కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... - అచ్చంగా తెలుగు

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

Share This

 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

టేకుమళ్ళ వెంకటప్పయ్య

 
" ఏమండీ పుష్కారాలొస్తున్నాయి కదా! మా అన్నయ్యను, వదినను పిల్లల్ను పిలిచారా రమ్మని?"
"హు..మొదలెట్టావూ...వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు. ఇదేమైనా పెళ్ళా పేరంటమా? బొట్టెట్టి పిలవడానికి?" విసుక్కున్నాడు సీతపై రామనాధం.
"హబ్బా! ఏమనుషులో ఏంటో! పన్నెండేళ్ళకొక్కసారి వచ్చే పుష్కరాలు. పిలిస్తే ఏమవుతుంది. సంతోష పడతారు".
"అందరూ సంతోష పడతారు.   ఏడ్చే వాడిని నేనే ఇక్కడ!"
"ఎందుకో అంత ఏడుపు?"
"పుష్కరాలంటే చాలు ఎక్కడెక్కడి బంధువులూ తయారవుతారు. మావయ్యా. .బాబాయ్.. తాతయ్య.. అంకులు..  పెంకులూ అనుకుంటూ.. వారికి టిఫిన్లూ.. భోజనాలూ.. సరుకులు కొనేవాళ్ళకు తెలుస్తుంది   బాధ!"
"మహా కొన్నారు లెండి. పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాలకు కూడా అలా బాధ పడకూడదు. మా అన్నయ్య కొడుకు సీ. చేసి బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడు ఇరవై రెండేళ్ళకే..  ఏభై వేలు జీతం"
"వాడో సన్నాసి.. బ్యాంక్ జాబే కానీ సంగీతమంటాడు. పాటలంటాడు. నాటకాలంటాడు. దేశ సేవ అంటాడు. దేశం మీద తిరగడమే వాడి పని".
"మీకు కళల మీద బొత్తుగా సదభిప్రాయం లేదు కదా!. సర్లెండి.. ఇష్టమైతే మన అమ్మాయికి ముడిపెడితే సరిపోతుందనీ.."
"వాడో కోండముచ్చు. నేనొప్పుకోను. సాఫ్ట్ వేర్ అల్లుడినో చూద్దాం. అంతే!"
"ఏదో చిన్నప్పుడు అలా అల్లరి పనులు చేసి ఉండొచ్చు. ఇప్పుడు బాగా బుద్ధిమంతుడయ్యడని వదిన చెప్పింది"
"అయినా బీ.టెక్  డిగ్రీ అవ్వాలి ఇంకా రెండు సంవత్సరాలున్నాయి.  ఇప్పుడే ఏమీ మాట్లాడకు. తర్వాత చూద్దాం" అని మాట మార్చేశాడు రామనాధం.
 *  *  *
 "అమ్మా! కుముదా ఇలా రామ్మా కూర్చో! యెల్లుండి పుష్కరాలకు మీ మావయ్యా పిల్లలూ వస్తున్నారు.
మావయ్య కొడుకు రాజేంద్ర నీకు తెలుసు కదా!"
" ( ఎప్పుడే నాలుగేళ్ళ క్రితం ఒక పెళ్ళిలో కలిసాం కదా? ఐతే ఏంటి?"
"అదికాదమ్మా! మంచి వాడు నీకిష్టమైతే.."
"అయితే?"
"వాడిని నీకిచ్చి పెళ్ళి చేద్దామని"
చివుక్కున లేచింది కుముద. "ఏంటమ్మా అప్పుడే పెళ్ళి ఏంటి? నాకు ఇంకా టూ యియర్స్ చదువుంది కదా!  అయినా నేను సాఫ్ట్ వేర్  వాళ్ళనే చేసుకుంటా" అని తెగేసి చెప్పేసింది.
"ఎవరైతే ఏంటే? వాడికి 50 వేలు జీతం తెలుసా?"
