నాకు నచ్చిన కధ - పున్నాగవాన - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కధ - పున్నాగవాన

Share This

నాకు నచ్చిన కధ - పున్నాగవాన

సత్యం శంకరమంచి 


ఎప్పుడైనా అమరావతి వెళ్ళారా ? అక్కడి గుడి చుట్టూ ఉన్న పున్నాగపూల పరిమళాన్ని గుండెల నిండా పీల్చారా ? పోనీ వెళ్లకపోయినా - సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కధలు పుస్తకం చదివారా ? అందులోని ప్రతి అక్షరం కృష్ణా నదిలోని స్వచ్చమైన నీటి బిందువే ! అందులోంచి నాకు నచ్చిన ఒక కధను మీకోసం తీసుకుని వచ్చాను. చదవండి...
***
రాత్రంతా వర్షం కురిసింది.
తెలతెలవారుతున్నా ఇంకా సనసన్న జల్లులు పడుతూనే ఉన్నాయి. ఆ చినుకుల్ని, చలిని లెక్కచేయకుండా పది పదిహేను మంది పిల్లలు బిరబిరమంటూ మొదటి ప్రాకారంలోకి పరుగెత్తుకొచ్చారు.
అక్కడ పెద్ద పున్నాగచెట్టు.
ఆ చెట్టు చుట్తో ఒత్తుగా పున్నాగపూలు రాలి ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల పున్నాగపూలు నేలంతా పరుచుకుని ఉన్నాయి. ప్రాకారంలో తెల్లటి పట్టుకంబళి పరిచినట్టుంది. పిల్లలు గలగల నవ్వుతూ పున్నాగపూల మీద పరుగెత్తుతూ పువ్వులేరుకుంటున్నారు. ఒకళ్ళ నొకళ్ళు తోసుకుంటూ పున్నాగపూల పరుపుమీద పడిపోతున్నారు. గిలిగింతలు పెట్టుకుంటూ కేరింతలు కొడ్తున్నారు. ఆ పసి పాదాల కింద పున్నాగపూలు నలిగి పోతున్నాయి. పిల్లలు పూల మీద నడుస్తుంటే పున్నాగపూల కాడలు 'చిటుక్కు చిటుక్కు మని చిట్లుతున్నాయి. పూల అడుగున నత్తగుల్లలు పాదాలకింద పడకుండా తప్పుకు  పాకిపోతున్నాయి.
అంతలో గాలి రయ్యిన వీచింది. చెట్టు పై నించి పున్నాగపూలు జలజల రాలి పడ్డాయి. పూలతెర మీద మరో పూలతెర. ఉహూహూ,.. అని వణుక్కుంటూ పిల్లలు గుత్తులు గుత్తులుగా ఏరుకుంటున్నారు.
ఎన్ని పూలు?
ఎన్నెన్ని పూలు!
చినుకు చినుకుకీ ఓ పూవు పూసినట్టుంది చెట్టు!
కుంటి సింగన్న మెట్లమీద కూర్చుని చూస్తున్నాడు. పున్నాగపూలు గుత్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ ఆడుకుంటున్న పిల్లల్నిచూస్తుంటే తనూ వాళ్ళతో కలిసి గెంతుదామనిపిస్తోంది. వాళ్ళ గొంతులతో గొంతు కలిపి పాడదామనిపిస్తోంది. నేల మీద పున్నాగలు, నింగి నించి రాలుతున్న పున్నాగలు. మధ్యన చిరునవ్వుల  చిన్నారులు. సింగన్న నెత్తురు పొంగింది. వాళ్ళతో కలిసి ఆడుకోటానికి తను కుంటివాడాయె! కళ్ళ నీళ్ళోచ్చాయి.
