గుణమే సంపద
ఆండ్ర లలిత
సూరమ్మ సూరయ్య విజయవాడ వాస్థవ్యులు. వాళ్లకి ఇద్దరు మగపిల్లలు. సూరయ్యగారు తెలుగు ఉపాధ్యాయుడు. సూరమ్మ గృహిణి. ఉన్న దాంట్లో పిల్లలని బాగా చదివిస్తూ, ఆ కనకదుర్గమ్మని నమ్ముకుని జీవించేవాళ్లు. వాళ్ళ పిల్లలు రామశర్మ, రవిశర్మ. మంచి తేజోవంతులు. నలుగురేఅన్న మాట కాని ఇంట్లో ఎప్పుడు వయోవృద్ధులు, చుట్టాలు వచ్చేవాళ్ళు - వెళ్ళే వాళ్ళు. అసలు వారి స్వస్థలము యనమలకుదురు. ఉద్యోగరీత్యా ప్రక్క నున్న విజయవాడలో స్థిరపడ్డారు. వారిద్దరూ ఆశావాదులు. కారు మబ్బులు కమ్మిన కాళరాత్రిలో కూడా ఆనందం-అందం వెతికి అనుభవించే మనస్తత్వం సూరమ్మా సూరయ్యలది. ఆ రోజు అమావాశ్య రాత్రి , సూరమ్మ హడావిడిగా సావిట్లో ఎవరి పనులలో వారు ఉన్న వేళ, తన తడి చెయ్యి చీర చెంగుకు తుడుచుకుంటూ “రండర్రా భోజనాలకి ఎనిమిది కావచ్చింది. తరువాత, ఏవండీ రేపటికి అన్నీ సద్దుకుని, తెల్లవారుజామున బయలుదేరి యనమలకుదురు వెళ్ళాలి” అంది సూరమ్మ. “ఇదిగో వస్తున్నాం” అన్నారు సూరయ్య. రామశర్మ, రవిశర్మ,సూరయ్య రాత్రి భోజనం చేస్తున్నారు. సూరమ్మ అందరికీ కొసరు కొసరు అడుగుతూ ప్రేమతో వడ్డిస్తూన్నప్పుడు, పెద్దవాడు రామశర్మ ఒక తుమ్ముతుమ్మాడు. తల్లి సూరమ్మ, రామశర్మ మీద నీళ్ళు జల్లి చిరంజీవి శతాయుష్యు అని, “పుట్టినది ఏ ఊరూ? దేవుడు పేరేమిటి?” అని అడిగింది. “పుట్టినది యనమలకుదురు. దేవుడి పేరు రామలింగేశ్వరస్వామి” అన్నాడు రామశర్మ అమ్మా మజ్జిగ పొయ్యి తొందరగా. తమ్ముడు రవికన్నా ముందు తినేసి సొడ్డు కొట్టాలి. “అమ్మా చూడమ్మా అన్నయ్య ఏమంటుంన్నాడో. అన్నయ్య కన్నా ముందు నేనే తినేసి సొడ్డు కొట్టాలి. నువ్వు ఎక్కువ పెట్టావు. నాకొద్దు అంతే” అన్నాడు రవిశర్మ. “అలా దిగపెట్టకూడదు. మంచి పిల్లాడివి కదూ! ఎక్కువ ఉన్నది ముందు, తక్కువైనది తరువాత తిను. అయినా రామూ నువ్వు కొంచం నిదానంగా తిను. అలా అల్లరి పెట్టకు చిన్న తమ్ముడు కదా!”అంది సూరమ్మ. బళ్ళున నవ్వు వచ్చింది రవికి. కాని రాముడికి రుస రుస మని కోపం వచ్చింది. “నీకు తమ్ముడంటేనే ఇష్టం. ఎప్పుడూ తమ్ముడిని వెనకేసుకుని వస్తావు” అంటూ ఉక్రోషముతో అన్నం గబగబా తినేసి లేచి వెళ్ళిపోతుంటే “ఆగరా రామూ! అంత కోపం ఎందుకు? ఏదో ఇంకా చిన్నతనం రవీది. వదిలేయరా. మనము ఎదిగిన కొద్ది ఒదగటం నేర్చు కోవాలి. విద్య గర్వం తేకూడదు. నమ్రత