శ్రీరామకర్ణామృతం - 8 - అచ్చంగా తెలుగు

శ్రీరామకర్ణామృతం - 8

Share This

శ్రీరామకర్ణామృతం - 8

డా.బల్లూరి ఉమాదేవి.


71.శ్లో: రఘునందన ఏవదైవతం నో
రఘువంశోద్భవ ఏవ దైవతం నః
భరతాగ్రజ ఏవ దైవతం నో
భగవాన్ ఏవ రాఘవ ఏవ దైవతంనః.
తెలుగు అనువాదపద్యము:
చం:నరవర శేఖరుండు రఘునందనుడే పరదైవతంబు శ్రీ
వరుడుపరేశుడైన రఘువంశ్యుడె మా పరదైవతంబు శ్రీ
హరి భగవంతుడైన భరతాగ్రజుడే పరదైవతంబు మా
కరయగ రామభూవరుడహర్నిశలుంబరదైవతంబగున్.
భావము:రఘువంశశురాజులను సంతోషింపచేయు రాముడే మాకు దైవము. రఘువంశమునందు పుట్టిన రాముడే మాకు దైవము..భరతుని అన్నగారైన రాముడే మాకు దైవము.భగవంతుడైన రాముడేమాకు  దైవము.
72శ్లో:ఉత్ఫుల్లామలకోమలోత్పల దళశ్యామాయ రామామనః
కామాయ ప్రశమాయ నిర్మలగుణారామాయ రామాత్మనే
ధ్యానారూఢమునీంద్ర మానస సరో హంసాయ  సంసారవి
ధ్వంసా యాద్భుత తేజసేరఘుకులోత్తంసాయపుంసేనమః
తెలుగు అనువాదపద్యము:
మ:తత నీలోత్పల కోమలాంగునకు కాంతాసన్మనోహారి కం
చితమౌనీంద్ర మనస్సరోవర లసచ్ఛ్వేత చ్ఛదస్ఫూర్తిస
న్నుతికిన్ సద్గుణశాలికిన్ దురిత సందోహాటవీవహ్ని క
ద్భుత తేజస్కున కాజిసూనునకు సంతోషంబునన్ మ్రొక్కెదన్.
భావము:వికసించిన నిర్మలమైన కోమలములగు నల్లకలువ రేకులవలె నల్లనైనట్టియు సీతాదేవిమనస్సునకు చంద్రుడైనట్టియు శాంతి కల్గినట్టియు నిర్మలములైన గుణములచే పువ్వులతోటవలె నానందముచేయునట్టియు మనోహరస్వరూపుడైనట్టియు ధ్యానము నందిన మునులమనస్సులను మానససరస్సునకు హంసయయినట్టియు సంసారబాధను పోగొట్టునట్టియు ఆశ్చర్యమైన తేజస్సుగలట్టియు  రఘువంశశ్రేష్టుడైన పురుషుని కొరకు నమస్కారము.
73.శ్లో:రాజీవాయత లోచనం రఘువరంనీలొత్పలశ్యామలం
మందారాంచితమండపోసులలితే సౌవర్ణకే పుష్పకే
ఆస్థానేనవరత్నఖచితే సింహాసనేసంస్థితం
సీతాలక్ష్మణలోకపాల సహితం వందే మునీంద్రాస్పద మ్ .
తెలుగు అనువాదపద్యము:
శా:మందారస్థలహేమరత్నమయపద్మద్యోతసత్పుష్పకం
బందున్  నైజసభాశుభాసనమునందాసీనుడై మౌనిస
ద్బృందాశాధిపలక్ష్మణాస్పదుడు నై పృథ్వీసుతాయుక్తుడై
కందేందీ రవర్ణుడౌ రఘువరున్ కంజాక్షు సేవించెదన్.
భావము:పద్మమువలె విశాలములైన నేత్రములు గలిగినట్టియు రఘువంశ శ్రేష్టుడైనట్టియు నల్లగలువవలె నల్లనైనట్టియు మందారవృక్ష ములచేత నొప్పుచున్న మండపమందు సుందరమైన బంగారు పుష్పకమందు సభామంటపమందు రత్నస్థాపితమైన సింహాసనమమందున్నట్టియు సీతాదేవితోనూ లక్ష్మణునితోను లోకములనేలు నింద్రాదులతో గూడి మునిశ్రేష్టులకుస్థానమైన రామునకు నమస్కరించుచున్నాను
74.శ్లో:వల్లీ ప్రవాళ నవపల్లవ పాదపద్మం
కంజేక్షణం జలదనీల సరోరుహాభం
