మహాకవి క్షేత్రయ్య - అచ్చంగా తెలుగు

మహాకవి క్షేత్రయ్య

Share This

మహాకవి క్షేత్రయ్య

మధురిమ


కృష్ణా పుష్కరాల సందర్భంగా విడుదలవుతున్న ఈ పుష్కర  ప్రత్యేక సంచికలో కృష్ణా నదీ తీరాన పుట్టిన మహానుభావులలో "పదం" అనే సంగీత ప్రక్రియ సృష్టికర్త, మధుర భక్తి సామ్రాజ్య సింహాసనాన్ని  ఆ మొవ్వ గోపాలుని కరుణా కటాక్షాలద్వారా అధిష్టించి ఆ మధుర భక్తిసామ్రజ్యాన్ని ఇప్పటికీ ఏలుతున్నమహోన్నతమైనభక్తి పరాయణుడు  మహాకవి క్షేత్రయ్య.
అసలు క్షేత్రయ్య కంటే ముందు మనం ఆయన జన్మస్థానంమరియు ఆయన ఇంటిపేరు కూడా అయిన మొవ్వ గురించి తెలుసుకోవాలి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని మొవ్వ ఓ మండలము మరియు గ్రామము కూడా,దివిసీమ లో ఇది ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతం.
మొవ్వ గ్రామం అంత ప్రసిద్ధి చెందడానికి గల ముఖ్యకారణం అక్కడి వేణుగోపాల స్వామి వారి ఆలయం. అసలు ఈ ఆలయ చరిత్ర,స్థల పురాణం ఒక్కసారి పరిశీలిస్తే…. ద్వాపరయుగంలో ఓ కార్తీక పౌర్ణమి నాడు ప్రేమమూర్తులైన రాధాకృష్ణలు ఆనంద పారవస్యాలతో  నాట్యం చేస్తూ ఉండగా కృష్ణ భగవానుని కాలి అందెల యొక్క "మువ్వ" పడిందట.అది ఎక్కడ పడిందో వెతికి ఇవ్వమని శ్రీకృష్ణుడు నారదునిఆదేశించాడట.అయితే నారద మహర్షి ఎంత వెతికినా దొరకపోవడంతో ఆయన స్వామి గురించి తపస్సు చేయగా ...స్వామి ఆ మువ్వ ఎక్కడైతే పడిందో అదే ప్రాంతంలో నారద మహర్షి దివ్యదృష్టిలో  అత్యంత కళాకాంతులతో,సౌందర్యముగాఎంతో దేదీప్యమానముగా కనిపించాడు,అప్పుడు నారదుడు పరమానంద భరితుడై... వెనువెంటనే దేవేంద్రుడి చేత తనకి ఎలా కనిపించాడో అలానే ఓ విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహంలో ప్రాణ ప్రతిష్ట చేసాడు.. అన్నది స్థల పురాణమైతే…..
ఆ పడిన మువ్వ మౌద్గల్య మహర్షి గా పునః జన్మని పొంది స్వామి గురించే తపస్సు చేస్తూ ఉండగా మాఘ పౌర్ణమి నాటి సాయం సంధ్యా సమయంలో  మౌద్గల్యుని కొఱకై స్వామి అక్కడ స్వయంభువుగా వెలిసాడని,అప్పుడు దేవతలు  రాత్రికి రాత్రే ఈ దేవాలయం నిర్మించారని ఇంకొక కథ కూడ జనప్రాచుర్యంలో ఉంది.
స్వయంగా స్వామి వారి మువ్వ ఇక్కడ పడింది కాబట్టి ఈ గ్రామం మువ్వ గా పిలువబడి కాలక్రమేణా మొవ్వగా మారిందని కొన్ని గాధలు,మౌద్గల్యుని కొఱకు స్వామి వెలసినాడు కనుక మౌవ్వ గోపాలుడని పిలవబడుతూ కాల క్రమేణా మొవ్వ గోపాలునిగా పిలువబడుతున్నాడు  అని కొన్ని కథలూ కూడా ప్రచారం లో ఉన్నాయి.తనకున్న సహస్ర నామాలలో ఏపేరుతో తనని పిలిచినా పలికే ఆ స్వామి భక్త వరదుడు,వత్సలుడూ కూడా మరి.
క్షేత్రయ్య జన్మించిన సంవత్సరం 1595 అని 1600 అని చారిత్రకారుల మధ్య విభిన్న అభిప్రాయాలున్నా ఆయన 1595-1680 వ ప్రాంతానికి చెందినవాడని నిర్ధారించారు.క్షేత్రయ్య తల్లితండ్రుల పేర్లు తెలియకపోయినా వారు  కంచి లోని వరదరాజస్వామిని ప్రార్ధించగా స్వామి వారి వరప్రసాదం గా పుట్టినందుకు వీరికి వరదయ్య అని పేరు పెట్టినట్లు గా కొన్ని ఆనవాళ్ళు కలవు.ఇదే పేరును వీరు కొన్ని పదాలలో  స్వనామ ముద్రగా "వరద" ఉపయోగించి ఉండవచ్చు అని చారిత్రకారులునిర్ణయించారు.
