ఆభరణాలు
- డి. శోభారాణి.
“అర్పిత పెళ్ళి సెటిల్ అయింది. ఈఆదివారమే నిశ్చితార్థం. పిల్లలను తీసుకొని శనివారమే వచ్చేయండి.. ” అంటూ నాన్న దగ్గరినుండి ఫోన్ రాగానే ఆశ్చర్య పోయాను.
నా చెల్లెలు అర్పితకు పెళ్ళి సంబంధాలు చూస్తున్న మాట వాస్తవమే కాని నాకు ఒక్క మాట చెప్పకుండా.. అబ్బాయి వివరాలేవీ తెలుపకుండా.. అసలు నాప్రమేయమే లేకుండా.. పెళ్ళి సంబంధం ఖాయం చేసుకోవడం.. నిశ్చితార్థం నిర్ణయించుకోవడం.. నామనసు కలత పడింది.
చెల్లెలు అంటే నాకు ఏమీ బాధ్యతలు లేనట్లు.. నేనేమీ సంబంధాలు చూడనట్లు ఇలా నాన్న వ్యవహరించడం బాధగా అనిపించింది.
అర్పిత కోసం నేనూ నాలుగైదు సంబంధాలు చూశాను. మాకు నచ్చిన సంబంధాల వారి నుండి ఆశించిన సమాధానం రాలేదు. ఎలా వస్తుంది?.. అమ్మాయికి అందచందాలు, చదువు సంస్కారం కంటే ఐశ్వర్యానికి ప్రాముఖ్యమిచ్చే రోజులివి.
మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న పోలీసు కానిస్టేబుల్. అమ్మ గృహిణి. నా తరువాత ఇంట్లో ఇక చిన్న పిల్లల సందడి రాదనే నిరాశ ఆవరించన తరుణంలో పుట్టింది అర్పిత. నాకూ అర్పితకు దాదాపు పదేండ్ల వ్యత్యాసం. మా ఇంట్లో ఆనందానికి అవధులు లేవు. ఊహించని పరిణామం. నన్ను ‘ఒన నక్క’ అని గేళి చేసిన వారి నోళ్ళు మూతలు పడ్డాయి...
‘ఏజన్మలో చేసుకొన్న పుణ్యఫలమో!.. నాజన్మ ధన్యమైంది.’ అనుకుంది అమ్మ. అమ్మ ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం. నాన్న సరే సరి.. నన్నిప్పుడు ఎవరడిగినా నేనూ, నాకో చెల్లాయి అంటూ తలెత్తుకొని సగర్వంగా చెప్పుకోవడం నాకెంతో సంతృప్తినిచ్చేది...
అర్పిత ఎదిగిన కొద్దీ నాన్నకు నాపైన ఆర్థిక పరమైన అనుమానపు ఛాయలు పెరుగసాగాయని నా అనుమానం. నేనేపని చేసినా నాన్న నన్ను నమ్మడం లేదు. ఓరకంగా కారణం నేనే నేమో!.. నామనసు పరి పరి విధాల వ్యాకులత చెందసాగింది...
***
నేను బి.ఏ. డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్ష రాయగే నాన్న నన్ను బలవంతంగా హోంగార్డ్స్ సెలక్షన్స్ కు తీసుకెళ్ళాడు. సెలక్టయ్యాను. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానన్నాను. నాన్న ఒప్పు కోలేదు. ‘నువ్వు పీ.జీ. చేసినా ఇంతకంటే మంచి ఉద్యోగం రాదని అన్నాడు. ‘చదివిన చదువులు ఇక చాలు ఉద్యోగంలో చేరిపో..’ అని హుకుం జారీ చేశాడు. ‘నేనేం చదివానని.. ‘ఆ’ అంటే ‘ఇ’ రాదు.. పోలీసు నౌకరీ చేయడం లేదా.. మాకాలంలో కాబట్టి నాకామాత్రం ఉద్యోగం దొరికింది. ఈకాలంలో అయితే అదీ దొరకదు. నిన్ను ఇంకా ఎంత కాలం పోషించాలి.. పెళ్ళి చేసుకొని నీదారి నువు చూసుకో..’ అంటూ పెదవి విరిచి మాట్లాడే సరికి నామనసు చివుక్కుమంది. అలా నాన్న మాట్లాడడం అదే మొదటి సారి. ఆసంఘటనతో నాన్న నన్ను నమ్మడం లేదనే నాఅనుమానానికి బీజం పడింది.
