విహార యాత్ర - అచ్చంగా తెలుగు

మా బాపట్ల కధలు – 5

విహార యాత్ర

-భావరాజు పద్మిని


1992 వ సంవత్సరం... అది బాపట్లలో ఎ.జి.కాలేజి ఎదురుగా ఉన్న ఎస్.ఎం.జి.హెచ్ బాలికోన్నత పాఠశాలలో పదవతరగతి గది...
“అమ్మాయిలూ... ఇటోసారి వినండి. వచ్చే శుక్రారం మన స్కూల్ పిల్లల్ని అమరావతి విహారయాత్రకి తీసుకుని వెల్తాండాం. వచ్చేందుకు ఇష్టం ఉన్నవాళ్ళు చార్జీలకు వంద రూపాయిలు తీసుకురాండి. ఐతే, ఇది చార్జీలకి మాత్రవే ! ఎవరి తిండి వాళ్ళు తెచ్చుకోవాలి, సరేనా ?“ తన పద్ధతిలో సాగాతీసుకుంటూ చెప్పింది మార్తా మేడం.
“అదేంటి మేడం? పక్కన సూర్యలంక బీచ్ పెట్టుకుని, మనం విహారయాత్రకి అంత దూరం వెళ్ళడం ఎందుకు? అందరూ  మనూరు చూడడానికి వస్తే, మనం వేరే ఊరు వెళ్తామా ?” ఏ విషయంలోనూ కడుపునొప్పి ఆగని లక్ష్మి, చెయ్యి పైకెత్తుతూ అడిగింది.
“లేచావూ ! ‘చెయ్యెత్తండి, జైకొట్టండి ‘ అని ఎర్రబస్సు వాళ్ళు నిన్ను చూసే పెట్టుంటారే! ఎప్పుడూ మీరు చూసే సముద్రమేగా ! అక్కడేవుంది, రావణాసురుడి తలకాయ(ఇదో రకం సముద్రపు ఒడ్డున పెరిగే చెట్టు, దీని కాయ చుట్టూ సన్నటి ముళ్ళతో, గోళాకారంగా గాలికి దొర్లుకు వస్తుంది ), ఎండ్రగబ్బలు, చిల్లపెంకులు తప్ప ! అమరావతి పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఆలయం పక్కనున్న కృష్ణా నదిని చూస్తేనే కొత్త ఉత్సాహం వస్తుంది. అంతేకాక, బౌద్ధులు నడయాడిన పవిత్ర భూమి అది. బౌద్ధులు వాడిన పవిత్రమైన వస్తువుల ప్రదర్శనశాల కూడా అక్కడే  ఉంది. వినోదయాత్రలో వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందితే మంచిదే కదే ! అందుకే ఈసారి అటు వెళ్తున్నాం. ఇక కూర్చోవే సందేహానందం !” మార్తా మేడం అనేసరికి క్లాసులో ఒక్కసారిగా నవ్వులు పూసాయి.
“మేడం ,ఇవాళ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు,” అంది గంటకోసారి ఆవిడని పొగిడే దుర్గ. అవును మరి, అది వాళ్ళ పక్కింట్లో ఉంటుంది. ఆవిడని అలా అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసుకోకపోతే దానికే కాదు, మరెవరికీ కుదరదు మరి ! ఎందుకంటే ఆవిడే ఆ స్కూల్ హెడ్ మిస్ట్రెస్, ఇంగ్లీష్ టీచర్, సైన్సు టీచర్, లెక్కల టీచర్... ఒక్కమాటలో ఆల్ ఇన్ వన్.  తెలుగు, హిందీ  మాత్రం ఆవిడకు రావు కనుక, వేరే టీచర్లు ఉండేవారు. అంటే మిగతావి వచ్చని కాదు, పుస్తకం చూసి, గైడ్ చూసి, ఎంచక్కా చదువుతుంది ! స్కూల్ లో కొందరు పిల్లలు ఆవిడకు రేషన్లో పంచదార, పప్పులు తేవడానికి వెళ్ళాలి. కొందరు ఆవిడకి కూరలు తరగాలి, కొందరు ఆవిడ బిల్లులు కట్టాలి... ఒక్కటేమిటి, ఆవిడ చెప్పిన పనల్లా చెయ్యాలి. చెప్పిన పన్లు చెయ్యకపోతే, మొత్తం క్లాసు ముందర తిడుతుందని హడల్ అందరికీ. ఆవిడ స్కూల్ కి ఏ టైంకి వస్తుందో, ఏ టైం కి వెళ్తుందో చెప్పలేము. ఆ రోజు 11.30 కి వచ్చింది.
