ఒంటిమిట్ట రఘువీర శతకము - అయ్యలరాజు త్రిపురాంతకుడు
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం
ఒంటిమిట్ట రఘువీర శతకకర్త అయ్యలరాజు త్రిపురాంతకుడు కడపమండలములోని ఒంటిమెట్ట నివాసి. ఆర్వేలనియోగి.అయ్యలరాజు కుమారుడు. ఆపస్తంబసూత్ర కాశ్యపగోత్రజుడు. ఈ కవి దాదాపు క్రీ.శ. 1460 ప్రాంతములవాడుగా చరిత్రకారుల నిర్ణయం. రామాభ్యుదయం రచించిన అయ్యలరాజు రామభద్రకవి కి ఈ కవి ముత్తాత అని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ఐతే తాత అయి ఉండవచ్చునని మరికొందరి అభిప్రాయం. ఈ కవి వంశంలో అందరు కవులే. ఐతే ఈతని రచనలేవియో తెలియటం లేదు.
శా. ఆకర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబులో
నాకావ్యంబులు మెచ్చఁ జేసితివి నానారాజులుం జూడఁగా
నీకుం బద్యము లిచ్చుచో నిపుడు వాణీదేవి నాజిహ్వకున్
రాకుం డెట్లు వసించుఁ గాక రఘువీర జానకీనాయకా!
అనే పై పద్యం గమనిస్తే ఈ కవి రాజులచేత సన్మానములు పొందినట్లు తెలుస్తున్నది. ఐతే ఈ కర్ణాటకమండలాధిపతి అనేది ఎవరనేది ఇంకా తేలని విషయం. ఈ కవి వంశంలోని వారు వైష్ణవులని, శ్రీరామ భక్తులని వీరి రచనలవలన మనకు తెలుస్తున్నది. అదేవిధంగా ఈ కవిని తరువాతికవులు అనేకులు తమ కావ్యాలలో ప్రస్తావించటం ద్వారా ఈకవి ఆనాటి సాహిత్యకారులలో ప్రసిద్ధికెక్కినవాడుగా తెలుస్తున్నది. ఈకవి ఆంధ్రమహాభాగవతకర్త పోతనామాత్యునికి సమకాలికుడు కావటంవలన ఆతని పోకడలు ఈశతకంలో గోచరిస్తాయి. లక్ష్ణకారులు కూడా ఈశతకంలోని పద్యాలను తమ కావ్యాలలో ఉదాహరిచటం ఈశతక ప్రాముఖ్యాన్ని తెలియచేస్తుంది.
శతక పరిచయం:
ఒంటిమిట్ట రఘువీరశతకం శార్ధూల మత్తేభ వృత్తాలలో, 108 పద్యాలతో, రఘువీర జానకీనాయకా" అనేమకుటంతో చెప్పిన భక్తిరస ప్రధాన శతకం.
శా. తారుణ్యోదయ యొంటిమెట్ట రఘునాథా నీకు నేఁ బద్యముల్
నూఱున్ జెప్పెద నూరఁ బేరువెలయున్ నూత్నంబుగా నంత నా
నోరుం బావన మౌను నీకరుణఁ గాంతున్ భక్తి నన్నందఱున్
రారమ్మందురు గారవించి రఘువీర! జానకీనాయకా!
ఈశతకంలో అనేకపద్యాలు కేవలం రామనామ శబ్ధమాహత్మ్యము తెలిపేవే. ఈ క్రింది పద్యాలను గమనించండి.
శా. గోమేధాధ్వర యశ్వమేధశతముల్ గోదానభూదానముల్
హేమాద్రుల్ తిలపర్వతంబులు సువర్ణేభాశ్వదానంబులున్
నీమంత్రం బగు నక్షరద్వయమునే నీపుణ్యముం బోలవో
రామా రాఘవ రామభద్ర రఘువీర జానకీనాయకా!
మ. మమకారంబున సర్వకాలమును నీమంత్రంబు వాక్రుచ్చు డెం
దము నాకుం గలుగంగని మ్మటులనైనన్ మృత్యువక్త్రమ్ము దూ
ఱము నిన్నున్ మతి దూఱ మంత నపవర్గస్వర్గమార్గంబు దూ
రము గాకుండును మాకుఁ జేర రఘువీర జానకీనాయకా!
ఈతడు శ్రీవైష్ణవము స్వీకరించినట్లు ఈ క్రిందిపద్యంవలన తెలుస్తున్నది. చక్రాంకితమని ముద్రల కాల్చి శరీరమున నంటించు వైష్ణవాచారము నీతడు వర్ణించిన విధం చూడండి.
మ. చెలువంబొప్ప సువర్ణముద్ర లితరుల్ చెల్లించుటే క్రొత్త కా
కల నీ ముద్రలుచూడఁ జెల్లుబడి చక్రాలంచు వేయించు మం
డలనాథాగ్రణి క్రొత్త నీబలిమి నానావర్ణంపు దోలు ము
ద్రలు చెల్లించితి విందు నందు రఘువీరా! జానకీనాయకా!
