ఋషి పుంగవుడు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారు
టి.వి.ఎస్.శాస్త్రి
కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి వారు ఒక సందర్భంలో ఇలా చెప్పారు-‘’నాకోసం మీరు కంచికి రావలసిన పని లేదు.చందోలులోనే దేవీ ఉపాసకులు తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారున్నారు,వారిని దర్శించండి. ఆ దర్శనం సు'దర్శనం'!‘’అని అంటే శాస్త్రి గారి ఎంతటి మహిమాన్వితులో మనమర్ధం చేసుకొనవచ్చును.శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారు,
తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి ,హనుమమ్మ దంపతులకు 1896 ఆగస్ట్ 25 న జన్మించారు. నిష్టాగరిష్ట కుటుంబం వారిది.19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ,పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతి గారితో వివాహమైంది .ఆమె పేరును శ్రీ దేవిగా శాస్త్రిగారు మార్చారు. శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశమైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకోలేదు.బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు ఒక ఆధునిక ఋషి,కవి,మంత్రోపాసకుడు, వేదాంతి,పురాణ ప్రవచన కారుడు,వీటన్నిటినీ మించి పూర్తిగా భగవంతునినే నమ్మి బ్రతుకంతా ఒక తపస్సుగా,యజ్ఞంగా జీవితాన్ని గడిపిన కర్మిష్ఠి ,నిగర్వి,నిరాడంబరుడు.
వీరిని 'చందోలు శాస్త్రి' గారిగా పిలుస్తుంటారు.చందోలు గ్రామం పొన్నూరు,రేపల్లె మార్గంలో ఉంది .ఈ గ్రామంలో ముస్లిములు ఎక్కువ. విశేషమేమంటే,ప్రతి ముస్లిం రైతు తన పొలం నుండి పండిన
పంటలోఒక బస్తా ధాన్యం,వీరి ఆశ్రమానికి చేరుస్తుంటారు.అన్ని మతాల సారం ఒకటేనని, ఆయన జీవన విధానంవల్ల వారు గ్రహించి, ఆయనను పరమ పూజ్యులుగా భావిస్తారు.కటిక దరిద్రం అనుభవించిన ఈ మహనీయుడు,తన విశ్వాసాల పట్ల ఎప్పుడూ పట్టు సడలించుకోలేదు.జీవితమంతా 'అమ్మవారి' సేవకే వినియోగించారు.అమ్మవారికి ఒకసారి, నైవేద్యం పెట్టటానికి ఇంట్లో ఒక పండు కూడా లేదు.కేవలం మంచి నీటినే మూడురోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టారు.దేశమంతా కాలినడకనే తిరిగి ఆధ్యాత్మిక పురుషలను కలుసుకున్నారు.వారి మన్ననలను పొందారు. అయితే,ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.ఇంటిలోని వారందరూ ఒంటిపూటే భోజనం చేసేవారు.పైగా ఆ రోజుల్లోనే,వేద విద్యాలయం కొరకు పదివేల రూపాయల అప్పుకూడా చేశారు.అది ఆ రోజుల్లో చాల పెద్ద అప్పుకింద లెక్క.అలా తిండిలేక,నీరుత్రాగి, అమ్మవారిని ఆరాధిస్తూ, ఒక రోజున సొమ్మసిల్లి పడిపోయారు.అంతలో వారికి స్వప్నంలో ఒక ఎనిమిది సంవత్సరముల వయసుగల ఒక బాలిక కనపడి,
"విచారించకు!రేపు ఒకతను పురాణం చెప్పమని వస్తాడు.అతని వెంట వెళ్లి పురాణం చెప్పు.నీకు అన్ని శుభాలు కలుగుతాయి."అని చెప్పి ఆ బాలిక అదృశ్యమయింది.ఆ మరుసటి రోజు ఉదయమే ఆ ప్రాంతానికి చెందిన జమీందారైన ఖాజీపాలెం సీతారామరాజు గారు బండి తీసుకొని వచ్చి శ్రీ శాస్త్రి గారిని తీసుకొని వెళ్ళారు. శ్రీ శాస్త్రి గారు చందోలుకు తిరిగి చేరకమునుపే, శ్రీ రాజుగారు శాస్త్రి గారి ఇంటికి ధాన్యపు బస్తాలను పంపారు.ఈ విషయం శ్రీ శాస్త్రి గారికి తెలియదు.ప్రవచనం పూర్తి అయిన తరువాత తిరిగి చందోలు వచ్చారు.ఇంటి తలుపు తట్టారు.వారి భార్య తలుపును గట్టిగా నెట్టి రమ్మని
