మోడా మోడి - అచ్చంగా తెలుగు

మోడా మోడి

డా.తాడేపల్లి పతంజలి 


అందమయిన అను అర్థంలో అన్నమయ్య కల్పించిన  పద బంధం   “మోడామోడి”. అయితే  మోడామోడి అను పదానికి బయట పడీపడని సిగ్గులు అను అర్థం కూడా రావచ్చని 21 సంపుటపు  పరిష్కర్త కీ.శే. గౌరిపెద్ది రామశర్మ గారు అన్నారు.బయట పడీపడని సిగ్గులు కూడా అందమైనవే కదా ! ఇప్పుడు  ఆ మోడామోడి  పదబంధమున్న మొత్తం కీర్తనను ఆస్వాదిద్దాం.

పల్లవి:     ఏడనున్నా నీ వారమే యెరవు సేయకువయ్య
             మోడామోడితనమున మొక్కేము నీకు
చ.1:        పాయము నీ కిచ్చితిమి పంతములదానఁగాను
                పోయివచ్చేమయ్యా పొద్దున నేము
                కాయ మిది నీసొమ్ము కడమ నే నెఱఁగను
                మాయింటికి రావయ్యా మరి చెప్పేఁగాని

చ.2:        మనసు నీ కొప్పనాయ మారుమాట లెఱఁగము
                వెనక వచ్చేమయ్యా విడిదికిని
                దినము నీకే సెలవు దేవరచిత్త మిఁకను
                ననుఁజూడవయ్యా నవ్వు నవ్వేఁగాని
చ.3:        సేస నీపైఁ బెట్టితిమి చెప్పుకొనఁ బనిలేదు
                ఆసతో నుండేనయ్యా ఆడనే నేను
                బాసతో శ్రీవేంకటేశ పైకొని కూడితి విందే
                వేసరక రావయ్యా వెంటఁదిప్పేఁ గాని (రేకు: 1049-5సంపుటం: 20-293)

తాత్పర్యము పల్లవి:     వేంకటేశా ! ఎక్కడ ఉన్నా  మేము నీవారమే . వేరేగా-   (ఎరవు) చూడకయ్యా ! అందంగా , ఉదాత్త శైలిలో (మోడా మోడి తనమున) నీకు నమస్కరిస్తున్నాము. అందంగా మొక్కే మా జీవితాలను  కూడా         అందంగా మార్చవయ్యా !

  చ.1:        నా వయస్సుని-నా యౌవనాన్ని నీకు సమర్పించాను. పంతాలు పోయేదానిని కాను.(సర్వత్మనా నిన్నే తలచుకొంటున్నాను) పొద్దున్నే  మేము పోయి వస్తాము.(పొద్దునే జీవుని ఉదయా ఈ శరీరము నీ సొమ్ము. చివరికి ఏమి మిగులుతుందో  నేను ఎరగను. మా ఇంటికి రావయ్యా ! స్వామీ! ఏమిటోలే ! నేను చెబుతుంటా కాని.. నువ్వు వస్తావా... నా పిచ్చి అంతే.

   చ.2:        నా మనస్సు నీకు అర్పణమయింది.కానుకయింది. (ఒప్పనాయ). ఎదురుమాటలు మాకు తెలియవు. నువ్వు ఉంటున్నచోటికి  ఇదివరకు వచ్చే వారము కదా ! నీకే దినమంతా ఉపయోగమవుతుంది. ఖర్చవుతుంది.  (సెలవు). కనుక ఇక  ప్రభువు వారి చిత్తం(చిత్తం= పెద్దవారేదేని           చెప్పునపుడు     అంగీకార సూచకముగ వాడు పదము చిత్తం.  ఔను అను అర్థములో వాడే పదం).        నన్నొక సారి చూడవయ్యా     బాబూ ! నవ్వు నవ్వేవు కాని.

 చ.3:        అక్షింతలు నీమీద పెట్టాము. పెండ్లాడాము.(సేస పెట్టు)  ఇప్పుడు కొత్తగా ఆ విషయం చెప్పుకోవలసిన పని లేదు. మీరు ఉండమన్న చోటనే – ఆడనే – నీకోసం ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాను మహా ప్రభూ ! వేంకటేశా ! నాకు ఏవేవో  ప్రమాణాలు (బాసలు) చేసి  ఈ స్థలంలోనే  మీదికి వచ్చి, ప్రయత్నంతో (పైకొని)  శుభ్రంగా నాతో           కలిసావు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మగడా ! శ్రమపడక(వేసరక)  తొందరగా రావయ్యా ! నా వెంట తిప్పి నీకు స్వర్గాలు చూపిస్తాలే. ఆంతర్యము ఆన్నమయ్య ఈ కీర్తనలో భక్తుని రూపంలోని  ప్రియురాలు . స్వామి సన్నిధి కోసం తపించి పోతూ తనలో కలిసిపొమ్మని, తనతోటే ఉండమని ప్రార్థిస్తున్నాడు. వేడుకొంటున్నాడు. “శ్రీ వేంకటేశ/మోడా మోడితనమున మొక్కేనంటా(రేకు: 1729-03   సం:     27-171)”  మోడామోడిసిగ్గుల మూసిపెట్టనేఁటికే (రేకు:1171-3        సం: 21-357)         మోడామోడిమాఁటల ముచ్చట దీరినా ( రేకు: 1598-6సం: 25-468) అని ఇతరప్రదేశాలలో కూడా మోడామోడిని   అన్నమయ్య అందంగా ప్రయోగించాడు. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలులో మోడి అనే జానపద కళారూప విశేషాలు ఉన్నాయి. మోడి అంటే  మంత్ర, తంత్ర విద్యను ప్రదర్శించడం అని అర్థంగా అందులో చెప్పారు. అందమైన బయట పడీపడని సిగ్గులలో కూడా –(మోడా మోడిలో ) వినబడని మంత్రాలున్నాయి. స్వస్తి.
***

No comments:

Post a Comment

Pages