పుష్యమిత్ర - ఆరవ భాగం
టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మించడానికి అనువైన ప్రదేశం కోసం హిమాలయాలపైన ఇస్రో వారు హెలికాప్టర్ల ద్వారా అన్వేషణ జరుపుతూ టవర్ నిర్మాణం లో ఎదురైన మంచును తొలగించే దశలో బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనుడు తారసపడతాడు. సింహకేతనుడు, పుష్యమిత్రుని జయించేందుకు అఘోరా సాయం పొందాలని వెళ్ళగా, బలవంతులతో విరోధం మానుకోమని సలహా ఇచ్చి పంపుతాడు అఘోరా. అయినా మాయోపాయంతో అయినా పుష్యమిత్రుని జయించాలన్న ఆలోచనతో అంత:పురం చేరుతాడు సింహకేతనుడు. (ఇక చదవండి)
వైశాఖ మాసం, విశాఖా నక్షత్రం, పౌర్ణమి. మూడో ఝాము దాటి వేకువ ఝాముకు ఇంకా ఘడియ సమయం ఉంది. పుష్యమిత్రునికి తోడున్న సైనికుడి హఠాత్తుగా మెలుకువ వచ్చింది. పారా హుషార్.... అంటూ.. కోటలో సైనికులు అరుస్తున్నారు. పుష్యమిత్రుడు మూడో ఝాము దాటే లోపు నిద్రలేపమన్నాడు. ఆరుబయట వరండాలో పడుకున్న సైనికుడు ఉలిక్కిపడి లేచి మెల్లిగా గది తలుపులు తెరిచి చూసాడు. అక్కడ పుష్యమిత్రుడు ప్రాణాయామం చేస్తూ సమాధిస్థితి లో కనుపించాడు. అలా ఎంతసేపటినుండి ఉన్నాడో తెలీదు. నాలుగోఝాము లో ఓ ఘంట కాలం గడిచాక లేచి నది ఒడ్డుకు బయలు దేరారు. చీకటిగా ఉన్నప్పుడే కత్తి తిప్పడం. బల్లెం విసరడం, విలువిద్య అన్నీ పూర్తయ్యాయి. సైనికుడిని గుర్రం పైన ఎక్కమని, తను కింద నిలబడి, నేలపైనుండి ఒక్క గెంతుతో ఎగిరి సైనికుడి చేతిలోని కత్తిని విరగ గొట్టడమూ...గుర్రం ఎక్కి పైనుండి కిందకు దూకుతూ చేతిలో ఉన్న బల్లెమును భూమిలో ముప్పాతిక వంతు దించడం చూసాక సైనికుడికి ముచ్చెమటలు పట్టాయి.
వేకువఝాము చివరి ఘడియల్లో సంధ్యావందనం ముగించి మళ్ళీ సూర్యోదయం అయేలోపు విడిదికి చేరుకున్నారు. ఈలోపు అంత:పురం లోని సైనికులకు ఈ విషయాలన్నీ పూసగుచ్చుతున్నాడు సైనికుడు. పుష్యమిత్రుడు విడిదిలో... తల్లి దండ్రులకు, తనకు వేదవేదాంగ విద్యలు నేర్పిన సుదర్శన వేదాంత భట్టుకు, అస్త్రశస్త్రాలలో తర్ఫీదు ఇచ్చిన దేవాపి మహాయోగికీ మనస్సులో అంజలి ఘటించాడు. దైవాన్ని ధ్యానించాడు. మహాయోగి తనకు బహుమతిగా ఇచ్చిన ఖడ్గానికి నమస్సులర్పించి సర్వసన్నద్ధుడయ్యాడు. సైనికుడు గుర్రానికి తగిన దాణా, గుగ్గెళ్ళూ పెట్టించి మంచి నీరు త్రావించి కళ్ళెం బిగించాడు. ఉదయం సరిగ్గా ఎనిమిది గంటలకు అస్త్రవిద్యా ప్రదర్శనకు బయలుదేరాలి.
