మళ్ళీ వసంతం
ఆండ్ర లలిత
సిరీష గేటు తీసినట్టు గమనించి, చిరునవ్వుతో తలుపు తీసి “రా కూర్చో సిరీషా” అంది వసంత. ఐదు నిమిషాలలో వస్తాను అని సోఫా చూపించింది. గబగబా అత్తయ్యగారి గది వరుకు నడుస్తూ “అత్తయ్యగారండీ సిరీష వచ్చింది. అలా కాసేపు ఉద్యానవనములో నడిచి వస్తా”అంది వసంత చీర సవరించుకుంటూ. “మంచిదమ్మా వెళ్ళిరా! ఇదిగో నేను మల్లెలమాల కట్టడము పూర్తి అయిపోయింది. ఇదిగో వసంతా తీసుకో, నీకు సిరీషకి. ఖంగారు పడి వచ్చేయకు. చంటాడు ఆట నుంచి వస్తే చూసుకుంటాను. నాకు మావయ్యగారికి ఇడ్లీ కుక్కర్లో పెట్టావు కదా పది నిమిషాలలో ఆపేస్తాను. సరేగాని రుమాలుందా”అంది పార్వతమ్మ వసంత కేసి చూస్తూ. “లేదండీ” అంది వసంత. దండం మీద ఆరుతున్న బట్టలలోంచి ఒక రుమాలు తీసి “ఇదిగో” అని అందించి, చీర చెంగు నిండుగా కప్పుకో! దొంగలు తిరుగుతున్నారు!!! అని హెచ్చరించింది పార్వతమ్మ ప్రేమతో. తల్లిని మరిపించిన అత్తగారిని చూసి వసంతకి కళ్ళు చెమర్చాయి. “ఏమిటే అమ్మా వసంతా! ఆ దీర్గాలోచన ? ఏవన్నా మరిచిపోయావా ఏమిటీ?”అంది పార్వతమ్మ. “అబ్బే ఏమీ లేదు. మా మంచి అత్తగారు”అంది వసంత ప్రేమతో, తన వాలు జడ వెనక్కి వేసుకుంటూ. “ఆ...సర్లే! ములగచెట్టు ఎక్కించకు! పడిపోతాను” అని నవ్వుతూ సాగనంపి సింహద్వారము వేసుకుని తన పనులలో పడింది పార్వతమ్మ. ఇక్కడ ఉద్యానవనములో నడుస్తున్నప్పుడు, వసంత సిరీష కేసి చూసి సిరీష ముభావముగా ఉన్నదని గమనించి “రా సిరీషా ఇక్కడ కూర్చో”అని చేయి పట్టుకుని కుర్చీ బల్ల చూపింది వసంత. “ఏమి అయింది? నిన్ను నేను వారము రోజులనుంచి చూస్తున్నాను, అసలు అంత కలవరము ఎందుకు చెప్పు” అంది వసంత ప్రేమతో ఓదారుస్తూ. “ఏమిటో ప్రొద్దున్న హడావిడిగా వంటచేస్తూ సమయము చూసుకుని ఉపహారము బల్లమీద పెట్తాను, రామ్(భర్త) స్నానము నుంచి వచ్చేలోపల. సగం తిని సమయము లేదని దిగపెట్టేసి వెళ్ళిపోతారు. పోని ఎవరికీ తెలీయకుండా చెత్తబుట్టలో పడేయచ్చుగా. అదీ కాకుండా నేను ఒకవేళ తినే వెళ్ళాలి, లేకపోతే నాకు బావుండదని అంటాను అనుకో. నన్ను విసికించకు. చంపేస్తున్నావు అంటారు కంచు కంఠంతో. నాకు ఆయన కోపగించుకునందుకు బాధ కాదు. తరువాత మా అత్తగారూ వాళ్ళు నా గురించి ఏమి అనుకుంటారు అని. నన్ను ఏమన్నా అనాలంటే పడక గదిలోనో, లేదూ మేమిద్దరము వేరే ఉన్నవేళలోనో అనమని ఎన్నోవిధాల చెప్పి చూసా, రామ్కి. అర్థము చేసుకోరు! ఆయన ధోరణే ఆయనది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు. కానీ ఎంతసేపు కచేరీ ధోరణే! తినకపోతే నేనేమి చేయను”అంది సిరీష. “ఏమంటారేమిటీ?” అంది వసంత ఆతృతగా. “అయ్యో హత విధీ. తినకుండా