ఇలా ఎందరున్నారు ?- 22 (చివరి భాగం ) - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- 22 (చివరి భాగం )

Share This

ఇలా ఎందరున్నారు ?- 22  (చివరి భాగం )    

అంగులూరి అంజనీదేవి



(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ తో సంకేత  ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని.  సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. అనంత్ తనతో తిరిగింది కేవలం కాలక్షేపానికే అని తెలిసిన సంకేత మనసు ముక్కలవుతుంది. అతన్ని నిలదీసేందుకు వెళ్ళిన సంకేత, ప్రస్తుతం అతను మరో అమ్మాయితో ఇదే ఆట మొదలు పెట్టాడని తెలుసుకుంటుంది. అనంత్  కు  ఆక్సిడెంట్  అవుతుంది. అతనికి సేవలు చేస్తుంటుంది  సంకేత. నీలిమను శ్రీహర్ష పెళ్లి, అనంత్ తో సంకేత పెళ్లి జరిగిపోతాయి. అనుక్షణం నరకం చూపిస్తున్నా, అనంత్ తో ఓపిగ్గా కాపురం చేస్తుంటుంది సంకేత. శివాని భర్తతో విడిపోయి ఒక అవిటివాడిని పెళ్లి చేసుకుంటుంది. హిందూ కాపురాన్ని దిద్దుతుంది సంకేత.  ఇక చదవండి... )
ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది హిందూ జీవితం. సుదర్శన్ కి మంచి జాబ్ వచ్చింది ఇంటి బాధ్యతలు పట్టించుకుంటున్నాడు. హిందూ జీతం సేవ్ చేస్తున్నాడు. ఇంత మంచి మార్పులతో జీవితం ఇంత అందంగా ఉంటందని అసలు ఊహించలేదు. ఇదంతా సంకేత పెట్టిన బిక్ష...
తనతో పాటు సుదర్శన్ కూడా కూర్చోబెట్టి జీవితం విలువేంటో ఉదాహరణలతో మనసుకు హత్తుకునేలా చెప్పింది. “విడాకులు వద్దు కలసి ఉంటాము “ అనే వరకు తీసుకు వచ్చింది.
“అతను మారడు, అతనితో కల్సి ఉండలేను అని నేను అంటే దానికి కూడా ఓ మంచి కారణమూ చెబుతూ .... అతను నిన్ను వెంటపడి పెళ్ళి చేసుకున్నాడు. అతనికి నీ పట్ల ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న చోట ఎప్పటికైనా జీవితం ఉంటుంది. ఏ చిన్న అవకాశం వున్నా అతనితో కలసి ఉండటానికే ప్రయత్నించాలి. తేనే కోసం చేసే ప్రయత్నం లో ఎన్నో ముల్లుంటాయి... జీవితం కూడా అలాంటిదే!” అంది.
అలాంటి సంకేత కోసం తనేం చెయ్యగలుగుతోంది. సంకేత పైన పెంట్ హౌస్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటుంది.రాత్రిపూట తన తల్లి తోడుగా ఉంటుంది. హిందూ తల్లి త్రిపురమ్మ కూడా సంకేత గురించి ఆలోచిస్తుంది. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని ఆశ పడుతోంది. అదే విషయం హిందూతో కూడా అంది.
*****
ఆ మధ్య ఒకసారి దాస్ కనిపించి చెప్పాడు , అనంత్ కి కాలేజి లెక్చరర్ గా ఉద్యోగం ఇప్పించాను...కాని సరిగ్గా చేస్తాడో లేదో అని భయంగా ఉండేది. కాని అతనిలో చాలా మార్పు వచ్చింది. ఈ విషయం మీ ఫ్రెండ్ సంకేతకి చెప్పండి.. సంతోషిస్తుంది...అన్నాడు.
అతను చెప్పాడని కాదు, తను కూడా చూసింది అనంత్ ని కాలేజ్ లెక్చరర్ గా, ఈ విషయం సంకేతకి చెప్పినా స్తబ్దుగానే ఉంది. అనంత్ కూడా తను కనిపించినా సంకేత ఎలా ఉంది అని అడగలేదు.
