(జ)వరాలి కధలు - 7
లోక(లేకి)నాధం మామయ్య (పీనాసి కధ)
గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
నూతి దగ్గర స్నానం చేసి లోనికొస్తున్న నేను, వరాలు చేసే పిచ్చిపనికి విస్తుపోయాను. "అదేంటోయి! వంకాయలు తరగటం వరకూ బాగానే ఉంది. కానీ ముచికలు గిన్నెలో వేసి. ముక్కలు క్రింద పడేస్తున్నావేంటి? " నాప్రశ్నకు చురుగ్గా తలెత్తి చూసి తిరిగి తన పనిలో మునిగిపోయింది. "అడిగేది నిన్నే?" రెట్టించాను. " వంకాయలైనా, బట్టలసబ్బైనా నేను నాణ్యతే చూస్తాను" వరాలి బదులుకి నాకు చిర్రెత్తింది. "వంకాయలేమిటి, బట్టలసబ్బేమిటి? నేనడిగినదానికి, నువ్వు చెప్పేదానికి పొంతన ఉందా?" చిరాకుపడ్డాను. "ఖర్మ! టి.వి.లో ప్రకటనలన్నీ బట్టీ వచ్చేసి చస్తున్నాను" అంటూ తలకొట్టుకొంది. "దాని సంగతి సరే! దీని సంగతేమిటి?" నేలమీద వంకాయ ముక్కలను చూపిస్తూ అడిగాను. వెంటనే ఒక వంకాయముక్క తీసి నా చేతిలో పెట్టింది. దాన్ని పట్టుకు వేలాడుతున్న రెండంగుళాల పురుగు చేతికి తగిలి కంపరంతో క్రింద పడేశాను. "ఏమిటిది?" చిన్నగా అరిచాను. "నేనడిగేది అదే! ఏమిటిది?" తనూ గొంతు పెంచడంతో త్రుళ్ళిపడ్డాను. " నాకు కాలు బెణికిందని జీవితంలో యిన్నాళ్ళకి, అదీ మన యింటి దగ్గర్లో పెట్టిన సంతకెళ్ళి కాయగూరలు తెమ్మంటే నిన్న మీరు తీసుకొచ్చిన కూరగాయలేమిటి? ఆ వంకాయ తరిగితే ఒక్క ముక్కంటే ఒక్కటన్నా మంచిదుందా? ప్రక్కింటావిడ పావు కేజీ వంకాయలు పదిహేనంటే మావారు పదికే తెచ్చారని చెప్పాను. అప్పుడావిడ చూసిన చూపుకి అర్ధం యిప్పుడు వాటిని తరుగుతుంటే తెలిసింది. కూరలు తరిగి పెరట్లో పోయటానికి నాకేం సరదానా?" వరాలి తిరుగుబాటుకి తప్పు చేశాను గనుక తగ్గక తప్పలేదు. " అదికాదోయి! ఆవిడ వెళ్ళిన దుకాణానికి నేనూ వెళ్ళాను. ఆవిడ బేరమాడుతుంటే పదిహేనుకి పైసా తగ్గేది లేదన్నాడు. ప్రక్క దుకాణంలో పదికి యిస్తానంటే ఆశపడ్డాను." "వాడన్నాడు సరే! ఆరుకి అడక్కపోయారా? అబ్బే లేదు. కొంతమందికి బజార్లో బేరమాడాలంటే నామోషీ! అక్కడ కన్న యిక్కడ చవకని సంచీ పట్టేశారు. ఏదైనా కొనేటప్పుడు మనం చెల్లించే నాణాలే కాదు వాడిచ్చే వస్తువు నాణ్యత కూడా చూడాలి. ఒక వ్యక్తి సంఘంలో రాణించే తెలివితేటలు సంతమార్కెట్లోనే తెలుస్తాయని మా బామ్మ చెప్పేది. సంతలో వంకాయలే బేరమాడలేనివారు రేపు ఆడపిల్ల తండ్రయితే, వరుణ్ణేం బేరమాడతారండీ? చవకలో దొరికాడని చవటని తెచ్చేస్తారా? " వరాలి మాటలకు నాలో కోపం నషాళానికంటింది. " నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్! వంకాయలకి, వరుడికి సంబంధమేంటే?" " రెండూ కొనుక్కొనేవే కదా!" నెమ్మదిగా సణిగింది. " నా పెళ్ళికేం చేశానో తెలుసుగా! అదే చేస్తాను" చిన్నగా అరిచాను. "మీ పెళ్ళి.. . .