ఇష్టం వుంటే కష్టం ఉండదు
బి.వి.సత్యనాగేష్
ఇష్టం లేని ఎన్నో పనుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తూ ఉంటాము... చెయ్యవలసి వస్తుంది కూడా! ఇలా చెయడం వలన ఒక్కోసారి విసుగొచ్చి మానసిక నీరసం చోటు చేసుకుంటుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకునే వారిలో మాత్రం ఉత్సాహం, ఉత్తేజం బాగా కన్పిస్తాయి. అదెలాగో చూద్దాం.
ఉదయం లేవడంతోనే కొంతమంది చాలా ఉత్సాహంగా లేస్తారని అభిప్రాయ పడతారు కొందరు. అందరూ అలా ఎందుకు భావించలేరనేదే ఇక్కడ సమస్య. దీనికీ ఒక కారణం వుంటుంది. వాస్తవానికి ఉత్సాహమనేది ఉదయం లేచిన వెంటనే ఎక్కడి నుంచో రాదు. ఇంకొంచెం సమయం నిద్రపోవాలని సుమారుగా అందరికీ అన్పిస్తుంది. కాని... ఉత్సాహంగా లేచే వారిలో ఒక ముఖ్యమైన కారణం కన్పిస్తుంది. అదే...వారు చేయవలసిన పని. దానినే లక్ష్యం అంటాం. ‘లేచి ఏం చెయ్యాలి’ అని ప్రశ్నించుకునే వారికి లేవబుద్ధి కాదు. ఉదయాన్నే లేవడం కష్టం అనుకోకుండా ఇష్టంగా అనుకుని పని చేసుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఒక ఉదాహరణను తీసుకుందాం.
తెల్లవారకముందే లేచి కాఫీ, టీ , టిఫన్ లను తయారుచేసి, పిల్లలకు సహాయం చేసి, స్కూలుకు పంపి, వంట పూర్తి చేసుకుని, తనూ, తన భర్త కలిసి భోజనం చేసి, మధ్యాన్నం కొరకు టిఫిన్ బాక్స్ లను తయారు చేసుకుని, ఆఫీస్ కు వెళ్ళి, సహోద్యోగులతో పోటీపడి పనిచేసే సగటు మధ్య తరగతి మహిళాఉద్యోగులు నిద్రనుంచి లేవగానే వారి లక్ష్యాలు కన్పిస్తాయి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత వుండే పని ఎలాగూ వుంటుంది. భర్త, పిల్లలు, పనిమనిషితో సహా అందరికీ మెచ్చేలా వుంటూ, అతిథులొస్తే వారికి కూడా ఆతిథ్యాన్నిచ్చి,కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ రోజులు గడపాలి. ఈ విధంగా ఉండేవారికి కూడా ఉదయం లేవగానే అపుడే తెల్లారిందా అన్నట్లుంటుంది. కాని వారు లక్ష్యదిశలో పనిచెయ్యడం వల్ల అది ఒక అలవాటుగా మారిపోతుంది. సగటు మనిషికి ఈ అలవాటు లేకపోయినా ప్రయాణం వున్నపుడు, పెళ్ళి ముహూర్తం వున్నపుడు, ఉదయం సమయం అయినప్పటికీ ఉషారుగా మేల్కొంటాడు. దీనికి కారణం ...’లక్ష్యం’. కష్టం వున్నా ఇష్టంగా చేయడానికి కారణం ‘లక్ష్యం’ అని తేల్చిచెప్పవచ్చు. ఈ లక్ష్యం డబ్బు కావచ్చు, మెప్పు పొందటం, తృప్తి పొందటం కావచ్చు, ఖ్యాతి కోసం కావచ్చు, బాధ్యత కావచ్చు.
ప్రతీ ఉదయం ఒక గంట ముందు మేల్కొంటే నెలకు ౩౦ గంటలు మన ప్రగతికి ఉపయోగపడతాయి. అలాగే సంవత్సరానికి 365 గంటలు. మరి జీవితం మొత్తంలో ఎన్నో ఫలవంతమైన గంటలను ఆదా చేసుకొని సద్వినియోగపరచుకోవచ్చు.