దాస్ ఏది చేసినా సంకేత మీద ఉన్న అభిమానంతోనే  అని తెలుసు. అందుకే దాస్ తో మాట్లాడాలని ఆ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికొచ్చే ముందు దాస్ షాప్ కి వెళ్లింది హిందూ.
సంకేత మానసికంగా ఒక్కక్కరికి దూరం అవుతుంది. చుట్టూ ఎందరున్నా ఆమె అనుభవించే ఒంటరితనాన్ని ఎవరూ తీసేయ్యలేకపోతున్నారు.... సంకేత తన చుట్టూ ఓ గిరి గీసుకుంది. తనకు మార్పు అవసరం మీరు ఒకసారి తనతో మాట్లాడండి అంది.
“నేను ఎవరిని ఆమెతో మాట్లాడడానికి...అయినా నాకు తెలిసి సంకేత ఒకరు చేబితే మారే రకం కాదు.”
“సర్.. మీరు ఎవరో చెప్పక్కర లేదు. మీరు సంకేత కి మంచి శ్రేయోభిలాషులు... స్నేహితులు కూడా... అనంత్ లో మార్పు కోసం చాలా కష్టపడింది. ఇప్పుడు అయినా జాబ్ చేస్తూ కూడా సంకేతని తీసుకెళ్లాలని రాలేదు. సంకేత ఇప్పటి వరకు అనుభవించింది చాలు సర్. మీరు తనకి కొత్త జీవితాన్ని ఇవ్వండి” అంది.
దాస్ హిందూ చెప్పేది అంతా గంభీరంగా వింటున్నాడు తప్ప దేనికి జవాబు ఇవ్వలేదు.
సారీ సర్! మీ మనసులోని మాట తెలుసు కోకుండా అడిగాను వెళ్లొస్తాను అని బయలుదేరింది హిందూ...
*****
శివాని భుజం పట్టుకొని గట్టిగా వూపుతూ “ఎందుకే ఇలాంటిపని చేశావు?” అంటూ ఆవేశంగా అడిగింది పల్లవి. పల్లవి పక్కనే సంకేత, హిందూ కూర్చునివున్నారు. వాళ్ళలో కూడా ఇదే ప్రశ్న ... ఆమెకు సరిజోడి కాని వాణ్ణి పెళ్ళి చేసుకుందని అనిపించి ముగ్గురు కలిసే వచ్చారు శివాని దగ్గరకు.
“నేను చేసింది సరైనదే ...! నాకు అదే కరెక్ట్ ...!” అంది శివాని.
“అని నువ్వనుకుంటే సరిపోతుందా? చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? అసలు నీ జీవితం గురించి ఆలోచించే చేశావా ఈపని? అప్పుడేమో అలా చేశావు. అందరిలా వుండాలనిపించదా నీకు?” అంది పల్లవి నెత్తీ నోరు కొట్టుకుంటూ..
శివాని వాళ్ళవైపు చూడకుండా ఏటో చూస్తూ “ పెళ్ళయ్యాక నా భర్త చాలా ప్రేమగా చూసుకున్నాడు అందుకే నేను చాలా సిన్సియర్ గా మారిపోయా, కానీ గతంలో నేను చేసిన తప్పులు నాకు బాణాలై గుచ్చుకుని...నా జీవితంలో చాలా మార్పులు జరిగాయి. నా భర్త వదిలేశాడు... ఇంకొకరిని నమ్మితే వాడు మోసం చేశాడు.. నేనున్న హాస్టల్లో కామెంట్స్ తో అక్కడ ఉండలేక ఇంటి కేల్తే మానాన్న అమర్యాదగా, చులకన చేసి మాట్లాడాడు. చదివించాం..పెళ్ళి చేశాం సమస్య ఏదైనా నువ్వు మాత్రం ఇక్కడికి రాకు... కనీసం పుట్టింట్లోనైనా గౌరవం నిలుపుకో...” అన్నాడు.