"సాఫ్ట్ వేర్ వాళ్ళకు లక్షల జీతం వస్తుంది తెలుసా?"
"లక్షల జీతం కాదే ఆడదానికి ముఖ్యం. నిన్ను లక్షణంగా చూచుకోగలిగే కుటుంబం లోకి వెళ్ళగలగడం"
"నీ పుక్కిట పురాణాలు, సిద్ధాంతాలు...ఆపి పని చూసుకో అమ్మా.. కాలేజీకి టైం అవుతోంది"
*  *  *
"నరేష్! కొంపముణిగేట్టుంది. మా అమ్మ రాక్షసి ఇప్పటినుంచే పెళ్ళి పెళ్ళి అంటూ తినేస్తోంది. ఎలా తప్పించుకోవాలో? నీకు ఇయర్ క్యాంపస్  సెలెక్షన్ జాబ్స్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా?"
"లేదు కుముదా! సీ.జీ కనీసం 9 ఉండాలట. నాకు ఇప్పటికి ఏడే కదా వుది. అయినా ఇంకా 9 మంత్స్ టైం ఉంది కదా? ఏదో ఒక వుద్యోగం రాకపోదు"
"నీ మొహం వస్తుంది. సరిగ్గా చదువ్. లేక పోతే ఇన్ఫోసిస్ లోనో 10 వేలకు చేరి 2 సంవత్సరాలు బెంచ్ మీద కూచునే జాబ్ వస్తుంది. లోపు నాకు పెళ్ళీ అయిపోతుంది"
"హమ్మో అలా భయపెట్టకు. ఇంకా నేను బ్యాక్ లాగ్ కూడ క్లియర్ చెయ్యాలి."
"సరిపోయింది. ఇలా ఫెయిల్ అవుతూ కూర్చో! . సరే మా మావయ్య కొడుకు పుష్కరాలకు వస్తు న్నాట్ట"
"అయితే"
"వాళ్ళు పుష్కర స్నానాలకు వచ్చినప్పుడు కృష్ణా నదికి వస్తే వాడిని చూపిస్తా నీకు"
"అన్నయ్యా... అని షేక్ హ్యాండ్  ఇచ్చి కుముదను చేసుకో అని చెప్పాలా?"
".. ... అది కాదు. నువ్వు సరిగ్గా చదివి జాబ్ తెచ్చుకోకపోతే వచ్చే ప్రమాదం గురించి చెప్తున్నా! నేను టైంలో కాల్ చేస్తాను అక్కడికి రా...చూద్దువుగాని"
"ఏంటే చూసేది నీ కాబోయే మొగుడినా?"
"హబ్బా అప్పుడే జెలసీ రా నీకు. బై. వస్తా!"
*  *  *
 "అమ్మా కుముదా! తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?"
"ఏమో అమ్మా! ఇక్కడే ఉండాలి. ఒరే కృష్ణా! కృష్ణా! ఎక్కడికెళ్ళావు రా! అమ్మ పిలుస్తోంది"
"అసలే వాళ్ళొచ్చే టైం అయింది. మీ నాన్న అఫీసులో ఏదో మీటింగని అర్జెంటుగా వెళ్ళారు.వీడెక్కడికెళ్ళాడో"
"వస్తాడు లేమ్మా! హడావుడి పడకు.వాళ్ళెమన్న వీ..పీ లా చుట్టాలేగా!"
"సర్లె నువ్వెళ్ళి స్నానం అదీ చేసి రెడీ అవు. అలా జిడ్డు మొహం తో ఉండకు"
"అలాగే తల్లీ నువ్వెళ్ళు"
అరగంట  అనంతరం... ల్యాండ్ ఫోను రింగయ్యింది.
"కుముదా! ఫోన్ చూడు"
"హలో! ఎవరండీ! హా మీరా మావయ్యా! చెప్పండి. అమ్మ లోపలుంది పిలవాలా?"
అవతలనుండి ఏమి చెప్పారో...ఏమో
" గాడ్ అవునా! దెబ్బలేం తగల్లేదు కదా! కృష్ణ కోసం ఇక్కడ అమ్మ వెతుక్కుంటొంది. మీ ఆటో లోనే తీసుకొస్తున్నారా? ధ్యాంక్ గాడ్"
"అమ్మా తమ్ముడు ఆడుకుంటూ పడ్డాడట. మావయ్యా వాళ్ళ ఆటో లోనే వస్తున్నాడట"