బాగా చదివే విద్యార్ధి, డ్యూటీలో ఉన్న డాక్టర్, పోలీస్, ప్రొఫెషనల్స్ కూడా లక్ష్యాన్ని, ఫలితాన్ని ఆశించే పని చేస్తారు. వీరందరిలో వున్న ఉమ్మడి భావం – ‘లక్ష్యం’ లక్ష్యాన్ని అలక్ష్యం చెయ్యకుండా లక్ష్యాన్ని తలచుకుంటూ, ఆ లక్ష్యాన్ని చేరడం వల్ల వచ్చే ఫలితాలను ఆశిస్తూ, ఆస్వాదిస్తూ పని చేయడమే వీరి రహస్యం. అందువల్ల పని కష్టం అనిపించినా లక్ష్యాన్ని తలచుకుంటూ ఇష్టంగా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. అలా చేయలేని పక్ష్యంలో పని చేయడం కష్టంగానే వుంటుంది. ఫలితాలు కూడా అంతంత మాత్రమే వుంటాయి. అందువల్ల అసంతృప్తి పెరిగి అదే భావంతో ఇష్టం లేకుండా కష్టం అనుకుంటూ పనిచేస్తారు. ఇదొక విషవలయంగా మారుతుంది. ఈ కష్టం అనే భావం కలగడానికి కొన్ని కారణాలుంటాయి. అవేంటో చూద్దాం.
- రోజూ అదే పని లేదా అదే రొటీన్
- సవాలుగా తీసుకుని పనిచెయ్యలేకపోవడం
- సృజనాత్మకంగా ఆలోచించలేకపోవడం
- చేసేపనివలన చెప్పుకోదగ్గ తృప్తి లేకపోవడం
- వస్తురూపంలో లాభం లేకపోవడం.
పైన పేర్కొన్న కారణాల వల్ల కొందరికి ఉత్సాహం కలగదు. కాని... అటువంటి పరిస్థుతుల్లో కూడా ఇష్టంగా పని చెయ్యడం గురించి చూద్దాం.
ఒక క్రీడాకారుడు రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తాడు. ఆటలో పట్టు ఉండాలంటే వ్యాయామం అవసరం అనే భావాన్ని పెంచుకుంటాడు. పిల్లల్ని పెద్దలు కట్టడి చేస్తున్నట్లుగా బావిస్తారు కొందరు యువకులు. కాని ఆ క్రమశిక్షణను శిక్షగా అనుకోకుండా శిక్షణగా అనుకుంటే ఫలితాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. ఆలోచించడం ద్వారా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడమే దీనిలోని రహస్యం.
“No pain – No gain” అంటారు నిజమే ప్రతీ మనిషి ఈ భూమి మీదకు రాక ముందు తల్లి గర్భంలో 9 నెలలు వున్నపుడు ఆ మాతృమూర్తి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. కాని ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని పడంటి బిడ్డ గురించి ఇబ్బందులను, పురిటి వేదనను భరిస్తుంది. లక్ష్యం... పడంటి బిడ్డ.
ఈ ప్రపంచంలో నూటికి 10% పరిస్థితులు మన స్పందన మీదే ఉంటాయనేది అనుభవజ్ఞుల అభిప్రాయం. కనుక మన కష్టాలను సానుకూల ఆలోచనా ప్రక్రియతో స్పందన ద్వారా ఇష్టంగా మార్చుకునే పద్ధతులను పరిశీలిద్దాం.
- కష్టపడిన వారెవ్వరూ నష్టపోలేదు. ఫలితంతో వెలకట్టలేని అనుభవాల్ని సంపాదించగలం, కనుక పని కష్టమైనదైనా రాబోయే ఫలితం, అనుభవంపై దృష్టిని సారించాలి.