వెళ్ళాడు. కాస్త పెంద్రాళే తెమలచ్చుగా. రాత్రికి కాని రాడు అని అంటారు అనుకో. ఆ మాటకి కడుపులో దేవేస్తుంది. దాంట్లో నా తప్పేమిటీ చెప్పు వసంతక్కా. ఎంత కాలం ఉగ్గబెట్టుకోను!! నాకూ అంటూ ఏముంది? వంటింట్లో పని ఎప్పటికీ తెమలదు. బంక మట్టిలో కాలు పెట్టినట్టే. ఆ బంక నుంచి బయటికి ఊడి పడటము చాలా కష్టము. ఎంత చేసినా మొప్పేకాని మెప్పు మటుకు ఎప్పటికీ రాదు. ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో ఒక వంక పెడతారు. అయ్యో చేసిందే! అని ఎందుకు ఉండరూ. వంక లేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందట అనట్లు... ఆ రోజు, అదే మొన్న ఆదివారం ఉప్మా చేసాను. మా ఇంట్లో ఉప్మాలో ఎండు మిరపకాయి కూడా వేస్తారు పచ్చిమిరపకాయలతో. అది నా అలవాటు. ఒకవేళ వేసానే అనుకో, తింటే విషము కాదు కదా!” అంది సిరీష తన గుండె బరువు తగ్గించు కుంటూ. “బాగానే ఉంది వరుస. ఎలా కాపురము చేస్తున్నావే తల్లీ. జాగ్రత్తగా సరిదిద్దు కోవాలి. జీవితం కత్తి మీద సాము వంటిది. నేర్పుతో దిద్దుకోవాలి! సిరీషా”అంది వసంత. మా అత్తగారు మావగారు తలదూర్చని విషయాలంటూ ఏవీ ఉండవు. యెడ్డమంటే తెడ్డంమంటారు. ఇలా చెప్పుకుని పోతుంటే ఎన్నెన్నో! మా ఆయనకి నోట్లోంచి మాటే రాదు. వాళ్ళ తల్లీ తండ్రీ వాక్కు బ్రహ్మ వాక్కు. ఆయన ఉన్నట్టు నన్ను ఉండమంటారు. ఏలా అవుతుంది వసంతక్కా. నేనేమన్నా రొబోట్ నా? నాకు ఇంట్లో వాళ్ళ మొహాలు చూడాలంటే తేళ్ళూ జెర్లూ పాకినట్టు ఉంటుంది. అయినా వాళ్ళకేమి కావాలో వాళ్ళు చెప్తే చేస్తాను. ఒక్క సారి కూడా క్షమాపణ అడగరు. తప్పు చేసినా చేయకపోయినా నేనే తలవంచాలి. క్షమాపణ అడగాలి. ఇది ఎక్కడ పద్దతి వసంతక్కా? అసలు విడాకులు ఇద్దామనుకుంటుంన్నాను. తట్టుకోలేక పోతున్నాను” అంది సిరీష ఉక్రోషముతో! “ఆగవే సిరీష! క్షణిక ఆవేశములో నిర్ణయాలు తీసుకోకు. మీ అమ్మా నాన్నగారితో మాట్లాడావా మరి” అంది వసంత ఆందోళనతో. “మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా కోపంలో ఉన్నారు. మాకు నువ్వూ మా మనవరాలు శిల్ప బరువు కాదు, వచ్చేయమ్మా, అని నాన్న నాతో అన్నారు. నీ సలహా అడుగుదామని కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నాను” అంది సిరీష. “సరే నన్ను అక్క అని భావిస్తున్నావు కాబట్టి, నా వంతు సహాయము నేను చేస్తాను. కుటుంబము నిలపెట్టేందుకు ” అంది వసంత. “కుటుంబము నిలపెట్టడానికా!”