“ఔనా, థాంక్సే ! మూనెల్ల తర్వాత, ఇవాళే తలంటు పోసుకున్ననే. అందుకే లేట్ అయింది. టైం చాలదని, స్నానం కూడా మూడు రోజులకో సారి చేస్తుంటా !“ అందావిడ మురిసిపోతూ. క్లాసులో ఉన్న అందరికీ ఒక్కసారి కడుపులో తిప్పినట్టు అయ్యింది. “ఈవిడీ, అరబ్ దేశాలలో పుట్టాల్సింది, అక్కడ నూనెలు ఎక్కువ, నీళ్ళు తక్కువ దొరుకుతాయట ! హాయిగా స్నానమే చెయ్యక్కర్లా !” గొణిగింది శారద. మౌనంగా తలొంచుకు నవ్వసాగాము నేను, ఉష. మధ్యాహ్నం లంచ్ గంట మ్రోగడంతో అందరం ఇళ్ళకు బయలుదేరాము.
అది శుక్రవారం ఉదయం 5 గం. సమయం. ముందుగానే ఆర్.టి.సి. వాళ్ళతో మాట్లాడి, ఊరి మధ్యలో ఉన్న గడియారపు స్థంభం వద్దకు ఒక రెండు బస్సులు తెప్పించారు. పిల్లలంతా కోలాహలంగా అందులో కూర్చున్నాము. నా ప్రక్కన అటు ఉష, ఇటు శారద కూర్చున్నారు. అందరి మొహాల్లో ఆనందం తాండవిస్తోంది.
“ఏమే, ఏం తెచ్చావే ?” అడిగింది శారద.
“నేను పులిహోర తెచ్చానే...” అంది ఉష.
“మరి నువ్వో ?”
“నేనూ పులిహోరే... ఏమే నువ్వేం తెచ్చావు ?”
“నాకు ఇష్టమని మా అమ్మ దద్దోజనంతో పాటు దొండకాయ పచ్చడి చేసి ఇచ్చింది.”
“ఏవిటీ, దొండకాయ పచ్చడా ? ఎప్పుడూ వినలేదే !” అన్నారు ఇద్దరూ ముక్తకంఠంతో.
“అవునే. దానికో పెద్ద కధ ఉంది. ఓ సారి మా బామ్మా తాత దూరంగా కొండమీద ఉన్న ఓ పుణ్యక్షేత్రానికి తీర్ధయాత్రకు వెళ్లారట. మధ్యాహ్నం కావొస్తోంది, ఎండ మండిపోతోంది. ఇద్దరూ పెద్దవాళ్ళే, అలసటగా ఉంది, ఆకలి దంచేస్తోంది. అప్పుడు అన్నిచోట్లా భోజన వసతి సదుపాయాలు ఉండేవి కాదు కదా ! ఆ కొండమీద కూడా హోటల్స్, సత్రాలు ఏమీ లేవట. వీళ్ళు కూడా ఏమీ ఆహారం తెచ్చుకోలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా...”
“ఏవిటే బాబూ, దొండకాయ పచ్చడికి గండికోట రహస్యంలా పెద్ద చరిత్ర చెప్తున్నావ్. “ అంది శారద. “ఉండవే, కధ ఆసక్తికరంగా ఉంది, నువ్వు చెప్పవే !” అంది ఉష.
