నిండు జీవితం - అచ్చంగా తెలుగు

నిండు జీవితం

Share This

నిండు జీవితం

అవసరాల సీతారామలక్ష్మి 


కిటికీ లోంచి సూర్య కిరణాలు వెచ్చగా మీది పడడమ్తో మెలకువ వచ్చింది వినీల కి. బద్దకంగా వొళ్ళు విరుచుకుంటూ బయటకి చూసింది. వాకిట్లో తల్లి పద్మ తులసి కోట దగ్గర పూజా చేస్తోంది. చక్కగా తల స్నానం చేసి , జరీ చీర, నుదుట కుంకుమ , పాదాలకు పసుపు తో శుక్రవారం మహాలక్ష్మి లా కనిపించింది వినీల కు.
మెల్లగా ప్రక్కన పడుకున్న చెల్లెలు ప్రమీల వైపు ప్రేమగా చూసింది.  ముద్దుగా ముడుచుకుని  పడుకున్న వైనం చూసి , ఈ పిల్లెనా అంత అల్లరి చేసేది అన్నట్టూగా నవ్వుకుంది. బెడ్ రూమ్ లోంచి బయటకు వస్తోంటే, పూజ గది లోంచి వస్తున్న తండ్రి ప్రభాకారాన్ని చూసి, "గుడ్ మార్నింగ్ నాన్న" అంది వినీల.  "మార్నింగ్ నీల" అంటూ సోఫా లో పేపర్ పట్టుకుని కూర్చున్నాడు. బాత్ రూమ్ వైపు వెళ్తూ "మార్నింగ్ అమ్మ" అంది.  పద్మ మాత్రం " శుక్రవారం , ఆడపిల్లవి ఇంత పొద్ధెక్కి లేస్తే ఎలా నీలా? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావ్"  అంది తన ధోరణి లో .
వినీల గబగబా ఫ్రెష్ అయ్యే పని లో బిసీ అయ్యింది.  ఇంతలో కళ్ళు నులుముకుంటూ ప్రమీల హాల్ లోకి వచ్చింది.  "డాడి, గుడ్ మార్నింగ్" అంటూ ప్రభాకరం వొళ్లో కూర్చో బోయింది. "పమ్మీ , లేవే మీ ముమ్మీ చూస్తే తిడుతుంది." అన్నాడు. వంట గదిలోంచి పద్మ " పాచి మొహంతో అలా మీద పడతా వెంటే పమ్మీ. అసలు మీ నాన్నని అనాలి మరీ గరాభం చేస్తారు." అంది  టిఫిన్ తెచ్చిటేబల్ మీద పెడుతూ.
టిఫిన్ చేస్తొంటే పద్మ ప్రభాకరం కి ఏదో సైగ చేసి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆది గమనించిన వినీల "నాన్న. ఏంటి ? ఏమైన చెప్పాలా?" అంది.  వెంటనే ప్రభాకరం " ఎం లేదురా నీలా" అంటూ ఒక పేపర్, ఫోటో వినీల ముందుంచాడు. వెంటనే ఆది పెళ్లి కొడుకు వివరాలు, ఫోటో అని అర్దమైంది వినీల కు. " నీకు నచ్చితే , వాళ్ళు ఈ ఆదివారం పెళ్లి చూపులకి వస్తాం అంటున్నారు నీల" అని ముక్తసరిగా ముగించేసాడు. పద్మ మాత్రం నీలకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే వద్దు అన్నట్టు సైగ చేశాడు ప్రభాకరం.
నీల, పమ్మీ బ్యాగ్స్ సర్దుకుని బయలుదేరుతుంటే " రాత్రి లోపు ఏ సంగతి చెప్తే , వాళ్ళకి ఇన్‌ఫార్మ్ చేస్తారా నీలా. వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కదా" అన్నాడు ప్రభాకరం , చాయ్స్ ఇస్ యువర్స్ అనే గొంతు తో. పద్మ కి మాత్రం కూతురికి నచ్ఛచెప్పాలిగాని, పెళ్లి విషయం లో  ప్రభాకరం ఇలా పొడి పొడి గా ఉండడం అసలు నచ్చలేదు.