మరియు విధేయిత నేర్పాలి. అప్పుడే జీవితంలో పైకి రాగలం. మనకి విద్యాభివృధై రాణిస్తుంది. నువ్వు బంగారు తండ్రివి. నీ మనసు వెన్న పూస.” అన్నాడు సూరయ్య. ఆ పోగడ్తకి ఇలా పోంగిపోయి, అలా ఒక నవ్వు నవ్వి! “అమ్మా యనమలకుదురు గుడి గురించి చెప్పవూ? రేపు మనం వెళ్తున్నాం కదామ్మా” అన్నాడు రామశర్మ. అలాగే చెప్తాను వినండి “దశావతారాలులో ఆరొవ అవాతారమైన పరశురాముడు తన తండ్రి జమదజ్ఞిని క్షత్రియుడు సంహరించినందుకు ప్రతీకారంగా క్షత్రీయులపై దండెత్తి సృష్టించిన రక్తపాతానికి ప్రాయశ్చిత్తంగా ఆ పాప పరిహారముకోసం యనమలకుదురుపై శివుని ప్రతిష్ఠించి అర్చించారు. శ్రీరాముడు కూడా తన వనవాసకాలంలో ఈ లింగమూర్తిని దర్శించారు. మునిగిరి అని కూడా పిలుస్తారు. చాలుక్యులు, విజయనగర ప్రభువులు, కాకతీయులు గంగాధరుని దర్శించుకునేవారు. వేయి మునులు ఈ పర్వతముపై తపస్సు చేసుకునే వారు. వేయి మునులు కుదురుకున్న పర్వతాన్ని వేయి మునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమేణ వ్యవహారిక సౌలభ్యము కోసం గ్రామీణులు యనమలకుదురు అని పిలవటం మొదలు పెట్టారు. చాలా మహిమాన్వితమైన ఆలయము. ఆ భోళా శంకరుడుకు ఒక్క అభిషేకం చాలు కరుణిస్తాడు. మరి ఆ తల్లి పార్వతీ దేవి మనని ఎల్లవేళలా చల్లగా కాపాడుతుంది. కృష్ణా నదీ తీరాన్న ఎత్తైన పర్వతంపై వెలసిన పర్వతీ పరమేశ్వర్ల ఆలయం అది ”అని ముగించింది సూరమ్మ. పనులు అన్నీ ముగించుకుని అందరూ నిశ రాత్రి గగనంలో నక్షత్రాలు చూస్తూ ఎవరిధోరణిలో వారు ఆ ఆకాశంలో మిల మిలమెరిసే తారలను వర్ణించుకుంటూ ఆనందిస్తునప్పుడు సూరయ్య తన పరివారం ఆనందాలలో పాల్గొనుచూ సూరమ్మతో తన భావనలు పంచుకున్నారు. అమావాస్య రాత్రి నక్షత్రాలు బాగా కనబడతాయి. అలాగే నల్ల మబ్బులు మన జీవితాన్ని కమ్మినప్పుడు మనము దాన్నుంచి ఏలా బయటికి రావాలా అని మనలో మనము ఆలోచించుకున్నప్పుడు నక్షత్రాలాంటి మన లోనున్న శక్తులు, నైపుణ్యం మనకి కనపడి ఒక దారి సూచిస్తాయి. ఏమంటావమ్మా” “అవునండీ. ఎవరి ఆలోచనాశైలి వారిది. వజ్రపు హారములు ధరించిన నిశకన్యని చూడండి గగనంలో, తన అందం మెచ్చి మన పెరట్లో రాత్రివేళ విరబూసిన పువ్వులు, పూలార్చన చేస్తున్నాయి కదూ! ఎంత సుమధురమైన దృశ్యమో కదండీ” అవునౌను అని నవ్వుకున్నారు సూరమ్మ, సూరయ్యా. అలా చల్లని రాత్రిలో చక్కటి మాటలు, నవ్వుల