నాకు నచ్చిన కధ-సుఖాంతం-శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి
టీవీయస్.శాస్త్రి
సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో సుఖాంతం,బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం,ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.ఛాయాదేవి గారు వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ
విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి
తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది.
*****
నిద్ర సమయానికి నిద్రపోకపోతే అది నిద్రా భంగం అవుతుంది. మళ్ళీ నిద్ర పట్టటం చాలా కష్టం.ఆ నిద్ర కోసం మధ్యతరగతి గృహిణులు ఎంత వేచి చూస్తున్నారో, మనందరికీ తెలుసు!పగలంతా చాకిరి చేసి వళ్ళు పులిపోయిన స్త్రీకి కావలసింది నిద్రే!ఆమెకు ఎంతసేపటికీ నిద్ర రావటం లేదు.రాత్రి పడుకోబోయే ముందర ఒక నిద్ర మాత్రను కూడా వేసుకుంది. అయినా నిద్రాదేవి కరుణించలేదు.ఇంట్లో ఆమె ఒక్కతే ఉంది,భర్త వేరే పనిమీద ఊరికి వెళ్ళాడు.పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి!వారందరూ తలా ఒక చోట ఉన్నారు.ఈ యాంత్రిక జీవితంలో వారికి తల్లి తండ్రులను గురించి ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు.ఎంతో కాలంగా నిద్రకు దూరమైన ఆమెకు ఈ రోజు నిద్ర మీద విపరీతమైన కోరిక కలిగింది. హాయిగా శవంలాగా నిద్రపోవాలనిపించింది ఆమెకు. ఎన్నాళ్ళగానో తీరని కోరిక అది.
చిన్నప్పుడు నిద్రపోతుంటే ముఖం మీద నీళ్ళు పోసి మరీ లేపేది తల్లి చదువుకుంటానికి. నిద్ర మత్తుతోనే స్కూల్ కు వెళ్ళేది.ఆదివారమైనా హాయిగా పడుకుందామని అనుకుంటే ,తలంటు స్నానం అని మరీ కొట్టి లేపేది తల్లి. ఈడొచ్చిన తర్వాత ,వయసొచ్చిన ఆడపిల్ల అంత నిద్ర పోకూడదని లేపేవారు! పరీక్షలప్పుడు ఇక చెప్పేదేముంది?తల్లితండ్రులు వంతులవారీగా మేల్కొని బలవంతంగా చదివించేవారు. ఇక లాభం లేదనుకొని,పెళ్లైన తర్వాత హాయిగా నిద్రపోవచ్చని అనుకుంది ఆమె.ప్రణయంలో అలసిపోయిన ఆమెకు కునుకు పడుతుండగానే పాలవాడు వచ్చి తలుపు కొట్టుతాడు. ఇంతలో పంపు నీళ్ళు వస్తున్నాయని ఇంటిగల ఆవిడ కేకలు వేస్తుంది. ఇక నిద్ర రాదు ,పోవటానికి అది సమయమూ కాదు! భర్తకు అల్పాహారాన్నిచేసిపెట్టి ఆయన్ని ఆఫీసుకు పంపాలి. ఇక అంతా ఖాళీగా అని అనుకోవటానికి వీల్లేదు!మధ్యాహ్నం కాసేపు కునుకు తీసే వేళకి ఏ పోస్ట్ మానో తలుపు తట్టి లేపుతాడు.పక్కింటి వాళ్ళు కబుర్లకు వస్తారు!ఆకతాయి పిల్లలు కాలింగ్ బెల్ నొక్కి పారిపోతారు!