శ్రీ జి.వి.పూర్ణచందు గారితో ముఖాముఖి
భావరాజు పద్మిని
కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, సాహితీ వేత్త, శతాధిక గ్రంథకర్త, పరిశోధకుడు, ఆం.ప్ర. ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయాల పురస్కారాల గ్రహీత అయిన డా.జి.వి. పూర్ణచందు గారితో ప్రత్యేక ముఖాముఖి... మీ కోసం...
నమస్కారమండీ... మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి.
నమస్కారం. మా మాతామహులది కృష్ణాజిల్లా కంకిపాడు. నా బాల్యం, విద్యాభ్యాసం అంతా కృష్ణాజిల్లా లోని వివిధ గ్రామాల్లో సాగింది. ఇంటర్మీడియట్‘లో నేను విజయవాడ శాతవాహన కాలేజీ విద్యార్థిని. ఆ తర్వాత మెడిసిన్ కూడా విజయవాడలోనే చేశాను. ప్రాక్టీసు కూడా విజయవాడలోనే కొనసాగిస్తున్నాను. 1973 నుంచి బెజవాడే నా కార్యక్షేత్రం
కృష్ణా నదితో మీకున్న అనుబంధాన్ని గురించి చెబుతారా ?
మా నాన్నగారు అగ్రికల్చర్ డిపార్టుమెంటులో పని చేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా కృష్ణాజిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. అవనిగడ్డ, చల్లపల్లి, కప్తానుపాలెం, ఘంటసాల, నూజివీడు, ఉయ్యూరు వంటి గ్రామాల్లో ఉన్నాను. కృష్ణ ఒడ్డుతో ఉండే అనుబంధం వల్ల, నేరుగా కృష్ణ నీటినే తాగి పెరగటం వలన తెలుగు భాషా సంస్కృతులమీద అభిమానం ఏర్పదటానికి ముఖ్య కారణం. చిన్ననాటి నుంచి ఇక్కడి గ్రామీణ ప్రజల ఆహారవిహారాలు, జీవిత విధానం మీద నాకు చక్కటి అవగాహన ఏర్పడింది.
మీరు చిన్నప్పటి నుంచి రచనలు చేసేవారా ? ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ?
నేను 8,9 తరగతుల్లో ఉండగా నా సాహిత్య జీవితం ప్రారంభమయ్యింది. నూజివీడు హైస్కూల్లో, 8,9 తరగతులు చదువుతూ ఉండగానే ‘మేఘమాల’ అనే లిఖిత మాసపత్రిక నడిపేవాడిని. అప్పట్లో ప్రసిద్ధ కవులు దుర్గానంద్, ఎం.వి.ఎల్ లాంటి పెద్దలతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ముఖ్యంగా దుర్గానంద్ గారి అబ్బాయి నా క్లాసుమేట్, అందువల్ల దుర్గానంద్ గారితో చనువుండేది. వారి ప్రభావంతోనే నేను సాహిత్యం వైపుకు వచ్చాను.
రచనల్లో మీరు ఎటువంటి ప్రక్రియలు ప్రయత్నించారు? ఎటువంటి రచనలు చేసారు ?
నా మొదటి రచన ఆంధ్రప్రభ వారపత్రికలో 1975 లో వచ్చింది. విద్వాన్ విశ్వంగారు అప్పుడు నన్ను బాగా ప్రోత్సహించేవారు. “ఆత్మలతో మాట్లాడగలమా?” అన్నది నా మొదటి రచన. మొదటి నుంచీ కూడా నేను శాస్త్రీయపరమైన, పరిశోధనాత్మకమైన రచనలే ఎక్కువ చేసాను. పరిశోధన అంటే ఇష్టం.