ఇక వరదయ్య బాల్యంలో పెద్దగా చదువుకోకపోయినా మొవ్వ కి దగ్గరలో గల కూచిపూడి గ్రామంలో సంగీతం,నాట్యం నేర్చుకున్నాడు. ఎప్పుడూ వేణు గోపాలు స్వామిపై అమిత భక్తిని కలిగి ఆయన పై స్తోత్రాలు,శ్లోకాలు, పాటలుమొదలైనవన్నీ పాడుతూ ఆ స్వామి సన్నిధానంలోనే గడిపేవాడట.
బాల్యం నుండీ వరదయ్యకి అదే ఊరిలో ఉండే మోహనాంగీ అనే మిత్రురాలు ఉండేది....ఆమె కూడా  కూచిపూడిలో, నాట్యం అభ్యసిస్తూ ఉండేది వేణుగోపాలునిపై అత్యంత భక్తితో ఉండి స్వామి వారి కోసం ఎప్పుడు ఆలయంలో నాట్యం చేస్తూ ఉండేది.వీరిద్దరికీ వేణుగోపాల స్వామి అంటే అమితమైన భక్తి.
ఇద్దరూ భక్తి పరాయణులై వరదయ్య పాటతో ,ఆమె నాట్యంతో వేణుగోపాల స్వామిని ఆరాధిస్తూ  ఉండేవారట. వరదయ్య అద్భుతమైన  శృంగార భావ ప్రధానమైన పాటలను వేణుగోపాలునిపై రచిస్తే వాటికి అంతే అద్భుతం గా మోహనాంగి నాట్యం చేస్తూ ఉండేదట.శ్రీ కృష్ణుని  శృంగారలీలలను ఎంతో అద్భుతం గా నయకా నాయకీ వర్ణనలో వరదయ్య రచించేవాడట..కాని ఊరిలో ని కొందరు మాత్రం క్షేత్రయ్య మధుర భక్తిని అర్థం చేసుకోలేక మూఢులై అవి నైతిక పతనానికి సంకేతాలు గా ఉన్నాయని విమర్శించేవారట.కాని ఎవరేమనుకున్నా స్వామి వారి ఆలయం లో ఎప్పుడూ ఆ శృంగార రస భరితమైన పాటలు వరదయ్య ఎప్పుడూ  పాడుకుంటూనే ఉండేవాడట.
ఓ కృష్ణాష్టమి నాడు వేణుగోపాల స్వామిపై అద్భుతమైన పదాలను వరదయ్య రచింపగా వాటికి మోహనాంగి ఎంతో గొప్పగా అభినయించింది.ఆనాటి రాత్రి అందరూ వెళ్ళిపోయిన తరువాత కూడా వరదయ్య ఒక్కడే ఆ ఆలయంలో ఉండిపోయాడట.అలా ధ్యానంలో ఉన్న వరదయ్య కళ్లముందు ఒక్కసారిగా ఓ అద్భుతం జరిగింది.ఆలయం తలుపులు వాటంతట అవే తెరుచుకుని ఎదురుగా వేణుగోపాల స్వామి విగ్రహం ఉన్న చోట స్వామి వారు ప్రత్యక్షం అయ్యారట.
ఆ జగన్మోహనాకారుడిని దర్శించుకున్న వరదయ్య కి అది కలో నిజమో తెలిసేలోపే స్వామి వారు “వరదయ్య! నీ మధురమైన పాటలకు పరవశించాను.నీ మధురమైన పాటలు పదాలుగా విశ్వవిఖ్యాతిని ఆర్జిస్తాయి.నువ్వు ఈ పదాల రచన ఇలానే కొనసాగిస్తూ నా ప్రేమ తత్వాన్ని అన్ని పుణ్యక్షేత్రాలకూ వెళ్ళి ప్రచారం చెయ్యి" అని దీవించారట.
స్వామి వారి దివ్య ఆశీర్వచనం అందుకున్న వరదయ్య నిజస్థితి కి వచ్చిస్వామి వారి దర్శనానికిఅమితానందపడి.. తనకు తెలియకుండానే కొన్ని మధుర గీతాలను స్వామి వారిని ప్రశంసిస్తూ పాడాడట.అతను ఇంతకముందు పాటలు పాడినా ఈ పాట ద్వారా ఒక అనిర్వచనమైన అనుభూతి పొందిన క్షేత్రయ్య తన జీవన గమ్యాన్నీ అప్పుడు నిర్దారించుకున్నాడు.అప్పుడు తను పాడిన ఆ పాటే పదం అయ్యింది.ఆ పదం నాయకా-నాయకి భావనలో కొనసాగింది.