నాకు తెలియకుండానే నాకోసం నాన్న పెళ్ళి సంబంధాలు చూడ సాగాడు. నేను పెళ్ళి చూపుల వరకు రాకుండానే సున్నితంగా తిరస్కరించే వాణ్ణి. నాదృష్టిలో పెళ్ళి చూపులు జరిగాయంటే ‘అమ్మాయిని తిరస్కరించడం సంస్కారం అనిపించుకోదు.. అమ్మాయిని బాధ పెట్టిన వాడిని అవుతాను. ఎదో రకంగా ముందుగా అమ్మాయిని చూశాక కాని పెళ్ళి చూపుల తతంగం పెట్టుకోరాదు..’ అనే అభిప్రాయం నాలో లోతుగా పాతుకు పోయి ఉంది.
నా డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాయి. నాకు సికింద్రాబాదు దగ్గర తిర్మలగిరి పోలీసు సెంటర్లో ట్రైనింగ్‌కోసం కాల్ వచ్చింది. జాయిన్ కావడానికి దాదాపు ఒక నెల రోజుల సమయముంది. ఈసమయంలోనే ఏదో ఒక సంబంధం ఖాయం చేసుకోవాలని నాన్న ఆరాటం.. నేనేమో ఏదో ఒక పని కల్పించుకొని తప్పించుకు తిరగడం...
మా ఇంట్లో ఒక పాత నవారు మంచం వుంది. ఆ మంచమంటే నాకు చాలా ఇష్టం. పరుపు లేకున్నా మెత్తగా పడుకోవచ్చు.
దాని నవారు తెగిపోయింది. నవారు కొనుక్కు వస్తానని హసన్పర్తికి వెళ్ళాను. ఆఊళ్ళో మాకు బంధువులు కాడా ఉన్నారు. రెండు మూడు రోజులు నాన్న పాడే నా పెళ్ళి పాట నుండి తప్పించుకోవచ్చని నా ప్లాను. ఆ ఊరి నవారు మన్నిక అందరికీ తెలుసు. ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు కూడా.
హసన్‌పర్తిలో నవారు నేయడం కుటీర పరిశ్రమ. దాదాపు ప్రతీ ఇంట ఒక నవారు మగ్గం వుంటుంది.
పద్మశాలి చేనేత సహకార సంఘం కార్మికులకు నవారుకు సంభంధించిన ముడి సరుకు సరఫరా చేయడం, తిరిగి వారు నేసిన నవారును సంఘం కొనుగోలు చేయడం సంఘం అత్యధిక శ్రద్ధ వహిస్తుంది. ఇక్కడి నుండి రాష్ట్రంలో నలుమూలలా వ్యాపారం కొనసాగుతూంది. హసన్‌పర్తిలో నేసిన నవారు నాణ్యతకు పెట్టింది పేరు. మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది.
నేను ఆసంఘంలో అడుగు పెట్టే సరికి అందులో గుమస్తాగా పని చేసే మాదూరపు బంధువు రాజమొగిలి నన్ను చూసి పరుగెత్తుకుంటూ వచ్చాడు. నాకు వరుసకు పెదనాన్న అవుతాడు. విశ్రాంత జీవనం. చేనేత సహకార సంఘంలో వేతనం ఆశించకుండా సేవాదృక్పదంతో పని చేస్తున్నాడు.
“బాబూ సూర్యం.. ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి...” అంటూ ఆప్యాయంగా పలుకరించాడు. కూర్చోమని చెప్పి టీ తెప్పించాడు.. టీ తాగుతూ కుశల ప్రశ్నలు వేసుకోసాగాం..
ఇంతలో సంఘంలో నవారు బిల్లలు అప్పగించడానికై ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి అనే బదులు అప్సరస అంటే బాగుంటుందేమో!.. కరెంటు పోయి చీకట్లో ఉన్నామనుకున్న మాకు ఆమె రాకతో కరెంటు వచ్చినట్లుగా భ్రమ పడ్డాం. కరెంటు వచ్చాక కూడా ఫ్లోరెసెంటు లైట్లు ఆమె ముందు వెల, వెల పోతున్నాయంటే అతిశయోక్తికాదు. ఆమె కదలిక ఒక మెరుపుతీగ. ఆమె మాటలు తేనెల మూటలు. ఆమె స్వరం విని కోకిల సైతం గొంతు సవరించుకోవాల్సిందే. నా టీ కప్పులోనే మిగిలి పోయింది.. నాకళ్ళు నిలిచి పోయాయి.. ఆమె హంసలా నడుచుకుంటూ వెళ్ళి పోయింది.