విషయం తెలిసిన సీత రామనాధం కు ఫోను చేసి వెంటనే రమ్మని పిలిచింది. కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతోంది.
పది నిముషాల అనంతరం ఆటొ వచ్చి ఆగింది.
అందులోనుండి గాయాలతో కృష్ణ..సీత అన్నయ్యా, వదినా, రాజేంద్ర, వాళ్ళ అమ్మాయి దిగారు.
"ఏమైందన్నయ్యా! మావాడెక్కడ కనబడ్డాడు మీకు" అంటూ ఏడుస్తూ ఎదురు వెళ్ళింది సీత.
"గాభరా పడకమ్మా..సీతా.. వీధి మొదట్లో క్రికెట్ ఆడుతూ మీ వాడు పిల్లలతో గొడవ పడ్డాడట. వాళ్ళందరూ కలిసి వీడిని కొడుతున్నారు. ఆటోలోనుండి చూసి మా రాజేంద్ర గుర్తుపట్టి వాళ్ళతో పోట్లాట ఆపించి తీసుకు వచ్చాడు. చిన్న గాయాలేలే కంగారు పడకు." అని చెప్తూ లోపలికి వెళ్ళారు.
*  *  *
"ఇక్కడ హీరో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వూరికే ఫోన్ చేయకు నేనే చేస్తా" అని పెట్టేసింది కుముద.
"ఏం కుముదా ఎలా ఉన్నావ్?" అంటూ అత్తయ్యా మావయ్యా రూంలోకి వచ్చారు.
"( బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు?"
ఇంతలో రాజేంద్ర "అమ్మా!" అంటూ లోపలికి వచ్చాడు. కుముదను చూసి "అమ్మా చిన్నప్పుడు చూసాను. అప్పుడే ఇంజినీరింగు కు వచ్చేసింది" అన్నాడు నవ్వుతూ.
"అత్తయ్యా నేను మళ్ళీ వస్తాను" అంటూ బయటికి వెళ్ళింది కుముద.
అందరూ మొహాలు చూసుకున్నారు.
*  *  *
 అందరూ పుష్కర స్నానాలకు సిద్ధమౌతుండగా వచ్చి "స్నానాలు అయ్యాక పిండ ప్రదానాలు అవీ ఉన్నాయి బోలెడు టైం పడుతుంది త్వరగా బయల్దేరండి" అంటూ హడావుడి గా బయల్దేర దీసాడు రామనాధం.
 పుష్కర ఘాట్ వద్ద వేల సంఖ్యలో జనం. జోరుగా పారుతోంది కృష్ణమ్మ. కాలు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. ఇంతలో మైకులో పుష్కర ఘాట్లు చాలా ఉన్నాయనీ అన్నీ ఉపయోగించుకోవచ్చనీ అనౌన్సుమెంటు ఇచ్చారు. రామనాధం ఇక్కడ రెండు గంటలైనా తేలేట్టు లేదు వ్యవహారం అని ఎదురుగా ఆవలి గట్టులో ఉన్న సీతానగరానికి వెల్దామని ఆటో మాట్లాడి అక్కడకు చేరారు.
ఆటో దిగగానే సందు చూసి "ఒరే నరేష్... సీతానగరం రెండో ఘాట్ లో ఉన్నాం" అని ఫోను కొట్టేసింది.
 ఘాట్లోకి దిగుతూ ఉండాగా "సుడి గుండాలు ఉన్నాయి లోతుకు వెళ్ళరాదు" అనే బోర్డులు కనబడ్డాయి. అవతలివైపు ఉన్నంత బందోబస్తు.. గజ ఈతగాళ్ళ హడావుడి లేకుండా హాయిగా ఉంది ఘాట్. చాలా ఫ్రీగా స్నానాలు చేస్తున్నారు జనం.
 రామనాధం సీతతో  "సీతా!  మొదట నేను మీ అన్నయ్య స్నానాలు చేసి పిండ ప్రదానాలు గావిస్తూ ఉంటాము. మీరు తర్వాత చేసి వచ్చెయ్యండి" అని హుకుం జారీ చేసి స్నానాలు మొదలెట్టారు. పిల్లలతో ఉన్న రాజేంద్ర అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. నరేష్ కు సైగలతో రాజేంద్రను చూపించింది కుముద. బాగున్నాడు అన్నట్టు సైగ చేయగానే.. వేలు ఆడించి కొడతా అన్నట్టు సైగ చేసింది కుముద.