మధుర భక్తిలో నాయకా-నాయకీ భావన  అంటే జీవాత్మ పరమాత్మ లో వినీలం అవ్వడమే ...నాయకుడు పురుషోత్తముడైన  భగవంతుడయితే.. నాయకి భక్తుడే.భగవత్ ధ్యానం తప్ప అన్యమెరుగని కొందరు మహాభక్తులు తమ ప్రతీ భావం,భావనలో ఆ పరమాత్మనే ఊహించుకున్నారు.అలాంటివారిలో అగ్రగణ్యులు 12వ శతాబ్దానికి చెందిన శ్రీ భక్త జయదేవులవారు.వీరు సంస్కృతం లో తమ గీతగోవిందం కావ్యంలో రాధకృష్ణుల మధుర భక్తిని ఎంతో శృంగార భరితం గా ఆవిష్కరించారు.అయితే తెలుగులో ఇలాంటి నాయకీ నాయక భావనతో శృంగార కీర్తనలను మొట్టమొదటరచించిన ఘనత మన పదకవితా పితామహులు అన్నమాచార్యులవారిదే..ఆయన రచించిన ఆ  శృంగార కీర్తనలన్నీ మధురభక్తికి నిదర్శనాలే.పదాలు అంటే పాటలే...ఆనాటి కాలంలో పాటని పదం అని అనేవారు.
అయితే అన్నమాచార్యులవారు తరువాతి కాలంలో ఆధ్యాత్మిక సంకీర్తలని కూడా రచించారు..కాని కేవలం మధురభక్తి మార్గంలోనే భగవంతుడిని చేరుకున్న వారిలో జయదేవుల తరువాత వారు క్షేత్రయ్య గారే.
స్వామి వారు నిర్దేశించిన కార్యానికై బయలుదేరాడుక్షేత్రయ్య.మొవ్వ వదిలి వెళ్ళేముందు తన మితృరాలు మోహనాంగి దగ్గరికి వెళ్ళి తాను భగవత్ ప్రచారానికై బయలుదేరుతున్నానని ఆమెను తిరిగి కంచిలో కలుసుకోగలనని వాగ్దానం చేసారు.
తాను మొట్టమొదటగా ఆ వరదరాజస్వామి దర్శనానికై కంచికి బయలుదేరుతున్నానని ఆ స్వామి దయవలన తిరిగి ఆమెను కలుసుకోగలనని వాగ్ధానం చేసి కంచి కి బయలుదేరెను.
క్షేత్రయ్య కంచికి చేరుకోబొయే ముందు మార్గంలో గోల్కొండ చేరుకొనెను.ఆ సమయములో గోల్కొండ ను అబ్దుల్లా కుతుబ్ షాహ్ పరిపాలించుచున్నాడు.ఆ రోజుల్లో మన భారతదేశం లో చాలామంది రాజులు తమ పరిపాలనలో కళలను ఎంతో అభివృద్ధి చేస్తూ కళాపోషకులుగా ఉండేవారు.గోల్కొండ నవాబు గారి  ఆస్థానంలో కూడా  సంగీత సాహిత్యాలకు,నృత్యానికి మంచి ఆదరణ ఉండేది. నవాబు గారి ఆస్థానములో కూచిపూడి నాట్యప్రక్రియ సృష్టికర్త శ్రీ సిద్ధేంద్రయోగి కూడా ఎన్నో సన్మాన సత్కారాలను అందుకున్నారు.వరదయ్య వారి ఆస్థానంలో చక్కటి పదాలను ఆలపించి నవాబు గారి ప్రశంసలను అందుకున్నాడు.
నవాబు గారి ఆస్థానంలో కమల అనే నర్తకీ మణి ఉండేది...ఆమె క్షేత్రయ్య శృంగర పదాలకు అత్యంత ఆకర్షితురాలైనది.. వరదయ్యకి ఇదే విషయము చెప్పగా క్షేత్రయ్య చిరునవ్వు నవ్వి అది శృంగారంకాదనియు...తన మొవ్వ గోపాలునిపై తనకు గల మధుర భక్తి అనియు ఆమెను సున్నితం గాతిరస్కరించాడు...తన అందం,అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఆమెను వరదయ్య తిరస్కరించడం అవమానంగా భావించినా రాజు గారి అమిత ఆదరాభిమానాలను చూరగొన్న వరదయ్య ను ఏమీ చెయ్యలేక ఊరుకున్నది.
నవాబు గారు వరదయ్య ని ఎప్పటికీ వారి ఆస్థానం లో ఉండమని అభ్యర్దించినప్పటికీ అది సున్నితం గా తిరస్కరించి...తన జీవిత గమ్యం మొవ్వగోపాలుని ప్రేమ తత్వమును ప్రచారం చెయ్యడమని చెప్పితప్పకుండా మరల మొవ్వ కి చేరుకునే ముందు ఇక్కడికి తిరిగి రాగలనని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకున్నాడు వరదయ్య.