“అలా చూస్తుంటే వాళ్లకు దూరంగా ఎక్కడో ఒక చిన్న పూరిపాక కనిపించిందట. అక్కడకు వెళ్లి చూస్తే, ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. “అవ్వా, ఆకలి వేస్తోంది. దూరం నుంచి వచ్చాము, ఏదైనా ఉంటే పెడతావా?” అని అడిగారు. ఆవిడ “అయ్యో, చూస్తే, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ లాగా ఉన్నారు, ఈ పేదింట్లో తింటారా ?” అని అంది. వెంటనే వీళ్ళు,”చూడు అవ్వా ! ప్రాణాలు నిలబెట్టుకోడం ముఖ్యం కదా ! ఎంతటి వారికైనా ఆకలి బలీయమైనది. మహాతపస్సంపన్నులైన మునులే అవసర సమయంలో గుర్రం తినే గుగ్గిళ్ళను తీసుకు తిన్నట్లు చరిత్ర చెబుతోంది. అంతెందుకు, ప్రేమతో పెట్టిన పిడికెడు అన్నాన్ని భగవంతుడు కూడా కులమత విభేదాలు చూడకుండా స్వీకరిస్తాడు కదా ! అందుకే, నీవద్ద ఏది ఉంటే అదే పెట్టమ్మా !” అన్నారు. వెంటనే ఆవిడ వీళ్ళని కూర్చోబెట్టి, కాస్త మజ్జిగ నీళ్ళిచ్చి, పెరట్లోకి వెళ్లి ఏవో కోసుకొచ్చి పావుగంటలో వంట ముగించి, అరిటాకులో వడ్డించింది. ఉడుకు అన్నం, దానితో ఏదో పచ్చడి... పరమాద్భుతంగా ఉంది. బామ్మ, తాత వాయలు వాయలు తినేస్తున్నారు. భోజనం ముగించాకా ... “అవ్వా, ఇంతకీ ఇది ఏమి పచ్చడి, ఇటువంటి రుచి జన్మలో ఎరుగను.” అంది బామ్మ. “ ఇంట్లో కూరలేమీ లేకపోడంతో పెరట్లో దొండపాదుకు పండిపోయిన దొండకాయలు ఉంటే కోసుకోచ్చాను, అదే పచ్చడి చేసానమ్మా,” అంది అవ్వ. “దొండపండు పచ్చడా? ఎప్పుడూ వినలేదే ! ఎలా చెయ్యాలో చెప్పవూ,” అని అడిగితే, అవ్వ “పండిన దొండ ముక్కలు కోసి, ఉప్పేసి మగ్గబెట్టి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, తగినంత ఉప్పు, చిటికెడు పంచదార వేసి, రుబ్బి, పోపు వేస్తే చాలమ్మా, ఏదో మీ అభిమానం గాని, ఇదో పెద్ద వంటా ?” అని ఆనందపడిపోతూ చెప్పిందట. బామ్మా వాళ్ళు డబ్బు ఇవ్వబోతే, నిరాకరించి, “ఆదిదంపతుల లాంటి మీకు అన్నం పెట్టే అదృష్టం ఈ రోజున ఆ స్వామి దయవల్ల కలిగింది, ఇంకేం వద్దమ్మా,” అని వారించిందట. అప్పటి నుంచి దొండకాయ పచ్చడి మా ఇలవేల్పు అయ్యింది.” అంటూ ముగించాను నేను. ఉష, శారద కళ్ళు విప్పార్చి వింటున్నారు. ఇలా కబుర్లతో కాలం ఎలా గడిచిపోయిందో తెలీదు. 6. 30 అవుతుండగా అమరావతి గుడి ఎదురుగా బస్సు ఆగింది. బిలబిల మంటూ పరుగులు పెడుతూ దిగాము అందరం.
