“వచ్చేసి నయ్ కిట్టమ్మ పుష్కరాలు!”
మంథా భానుమతి
“ఏం వస్తున్నాయే?” దాని హడావుడికి నవ్వుకుంటూ అడిగాను.
“కిట్టమ్మకి పుస్కరాలొత్తన్నయ్యంట కదా?”
“వస్తే మనకేంటే?”
“బడికి సెలవలిత్తారంట. ఏడేడ్నించో అంతమంది పెజలొత్తారంట. మనకి బోలెడ్డబ్బులొత్తయ్యే అంటన్నాడు మా అయ్య.”
“ఐతే బడికి సెలవలనగానే హుషారొచ్చిందా?”
“అదేం లేదమ్మా! మిమ్మల్ని ఒక సారి అడిగి రూడి చేసుకుందామనీ..” యాస మార్చి, సిగ్గు పడుతూ అంది. దాని నల్లని బుగ్గలు ఎరుపెక్కి తమాషాగా ఉంది. నా దగ్గరకొచ్చిన కొద్ది సేపటికి పల్లె యాస మార్చేస్తుంది.
హంసకి పన్నెండెళ్లి పదమూడో ఏడు నడుస్తోంది. ఆరో తరగతి చదువుతోంది. మా ఇంటికి కొంచెం దూరంలో బెస్త వాడలో ఉంటుంది. తండ్రి జాలయ్య పగలు పంటు మీద కూలి పనికి, రాత్రిళ్లు భార్యతో కలిసి చేపలు పట్టడానికి వెళ్తాడు.
కృష్ణానది సముద్రంలో కలిసే సంగమస్థానానికి దగ్గర్లో ఉంటుంది మా ఊరు. ఒక పక్క సముద్రం, మూడు పక్కలా కృష్ణానది పాయలు.. మధ్యలో ఉన్న లంక. ఎదురు మొండి అనే ఊరికి దగ్గర్లో కృష్ణా, సాగర సంగమానికి కూతవేటు దూరంలో ఉంటుంది మా ఊరు. అక్కడ స్కూల్లో స్కూలసిస్టెంట్ ని నేను. అవటానికి మాది గుంటూరయినా, పదిహేనేళ్ల నించీ ఇదే ఊరిలో పనిచేస్తుండడంతో ఇక్కడి గాలీ, నీరూ, మనుషులూ.. అంతా నాదే అనిపిస్తుంది. ట్రాన్స్ ఫర్ భయం అస్సల్లేదు. ఈ మారుమూల గ్రామానికి వచ్చి, తాగునీటి దగ్గర్నుంచీ అవస్థపడదామని ఎవరూ అనుకోరు.
మావారు అవనిగడ్డలో బట్టల వ్యాపారం చేస్తారు. రెడీమేడ్ షాపు కూడా ఉంది మాకు. రోజూ పంటు మీదెళ్లి వస్తుంటారు. ఒకవేళ నది ఉధృతంగా ఉంటే, షాపులోనే ఉండిపోతారు. అక్కడో గది, అన్ని సదుపాయాలతో అమర్చుకున్నారు.
మాకు సంతానం ఇవ్వలేదు ఆ దేవుడు.. గుంటూరెళ్లి డాక్టర్లకి చూపించుకున్నా, ఏం లాభం లేక పోయింది. ఇద్దర్లో లోపం లేదు.. ఆ పైవాడి దయే లేదు. ఇంక మేం ఈ ఊరొదిలి వెళ్లాల్సి అవుసరం ఏవుంది?
“అమ్మా! పుస్కరాలంటే ఏంటమ్మా? కిట్టమ్మలో తేడా ఏవన్నా వచ్చుద్దా?” హంస కుతూహలంగా అడిగింది. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ దాని కేసి చూశాను.
దాని కళ్లు మిలమిలా మెరిశాయి. స్వచ్ఛమైన నీటిలో ఈదులాడుతున్న చేప పిల్లల్లా కనుపాపలు తిరుగుతున్నాయి. నల్లటి నలుపైనా హంస, కోటేరులాంటి, ముక్కు, చిన్ని నోరు, పెద్ద కళ్లతో.. కళగా చక్కగా ఉంటుంది. మత్స్యకారులు కదా.. ఏవున్నా లేకపోయినా, అమ్మగా మిగిలిన చేపలతో కడుపు నింపుకుంటారు.. శరీర ఛాయ నిగనిగ లాడుతూ ఉంటుంది.