దక్షిణ భారతదేశం లో ఆ రోజుల్లో చాలా రాజ సంస్థానాలలో తెలుగు భాషని రాజులు చక్కగా పోషించితరించారు.తెలుగు కవులకు ఎంతో ఉన్నతమైన ఆదరణ లభించేది.అలాంటి సంస్థానాలలో ఒకటి మధురై లోని తిరుమలనాయకుని ఆస్థానం.తిరుమల నాయక మహారాజు  వరదయ్య ని ఎంతో ఆత్మీయంగాఆహ్వానించాడు. తిరుమలనాయక మహారాజు స్వయంగా కవి,కళాపోషకుడు.ఆయన ఆస్థానం లోవరదయ్యకు తోటి కవులనుంచీ ఎంతో మంచి ఆదరణ లభించింది.మధురై లో ఉండగా మీనాక్షీ అమ్మవారి దర్శనం కూడా వరదయ్య కి ఎంతో గొప్ప స్పూర్తిని ఇచ్చింది.ఆ ఆలయం తిరుమల నాయకుని కాలం లో ఎంతో శోభయమానంగా వర్ధిల్లిన ఆలయాలలో ఒకటి.అక్కడ అమ్మవారి సన్నిధిలో ప్రశాంత వాతావరణంలో సుమారు 2000 వరకూ పదాలు రచించారు మన క్షేత్రయ్య.
ఆ తరువాత మధురై నుండీ కంచి కి బయలుదేరాడు మన వరదయ్య.కంచి లోని వరదరాజ స్వామి దర్శనం చేసుకున్న తరువాత ఇక తన జీవితం ధన్యమైనట్టు గా భావన కలిగింది వరదయ్యకి.ఇక తన జీవిత గమ్యం చేరుకున్నాను అనుకున్నాడు వరదయ్య.వరదయ్య మధుర భక్తి కంచిలో పతాక అధ్యాయానిఅందుకుంది. తాను నాయకి గా ఆ వరదరాజ స్వామి నాయకుడిగా ఎన్నో మధుర సంకీర్తనల ద్వారా స్వామిలో ఐక్యం అయ్యాడు వరదయ్య.మొవ్వ లో వేణుగోపాల స్వామి తరువాత ఈ ఆలయం అతనిని అంతగా ఆకట్టుకుంది.
ఎప్పుడూ ఆలయంలో ధ్యానంలో ఉంటూ ఉండడమో,లేక స్వామి పై పదాలను కూర్చుచూ కాలముగడిపేవాడు.అర్చకులకు కూడా తన గేయాలద్వారా అత్యంత ప్రీతిపాత్రుడైన వరదయ్య ఓ సారి ధ్యానంలో ఉండగా ఆలయ ప్రధానార్చకులు వరదయ్యని ఆలయంలోనే ఉంచేసి తాళం వేసి వెళ్ళిపోయారు.కాసేపటికి వరదయ్య కళ్ళు తెరిచి చూసేసేరికి స్వామిదగ్గరికి ఆయన దేవేరి పేరుందేవి తాయరు స్వామి వారి ఏకాంతసేవకై వచ్చినారట.ఆ దృశ్యాన్ని చూసి  పులకించిపోయిన వరదయ్య ఆసువుగా  కొన్ని పదాలను అప్పటికప్పుడు రచించాడు.
మరునాడు అర్చకులు ఆలయ ద్వారాలు తెరిచేసేరికి పదాలు ఆనందపారవశ్యాలతో పదాలు  పాడుకుంటున్న వరదయ్య  ని చూసి ఆశ్చర్య పోయారట. వరదయ్య చెప్పిన సంగతులు విని ఆహా!ఏమి ఈ భక్తుని అదృష్టం అనుకున్నారట.ఆనాటి నుండీ వరదయ్య అంటే గౌరవ భావం అందరికీ  ఇంకా ఎక్కువయ్యింది.
సుమారు ఒక నెల రోజులపాటు కంచిలో నివసించాక తంజావూరు సంస్థానం లో కళలకుఉన్నఆదరాభిమానాలగురించి విని తంజావూరు వెళ్ళాలని నిర్ణయించుకుని వరదరాజ స్వామి వద్ద సెలవు తీసుకుని మరల స్వామి దర్శనార్థం తప్పక వచ్చెదనని నిర్ణయించుకుని వేణుగోపాలుని మధుర భక్తి ప్రచారానికై తంజావూరు బయలుదేరారు.
ఆ సమయంలో తంజావూరిని రఘునాథ నాయకుని కుమారుడైన విజయ రాఘవుడుపరిపాలించుచున్నారు.విజయ రాఘవుడు కూడా తండ్రి వలెనే మంచి కళాపోషకుడు,స్వయంగా ఆయనే గొప్ప కవి కూడా సుమారు 40 కావ్యాలు రచించాడు.  కుచిపూడి  నాట్య కళాకారులకు అచ్యుతరాయపురం అగ్రహారానే బహుమానంగా ప్రకటించిన కళాపిపాసి.