శివాని ఎన్ని చెప్పినా, హిందూ సంకేత మౌనంగా వున్నా – పల్లవికి మాత్రం ఆవేశం ఆగడం లేదు” చివరికి నీకు మిగిలింది ఇదేనానే! అయినా ఒక చెయ్యి పూర్తిగా పని చెయ్యని వికలాంగుడిని పెళ్ళిచేసుకోవటం ఏమిటే!నేకేమైనా పిచ్చా!” గట్టిగా అరిచింది.
హిందూ ,పల్లవి భుజాన్ని గుచ్చిపట్టుకొని “అది మంచిపనే చేసింది నువ్వేం అరవకు దాన్ని...” అంది.
హిందూ శివాని ఇబ్బందిని గ్రహించి “ఎందుకలా ఆవేశపడతావ్! ఒక చెయ్యి లేనంత మాత్రాన కొంపలేం మునిగిపోవు.అవయవాలన్నీ సరిగ్గా ఉన్న మానసిక వికలాంగుడి కన్నా ఇతనితోనే దాని జీవితం బాగుంటుంది. నిన్న దాస్ ఏమన్నాడో తెలుసా! సంకేతని పెళ్ళి చేసుకొమ్మని అడిగితే నోరెత్తి సమాధానమే చెప్పలేదు. ఆ దాస్ కన్న వికలాంగుడైనా ఈ శివాని భర్తనే మేలు...” అంది కోపంగా.
హిందూ శివాని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అభినందనగా చూసింది. శివాని! నువ్వు చాలా మంచి పని చేశావు.అతన్ని నేను చూశాను. కంప్యూటర్ వర్క్ ని చాలా బాగా చేస్తాడు. ‘శివాని నా భార్య’ అని గర్వంగా చెప్పుకునేలా నిన్ను నువ్వు మలచుకో.. మనిషికి ఏ క్షణానికి ఆ క్షణమే భవిష్యత్తు మొదలువుతుంది. అలా అని నీ గతాన్ని నువ్వు మరచిపోవద్దు. గతంలోని నీ చెడు అనుభవాలే నీ భవిష్యత్తుకి దిశా నిర్దేశాలు “ అంది.
*****
శివాని దగ్గరినుడి ఇంటికొస్తుంటే హిందూ దాస్ గురించి మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి సంకేతకి....
హిందూకి చెప్పాలి...తను దాస్ నే కాదు ఎవరిని పెళ్ళి చేసుకోనని... దాస్ ఇప్పటికే తన విషయంలో చాలా సహాయం చేశాడు.
ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టగానే హాల్లో హిందూ తల్లితో మాట్లాడుతున్న శరదృతి చూసి “అత్తయ్యా! మీరా?ఎప్పుడొచ్చారు? అంది కొన్నిక్షణాలు ఏదో లోకంలోకి వెళ్ళి తిరిగి తన లోకంలోకి వచ్చిన దానిలా.
అనంత్ ఇప్పుడు చాలా మారాడు సంకేతా! జాబ్ చేసుకుంటూ బుద్ధిగా ఉన్నాడు. మీ మామయ్యగారు నేను కూడా అనంత్ దగ్గరే ఉంటున్నాం...” అంది. అలా వుండటం మాకు ఆనందమే కదమ్మా ..నీకు పెళ్ళిట కదా! బాధతో ఆమె గొంతు పూడుకపోయింది.
శరదృతి విచారంగా మొహం పెట్టి ఆ పెళ్ళి ఆపాలని వచ్చాను. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు బాగున్నాడు. నేను హామీ ఇస్తాను. భవిష్యత్తులో వాడితో  నీకెలాంటి ఇబ్బంది రాదు. సరేనా? తొందరపడి నువ్వు ఈ పెళ్ళి చేసుకోకు...” అంది.