సీమంతినీ నయనమోహన మూలమంత్రం
రామం నమామి ముని మానస రాజహంసమ్.
తెలుగు అనువాదపద్యము:
చ:కిసలయవిద్రుమారుణత గేరుపదాంబుజయుగ్ముమౌని మా
నససరసీమరాళము ఘన ప్రతిమానవినీలుమానినీ
విసరవిలోచనాంబురుహవిశ్రుతమోహనమంత్రమున్ మహా
త్ము సరసిజాక్షు భక్తజనతోషకరున్ రఘురాము గొల్చెదన్.
భావము:తీగలవలె మృదువై పగడములవలె చిగుళ్ళ వలె నెర్రనైన పాదపద్మములు గలిగినట్టియు పద్మములవంటి నేత్రములు కల్గినట్టియు మేఘములవలె నల్లగలువలవలె ప్రకాశించుచున్నట్టియు స్త్రీల నేత్రములను మోహపెట్టు ప్రధాన మంత్రమైనట్టియు మునుల మనస్సనెడి మానస సరస్సునకు రాజహంసయైనట్టియురామునకు నమస్కరించుచున్నాను.
75.శ్లో:అలం వివాదేన  నమానుషో౾యం
రామాత్మనా రక్షస మర్ధనాయ
భుజంగ  శయ్యాం పరిముచ్య
సాక్షాన్నారయణో భూతల మాజగామ
తెలుగు అనువాదపద్యము:
చ:కలహమికేల మానవుడు గాడుసుమీరఘురామచంద్రుడీ
యిల జనియించె రాక్షసులనేపడగింపభుజంగ తల్పమున్
దొలగిజగన్నియంతయగు తోయజనాభుడు దృష్టి పాత్రుడైసలలితమౌ మహామహిమసర్వజగంబులు సన్నుతింపగన్.
భావము:వివాదము చాలు.ఇతడు మనుష్యుడు కాడు.సాక్షాత్తుశ్రా మన్నారాయణమూర్తి శేషశయ్యను విడిచి రాక్షససంహారముకొరకు శ్రీరామ రూపమున భూమిని పొందెను.
76.శ్లో:లోకత్రాణానుకారీ దశవదన శిరః పంక్తి విచ్ఛేదకారీ
లంకాలంకారహారీ భృగు తనయ మస్సర్వగర్వాపహారీ
సీతా సీమంతకారీ మణిమయమకుటో దివ్యకోదండధారీ
శ్రీరామః పాపహారీశమయతు దురితం భూమిభారాపహారీ.
తెలుగు అనువాదపద్యము:
మ:భువనత్రాణు దశాస్యకంఠ విలుఠద్భూరి ప్రభావాఢ్యు దా
నవరాట్పట్టణవైభవాపహరు సన్మాణిక్యకోటీరు భా
ర్గవ గర్వాపహరున్ ధనుర్ధరు ధరాకన్యాను సారిన్ హరిన్
భువిభారాపహు రాముగొల్తు దురితంబుల్ పాపి రక్షింపగన్.
భావము:లోకసంరక్షణము చేయునట్టియు రావణుని శిరసులవరుసను దెగగొట్టినట్టియు లంకాపట్టణపు శోభను హరించినట్టియు పరశురాముని మనోగర్వమంతయు హరించినట్టియు సీతాదేవి పాపటను దిద్దునట్టియు మాణిక్యకిరీటము కల్గినట్టియు ప్రశస్తధనుస్సును పూనినట్టియు పాపమును హరించునట్టియు భూమిబరువును పోగొట్టునట్టియు రాముడు పాపమును శాంతింప చేయుగాక.
77.శ్లో:బ్రహ్మాది యోగిమునిపూజిత సిద్ధమంత్రం
దారిద్ర్యదుఃఖ భవరోగవినాశమంత్రమ్
సంసారసముత్తరణైక మంత్రం
వందే మహాభయహరం రఘురామమంత్రం.
తెలుగు అనువాదపద్యము:
ఉ:సారసగర్భ యోగిముని సంస్మరణీయము దుఃఖ రోగ సం
హారకమున్దరిద్ర కలుషాపహమున్ భయవారకంబు సం
సారపయోధి తారకముసర్వసుపర్వ మనోవిహారమున్
శ్రీరఘురామ మంత్రము గురించి నమస్కృతులాచరించెదన్.
భావము:బ్రహ్మమొదలగు యోగులచేమునులచే