* * *
సింహకేతనుడు తెల్లవారు ఝాముకు ఇంకా కొంత సమయం ఉందనగా లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, వ్యాయామం చేసాడు. అసలే కండలు తిరిగిన అతని శరీరం ఇంకా భయంకరంగా కనిపించ సాగింది. తను ఏ సమస్య వచ్చినా దర్శించే "ప్రత్యంగిరా దేవత" మందిరానికి వెళ్ళి నిష్టతో దీక్షగా ప్రార్ధనలు సాగించాలని నిశ్చయించాడు. ఎర్రటి సింధూర వర్ణ వస్త్రం ధరించాడు. ఇంకో సింధూర వర్ణ వస్త్రం నడుముకు బిగించాడు. పైన ఏ ఆచ్చాదనాలేదు. భయంకరమైన అతని ఆకారం ఇంకా భయంకరంగా కనిపించ సాగింది. ఏడడుగుల పైన పొడవూ.. 150 కే.జీలు మించిన బరువు ఉన్న సింహకేతనుని చూసి అంత:పురం లో జనం నివ్వెరపోయారు కొంచెం కళవెళ పడ్డారు. ఎన్నడూ అలా ఆ ఆకారంలో అంత ఆవేశంగా ఉన్న అతన్ని చూడలేదు.
మందిరంలో పురోహితుడు పరుగు పరుగున ఎదురు వచ్చి స్వాగతించాడు. సిం హకేతనుని ఆవేశం మొహంలో ఆందోళనా చూసాక పలకరించడానికి ధైర్యం చాలలేదు. ఆశీనుడవగానే పరిచారిక ఒక పెద్ద బుట్ట నిండా వివిధ రకాల పుష్పాలను అతని ముందుంచింది. రాజ గురువు ముందు కూర్చొని కానివ్వమన్నట్లు సైగ చేశాడు.
“సింహీం సింహముఖీం భగవత: ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వాలాం
శూల స్థూల కపాలపాశ డమరు వ్యగ్రాగ్ర హస్తాంభుజాం |
దాంష్ట్రాకోటి వశం కటాస్య కుహరా మార్తక నేత్రత్రయీం
బాలేందుద్యుతి మౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే”||
అని ధ్యానించాక రాజగురువు చెప్పిన రీతిగా నిష్టగా నూట ఎనిమిది సార్లు మూలమంత్రం "ఓం హ్రీం క్షం భక్షా జ్వాలా జిహ్వే కరాళ దంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్!" అంటూ పఠించ సాగాడు. కొంత సమయం గడిచాక లేచాడు. అంత:పురంలో మహారాజు బృహద్ధ్రదునీ, రాజమాతనూ దర్శించి వారి ఆశీర్వాదం పొందాడు. మహారాజు.. "నాయనా సింహకేతనా.. నాకు ఇంతవరకూ పుత్రులు కలుగలేదు. నాకు ఎలాంటి స్వపర పక్షపాత బేధం లేదు. నీకోరిక మేరకే ఈ పోటీ ఏర్పాటు చేయడం జరిగిందని మర్చిపోకు. నీకన్న బలశాలి శౌర్యవంతుడూ ఎక్కడైనా ఉన్నాడా? ఏదేశంలోనైనా ఉన్నాడా? అని ఎప్పుడూ అడిగేవాడివి గుర్తుందా? దానికి నేడు సమాధానం లభిస్తుంది నీకు. ఒకవేళ దైవం అనుకూలించక నీవు ఓడినట్లైతే..ఏమి చెయ్యాలో అలోచిద్దాం. సాహసమూ.. ధైర్యమూ.. వీరత్వమూ.. మన రాజవంశాల సొత్తు. అధైర్యపడకు! విజయలక్ష్మి వరిస్తుంది! " అని అశీర్వదించాడు. పోటీకి సిద్ధమయ్యాడు సింహకేతనుడు.