1980లో నా మొదటి పుస్తకం “అమలిన శృంగారం” అచ్చయ్యింది. నేనప్పుడు మెడిసిన్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అప్పట్లో “సౌజన్య” అనే వారపత్రిక వచ్చేది. అందులో నేను ఒక ఏడాది పైగా ‘ప్రేమ-పెళ్లి-శృంగారం” పేరుతో ఒక శీర్షిక నిర్వహించాను. దాన్నే కొంత పెంచి అమలినశృంగారం పేరుతో పుస్తక రూపంలో తెచ్చాను. భారతీయ, పాశ్చాత్య సిద్ధాంతాల తులనాత్మకంగా ‘సైకాలజీ ఆఫ్ సెక్స్’ మీద తెలుగులో నాదే మొదటి పుస్తకం. ఫ్రాయిడ్ id, ego, super ego అనే మూడు సిద్ధాంతాల ఆధారంగా సైకో అనాలసిస్ థియరీ ని నడిపాడు. సాంఖ్యులు సత్వ, రజస్, తమో గుణాల గురించి చెప్పిన సిద్ధాంతాల్నే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణా సిద్ధాంతంలో ప్రతిపాదించాడు. ఆ రెండు సిద్ధాంతాల సమన్వయాన్ని నేను ఈ పుస్తకం ద్వారా సాధించాను. నేను 1957 లో పుట్టాను, అంటే ఈ పుస్తకం రాసేసరికి నాకు కేవలం 23 ఏళ్ళు.
నేను చాలా చిన్న వయసులోనే సాహితీ ప్రస్థానం మొదలు పెట్టడం వల్ల నాకు చాలామంది సీనియర్ రచయితలతో సాన్నిహిత్యం ఉండేది. వాళ్ళ దగ్గర చాలా అంశాలు నేర్చుకున్నాను. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో విహారి, పురాణపండ రంగనాథ్, అజంతా, ఎం.వి.ఎల్, దుర్గానంద్ మొదలైన వారు ఉన్నారు. జి.కృష్ణ గారు బెజవాడలో ఉన్న కాలంలో రోజూ సాయంత్రం పూట కాలేజీ అయిపోయాక వెళ్ళి ఆయన దగ్గర కూర్చొనే వాణ్ణి! ఏటుకూరి బలరామూర్తి గారు, తుమ్మల వెంకట్రామయ్య గారు, మహీధర రామ్మోహన రావు గారు, మైత్రేయగారు మొదలైన వారికి నేను శిష్యుణ్ణి. వారి వలనే అభ్యుదయ మార్గంలో నా ఆలోచనా విధానం రూపు దిద్దుకుంది. విహారి, గుత్తికొండ సుబ్బారావు, ప్రభృతుల సాన్నిహిత్యంలో సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం సాధించాను. సాహితీ రచన, సభల నిర్వహణ రెండిట్లోనూ దిట్ట ననిపించుకున్నాను.
వృత్తి రీత్యా మీరు డాక్టర్ కదా, మరి ప్రవృత్తి రీత్యా రచయిత. ఈ రెండిటినీ ఎలా సమన్వయ పరచుకున్నారు ?
డాక్టర్ కాకముందే నేను పేరున్న పత్రికా రచయితని. పుస్తక రచయితని కూడా! పేరు ముందు డాక్టర్ అనే పదం లేకుండా మూడు పుస్తకాలు వెలువడ్డాయి. అయుర్వేద వైద్యం చదవటం వలన సంస్కృత అధ్యయనం వైపు దృష్టి పెట్టాను. అందువల్ల నేను మంచి అనలిస్ట్ అయ్యాను. నా చుట్టూ ఉన్న వ్యక్తులంతా ప్రముఖ రచయితలు కావటం వల్ల, వారు చెప్పే అంశాలను వినటం వల్ల, వారు చెప్పే విషయానికి, నేను చదువుకున్న విషయాలకి సమన్వయం చేసుకోవటం వల్ల, నేను పరిణతి చెందాననుకుంటాను. అందుకే చిన్న వయసు లోనే పెద్ద విషయాలు మాట్లాడగల పరిజ్ఞానం అలవడింది.
వైద్యంలోకి వచ్చాక, ఒక రచయితగా నాకున్న శైలి, విధానాలను ఉపయోగించి వైద్య సంబంధమైన విషయాల్ని సులభ శైలిలో అందరికీ సులువుగా అర్ధమయ్యేలా రాయగలిగాను. సామాన్యుడికి అర్ధం అయ్యేలా వైద్య రహస్యాలను రాయడం కష్టం. నా మెడికల్ పుస్తకాలు బాగా జనాదరణ పొందాయి. కేవలం మెడిసిన్ మీద 40 పుస్తకాలు అచ్చయ్యాయి. వాటిలో 20 ఎడిషన్లు పడ్డ పుస్తకాలు కూడా ఉన్నాయి. ‘ఆహార వేదం’ లాంటి 600 పేజీలున్న పుస్తకాలు కూడా వాటిలో ఉన్నాయి.