కంచి లో ఉండగానే పేరుప్రఖ్యాతులు ఆర్జించిన మన వరదయ్య ని విజయ రాఘవుడు ఎంతో ఆదరం గా స్వాగతించినప్పటికీ అతని ఆస్థానంలో ని ఇతర కవులు మాత్రం వరదయ్య తమ ఆస్థానానికి ఎప్పుడు వస్తాడా వారిని ఎప్పుడు ఓడించి రాజు గారి ముందు అవమాన పరుద్దామా అని ఎదురుచూస్తూ ఉన్నారు.అదే ఆస్థానంలో రంగజమ్మ అనే నర్తకి ఉండేది, ఆవిడ గొప్ప కవయిత్రి కూడా,ఉషా పరిణయము ఆమె రచించిన కావ్యము...ఆవిడ మాత్రం  వరదయ్య యందు అభిమానము కలిగి ఉండేది. ఇంకా ఈ ఆస్థానంలో చతుర్దండి, ప్రకాశిక వంటి కావ్యాలను రచించిన శ్రీ వేంకటముఖి ,ప్రముఖ కవి,విజయరాఘవుని గురువులు అయిన  శ్రీనివాస  తాతాచార్యుల వారు కూడా ఉండేవారు.
విజయ రాఘవ మహారాజు,వరదయ్య మంచి మితృలవలే ఉండేవారు.. ఇద్దరూ ఎన్నో చర్చాఘోష్టులలొ పాల్గొనే వారు..ఈయన దగ్గర ఉండగా వరదయ్య సుమారు 1000 పదాలు రచించాడు.వరదయ్య మహారాజుని ఏకవచనం  తోనే సంబోధించేవాడు... వీరి స్నేహం పై అసూయ పెంచుకుని వారి మైత్రిని సహించలేని కొందరు  సభికులు ఓనాడు...రాజు గారిని ఏకవచనంతో సంబోధించడం అవమానం అనీ,వరదయ్య పదాలలో భాష మామూలు మాట్లాడుకునే భాషలా ఉంది కానీ అందులో కవిత్వపు ఛాయలే లేవని అవమానించారు.దానికి జవాబు గా వరదయ్య ఈవిధం గా చెప్పాడు"నేను మహారాజుని ఓ రాజుగా గౌరవించినా కవిత్వం చెప్పేటప్పుడు ఓ స్నేహితునిగా ఆతనిని ప్రేమిస్తాను.అందుకే పదాలు వినిపించేటప్పుడు అలా సంభొదిస్తాను అని అతి వినయం గా సమాధానం చెప్పి..తన పదాలు పండితులకే కాదు పామరులకి కూడా అర్థం కావాలి అని తాను భావించాడు కాబట్టే సరళమైన వాడుక భాషలోనే రచించాననీ ఇది వేణుగోపాలుని సంకల్పం అనీ తాను నిమిత్తమాత్రుణ్ణి అని చెప్పి  ఓ పదాన్ని సగమే రాసి మిగిలనది సభికులను పూర్తి గావించమని చెప్పి తంజావూరు నుంచీ  రామేశ్వరం బయలుదేరాడు.
తన మితృరాలు మోహనాంగి కి ఇచ్చిన వాగ్దానం ప్రకారం కంచి లో ఉండగా ఆమెను రమ్మని మొవ్వ కి కబురు పంపాడు. కానీ ఆమె వచ్చేలోపే తంజావూరు బయలుదేరాడు వరదయ్య.కాని ఆమె కంచిలో కొన్నాళ్ళు వేచి చూసి వరదయ్య రాకపోవడంతో ఆలయ అర్చకుల సలహా మేరకు తంజావూరుబయలుదేరింది.తంజావూరుకు వచ్చిన ఆమె కి అక్కడకూడా నిరాశే ఎదురయ్యింది. ఎందుకంటే ఆమె తంజావూరు వచ్చేసేరికి వరదయ్య రామేశ్వరం బయలుదేరాడు.అయితే తంజావూరులో ఆమె వరదయ్య శిష్యురాలిగా పరిచయం చేసుకోవడంతో ఆమెకు రంగజమ్మ గారితో పరిచయం ఏర్పడింది. ఆమెను రంగజమ్మ గారు ఆహ్వానించీ ఆతిధ్యం ఇచ్చారు.వరదయ్య తప్పక తిరిగి తంజావురు వస్తాడని,పండితులకుపూరించమని ఇచ్చిన పద్యంకోసమైనా వరదయ్య తప్పక ఇక్కడికి తిరిగి వస్తాడని అప్పుడు కలుకోగలదని చెప్పి మోహనాంగి కి తన ఇంట్లోనే ఆతిధ్యం ఇచ్చారు రంగజమ్మ.