“మీరు పుస్తకాలు చూసి, ఆలోచించి చెప్పండమ్మా! నేను గిన్నెలు తోమేసి, ఇల్లూడిచేసొస్తా.” తుర్రు మంది లోపలికి.
నవ్వుకుంటూ పుస్తకాల అలమారా దగ్గరికి వెళ్లాను.
“బృహస్పతి కన్యారాశికి వచ్చినప్పుడు పుష్కరుడు, కృష్ణానదికి వస్తాడు. అందరి పాపాలనీ ప్రక్షాళన చెయ్యడానికే బ్రహ్మ పుష్కరుడిని పన్నెండు సంవత్సరాలకోసారి ఒక్కోనదికి పంపుతాడు. పుష్కరుడు వచ్చినప్పుడే సప్తఋషులూ, దేవతలూ సూక్ష్మ రూపంలో.. అంటే మనకి కనిపించకుండా వచ్చి స్నానమాచరించి పూజలు చేస్తారు.” హంస ధర్మమా అని పుస్తకాలు తిరగేసి పుష్కరాల గురించిన సమాచారం సేకరించి, స్కూల్లో ఆరో క్లాసు పిల్లలకి వివరిస్తున్నాను.
“అసలీ పుష్కరుడెవరు టీచర్?” హంస లేచి అడిగింది. నేను ఈ ఊరు వచ్చినప్పట్నుంచీ, పేటలన్నీ తిరిగి పిల్లల్ని బడికి పంపేట్లు అందరినీ ఒప్పించాను. సాధారణంగా పధ్నాలుగేళ్ల లోపు పిల్లలకి ఊళ్లో పనేం ఉండదు. కానీ, చెప్పే వారు లేక రోడ్ల మీద తిరుగుతుండేవారు. చదువు ఉపయోగం పల్లె ప్రజల బుర్రల్లోకెక్కిందో లేదో కానీ, మధ్యాన్నం అన్నం పెడతామంటే, అందరూ పిల్లల్ని పంపడం మొదలెట్టారు. ఒకసారి బడికి రావడం మొదలు పెట్టాక పిల్లల్ని దారిలో పెట్టడం పెద్ద కష్టమవలేదు. రాత్రిపూట పెద్దలకి కూడా చదువడం రాయడం, కూడికలూ తీసివేతలూ నేర్పించడం మొదలు పెట్టాను.
దాంతో తమ గుత్తేదార్లని ప్రశ్నించడం మొదలుపెట్టారు మత్స్యకారులు. వాళ్ల జీవితాలలో కొద్ది మార్పు వచ్చిందనే చెప్పచ్చు.
“అనగనగా..” మొదలు పెట్టగానే పిల్లల మొహాల్లో నవ్వులు విరిశాయి. ఆ పువ్వులని ఏరుకుంటూ ఆరంభించాను.
“వేల సంవత్సరాల క్రితం మన దేశంలో తుందిలుడనే మహాత్ముడుండేవాడు. అన్నీ మంచి పనులు చేస్తుండేవాడు.”
“బళ్లో, బావి దగ్గరా మొక్కలు పాతే వాడా? గుడి దగ్గర అడుక్కునే వాళ్లకి డబ్బులిచ్చేవాడా? ఇంకా.. వాళ్లమ్మకి వంటపనిలో సాయం చేసేవాడా?” వాళ్లకి తెలిసిన మంచిపనులన్నీ వల్లె వేస్తోందొక అమ్మాయి.
“అవును.. ఇంకా చాలా చేసేవాడు. నేను చెప్పటం పూర్తయ్యాక మీ సందేహాలన్నీ తీరుస్తా సరేనా?” బుద్ధిగా తలలూపారందరూ.
“తుందిలుడు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, ఏం కావాలో కొరుకోమంటే నీలో నాకు స్థానం ఇమ్మని అడిగాడు. అంటే ఎప్పుడూ శివుడి దగ్గరే ఉండిపోయేలాగ. అప్పుడు శివుడు తన రూపాల్లో ఒకటైన జలరూపంలో చోటిచ్చాడు. అంతే, తుందిలుడు నీటికి అధికారి అయ్యాడు. నీరేకదా మనల్ని పోషించేది.. అందుకని తుందిలుడు పుష్కరుడయ్యాడు. అయితే,
బ్రహ్మదేవుడికి సృష్టి చెయ్యడానికి పుష్కరుని సహాయం కావలసి వచ్చింది. ఆ సహాయం అయిపోయాక, బ్రహ్మ దగ్గరే ఉండిపోతానన్నాడు పుష్కరుడు. కానీ, సకల జీవకోటికీ నీళ్లు కావాలి కదా.. అందుకని దేవగురువు బృహస్పతి బ్రహ్మని వేడుకుంటాడు పుష్కరుడిని ఒప్పించమని.
అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరుడు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులు పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి.
అందుకే బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు. ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యం, ఆరోగ్యం వస్తుంది.”
పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అంతకు ముందే, నక్షత్రాలు, రాసుల గురించి చెప్పానేమో.. ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు.
హంస లేచింది.
“అంత బాగా అర్ధం కాలే టీచర్.. కానీ, దేవుళ్లూ పుష్కరుడూ కలిసి ఒక్కొక్క నది దగ్గరకి పన్నెండేళ్ల కొకసారి వచ్చి పన్నెండు రోజులుంటారని తెలిసింది. వచ్చే కిట్టమ్మ పుష్కరాలకి బాగా అర్ధమవుతుందను కుంటా. అప్పటికి మేం చదువులు పూర్తి చేసుకుంటాం కదా!”
“అమ్మో.. పన్నెండేళ్ళ తరువాత..”
క్లాసంతా మళ్లీ నవ్వులు.
మా ఊర్లో పుష్కరాల హడావుడి విజయవాడలో అంత లేక పోయినా, బానే వస్తుంటారు జనాలు. ప్రశాంతంగా ఉంటుందనీ, కృష్ణవేణి లో నీళ్లు బాగా ఉంటాయనీ! ఇతర మతాల వాళ్లు కూడా ఇటువంటి పర్వ దినాల్లో బాగా పాల్గొంటారు.
పుష్కరాలు మొదలయ్యాయి. స్నానాలకీ, పూజలకీ వచ్చేవాళ్లు.. పూజలు చేయించే పంతుళ్లు, అవకాశం దొరుకుతే ఏదైనా దొరక్క పోతుందా అని దోగాడే దొంగలు.. అంతా సందడి.
హంస రోజూ పొద్దున్నే స్నానం చేసి, తయారయి, జడలో నీలాంబరాలు, కనకాంబరాలు కలిపి కట్టిన మాల పెట్టుకుని.. పంటు మీదికి వెళ్తోంది. కొత్త వారికి మా చుట్టుపక్కల ఊళ్ల గురించి వివరిస్తూ, తనకి వచ్చిన జానపద గీతాలు పాడుతూ.. సామాన్లు తీసుకెళ్లడంలో సాయం చేస్తూ, వాళ్లిచ్చిన తృణమో పణమో ఇంటికి తీసుకెళ్తోంది సాయంత్రానికి.
ఆ రోజు..
బజారు పని మీద అవనిగడ్డ వెళ్తున్నాను.. పైగా స్కూలు సెలవలు. నాకు పుష్కర స్నానం మీద అంత నమ్మకం లేదు. ఐనా రోజూ మేం స్నానం చేసేది క్రిష్ణమ్మ నీళ్లతోనే కదా!
“అమ్మా! మీరొస్తున్నారా? పంటు మీద.. చాల్రోజులైంది కదా!” హంస పలుకరించింది.. మొహమంతా నవ్వే దానికి. గులాబీ రంగు మీద నల్ల చుక్కలున్న పరికిణీ, నల్ల జాకెట్టు.. గులాబీ రంగు ఓణీ వేసుకుంది. మెళ్లో ఏదో పూసలదండ. కళకళలాడి పోతోంది. ఒక సారి పరికించి చూశాను.
“మీరు కుట్టించిందేనమ్మా! ఓణీ మా అమ్మ మొన్నవనిగడ్డెళ్లినప్పుడు కొంది.. సంతలో. బాగుందా?” సిగ్గు పడిపోతూ చెప్పింది.
“హంసా! ఇక్కడున్నావా? కాస్తీ స్టాండు పట్టుకో!” ఎవరో కుర్రాడు, పాతికేళ్లుంటాయి. కెమేరా, స్టాండు పట్టుకునొచ్చాడు. అతడ్ని చూడగానే హంస మొహం వేయి వోల్టుల బల్బు లాగ వెలిగింది. అసలే ఏళ్లకి మించి ఎదిగింది. అందులో, ఓణీ వేసుకుంటే పదహారేళ్ల పిల్లలా ఉంది.