సింగన్న వయసులో ఉండగా గొప్ప బలశాలి.రాళ్ళేత్తే విద్యలో ఆ పరగణాలో కొట్టేవాడు లేడు. పందెం కట్టి మా లక్షమ్మవారి చెట్టుదగ్గర వూరు వూరంతా చూస్తుండగా పదిమంది పట్టలేని రాయిని తానొక్కడే పైకెత్తి గిరగిర తిప్పి కింద వదిలేసేవాడు. ఆ కండలు తిరిగిన వొళ్ళు, ఇనప కమ్ముల్లాంటి చేతులు, ఆ బలమైన శరీరం చూసి లచ్చి మనస్సు పులుక్కుమంది. విశాలమైన వీపుమీద చెమటలు అలలు అలలుగా కారుతుంటే పరుగున వెళ్ళి “కొంగుతో తుడుద్దునా!” అని మనసు, ఆత్రుతపడేది. తండ్రితో చెప్పింది సింగన్నని తప్ప మరొకర్ని మనువాడనని.అన్న ప్రకారం లచ్చి పెళ్ళి సింగన్నతో గుళ్ళో జరిగింది. వూరందరికీ ఆ జంటని చూస్తే ముచ్చటేసేది. ఒక్క క్షణం ఒక్కళ్ళని విడిచి ఒకళ్ళ ఉండవాళ్ళు కాదు. కృష్ణలో కలసి జలకాలాడేవారు. సింగన్న కండలు తీరిన శరీరాన్ని లచ్చి గంటలు గంటలు రుద్దేది. సూర్యాస్తమయం దాకా స్నానం చేసి గుళ్ళోకొచ్చి సామికి, అమ్మకిమొక్కుకొని ఇళ్ళ కెళ్ళేవారు. పిల్లలు కుప్పలు కుప్పలుగా పున్నాగపూలు బండల మీదికి తీసికెళ్లి పోస్తున్నారు. కొందరు మాలలు అల్లుతున్నారు. కొందరు దేవుడికి గజమాల తయారుచేస్తున్నారు. కొందరు పున్నాగపూల రేకులు తుంచి, ఒక్కొక్క రేకును రెండు వేళ్ళ మధ్య కొంచెం నలిపితే రేకుకున్న రెండు పొరలు సళ్ళుకుంటున్నాయి. అప్పుడు అందులోకి గాలి ఊదితే బుడగలా తయారవుతోంది. ఆ బుడగని వాళ్ళ నుదుటిమీద కొడ్తే “టప్” మణి పేలే ఆట ఆడుకుంటున్నారు. మళ్ళీ పున్నాగచెట్టుదగ్గర కొచ్చి దోసెళ్ళనిండా పూలు తీసుకెళ్ళి బండలమీద పోస్తున్నారు.
సింగన్న నెత్తురు జివ్వమని లాగుతోంది. వర్షం కురిసిన ఉదయాన  ఒకరోజు తనూ లచ్చి అక్కడ కొచ్చారు. లచ్చి పున్నాగపూలు ఏరుకుంటోంది. తను గబగబ పున్నాగ చెట్టు ఎక్కాడు. లచ్చి నుంచున్నచోట సరిగ్గా పై కొమ్మ మీది కొచ్చాడు. కొమ్మలు ఒక పట్టున వూపాడు. గలగల పున్నాగపూలు లచ్చి నెత్తిన రాలాయి. మళ్ళీ వూపాడు. కుప్పలు కుప్పలాగా గుత్తులు గుత్తులుగా లచ్చి నెత్తిన పున్నాగ వర్షం. అప్సరస నెత్తిన ఆకాశం నుంచి నక్షత్రాలు కురుస్తున్నట్లుంది. ఆ పూలవానలో తడిసిపోతూ, ఆ గాలికి పడే చినుకుల చలికి ముకులించుకుపోతూ కిలకిల నవ్వింది. గుండె పులకలేత్తేటట్లు నవ్వింది.
పిల్లల గజమాల పూర్తవుతోంది. పూలచెండ్లతో ఆడుకుంటున్నారు. సింగన్న కుంటు కుంటూ పున్నాగచెట్టు దగ్గర కొచ్చాడు. పిల్లలతో పాటు తనూ “వోప్పలకుప్పా! వయారిభామా!” అని గొణుక్కున్నాడు. తనూ, లచ్చీ అంత సంబరంతో ఆడుకునేవారు.