నాపరధ్యానాన్ని అర్థం చేసుకున్న పెదనాన్న టీ తాగడం పూర్తి చేసి ఖాళీ కప్పు టేబుల్ కింద పెడుతూ స్వరం సరి చేసుకున్నాడు. ఆ శబ్దంతో ఠక్కున ఈలోకానికి వచ్చాను. నా చూపులను గమనించిన పెదనాన్న నాగూర్చి ఏమనుకుంటున్నాడో ఏమో!.. అని బిడియ పడ్డాను. టీ ఒక్క గుక్కలో తాగేసి సీను మార్చాను.
“పెదనాన్నా నేను నవారు కొందామని వచ్చాను. రెండు బిల్లలు కావలి” అన్నాను.
ఇద్దరం కౌంటరు వద్దకు వెళ్ళి రకరకాల డిజైన్లు కలిగిన నవారు బిల్లలను పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ ఇంతకు ముందు అమ్మాయి తెచ్చిన నవారు బిల్లలు ఖరీదు చేసాను. పెదనాన్న వాటిని ప్యాకింగ్‌కు పంపించి “రా బాబూ!... నీతో కాస్తా మాట్లాడాలి” అన్నాడు.
నేను సంశయిస్తూ కూర్చున్నాను.
“బాబూ.. నీకు పెళ్లి సంబంధాలు చూడమంటూ మీ నాన్న గారు నా చెవిలో వేసారు...
ఈఊళ్ళో ఓఅమ్మాయి వుంది. పేరు సుస్మిత వాళ్ళ ఇంట్లో పెద్దమ్మాయి. ఆమెకు ఇంకా ఇద్దరు చెల్లెండ్లు ఒక తమ్ముడు వున్నారు. సుస్మిత తల్లి పేరు సులోచన గృహిణి.. తండ్రి లక్ష్మీపతి. పేరుకు లక్ష్మీపతే గాని ఆస్తిపాస్తులేమీ లేవు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. ఇంట్లో అందరూ నిరంతరం శ్రమజీవులే. సులోచన బీడీలు కూడా చేస్తూంది. ఇదివరకు లక్ష్మీపతి ‘సామిల్లులో’ పని చేసేవాడు. సుస్మిత పదవతరగతిలో ఉండగా లక్ష్మీపతి చేయి మెషీన్లో పడి కుడి చేయి తెగిపోయింది.. పనిలో నుండి తీసేశారు. చదువులో ఎంతో చురుకుగా ఉన్న సుస్మిత ఇంటి పరిస్థితులు గమనించి తనకు తానుగా చదువు మానేసి నవారు పరిశ్రమలో చేరి పోయింది. మిగతా ఇద్దరు చెల్లెండ్లు, తమ్ముడు స్కూలుకు వెళ్లి వచ్చి బీడీల మూతులు ఒత్తడంలో, నవారు నేయడంలో సాయపడ్తూ వుంటారు. లక్ష్మీపతి ప్రస్తుతం స్వంతంగా రోడ్డు మీద చిన్న టీ కొట్టు నడుపుకుంటున్నాడు. వాళ్ళు తలదాచుకోడానికి ఒక చితికి పోయిన పెంకుటిల్లు వుంది..” అంటూ నేను అడుగ కుండానే నాకు ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తుండడం నాకు విస్మయాన్ని కల్గించింది.
మౌనంగా వింటున్న నామదిలో ఇంతకు ముందు చూసిన అమ్మాయి తాలూకు దృశ్యాలే నాట్యం చేస్తున్నాయి. నామనసు ఆ ఆమ్మాయి వెన్నంటే వెళ్తోంది...
నేను పరధ్యానంగా వున్నానని గమనించి “వింటున్నావా బాబూ..” అన్నాడు పెదనాన్న.
“ఆ!.. ఆ!.. వింటున్నాను పెదనాన్నా.. ” అన్నాను.
మళ్ళీ చెప్పసాగాడు.