గుర్రపు శాలకు వెళ్ళి అక్కడి గుర్రాలను పరీక్షించాడు. "అశ్వశిక్షకా! శుభోదయం! ఈ గుర్రాన్ని ఈరోజు శస్త్ర ప్రదర్శనా వేదిక వద్దకు తెచ్చి సిద్ధంగా ఉంచు, పోటీకి తలపడే వాళ్ళలో నేను చెప్పినవారికి ఈ గుర్రం అప్పగించు" అన్నాడు. అందుకు ఉలిక్కిపడ్డ శిక్షకుడు "సింహకేతనా! క్షమించాలి ! ఈ జవనాశ్వాన్ని చాలా ఖరీదు పెట్టి తెప్పించుకొన్నారు మహారాజావారు. మంచి మేలు జాతి గుర్రం, వంశం లెక్కలు అన్నీ చూసే తెప్పించారు. తన దగ్గర ఉండవలసిన అశ్వం అని. కానీ అది పొగరు బోతు. ఎవ్వరినీ దగ్గరకు రానివ్వటం లేదు. మీద చెయ్యి వేస్తే ఈడ్చిపెట్టి తన్నుతోంది. చాలా మంది ఆశ్వికులు దాని పని పట్టటానికి ప్రయత్నించి, కాళ్ళూ చేతులు పోగొట్టు కొన్నారు. చివరికి ఇంత అనుభవశాలినైన నేనూ అనేకసార్లు ప్రయత్నించి విఫలుడిని అయ్యాను. మేపటం తప్ప దేనికీ పనికి రాకుండా పోయింది. మహారాజుకు దాని మీద విరక్తి పుట్టింది. ఎట్లాగైనా దీన్ని వదిలించు కోవాలని ప్రయత్నం చేశారు గతం లో బేరాలు పెట్టారు. సంగతి తెలిసిన ఎవరూ కొనే సాహసం చెయ్యలేక పోయారు. చివరికి ఏమీ పాలు పోక ఏదో విధంగా వదిలించు కోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. మీరూ గతంలో ఒకటిరొండు సార్లు ప్రయత్నించిన విషయం......” అంటూ నీళ్ళు నమిలాడు. “మా ఆజ్ఞ! అంటే మహారాజు గారి ఆజ్ఞ కింద భావించి తీసుకురా! ఏమి చెయ్యాల్సింది మేము అక్కడ నిర్ణయిస్తాము" అన్నాడు సింహకేతనుడు. "చిత్తం అలాగే" అన్నాడు అశ్వశిక్షకుడు.
* * *
అది అంత:పురానికి యోజనం దూరంలో ఉన్న సువిశాల మైదానం. తూర్పు ముఖంగా ఉన్న మందిరంలాంటి ప్రదేశంలో మహారాజు, రాజవంశీయులు వారికి సిబ్బంది మాత్రమే కూర్చుంటారు. పశ్చిమ దిక్కులో సైనిక పరివారం. తూర్పు దిక్కులో పోటీలలో పాల్గొనేవారు తదితర బృందం. దక్షిణ దిక్కుగా పురజనులు. అన్ని దిక్కులలో కూర్చునేందుకు ఎత్తైన రాతి అరుగులు, ఎత్తైన మెట్లతో నిర్మింప బడ్డాయి. ప్రదర్శనకు అనుకూలంగా మధ్య భాగం దీర్ఘవృత్తాకారంలో పచ్చికతోనిండి ఉంది. ఇదంతా గ్రీకు సాంప్రదాయాన్ని అనుసరించి నిర్మించినవే.
"మహాజనులారా! పోటీకి విచ్చేసిన రాజవంశీయులారా! సైనికులారా! పుర ప్రజలారా! మనం నేడు ఇక్కడ ఎందుకు సమావేశమైనామో అందరికీ తెలుసు. మన మహాసేనాని భాగ్యమణివర్మ ఆరునెలల క్రితం విషప్రయోగం వల్ల మరణించాడు. అతని స్థానంలో సమఉజ్జీ, సమర్ధుడైన సేనాని కొరకు దేశ దేశాలలో ప్రకటనలు చేయించాము. దండోరాలు వేయించాము. మొత్తం పదహారు మంది ఈ పోటీకి విచ్చేశారు. వారిలో పుష్యమిత్రుడనే ఒక బ్రాహ్మణుడు కూడా ఈ పోటీకి రావడం మీకు తెలుసు. ఈ పోటీ మూడు దశలలో జరుగుతుంది. నేడు ఈ పోటీలలో మొదటగా వచ్చిన పదహారు మందీ తమలో తాము విద్యలలో నేర్పరితనం చూపి తాము పదహారు మందిలో ఎవరినో ఒకరిని విజేతగా నిర్ణయించడం మొదటి దశగా