“అమ్మా! ఈరు విలేఖరంట. ఇక్కడ జరిగేదంతా పేపర్లో ఏస్తారంట. నాగురించి కూడా రాస్తానని బోలెడు ఫొటోలు తీశారు. మా జానకీ టీచర్ గారండీ..మాకందరికీ ఎంతో ఇష్టం” పరిచయం చేసింది.
“నమస్తే మేడమ్! అయామ్ వినయ్ సిన్హా.. సుడిగాలి పత్రిక విలేఖరిని. పుష్కరాలకి ఈ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను. హంస.. వెరీ యాక్టివ్ అండే స్వీట్ గర్ల్.. నాకు చాలా హెల్ప్ చేస్తోంది.”
“ మీది తెలుగు పత్రికేనా? మీరు బెంగాలీలా?” అమాయకంగా అడిగాను.
“అవునండీ. మీ లంకకి రాదేమో మా పత్రిక. ఈనాడు తర్వాత మా పత్రికకే సర్క్యు లే షన్ ఎక్కువ. నేను పదహారణాల తెలుగు వాణ్ణి. నరసింహం అసలు పేరు. మీడీయా కదా.. వెరైటీగా ఉండాలని మార్చుకున్నా.”
“ఫరవాలేదే.. పదహారణాల అనే తెలుగు పదం బానే వచ్చిందే..” నా వ్యంగ్యం అర్ధం అవలేదో.. అయినా పట్టించుకోలేదో.. పెద్దగా నవ్వి, హంస చెయ్యి పట్టుకుని, స్టాండు తో సహా లాక్కెళ్లాడు.
సాలోచనగా చూస్తూ నిలబడి పోయాను.
ఆ రోజు ఆదివారం.. పొద్దున్న ఎనిమిదయింది. నేను బూజుల కర్ర పట్టుకుని ఇల్లు దులిపే కార్యక్రమంలో ఉన్నాను. మా వారు కూడా ఇంట్లో ఉన్నారు. వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. అప్పుడే గమనించాను.. హంసని.
“ఏంటే హంసా! అంత దిగులుగా ఉన్నావూ?” ఎప్పుడూ గలగలా మాట్లాడే హంస మౌనంగా వచ్చి పనులు చేసుకు పోతోంది. పేరుకి వాళ్లమ్మ చేస్తుంది మా ఇంట్లో.. కానీ రోజూ వచ్చేది హంసే. రోజూ రెండు పూటలూ భోజనం పెడతాను. అందుకని, ఒక్క రోజు కూడా నాగా పెట్టకుండా వస్తుంది.
పుష్కరాలు అయి రెండు నెలలవుతోంది. పంటు మీద హడావుడంతా తగ్గిపోయినట్టుంది. మామూలు పన్లలోకి వచ్చిపడ్డారు ఊర్లో అందరూ. మా స్కూలు కూడా దినచర్య కొచ్చేసింది.
జవాబివ్వకుండా వంటింట్లోకెళ్లిన హంస వెనుకే, శబ్దం చెయ్యకుండా వెళ్లాను. పప్పుకని తరిగి పెట్టిన మామిడి కాయ ముక్కల్లోంచి రెండు తీసి చటుక్కున నోట్లో వేసుకుని పక్కకి తిరిగిన హంస నన్ను చూసి కదలకుండా నిలబడి పోయింది. అది కక్కుర్తి పడ్డం అంతవరకూ ఎప్పుడూ చూడలేదు..
ఒకసారి పరిశీలనగా చూశాను. మామూలు లంగా, జాకెట్టులో పసితనం పోని మొహంతో అమాయకపు చూపులుతో బెదురుగా.. ఏమిటి దీని కష్టం? బుర్రలో ఏదో మూల దొలుస్తున్న సందేహం భూతంలా బైటికొచ్చింది.
“ఏమయింది?” చెయ్యి పట్టుకుని, దొడ్లో జామ చెట్టు వెనక్కి తీసుకెళ్లి అక్కడున్న సిమెంటు బెంచీ మీద పక్కన కూర్చో పెట్టుకుని, చెయ్యి పట్టుకుని అడిగాను..