- సమస్యలను అవకాశాలనుకునే మానసిక వైఖరి అలవర్చుకోవాలి. ఒక పేపర్ తీసుకుని నిలువునా మధ్యకు మడతబెట్టి ఎడమచేతిభాగం వైపు సమస్యలను రాసుకోవాలి. కుడిచేతి ప్రక్క అదే సమస్యను అవకాశంగా మార్చుకుని రాసుకోవాలి. ఉదాహరణకు – “రోజూ ఉదయం ఏకాగ్రత కోసం / ఎక్సర్సైజులు చేయటానికి నిద్ర నుంచి లేవాలి. కష్టంగా వుంటుంది” అనే వాక్యాన్ని ఎడమ భాగంలో రాసుకోవాలి. “ఎక్సర్సైజులు చేయటం వలన ఏకాగ్రత మెరుగై మంచి ఫలితాలొస్తాయి. జీవితం అభివృద్ధి పథంలో నడుస్తుంది. అనే వాక్యాన్ని కుడివైపు భాగంలో రాసుకోవాలి. ఈ విధంగా సమస్యలను అవకాశాలుగా మార్చుకుని రాసుకుంటే మానసిక ధోరణి ఎంతో మార్పు కలిగి కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలం.
- బాక్సింగ్ పోటీలో కింద పడటం వలన ఓడిపోరు. పది అంకెలు లెక్కపెట్టే లోపుగా పైకి లేవకపోతే ఓడిపోయినట్లుగా ప్రకటిస్తారు. కనుక పడిపోయామని ఆలోచించడం మాని ఎలా లేవాలనే లక్ష్యం వైపు ఆలోచించే వాళ్ళే గెలుపు పొందుతారు. ఈతకొట్టే ప్రయత్నం చేయనపుడే నదిలోకి పడినవాడు మునిగిపోతాడు. కనుక ప్రతీ పరిస్థితిలోనూ కష్టమైనప్పటికీ ఇష్టంగా ప్రయత్నం చేస్తే జీవితం సంతోషంగా గడుస్తుంది.
- కష్టమైన పనిని ఇష్టంగా చేయడానికి ఊహించుకోవడం (VISUALIZATION) ఒక మంచి ప్రక్రియ. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని పనిచేస్తే వచ్చే ఫలితాన్ని దృశ్యరూపంలో ఊహించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కష్టం ఇష్టంగా మారుతుంది.
- ఆటో సజషన్ పద్ధతిలో సెల్ఫ్ హిప్నాటిజం ద్వారా మనసును ప్రశాంత పరిచి, కష్టాన్ని ఇష్టంగా మార్చుకునే విధాన్ని ఊహించుకుంటే చాలా మంచి ఫలితాలుంటాయి.
- చివరిగా... ఎంతో కష్టాన్ని ఓర్చుకుని ఇష్టంతో పనిచేసి గొప్ప ఫలితాలను పొందిన వారిని “రోల్ మోడల్స్” గా తీసుకొని నిత్యం స్ఫూర్తి పొందుతూ వుంటే ఏదీ కష్టంగా వుండదు. అంతా ఇష్టంగానే వుంటుంది. ఇది కేవలం మానసిక భావన మాత్రమే.
ఏ పనైనా నేర్చుకునే దశలో కష్టంగానే అనిపిస్తుంది. ఇష్టంతో చేస్తే చాలా సులభతరం అయిపోతుంది. సైకిల్ తొక్కడం, స్కూటర్ నడపటం, వంట చేయడం లాంటి పనులన్నీ నేర్చుకునే దశలో కష్టంగానే ఉంటాయి. ఇష్టంతో నేర్చుకుంటాం కాబట్టి తర్వాత సులభమై ఎన్నో లాభాలు కల్గిస్తాయి. ఈ ప్రపంచంలో ఏ పని నైనా ఒకడు సాధించాడంటే అదే పనిని అదే విధంగా చేస్తే ఆ పనిని ఎవ్వరైనా సాధించగలరని నమ్మి ఇష్టంతో సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. కష్టాన్ని ఇష్టంగా అనుకుంటే ఏదీ కష్టం కాదు. ప్రయత్నించి చూడండి. మీ అనుభవం అది నిజమని చెప్తుంది. ఆలస్యమెందుకు? పదండి ముందుకు.
***
No comments:
Post a Comment