“ఆగండే ! లైన్లో నిలబడండి. ఇదిగో, ఇప్పుడు మనం ముందర ఆవలి రేవుకి లాంచీలో వెళ్లి, నదిలో స్నానాలు చేసి వద్దాము. తర్వాత స్వామిని దర్శించుకుని, టిఫిన్ లు తిని, చుట్టుపక్కల గుళ్ళు చూసుకుని, భోజనాలు చేసి, ఆ పై బౌద్ధారామాలు,  బస్టాండ్ దగ్గర మ్యూజియం చూసుకుని, వెనక్కి వెళ్దాము. పది పది మంది ఒక టీచర్ వద్ద పేర్లిచ్చి, ఉండండి. ఎవరైనా తప్పిపోతే, ఇదిగో ఈ గాలి గోపురం మొదట్లోకి వచ్చి నిలబడండి. తప్పిపోయినా, మిమ్మల్ని సాయంత్రం లోపు వచ్చి, పట్టుకు పోతాంలే ! లేప్పోతే మీ అమ్మా,నాన్న మమ్మల్ని ఊళ్ళో బతకనివ్వరుగా !” మార్తా మేడం మాటలు విని, అంతా నవ్వుకున్నాము. లాంచి అవతలి రేవుకు వెళ్ళింది. అందరూ అక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణాల వద్దకు వెళ్లి, ఏవేవో కొనుక్కుంటున్నారు. నాకెందుకో వాటికంటే, ఆ నది ఒడ్డున కూర్చుని కళ్ళముందు ముగ్ధంగా కనిపిస్తున్న ప్రకృతినే చూడాలనిపించింది...
నది ఒడ్డున ఉన్న మెట్ల మీద కూర్చుని, మౌనంగా గమనించసాగాను. ఇంకా నదిమీద మంచు తెరలు వీడలేదు. గుడికి చుట్టూరా ఉన్న పున్నాగ పూల పరిమళాన్ని గాలి మోసుకు వస్తోంది. అక్కడున్న చిన్నపాటి దుకాణం నుంచి లింగాష్టకం వినసొంపుగా చెవులకు సోకుతోంది. అక్కడి వాతావరణంలో ఏదో అలౌకికమైన ప్రశాంతత ఉంది. దూరంగా అలలపై చిన్న పడవ తేరులా సాగిపోతోంది.
“ఏమే, దీన్ని చూడు, ఆ వచ్చే పడవేదో పంచకల్యాణి గుర్రమైనట్లు, ఆ తెరచాప దాని రెక్కలైనట్టు, ఆ పడవవాడు దీని కలల రాకుమారుడు అన్నట్లు, గుడ్లు మిటకరించి చూస్తోంది. ‘అమ్మా! పద్మినీ దేవి ! కాస్త కలలోంచి ఇలలోకి దయచెయ్యండి, బహుపరాక్, బహుపరాక్ !” అంటున్న శారద మాటలకు వెనుదిరిగి చూసి, నవ్వసాగాను. “అబ్బా, ఊరుకోవే అల్లరి. అదేదో ప్రకృతిని చూస్తుంటే !” కోప్పడింది ఉష. ‘చూడు, మేము విభూతి పండు కొనుక్కున్నాము...’ అంటూ చూపించింది.
ఈలోగా “అమ్మాయిలూ, బిలబిల మంటూ , జరజర మంటూ రండి, పడవొచ్చేసింది ,” అంది మార్తా మేడం. “ఏమే, ఈవిడ తెలుగు మండ ! ఎలుకలకి, పాములకి వాడే భాష పిల్లలకి వాడుతోంది చూడు, ఉడుత మొహమూ ఇదీనూ !” అంది శారద. మేమిద్దరం నవ్వు దాచుకోలేక, లాంచి ఎక్కుతుంటే... “ఏమే ! త్రిపాది నక్షత్రాలు, బస్సు ఎక్కిన దగ్గర్నుంచి కిస్కూ కిస్కూ మంటూనే ఉన్నారు. గాంధి గారి మూడు కోతుల్లా ఈ అల్లరేంటే ? “ అంది వకుళ మేడం. పగలబడి నవ్వుకుని, బాగ్ లతో లాంచి ఎక్కాము. ఆ లాంచి వెళ్తుంటే, నది ఒడ్డున అక్కడక్కడా ఏవో మెట్లు కట్టడం, నదిలో కర్రలు పాతడం, తడికెలతో నది ఒడ్డున ఏవో దళ్ళు కట్టడం కనిపించింది.
“మేడం గట్టిగా గాల్లోకి ఎగిరి, ఒక దూకు దూకితే సరిపోయేదానికి, వీళ్ళు కష్టపడి, మెట్లు కర్రలు పట్టుకు సాము చేస్తున్నారు ! ఎందుకు మేడం ?” అడిగింది లక్ష్మి.
