నమ్మకమే మనోసూత్రం - అచ్చంగా తెలుగు

నమ్మకమే మనోసూత్రం

Share This

నమ్మకమే మనోసూత్రం

బి.వి.సత్య నాగేష్ 


‘Man is what he believes’
– Anton chekhov
మన జీవితాన్ని నడిపించే సూత్రం ( GUIDING PRINCIPLE) ‘నమ్మకం’. ఈ నమ్మకం అనేది మనం అనుభవాలతో పెంపొందించుకున్న ‘మానసిక ముద్ర’ ఇది మన స్వంత భావం అందుకే ‘స్వభావం’ అంటారు.
నమ్మకమనేది ఒక ఫిల్టర్ లాంటిది. మన ఆలోచనా ప్రక్రియను మనకున్న మానసిక ముద్రలతో జల్లెడ పడుతుంది. చివరిగా ఒక అర్ధాన్నిస్తుంది. కొన్ని నమ్మకాలు మనల్ని ఎంతో ఎత్తుకు ఎదిగేటట్లు చెయ్యగలవు. అలాగే కొన్ని నమ్మకాలు మనల్ని దిగజారేటట్లు చెయ్యగలవు. మన నమ్మకాలు మన శరీరంపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.
          “Drugs are not always necessary,
           but belief in recovery always is.”
                                                -Dr. Norman Cousins
                                      (Author of “The Anatomy of a disease”)
శరీరంపై మనసు ప్రభావం ఎంతో వుంటుందనటంలో సందేహం లేనేలేదు. రుచికరమైన పదార్ధాన్ని చూసినపుడు నోట్లో లాలాజలం విడుదలౌతుంది. అదే పదార్ధంపై వేరే అభిప్రాయం వున్న వారికి లాలాజలం విడుదలవదు. ఇది ఒక నమ్మకం. భయపడినపుడు శరీరం వణుకుతుంది., గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎడ్రినాలిన్, కార్టిసాల్  విడుదలౌతాయి. భయం అనేది “ఏదో అవుతుంది” అనే ఒక నమ్మకం. ఈ నమ్మకం ప్రతికూలమైనది.
భయం ఒక రకమైన నమ్మకమైతే, ఆత్మవిశ్వాసం అనేది మరొక రకమైన నమ్మకం. నమ్మకాలు శారీరక ఆరోగ్యంపైన ప్రభావాన్ని చూపిస్తాయి కూడా. హార్వాడ్  యూనివర్సిటీకి చెందిన Dr. Henry Beacher ఎర్రమందు (Barbiturate) ను ఉపయోగించి “మనుషుల ఆలోచనా విధానం-వ్యాధినివారణ” అనే అంశంతో వందల సంఖ్యలో మనుషులతో ప్రయోగాలు చేసేరు. ఆలోచనా ప్రక్రియ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రయోగాత్మకంగా రూడీ పరిచేరు కూడా!
కొంతమందికి డాక్టర్పై అపారమైన నమ్మకం వుంటుంది. డాక్టర్ ను సంప్రదించిన తర్వాత “నీకేం రోగం లేదు” అని డాక్టర్ అంటే....”హమ్మయ్య....నాకేం రోగం లేదు” అనుకుంటూ తృప్తికరంగా వుండటం కూడా ఒక నమ్మకమే! డాక్టర్ తన నాడి పట్టుకుని చూస్తే చాలు తన రోగం మాయమౌతుందనే ‘నమ్మకం’ వున్నవాళ్ళు కూడా వున్నారు. దాన్నే “డాక్టర్ హస్తవాసి” అంటారు. డాక్టర్ ఎలా చెప్తే అలా వింటారు. డాక్టర్ విటమిన్ టాబ్లెట్ ఇచ్చినా రుగ్మత తగ్గిపోతుంది. దీనినే “placebo effect” అంటారు.