మీ యిష్టం. . .కట్నమివ్వాల్సొస్తుందని కన్నబిడ్డ పెళ్ళి చేయకపోతే అది ఊరుకొంటుందా? ఏదో రోజు ఎదురు తిరిగి ' ఏమయ్యోయి! నాకు పెళ్ళి చేసే ఉద్దేశ్యం ఉందా లేదా? ' అని నిలదీస్తుంది" పెళ్ళాడిన వాళ్ళు, పెనం మీద దోశ ఒకటేనని నా స్నేహితుడు చెప్పేవాడు. ఆలుమగలిద్దరూ ఒకళ్ళమీద ఒకళ్ళు ఆధారపడక తప్పదు. పెనం మీద దోశ బ్రతుకు మాడిపోకుండా ఉండాలంటే, తనను తిరగోసి, బోర్లేసి, పళ్ళెంలో పడేసే గరిటె ఆడించినట్లు ఆడక తప్పదు. అందుకే నా కోపాన్ని దిగమింగుతూ వరాల్ని అడిగాను. "ఇంతకీ ఏమంటావ్?" "ఇందాకే చెప్పానుగా! సంఘంలో రాణించాలంటే సంతమార్కెట్ అనుభవం ఉండాలని. చవకరకానికి ఆశపడక నాణ్యమైన సరుకులు కొనాలంటే వాటిని ఎంచి చూసే అనుభవం కావాలి. అందుకని మార్కెట్ పద్ధతులు తెలుసుకోవటానికి రేపట్నుంచి . . . . " అని నర్మగర్భంగా ఆగింది. " ఇది చాలా అన్యాయమోయి! నీకు కాలు బెణికిందని ఏదో సాయం చేద్దామనుకొంటే. . .ఆ మార్కెట్ పని కూడా నాకు తగిలిస్తావా? . ఆఫీసులో అలసిపోయి వచ్చిన నాకు యీ పని అప్పచెప్పటం. . . . ." " నిజమే! కానీ సంపాదించి భార్యను పోషించాల్సిన ఎంతమంది తమ భార్యలను తమలాగే సంపాదించి రమ్మని ఉద్యోగాలకు పంపటం లేదూ? ఆ భార్యలు యింటికొచ్చి వంట కూడా చేస్తున్నప్పుడు, ఆఫీసునుంచి వస్తూ మీరు అలా మార్కెట్లోకి తొంగి చూసి వస్తే తప్పేమిటి? అసలా మార్కెట్ పని మగాళ్ళదేగా?" "నాకు బేరాలాట్టం రాదని నువ్వే చెప్పావుగా!" చివరి అస్త్రం సంధించాను. " సరె! మీతో పాటు నేనూ వస్తాను. ఈ రోజుల్లో ఎంతమంది భార్యాభర్తలు కలిసి మార్కెట్ కెళ్ళటం లేదు" సన్నాయి నొక్కులు నొక్కింది. వెంటనే నా కళ్ళముందు ఖరీదైన హోటల్లో దంపతులకయ్యే హోటలు బిల్లులు, దానితో పాటు అదనంగా చెల్లించే టిప్పులు కళ్ళముందు తిరిగాయి. పెనం మీద దోశ గరిటెను చెందనాడుకొంటే పరిస్థితేంటో కూడా గుర్తుకొచ్చి సరె నన్నాను. భార్యతో బజారు కెళ్తే పెరగబోయే సాదరు ఖర్చులు ఆలోచిస్తున్న నా చేతిలో కాఫీ కప్పు పెట్టి వంకాయల పనిలో పడిందామె. మౌనంగా కాఫీ చప్పరిస్తూ నా కోపాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. వెంటనే సందర్భం ప్రక్కదారి పట్టి నా సందేహం అలాగే ఉండిపోయిందన్న విషయం గుర్తొచ్చి ఆమె ప్రక్కనే చదికిలబడ్డాను. " ముక్కల సంగతి సరె! ముచికలు గిన్నెలో వేస్తున్నావేంటి? " అని అడిగాను. "చూడండి స్వామీ! మీరు తెచ్చిన వంకాయల్లో పుచ్చులు తీసేయగా మంచిగా ఉన్నవవే! కూరకెలాగూ పనికిరావు. కనీసం పులుసులో నైనా వేద్దామని " వరాలి బదులుకు నా చెయ్యి వణికి చేతిగ్లాసులోని వేడికాఫీ నా మోకాళ్ళపై చిందింది. చేతిలో గ్లాసు