జల్లుల సవ్వడ్లో చీకటి తరువాత వెలుతురు తప్పక వస్తుందనే గాఢ విశ్వాశముతో, సూర్యోదయము కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్నారు. మర్నాడు పొద్దున్నే, కోడి కూత గడియారం అలారమ్తో మెలుకువ వచ్చి చీకటితో తయారై బయలుదేరి యనమలకుదురు జేరుకున్నారు. ఆదివారంమేమో చాలా మంది దర్శనానికి వేచియున్నారు. కాని ఆ పర్వతీపరమేశ్వర్ల అనుగ్రహంతో దర్శనము మిగతా కార్యక్రమాలన్ని సక్రమంగా అయ్యి , బయటికి వస్తూ “ఆగండర్రా! ఒక్క క్షణం ఆ ఎదర మెట్టు మీద కూర్చొని వెళ్దాము” అంది సూరమ్మ. ఇంతలో రవిశర్మ “ఆకలి వేస్తోందే! కొబ్బరి ముక్క పెట్టవూ”అన్నాడు. “అలాగే నాన్నా” అంది సూరమ్మ. గుడిలో మెట్టుమీద కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ కొబ్బరి చిప్ప ప్రసాదం మెట్టుకేసి కొట్టి ముక్కలు చేసి సూరమ్మ అందరికీ ఇస్తే అందరూ స్వీకరిస్తున్నప్పుడు, చిలుమూరులో ఉంటుంన్న మావయ్య రామయ్య సూరయ్యను దూరం నుంచి చూసి “ఏవమ్మో కామాక్షీ అటు చూడు! ఆ ఎదర మెట్టుమీద మన సూరయ్య కాదూ. చూడు!”అన్నాడు. “అవునండీ మన సూరయ్యే. పదండీ కలుద్దాము” అంది కామాక్షి. రామయ్య,కామాక్షి సూరయ్య దగ్గరకు వచ్చి “ఎలా ఉన్నావు రా! చాలా కాలమైంది మిమల్ని చూసి. అమ్మమ్మ మంచంమీద ఉన్నప్పుడు చూడటానికి వచ్చావ్. పిల్లలితో మళ్ళీ రాలేదు. వస్తూ ఉండండీ. సమయము చూసుకుని. అప్పుడే బంధాలు గట్టి పడతాయి. అన్నట్టు మా అమ్మాయి రత్న పెళ్ళికుదిరింది. మొదటి శుభలేఖ సతీ సమేత రామలింగేశ్వరస్వామికి సమర్పించి ఆశీస్సులు పొందుదామని వచ్చాము. మరి పెళ్ళికి తప్పకుండా రావాలి సుమీ” అన్నాడు రామయ్య. “అన్నట్టు సూరమ్మ పెళ్ళికి వచ్చినప్పుడు నా నగలు ఖరీదైన చీరెలు యిస్తాను. ఓద్దనకు. ఒక్కసారి చుట్టపెట్టుకుని ఇద్దువుగాని. అసలే అభిమానవంతురాలివి. బీదవాళ్ళంటే మేము తిరిగే ప్రపంచంలో చిన్న చూపు. కాస్త హోదా ఉన్నవాళ్ళే మా బంధువులు. ఏ మనకోకు అమ్మడూ. మనసులో పెట్టుకుని మా హోదాకి తగ్గట్టు దుస్తులు వేసుకుని రండీ. ఇదిగో ఈ రెండువేలుంచు. పిల్లలికి మంచి దుస్తులుకొను” అంది కామాక్షి. “వద్దు పిన్నీ మేము కొంటాము పిల్లలికి”అంది సూరమ్మ. “అలా కాదుంచు. తీసుకో”అని చేతులో పెట్టేసింది కామాక్షి. “నీకు , సూరయ్యకీ మా బట్టలు ఇస్తాములేమ్మా. మరి ఉంటానమ్మా. మా అమ్మయి వంటరిగా ఉంది ఇంట్లో. అసలే రోజులు బాగాలేవు.