరిగే చందన యాత్ర కూడా మొదలవుతుంది. రథాలకు వాడే చెక్కలను దసపల్లా నుండి దుంగల్లా తయారు చేసి మహానది నదిలోని నీటిలో పురీకి తీసుకువస్తారు.
తరతరాలుగా వంశ పారంపర్యంగా ఈ రథాలను తయారుచేసే వడ్రంగుల వంశానికి చెందినవారే ఈ రథాలను తయారు చేస్తారు. ప్రతిరథము చుట్టూ 9 మంది పార్శ్వదేవతల మూర్తులు ఉంటాయి. బలభద్రుని రథానికి తెల్లని గుర్రాలు, జగన్నాథుని రథానికి నల్లని గుర్రాలు, సుభద్ర రథానికి ఎర్రని గుర్రాలు నాలుగు చొప్పున ఉంటాయి. రథాలకు చోదకులుగా మాతలి, దారుక, అర్జునులు ఉంటారు.
ఈ యాత్రలో పూరీ మహారాజ వంశజులైన గజపతి మహారాజుగారు బంగారు చీపుర్తో వీధులను ఊడుస్తారు. సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలతో వీధులను గజపతి రాజావారు స్వయంగా పునీతం చేస్తారు. అందంగా పూలతో అలంకరించబడిన రథాలు, మేళ తాళాలతో, ఆషాఢ శుద్ధ విదియనాడు, వేలాది మంది తాళ్లతో హరినామ స్మరణ చేస్తూ, రథాలను లాగుతూ ఉండగా జగన్నాథ మందిరం నుండి బడా దండా అనబడే ముఖ్య వీధి ద్వారా దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకుంటాయి.
జగన్నాథ అంటే జగత్తు అంతటికీ నాథుడని అర్థం. విష్ణుసహస్రనామంలో ఈ నామం మనకు కనిపిస్తుంది. ఈ నామానికి ఇదే అర్థం కాకుండా ఇంకా ఎన్నో విశేష అర్థాలున్నాయి. అందుకే అంటారు 'మహాలోకం జగన్నాథం' అని. యాత్రలో ముందు బలభద్ర సుభద్రలు తరలి వెళ్లగా, వారి వెనుకు జగన్నాథుడు యాత్ర చేస్తాడు. రథయాత్రలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఊరేగిస్తారు."రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" - రథములో జగన్నాథుని రూపమైన వామనుని చూసినంత పునర్జన్మ లేదని ప్రతీతి. పురీ పట్టణంలో జగన్నాథుని మహిమవలన యముని ప్రభావం చాలా తక్కువ ఉంటుందని, దాని వలన ఈ క్షేత్రానికి యమనిక తీర్థంగా పేరు వచ్చింది.
ఈ రథయాత్ర సమయంలో యాత్రలో ఉండే ప్రతి వస్తువును (రథము, తాళ్లు, గుర్రాలు మొదలైనవి) జగన్నాథునిగానే భావిస్తారు. అందుకే అంటారు 'సర్వం జగన్నాథం మయం' అని. రథాల తిరుగు ప్రయాణంలో మేనత్త మౌసీ మా గుడి వద్ద ప్రత్యేక ఫలహారాన్ని దేవతలకు నివేదిస్తారు. ఏడు రోజులు గుండిచా మందిరంలో ఉన్న తరువాత మూలమూర్తులు తిరిగి జగన్నాథ దేవాలయ గర్భగుడిలో స్వస్థానాలకు చేరుకుంటాయి.
నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే।
బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః ॥
ఏ ఆలయంలోనైనా గర్భాలయంలోని మూల విరాట్టు కరచరణాలతో, సర్వాలంకారాలతో, నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. కానీ పూరీలోని జగన్నాథుడు మాత్రం కరచరణాలు లేకుండా, కొలువుదీరి దర్శనమిస్తాడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు ఓ కథ వుంది.
పూర్వం ద్వాపర యుగంలో భరతఖండాన్ని ఇంద్రద్యుమ్నుడనే మహారాజు పాలించేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు. ఒకసారి నారాయణుడు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించి, తన కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు ఆదేశాన్ని తన సకృతంగా భావించి, ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ఆలయంలో మూల విరాట్టు రూపాలు ఎలా వుండాలనే విషయంలో మాత్రం ఆలోచనలో పడ్డాడు.
ఎందుకంటే కలలో కనిపించిన విష్ణువు రూపాన్ని తాను శిల్పంగా మలచలేడు కాబట్టి. ఎందుకంటే శిల్పులు మహారాజు దర్శించిన రూపాన్ని శిల్పంగా మలచలేరు కదా, ఎందుకంటే వారికి నారాయణుని దర్శనం కలుగకపోవడమే అసలు విషయం. ఈ విషయంలో మహారాజుకు చింత రోజురోజుకీ పెరిగిపోసాగింది. తన భక్తుడు పడుతున్న ఆవేదన సకలలోక రక్షకుడైన నారాయణుడికి అర్థమయ్యి, తానే ఒక శిల్పి రూపమును ధరించి, ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరకు వచ్చాడు.
మహారాజు దగ్గరకు వచ్చన శిల్పి, మహారాజుతో " అయ్యా! మీకు సంతృప్తి కలిగే విధంగా మూలవిరాట్టు నిర్మాణం చేస్తాను, అయితే విగ్రహ తయారీకి 21 రోజుల సమయం పడుతుంది. అయితే నా పని పూర్తి అయ్యేంత వరకు, ఎవరూ కూడా నా గదిలోకి రాకూడదు. నాకు నేనుగా బయటకు వచ్చేవరకు, నా యొక్క పనికి ఎవరూ కూడా అంతరాయం కలిగించకూడదు" అని నిబంధన విధించాడు. మహారాజు అందుకు సమ్మతించాడు.
ఒక ఏకాంత మందిరంలో నారాయణుడైన మాయాశిల్పి తన పని ప్రారంభించాడు. వారాలు, నెలలు గడుస్తున్నాయి. మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే వున్నాయి. పని జరగుతూనే ఉంది. కానీ మూలవిరాట్టు రూపాన్ని చూడాలనే ఆత్రుత, మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది. కొన్ని రోజుల తరువాత ఆ మందిరం నుంచి శబ్దాలు రావడం మానేశాయి.