క్రిందపెట్టి కాలిన చోట చేతితో రుద్దుకొన్నాను. " ఏమిటి? వంకాయ ముచికల్ని పులుసులో వేస్తావా?" " మీ భార్యని కద! మీరు ఖర్చుపెట్టిన పది రూపాయిల్లో రెండైనా కిట్టుబాటు కావాలిగా!" కాఫీ నీళ్ళ కన్న వేడిగానే చురక తగిలింది. తరిగిన కూర ముక్కల్ని కుక్కర్లో పడేసి , దాన్ని గాస్ స్టవ్ పై పడేసింది. తరువాత పుచ్చుముక్కల్ని పెరట్లో పడేసి వస్తూ ఫక్కున నవ్వింది. ఆమె నవ్వుతో నాకు తల కొట్టేసినట్లయింది. " ఎందుకు నవ్వుతావ్?" ఉక్రోషాన్ని అణుచుకొంటూ అడిగాను. " మా లేకినాధం మామయ్య గుర్తొచ్చాడు" వరాలు చెప్పింది. కధలంటే నాకు బలహీనత అని ఆమెకు బాగా తెలుసు. " ఆయనెవడు?" కోపంలో కుతూహలాన్ని కలగలిపి అడిగాను. "ముందా కాఫీ చల్లారిపోకుండా త్రాగండి " కధ మీద ఆసక్తితో నేలపై ఉన్న గ్లాసులోని కాఫీని గడగడ త్రాగేశాను. " కధలంటే మీకెంత యిష్టమండి!" అని నా చేతిలో ఖాళీ కప్పు తీసుకొని సింక్ లో పడేసి వచ్చి కూర్చుంది. " అసలాయన పేరు లోకనాధం. మా అమ్మకు దూరపు చుట్టం. ఆయన ప్రవర్తనను బట్టి బంధువులంతా ' లేకినాధం' అనేవారు. చివరికి అసలు పేరు లోకనాధం పోయి, లేకినాధం అన్న పేరు స్థిరపడిపోయింది" వరాలు చెబుతున్న కధను స్కూల్ల్లో మొదటి బెంచీలో కూర్చున్న కుర్రాళ్ళా నోరెళ్ళబెట్టి వినసాగాను.
లేకినాధం అనబడే లోకనాధం గారు వరాలు తల్లికి దూరపు చుట్టం. వాళ్ళు వరాలి చిన్నప్పుడు వీళ్ళింటికి ప్రక్కవీధిలోనే ఉండేవారు. ఆయనకి ఆరుగురు సంతానం. వారు కూడా తండ్రి లక్షణాలను ముమ్మూర్తులా పుణికి పుచ్చుకొన్నారు. ఆ రోజుల్లో బియ్యం, పప్పులు వంటి వాటిని పిల్లల్ని కొట్టుకు పంపి " మచ్చు " తెప్పించుకొనేవారు. పిల్లలు వెళ్ళి అడగ్గానే దుకాణంవాళ్ళు తమదగ్గర ఉన్న బియ్యం, పప్పు రకాలను చిన్న చిన్న పొట్లాలుగా కట్టి, వాటిపై ' కిలో ధర 'ను వ్రాసి పిల్లలకిచ్చి పంపేవారు. దానినే " మచ్చు " అనేవారు. అలా పిల్లలు తెచ్చిన వాటిని యింటి దగ్గర పెద్దలు వాసన చూసో, కొద్దిగా నోట్లో వేసుకొని రుచి చూసో ఫలానా రకం సరుకు పంపమని ఆ పొట్లంపై వ్రాసి పిల్లలకిచ్చి పంపేవారు. దాని ప్రకారం ఆ రకం బియ్యమో, పప్పో దుకాణం వాడు ఆ యింటికి పంపేవాడు. ఇది వ్యాపారులు, గృహస్తుల మధ్య నమ్మకంపై నడుస్తూ ఉండేది . ఈ పద్ధతినుంచి కూడా " లేకినాధం " గారు లాభం పొందాలని చూసేవారు. వారి ఆరుగురు పిల్లలు దిక్కుకొకరు చొప్పున ఊరిలోని దుకాణాలన్నీ తిరిగి పప్పుల పొట్లాలు ' మచ్చు ' పేరుతో సేకరించి తెచ్చేవాళ్ళు. వాటన్నిటినీ కలిపేసి రోజుకో రకం పప్పు పులుసుతో నెల లాగించేసేవారు. నెల కాగానే తిరిగి పప్పుల మచ్చుకోసం దుకాణాలకి వెళ్ళేవారు. బియ్యం విషయంలో యీ సేకరణ కుదరదు గనుక బియ్యం