శ్రీ దత్తాత్రేయ వైభవం - 4
శ్రీరామభట్ల ఆదిత్య
శ్రీ స్వామివారి జీవిత విశేషాలను తెలుపుతూ ప్రధాన శిష్యగణంలోని శ్రీసిద్ధ సరస్వతి స్వామివారు సంస్కృతంలో 'గురు చరిత్ర' గా పుస్తకం రచించారు. ఈ పుస్తకాన్నే శ్రీ గంగాధర్ సరస్వతి గారు మరాఠీలోకి అనువదించారు. ఇది నిత్యపారాయణ గ్రంథం. గురు చరిత్ర గ్రంథరాజాన్ని తెలుగులో ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అనువదించారు.
స్వామివారి అవతార సమాప్తి కూడా చాలా విచిత్రంగా జరిగింది. స్వామి వారు గాణుగాపురాన్ని వదిలి తన ఏడుగురు శిష్యులతో సహా భీమా మరియు ఆమ్రజా నదుల సంగమ స్థలికి చేరుకున్నారు. అక్కడి ప్రసిద్ధ అశ్వథ్ధ వృక్షాన్ని చూపిస్తూ స్వామివారు " ఈ వృక్షాన్ని భక్తితో పూజించి తపమాచరించండి, మీ కోరికలన్నీ తీరుతాయి, మీ జీవన్ముక్తి మార్గమౌతుంది " అని అన్నారు. తరువాత తన అవతార పరిసమాప్తి గురించి స్వామివారు తన శిష్యులకు వివరించారు.
బాధాతప్త హృదయాలతో శిష్యులు స్వామి వారికి అరటి ఆకులతో చిన్న తెప్పను తయారుచేసి దానిని పూలతో అలంకరించి, దాన్ని నదిలో ఉంచారు.... ఆ అరిటి తెప్పను అధిష్టించిన స్వామి తన చివరి ఆశ్వీర్వాదంగా గ్రామ ప్రజలను సంబోధించారు. శ్రీ స్వామి అక్కడి వారిని ఉత్సాహపరుస్తూ ఇలా అన్నారు " నేను ఈ తెప్ప మీద శ్రీశైలానికి దగ్గరలోని కదళీ వనానికి వెళుతున్నాను. నేను అక్కడ క్షేమంగా చేరాను అనడానికి చిహ్నంగా, ఈ నదీప్రవాహానికి ఎదురుగా పూలు తేలుతూ కనిపిస్తాయి ".
స్వామివారు వెళ్ళే సమయానికి గ్రామ ప్రజలు అందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ స్వామివారిని సిద్ధంగా లేకపోవడంతో వారికి ధైర్యం చెబుతూ స్వామి " బాధపడకండి! నేను నా భక్తులను విడిచి ఎక్కడికీ వెళ్ళను. భౌతికంగా కదళీ వనంలో ఉన్నా, నా స్వరూపం ఇక్కడే తిరుగాడుతూ ఉంటుంది. నేను ప్రతీ రోజూ మధ్యాహ్నం మీ అందరి నుండే భిక్షను స్వీకరిస్తాను. ఇక్కడి నదిలో స్నానం చేసి, ఈ వృక్షాన్ని పూజించిన, నా పాదుకా దర్శనం చేసిన వారిని నేను తప్పక అనుగ్రహిస్తాను.
నిజంగానే స్వామి వారు శ్రీశైలం చేరగానే అక్కడి నదిలో ప్రవాహానికి వ్యతిరేక దిశలో పూలు తేలిపైకి రావడం ప్రారంభమైంది. ఇలా స్వామివారు తమ అంతిమ సమయంలో కూడా లీలావిశేషాలను చూపి అక్కడి వారిని అనుగ్రహించారు.
కారంజ క్షేత్రం మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఉన్నది. మనకు స్కంద పూరాణంలోని పాతాళ ఖండంలో ఈ క్షేత్ర వర్ణన కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో కారంజ మహర్షి ఉండేవారు. కారంజ వనంలో ఉండడం చేత పతంజలి మహర్షికి ఈ పేరు వచ్చింది. వశిష్ఠ మహర్షి శిష్యుడైన శ్రీ పతింజలి తన కుటీరంతో శిష్యగణంతో సహా ఉండేవారు.
ఈ కారంజ వనంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉండడం చేత గంగామాతకై మహర్షి ప్రార్థన చేయగా సంతసించిన రేణుకా దేవి అన్ని పవిత్ర నదుల నీటితో పావనమైన ఒక కుండాన్ని సృష్టించింది. ఈ కుండమే 'ఋషి తాలావ్' గా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడ ప్రసిద్ధ 'బేంబ్లా' నది కూడా ఉద్భివిస్తుంది. జైనులకు కూడా ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది.
ఇక తరువాతి ప్రసిద్ధ దత్త క్షేత్రం గాణుగాపురం. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్ పూర్ తాలూకాలో ఉంది గాణుగాపురం. భీమా మరియు అమ్రజా నదుల ప్రవిత్ర సంగమ స్థలి అయిన ఈ క్షేత్రంలో స్వామివారి పాదుకలున్నాయి. అక్కడి నిర్గుణ మఠంలో ఉన్న ఈ పాదుకలను నిర్గుణ పాదుకలు అని కూడా అంటారు. ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం గురించి శ్రీ గురు చరిత్రలోని 49వ అధ్యాయంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
స్వామి వారు చెప్పినట్టుగానే ఇక్కడ మధ్యాహ్న భిక్షకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా కనీసం ఐదు ఇళ్ళలో మధ్యాహ్న భిక్ష స్వీకరించడం పరిపాటిగా మారింది. ఈ విషయాన్ని మనం శ్రీ గురుచరిత్రలోని 21 - 22 అధ్యాయాలలో తప్పక గమనించవచ్చు.....
గురుమధ్యే స్థిత౦ విశ్వ౦ విశ్వ మధ్యే స్థితో గురుః। గురుర్విశ్వ౦ నచాన్యోస్తితస్మై శ్రీగురవే నమః॥
దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24 తత్త్వాలను తన గురువుగా స్వీకరించారు.
జగత్తుకూ, ప్రకృతికీ తానే గురువైనా మనందరిలో ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24 తత్త్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు అవి...
1) ఆకాశం
2) భూమి
3) అగ్ని
4) జలం
5) వాయువు
6) సూర్యుడు
7) చంద్రుడు
8) పావురం
9) కొండ చిలువ
10) తేనెటీగ
11) భ్రమరం ( తుమ్మెద )
12) సముద్రం
13) రాబందు
14) సాలీడు
15) ఏనుగు
16) జింక
17) చేప
18) పసి పిల్లవాడు
19) కన్య
20) పాము
21) లోహపు పనివాడు
22) ఎలుగుబంటి
23) వేశ్య
24) చిమ్మట
ఇవన్నీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , పంచ తన్మాత్రలు, మిగిలిన నాలుగు మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలు. ఆ ఙ్ఞానమూర్తి అవ్యక్త రూపంలో వీటన్నిటిలో ఉన్నట్టుగా చెప్తారు.
ఈ ప్రకృతి తత్త్వాలను దత్తాత్రేయుడు ఎలా గురువుగా స్వీకరించాడో వచ్చే నెల తెలుసుకుందాం... ( ఇంకా వుంది )
No comments:
Post a Comment