చెప్పింది.ఎలాగో ఒకలాగు ఇంట్లోకి ప్రవేశించారు.చూసిన దృశ్యం వారిని ఆశ్చర్యచకితులను చేసింది.ఆ గదిమొత్తం ధాన్యపు రాశితో ఖాళీ లేకుండా ఉంది. ఆనాటినుండి వారు దివంగతులయ్యేవరకూ మరెన్నడూ దరిద్రం అనుభవించలేదు.పైగా అనేక నిరుపేద బ్రాహ్మణ విద్యార్ధులకు ఉపనయనాలు చేయించారు,మరి కొంత మందికి ఇళ్ళు కట్టించారు.వీరు రామాయణాన్ని పద్య కావ్యముగా వ్రాశారు.శ్రీ విశ్వనాధ వంటివారి ప్రశంసలు పొందిన కమనీయ కావ్యమది.దానికి విశ్వనాధ వారే 'ముందుమాట' వ్రాశారు.ఆయన మహిమలను గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.శ్రీ కంచి పరమాచార్య,ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు,వీరిని కలువకుండా వెళ్ళేవారు కాదు.వారిద్దరి మధ్య ఆధ్యాత్మికమైన సంభాషణ ,వారి కలయిక లేకుండానే జరిగేది.వారిని గురించి సంపూర్ణంగా చెప్పాలంటే,అది ఒక పెద్ద గ్రంధమౌతుంది.వారిని గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను మీకు తెలియచేస్తాను.ఒక సారి బాల్యంలో,వారు తన మేనత్త గారి ఇంటిలో వేరుశనగకాయలు తింటూవున్నారు.అదిచూసి వారి మేనత్త ,ఆచారపరులు వేరుశనగకాయలు తినకూడదు,అని మందలించింది.(హిందువులలో,శాకాహారులలో కొంత మంది భూమిలోపల పండేవాటిని తినరు.ఉల్లిగడ్డలు,దుంపకూరలు,వేరుశనగకాయలు లాంటివి తినరు.ఈ రోజుల్లో చాలా మంది దానిని పాటించటానికి వీలుగాక తింటుండవచ్చుకానీ,పార్సీలు నేటికీ వీటిని తినరు.ఈ మధ్య నేను అమెరికా వెళ్లినప్పుడు, విమాన ప్రయాణంలో కావలసిన ఆహారం,లభ్యమయ్యే ఆహారం గురించి తెలుసుకునే సమయంలో నాకు ఈ విషయం తెలిసింది.ఆసియన్ వెజెటేరియన్ కు ,పార్సియన్ వెజెటేరియన్ కు చాలా తేడా ఉంది.కారణం ఏమిటో నాకు తెలియదు.).అ రోజునుండి,శ్రీ శాస్త్రి గారు జీవితాంతం,వేరుశనగ నూనెను కూడా వాడలేదట.ఒకసారి రైలులో ప్రయాణించేటప్పుడు, కొంతమంది ఆకతాయి పిల్లలు వీరికి ఇబ్బంది కలిగించే విధంగా ధూమపానం చేస్తున్నారు.ఆనాటి నుండి,వారు రైలు ప్రయాణాలు కూడా మానుకున్నారు.అయితే, ఒక్కసారి మాత్రం కాశీకి రైలు ప్రయాణం ద్వారానే వెళ్ళారు. ఏడుగురు ఆడ సంతానం కలిగిన అనేకులు వీరి వద్దకువెళ్లి వీరిచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకొని పుత్రవంతులయ్యారు.రెండవనెల గర్భవతిగా ఉన్నప్పుడే,అటువంటి స్త్రీకి ముక్కులో ఏదో పసరు పోసేవారు.నేను తెనాలి,పొన్నూరులలో పనిచేయు సందర్భంలో వీరిని పలుమార్లు దర్శించుకునే భాగ్యం కలిగింది.అందరినీ ప్రేమతో పలకరించేవారు.ప్రసన్నవదనం.మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే దివ్య మంగళస్వరూపం.ఎందరికో 'శ్రీ విద్యను'ప్రసాదించిన ఈ ఆదునిక ఋషి, ఒక మరువలేని వ్యక్తి.ఒక చిన్న సంఘటనను గురించి చెప్పి ముగిస్తాను.ఆ రోజుల్లో శ్రీ చెన్నారెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.వారికి శ్రీ శాస్త్రి గారి ఋషితత్వ జీవనవిధానం నచ్చి,ప్రభుత్వ సహాయంగా వేద విద్యాలయానికి ప్రతి సంవత్సరమూ రెండులక్షల రూపాయల సహాయం అందేటట్లు ఏర్పాటు చేస్తానన్నారు.ఆ ప్రతిపాదనను శ్రీ శాస్త్రి గారు సున్నితంగా తిరస్కరించారు.కారణం వారి మాటల్లోనే వింటే బాగుంటుంది."ఇన్నాళ్ళు నాకు ఆర్ధిక పరిపుష్టిని,నలుగురికి సహాయం చేయగల శక్తి సామర్ధ్యాలను ప్రసాదించిన ఆ జగన్మాత ,ఇక ముందుకూడా నాకు అండగా ఉంటుంది.ఈ రోజు మీరు చేస్తానన్న సహాయాన్ని నేను అంగీకరించటం అంటే,నా'తల్లిని' నేను నమ్మకపోవటమే!" అని చెప్పారు.శ్రీ చెన్నారెడ్డి గారు వారికి సాష్టాంగ ప్రణామం చేసి వెళ్లారు.శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలంలో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం" చేసిన మహనీయులు.శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత
సంఘటనను గురించి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఇలా చెప్పారు ఒక సందర్భంలో ---
ఆయన ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా వచ్చి కూర్చునేదిట . ఒకసారి ఒకామె ఆయన వద్దకు వచ్చి తనకు సీతా మంత్రాన్ని ఉపదేసించమని కోరిందట . వారు చాలా కాలం సీతా
మంత్రోపాసన చేసి , తరువాత ఆవిడకి మంత్రోపదేశం చేసారట.ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కస్టాలు వస్తాయని విన్నాను, నిజమేనా అని అడిగిందట.వారు అలాంటప్పుడు అదే మంత్రం
కావాలని ఎందుకు అడిగావు ? సందేహాలుండకూడదు.కొంతకాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దనీ ,చాలా కష్టాల బారిన పడుతున్నాననీ వేడుకుందట .దానికి శాస్త్రి గారు అంగీకరించి,
కావలసిన జపాలు ఆయన చేసుకుని, ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలెయ్యి .ఇకనించీ మళ్ళీ దానిని జపించవద్దని చెప్పారట .ఆవిడ అలాగే చేసిందట .ఆ రాత్రి కలలో సీతమ్మ వారు శాస్త్రి గారికి కనిపించి , అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు ? ఇకనించీ నువ్వు పిలిస్తే నేను రాను అన్నదట . నిద్ర లేచి వారు పించారుట .కొన్నాళ్ళ తర్వాత , వారింట్లో శ్రీరామనవమి నాడు
రామపట్టాభిషేకం ఎప్పటిలాగే జరుపుతున్నారు . ఎక్కడెక్కడినుంచో శిష్యులు వచ్చి ఉన్నారు .శాస్త్రి గారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి ,తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట.
సీతమ్మ తల్లి రానని చెప్పిందిగా!ఎలా పిలవగలను ? అని చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయారట .చివరకి అతి కష్టం మీద సీతాం ఆవాహయామి అని అనగలిగారట .వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట .గద్గద స్వరంతో శాస్త్రి గారు 'రానన్నావు కదా తల్లీ . ఈ దాసుని మీద అంత దయా?' అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట .ఏం చెయ్యనురా ! శ్రీ రాములవారిని పిలిచావు ముందు . వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ ఎదుట .నేను రాకేం చెయ్యను ? అన్నదట ! ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి.
10-12-1990 ,ప్రమోదూత మార్గశిర బహుళ నవమి నాడు శాస్త్రిగారిని బాలాత్రిపురసుందరి అమ్మవారు తన ఒడిలోకి శాశ్వతంగా తీసుకొని పోయింది..వారి పార్ధివ దేహానికి దహన సంస్కారం చేస్తున్నప్పుడు అమ్మవారి ఆకారంగా చితిమంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు.ఆ ఫోటో చాలా మందివద్ద ఉండే ఉంటుంది.నా వద్ద కూడా ఈ మధ్య వరకూ ఉండేది.నాకున్న స్నేహితులలో కొందరు పుస్తక ప్రియులు ప్రేమతో దానిని దా(దో)చుకున్నారు.ఎవరి వద్దనైనా ఉంటే పంపుతే ఆనందిస్తాను!పత్రికల్లో పడిన చిత్రాన్ని ఈ క్రిందనే చూడగలరు!
No comments:
Post a Comment