జ్ఞాన తృష్ణ దీర్చు కృష్ణ
పిన్నలి గోపీనాథ్
1. సీ. పశ్చిమాద్రిన బుట్టి పరుగు ప్రారంభించి
................................తూరుపు దిక్కునా చేరు జలధి
నాల్గు రాష్ట్రములను నయముగా స్పృశియించి
................................ధన్యులనుగ జేయు తైర్థికులను
ప్రవహించునందాక పావన క్షేత్రాలె
.................................మునగ నెచ్చటనైన ముక్తి దొరకు
పేరు కృష్ణయె గాని పింగళాక్ష గుడులె
..................................దారి పొడవునను దర్శనంబె!
ఆ.వె.
గోవు గళము నుంచి గూర్మితో యురకెత్తి
వేణు మాధవునికె వీడు కొలిపి
సాగరమున గలియు, శైవులకు మరియు
వైష్ణవులకు జ్ఞాన తృష్ణ దీర్చు...!!
2. ఉ. పుష్కర వేళయే యనుచు పుణ్యము గోరుచు వందలాదిగా
దుష్కర మైన నేమియని దూరము, భారము లెక్కసేయకన్
పుష్కలముం జనం కదిలి పూర్తిగ ' వాడ 'ను చుట్టుముట్టినన్
పుష్కర ' పుణ్యమే' దొరకు పూర్తిగ పంకిలమైన నీటిలోన్..... !!
3. ఆ.వె.
చిన్న రేవులెపుడు చింత లేనివి చూడు
ముక్తి ముఖ్యమైన భక్తి చాలు
వసతి కొరకు కాని వాదనలే వద్దు
పంక్తి వరుని మాట ప్రగతి బాట !!
4. ఆ.వె.
మూడు రోజులందె ముగియు ముచ్చట కాదె
తొందరేల పరుల త్రోయనేల
పర్వమనగ నిదియె పన్నెండు రోజులూ
స్నానమాడవచ్చు సహన శీలి.....!
No comments:
Post a Comment