ఆయుర్వేద వైద్యుడిగా, తెలుగు భాషా చారిత్రక పరిశోధకుడిగా తెలుగువారి ఆహార చరిత్రను, ఆహార మూలాల్ని వెతికేందుకు అనేక పరిశోధనలు చేసాను. కేవలం మన ఆహార చరిత్ర మీద 9 పుస్తకాలు వ్రాశాను. అందులో ఒక పుస్తకాన్ని “తెలుగు విశ్వవిద్యాలయం” వారు “మన ఆహారం” పేరుతో ప్రచురించారు. అడపా దడపా కొందరు పెద్దలు వ్రాసిన వ్యాసాలు తప్ప, మన ఆహారచరిత్ర మీద తెలుగులో పుస్తకం లేదు. శ్రీనాథుడు, తెనాలి రామలింగడు వంటి మహా కవులు తమ కావ్యాలలో చాలా వంటకాలను ప్రస్తావించారు. శ్రీనాథుడు దమయంతీ స్వయంవరం సందర్భంలో అతిధులకి వడ్డించిన వంటకాల లిస్టుని సురవరం ప్రతాపరెడ్డి గారు ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ లో ప్రకటించారు. వాటిలో చాలా వంటకాలు ప్రస్తుతం వివియోగంలో లేవని, విజ్ఞులు పరిశీలించవలసి ఉందనీ వ్రాశారు. నేను వాటి మూలాలను వెదికి ఆనాటి పేర్లు ఈనాటి ఏ వంటకాలకు సంబంధించినవో తేల్చే ప్రయత్నం చేశాను. ఉదాహరణకి ‘దూది మణుగులు’ అంటే మావ్ పూరీ. వీటిని శ్రీనాధుడు వర్ణించాడు. గుజ్జుగా కాచిన గోక్షీరం అంటే తియ్యనిక్రీముని ఆ పూరీ మీద డిజైనుగా వేస్తే అది, కొత్త పెళ్లి కూతురి తెల్లచీర అంచులా ఉందని శ్రీనాధుడు వర్ణించాడు. ఇటువంటివన్నీ వెలికి తీసి, అప్పుడెలా తిన్నారు, ఇప్పుడు మనమెలా తింటున్నాము, ఎలా తినాలి అన్నవి వైద్యుడిగా తెలిపాను. “అలనాటి ఆహారాలు” అని నేనొక పుస్తకం రాసాను. ‘తరతరాల తెలుగు రుచులు’ అన్న పుస్తకం రాసాను. ఆహార వేదం ప్రచురించాను. ఆంధ్రభూమి వారపత్రికలో గత రెండున్నరేళ్ళుగా ఆహారోపనిషత్తు శీర్షిక నిర్వహిస్తున్నాను. మళ్ళీ ఎప్పటికప్పుడు నా పరిశీలనలోకి వచ్చిన విషయాలను అప్డేట్ చేస్తూ వచ్చాను.
మీరు కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎప్పటి నుంచి వ్యవహరిస్తున్నారు?