అంది సిరీష ఆశ్చర్యంతో. “నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ కుటుంబము చూడ ముచ్చటగా ఉంటుంది” అంది సిరీష. “ఆగవే సిరీషా! నీ కొక కథ చెప్పాలని ఉంది. మరి వింటావా?” అంది వసంత సిరీష కళ్ళలోకి చూస్తూ. “వింటాను” అంది సిరీష ఆతృతతో. కల్పన అల్లారు ముద్దుగా పెరిగింది. మరి కల్పన భర్త కిషోర్ కష్టపడి పైకొచ్చిన రకం. మరి వాళ్ళ ఇరువురి దృష్టికోణాలు వేరు వేరు. పొద్దున్న లేచిన మొదలు ఒకరి మాట మరోకరికి నచ్చేది కాదు. ఇక కల్పన కిషోర్ ల పనేమిటంటే .. ఎవరెవరు ఏమి చేసారా అని ఎంచుకోవటమే. దానితో ప్రేమ ఎలా ఉన్నా, ద్వేషము బాగా పెరిగింది. అసలు వాళ్ళకి పరిమితము చేసుకోక, వాళ్ళని పుట్టించిన కుటుంబాల మీద కూడా పడ్డారు. తరువాత పెరిగిన పరిసరాలు. ఇలా మరి వారి వారి అభిప్రాయాలనే బలపరచుకుంటూ ముందుకు సాగిపోయారు. ఇలా కొన్ని నెలలు గడిపాక, కిషోర్ వేలువిడిచిన మేనమామ అత్తయ్య వాళ్ళ సంసారం చూడాలని వచ్చారు. అప్పుడు మాటల సందర్బములో పెళ్ళి అనే పదం వెనుక దాగియున్న భావన ఆయన తన దాపత్య జీవిత అనుభవంతో ఇలా వివరించారు..... “ఎవోయ్... రత్నమ్మా మన దాంపత్య జీవితం గురించి వీళ్ళకి తెలుపదాము రావమ్మకుర్చో! ఇదిగో బాబు కిషోర్, కల్పనా మొదటి సూత్రం .... పెళ్ళి అనేది మూడు పువ్వులు ఆరుకాయలగా సాగిపోవాలి. ఒకళ్ల మీద ఒకళ్లు ఆధార పడాలేకాని కించ పరచు కోకూడదు. మన చేయి పట్టుకుని మనసా వాచా కర్మణా మనతోపాటు నడుస్తాను అని శపధం తీసుకుని మన జీవితంలో అడుగు పెట్టిన భాగస్వామి ముఖమున, చిరునవ్వు కోల్పోనీయకూడదు. సంసారసాగరము ఈదుతుంటే ఎన్నో కష్టాలు సుఖాలు వస్తాయి. కలిసి అనుభవించాలి. అప్పుడే ఒడ్డు చేరగలము. ఇక్కడ ఎవరు గెలిచారా అని కాదు. కలసి కట్టుగా ఆదర్శ కుటుంబముగా ముందుకు సాగిపోవాలి. అదయ్యా మా దాంపత్య జీవిత రహస్యం” అన్నారు వేలువిడిచిన మేనమామ. ఇది కల్పన కిషోర్ మనసులలో చెరగని ముద్ర వేసింది. వారి వారి దృక్పధాలు మార్చుకున్నారు. ఇంతవరుకూ ఉన్న అనుమానాల చెదలను పెకిలించి తీసేసి నమ్మకము అనే పునాది మీద వారి కుటుంబము ఎర్పరుచుకుని నిలదొక్కున్నారు. అప్పటి వరుకూ కంపరమెత్తుతున్న జీవితం ఎంతో అందంగా కనబడింది. అందుకే ఆంగ్లములో అంటారు ”The way you look at things always matters” అని. “ఎలా ఉంది కథ” అని సిరీషని ప్రేమతో అడిగింది వసంత. “బావుంది! ఇప్పుడు నా మనసు ఇంకొక కోణము నుంచి ఆలోచిస్తోంది. చూడాలి వసంతక్కా. నీ మాటలు నాకు ఊరట కలిగిస్తున్నాయి. అక్కడ ఎక్కడో వెలుతురు కనబడుతోంది”అంది సిరీష ధీర్గాలోచనతో. “మరైతే వెళ్లు ఆ దారిలో. పద నేనూ వస్తా”అని చిరునవ్వుతో అంది వసంత. “అసలు రామ్ అంత చెడ్డ వాడా సిరీషా? ప్రేమగా ఏ ఒక్క కోణములోనూ చూసుకోలేదా”అని అడిగింది వసంత సిరీష కేసి ఆప్యాయంగా చూస్తూ. “రామంటే చాలా ఇష్టమక్కా అని బళ్ళన ఏడ్చింది. నాకు ఏమన్నా సలహాలివ్వవా” అని చేయిపట్టుకుంది సిరీష. “సిరీషా, ఏ రంకంగా నువ్వు రామ్తో మానసిక వొత్తిడికి గురౌతావు?”