ఇక రామేశ్వరం బయలుదేరిన మన వరదయ్య మార్గంలో భూలోక వైకుంఠంలా విరాజిల్లే  శ్రీరంగం వెళ్ళి అక్కడ శేషశయనుడైన శ్రీమన్నారాయణుని దర్శించి,వారిపై కొన్ని పదాలను కూడా రచించి,రామేశ్వరం బయలుదేరారు.రామేశ్వరంలో రామునిచే ప్రతిష్ట గావించబడిన రామేశ్వరుని దర్శించి...కొంత కాలం స్వామి సన్నిధిలో గడిపాక తిరిగి తంజావూరు,గోల్కొండ మీదుగా మొవ్వ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
ఇక్కడ తంజావూరులో వరదయ్య రాకకి నిరీక్షిస్తున్న మోహనాంగి కి ఈవార్త కొందరు యాత్రికుల ద్వారా తెలిపరిచినారు రంగజమ్మ గారు.ఆ వార్త విని అత్యంత సంతోషభరితమైన స్థితిలో ఉన్న మోహనాంగీ తంజావూరు ఆస్థానం లో నాట్య ప్రదర్శన ఇవ్వవలిసినదిగా కోరారు రంగజమ్మ.ఆమె అందుకు అంగీకరించగా ఓనాడు విజయరాఘవ మహారాజు గారి ఎదుట వరదయ్య పదాలకు మోహనాంగి అద్భుతం గా నాట్యం చేసింది...వరదయ్య వేణుగోపాలుని రాకకి నిరీక్షిస్తూ సాగిన ఆ పదాన్ని వరదయ్య కోసం  తన నిరీక్షణ ప్రతిబింబించేలా  నర్తించింది.అదే సమయంలో వరదయ్య కూడా అస్థానానికి వచ్చాడు.వరదయ్య దర్శనం తో మోహనాంగి తరించింది.సభలో ఇతర కవులు కూడా  వరదయ్య తమకి పూరించమని ఇచ్చిన పదాన్ని పూర్తిచేయలేకపోయామని  ఆ పని కేవలం కారణజన్ముడైన వరదయ్య వలనే సాధ్యం అని,తమ అజ్ఞానానికి మన్నించమని కోరగా వరదయ్య అసంపూర్ణంగా మిగిలి ఉన్న ఆ పదాన్ని పూర్తి చేసాడు…వరదయ్య అపారమైన ప్రతిభ కి ఆయనకు “క్షేత్రజ్ఞుడు” అన్న బిరుదును... ఇన్ని.. క్షేత్రాలు దర్శించి ఇంతమందిని తన రచనల ద్వారా తరింపచేస్తున్న వరదయ్య కి “క్షేత్రయ్య” అన్న బిరుదుని రాజు గారు,మిగిలిన పండితులు కలిసి   ప్రధానం చేసారు.
రాజుగారి దగ్గర, అందరి దగ్గర సెలవు తీసుకుని మోహనాంగితో మొవ్వకు ప్రయాణమయ్యాడు.ముందుగా వారు కంచిచేరగా అక్కడ వరదరాజుని పునః దర్శించుకున్న వరదయ్య ఓ అద్భుతమైన పదాన్నిసమకూర్చగా దానికి మోహనాంగి అంతే అద్భుతంగా ఆనంద నాట్యము చేసిందట.ఆలయములోనివారందరూ ఆ నాట్యానికి ఆ రచనకీ ముగ్ధ మనోహరులై వారిద్దరినీ సత్కరించినారట.
కంచినుండీ తిరిగి గోల్కొండ రాగా అప్పటికే క్షేత్రయ్య రాకకై ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నవాబు గారు క్షేత్రయ్యను ఎంతో ఘనంగా స్వాగతించి సత్కరించారు.
గోల్కొండ నవాబు గారి ఆస్థానంలో తులసిమూర్తి అనే పండితుడు ఉండేవాడట.ఆయన నవాబుగారికి క్షేత్రయ్య పై లేనిపోనివన్ని చెప్పి ఆయన పై చెడు అభిప్రాయాన్ని కలిగించాలని చూసేవాడు.తులసిమూర్తి  కుటిలబుద్ధిని గ్రహించిన గోల్కొండ నవాబుగారు అతనికి బుద్ధి చెప్పాలని..ఒకరోజు సభలో అందరి ఎదుట క్షేత్రయ్య కి 40రోజుల గడువులో 1500 పదములను సమకూర్చమని ఆదేశించెను.ఇది కూడామొవ్వగోపాలుని ఆదేశంగా స్వీకరించిన క్షేత్రయ్య సరే అనెను.అయితే క్షేత్రయ్య మనసుని అపవిత్రం చేసి అతని అలోచన మువ్వ గోపాలునినుండి మళ్ళిస్తే అతను నిర్ణీత సమయంలో పదాలు రచింపలేడని దుష్ట అలోచనతో తులసి మూర్తి ఆస్థాన నర్తకి కమలతో కలిసి ఓ దుష్ట పన్నాగము పన్నెను.కమల కూడా క్షేత్రయ్య తనను తిరస్కరించాడన్న అలోచనాతో సరే అని తులసిమూర్తి తో చేతులు కలిపెను....కానీ క్షేత్రయ్య మనసు ఆ మొవ్వ గోపాలనుకే అంకితం అయ్యెనని తెలుసుకోలేకపోయెను.