ప్రభాకరం SBI  లో మ్యానేజర్ గా చేస్తున్నాడు. పద్మ గృహిణి. వినీల, ప్రమీల ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు.  వినీల M.Sc. M.Ed చేసి, లెక్చరర్  గా చేస్తోంది.  ప్రమీల ఇంటర్ మొదటి ఏడు చదువుతోంది.  ప్రభాకరం మోడరన్ గా కనిపించినా, కొన్ని విషయాలలో పాత కాలపు ఆలోచనలు, వాసనలు కనిపిస్తాయి.  పద్మ మాత్రం పూర్తిగా పాత కాలం మనిషి. ఆడ పిల్లలు, కట్టుబాట్లు, అంటూ పిల్లలకి ఎప్పుడూ  హిత భొధ  చేస్తూ ఉంటుంది.
కాలేజ్ బస్సులో కూర్చుంది వినీల. పర్స్ లోంచి ఆ పేపర్ తీసి చదవసాగింది.  పేరు ఆదిత్య. MBA gold medalist -ఉస్మానియా  యూనివర్సిటీ  అని చదవగానే, "గుడ్" అనుకుంది.  ఒక పేరున్న కంపనీ లో ఫైనాన్సు మేనేజర్ గా చేస్తున్నాడు.  మళ్లీ "గుడ్" అనుకుంది. ఫ్యామిలీ వివరాలు కూడా బానే అనిపించాయి. "ఓవరాల్ గా బానే ఉంది. సరే. lets see." మనసు లో అనుకుంది. లంచ్ లో నీల, తండ్రికి ఫోన్ చేసింది. ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న ప్రభాకరం వెంటనే " చెప్పారా నీల. లంచ్ అయ్యిందా?" అన్నాడు.  "జస్ట్ ఇప్పుడే అయ్యింది నాన్న. బయోడేటా చూసేను." అని కొంచం ఆగింది నీల. "బాగానే ఉంది. ఆదివారం రమ్మని ఇన్‌ఫోర్మా చెయ్యండి." అంది. " ఇప్పుడే ఫోన్ చేస్తారా తల్లి" అన్నాడు ఆనందంగా.  "బై నాన్నా" అని ఫోన్ పెట్టేసింది వినీల.
సాయంత్రం ఇంటికి వస్తూనే, వినీల పర్స్ లోంచి ఆ పేపర్, ఫోటో టేబల్ మీద పెట్టింది.  పమ్మీ వస్తూనే ఆ ఫోటో తీస్కుని "అక్కా! బావ సినిమా హేరొా లా ఉన్నాడే." అంది నవ్వుతూ.  నీల గిర్రున వెన్నక్కి తిరిగి " బావ? అప్పుడే బావెంటే, నేనింకా చూడాలి, నాకు నచ్చాలి. అప్ప్పుడు ఆలోచిద్దాం" అంటూ రూమ్ లోకి వెళ్లబోయింది.  పమ్మీ " నాకు నచ్చేశాడు." అంది.  "ఐతే నువ్వే చేసేస్కోవే" అంది నవ్వుతూ నీల.  "పెళ్లా, నేనా . నో  వే. మనకి అలాంటివి అస్సలు పడవ్ " అంది సోఫా పై ఎక్కి డ్యాన్స్ చేస్తూ.
వీళ్ళ మాటలు వింటున్నా పద్మ వెంటనే " ఎం నువ్వు పెళ్లి చెస్కోవా? అక్కా చెస్కోవట్లేదా? పెళ్లి చెస్కోకుండా ఎం చేస్తావ్ తల్లి?" అంటూ హాల్ లోకి వచ్చింది. " చేస్కోను మమ్మీ!! జాబ్ చేస్తా, అన్నీ దేశాలు తిరుగుతా హాయిగా" అంటూ ఇంకా ఏదో చెప్పేలోపు ప్రభాకరం వచ్చాడు.  పద్మ " మగాడి లా పెంచుతున్నారుగా మీ నాన్న, పోనీ ఒక ఆడపిల్ల నే  తెచ్చి చెయ్యమను నీకు. " అని రుస రుస వంటింట్లో కి వెళ్లిపోయింది.  అలవాటు అయిన సీన్ నే కదా అన్నట్టు తండ్రి, కూతుళ్ళు గట్టిగా నవ్వెశారు.