***
పన్నెండేళ్లయింది.
“అమ్మా! కృష్ణా పుష్కరాలుట కదా?” రెండు కాళ్లతో గెంతుతూ వచ్చాడు పదకొండేళ్ల ప్రవీణ్.
“అవునా.. ఎవరు చెప్పారో?”
“అక్క చెప్పింది. చాలా మంది వస్తారుట కదా మనూరికి? అంతా పెండాల్స్ అవీ వేస్తున్నారు. టెంపరరీ షెడ్లు.. హోటల్స్.. రోడ్లన్నీ హడావుడిగా ఉన్నాయి.”
“అవునమ్మా. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. మొదటి సారి కదా! చాలా ఘాట్లు పెడుతున్నారు. మనూరు సంగమం దగ్గరని ఎక్కువ మంది వస్తారని అనుకుంటున్నారు.” హంస లోపల్నుంచి వచ్చింది.
“అలాగా! ప్రవీణ్.. ఐతే నువ్వు వాలంటీర్ వర్క్ చెయ్యచ్చు. మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకునిరా..”
“ఓ.. అలాగే. ఇప్పుడే అందరికీ చెప్పొస్తా.” తుర్రుమన్నాడు ప్రవీణ్.
హంసని కుతూహలంగా చూశాను. మొహంలో ఏ భావం లేదు. మామూలుగా ఉంది. సన్నంచు చిన్న డిజైన్ లేత నీలం వాయిల్ చీర. బిగించి వేసిన వాల్జడ. చిరునవ్వుతో ఉంది. బి.ఏ, బి.యిడి చేసి, అవసరమైన పరీక్షలు పాసయి, మా స్కూల్లోనే స్కూలసిస్టెంట్ గా చేస్తోంది. నేనిప్పుడు అదే స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ ని. హంస మాట, నడక, మనిషి తీరు.. అన్నీ మారి పోయాయి.
బెస్త వాళ్ల గుడిసెలన్నీ, రోటరీ వంటి యన్. జివో సంస్థల ధర్మమా అని పక్కా ఇళ్ల కింద మారిపోయాయి. ఆర్.ఓ ప్లాంట్లు పెట్టి మంచి నీటి వసతి కూడా చేశారు. తుప్పలు తప్ప ఇంకేం పెరగని మా నేలలకి నేల పరీక్షలు జరిపించి, ఏం పెరుగుతాయో కనుక్కుని ఆ ఫల వృక్షాలు వేసి, డ్రిప్ ఇరిగేషన్ తో మెట్ట పంటల వ్యవసాయం కూడా మొదలు పెట్టారు. అందులో నేను, మా వారు కూడా భాగస్వాములమే. హంస రాత్రికి వాళ్లింటికి వెళ్లినా పగలంతా మా దగ్గరే ఉండి, స్కూల్ అయిపోయాక మా కార్యక్రమాల్లో తోడుగా ఉంటోంది.
“హంసా! పుష్కరాలు..” ఏం చెప్పాలో తెలియక ఆగి పోయాను.
“అప్పుడు జరిగింది.. మర్చిపోవడం సాధ్య కాదమ్మా. కానీ మీ దయతో నాకు కొత్త జీవితం వచ్చింది. అది పాడు చేసుకునే మూర్ఖు రాలిని కాదు. మీరేం భయపడకండి.”
“ఒక వేళ..”
“అతను కలిస్తే.. నేను చూడను కూడా చూడను.” అదే చిరునవ్వుతో లోపలికి వెళ్లి పోయింది.
పన్నెండేళ్లలో ఎంత మార్పు? ఏడవడం కూడా చాతకాని.. అసలేం జరిగిందో తెలియని పదమూడేళ్ల హంస కన్నుల ముందు కదలాడింది. జామచెట్టు దగ్గర అమాయకంగా అది చెప్పిన విషయం..
***
రకరకాల కథలు చెప్పి, నది ఒడ్డున.. మడ అడవుల్లోకి ఫొటోలని తీసుకెళ్లి, వినయ్ సిన్హా చేసిన పని ఒకటొకటీ చెప్తుంటే కన్నీరాగలేదు నాకు. అభం సుభం తెలియని చిన్నపిల్ల.. వాళ్లమ్మ, పిల్ల పెద్దదయిందని చెప్పి మూడు నెలలు కూడా అవలేదు. అసలేం జరుగుతోందో కూడా సరిగ్గా తెలీని పసిది..