ఇదంతా అయ్యేసరికి పనిమనిషి అంట్లు తోమటానికి వస్తుంది. ఇలా నిద్రకోసం పరితపిస్తుండగానే పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళు మేలుకున్నప్పుడు ఆమెను నిద్రపోనివ్వరు,ఆమె నిద్రపోదామనుకుంటే వాళ్ళు మేలుకొని ఉంటారు. వాళ్ళు పెద్దైన తర్వాత వారి చదువులకోసం మేల్కొనాలి. వాళ్లకు వయసొచ్చిన వేళ వాళ్ళు ఆలస్యంగా ఇంటికి చేరుకుంటే అదో బెంగ!వాళ్ళు ఇంటికి వచ్చేదాకా మేల్కొనాలి!వాళ్లకు వివాహాలు అయిన తర్వాత పిల్లల పురుళ్ళ కోసం,పసిపిల్లల ఆలనా పాలన కోసం మేల్కొనాలి!ఇలా ఇంకా ఎంతకాలం నిద్ర లేకుండా ఉండాలి?ఆమెకు జీవితం మీదే విరక్తి పుట్టింది. ఈ రోజు అయినా కంటి నిండా నిద్రపోవాలి!పైగా భర్త కూడా ఊళ్ళో లేదు!అయినా నిద్ర రావటం లేదు. మరో నిద్ర మాత్ర వేసుకుందామని సీసాను చేతిలోకి వంపుకుంది . సీసాలోని మాత్రలన్నీ ఆమె చేతిలో పడ్డాయి!ఆ మాత్రలు తమని తీసుకొమ్మని ఆమెను ఆహ్వానిస్తున్నాయి. ప్రతి మాత్రలో నిద్ర ఉంది. అన్ని మాత్రాల్లో ఉన్న నిద్రంతా ఆమెకు కావాలి!ఆమె భర్తకు ఒక చిన్న చీటీ రాసి పెట్టింది.ఆ చీటిలో ,"ఏమండీ ఆత్మహత్య చేసుకున్నాని అనుకోకండి!నిజంగా నిద్ర కోసం నిద్ర పోతున్నాను!" అని ఉంది.
కధ అయిపొయింది!
****
నిజానికి ఈ కధ దు:ఖాంతం !అయితే రచయిత్రి ఈ కధకు 'సుఖాంతం'అనే పేరు పెట్టింది. సగటు స్త్రీకి అది సుఖాంతమే అని ఆమె భావన!ఈ కధలో 'ఆమెకు' పేరు పెట్టకపోవటానికి కారణం ఆమె సగటు స్త్రీకి ప్రతీక అని! చాలా ఇళ్ళల్లో ఇటువంటి స్త్రీలు ఉంటారు!మనింట్లోనే ఉంటారు.స్త్రీ కూడా ఒక మనిషే. ఆమెకు కూడా మెదడు ఉంది. దానికి కూడా ఆలోచనలు ఉన్నాయని చలం చెప్పిన మాటలు పురుషాధిక్యపు ప్రపంచానికి ఆయన వేసిన కొరడా దెబ్బలు!అయినా స్త్రీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు!ఏదో కొంతమంది ధనవంతులయిన స్త్రీలకు మాత్రమే స్వంతమైన సుఖాలు, స్వేచ్ఛ చాలామంది స్త్రీలకు ఇంకా తీరని కోరికలుగానే మిగిలిపోయాయి. ఆఖరికి చిన్న చిన్న కోరికలకు కూడా దూరమౌతున్నారు చాలామంది స్త్రీలు.ఈ కధలో ఒక స్త్రీ నిద్రకోసం జీవితమంతా ఎలా పరితపించి చివరికి తన జీవితానికి ఎలా ముగింపు ఇచ్చిందో తెలుసుకుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది.మన ఇంట్లో స్త్రీలకైనా ఈ చిన్నచిన్న కోరికలనుండి దూరం చేయకుండా జీవితాన్ని ప్లాన్ చేసుకుందామని ఈ కధ మీకు చెబుతున్నాను!గమ్మత్తు ఏమంటే,ఈ కోరికలు ఆర్ధికమైనవి కూడా కావు!కధలో మీరే చూసారుగా! స్త్రీలకు ఉన్న అటువంటి సమస్యలను గుర్తించి వారి కధలను నిజంగా సుఖాంతం చేయటం మన కర్తవ్యం ,బాధ్యత.
ఇంత మంచి కధను అందించిన శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారికి ధన్యవాదాలతో!
***
No comments:
Post a Comment