భావిస్తున్నాము. దీనికి సమయం ఐదు ఘడియలు (రెండు గంటలు). ఆ తర్వాత ఆ గెలిచిన వీరునితో మా అష్ట దిగ్గజాలవంటి అష్ట సేనానులతో పోరాడవలసి ఉంటుంది. అది రొండవ దశ. దానికి సమయం రెండున్నర ఘడియలు. ఆ వీరుడు అష్ట సేనానులతో పోరాడి ఓడిపోతే, ఒక సామాన్య సేనాని గానే పరిగణింపపడతాడు. అతడు అనుభవజ్ఞుడైన సేనాని క్రింద పనిచేయవలసి వస్తుంది. అలా కాక అష్టసేనానులనూ ఓడించగలిగిన ధీశాలి అయితే మూడవ దశగా మాసింహకేతనుని తో తలపడవలసి వస్తుంది. ఒక్క విషయం ముందుగానే చెప్తున్నాను... సింహకేతనుని తో పోరాటం అంటే మృత్యువును ఆహ్వానించినట్లే" అని బ్రుహద్ధ్రధుడు అంటూఉండగానే ఐదుగురు పోటీనుండి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు అతని భీకర స్వరూపం చూసి. కోరమీసం మెలిత్రిప్పుతూ.... “మహారాజా పోటీలకు అనుమతివ్వండి" అని సింహకేతనుడు అనగానే.. రాజు తల వూపి రాజ దండం పైకెత్తి చూపగానే..యుద్ధ భేరీలు మ్రోగాయి...శృంగ నాదాలు సాగాయి. అష్టసేనానులలో ప్రధాన సేనాని ధవళ వస్త్రాలతో, నాలుగు తెల్లని గుర్రాలు గట్టిన రధంపై, తెల్లని పతాకం పైన ధరించి ముందు బయలుదేరగా మిగిలిన ఏడుగురు సేనానులూ గుర్రాలపై అతన్ని అనుసరించి ఆ రంగమండపం చుట్టూ మూడు సార్లు అతివేగంగా దీర్ఘ వృత్తాకారంగా తిరిగి రాజు గారికీ సింహకేతనునికీ నమస్కరించి వారి వారి ఆసనాల్లో కూర్చున్నారు. సింహకేతనుడు లేచి "ఇప్పుడు మీ పదకొండు మందీ బల్లెం డాలునూ ధరించి.. మీ మీ గుర్రాలపై ఎక్కి, ఎవరు ఇతరులను ఓడించి, వారి బల్లెములను పడగొట్ట గలగలిగితే వారు విజేతలు. చివరకు ఎవరి చేతిలో బల్లెం ఉంటుందో వారే ఈ పరీక్షలో విజేతలు. అది ఒకరే అవాలి. అర్ధమైందా ? " అని చూసాడు.
పుష్యమిత్రుడు పురుష సింహంలా తన మేఘపుష్పాశ్వం వద్దకు వచ్చి డాలును ధరించి మూడు మణుగుల (ఏభై కిలోల పైచిలుకు) బరువున్న పది అడుగుల పొడవున్న బల్లెము భూమి మీద గుచ్చి గాలిలోకి తేలినట్టు లేచి గుర్రం పై కూర్చొనడానికి సిద్ధమౌతుండగా.. అశ్వశిక్షకుడు పొగరుబోతు గుర్రాన్ని తెచ్చి పుష్యమిత్రుని ముందు వుంచాడు. "మీరు ఈ గుర్రాన్ని అధిరోహించి ఈ ప్రదర్శనలో పాల్గొనలాని మా రాజాజ్ఞ" అనగానే ఆశ్చర్య పోయిన పుష్యమిత్రునికి ఈ పన్నాగం సింహకేతనుడిదని అర్ధమైంది. ఆ గుర్రం వద్దకు వచ్చి నిలబడగానే.. దగ్గరకు రావద్దు అన్నట్టు విచిత్రమైన ధ్వనులు చేసింది. సింహకేతనుడు చిరునవ్వుతో మీసం మెలివేస్తూ.. పుష్యమిత్రుని పని అయిపొయినట్టే అని భావిస్తూ మహదానందంగా తిలకిస్తున్నాడు ఆ వినోదాన్ని. అందరూ గుర్రాలను ఎక్కిన తర్వాత..."