ఆ రోజు కునినపాడు వస్తాదు తనతో పందెం కట్టాడు. చుట్టుపక్కల వూళ్ళ నుంచి జనం పందెం చూడ్డానికి వచ్చారు. లచ్చి తప్పకుండా గెలుస్తానని హుషారిచ్చింది. ఇరవై మంది పట్టలేని రాయి పై కేత్తాడు సింగన్న, రోమ్ములదాకా ఎత్తాడు. చేతులమీద ఎత్తాడు. వందలాది జనం ఆనందంతో చప్పట్లు చరిచి ఈలలు కొట్టారు. ఆ  సంబరంలో అవతలికి విసిరేయవలసిన రాయి మీద పడేసుకున్నాడు. అందరు గొల్లుమన్నారు. లచ్చి మూర్చపోయింది. సింగన్న బతికాడు కాని పోయింది కాలే!
సింహంలా తిరిగిన సింగన్న పిల్లి అయిపోయాడు. ఈ కళ్ళు ఈ దుఃఖాన్ని చూడలేను అన్నట్టుగా" అది జరిగిన మూన్నెళ్ళకే లచ్చి కన్ను మూసింది. సింగన్న కుంటి వాడై ఒంటరివాడై నాడు.
పిల్లలు కొప్పులో పున్నాగపూలు తురుముకున్నారు. మెళ్ళలో పున్నాగ దండలు వేసుకున్నారు.గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి "ఇంక చద్దన్నాలు తినరా పదండి పదండి ” ఆని కేక లేసేసరికి హో హో
అరుచుకుంటూ వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళిపోయినా సింగన్నకి వాళ్ళపాటలు విన్పిస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆటలు కన్పిస్తూనే ఉన్నాయి. కుంటుకుంటూ చెట్టకిందకొచ్చి నుంచున్నాడు. అదే చోటు! ఆనాడు  లచ్చి నుంచున్న చోటు. లచ్చి తల మీద, వొంటినిండా పున్నాగ వర్షం కురిసిన చోటు. సంతోషంగా ఎగిరి గంతెయ్యబోయాడు. కింద పడ్డాడు. డెబ్బ తగిలినా బాధనిపించట్లేదు. పున్నాగ పూలు మెత్తగా వొత్తకున్నాయి. కళ్ళవెంట ధారలుగా కన్నీరు. ఆ పున్నాగ పూలమీద దొర్లాడు. వొళ్ళంతా పున్నాగపూలు పోసుకున్నాడు. ఏడుస్తూ నవ్వుతూ పున్నాగ పూలల్లో పొర్లాడు. శరీరమంతా పున్నాగలు, వొంటినిండా పున్నాగపరాగం.
ఇంతలో గాలి రివ్వున వీచింది. చెట్టు పైనించి గుత్తులు గుత్తులుగా పూలు రాలాయి. కొన్నింటిని దోసిట్లో పట్టుకున్నాడు సింగన్న.
ఎవరికిస్తాడు ఆ పూలు.
ఎదురుగా చిన్న గుళ్ళో కుమారస్వామి విగ్రహం.
నడిచి వెళ్ళలేడు గదా ! ముందుకు కూర్చుని దోసిట్లోని పున్నాగాల్ని కుమారస్వామి మీదకి విసిరాడు, నల్లటి కుమారస్వామి విగ్రహం పైన తెల్లటినక్షత్రాల మెరుపులు!
 (అమరావతి కధలు పుస్తకం నుంచి నవోదయ పబ్లిషర్స్ సౌజన్యంతో...)

No comments:

Post a Comment

Pages