కృష్ణాజిల్లా రచయితల సంఘం 1983 లో ఏర్పడింది. మండలి బుద్ధప్రసాద్ గారు,గుత్తికొండ సుబ్బారావు గారు, ముక్కామల నాగభూషణం గారు నేను మేమంతా కలిసి, మండలి వేంకట కృష్ణారావుగారి ప్రేరణతో ఏర్పాటు చేసి, 83లో రిజిస్టర్ చేసాము. దానికి ముక్కామల నాగభూషణం గారు ప్రెసిడెంటుగా ఉంటే, నేను, మండలి బుద్ధప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీలు గా ఉన్నాము, గుత్తికొండ వారు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు మేము చేసాము. 83-95 వరకు మంచి కార్యక్రమాలు చేసాము. ఆ తర్వాత రచయితల సంఘంలో పెద్దలు పోవడంతో కాస్త విరామం వచ్చింది. 2005 లో దాన్ని రివైవ్ చేసి, 3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, ఒక జాతీయ తెలుగు మహాసభలు, 15 నేషనల్ సెమినార్స్, 12 పరిశోధనా గ్రంథాల ప్రచురణ ఇవన్నీ చేశాము. తెలుగు భాషోద్యమానికి అంకితంగా పనిచేశాము. ప్రజల గుండె తలుపులు తట్టేందుకు బందరు నుంచి నెల్లూరు దాకా 4 జిల్లాల్లో రచయితల పాదయాత్ర నిర్వహించాము. తెలుగు భాషకు ‘ప్రాచీనతా హోదా’ సాధించడంలో సంఘం పక్షాన మేము చాలా కృషి చేసాము. ‘నైలు నుండి కృష్ణ దాకా’ (ద్రవిద విశ్వవిద్యాలయం ప్రచురణ), ‘తెలుగే ప్రాచీనం’ అనే నా పుస్తకాలు ప్రాచీనతను నిరూపించేందుకు కొంత తోడ్పడ్దాయి కూడా! అంతేకాక “తెలుగు భాష ప్రాచీనత గురించి అనేక సెమినార్లు నిర్వహించాము. ఆ విధంగా భాషోద్యమంలో నేనూ ముఖ్య భాగస్వామిని కాగలిగాను.
కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రధాన కార్యదర్శి, నేషనల్ మెడికల్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తన్నీరు కృష్ణమూర్తి విద్యాధర లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ గా ఇలా పలు కీలకమైన రంగాల్లో మీరు నైపుణ్యం సాధించి, విజయవంతంగా ఎన్నో బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అసలు వీటికి సరిపడే సమయం మీకు ఎలా దక్కుతుంది ?
“బిజీ గా ఉండే మనిషే తీరిక చేసుకోగలడు” అని నా ఉద్దేశం. తీరిగ్గా కూర్చునే వారికి ఎలాగూ తీరిక ఉండదు. ఇంతకు రెట్టింపు పని ఉంటేనే నా మనసుకు స్థిమితంగా ఉంటుంది. 1980తో ప్రారంభించి, ఇప్పటివరకూ సంపాదకత్వం వహించినవీ, పత్రికల్లో శీర్షికలుగా నిర్వహించినవీ అన్నీ కలిపి 110 పుస్తకాలు అచ్చయినాయి. నా పుస్తకలన్ని ద్రావిడ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, ఎమెస్కో, విక్టరీ, మధులత, మహలక్ష్మీ లాంటి ప్రసిద్ధ సంస్థలు ప్రచురించాయి. ప్రస్తుతం “కృష్ణాతీరం” పేరుతో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ తరఫున ఒక వెయ్యి పేజీల వాల్యూం తీసుకు వచ్చే పనిమీద ఉన్నాను. నేను దీనికి ఎడిటర్ గా ఉన్నాను. దాదాపు 9 పత్రికలకు పరిశోధనా వ్యాసాలు, శీర్షికలు రాస్తున్నాను. మరొక వైపు రచయితల సంఘం పనులు, వైద్య వృత్తి ఇవన్నీ ఏకకాలంలోనే చెయ్యగలుగుతున్నాను. వయసు మీద పడ్తున్నా ఉత్సాహం ఉంది కనుకే ఇది సాధ్యమవుతోంది. ‘నేను చాలా కష్టపడిపోతున్నాను, ఇంక నావల్ల ఏదీ కాదు,’ అనుకుంటే మనం ఏమీ చెయ్యలేము. ‘ఇది నాకు చాలదు’ అనుకుంటేనే మనం ఏదన్నా చెయ్యగలుగుతాము. ఇదంతా మన భావన లోనే ఉంది అని గుర్తించాలి. వ్యాసుడు, ఆది శంకరాచార్యులు వంటి మహానుభావులు చేసిన వాటితో పోలిస్తే మనం చేసింది ఎంత... అని నాకు అనిపిస్తుంది.
అనేక జాతీయ సదస్సులకు మీరు నిర్వాహకులుగా వ్యవహరించారు కదా ! మీరు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా ?