అంది వసంత. “నన్ను పని వత్తిడిలో పట్టించుకోరు. నా మీద చేయిచేసుకోవటము మటుకులేదు వసంతక్కా!” అంది సిరీష. “సిరీషా నేను చెప్పినట్టు కొద్దిరోజులు చూద్దాము ఫలించక పోతే, అప్పుడు నీ పధ్ధతిలో వెళ్లమ్మా. నువ్వు ఏ దారి ఎంచుకున్నా నేను నీతోనే. రామ్ ప్రేమ పొందాలంటే వారి కుటుంబాన్ని అంతా ప్రేమించాలి. వాళ్ల ఇష్టాలు తెలుసుకునే ప్రయత్నము చెయ్యి. మన చుట్టూ జరుగుతున్నవి ప్రేమించు. ఇప్పుడు వంటే తీసుకో! కుటుంబ సంతోషాలకు కొలబద్ద మనకి ఉన్నదాంట్లో చక్కగా అందరినీ ప్రేమ, ఆదరణలతో చూసుకోవటము. ఆదాయము, ఖర్చు, ఆదా అనేవి వండే వంటకాల మీద మోపి, విసుకు చిరాకుల మధ్యలో కొట్టుమిట్టాడటము కాదు. నువ్వు అమృతతుల్యమైన భోజనము ప్రేమ, ఆత్మీయతలు రంగరించి వడ్డించి ప్రాణం పోసావనుకో అందరికీ, వాళ్ల మనసులలో చోటు తప్పకుండా లభిస్తుందే తల్లీ. వెనుకటికి ఓ పేదరాసి పెద్దమ్మ, ఆకలితో రాజుగారు తన ఇంటికి వస్తే! వండడానికి ఏమీ కూరలు లేక, దొడ్లోంచి గరిక కోసుకొచ్చి, గరిక పచ్చడి చేసి, వేడన్నముతో నెయ్యి వేసి వడ్డించిందట ఆప్యాయంగా. అంతే ఆయన ఆత్మా రాముడు శాంతించి....ఒక అగ్రహారము వ్రాసి యిచ్చాడట. అందుకే ఆప్యాయత స్వీకరించాక అన్నదాతా సుఖీభవ అని కూడా అంటారు మనసారా. నీ కృషికి ఫలితం అప్పటికప్పుడు రాకపోవచ్చు. కాని నిదానముగా వాళ్ల మనసులలో చోటు గెలవచ్చని నా గాఢ విశ్వాసము. ఇక తల్లి మీద కోపము క్షణికం. ఎందుకంటే ప్రేమ ఎక్కువసేపు కోపము ఉండనీయదు. అలాగే రామ్ కుటుంబాన్ని పరిసరాలని కూడా ప్రేమించు . అప్పుడు అన్నీ సక్రమంగా అవుతాయి. ముందడుగు వెయ్యి. తప్పకుండా వాళ్లు నిన్ను అనుసరిస్తారు, సమయము ఇవ్వు. పెద్దలు క్షమాపణ అడగటము, మనకి స్రేయస్కరము కాదు. వారి దీవెనలు మనకి చాలు. మీ అత్తగారు అన్న వాక్యము మనసుకి తీసుకోకు. దాని వెనుకన్నున్న ఆవేదన అర్థము చేసుకో సిరీషా. అయ్యో తినకుండా వెళ్లాడు అన్న వాక్యము గూడార్థము ఏమిటంటే, తల్లి సంతానము తనవాళ్ళు తినకుండా తను తింటుంటే తల్లడిల్లి పోతుంది. అయ్యో సుర్యోదయముతో ఇంటిలోంచి కొడుకు బయటికి వెళ్ళిపోతాడు. రెక్కలు ముక్కలు చేసుకుని,బరువు బాధ్యతలు బుజాన్నేసుకుని కష్టపడతాడు. వాడు బాగుంటేనే కదా సంసారం నడిచేది. మళ్ళీ సూర్యాస్తమాయానికి కానీ రాడాయే. ఇలా సరిగ్గా భోజనము చేయకపోతే ఆరోగ్యము క్షీణించదూ? సంసారం అన్నది అతనిమీద ఆధారపడినప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి సిరీష. మొన్న నువ్వు చెప్పావు కదా, శిల్ప