అగస్త్యలింగ శతకము - తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు - అచ్చంగా తెలుగు

అగస్త్యలింగ శతకము - తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు

Share This

అగస్త్యలింగ శతకము - తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు

పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం. 
అగస్త్యలింగ శతక కర్త శ్రీ.తాడికొండ పూర్ణమల్లికార్జున అయ్యంవార్లు శా.శ. 1776 ఆనందనామసంవత్సరమున తెనాలి తాలూకా నందలి ఈమని గ్రామమున జన్మించారు. వీరు బ్రాహ్మణులు. భార్ద్వాజగోత్రము. ఆపస్తంబసూత్ర యజుశ్శాఖ. తలిదండ్రులు బుచ్చమాంబ, రాజలింగారాధ్యులు. ఈ కవికి పూర్ణయ్యశాస్త్రి అను వ్యావహారికనామము కూడా కలదు. వీరిది పండితవంశము. తండ్రి తాతలు కూడా ఉభయభాసలందు పాండిత్యమే కాక మంత్ర శాస్త్రములందును మంచి ప్రతిభకలవారు. ఈ కవి కూడా బాల్యము నుండి యుభయభాషాపాండితి నార్జించుటయేకాక సంగీత మంత్ర శాస్త్రములందు కూడా ప్రతిభ నార్జించెను. ఇతనీ లింగధారణ ఇచ్చిన గ్రువులు పండితారాధ్యుల రాజలింగారాధ్యులవారు. ఈ కవికి రాజమ్మ, భ్రమరాంబ అని ఇరువురు సోదరీమణులు.
ఈకవి అష్టవిధార్జనాపరతంత్రుడు. షట్కాల శివపూజా ధురంధరుడు. అనేకమంది శిష్యపరంపర కలవాడు. వీరి మొదటి భార్య అచిరకాలమున మరణించగా, రాజేశ్వరి అనినామెను ద్వితీయ వివాహము చేసుకొనెను. వారికి భ్రమరాంబ కుమార్తె, పూరణవంతుడు అనుకుమారుడు కలిగిరి. రాజేశ్వరి కూడా కుమారుడు కలిగిన కొలది కాలములో మరణించగా మీనాక్షమ్మ అనునామెను వివాహము చేసుకొనెను. వీరికి అయిదుగురు కుమారులు జన్మించిరి.
ఉభయభాషా పండితుండైన ఈ కవి అనేక గ్రంధములు రచియించినాడు. అవి. 1. హరిశ్చంద్రోపాఖ్యానము,(అచ్చతెలుగు ప్రబంధము, అముద్రితము), 2. కూకదమారయ్య కథ, 3. శ్రియాళుని కథ, 4. రౌద్ర సత్తెక్క కథ, 5. మైథున రామయ్య కథ (ఇవి శివకథలు, అముద్రితములు), 6. సిద్ధేశ్వర శతకము, 7. అగస్త్యలింగ శతకము, 8. భజన కీర్తనలు, 9. రామేశ్వరయాత్రా తటస్థక్షేత్రదేవతా పంచరత్నములు, అష్టకములు.
ఈ కవి శ్రీమఖ సం. మాఘ బహుళ చతుర్థి మహాశివరాత్రి యందు లింగోద్భవకాలమున శివసాయుజ్యము పొందినారు.
శతక పరిచయము:
"ఈమనియగస్త్యలింగ బాలేందుసంగ" అనేమకుటంతో వ్రాసిన ఈభక్తిరస సీసపద్యశతకంలో  కోవలోనికి 102 పద్యాలున్నాయి. ఇందలి కవిత్వము రసవంతమై ద్రాక్షాపాకమును పోలి ఉంటుంది. ఈశతకంలో అనేక శివ భక్తుల సచ్చరిత్రములు, శైవమత సంప్రదాయములు ఇమిడియున్నాయి. శివభక్తి తత్పరతకు ఈ శతకము ఒక మచ్చుతునక అని చెప్పవచ్చును. అచ్చతెలుగున శివరూపవర్ననము చూడండి.
సీ. పులితోలు మొలకట్టు తెలిగట్టు నీపట్టు, నిప్పు నుదుటబొట్టు నింగి జుట్టు
కేల ముమ్మొనవాలు తోలు నెమ్మెయి శాలు, మేనఁ జక్కనియాలు మినుకువాలు
తపసులు నీదండ తరుచుగా మెడనిండ, పుంకలదండ పెంబూది నిండ
గాలిమేతరి పేరు నేల చెల్వగు తేరు, నీకు సొంపగుసౌరు మాకుఁ జూడ
గీ. గరము బీతగు మది బెసికంటివేల్ప
నీకుఁ గావించెద జోహారు నీకుమారుఁ
బ్రోవు మెప్పుడు గొడవలు బొడమకుండ
ఈమనియగస్త్యలింగ బాలేందుసంగ.
త్రిపురాసుర సంహార ఘట్టము శివలీలలో ఒక ప్రాముఖ్యత కలది. ఆ ఘట్టాన్ని వివరించిన విధము చూడండి.