సింధూ నాగరికతా కాలంలో మన భారతదేశం పరిస్థితి ఏమిటి ? ఆ సమయంలో దక్షిణ భారతంలో మనుషులు ఉన్నారా అన్న ప్రశ్న అడిగినప్పుడు, చరిత్రకారులు – “ఉన్నారు” అని చెబుతున్నారు. మరి వారు ఎలా జీవించారని అడిగితే – “వారు సంస్కృతీ సంపన్నంగానే జీవించారనీ, వారికి ఇనుమును కరిగించే పరిజ్ఞానం ఉందనీ, చరిత్రకారులు చెప్పారు. అంటే మనకు కూడా సింధూ నాగరికత కాలంలోనే దానితో సరిసమానమైన ఒక గొప్ప సంస్కృతి ఉంది కదా... మరి దీన్ని మీరెందుకు ‘దక్షిణ భారత సంస్కృతి’ అని కాని, ‘కృష్ణా గోదావరీ, కావేరీ పరీవాహ సంస్కృతి’ అని కాని, ‘డెక్కన్ సంస్కృతి’ అని కాని అనట్లేదు... అనడిగితే దానికి సమాధానం లేదు.
చరిత్ర వ్రాసేప్పుడు, మన దక్షిణాదిలో ఏదైనా విశేషం దొరికితే దాన్ని భారతదేశంలో దొరికిందంటారు. భారత దేశం అనగానే యూపీ, బీహార్, బెంగాల్ మీదకు దృష్టి వెడుతుంది కానీ, తెలుగునేల అని ఎవరూ అనుకోరు. చరిత్ర రచనలో మనకు జరిగిన అన్యాయం ఇదే! అందుకని ఈ విషయం మీద మేమొక సెమినార్ ప్లాన్ చేసి, ద్రావిడ విశ్వవిద్యాలయం వారితోనూ, ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ వారితోనూ, ASI వాళ్ళతోనూ కలిసి బెజవాడలో 3 రోజుల సెమినార్ చేసాము. మన ప్రాచీన నాగరికతకూ కృష్ణా గోదావరీ లోయల నాగరికతగా పేరు పెట్టాలని అందులో డిమాండ్ చేసాము. ఇంతకుముందు ఎవరూ ఇలా చెయ్యలేదు. నేనొక ఫ్రీ లాన్స్ పరిశోధకుణ్ణి. చరిత్ర మీద డిగ్రీలు చేయకపోయినా, చరిత్ర పట్ల నాకున్న ఆసక్తితో ఈ సెమినార్ నిర్వహణ కోసం శ్రమించాను. ఇదొక మర్చిపోలేని సంఘటన.
ఇంకొకటి తెలుగుభాష ప్రాచీనతను నిరూపించేందుకు ఇవాళ్టికి కూడా ఒక్క యూనివర్సిటీ కనీసం ఒక్క పి.హెచ్.డి. చేయించలేదు. 2008 లో ప్రాచీనతా హోదా వచ్చినా, ఇవాల్టికీ ఈ అంశంపై ఎవరూ పి.హెచ్.డి. చెయ్యలేదు. అందుకని మేము ‘ప్రాచీనతా సదస్సును’ నిర్వహించాము. భాషావేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలను పిల్చి, సదస్సులు నిర్వహించి, మేము దాదాపు 12 వాల్యూంలు తెచ్చాము. తెలుగు పసిడి,వజ్రభారతి, కృష్ణాజిల్లా సర్వస్వం, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమండలి, తెలుగు వ్యాస భారతి లాంటి బృహత్తర పరిశోధక గ్రంథాలు వీటిలో కొన్ని. వ్యక్తిగతంగా ‘తెలుగే ప్రాచీనం’, నైలూ నుండీ కృష్ణదాకా, ప్రాచీన కృష్ణాతీరం-మరో చూపు గ్రంథాలు వ్రాసాను.