ఆదివారం పెళ్లి చూపుల కార్యక్రమం పూర్తయ్యింది.  సాయంత్రం వినీల మెడ మీద కూర్చొని ఆలోచనలో పడింది. ఎందుకో ఆదిత్య మాటలు చాలా కృత్రిమం గా అనిపించాయి నీలకు. ఏదో తనను ఇంప్రెస్స్ చెయ్యాలన్నట్టు మాట్లాడాడు.  బయోడేటా లో ఉన్న విషయాలకి, అతను మాట్లాడిన మాటలకి లింక్ కుదరట్లేదు అనుకుంది.  చాలా సేపు ఆలోచించింది కానీ అంతా గందరగోళం గా అనిపించింది నీలకు. రాత్రి భోజనాలు చేస్తుంటే అడిగాడు  ప్రభాకరం “ఏరా నీల, ఎలా ఉన్నాడు ఆదిత్య? నీకు నచ్చాడా ? " . నీల ముభావంగా " నాకు 2 రోజులు టైమ్ కావాలి నాన్న,  నన్ను ఆలోచించుకోనివ్వండి"  అంది. " ఓకే రా!! టేక్ యువర్ ఓన్ టైం " అన్నాడు ప్రభాకరం.  పద్మ మాత్రం వస్తున్న కోపాన్ని అనుచుకుంటూ వడ్డించసాగింది. " వాళ్ళ వివరాలు అన్నీ వెరిఫై చేశారా నాన్న?" అంది మెల్లగా నీల. వెంటనే పద్మ " మనకు తెలిసిన వాళ్ల ద్వారానే  వచ్చిందే ఈ సంభంధం. అయినా మేము అంత ముందు, వెనుకా చూడకుండా సంభంధం కుదుర్చుకుంటామా ? నీకు అన్ని అనుమానాలే నీల. వాళ్ళ గురించి వాకబు చేశామని తెలిస్తే తప్పుగా అనుకోరు. " అంది కసురుకుంటూ.  పద్మ చెప్పింది నిజమే అన్నట్టు బుర్ర  వూపీ వూరుకున్నాడు ప్రభాకరం. నీల కు మాత్రం ఎందుకో ఒకసారి వివరాలు వెరిఫై చేస్కుంటే బావుండును అని మనసు పీకుతోంది. ఏమీ ఖచ్చితంగా  తెలుసుకోకుండా ఎలా వొప్పేసుకోవాలి.
మర్నాడు ప్రభాకరం  పొద్దున్నే ఏడు గంటలకే హడావిడిగా ఎక్కడికో వెళ్ళడానికి సిద్దం ఆవతున్నాడు, చేతి లో పెపెర్స్ ఏవో ఉన్నాయి.  ఆది చూసి నీల " ఏంటి నాన్నా అంత హడావిడి" అంది. "ఎం లేదురా!! 3 నెలల క్రితం ఒక ప్లాట్ చూశాను కదా, కొనడానికి, ధాని డాక్యుమెంట్స్ కాపీలు వచ్చాయి. వాటిని ఆడ్వోకేట్ కి చూపించి లీగల్ ఒపీనియన్ తీసుకోవటానికి వెళ్తున్నా నీల" అన్నాడు కాస్త హుషారుగా.
కాలేజ్ కి వెళ్ళాలి అనిపించలేదు వినీల కు. ఫోన్ చేసి లీవ్ అని చెప్పేసింది.  ఆ రోజంతా గదిలో , పత్రిక తిరగేస్తూ ,ఈ విషయమే ఆలోచిస్తూ గడిపేసింది.  రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర మళ్లీ ప్రభాకరం " నీలా, ఏమీ ఆలోచించావ్ రా , ఆదిత్య గురించి??, వాళ్ళు మధ్యానం ఫోన్ చేశారు నాకు. వాళ్ళకి నువ్వు నచ్చావట. ఓకే అన్నారు.  ఇక మన నిర్ణయం చెప్పాలి."  పద్మ , కూతురి  తల నిమూరుతూ " మంచి సంభందం నీల, ఒక్కడే అబ్బాయి, భాద్యతలు కూడా ఏమీ లేవు. పైగా నీకు కావలసినట్టే మంచి చదువు, ఉద్యోగం ఉన్నాయి. ఇంకేమి ఆలోచించకు తల్లి. చెస్కోరా నాన్నా, సుఖపడతావ్. " అంది. నీల మాత్రం ముభావంగా కంచం లో గీతాలు  గీస్తూ ఉండిపోయింది.  కాసేపాటికీ ప్రభాకరం మళ్లీ " నచ్చక పోతే చెప్పేయ్ నీల , బలవంతం ఏమీ లేదు. కానీ ఎందుకు నచ్చ లేదో , నీ కైనా క్లారిటీ ఉంటే మంచిది." అన్నాడు , అసహనాన్ని గొంతులోనే అనిచేస్తూ.