రాజ దంపతులకు ఆతృతతో పాటు అనుమానం కూడా ఎక్కువైంది. నిద్రాహారాలు లేకుండా ఆ మందిరంలో పని చేస్తున్న శిల్పి బహుశా మరణించి వుంటాడేమోనని సందేహం కలిగింది. ఇక ఓపిక నశించిన మహారాజు శిల్పి పెట్టిన నియమాన్ని ఉల్లఘించి ఆ ఏకాంత మందిరంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశంతో నియమభంగం అయిందని గుర్తంచిన శిల్పి మరుక్షణంలో మాయమయ్యాడు. అక్కడ దర్శనమిచ్చిన మూడు మూర్తులను చూసి, ఆశ్చర్య పోయాడు ఇంద్రద్యుమ్నుడు.
కరచరణాదులు లేకుండా, వున్న ఆ మొండి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలా అనే సందేహం ఆయనకు మరింత బాధను కలిగించింది. అదే రోజు రాత్రి బాధతో ఉన్న ఇంద్రద్యుమ్నునికి కలలో కనిపించి "రాజా! బాధపడకు. ఇదంతా నా సంకల్పమే. ఈ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఈ రూపాలతోనే కొలువుతీరి జగన్నాథుడు అనే పేరున జనులందరి కోరికలూ తీరుస్తూ వుంటాను '' అని పలికాడు. ఇంద్రద్యుమ్నుడు ఈ మూర్తులనే ఆలయంలో ప్రతిష్ఠించాడు. అవే నేటికీ సర్వజనుల చేత పూజలందుకుంటున్న బలభద్ర, సుభద్ర, జగన్నాథ మూర్తిత్రయం.
అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు.కానీ నీలాచలం క్షేత్రంలో అదే ప్రత్యేకత. ఆ తరువాత క్రీ.శ. 1140లో అప్పటి రాజు అనంతవర్మ చోడగంగాదేవ్ నూతన మందిరం నిర్మించగా, అనంతరకాలంలో శిథిలమైన దానిని ఆయన మనువడు అనంగ భీమదేవుడు పునర్నిర్మించారు. ఆ తర్వతి కాలంలో అనగా క్రీ.శ.1174లో ఒడిషాను పరిపాలించిన అనంగ భీమదేవుడు ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో దర్శనమిస్తున్న జగన్నాథస్వామి ఆలయ సంపద అంతా అనంగ భీమదేవుని కాలంలో నిర్మించినవే.
సాధారణంగా ఏ ఆలయంలోనైనా భగవంతుడు భార్యాసమేతుడై కొలువుతీరి వుంటాడు. కానీ పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు మాత్రం తన సోదరుడు బలభద్రుడుతోనూ, సోదరి సుభద్రతోనూ, కొలువుదీరి సేవలు అందుకొంటూంటాడు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన జగన్నాథుని ఆలయంతోపాటు వినాయకునికి, లక్ష్మీ, పార్వతులకు, శివునకు, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు వున్నాయి.....
శ్రీ పీఠంగా పిలిచే పూరీఆలయం 214 అడుగుల ఎతైన గోపురంతో, 68 అనుబంధ ఆలయాలతో భక్తజనులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ కొలువు దీరిన బలభద్ర, సుభద్ర, జగన్నాథులను సృష్టి = బ్రహ్మ, స్థితి = విష్ణు, లయ = మహేశ్వరులకు ప్రతీకగానూ భావిస్తారు. రుద్ర, విష్ణు, ఆదిపరాశక్తి రూపాలుగానూ భావిస్తుంటారు. ఆలయ నియమం ప్రకారం 'యాత్ర' ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రథం పురోగమనమే తప్ప తిరోగమించదు. రథోత్సవ ప్రారంభానికి ముందు జ్యేష్ఠ పూర్ణిమ నాడు 108 బిందెలతో దేవతామూర్తులకు స్నానం చేయిస్తారు ఈ 'సుదీర్ఘ' స్నానంతో వారు మానవ సహజమైన అనారోగ్యం బారినపడి, తిరిగి కోలుకునే వరకు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు.
56 రకాల ప్రసాదాలు ఆరగించే స్వామికి, ఆ సమయంలో 'పథ్యం'గా కందమూలాలు, పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. మళ్లీఆలయ ప్రవేశంతో 'నేత్రోత్సవం' జరిపి, యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు. ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేబర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. అంటే 2027లో  నవకలేబర ఉత్సవం జరగబోతుంది అన్నమాట.
ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందన యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్‌ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు.
అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం పాత మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు..
శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన ప్రసిద్ధ జగన్నాథాష్టకాన్ని చదివి తరిద్దాం....!!!
కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 1 ॥
భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటక్షం విదధత్
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 2 ॥
మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 3 ॥
కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 4 ॥
రథారూఢో గచ్ఛన్పథీ మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకలజగతాః సింధుసుతయా
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 5 ॥
పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 6 ॥
న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవే
న యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరపధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 7 ॥
హరత్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశ
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే ॥ 8 ॥
ఇతిశ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ జగన్నాథాష్టకం సంపూర్ణం.

No comments:

Post a Comment

Pages