ప్చ్..ఉంటానమ్మా”అంది కామాక్షి సూరమ్మతో పిల్లలి ఎదురుగా. “మంచిది పిన్నీ” అని చిరునవ్వుతో అంది సూరమ్మ. తల్లీ తండ్రీ చూపించిన లోకానికి వారి చుట్టూ ఉన్నలోకానికి సహస్రం తేడా గమనించిన 14ఏళ్ళ ప్రాయంలోనున్న రామశర్మకి తనమీద తనకే కోపం వచ్చింది. క్లిష్టమైన సమస్య తో ఆలోచనలో పడ్డాడు. ధనమా, నైతిక విలువలా, విద్యా, ఏది సంపద? ఏది ముఖ్యం? దేనికి ఎక్కువ ప్రాధాన్యత? అన్నీ ముఖ్యమా? అయితే ఏది ముందు. 13ఏళ్ళ రవిశర్మ అన్నయ్యకేసి తిరిగి, మెల్లిగా మనం బీదవాళ్ళం కదా! గొప్పగా ఉండాలంటే ఏది ఉండాలన్నయ్యా? అని మెల్లిగా చెవిలో ఊదాడు రవిశర్మ. “ఛీ ఊరుకో! అమ్మా నాన్నే గొప్పవారు. మనమే గొప్పవాళ్ళం. హు...” అన్నాడు రామశర్మ తమ్ముడు ని దగ్గరకు తీసుకుని. “ఒరేయ్ రామశర్మ రవిశర్మ నేనెవరో తెలుసా మీ చిన్న తాతయ్యని. అదిగో ఈవిడ మీ చిన్న అమ్మమ్మ.” “ ఎలావున్నావు అమ్మడు. నేను మీ ఆయన సూరయ్యకి కాస్త ఎదో ధన సహాయము చేసాను. అప్పట్లో. హూ! ఇలా నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంన్నాడంటే దాంట్లో నా చెయ్యి కూడా ఉంది అమ్మడూ” అన్నాడు రామయ్య గర్వంగా సూరమ్మని ఉద్దేశిస్తూ. “అవునండి బాబయ్యగారు అంతా మీ పెద్ద మనసు, కడుపు చలవ. ఎలా మర్చిపోగలము”అంది సూరమ్మ. “అయితే అయింది కాని, బానే వృద్ధిలోకి వచ్చావు. కష్టపడి. సంతోషము. అప్పుడప్పుడు యొగక్షేమాలు తెలుపుతూ ఉండు సూరయ్య. ఇంక పిల్లలూ అలా అమ్మ వెనుక దాక్కుంటారేమిటీ? గుసగుసలు చెప్పుకుంటూ. నాతోనూ చెప్పండీ. రండి బయటికి!”అన్నాడు రామయ్య గర్వంగా. “అదేమీ లేదు తాతయ్య” అని చిరునవ్వుతో శెలవిచ్చాడు రామశర్మ. “బాగా చదువు వెలగబెడ్తున్నారా? ఏమౌతారూ పెద్దయ్యాక?” మెట్టుమీద కుర్చొని మీసాలు మెలిపెట్తూ అడిగాడు రామయ్య. “నేను పెద్ద వైధ్యుడౌతానండి తాతగారండీ”అన్నాడు రామశర్మ చేతులు కట్టుకుని నమ్రతతో. “నేనూ వైధ్యుడినే అవుతానండీ”అని రామశర్మ కేసి చూస్తూ అన్నాడు రవిశర్మ. ఊ...ఇంక ఆలస్యమౌతోంది శెలవు తీసుకుంటాము అని రామయ్య కామాక్షి లేచి వెళ్తూ రెండు అడుగులు దీర్ఘాలోచనతో వేసి ఏదో చెప్పటము మర్చిపోయినట్టు వెనుకకు తిరిగి సురయ్య దగ్గరగా వెళ్ళి “ఏమిటోరా సూరయ్యా పేగుబంధంతో చెప్పకుండా ఉండలేకపోతున్నా. మీ పిల్లలి కోరికలు నీ తహతకి అందనవి. మొక్కగా ఉన్నప్పుడే తుంపేయ్యి. నాకు తహతున్నది కాబట్టి చదివించాను. నువ్వేదో మావయ్య ధన సహాయము చేస్తాడనుకోకు. నెనేమి చెయ్యను. ఇంక ఉంటాను”అని కామాక్షితో కలిసి కార్లో తిరుగు ప్రయాణమైయ్యారు రామయ్య.