“బీద కుటుంబం అన్నట్లే కాని పరువుగల సంప్రదాయ కుటుంబం. నువ్వు ఊ!. అను. పెళ్ళి చూపులు ఒక గంటలో అరేంజ్ చేయిస్తాను. నీ ఐడియాలోజీ నాకు తెలుసు. నువ్వు ఆ అమ్మాయిని నచ్చవనే ప్రసక్తే రాదు..” అన్నాడు పెదనాన్న.
నా మనసులో అలజడి మొదలయ్యింది..
“పాపం!.. లక్ష్మీపతి పెద్దమ్మాయి పెళ్ళి చేయాలని చాలా సంబంధాలు చూస్తున్నాడు. కలిసి రావడం లేదు.. అమ్మాయి అందచందాలతో బాటు వరకట్నానికీ ప్రాముఖ్యమిచ్చే రోజులు.. నీకు తెలియంది కాదు. అయితే నీమనస్తత్వం నాకు తెలుసు కాబట్టి వారి కుటుంబ గూర్చి చెప్పాను. కాని మీనాన్న పూర్తిగా కట్నం కానుకలూ ఆశించే మనిషి అని నాకు తెలుసు. బాగా ఆలోచించు. ఆకుటుంబాన్ని ఆదుకున్న వాడవి అవుతావు. వచ్చే వేసవి సెలవుల్లో ఎలాగైనా పెళ్ళి చేయాలని లక్ష్మీపతి ఆరాట పడ్తున్నాడు. నీకు ఈడూ జోడూగూడానూ.. ” అనే పెదనాన్న మాటలు నాపై ప్రభావాన్ని చూపసాగాయి..
‘కాని మాఇంట్లో అమ్మకు నాన్నకు చెప్పకుండా పెళ్ళి చూపులు!..’ సందేహించ సాగాను.
నా అనుమానాన్ని అర్థం చేసుకున్నాడు పెదనాన్న.
“ఇవి అఫీస్యల్గా పెళ్ళి చూపులు కావు బాబూ!.. అలా వెళదాం.. ఫ్రెండ్లీగా నిన్ను పరిచయం చేస్తాను. విషయం అమ్మాయికి గూడా తెలియనివ్వను. ఆతర్వాతే అసలు పెళ్ళి చూపులు. మీఇంట్లో నీకు మాట రాకుండా చూసే బాధ్యత నాది” అంటూ పెదనాన్న పూర్తి భరోసానిచ్చాడు. నా అంతరంగంలో ఆలోచనలు రేగుతున్నాయి. ఆలోచనలో పడిపోయాను. నా మౌనం అంగీకారంగా తీసుకొని సంఘంలోని మరో గుమస్తా చెవిలో ఏదో చెప్పి పంపించాడు.
నా గుండె వేగంగా కొట్టుకో సాగింది. ప్రథమంగా నేను ఒక అమ్మాయితో.. అదీ మావాళ్ళకు తెలియకుండా.. ‘అయినా నేను వాళ్ళకు నచ్చాలి కదా!.. నాకూ రాబోయేది భరోసా లేని నౌకరి.. సర్లే.. చూద్దాం..’ అని మనసులో ఊగిసలాట..
సంధ్యాసమయం..
పెదనాన్న నాకు చెప్పింది ఒకటి.. అక్కడ జరిపించింది మరొకటి..
వాతావరణం పెళ్ళి చూపులకు ప్రతీకగా నిలిచింది. హతాశుడనయ్యాను..
సుస్మిత నాన్నగారు లక్ష్మీపతి నాగూర్చి.. నాభవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగి తెలిసుకున్నాడు. వాస్తవానికి హసన్‌పర్తి మాస్వస్థలం. నాన్న పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంరీత్యా బదిలీల పరంపరలలో హసన్‌పర్తిలో ఉన్న మాఇంటిని అమ్మేసి పర్కాలలో సెటిల్ అయ్యాం. మానాన్న, లక్ష్మీపతికి చిన్ననాటి స్నేహితుడే.. దాంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
అమ్మాయి వచ్చి నాకెదుర్గా కూర్చుంది. తలెత్తి చూసి ఆశ్చర్య పోయాను. నేను సంఘంలో ఇంతకు ముందు చూసిన అమ్మాయే.. నాముఖంలో ఆశ్చర్యపు కుసుమాలు వికసించడం చూసి చిరునవ్వు నవ్వాడు పెదనాన్న.