సీ. భూమి రథంబు జాంబూనదశైలంబు, చాపంబు శింజిని సర్పరాజు
శతధృతి సారధి జలజాక్షుఁడు శరంబు, శశిభాస్కరులు రథచక్రయుగము
నాల్గువేదంబులు నాలుగుగుఱ్ఱముల్, శరధి శరధికాఁగ సమరమునను
ద్రిపురారివీరులఁ దెగటార్చుటకు నివి, యాడంబరమె కాని యాత్మఁదలప
గీ. నివియు నీకేల? లయకాలుఁడవు నిమేష
మాత్రమునఁజూద భస్మమౌ ధాత్రి యంత
యిచ్చ గలిగెనుగాని మహేశ నీకు
ఈమనియగస్త్యలింగ బాలేందుసంగ.
అంతేకదా! తలచినంతనే ఈ సమస్త లోకాలను లయమునొందించు శక్తికలవానికి, సమరానికి  ఇంత అవసరమా?
ప్రదోషవేళ సివతాందవ నృత్యం ఒక అపూర్వ దృశ్యం. ఈ దృశ్యాన్ని ఈ కవి ఎంత అందంగా చిత్రించారో చూడండి.
సీ. భారతీదేవి నీపార్శ్వమందున నిల్చి, యింపుతో వీణ వాయింపుచుండ
పురుహూతుఁ డొకవంకఁ బూని వేణువున నీ, పావనకథలను బాడుచుంద
జలజాసముణ్ డొకచక్కి తాళము వేయ, పద్మయ్ భరతకల్పనము జేయ
హరి మృదంగంబును భరమార్గములచే, సొంపొదవంగ వాయింపుచుండ
గీ. అమరులందరుగూడి యత్యద్భుతంబు
దోపఁజూచుచునుండఁ బ్రదోషవేళ
నాత్యమును సల్పుఘనుఁడవు నాగభూష
ఈమనియగస్త్యలింగ బాలేందుసంగ
అధిక్షేప పద్యాలకు ఈశతకంలో కొదువలేదు. పరమశివుని సంసారంపై ఈ అదిక్షేప పద్యాలు గమనించండి.
సీ. అభవ నీభూషణంబగు భుజంగము గణ, పతివాహనమును మ్రింగ మతిఁ దలంచు
స్కందునుతురంగంబు సర్పహారంబుల, నశనంబు గొనఁజూచు నహరహంబు
నగజాతగుఱ్ఱంబు నాగాననంబును, గోళ్ళఁ జీల్చుటకునై కోరుచుండు
గౌరి యసూయచే గంగతోఁ గలహించు, ఫాలాగ్ని చందురు బాధపెట్టు
ఎందుఁజూచిన పసలేమి నీకుటుంబ
కలహము నీవు విసము ద్రాగంగవలసె
నేమొ కాకున్న విసమి నీకేల త్రావ
ఈమనియగస్త్యలింగ బాలేందుసంగ
సీ. అనిశంబు పితృవనమందు నివసించెడి, నీకు సౌధములేల నీలకంఠ
ఆస్థులు దాలిచి యంతటఁ దిరిగెడి, నీకు స్నానములేల నిటలనయన
నెఱి దిగంబరుడవై నిచ్చలు ద్రిమ్మరు, నీకువస్త్రములేల నిగమఘోట
భస్మము మెయినిండ బాగుగాఁ బూసిన, నీకు గంధములేల నిర్మలాంగ
సరసశవధూమధూపంబు చాలఁ గలుగ
వేరె ధూపంబు నీకేల విసముదినిన
నీకు నైవేద్య మెందుకు నిక్కముగను
ఈమనియగస్త్యలింగ బాలేందుసంగ
శివభక్తుల అనేక కథలు, శివమహిమలు వర్ణించు పద్యములు అనేకము. ముందు చెప్పికొనిన విధంగా ఈశతకంలో అనేక అచ్చతెలుగు పద్యాలు ఉన్నాయి. ఇవేకాక సర్వలగు సీసం, నిరోష్ఠ్య సీసము వంటి పద్యాలు ఈకవికి భాషపై ఉన్న పట్టు తెలియచేస్తాయి. మన్యుష్య శరీరమునందలి షట్చక్ర వర్ణన, సాధించే విధానము తెలిపేపద్యాలను చూడగా ఈ కవి మంత్ర యోగ విధ్యలందు నిష్ణాతునిగా భావించవచ్చు.
మచ్చుకి సహస్త్రార చక్రము గురించిన ఈ పద్యం గమనించండి.
సీ. ఆజ్ఞేయమున కూర్ధ్వమందు నారసిచూడ, వరసహస్త్రారంబు వరలుచుండు
నా సహస్త్రారంబునందు కోమలములౌ, వేయిదళంబులు వెలయుచుండు
బహుచిత్రవర్ణముల్ పరమభక్తియు నట, ఝుంకారనాదంబు సల్పుచుండు
పదునూలున్ హంసలు బరగుచునుండును, సాక్షీభూతంబగు సదమలాత్మ
గీ. జ్యోతిరూపంబుచే వెల్గు చోద్యముగను
దాని గురుకృపఁ గనుగొన్న ధన్యుఁడరయ
నీవే యగునయ్య చూడగ నిక్క మిదియ
ఈమనియగస్త్యలింగ బాలేందుసంగ
ఈశతకంలోని ప్రతిపద్యము భక్తిరసముతో నిండిఉన్నాయి. ప్రతిఒక్కరు చదవలసిన శతకం. మీరు చదవండి ఇతరులచే చదివించండి.
***

No comments:

Post a Comment

Pages