“వాడింకా నీకోసం ఎదురు చూస్తూనే వున్నాడు. నిన్ను మరచిపోలేక ఎన్ని సంబంధాలు వచ్చినా వద్దని చెబుతున్నాడు” అంది.
దానికి సంకేత ఒప్పుకోలేదు. వెంటనే ఆమె ముఖంలో రంగులు మారాయి. “అతను నన్ను మరచిపోలేక కాదు. అది నేను నమ్మను. ప్రత్యూషకి ఇప్పుడు ఉద్యోగం లేదు. ఆర్ధికపరమైన భరోసా లేదు, ఆమెకు జీవితం అంటే భయం పుట్టి కనీసం గృహిణిగా అయినా జీవితాన్ని నెట్టుకు రావాలని అనుకుంటుందని అనంత్ కి కూడా తెలుసు... అనంత్ కి ఇపుడు ఉద్యోగం ఉందని ప్రత్యూష కి  తెలుసు, ఆమె అనంత్ కోసం ప్రయత్నం చేస్తోందని అనంత్ కి తెలుసు.ఇక వేరే అమ్మాయిలంటారా? వాళ్ళు ఎలా ఉంటారో ఏమో! ఒకసారి పెండ్లయిన వాడ్ని కదా! అని సందేహిస్తున్నట్లు ఉంది అంతే!” అంది.
శరదృతి మాట్లాడలేకపోయింది.
అక్కడే ఉన్న హిందూ సందేహంగా చూస్తూ “ఆంటీ దీన్నిప్పుడు తీసికేల్లాలని వచ్చారా మీరు? అని అడిగింది. కానీ ఒక్కమాట ఆంటీ! మీ మాట మీద నమ్మకం గౌరవం వున్నాయి. వీళ్ల అమ్మా, నాన్న ఎలాంటివారో మీకు తెలుసు. ఇది ఆనందంగా వుందని తెలిస్తే సంతోషిస్తారు. లేకుంటే దుఃఖిస్తారు అంతకంటే ఇంకేం చేయలేరు. ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి....ఇక ముందు అనంత్ లో కొత్త వ్యక్తి కన్పిస్తేనే సంకేత అక్కడ ఉంటుంది. లేదంటే ఇక్కడికి వస్తుంది. ఇపుడు చేసే ఉద్యోగం కూడా మానేయదు....అంది హిందూ.
శరదృతికి హిందూలో ఒక మంచి స్నేహితురాలు కన్పించింది. నువ్వు కాని నేను కాని సంకేత శ్రేయోభిలాషులమే హిందూ! నేను కూడా సంకేతను కోడలు అని అనుకోవట్లేదు, ఒక స్నేహితురాలి లాగానే చూస్తాను.సరేనా?” అంది. సంకేతతో పాటు హిందూ, త్రిపురమ్మ కూడా బయలుదేరారు.
*****
దారిలో వేల్తున్నంతసేపు శరదృతి, హిందూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు.... సంకేతకి వరమ్మ గుర్తొచ్చింది. ఒకప్పుడు వరమ్మ తనతో “సంకేతా! మన జీవితంలో వచ్చే ప్రతిరోజు, క్రితం రోజు కన్నా ఎంతో కొంత ఎక్కువ నేర్పుతుండాలి’ అనడం గుర్తొచ్చింది. ‘ఎంతో కొంతకాదు బాగానే నేర్పించి బామ్మా!’ అని మనసులో అనుకుంటూ తను అనంత్ దగ్గరకి వెళ్తున్నట్లు నీలిమకి వెంటనే ఫోన్ చేసి చెప్పింది. అది విని నీలిమ సంతోషపడుతూ సెల్ ఫోన్ తీసికేల్లి వరమ్మకిచ్చి సంకేతతో మాట్లాడమంది.
“నాకెందుకో భయంగా వుంది బామ్మా!” అంది సంకేత. ఆ మాట చెబుతున్నపుడు శరదృతికి వినిపించకుండా మాట్లాడింది.