*****
ప్రయాణమయ్యి ఇంటికి చేరుకున్నారు సూరయ్య కుటుంబంతా. రాత్రయ్యింది. “అమ్మా ! ఆ తాతయ్య అమ్మమ్మా నాకు నచ్చలేదు.వాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారు”అన్నాడు రవిశర్మ సూరమ్మచెంగులాగుతు. “అలా అనకూడదమ్మా. మంచి వాళ్లే! మాట కాస్త కటువంతే”అంది సూరమ్మ. “లేదమ్మా , తమ్ముడుతో ఏకీభవిస్తున్నాను” అన్నాడు రామశర్మ. పిల్లలి మనసు బాధ పడిందని గమనించి సూరమ్మ మాటరాక మౌనంగా ఉండిపోయింది. సూరయ్య సూరమ్మా వారి వారి తాపాలు అణిచి పెట్టుకుని చిరునవ్వుతో పిల్లలి తాపాలు చలర్చటానికి ప్రయత్నించసాగారు. వారు పెద్దవాళ్లుగా వారి మనసులు గాయపడినా తట్టుకుని బయటికి రాగలిగారు. ఆటుపోటు జీవితానికి అలవాటు పడ్డవారు. కాని పిల్లల లేత హృదయాలు గాయపడ్డాయని గమనించి సూరయ్య రాముడున్ని రవిని దగ్గరకు తీసుకుని “విద్య మనకి ధనము , సంస్కారము మరియు నమ్రతా తెస్తుంది. అది మనని గొప్పవాళ్ళగా పరిగణిస్తుంది. మీకు అవన్నీ ఉన్నాయి. మీరు గొప్పవాళ్ళే. బాగ చదివిస్తా. చదువుకోండి. గొప్ప వైధ్యులై , ఏంతో మంది మీ దగ్గరికి బాధతో వచ్చి మీ చికిత్స తరువాత చిరునవ్వు తో వెళ్తే ,ఆ ఆనందమే వేరు. భగవంతుడు చల్లగా చూస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. కంగారుపడకండి రాము రవీ”అన్నాడు సూరయ్య. మీకు ఆకాశంలో వున్న నక్షత్రాల గురించి, అవి మనకి ఎంత చక్కని సందేశాన్ని ఇస్తున్నాయని చెబుతాను. మీకు నచ్చినప్పుడు వాటి గురించి మీ అంతట మీరే ఇంకా తెలుసుకుని మరికొన్నివిషయాలు అర్ధం చేసుకోవచ్చు. మనిషి కంటికి వేల కోట్ల నక్షత్రాలలో దాదాపు 2000 నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అందులో ఏ ఒక్క సమయంలోనైన కొన్ని వందలు మాత్రమే కనిపిస్తాయి. నువ్వు క్షుణ్ణంగా పరిశీలిస్తే 4 కన్నా ఎక్కువ సమీప నక్షత్రాలు వున్న సమూహాల ( నిర్దిష్టమైన అమరిక బట్టి) క్రింద విభజించినట్లయితే ఏ ఒక్క సమూహము మరొక సమూహంలా వుండదు. అంత కన్నా తక్కువ నక్షత్రాలు వున్న సమూహాలయితే ఒకటి కన్నా ఎక్కువే కనిపిస్తాయి. ఇంకా తక్కువగా ప్రకాశవంతమైన నక్షత్రాలను చూడగలిలతే ఈ సమూహాల లక్షణాలు మరియు