“హమ్మయ్య, అడిగావూ... సుమారు 64 సెకండ్ల నుంచి నువ్వు సందేహాలు అడక్కపోయే సరికి బెంగెట్టుకున్నానే !నీలాంటి వాడే చూసి రమ్మంటే కాల్చి వచ్చాట్ట ! తామసంగా తప్ప మానవమాత్రుల ఆలోచనలు రావే నీకు ?ఎగిరి దూకుతావా నా తల్లే నా తల్లే !”... మార్తా మేడం మాటలకు అంతా విరగబడి నవ్వసాగారు. లక్ష్మి కూడా నవుతోంది, దాని ప్రత్యేకత ఏమిటంటే, ఎవరేమన్నా, నవ్వినా సరే, కడుపులో ఉన్న డౌటు తీరేదాకా, పెద్దగా పట్టించుకోదు. “అది కర్ర సాము, కత్తి సాము కాదే మాలచ్చిమి తల్లా ! ఇంకో నెలలో కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి కదా ! దాని కోసం పుష్కర ఘట్లు , మెట్లు, ఎంత లోతుకు వెళ్ళవచ్చో సూచించే కర్రలు, నది ఒడ్డున ఆడవాళ్ళు బట్టలు మార్చుకోడానికి దళ్ళు కడుతున్నారు. అరవయ్యేళ్ళ ముసిలోడు నీలాగా ఎగ్గిరి దూకలేడు కదమ్మా, అందుకే స్నానాలకి సాత్వికంగా ఘాట్ లు, మెట్లు కడుతున్నారు.” ఆవిడ మాటలు పూర్తి చెయ్యకుండానే... “ఆగండాగండి మేడం, ఇంతకీ పుష్కరాలంటే ఏంటి ?” అడిగింది లక్ష్మి చెయ్యి ఎత్తుతూ.
“ప్రశ్నకీ ప్రశ్నకీ మధ్య ఊపిరి తీసుకునే గాప్ కూడా ఇవ్వవే నువ్వు ? ఈ నది మధ్యలో నేను ఏమైపోవాలి? “ అంటూ నవ్వి, మళ్ళీ ఇలా చెప్పసాగింది మార్తా మేడం.
“పుష్కరం అంటే 12 సం. అని అర్ధం. పూర్వం మహర్షులు భారతదేశంలోని పుణ్యనదుల చరిత్ర, మహిమలను ప్రజలకు తెలియచెప్పారు. తీర్థరాజైన వరుణుని ఒకసారి దేవతలంతా సర్వతీర్థాలలో కలిసి, గంగాది మొదలైన ద్వాదశ నదులలో, సంవత్సరానికి ఒక నదిలో నివశించమని కోరారు. మహర్షుల విన్నపానికి వరుణ దేవుడు సమ్మతించి, "పుష్కరసమయంలో సమస్త దేవతలతో కలిసి బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి వస్తాను," అని చెప్పాడు. కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రథమని పురాణాలు చెప్తున్నాయి.అలా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే, సమస్త పాపాలు నశించి, ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భావిస్తారు. అందుకే అందరూ దూరదూరాల నుంచి పుష్కర స్నానానికి వస్తారు. అంతమంది ఒకేసారి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం కనుక, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు.” మార్తా మేడం మాటలని అంతా శ్రద్ధగా విన్నారు.
అవతలి గట్టుకు చేరగానే... అంతా ఒకరి మీద ఒకరు నీరు చిలకరించుకుంటూ ఆనందంగా స్నానాలు చేసాము. ఆ నది ఒడిలో ఉంటే, అమ్మ ఒడిలో ఉన్నంత వెచ్చగా ఉంది. ఆ తర్వాత అమరేశ్వరుడి గుడి చుట్టూ ఉన్న గుళ్ళు చూస్తూ, పంచారామాల కధ తెలుసుకుని, కొండంత వేల్పు అమరేశ్వరుడిని దర్శించుకున్నాము. గుడి చుట్టూ కోలాహలంగా తిరుగుతూ పున్నాగ పూలు ఒడి నిండా ఏరుకుని ఒకరిపై ఒకరం జల్లుకున్నాము. ఇటుకతో కట్టబడిన మహా చైత్యాలలో ఒకటైన అమరావతి స్తూపం దర్శించుకున్నాము. అక్కడే భోజనాలు చేసి, మ్యూజియం కు వెళ్ళాము.
“ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు పురాణాలు ద్వారా తెలుస్తుంది. వీటిని ఆధారంగా చేసుకొని ఇక్ష్వాకులవంశ కాలాను క్రమాన్ని వివరించారు.
వశిష్టీ పుత్ర శాంతమూలుడు క్రీ.శ180-193
మొదటి వీర పురుష దత్తుడు క్రీ.శ.193 -213
రెండో ఎహుబల శాంతమూలుడు క్రీ.శ.213-237
రెండో వీర రుద్ర పురుష దత్తుడు. క్రీ.శ. 237-248
పురాణ ఆధారాల ప్రకారం పేర్లు తెలియని ముగ్గురు రాజులు కూడా పరిపాలించారని తెలుపుతున్నాయి. ఏడుగురు ఇక్ష్వాకు రాజులు కలిసి 100 ఏళ్లు పాలించారని తెలుస్తుంది. ముఖ్యంగా మీరు ఎహుబలశాంతమూలుడి (క్రీ.శ.213-237) గురించి తెలుసుకోవాలి.
ఎహుబలశాంతమూలుడు వీర పురుషదత్తుడి కుమారుడు. ఇతడు 24 సంవత్సరాలు పాలించాడని ఇతరి సోదరి 24వ రాజ్యపాలనా సంవత్సరంలో కొండబలిసిరి నాగార్జున కొండపై ఒక బౌద్ధ విహారాన్ని కట్టించడం ద్వారా తెలుస్తుంది. ఇతని కాలంలో ఒకవైపు బౌద్ధం మరోవైపు హైందవం ఫరిడవిల్లినట్లు తెలుస్తుంది. నాగార్జున కొండలో ఇతని కాలం నాటి అనేక శాసనాలు 1954-61 తవ్వకాల్లో లభించాయి. పాకృత భాష, సంస్కృతంలో శాసనాలు రాయించే పద్ధతి ఇతని కాలంలోనే ప్రారంభమైంది. అలాగే అనే హిందూ దేవాలయాలను కట్టించాడు. దక్షిణ దేశంలో హిందూ దేవాలయాన్ని కట్టించిన మొట్టమొదటి రాజు ఇతడే. వీరు వాడిన వస్తువులు, ఆయుధాలు, దుస్తులు, అప్పటి శిల్పాలు, అవశేషాలను ఇక్కడ  భద్రపరిచారు” అని అక్కడి విశేషాల్ని వివరించింది వకుళ మేడం. అందరం వెంట తెచ్చుకున్న పుస్తకాల్లో అక్కడ చూసిన విశేషాలన్నీ రాసుకున్నాము. రాత్రి తిరుగు ప్రయాణంలో ఉష నా ఒళ్లో పడుకుని, “నువ్వు పాడతావు కదా !ఓ పాట పాడవా? “ అని అడిగి నేను ‘ఓ పాపా లాలి’ అన్న పాట సగం పాడుతుండగానే ఒళ్లో పడుకుని, నిద్రపోయింది. కల్లా కపటం తెలియని స్వచ్చమైన స్నేహాలు అప్పటివి. అమరావతి యాత్రలో ఎవరి అనుభూతులు వారివి, ఎవరి ముచ్చట్లు వారివి...
ఆ తర్వాత కూడా చాలా రోజుల పాటు ఆ విహార యాత్ర మా బాపట్ల నేస్తాల మాటల్లో సజీవంగానే నిలిచిపోయింది.
***
(చిన్నప్పటి విహారయాత్రలు ఎవరికైనా మధుర జ్ఞాపకాలే కదా !కృష్ణా పుష్కరాల ప్రత్యేక సంచిక కనుక, కృష్ణా నదికి సంబంధించిన కధ ఉంటే బాగుంటుందని, ఇలా రాయటం జరిగింది.)

No comments:

Post a Comment

Pages