“నీది భయం కాదు. నిరాశ. మనం అనుకున్న స్థాయిలో ఎదుటివ్యక్తి లేకపోతే నీకే కాదు ఎవరికైనా నిరాశగానే వుంటుంది. మీ అత్తగారిని, మామగారిని నీదగ్గరే పెట్టుకో! అంతా వాళ్ళే చూసుకుంటారు. వెళ్లిరా!” అంది వరమ్మ. ఆ తర్వాత కాంచనమాల, శివరామకృష్ణతో మాట్లాడింది సంకేత. వాళ్ళు కూడా ఇంచుమించు వరమ్మలాగే మాట్లాడారు. సంకేత హృదయం తేలికపడింది.
శరదృతి ఇంటికెళ్ళగానే అందరు హాల్లో కూర్చుని, సంకేతని అనంత్ గదికి వెళ్ళిరమ్మని చెప్పింది. సంకేత రూమ్ లోకి వెళ్ళి తనని గమనించకుండా తన పని చేసుకుంటున్న అనంత్ ని చూసి విసురుగా బయటికి వచ్చేసింది. హాల్లో ఉన్న పెద్దవాల్లిద్దరికి అర్ధం కాలేదు  అంతలో అనంత్ వచ్చి అమ్మా సంకేత ఎక్కడ! ఇందాక నాగదికి వచ్చిందా అంటూ , బాల్కాని వైపు వడివడిగా వెళ్ళాడు.
స్నేహితురాళ్ళు ఇద్దరు అనంత్ ని చూసి షాక్ అయ్యారు. అతనలా వస్తాడని వాళ్ళు ఊహించలేదు.అది గమనించి అనంత్ చాలా ప్రశాంతంగా నవ్వుతూ వాళ్ళిద్దర్నీ విష్ చేసి వెంటనే సంకేత చేయి పట్టుకొని నవ్వుతూ..  వదిలేస్తే వెళ్ళిపోతుంది నేను నా గదిలోకి తీసుకెళ్తాను ప్లీజ్! మీరెళ్ళి లోపల కూర్చోండి అన్నాడు. హిందూ నవ్వి శరదృతి దగ్గరకు వెళ్లింది.
గదిలోకి వెళ్ళాక సంకేతను దగ్గరకి తీసుకొని “ నేను నిన్ను చాలా కష్టపెట్టాను. అలా ప్రవర్తించినందుకు ముందుగా నేను ‘సారీ’ చెప్పుకుంటున్నాను” అన్నాడు అనంత్.
ఆ తర్వాత ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక పక్కకి చూస్తూ “ మొన్న దాస్ చెప్పింది విని నిజంగానే భయపడ్డాను. అందుకే అమ్మ కూడా బాంబే నించి వచ్చి నాతో మాట్లాడి నీ దగ్గరకి వచ్చింది. కానీ నువ్వు వస్తావనుకోలేదు.. నీకోసం ఎంత ఎదురుచూస్తున్నానో తెలుసా?” అన్నాడు ఆత్మీయంగా.
“ఆ...తెలుస్తుంది..నేను వస్తున్నానని తెలిసే మీరు షేర్స్ చూస్తున్నారా .....?అంది కోపంగా సంకేత.
“కాదు..కాదు.. నేను ఆ మధ్యన పెట్టిన పెట్టుబడులకి అనుకోకుండా లాభాలు వచ్చాయి, అవి అన్ని ఇప్పటి రేట్ల ప్రకారం అమ్మేసి ఆ వచ్చిన డబ్బును దాస్ కి నేనివ్వాల్సిన మొత్తం డబ్బు కట్టేస్తాను. అతను ఇప్పటికే నాకు చాల సహాయం చేశాడు” అన్నాడు. కృతజ్ఞతగా....