తండ్రి గొంతులో భాదను గుర్తించిన నీల మెల్లగా " నచ్చకపోవడం కాదు నాన్నా. ఒకసారి వాళ్ళ వివరాలు వాకబు చేస్తే మంచిదేమో అని.." తనలో తానే అంటున్నట్టుగా చెప్పింది. " ఆ మాట వింటూనే ప్రభాకరం కంచం ముందు నుంచి విసురుగా లేచి గది లోకి వెళ్ళిపోయాడు. తండ్రి కి కోపం వచ్చిందని గ్రహించింది నీల.  చెంపల పై జారే కన్నీళ్ళు తుడుచుకుంటూ తన గదిలోకి పరిగెత్తింది . ఆ రాత్రి ఎవ్వరూ నిద్ర పోలేదు. నిద్ర నటించారు అంతే. అందరి మనసుల్లోనూ ఇవే ఆలోచనలు. ఎందుకు, ఏమిటి , ఎలా? అన్న ప్రశ్నావాళి కి సమాధానాలు కోసం మన:శోధన జరిగింది.
తెల్లారింది . అంతా మౌనంగానే పనుల్లో పడ్డారు. కాఫీ కప్ తో సోఫా దగ్గర కు వ చ్చింది నీల. పేపర్ లోంచి తల ఎత్తి ప్రభాకరం, నీలను ప్రక్కన కూర్చోబెట్టుకుని, తల నిమిరాడు. ఏదో ధైర్యం వ చ్చింది నీలకీ. " ఎందుకు నీకు అంత అనుమానం, భయం నీల ? అంత నెగటివ్ గా ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్ళడం కష్టం రా" మెల్లగా నచ్ఛచెప్పే స్వరం లో అన్నాడు ప్రభాకరం . మెల్లగాధైర్యం తెచ్చుకుని నీల " నాన్నా, నేనొక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోరుగా, కోపం తేచ్చుకోరుగా " అంది.  " ఛ ఛ , అధెంటి రా , అలా అడుగుతావ్? కోపం దేనికి ? నువ్వు సుఖంగా వండాలానే కదా మా ప్రయత్నం అంతా" వెంటనే అన్నాడు ప్రభాకరం. నీల " నిన్న మీరు ఒక ప్లాట్ కొనడానికి , పేపర్స్ తో ఆడ్వోకేట్ దగ్గర్ కు వెళ్లారు కదా, ఆ ప్లాట్ రేట్ ఎంత నాన్నా?" అంది.  అసంధర్భం గా తోచినా " 4 లక్షలు రా. ఎందుకు?" అన్నాడు కొంత ఆశ్చర్యం తో.  చాలా మెల్లగా నీల" 4 లక్షలు విలువ చేసే ప్లాట్ కొనడానికి, వాటి పేపర్స్ వెరిఫికేషన్ చేయించారే, మరి ఇది నా జీవిత సమస్య నాన్న. నేను జీవితం పంచుకొబోయే నా లైఫ్ పార్టనర్ గురించి ఎందుకు క్రాస్ చెక్ చేసుకోకూడదు?? పూర్తి గారంటీ ఎందుకు ఆశించకూడదు?? ఆ ప్లాట్ విషయం లో తేడా జరిగితే పోయేది 4 లక్షల డబ్బు మాత్రమే కదా నాన్నా. కానీ నేను పెళ్లి చేసుకోబోయే మనిషి తప్పుడు మనిషి అయితే నా లైఫ్ ఏ చేజారిపోతుంది కదా .  ఆ ప్లాట్ కి ఉన్న విలువ కూడా మీ కూతురి నిండు జీవితానికీ లేదా " అంది తన్నుకొస్తున్న ఏడుపు ను దిగమింగుకుంటూ.
నీల మాటలకు ఉలుకు పలుకు లేకుండా వుండిపోయాడు ప్రభాకరం. బయటపడక పోయినా, నీీల అన్న ప్రతి మాట అక్షర సత్యం అని అతని మనసు కు తెలుసు.  తన కూతురి ఆలోచనలు ఇంత క్లియర్ గా ఉన్నందుకు ప్రభాకరం చాలా సంతోషించాడు. అరగంట సేపు అలానే మౌనంగా వుండిపోయాడు అంతర్ మధనం లో.  కాసేపాటికీ తేరుకుని, ఏదో నిర్ణయానికి  వచ్చినవాడిలా లేచి తయారయ్యి నీల గదిలోకి వెళ్లాడు. మౌనంగా మంచం మీద కూర్చోన్న నీల తల పై లాలనగా నిమిరి, చిరునవ్వుతో బయలుదేరాడు , పెళ్లి వాళ్ళ వివరాలు పూర్తిగా నిర్ధారణ చేసుకోవడం కోసం. తండ్రి గా తన భాద్యత కు సరైన మార్గం చూపిన కూతురు నీలను మనసులోనే అభినందిస్తూ.
***

No comments:

Post a Comment

Pages