పూజింపబడుమంత్రమును  లేమి చేతనైన కష్టమును సంసారరోగమును నశింపచేయుమంత్రమును సంసారసముద్రము దాటు మంత్రమును గొప్పభయమును పోగొట్టు రామమంత్రమును నమస్కరించెద.
78.శ్లో:శత్రుచ్ఛేదైక మంత్రం సరసముపనిషద్వాక్య
సంపూజ్యమంత్రం
సంసారోత్తారమంత్రంసముచితసమయేసంగనిర్యాణ మంత్రం
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసందష్ట సంత్రాణమంత్రం
జిహ్వేశ్రీరామమంత్రంజపజపసఫలంజన్మసాఫల్యమంత్రం.
తెలుగు అనువాదపద్యము:
మ:ఉరుసంసార సముత్తరంబు నిగమాంతోక్త్యర్చితంబున్ సమ
స్తరిపు ధ్వంసము జన్మపావనముగాసత్సంగ వేళా సము
చ్చరితంబున్వ్యసనాహి దష్ట జనరక్షాదక్షమై శర్మదం
బరుదౌ శ్రీ రఘురామమంత్రమును జిహ్వా భక్తిఁగీర్తింపుమా.
భావము:శత్రువుల గొట్టు ముఖ్య మంత్రమును సరసమై నుపనిషద్వాక్యములయందు పూజింపబడు మంత్రమును సంసారము దాటించు మంత్రమును  సంసార సంగమును పోగొట్టు మంత్రమును అన్ని యైశ్వర్యములలో ముఖ్యమైన మంత్రమును ద్యూతాది వ్యసనములను పాముచే కరువబడిన  వారిని రక్షిం చుమంత్రమును ఓనాలుకా తగు సమయమందు జపింపుము.
79.శ్లో:ఆకర్ణమారూఢ ధనుర్గుణాఢ్యం
బ్రహ్మాస్త్ర ఖండీకృత రాక్షసేంద్రం.
రథాధిరూఢం రణరంగ ధీరం
రామం భజే రక్తసరోరుహాక్షం.
తెలుగు అనువాదపద్యము:
శా:పాకారాతి రథంబు నెక్కి రణభూభాగంబు కంపింపగా
నాకర్ణాంత ధనుర్విముక్త ధృడబ్రహ్మాస్త్రంబునన్
రావణున్
లోకశ్రేణి నుతింప ద్రుంచినబుధశ్లోకున్ సరోషాంబకున్
గాకుత్ స్థాన్వయదుగ్ధ వారినిధి రాకాచంద్రు గీర్తించెదన్.
భావము: చెవి పర్యంతము లాగబడిన వింటినారితోకూడినట్టియు బ్రహ్మాస్త్రముచే సంహరింబబడిన  రావణుడు గలిగినట్టియు
రథమునెక్కినట్టియు,యుద్ధమునధైర్యవంతుడైనట్టియు  ఎర్రతామరవంటి  నేత్రములు గలట్టియు రాముని సేవించుచున్నాను.
80:శ్లో:ఏతౌ తౌ దశకంఠకంఠకదళీ కాంతార
కాంతి చ్ఛిదౌ
వైదేహీ కుచకుంభకుంకుమలసత్సంకారుణాలంకృతౌ
విశ్వత్రాణనిదాన సాధుసవనప్రారంభయూపౌ భుజౌ
దేయాస్తామురు విక్రమౌ రఘుపతే శ్రేయాంసి భూయాంసి నః.
తెలుగుఅనువాదపద్యము:
మ:కలుషనిశాచరేంద్ర దశకంధర కంధరకాననచ్ఛిదో
జ్జ్వలితము లుర్విజోరు కుచచర్చితకుంకుమ పంకిలారుణం
బులు భువనావనప్రకట భూరిమహాధ్వర యూపముల్ దినేట్కులభవదీయబాహువులు
కోరినకోర్కెలు నిచ్చు నిచ్చలున్.
భావము:రావణుని కంఠములనెడి యరటి తోట యొక్కశోభను దెగవేసినట్టియు సీత యొక్క స్తనములయందలి కుంకుమపు బురదచేత  నెర్రగా నలంకరింపబడినట్టియు ప్రపంచ సంరక్షణకు కారణమైన యోగ్యకార్యములనెడు యజ్ఞమున నారంభించు యూపస్తంభములైనట్టివియు గొప్పపరాక్రమము గలట్టివియు  నగునీచేతులు   మాకుగొప్ప శుభములనిచ్చుగాక.
( సశేషము. )

No comments:

Post a Comment

Pages