అలా అని మళ్ళీ షేర్స్ జోలికి వెళ్తానని భయపడకు. “ఇకముందు కాలేజీలో పాఠాలు చెప్పుకుంటూ జీవించటమే నా పని...” సిన్సియర్ గా...ఇది కూడా అనంత్ లో దాస్ వల్ల వచ్చిన మంచి మార్పు, అని సంకేతకి అర్ధమైంది. అందుకేనేమో బాషాతీతమైన సంతోషంతో ఆపాదమస్తకం కదిలిపోయింది. తనకి కావలసినదేదో దొరికినట్లు తృప్తిగా భర్త వైపు చూసి....
“హిందూని, త్రిపుర ఆంటీని పంపించేసి వస్తాను. ఇంట్లో సుదర్శన్ ఎదురుచూస్తూ ఉంటాడు”
“సరే! వెళ్ళి త్వరగా రా! ఇక్కడ నీకోసం నేను కూడా ఎదురుచూస్తూ వుంటాను” అన్నాడు నవ్వుతూ...
తిరిగి పైకి వచ్చాక.... దేవారాయుడికి కాల్ చేసి “మామయ్యా! బావున్నారా? పెద్దత్తయ్యా,సరిత వదిన, పిల్లలు బావున్నారా?” అంది. మా అత్తయ్య గారు నా దగ్గరకు వచ్చి నన్ను ఇక్కడకు తీసుకు వచ్చారు. ఇపుడు నేను అనంత్ దగ్గరకు వచ్చేశాను అంది.
“మంచిపని చేశావు సంకేతా! ప్రపంచాన్ని మార్చాలని చాలా మంది తలలు పట్టుకుని ఆలోచిస్తుంటారు.... ఇలా ఎవరికీ వారు మారాలని అనుకోరు. ఈ మార్పు వల్ల అనంత్ ఒక్కడే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు” అన్నాడు మనస్పూర్తిగా.
“మామయ్యా ఆరోజు మీకు చెప్పకుండా వెళ్ళినందుకు క్షమించండి. కానీ మీరు నామీద కోపం తెచ్చుకోకుండా లాయర్ గారితో మాట్లాడి నాకు సహాయం చెయ్యమని చెప్పారట. థాంక్స్ మామయ్యా!” అంది.
“ఇట్స్ ఓకే. అనంత్ ని ఒకసారి కాల్ చేయమని చెప్పు! అన్నట్లు రేపు సరిత భర్త స్టేట్స్ నుండి వస్తున్నాడు. మీరందరూ మా ఇంటికి రావాలి... దాస్ కూడా వస్తున్నాడు. అతనికి రావ్ అండ్ రావు కంపెనీ యం.డి గారు అమ్మాయితో పెళ్ళి నిశ్చయమైంది.
“అలాగే మామయ్యా! తప్పకుండా వస్తాం! అత్తయ్యగారితో, మామయ్యగారితో ఇప్పుడే ఈమాట చెబుతాను” అంటూ అనంత్ గదిలోకి వెళ్లింది సంకేత.
అప్పటికే అసహానంగా అటు, ఇటు తిరుగుతున్నా అనంత్ సంకేత రాగానే గబుక్కున దగ్గరకి తీసుకున్నాడు.
కెవ్వున అరిచింది సంకేత.
లైన్లో ఉన్న దేవరాయుడు కంగారుగా “ఏంటమ్మా! అలా కేకేశావ్?” అన్నాడు.
“అనంత్ మామయ్యా...!” అంది.
దేవరాయుడికి అర్ధమై చిన్నగా నవ్వి కాల్ కట్ చేస్తూ ‘సంకేత జీవిత ప్రయాణం సంపూర్ణం కావాలీ అంటే అనంత్ తోడే కావాలి. ఆ తోడే ఎంత నడిచిన అలుపురానంత బలంగా ఉంటుంది. ఇకముందు ప్రతిమలుపులో గెలుపే. అదికూడా అంతర్ముఖులై, మనసును విశాలం చేసుకుంటూ సాదించుకునే గెలుపు... ఆ గెలుపులో సగం అడుగులు సంకేతవి... సగం అడుగులు అనంత్ వి....: అనుకున్నాడు మనసులో.......
//సమాప్తం....//

No comments:

Post a Comment

Pages