అన్నము తిననని మొరాయిస్తే కేరెట్ హల్వా పెట్టానని”అంది వసంత. “అవును శిల్ప తినకపోతే, నేనెలా తినగలనూ. అయినా శిల్ప చిన్న పిల్ల. ఈయన చంటి పిల్లాడా ఏమిటి? ఆకలేస్తే ఎందుకు తినరూ. నువ్వు మరీను వసంతక్కా!” అంది సిరీష కొంచము తేరుకుంటూ. “ప్రత్యేకంగా పరిస్ధితులు అనుకూలించనపుడు ముందుగానే వాళ్ళే తప్పు మనదే ఒప్పు అనేసుకోకూడదు. సమతుల్యత తెచ్చుకోవడం చాలా అవసరము. మన మానసిక స్ధితి సమతుల్యముగా వున్నప్పుడు మనకు అందరి ప్రవర్తన వాళ్ళ వాళ్ళ దృష్టికోణాలలో సమంజసమని గుర్తించగలుతాము. అప్పుడు వాళ్ళ ప్రవర్తన తప్పుకాదు, కాని వాళ్ళు వాళ్ళ పరిధి నుంచి బయటకు రాలేక పోతున్నారన్నమాట అర్ధం అవుతుంది. ఈ విషయం గ్రహించాక వాళ్ళ సమంజసమైన కోరికలు తీర్చడం మనకి ఒత్తిడి అనిపించదు, వాళ్ళకి కూడా నీపైన నమ్మకము కుదురుతుంది. ఒకసారి నమ్మకము వచ్చాక ఒకరికొకరు ఆప్యాయత ఒలకపోసుకుంటారు. అది మానవ సహజం. ఎవరో నూటికి ఒకరిద్దరుతప్ప ఎవరూ ఎప్పటికీ మారలేనంత చెడ్డవాళ్ళు కాదు. ఈ స్ధిమితమైన మనోస్ధైర్యం చాలా అవసరము. ఇది మనసులో ఆశాభావాన్ని అలవాటు చేసుకోవడంతో వస్తుంది” అంది వసంత. తల్లి తండ్రులకి పిల్లలు ఎప్పుడూ బుజ్జి పాప బాబులే. అది లోకరీతి. దాంట్లో పరమార్ధం మన పిల్లలు పెద్దవాళ్లు అయినప్పుడు కానీ, మనకి దొరకదు. తప్పు చేసినప్పుడు పెద్దలమీద గౌరవముతో క్షమాపణ అడుగుతాము. మరి వాళ్లు తప్పు చేసినప్పుడు వాళ్లు చిన్నబుచ్చుకోకుండా మనము సమర్ధించుని పోతాము. ఇలా చేసి మనసులు మమతలు కాపాడి, ఒక్క త్రాడు మీద కుటుంబము నడిపించిన రోజు, కుటుంబాలు నిలబడతాయి, లోకం కూడా హర్షిస్తుంది. నాకు తెలుసు నీ మంచి తనము సిరీషా.” అంది వసంత గట్టిగా ఉపిరి తీసుకుంటూ. ఇంక వెళ్దాము! ఆలస్యమౌతోంది వసంతక్కా. రామ్ కి ఇష్టమైన గుత్తివంకాయ కూర చెయ్యాలి. మా మావగారికి ఉప్మా అరగటము లేదని అనుకుంటూ ఉంటారు. నాకు అది సులువు. ఒక తిప్పులో అయిపోతుంది. బ్రెడ్ సహించదు వేడి , అజీర్తి చేస్తుందట. అంటారు. కాని తిననని ఎప్పుడూ అనరు. ఇడ్లి అయితే ఇష్టము. సులువుగా అరుగుతుందని. ఓ నాలుగు ఇడ్లీలకోసము కుక్కర్ గ్యాస్ దూబరా అనుకోకుండా చేస్తాను. మా అత్తగారు మనస్సు నొప్పించను. మా ఇంట్లో వాతావరణ్ణాన్ని ప్రేమిస్తాను. చూద్దాము ఏమౌతుందో. నీ మాట ఎందుకు కాదనాలి” అంది సిరీష ఎదో దిక్కుతోచని ప్రశ్నలకి సమాధానం దొరికిన పారవస్యములో ఇంటికి తిరిగి నడుస్తూ ... నిన్నే ముందు అడుగు వేయమంటుంన్నాను అని ఏమీ అనుకోకు, అతనితో మాట్లాడితే అతనిని వేయమనేదాన్ని. ఎవరి మంచితనం వాళ్ళకి తప్పకుండా మంచి చేస్తుంది. ప్రతీ అడుగు లోనూ నేనే ఎందుకు ఒంగాలి అని అందరూ అనుకుంటే ఎవరి పరిధిలో వాళ్ళే మిగిలి పోతారు. గాఢ ప్రేమ మనసులో ఉన్నప్పుడు నేనే ఎందుకు బయటపడాలి అని ఏదో ఒక రకంగా వ్యక్తం చేయక పోతే అది ఫలించడం దైవాధీనం మాత్రమే. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, కాని చేయ గలిగిన మానవ ప్రయత్నం మనం తప్పకుండా చేసి తీరాలి అని నా నమ్మకం. ఎవరో ఒకరు ముందడుగు వేయ్యాలి కదా సిరీష. .. ఖంగారు పడకు అమ్మడూ...స్త్రీ ప్రేమ ,సహనము,ఓర్పు, త్యాగానికి ప్రతి రూపం. మంచి మాట మంచి తలపులు ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదే తల్లీ. అందరూ చేసే పనులు గుర్తించి మెచ్చుకో. విజయము నీ వెంటే” అనిముగించింది వసంత. “అవునుకాని వసంతక్కా కల్పనా కిషోర్ ఎవరూ?”అంది సిరీష. “మేమే. ఈ రోజు ప్రేమతో ఎర్పరచుకున్న నా బంగారు కుటుంబం. ఆశాభావము,కృషి ,లగ్నము, ప్రేమ, ఉత్సాహం పంచామృతములలాగ రంగరిస్తేకానీ ఫలితం కనబడదు. జీవితం ప్రతీ మనిషికి పూలబాటకాదు. కానీ ముళ్ళబాటని పూలబాట చేయగల్గినవాడు ధన్యుడు”అంది వసంత. “అవునా”అని ఆశ్చర్యపోయింది సిరీష. “సిరీష ! ప్రతీవాళ్ల మనస్తత్వం వేరు.అందువల్ల తప్పులు కన్నా మంచి పనులు గుర్తించి ఆకట్టుకోవాలి. ఇంకొకటి మీ తల్లీ తండ్రీ రమ్మంటములో తప్పులేదు. కూతురూ మనవరాలి మీద మమకారము అటువంటిది. ప్రేమ గుడ్డిది. వేరే కోణములో ఆలోచించలేక పోయారమ్మా, అంతే సిరీష” అంది వసంత ప్రేమతో. ఇలా కొన్నినెలలు సాఫీగా గడిచాక సిరీష, రామ్ కాఫీ త్రాగుతూ ప్రకృతి ని ఆస్వాదిస్తున్న సమయములో సిరీష రామ్ కేసి చూసి... “ఏవండీ మన కుటుంబములో చాలా మార్పులు వచ్చి అందరికీ ఆదర్శంగా నిలబడ్డాము. ఇరుపక్క కుటుంబాలు చూసుకుంటూ, మనము ఒకటిగా పెనవేసుకుపోయాము. మన జీవిత నావ ఇలా ఆనందంగా సాగిపోవాలి” అంది సిరీష. “ఎందుకు సాగదూ! ఇలాగే హాయిగా సాగుతుంది”అన్నాడు రామ్. “ నల్లమబ్బులు కమ్మి దిక్కుతోచని పరిస్థితిలలో సతమతమౌతున్నప్పుడు నేనున్నాను అని చేయి అందించిన వసంతక్క కుటుంబానికి జేజేలు పలుకుదాము” అని ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ కాలములో కుటుంబము అనే వ్యవస్థ కొట్టుకుపోతుందేమో అనిపిస్తున్న సమయములో మనము అందరికీ చెప్పాలి. కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలను చక్కగా ఒప్పుకుని, సద్దుకుపోతు, అందంగా మలుచుకుంటూ ఆదర్శంగా ముందుకు సాగిపోవాలి. అనట్టు సిరీష, మన జీతాలలో మళ్ళీ వసంతము తెచ్చిన వసంతక్క మన మనసులలో చెరగని ముద్రవేసుకుంది. మంచి మనసు ఏలాంటి కటువు వాళ్ళనన్నా మార్చేస్తుంది సుమీ” అని అన్నాడు రామ్.
***
No comments:
Post a Comment