 వాళ్ళు పిండ ప్రదానాల వైపు కదిలి పోగానే సీత, పిల్లలు స్నానాలకు ఉపక్రమించారు. నరేష్ పైనుండి కుముదతో సైగలతోనే మాట్లాడుతున్నాడు. రాజేంద్ర పిల్లలు ఎక్కడ తప్పిపోతారో అని ఖంగారు పడుతున్నాడు. సీత, వదిన, కుముద మొదట స్నానానికి దిగారు. సీత, వదిన స్నానం చేస్తుండగా కుముద నీళ్ళు మురికిగా ఉన్నాయంటూ కొంచెం పైకి వెళ్ళి స్నానం చేస్తోంది. ఇంతలో ఒక్కసారి నీళ్ళు పొంగి పెద్ద వరదలా వచ్చింది. కుముద కనిపించడం లేదు. సీత పెద్దగా ఏడుపు ఎత్తుకుంది. దూరంగా వంద గజాల దూరం లో కుముద చేతులు పైకి చూపిస్తూ మునిగి పోతోంది. అలలు పెద్దగా వస్తున్నాయి. వెంటనే రాజేంద్ర ఒక్క సారి నదిలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళి కుముదను వీపు పై ఎక్కించుకొని ఒడ్డుకు తెచ్చి పడేసాడు. అందరూ ఒకటే ఏడుపులు. లోపు గజ ఈత గాళ్ళు వచ్చి    “ఇంకో 2-3 నిముషాలు ఆలస్యం చేస్తే మీ పిల్ల మీకు దక్కేది కాదు...ఒక పది గజాల దూరం లో సుడిగుండాలు ఉన్నాయి అన్నారువారు తాగిన నీళ్ళు కక్కించడం వంటివి చేసాక వాతావరణం కుదుట పడింది. అందరూ స్నానాలు ముగించారు. ఇంతలో వచ్చిన రామనాధం, అన్నయ్యలకు జరిగింది అంతా చెప్పింది సీత.  కుముద నరేష్ ఎక్కడా అని చూస్తోంది. ఎక్కడా కనిపించలేదు.   రాజేంద్ర వంక చూసి చిరునవ్వుతో " ధ్యాంక్స్.. బావా.. " అని అందిమనలో మనకు ధ్యాంక్స్ ఏమిటి? వూరుకో..అసలు నేను చాలా కంగారు పడ్డాను. అటు వేపు వెళ్ళి ఉంటే చాలా ప్రమాదం అయ్యేది.
 *  *  *
నరేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తోంది కుముద. సమయం లో రాజేంద్ర అక్కడకు వచ్చి నవ్వుతూ "ఏంటి ఫోను మాట్లాడు. కట్ చేసినా చేస్తున్నారంటే ఏదో అవసరమైన పనే అయివుంటుంది" అన్నాడు. "ఏమీ లేదులే బావా మా ఫ్రెండ్ అయినదానికి కాని దానికి ఫోన్ చేస్తూ ఉంటుంది" అంది. ఇంతలో అక్కడికి వచ్చిన సీత "ఇద్దరూ బాగా ఫ్రెండ్స్ అయిపొయినట్టున్నారు" అంది నవ్వుతూ.  "పో అమ్మా" అని బయటికి వెళ్ళింది.
 అన్నా వదినా పిల్లలూ తిరుగు ప్రయాణం అయ్యారు. రాజేంద్ర వచ్చి "కుముదా ఒకసారి హైదరాబాదు రారాదూ!" అన్నాడు. ఇంతలో సీత వచ్చి.."అల్లుడూ..ఇంజనీరింగ్ అయ్యాక అది పర్మనెంటుగా మీ ఇంటికే వస్తుందిలే" అంది. కుముద తల దించుకొని "అలాగే అమ్మా!" అంది నవ్వుతూ .
*  *  * 

No comments:

Post a Comment

Pages