సంతాన లేమి - జ్యోతిష పరమైన కొన్ని యోగాల విశ్లేషణ - అచ్చంగా తెలుగు

సంతాన లేమి - జ్యోతిష పరమైన కొన్ని యోగాల విశ్లేషణ

Share This

సంతాన లేమి - జ్యోతిష పరమైన కొన్ని యోగాల విశ్లేషణ

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
Ph: +91-8897227271

ఈ రోజుల్లో సంతాన లేమితో బాధపడుతున్న వారి సంఖ్య రాను రాను పెరుగుతూ పోతుంది. శాస్త్రీయ కారణాలు ఎలా ఉన్నా మన ధర్మ శాస్త్రాలు మరియు జ్యోతిష శాస్త్రమును అనుసరించి విశ్లేషించినట్లైతే మనము కొన్ని ధర్మ బద్ధమైన నియమాలను పాఠించడం లేదని అనిపిస్తున్నది. పెద్దలను గౌరవించడం, పూజించడం మన సాంప్రదాయము. అది పూర్తిగా మరిచి వారిని వృద్ధాశ్రమాలకు ధారాదత్తం చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి కష్టాలు రావడం సహజమే. సంతాన లేమి తో బాధపడే వారి జాతక చక్రమున కొన్ని ప్రత్యేకమైన యోగాలకు చెందిన అధ్యయనము చేద్దాము. అందులో ప్రధానముగా:
మాతృ శాప సుతక్షయ
పితృ శాప సుతక్షయ
భ్రాతృ శాప సుతక్షయ
బ్రహ్మ శాప సుతక్షయ
గురు శాప సుతక్షయ
దైవ శాప సుతక్షయ
అనే 6 రకాల యోగాలు ప్రధానముగా ఉన్నాయి. ఈ యోగాల గూర్చి క్లుప్తంగా తెలుసుకొందాము:
మాతృ శాప మరియు పితృ శాప సుతక్షయ - తల్లిదండ్రులను గౌరవించడం మన సాంప్రదాయం. మనకు జన్మనిచ్చిన వారిని గౌరవించడం మరియు వారిని సేవించుకోవడం మన ధర్మమూ. అది ప్రక్కన పెట్టి వారి మనస్సు క్షోభ పడేట్లు ప్రవర్తిస్తే వారు ఒక్క క్షణము "అయ్యో ఇలాంటి సంతానము నాకు కలిగినదే" అని భాదపడితే చాలు అది శాపముగా మారి వాడిని గాని లేదా వారికి కలగబోవు సంతానమును కాని పట్టి పీడిస్తుంది. వారికి సంతాన క్షయము లేదా సంతాన హీనులను చేస్తుంది. అదే విధంగా భ్రాతృ శాపము కూడాను. తోడబుట్టిన వాళ్ళ మనస్సుకు క్షోభ కలిగించినట్లయితే కూడా ఇదే విధమైన ఫలితాలు ఉంటాయి.
వేద పండితులు, నిత్యమూ వేద వేదాంగాలు పారాయణము చేయు వారు, బ్రహ్మ జ్ఞానము కలిగి ఉన్న పండితులు, దైవజ్ఞులు, యోగులు, మునులు మరియు సిద్ధులు - వీరందరు దైవ స్వరూపులే, . వారిని దూషించడం, అవహేళన చేయడం మహా పాపము, ఫలితము పై విధంగానే ఉంటుంది.
మన ధర్మ శాస్త్రాల్లో గురు స్థానము అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నది. గురువే సర్వస్వము గా భావించే పూర్వ కాలాన్ని పోల్చి చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రము పొంతన అగుపడదు. గురు భక్తి క్రమంగా లోపిస్తుంది. గురువును దూషించ రాదు వారి ఆగ్రహానికి గురి కారాదు. గురువు ఆగ్రహము చాలా ప్రమాదకరము. కాని గురువు గారు కూడా అంటే విద్వత్తు గల వారు మరియు ఉత్తములై ఉండాలి. అలాంటి గురువుల ఆగ్రహానికి గురియైనచో కూడా ఫలితాలు పై విధంగానే ఉంటాయి.
మనము నిత్య జీవితంలో అనుభవిస్తున్న ఫలాలకు మన కర్మలే కారణము. అందుకు భగవంతుడు కారణము కాదు లేదా ఆయన బాధ్యత ఇందులో ఏమియు లేదు. సుఖంగా ఆనందంగా ఉంటే ఆహా! భగవదనుగ్రహము ఎంత సుఖంగా ఉన్నామని అనుకుంటాము, కష్టము వచ్చి భగవంతుడిని ప్రార్థించిన వెంటనే మన కష్టాలు తొలగిపోకపోతే వాడు ఎంత కఠిన మైన మనస్సు గల వాడు అని దూషిస్తాము. అది దోషమే. మన కర్మలకు మనమే బాధ్యులము అంతే గాని భగవంతుడు కాదు.
కావున మనము అందరమూ ధర్మబద్ధులమై ఉందాము. పెద్దలను, పూజ్యులను, మాతా పితరులను, గురువులను, దైవజ్ఞులు మొదలగు వారందరినీ గౌరవిద్దాము. గౌరవించ లేకపోతే కనీసం వారిని దూషించ వద్దు, వారి మనస్సుకు క్షోభ కలిగించ వద్దు. పైన తెలిపిన ప్రతికూలతలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో సందేహాలు ఉన్నట్లయితే నన్ను సంప్రదించండి
శుభం భవతు, శాంతిర్భవతు, సర్వేషాం స్వస్తిర్భవతు
సర్వేషాం మంగళం భవతు
సర్వేజనాః సుఖినో భవంతు - లోకాః సమస్తా సుఖినో భవంతు.
***

No comments:

Post a Comment

Pages