కొన్నప్పుడు, పక్కింటివాళ్ళు సరుకులు కొనడానికెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళి యీ పిల్లలు కొసరు అడిగేవారు. ఆ రోజుల్లో తమ దగ్గర సరుకులు కొన్న పిల్లలు కొసరు అడిగితే దుకాణం వాళ్ళు కొద్దిగా బెల్లం ముక్క ' కొసరు ' గా యిచ్చేవారు. తమ పిల్లలు అలా కొసరి తెచ్చిన బెల్లం ముక్కలను భద్రపరిచి వారు చేసుకొనే పప్పు పులుసులో రుచికోసం కొద్దిగా పడేసేవారు. అలా వారంలో నాలుగు రోజులు అప్పనంగా వచ్చిన పప్పుపులుసుతోనే గడిచిపోయేది. వాళ్ళింటికెవరైనా బంధువులొస్తే బియ్యం తక్కువ పోసేవారు. వాళ్ళంతా భోజనాలకి కూర్చున్న వేళ తనకి వడ్డిస్తున్న భార్యమీద లేకినాధంగారు అంతెత్తున లేచేవారు. " అంతంత వడ్డిస్తావేంటి? నేనేం మనిషినా? దున్నపోతునా ? " అని ఆయన పెళ్ళాంపై అరుస్తుంటే భోజనాలకి కూర్చున్నవాళ్ళు అర్ధాకలితో చేతులు కడుక్కొని ఒకపూటకే వాళ్ళింటినుంచి వెళ్ళిపోయేవారు. ఎవరైనా తెగించి రెండో పూట విస్తరేయబోతే వారికి యిలాంటి ఆపద్ధర్మంకోసమే తమ యింట్లో గోడకి వ్రేలాడదీసిన రైలు, బస్సు టైంటేబిళ్ళను చూపించి నిర్మొహమాటంగా గెంటేసేవాళ్ళు. వాళ్ళు మాత్రం చుట్టపుచూపుగా ఎవరింటికైనా వెడితే స్నేహితులను వెంటేసుకెళ్ళేవారు. స్నేహితులెదురుగా వీళ్ళని చుట్టాలు పొమ్మని చెప్పరుగా! వారికీ వాళ్ళింట్లో భోజనం దొరుకుతుంది. అలా భోజనం స్నేహితులకి తమ చుట్టాలింట్లో అమరుతోంది గనుక ఆ చుట్టలింటికెళ్ళే దారిఖర్చులను యీ స్నేహితులు భరించాలి. అలా పైసా ఖర్చు లేకుండా తమ పనులను నడిపించుకొనే లేకినాధంగారి పెద్ద అమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఎవరైనా ఆచారం ప్రకారం భారీ ఎత్తున కట్నం, లాంఛనాలు విడివిడిగా యిచ్చుకోలేనివారు అమాంబాపతు అని మగపెళ్ళివారితో గుత్తబేరమాడుతారు. కానీ లేకినాధంగారు తనతో " అమాంబాపతు " అని బేరమాడుతూంటే ఖంగు తిన్నాడా పెళ్ళి జరిపించే పురోహితుడు. లేకినాధంగారి సంగతి పూర్తిగా తెలియని పురోహితుడు చివరికి అమాంబాపతు బేరానికి ఒప్పుకొన్నాడు. పెళ్ళితంతుల్లో పురోహితుడు పట్టుకెళ్దామని పక్కనపెట్టే కొబ్బరిబొండాలు, తలంబ్రాలబియ్యం, తువ్వాళ్ళు, పళ్ళు, అణాపైసలు పక్కనే కూర్చున్న లేకినాధం మూటగట్టేస్తూంటే పురోహితుడికి తలతిరిగిపోయింది. " అవన్నీ ఆచారం ప్రకారం నాకొస్తాయండీ!" కోపాన్ని అణచుకొంటూ అన్నాడు పురోహితుడు. " అమాంబాపతు అని మాట్లాడుకొన్నాం గదాండీ!" అని లేకినాధంగారు సన్నాయి నొక్కులు నొక్కగానే పురోహితుడు మారుమాట్లాడలేకపోయాడు. పాపం ఆ పేదబ్రాహ్మడికి " అమాంబాపతు " లో అర్ధం అప్పుడుగాని తెలిసిరాలేదు. రోజులన్నీ ఒకలాగే ఉండవుకదా! అలాంటి లేకినాధంగారిని రోడ్డెక్కించే