రాజులకు కృతులు సమర్పించుటను పోతనకవివలె నిరసించెను.
మ. క్షితిలో నల్పులమీదఁ జెప్పిన కృతుల్ చీ చీ నిరర్థంబులౌ
నుతికిం బాత్రముగావు మేఁకమెడ చన్నుల్ నేతిబీరాకులున్
వితతప్రౌఢిని నీకుఁ జెప్పినకృతుల్ వేదాలు శాస్త్రాలు భా
రతరామాయణముల్ దలంప రఘువీరా! జానకీనాయకా!
పై పద్యంలోని మేకమెడ చన్నుల్, నేతిబీరాకులున్ వంటి జాతీయాలను గమనించండి. ఇటువంటి ప్రయోగములు ఈకవికి వెన్నతో పెట్టిన విద్య.
అప్పటికాలంలోని వీరశైవానికి ధీటుగా వీరవైష్ణవపద్ధతిలో ఈ కవి చెప్పిన కవిత్వం ఆనాటి సామాజిక పరిస్థితులను మనకు గుర్తుచేస్తుంది.
శా. నీమంత్రంబు సదా సదాశివుఁడు పత్నీయుక్తుఁడై కాశిలో
నేమఁబొప్ప జపించునంచు శ్రుతులన్నిన్ నిన్నె వర్ణింపఁగా
నేమా నిన్ను నుతించువార మయినన్ నేవ్నేర్చిన ట్లెన్నెదన్
రామా రాఘవ రామభద్ర రఘువీర! జానకీనాయకా!
శా. గోమాంసాశని మద్యపాని సగరిన్ గొండీఁడు చండాలుఁడున్
హేమస్తేయుఁడు సోదరీరతుఁడు గూ డేకాదశిన్ భుక్తిఁ గాం
చే మూఢాట్ముఁడు లోనుగాఁ గలుగు దుశ్శీలాత్ముఁడైనన్ దుదిన్
రామా యన్నను ముక్తిఁ గాంచు రఘువీర! జానకీనాయకా!
మ. కొడుకు ల్భ్రహ్మలు కూఁతు రీశ్వరశిరఃకూటంబుపైఁ గాపురం
బుడురాజుం దినరాజుఁ గన్ను లహిరా జుయ్యాలమంచంబు నీ
పడతుల్ శ్రీయు ధరిత్రియున్ సవతు చెప్పన్ పేరు నీ కన్యులా
రడి మార్త్యు ల్గనలేరు కాక రఘువీర! జానకీనాయకా!
మ. జననాధా గ్రణి నిన్నుఁ గొల్చునతఁ డాచండాలుఁడైనన్ బున
ర్జననం బొందక ముక్తిఁ గాంచు నొనరన్ సద్భక్తుఁడైనన్ దుదిన్
జనుఁ జండాల కులంబులోన నుదయించం గోరి నీనామకీ
ర్తన సేయన్ నిరసించెనేని రఘువీర! జానకీనాయకా!
ఈశతకంలోని పద్యాలు ఈతర కావ్యాలకు అనుకరణలు గా కనిపిస్తున్నాయి.
ఉదాహరణకు పైన చెప్పిన "కొడుకు ల్బ్రహ్మలు " అనే పద్యం పోతనామాత్య ప్రణీత నారాయణశతకంలోని " ధరసింహాసనమై" అనే పద్యానికి అనుకరణము. అలాగే భాగవతమునందలి " ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై " కి అనుకరణమైన ఈ పద్యం చూడండి.
మ. పరనారీకుచకుంభపాళికలపైఁ బాదబ్జయుగ్మంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపైఁ
బరువుల్ పాఱెడు నా తలంపులు మిమున్ భావింపఁగా జేసి స
ర్వరసాధీశ్వర నన్నుఁ బ్రోవు రఘువీరా! జానకీనాయకా!
శంకరాచార్య విరచిత భజగోవింద శ్లోకమునకు అనుకరణగా ఉన్న ఈ పద్యంచూదండి
శా. బాలత్వంబునఁ గొంతకాలము వృథాప్రాల్మాలి దుర్భుద్ధినై
జాలన్ యౌవ్వనమందు గర్వమతినై సంసారినై దుష్క్రియా
జాలభ్రాంతి జరింతుఁ గాని నిను గాంక్షం గొల్వలే దయ్య హే
రాళంబైనది చింతవంత రఘువీరా! జానకీనాయకా!
ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ క్రింది పద్యం చూదండి
రవిసూనున్ బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినాఁ డందునో
రవిసూనున్ గృపనేలి యింద్రసుతుఁ బోరం ద్రుంచినాఁ డందునో
యివి నీయందును రెండునుం గలవు నీకేదిష్టమో చక్కఁగా
రవివంశాగ్రణి తెల్పవయ్య రఘువీరా! జానకీనాయకా!
ఇంతచక్కని పద్యాలతో అలరించే ఈ శతకం ప్రతి వొక్కరు చదవాల్సిన అద్భుత సాహిత్యం. మీరు చదవండి. మీ మిత్రులచే చదివించండి.
***
No comments:
Post a Comment