“నొప్పెడ్తోందంటే చాకలేట్ నోట్లో పెట్టారమ్మా ఆ విలేకరి. ఒళ్లో కూర్చో పెట్టుకోని, నా ఫొటోలన్నీ ఆ కెమేరా పెట్టిలో చూపిస్తూ..” ఒక్కసారిగా మోకాళ్ల మీద తల పెట్టుకుని భోరుమంది. దగ్గరగా పొదవుకుని తల మీద రాస్తూ అడిగిన ప్రశ్నకి తల అడ్డంగా తిప్పింది. అంటే.. మూడో నెల వచ్చింది, పదమూడేళ్ల పిల్లకి.
“మీ అమ్మకి చెప్పావా? వాడి అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ..”
“లేదమ్మా! ఆరు ఏం ఇవ్వలేదు. మళ్లీ వస్తానన్నారు. భయం వేస్తోంది. కృష్ణమ్మ ఒళ్లో దూకేస్తానమ్మా..”
ఆ తరువాత హంస తల్లిదండ్రుల్ని పిలిచి, జరిగిందంతా చెప్పి కేకలేశాను. పిల్లని ఒంటరిగా ఎందుకు వదిలేశారని.
“ఇంకా ఆ వయసొచ్చిందనుకోలేదమ్మా..” జాలయ్య తప్పుచేసినట్లు తల దించుకున్నాడు.
“సరే.. సెలవుపెట్టి గుంటూరు తీసుకెళ్లి డాక్టర్ కి చూపిస్తా. ఆ తరువాత జరగాల్సింది చూద్దాం.”
గుంటూరులో నా క్లాస్మేట్ డాక్టర్ జయ దగ్గరికి తీసుకెళ్లాను.
“జానకీ! అబార్షన్ చేసే వయసుకూడా లేదే” గొడవచేసింది.
వాడు.. ఆ వినయ్ సిన్హా, సుడిగాలిలో రాజీనామా చేసి, ఢిల్లీలో పెద్ద పేపరుకి మారిపోయాట్ట.. మా వారు ఫోన్ల మీద తెలుసుకున్న సంగతి!
ఒక ఏడాది, జయ హాస్పిటల్ దగ్గరే ఒక గది అద్దెకి తీసుకుని, హంసని వాళ్లమ్మతో సహా ఉంచి, ప్రవీణ్ని నా కొడుకుగా ఊరికి తీసుకొచ్చాము.. నేను, మా వారు చర్చించుకుని.
“అంసని మీ దగ్గరే ఉంచుకోని చదువు అదీ చెప్పించండమ్మా. ఇదివరకిచ్చినట్టు పనికి డబ్బేం ఇవ్వద్దు.” జాలయ్య చేతులు జోడించి అన్నాడు. చేపలు పట్టేవాళ్లే ఐనా, సినిమాల ప్రభావంతో లోకజ్ఞానం బానే ఉంది.
అట్లాగ.. నాకు ఒక కూతుర్నీ, కొడుకునీ ఇచ్చాడా దేవుడు.
అప్పుడే నిర్ణయించుకున్నాను.. పదేళ్లు దాటిన ఆడపిల్లలందరికీ స్కూల్లో ప్రత్యేకంగా పాఠాలు చెప్పి, ఏవిధంగా వారిని వాళ్లు కాపాడుకోవాలో నేర్పించాలని. ఆ తరువాత మా ఊర్లో ఎటువంటి సంఘటనలూ జరగలేదు.
ఊరు ఊరంతా ఈ సారి కృష్ణా పుష్కరాల్లో పాలు పంచుకుంటోంది.
“వచ్చేసినయ్ కిట్టమ్మా..” అని పాటలు పాడుతూ..
మా దీవికి బ్రిడ్జ్ మాత్రం రాలేదు. ఈ కొత్త ప్రభుత్వం ఏవన్నా చేస్తుందేమో చూడాలి.
ఈసారి.. జాతీయ పత్రికల వాళ్లుకూడా కవర్ చేస్తార్ట మా ఊర్లో పుష్కరాలని.
వాడు.. వస్తే మాత్రం వదిలేది లేదు. ఊరి సర్పంచ్ మంచి పట్టుమీదున్నారు. ఆయనెవరో కాదు.. మా వారే!
***
No comments:
Post a Comment