ఇక అమ్మాయి నచ్చక పోవడం అనే సమస్య ఎక్కడిది?.. నాకు పెళ్ళి చూపుల మీద ఉన్న అభిప్రాయం కూడా పరిపూర్ణమైంది. మనసులోనే పెదనాన్నకు ధన్యవాదములు తెలుపుకున్నాను. నామాటల నైపుణ్యంతో నాకు అమ్మాయి నచ్చిందనే విషయాన్ని వాళ్ళు గ్రహించేలా చేసాను. నేను, పెదనాన్న లక్ష్మీపతి వద్ద సెలవు తీసుకొని బయట పడ్డాం.
మా వెనకాలే కబురు వచ్చింది. సుస్మితకు నేను నచ్చాను. ఎగిరి గంతులు వేసే వాణ్ణే.. పెదనాన్న నాపక్కన లేకుంటే.
ఈవిషయంలో మాఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అమ్మ కూడా నాన్ననే సమర్థిస్తోంది. అయినా నామనసులోని దృఢ సంకల్పంసడలి పోలేదు.
నేను కట్నం కానుకల విషయాలేవీ చర్చించకుండా పెళ్ళి తేదీ నిర్ణయించుకు రమ్మని అమ్మకు, నాన్నకు, వెంట వెళ్ళే పెద్దమనుషులకు ఖరాఖండిగా చెప్పడం.. నామొండి పట్టుదలతో నాన్న నామీద మరింత కోపం పెంచుకున్నాడు. ఆరాత్రంతా నా మౌన వేదన అమ్మ అర్థం చేసుకుని నాన్నను ఒప్పించింది. అయినా నాన్న చిన్న మెలిక పెట్టేడు.
“నువ్వు కట్నం తీసుకోవు సరే.. మరి రేపు నీచెల్లెలుకు కట్నమివ్వకుండానే పెళ్ళవుతుందా? ఏమిచ్చి చేస్తావ్.. చెల్లెలి పెళ్ళి బాధ్యత అంతా నీదే.. దానికి నా ఇష్ట ప్రకారం కట్నం కానుకలూ ఇచ్చి ఘనంగా పెళ్ళి చేయాలి.” అంటూ కోపంగా నావంక చూశాడు. చాలా తమాయించుకున్నాను. ఈపెళ్ళిని వ్యతిరేకించడం మూలాన తనకే నష్టం ఎక్కువ అని నాన్న లెక్కలు వేసుకుంటాడని నాకు తెలుసు. తన మనసులోని మాటను బయట పెట్టాడు కూడా. నేను ఉద్యోగంలో చేరాక ప్రతీ నెల కనీసం ఐదువందల రూపాయలు పంపాలని షరతు విధించాడు... ఒప్పుకున్నాను.
సుస్మితతో నాపెళ్ళి నిరాడంబరంగా జరిగింది.
నా హోంగార్డు ట్రైనింగ్ పూర్తి అయ్యింది. హన్మకొండలోని ‘నక్కల గుట్ట’ పోలీసు స్టేషన్‌కు నన్ను అలాట్ చేసారు.
హన్మకొండలో కొత్త కాపురం.. రెండు రోజులు ఉండి పోదామని అమ్మ కూడా మాతో వచ్చింది.
హోంగార్డ్స్ అనే ‘వాలంటీర్స్’ ను 1962 లో చైనా యుద్ధం తర్వాత ‘భారత అసమగ్ర నైపుణ్య సైనికులుగా’ గుర్తించింది భారత ప్రభుత్వం. ఇందులో 18 నుండి50 సంవత్సరములలోపు వయసున్న వారందరూ అర్హులే...
చాలీ చాలని జీతం. అయినా హోంగార్డు ఉద్యోగం సంఘ సంస్కరణ అనుకునే వాణ్ణి.
సెలవు పెట్టామంటే ఆరోజు జీతం కట్.. చుట్టాలు, పక్కాలు వస్తే వారికి మర్యాదలు చేయడం.. మున్ముందు పిల్లలు అయితే మరీ కష్టం.. నా ఒక్కడి శ్రమతో సంసారం నడవడం అసాధ్యం.