భేరీ నాదం వినపడగానే మీ పోరు ప్రారంభించాలి" అన్న సింహకేతనుడు ప్రకటన కూడా చే సేసాడు హడావుడిగా ఎక్కువ సమయం ఇవ్వకూడదన్నట్టుగా. అప్పుడు పుష్యమిత్రునికి గురువైన దేవాపి మాటలు స్మరణకు వచ్చాయి. మొండి గుర్రాన్ని లొంగదీసుకునే పద్ధతి. అంతే. అదే చిరునవ్వుతో.. పుష్యమిత్రుడు గుర్రం దగ్గరకు వచ్చి చెవిలో ఏదో ఊదాడు. ముందుకు వచ్చి దాని ముక్కులోనూ.. నోటిలోనూ.. వ్రేళ్ళు పెట్టాడు. అసలు మనుష్యుల్ని దగ్గరకే రానివ్వని గుర్రం ఇవన్నీ చేస్తుంటే మైనపు ముద్దలా ఒదిగి పోయింది . వీపు మీద చెయ్యి వేసి నిమిరాడు. అంతే మంత్ర ముగ్ధలాగ గుర్రం లొంగి పోయింది. బల్లెమును భూమి మీద గుచ్చి గాలిలోకి తేలినట్టు లేచి గుర్రం పై లంఘించి ఎక్కి కూర్చున్నాడు.అది ఒక్క సారి సకిలించి రెండు కాళ్ళపై పైకి లేచింది. ఆ సకిలింపుకు సింహకేతనుని గుండెలు గుభిల్లుమన్నాయి. పోటీకి వచ్చినవారు ఆ గుర్రం సకిలింపుకు నివ్వెరపడ్డారు. అది చూసిన సింహకేతనుడే కాదు మహారాజు సైతం ఆశ్చర్యపోయారు. భేరీ మోగాక పదిమంది యువకులూ తమలో తాము పోరుసల్పడం ఆరంభించారు. వారిలో ఇద్దరు తనవైపు దూసుకు రావడం గమనించిన పుష్యమిత్రుడు..వారు చేతికి అందే దూరం లో ఉండగానే బల్లెమును చివర పట్టుకుని తిప్పుతూ ఇద్దరి చేతిలోని బల్లేలనూ పడగొట్టి, బల్లెం వెనక్కు తిప్పి పొడిచిన దెబ్బలకు రెండు గుర్రాలూ కింద పడిపోయే సరికీ.. ఆ ఇద్దరూ కింద పడి.. రక్త సిక్తమవుతూ..తూర్పు దిశకు పారిపోయారు. అది చూచిన మరో నలుగురు తనవేపు ఒకే సారి దాడి చేస్తూ రావడం గమనించాడు. గుర్రాన్ని ఒక్కసారి కళ్ళేలు బిగించి లాగే సరికి గుర్రం రొండు కాళ్ళతో పైకి లేచి పెద్దగా సకిలించి రొండు కాళ్ళనూ ఎత్తి ఎదురుగా వస్తున్న రెండు గుర్రాల కాళ్ళమీద పడి తొక్కేసరికి, వాళ్ళు పెద్దగా అరుస్తూ కింద పడ్డారు. మిగతా ఇద్దరూ పుష్యమిత్రుని వెనుకకు వెళ్ళి వీపుపై బల్లేన్ని గుచ్చే సాహసం చేయగా తృటిలో గుర్రాన్ని వెనక్కు తిప్పి, గుర్రం పై మోకాళ్ళతో నిలబడి బల్లాన్ని రొండు చేతులతో మధ్యలో పట్టుకుని అర్ధచంద్రాకారంగా తిరిగి ఇద్దరినీ భుజాలపై అటూ ఇటూ మోదే సరికి, అదుపు తప్పి నేలపై పడిన నలుగురూ బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయారు. ఇదంతా అసహనంగా చూస్తున్నాడు సింహకేతనుడు. మిగిలిన నలుగురూ చుట్టుముట్టగా పుష్యమిత్రుడు గుర్రం పై మోకాళ్ళతొ కూర్చున్న తను నిటారుగా నిలబడి.. బల్లెం చివర పట్టుకుని వేసిన దెబ్బలకు ఇద్దరికి కిందపడి మోకాటి చిప్పలు చీరుకుపోయి కిందపడగా మరో ఇద్దరు అది చూచి భయపడి పారిపోయారు. పుష్యమిత్రుడు విపరీతమైన వేగంతో గుర్రాన్ని మూడు సార్లు ఆ మైదానం చుట్టూ పరిగెత్తించాడు. అమితోత్సాహంతో ప్రజలు “పుష్యమిత్ర మహాసేనానికీ జై! ” అని జయ జయ ధ్వానాలు చేస్తుండగా... క్రోధంతో నేత్రాలు మొహం రక్తవర్ణంతో మారిపోయి ఎర్రని వస్త్రాలతో ఉన్న సింహకేతనుడు మంకెన పుష్పంలా గోచరిస్తున్నాడు.. మహారాజు చెయ్యెత్తే సరికి అందరూ నిశ్శబ్దమయ్యారు. మహారాజు ఏం చెప్తారా అని అందరూ ఆశ్చర్యంగా చూచారు. (సశేషం)
-0o0-
No comments:
Post a Comment