సాంకేతికంగా తెలుగు భాషాభి వృద్ధి మీద దృష్టిపెట్టి 2వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించాము. యూనికోడ్ కన్‘సార్టియంలో సభ్యత్వం తీసుకుంటూ, సాంకేతిక తెలుగు అభివృద్ధికోసం నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం మా సభలలోనే ప్రకటన చేసింది. ఇలా ఎన్నో ఫలవంతమైన మార్పులకు కారణం అయ్యాము. మేము ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదు, తెలుగును చంపవద్దని మాత్రమే కోరుతున్నాము.
“కృష్ణా విశ్వవిద్యాలయం “ స్థాపించేందుకు మీరు చేసిన కృషిని గురించి చెప్పండి.
దీని కోసం బుద్ధప్రసాదు గారు, లక్ష్మీప్రసాద్ గారు, కృ. జి. రసం పక్షాన మేమంతా చాలా పోరాటం చేసాము. విశ్వవిద్యాలయం ప్రారంభానికి ముందు తెలుగు యం.ఏ. లేకుండానే ప్యాకేజి పంపిన అంశం నాకు తెలిసింది. నేను బుద్ధప్రసాద్ గారిని కలిసి, పత్రికాముఖంగా కూడా డిమాండ్ చేసి, పోరాటాలు కూడా చేసాము. అప్పుడు కె.సి.రెడ్డి గారు, కౌన్సిల్ చైర్మన్. వారు “మీరు డిమాండ్లు చేస్తున్నారు కానీ, తెలుగు ఎవరూ తీసుకోవట్లేదు, మీరు 15 మంది పిల్లల్ని తీసుకుని రాగలిగితే, ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు డిపార్టుమెంటు పెట్టిస్తాను” అన్నారు. అప్పటికి ఇంకా ఫీజు రీ-ఎంబర్స్‘మెంట్ విధానం రాలేదు. అయినా, ఎవరైనా పేదవారు తెలుగు ఎం.ఎ.లో చేరితే, వాళ్ళ ఫీజులు మేము కడతామని ప్రకటించి, 12 మందికి కృష్ణాజిల్లా రచయితల సంఘం తరఫున ఫీజులు కట్టాము. రెండో సంవత్సరానికి ఫీజు రీ-ఎంబర్స్‘మెంట్ ఆరుగురు పిల్లలకి వస్తే, మిగతా ఆరుగురికి మేము ఫీజులు కట్టాము. ఈ విధంగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మాత్రమే కాక, అందులో తెలుగు శాఖను నిలబెట్టేందుకు కూడా మేము కృషి చేసాము. ఆ తర్వాత ఆ స్పూర్తితో మిగతా యూనివర్సిటీల్లో కూడా తెలుగు శాఖ వచ్చింది.
మీరు పొందిన అవార్డులు/సత్కారాలలో మీరు మర్చిపోలేనివి ఏవైనా ఉన్నాయా ?
ఏదీ చిన్నా, ఏది పెద్దా అని నిర్ణయించి చెప్పలేనండి. అన్నీ గౌరవంగా ఉన్నాయి కనుకనే స్వీకరించాను. 30 పైన మంచి పురస్కారాలే వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిచ్చిన ప్రభుత్వపురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చిన కీర్తిపురస్కారం, ప్రసిద్ధ రచయితల పేరుతో ఉన్న పురస్కారాలు, ఇవన్నీ కూడా అపురూపమైనవే.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
చివరి నిముషం దాకా రాస్తూనే ఉండాలని నా కోరిక. రాష్ట్రం విడిపోయాక, తెలుగు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది కనుక, ప్రభుత్వం తరఫున కార్యక్రమాల నిర్వహణ, అకాడెమి ల పునరుద్ధరణ, సంస్కృతి పరిరక్షణలకు సంబంధించిన అంశాల కోసం పోరాటం చెయ్యడం వంటివి మా భవిష్యత్ ప్రణాళికలలో ఉన్నాయి. వీటన్నిటి కోసం అంచెలంచెలుగా, సమిష్టిగా కృషి చేస్తాము. ఇదేవిధంగా అందరూ ముందుకు వచ్చి ఈ ఉద్యమానికి సహకరించాలని నా కోరిక.
చాలా చక్కటి విశేషాలు చెప్పారండి, కృతజ్ఞతాభివందనాలు.
సంతోషమండి, నమస్కారం.
******
No comments:
Post a Comment