కమల ఒకనాడు  క్షేత్రయ్యను తన నాట్య ప్రదర్శనకు ఆహ్వానించి ఆయనకు వశీకరణ ద్రవమును  పండ్ల రసములో కలిపి ఇచ్చెను.క్షేత్రయ్య మనసు వికలితమై ఇంటికి చేరెను...క్షేత్రయ్యలో మార్పును గమనించిన మోహనాంగి వివరాలడుగగా క్షేత్రయ్య కమల ఇంటికి వెళ్ళి ,పండ్లరసమును తాగెనని చెప్పి...ఏదొ శక్తి తనని ఆమెవైపుకు లాగుతున్నదని చెప్పి తనకు తెలియకుండానే ఆమె ఇంటికి వెళ్ళుటకుసిద్ధమయ్యెను. విషయమును గ్రహించిన మోహనాంగి శ్రీ సిద్ధేంద్రయోగి ద్వారా క్షేత్రయ్య కు ఆ వసీకరణమునకు విరుగుడు మందుని ఇప్పించెను..కానీ క్షేత్రయ్య ఆరోగ్యము కుదుటపడుటకు చాలా రోజులు పట్టెను.ఈలోగానవాబుగారిచ్చిన నలభై రోజుల గడువు ముగియుటకు కేవలం ఒక్కరోజే ఉందనగా మోహనాంగి చాలా బాధపడెను.మొవ్వ గోపాలుని ప్రార్దించుచూ క్షేత్రయ్య కు సేవ చేస్తూ ఉండగా.. ఉన్నట్టుండీ క్షేత్రయ్య లేచి కూర్చుని మొవ్వ గోపాలుని ధ్యానము ప్రారంభించెను.ఆయనలో ఏదో నూతన శక్తి ప్రవేశించి ఆయన తెల్లవారే లోగా 1500 పదాలనూ పూర్తి చేసెను.మోహనాంగి,క్షేత్రయ్య ఈ సంఘటనతో చాల ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు.తమ మొవ్వ గోపాలుడే ఈ పని చేయించగలిగిన సమర్ధుడని గ్రహించి ఇంక ఆలశ్యం చేయకుండా వెంటనే మొవ్వ కి బయలుదేరాలని నవాబు గారి దగ్గరకు వెళ్ళారు.విషయం తెలుసుకున్నతులసిమూర్తి,కమల తమ అజ్ఞాన్ని మన్నించమని క్షేత్రయ్య ని  వేడుకున్నారు... నవాబు గారు క్షేత్రయ్య ని ఘనంగా సన్మానించి,సత్కరించి...క్షేత్రయ్య నీకు ఆ మొవ్వగోపాలునికి తేడా లేదు..నువ్వే ఆ మొవ్వ గోపాలుడివి నీకు ఆతిధ్యం ఇచ్చిన నేను ధన్యుడిని అని ఆయనను సాదరంగా మొవ్వ కి సాగనంపారు.
 అమితానందంతో మొవ్వకు బయలుదేరిన క్షేత్రయ్య మార్గమద్యంలో భద్రాచల రాముడినీ ,తిరుపతి శ్రీవేంకటేశ్వరుణ్ణీ దర్శించుకొనెను.ఏడుకొండలు ఎక్కి ఆ తరువాత ఆ స్వామి దర్శనంచేసుకుని ఆ వేంకటపతిపై కొన్ని పదములు కూర్చి పాడెను.క్షేత్రయ్య తన యొక్క  తన మన ధనాలన్నీ మొవ్వగోపాలుని పాదాల చెంత సమర్పించిన మహా భక్తుడు. అందుకే ఆయనకు ఏ దైవాన్ని చూసినా ఆ మొవ్వగోపాలుడే కనిపించేవాడు.
మొవ్వ వదిలిపెట్టి వెళ్ళిన తరువాత తిరిగి మొవ్వ చేరేలోపు సుమారు పది సంవత్సరాల కాలంలో  క్షేత్రయ్య  కాపిగిరి,తిరుపత్తూరు,చక్కిరపురం,కొవిటూరు,చిదంబరం,తిరువల్లూరు,వేదనారయనపురం,కాంచీపురం,తిరుపతి,పాలగిరి,శ్రీశైలం,హంపి,మధురై,శ్రీరంగం,మహాదేవపట్నం,రామేశ్వరం,భద్రాచలం  మొదలైన పుణ్యక్షేత్రాలన్ని దర్శించి తరించాడు.ఆ రోజులలో ఇన్ని క్షేత్రాలు దర్శించగలిగాడంటే ఇది కేవలం మొవ్వ గోపాలుని ఆశీర్వాద బలం తప్ప ఇంకేమీ కాదు.