లెక్కలన్నీ మారిపోతాయి. ఇంకా జాగ్రత్తగా ప్రతీ నక్షత్రంలో ప్రకాశంలో మార్పులు గమనిస్తే మరి కొన్ని సమూహ లక్షణాలు తెలుస్తాయి. మీరు చిన్న పిల్లలు గాబట్టి మీకు కనిపించే ప్రతీదాని గురించి తెలుసు కోవాలి అనే ఉత్సుకత సహజం. సరేగాని నాన్నా ఈ నక్షత్రాల గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు, తాత వాళ్ళగురించి మాట్లాడుకుంటుంటే అన్నాడు రామశర్మ. వినండి అదీ చెబుతా. ఏదైనా తెలియనిది త్వరగా అర్ధం చేసుకునే విధానాలలో నమూనాలను అర్ధం చేసుకోవడం మరియు సమతుల్యమైన దానితో పోల్చుకోవడం చాల సమంజసం. కొంత అవగాహన వచ్చాక క్రొత్త విషయం ప్రత్యేకత మరికొంచం విస్తృతంగా పరిశీలించవచ్చు. సరేగాని, ప్రతీ మనిషిలో వున్న గుణాలే నక్ష్రత్రాల వంటివి. పైపై మాటలు, చేస్టలు తప్పించి లోపలి వ్యక్తిత్వాన్ని చూడగలితే ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మించిన గుణములు నక్ష్రత్రాలలా ప్రకాశిస్తూ కనిపిస్తాయి. ఆ నక్ష్రత్రాల అమరికే ఆ వక్తి ప్రవర్తనకి ఒక ప్రత్యేకమైక అస్తిత్వానికి ప్రాణం పోస్తుంది. ఆ గుణాల పటిష్టత, ప్రాధేయత, కాల మాన పరిస్తితుల బట్టి వాటి మధ్య రాజీయే ఆ మనిషి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకతను అమరుస్తాయి లేక ఒనర్చుతాయి. మనిషికి కావసిన వివిధ గుణములు ఎన్ని నిర్దిష్టంగా ప్రేరేరింపబడతాయో వాటి కలయక ఆ మనిషి వ్యక్తి ప్రత్యేకత. ఇంతకీ చెప్పేది ఏమిటంటే మనిషి సాధ్యమైనన్ని సద్గుగాలను అలవాటు చేసుకోవాలి. అవి ప్రక్రృతి ఎలా అయితే వివిధ కాల మాన పరిస్తితుల బట్టి, పధ్ధతులవల్ల నిత్యం పరిపరివిధలుగా యెల్లప్పుడు అదే పనిగా తన కాలమానంలో నిర్మింపబడుతోందో, అదే విధంగా మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మింస్తూవుంటాయి. కొంత మంది కాల మాన పరిస్తితుల్లో కొన్ని బలహీనతలకు, ఉదాహరణకి ధనం ద్వారా సంపదించుకున్న వారి చుట్టు ప్రక్కలవున్న సాధారణ సమాజంలో పరపతిని వదులుకోలేరు. అది వారి బలహీనత లేక వారు నివసించే సమాజంలో సామరశ్యంగా బ్రతకడానికి అవసరమైన హంగులు. అలా చిన్నచిన్న బలహీనతలను లేక పధ్ధతులను గమనించి మనుషులను దూరం చేసుకుంటే మనకి ఎవరూ మిగలక పోవచ్చు. అలాఅని మన వ్యక్తిత్వాన్ని చంపుకోవసివన అవసరం కూడా లేదు. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ మన చుట్టుప్రక్కల సమాజంతో సాధ్యమైనంత సామరస్యంతో జీవించడమే మనిషి కర్తవ్యం. అలాఅని ఎల్లప్పుడు ఒకరు ఒప్పు మరోకరు తప్పు కాదు. ఎవరి పధ్ధతిలో వారు ఒప్పు. మనకి వేరే వారిని పరీక్షించే లేక విమర్శించే లేక వారి వ్యక్తిత్వంపై తీర్పు చేసే అవసరం గాని అధికారంగాని ఎవ్వరు అప్పచెప్పలేదు. కాని మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే బాధ్యత మనది మాత్రమే. తల్లి తండ్రులు, గురువులు, పరివారము, సహాధ్యాయులు, మనం వ్యవహరించే సమాజం మనకియెన్నో అవకాశాలు ఇస్తాయి. చివ్నప్పుడు ప్రవర్తనదిద్దబడిన తరవాత దాన్ని పరిరక్షుంచుకునే లేక కావలిసినట్టుగా పరివర్తించుకునే బాధ్యత మనది మాత్రమే. అందువల్ల తాతావాళ్ళు అలా ప్రవర్తించారని పట్టించుకోవలసిన అవసరం లేదు. అలా అని మనుషలని పూర్తిగా విడనాడుకునే అవసరం లేదు. మనం మన వ్యక్తిత్వాని కాపాడుకుంటూ వీలైనంత సద్దుకుపోవాలి. ఆత్మవంచన కూడా చేసుకోకూడదు. వీలుకాని సందర్భంలో వీలు కాదు అని నమ్రతగా మరియు నిక్కచ్చిగా చెప్పగలగాలి. ఇలా అన్ని కోణములలో సమతుల్యతయే జీవిత పురోగతినిస్తుంది. ఇది మరీ అంత కష్టం కూడా కాదు. కొన్ని ప్రాధాన్యవిలవలను కాపాడుకుంటూ సాధ్యమైనంత ప్రేమా అభిమానలతో మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇతరుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ వ్యవహరిస్తే సాధ్యమౌతుందు. అప్పుడు ప్రతీవిషయంలో తలబద్దలకొట్టుకోవలసిన అవసరం రాదు. నాకు తెలుసు మీకు చాలమట్టుకు తలకెక్కివుండదని. మీకు చాలా సమయంవుంది. ప్రస్తుతానికి ఇది నా బాధ్యత. ఇంక పడుకోండర్రా. మీకు చాల మంచి జీవితం వుంది ముందు ముందున. అవుననుకుంటానండి! అందుకే అదేదో పాటలో, “పై మెరుగులకే భ్రమపడకయ్యా మనసే మాయని మమతమయ్యా, గుణమే తరగని ధనమయ్యా ఓ..ఓ..ఓ..” అని వస్తుంది కదా! అని కూనిరాగం తీస్తూ కిలకిల నవ్వింది సూరమ్మ. అది విన్న పిల్లలు చిరునవ్వులతో కుదట పడి, మనసులలో వైద్యులవ్వాలనే వాంఛ దృఢ పడి, నవ్వుల జల్లులు కురిపించి ఆనందపారవస్యంలో తేలిపోయారు. ఇది చూసిన సూరమ్మా,సూరయ్యలమనసులు కూడా కుదుటపడ్డాయి. సూరమ్మ మనసులో ఆందోళన, వ్యధా గమనించి “సూరమ్మా, బాధ పడకు. ఓడలు బళ్ళౌతాయి. బళ్ళు ఓడలౌతాయి. ఇది నగ్న సత్యం. మన రాముడు, రవి గొప్పవాళ్ళౌతారు. నా మనసాక్షి చెప్తోంది”అన్నాడు సూరయ్య ప్రేమతో.