“నమ్మకం” అనే ఈ మనోసూత్రం ఎంత బలమైనదో చూద్దాం. అహింస అనేది మహాత్మాగాంధీ నమ్మకం. హింస అనేది టెర్రరిస్ట్ ల నమ్మకం. అన్నాహజారేది ఒక నమ్మకం అయితే గంధపు చెక్కల వీరప్పన్ ది మరొక నమ్మకం. అంతవరకూ ఎందుకు...కులం, మతం, ప్రాతం కూడా నమ్మకమే కదా! ప్రేమ ఒక నమ్మకం, ద్వేషం ఒక నమ్మకం. హోమియోపతి ఒక నమ్మకం, అల్లోపతి ఒక నమ్మకం. పిడివాదం, మొండివాదం,తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే మూర్ఖపు వాదంతో నెగ్గుకు రావచ్చుననేది కూడా ఒక రకమైన నమ్మకం. అపనమ్మకం కూడా ఒక నమ్మకం. ఒక్కమాటలో చెప్పాలంటే మన జీవితాన్ని నడిపొంచేదే నమ్మకం.
నమ్మకం అనేది ఉద్వేగంతో పదే పదే భావించడం వల్ల ఏర్పడిన ఒక గట్టి అభిప్రాయం. మనం విజయం సాధించగలం అనే నమ్మకం వుంటేనే విజయాన్ని సాధించగలం. నమ్మకం లేకుంటే డీలా పడిపోయి ఆశక్తుడిలా అయిపోతాం. నమ్మకంకు వున్న శక్తి అలాంటిది. ఇది పూర్తిగా మానసికమైనది.
నమ్మకాల ప్రతిబింబమే మన ప్రవర్తన. కనుక జీవితానికి ఉపయోగపడే విషయాలను పదే పదే ఉద్వేగంతో భావిస్తే అవి నమ్మకాలుగా మారతాయి. జీవితమే మారిపోతుంది. ఉత్తమస్థాయికి చేరిన వారికున్న సిద్ధాంతాలను అభివృద్ధి చేసుకుంటే అవి నమ్మకాలుగా మారి ఉత్తమస్థాయికి తీసుకేల్తాయి. దీనినే “Role modelling” అంటారు.
నమ్మకాలను మార్చుకునే ప్రయత్నంలో ముందుగా ఒక చిన్న పనిని ‘ఎక్సర్ సైజ్ ‘ లా చెయ్యాలి. అభివృద్ధికి ఆటంకం కలిగించే చెడు నమ్మకాలను ఒక కాగితం లేదా కార్డుపై వ్రాసుకోవాలి. ఈ విధంగా “చెడు నమ్మకాల పట్టిక” తయారవుతుంది. కాగితంపై వ్రాయటం చాలా ముఖ్యం. ఎందుకంటే...వ్రాతపూర్వకంగా లేని లక్ష్యాలు ఆచరణకు నోచుకోని ఆశలుగా మిగిలిపోయే అవకాశం వుంది. ఇలా వ్రాసుకున్న చెడునమ్మకాల పై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు...”నేను ఈ పనిని పూర్తి చేయలేను” అనేది ఒక చెడు నమ్మకం. ఈ చెడు నమ్మకానికి వ్యతిరేకంగా ఒక మంచి నమ్మకంను వేరే కాగితం లేదా కార్డుపై వ్రాయాలి. “నేను చేపట్టిన పనిని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాను” అనేది మంచి నమ్మకం. “నాకు ఇంగ్లీషు రాదు” అనేది చెడు నమ్మకం. “ఇంగ్లీషు అనేది ఒక మామూలు భాష. ఖచ్చితంగా నేర్చుకుని మాష్టర్ చేస్తాను” అనేది మంచి నమ్మకం. ఈ మంచి నమ్మకాలను ఒక్కొక్కటిగా భావోద్వేగంతో ఆచరణలో పెట్టాలి. ఈ విధంగా వ్రాసుకున్న “చేదు నమ్మకాల పట్టిక” నుంచి ఒక్కొక్క చెడు నమ్మకాన్ని బలహీనం చేసి, వాటి స్థానానే మంచి నమ్మకాలను పెంపొందించుకోవాలి.
నమ్మకం అనేది మనల్ని నడిపించే సూత్రం. కనుక మంచి నమ్మకాలను పెంచుకోవాలి. మనిషి జీవితంలో ఎదుగుదల,సంతోషాలను నిర్దేశించే శక్తి “నమ్మకం”కు ఉంది. అందుకని నమ్మకంతో నమ్మకాలపై దృష్టి పెట్టాలి. నమ్మకం కలిగింది కదా!
 ***

No comments:

Post a Comment

Pages