ఈ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి ఓ కృష్ణాష్టమి రోజుకి మొవ్వ గ్రామం చేరుకున్నాడు మన క్షేత్రయ్య.గ్రామంలో ప్రజలందరూ ఘన స్వాగతం పలికి ఎంతో ఆదరాభిమానాలతో మన క్షెక్షేత్రయ్య ని ఆహ్వానించారు.మొవ్వ గోపాలునిని దర్శించుకున్న క్షేత్రయ్య మోహనాంగి ఇద్దరూ ఆనందభాష్పాలతో ఆ స్వామినిఅర్చించారు. క్షేత్రయ్య  పాడగా మోహనంగి నాట్యం చేస్తూ ఉంటే అందరి కళ్ళకీ రాధాకృష్ణులు సాక్షాత్కరించినట్లుగా అనిపించిందట.అలా అందరూ చూస్తూ ఉండగానే క్షేత్రయ్య ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యం చెందింది...ఈ సంఘటన చూసిన మరుక్షణం మోహనాంగి కూడా క్షేత్రయ్య పాదాల చెంత ప్రాణం వదిలింది...వారిని ఏ పనికోసం ఇక్కడికి ఆ మొవ్వగోపాలుడు పంపించాడొ  ఆ పనిముగియగానే తనలోకే ఐక్యం చేసుకున్నాడు ఆ గోపాలుడు.ఈ విధంగా క్షేత్రయ్య ధన్యుడయ్యాడు.
క్షేత్రయ్య తన జీవితకాలములో మొత్తంగా 4500 పదాలు రచించినట్లు గా తెలియచున్నది.మధురలో 2000 పదాలు,తంజావూరులో 1000, గోల్కొండ నవాబు గారి దగ్గర 1500 ఇలా రచించినప్పటికీ .1950లో శ్రీ విస్సా అప్పారావు గారు రచించిన "క్షేత్రయ్య పదాలు"పుస్తకంలో లభ్యమవుతున్నవి 330 అయితే తరువాత గిడుగు సీతాపతి గారి పుస్తకంలో లభ్యమవుతున్నవి 380. క్షేత్రయ్య రచనాశైలి కూడా పండిత పామరులందరికీ అర్థమయ్యే విధంగా చాలా సరళం గా ఉంటుంది.ఆయన రచనలలో చాలా పదాల్లో మొవ్వగోపాల అన్న ముద్ర కనిపించగా ,కొన్ని పదాలలో విజయ రాఘవ,ఇభరాజవరద మొదలగు ముద్రలు కూడా కనిపిస్తాయి.
క్షేత్రాయ్య ఈ పదాలన్నీ నాయకీ-నాయక భావనతో రచించడం వలన,పల్లవి,అనుపల్లవి, చరణం అను భాగాలు గా రచించడం వలన మరియు రచనలన్ని మోహన,కాపి,ఆనందభైరవి వంటి  రక్తి రాగాలలోనే కొనసాగడం వలన ,చక్కటి తాళములలో కూర్చడం వలన అభినయానికి చక్కటి ఆస్కారం కలిగి..ఈనాటికీ నృత్య ప్రదర్శనలలో విరివిగా ప్రదర్శించబడుతున్నాయి.అసలు క్షేత్రయ్య పదాలకు బహుళ ప్రాచుర్యం కలిగించిన వారు సుప్రసిద్ధ వీణ విద్వాంసులువీణా ధనమ్మాళ్,తంజావూరు బృందాగారు.
దక్షిణ భారత దేశం లో కూచిపూడి,భరతనాట్యం మొదలగు అన్ని ప్రక్రియలలో  విరివిగాప్రదర్శించబడుతున్నాయి.
కొన్ని బహుళ ప్రాచుర్యం పొందిన క్షేత్రయ్య పదాలు
1.”ఎంత చక్కని వాడే నా సామి వీడెంత చక్కని వాడే
2.”ఇంత ప్రొద్దాయె ఇంక వాడేమి వచ్చేని
3.”ఇంక నిన్ను బొనిత్తునా ఇభ రాజ వరదా
4.”అలుక దీరెనా నేడైన నీ అలుక దీరెనా
5.”అలిగితే భాగ్య మాయె మరేమి వాడలగితే భాగ్యమాయె
జీవించినంతకాలం ఆ మొవ్వగోపాలుని స్మరణ లోనే తన జీవితాన్ని సార్ధకం చేసుకున్న భక్తాగ్రేశుడు క్షేత్రయ్యను ఈ పుష్కర ప్రత్యేక సంచిక ద్వారా స్మరించుకుని మనమూ తరిద్దాము.
****

No comments:

Post a Comment

Pages