********
అలా రోజులు గబగబా గడిచి పిల్లలు పెద్దవాళ్ళై పేరు ప్రఖ్యాతలతో గొప్ప వైధ్యులై మానవసేవే మాధవసేవగా భావించి సేవచేయసాగారు. రామయ్య గుండె జబ్బుతో బాధ పడుతూ రామశర్మ రవిశర్మ పనిచేసే ఆసుపత్రికొచ్చి వారి నైపుణ్యం గురించి విని, చికిత్సపొందుదామని వెళ్ళారు. రామ శర్మ చికిత్స గది దగ్గర వేచియుంటు “కామాక్షీ! మన రామశర్మ,రవిశర్మ మనని గుర్తుపట్తారా! ఏమో.... వాళ్లని చిన్నచూపు చూస్తూనే ఉండేవాళ్లం. ఏమిటో, కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ఏమిటో మాటజారాక తీసుకోలేము కదా. చూద్దాం” అన్నాడు రామయ్య బాధతో. “రామయ్యగారూ! రండి” అని రామశర్మ గది నుంచి నర్సు వచ్చి పిలిచింది. “పద వెళ్దాము కామాక్షీ” అంటూ చేతిలో ఫైలు పుచ్చుకొని తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు. రామయ్య, కామక్షిని చూసి రామశర్మ నిర్ఘాంతపొయి ఆనందంతో పక్కగదిలో రోగపీడుతులను చూసే రవిశర్మతో తన ఆనందం ఇంటర్కాంమ్ ఫోన్లో పంచుకుని, ఇరువురికీ నమస్కరించి ఆప్యాయత వినయవిధేయితలతో ప్రాణమిచ్చి మాట్లాడి, దైర్యం చెప్పి, వాళ్ళని తనకోసం వేచియుండమని చెప్పాడు. మిగతా రోగపీడుతులను చూసి రవిశర్మతో కలిసి సాదర మర్యాదలతో కార్లో ఇంటికి తీసుకెళ్లాడు. భేషజాలు లేని కుటుంబాన్ని చూసి రామయ్య,కామాక్షికి కళ్ళు చమర్చాయి. “ఏవండీ మనిషి గొప్పతనం అంటే కష్టపడి చదువుకుని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వీళ్లదండీ. మనది కాదండీ”అంది కామాక్షి రామయ్యతో. “అవునమ్మా అప్పుడు మనకి కళ్ళు కప్పిపడిపోయాయి” అన్నాడు రామయ్య. వారి కోరికమీర వారింట్లోనే బసచేసారు. రోగం నయ్యమైయి వైధ్యో నారాయణో హరి అని అనుకుని రాముడుని, రవిని దీవించారు. సూరమ్మ సూరయ్యతో “మన కృష్ణా నదీ తీరాన్న పుట్టి మన కృష్ణమ్మ పేరు నిలపెట్టారు. మీరు ధన్యులు.మీ పిల్లలు ఆణి ముత్యాలు. అమ్మా సూరమ్మ మీ పిల్లలు, గుణమే సంపదని చక్కగా చాటి చెప్పారు.అదంతా నీ కడుపు చలవే అమ్మడూ ” అని దీవించి, వారి ఊరికి ప్రయాణం అయ్యారు. సూరమ్మ సూరయ్య మందహాసంతో ఒకరి ఒకరు చూసుకున్నారు. గుణమే సంపదనే భావన తరతరాలు వాళ్ళ వంశంలో నిలిచిపోవాలను ప్రార్ధించారు.
********
No comments:
Post a Comment