పని చేసింది వరాలి రెండవ అక్క సునంద. సునంద, లేకినాధంగారి రెండవ అమ్మాయి సుశీల ఏడవ తరగతి చదువుతున్నప్పటి ముచ్చట. అతని మూడవ అమ్మాయి రాణి ఆరవక్లాసు చదువుతోంది. లేకినాధం గారు ప్రతిఏడాది వరాలి నాన్న దగ్గరకొచ్చి తన కూతురు సుశీలని క్లాసుపుస్తకాలు చింపేసిందని బాగా తిట్టిపోసి, తన కూతురు రాణికోసం సునంద పుస్తకాలు పట్టుకెళ్ళేవాడు. ఆయన చుట్టాలతనే కదాని వరాలి నాన్నగారు వాటిని ఊరికినే యిచ్చేవారు. కానీ రాణి సుశీల పాఠ్యపుస్తకాలనే వాడుకొనేది. వాళ్ళు సునంద పుస్తకాలకు శుభ్రంగా అట్టలేసి మూడవవంతుకు రాణి క్లాసులోని పిల్లలకు అమ్ముకొనేవారు. ఇది తెలుసుకొన్న సునంద ఆ ఏడాది చిన్న చిలిపి పని చేసింది. అలవాటుగా ఆయన ప్రతీ సంవత్సరంలాగే పుస్తకాలు అమ్మేశాడు. సాయంత్రానికే ఆ పుస్తకాలు కొన్నవాడు లేకినాధంగారి యింటిముందు శివతాండవం ఆడి వాళ్ళపదితరాలనూ తిట్టిపోస్తూ పుస్తకాలు వాళ్ళమొహానకొట్టి తన డబ్బులు పట్టుకుపోయాడు. అది చూసిన చుట్టుప్రక్కలవాళ్ళు ఏం జరిగిందని అడుగుతూంటే మొహంచెల్లక నెల్లాళ్ళలో ఆ యిల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేముందు సునంద పుస్తకాలు వాళ్ళకిచ్చేశారు. " ఇంత గొడవ జరగటానికి కారణమేమిటే? " సునందనడిగింది వరాలు. ఆమె తన పుస్తకాలు తీసి చూపించింది. పుస్తకాలన్నిటిలో ప్రతి రెండు పేజీలకు సునంద వ్రాసిన మాటలు ఎవరికైనా వీరావేశమే తెప్పిస్తుంది. " ఈ పుస్తకాలు కొన్నవాళ్ళకు పుట్టగతులుండవు" "లేకినాధం మామయ్యకు భలే బుద్ధి చెప్పావే! " మెచ్చుకోలుగా అంది వరాలు. " లేకుంటే. . . మరీ అంత పిసినారితనమా? ఎవరన్నా తన ఖర్చులు అదుపు చేసుకొని పొదుపు చేయాలి గాని మనింటి ఖర్చులకు ప్రక్కింటాయన జేబులో చెయ్యి పెడితే ఊరుకొంటారా? అయినా తనకు బుద్ధి రాదులే! నేనిచ్చింది చిన్న షాకే! రేపటికి మర్చిపోతాడు. ఆయన దిమ్మతిరిగే షాకెప్పుడు తింటాడో చూడాలని ఆశగా ఉంది " అంది సునంద. వరాలు చెప్పటం ఆపి దీర్ఘశ్వాస తీసింది. " సునంద ఆశ ఫలించిందా?" కధ వింటున్న నేను ఉత్సాహంగా అడిగాను. " బదులీయటానికి యిదేం భేతాళకధ అనుకొన్నారా? జీవితం. ఇదంతా ఎందుకు చెప్పానంటే మనకోసం కొన్ని ఖర్చులు పెట్టేటప్పుడు ఖర్చుకి వెనుకాడకూడదు. ముఖ్యంగా తిండికైనా, పిల్లల చదువుకైనా! ప్రతీవిషయంలో పీనాసితనం చూపిస్తే చిన్నపిల్లలక్కూడా లోకువైపోతాం" అంటూ నావైపు చూడకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది. వరాలు లౌక్యంగా కొట్టిన దెబ్బకు తట్టుకోలేక వసారాలో పచార్లు ప్రారంభించాను. అలా పచార్లు చేయటంలో కూడా పీనాసితనం చూపిస్తే నా ఆవేశం తగ్గేదెలా? మీరే చెప్పండి.
***
No comments:
Post a Comment