పి.జి.చేయాలనుకున్న నాలక్ష్యం నెరవేర్చు కోవాలి. సుస్మితకు ఎడ్యుకేషన్ ఇప్పించాలి. కనీసం తనకు టీచర్ ఉద్యోగం వచ్చినా సంసారం గాడిన పడ్తుంది..’ అని అలోచనలోచిస్తున్న నాకు అమ్మ గొంతు కళ్ళెం వేసింది. సుస్మితను నిలదీసినట్లుగా ఏదో అడుగుతోంది..
నేను వెంటనే నాబెడ్రూం నుండి గాబరాగా “ఏంటమ్మా.. ఏమైందీ..” అంటూ హాల్లోకి వచ్చాను.
“ఇదుగో నీ పెళ్ళాం చూడు.. తన పెట్టెలో బంగారు పెద్ద గొలుసు పెట్టుకొని నంగ నాచి వేషాలు వేస్తోంది. అది అమ్మి మన ఇంట్లోకి కావలసిన సామాన్లు కొందామంటున్నాను. మా అత్తగారు చాలా బీదవాళ్ళు వాళ్ళనేమీ అడుగొద్దు.. అని నువు గూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తివి. ఆఖరికి పడుకోడానికి నవారు మంచంకూడా మన ఇంట్లో నుండే తెచ్చుకుంటివి. ఇల్లన్నాక కనీసం ఓ టీ.వీ.. ఫ్రిడ్జ్.. డైనింగ్ టేబుల్, కూర్చోడానికి నాల్గు కుర్చీలైనా లేకుంటే ఎలారా.. మీ మంచికే చెబుతున్నా.. ఎవరైనా వచ్చి మీ అత్తవారు ఏంపెట్టారు అని అడిగితే ఏం చెప్తావ్..” అంటూ దీర్ఘాలు తీయసాగింది..
అంతవరకు సుస్మిత దగ్గర గొలుసు ఉన్నట్లు నాకూ తెలియదు. నామనస్తత్వం తెలిసి కూడా తాను తన ఇంటి నుండి గొలుసు తెచ్చుకున్నందుకు కోపం వచ్చింది. అయినా కొత్త సంసారం.. సుస్మిత బెదిరి పోతుందని నా కోపాన్ని తమాయించుకొంటూ “ సుస్మితా.. గొలుసు మీ ఇంటి నుండి ఎందుకు తెచ్చావ్?..” అంటూ నెమ్మదిగా అడిగాను.
తన మాటలకి సపోర్టు ఇవ్వకుండా, ‘గొలుసు ఎందుకు తెచ్చావ్..’ అని అడుగుతున్నందుకు సుస్మిత మీది కోపం నావైపు మళ్ళించింది అమ్మ.
“ఇది మాపూర్వీకులనుండి వంశాచారంగా వస్తున్న గొలుసండీ.. దీనిని మేము దేవుని మందిరంలో పెట్టి పూజిస్తూ ఉంటాం. నాల్గు తరతరాలుగా చేతులు మారుతూ మానానమ్మ దగ్గరి నుండి మా అమ్మకు అందితే, మాఅమ్మ నాకు ఇచ్చింది. గొలుసు తెచ్చానన్న విషయం మీకు నింపాదిగా చెబుతా మనుకున్నాను. కాని అత్తమ్మ చూసింది. దీనిని ఎట్టి పరిస్థితులోనూ అమ్మగూడదండీ..” అంటూ బిక్క మొఖం పెట్టింది సుస్మిత. ఆముఖాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేసింది. ఎంత అమాయకత్వం.. అనుకోకుండా నాపెదవులపై చిరునవ్వు మొలిచింది. అమ్మ లేకుంటే వాటేసుకునే వాణ్ణి.
నేనూ ఆనవాయితీ ప్రకారం తెచ్చుకున్న నవారు మంచమే అది. దానిని మాఇంట్లో అందరం ‘ఛత్రికోల్ల పట్టే మంచం’ అంటాం. చూడ ముచ్చటగా వుంటుంది. మంచానికి తల, కాళ్ళ దిశలలో రెండు మూడు అడుగుల నిడివి కలిగిన అద్దాలు అమర్చి వుంటాయి. ఒక వైపు చూపుడు అద్దమయితే మరో వైపు నెమళ్ళ నాట్య భంగిమల చిత్రాలు, దూరంగా కొండలు.. జలపాత దృశ్యాలు మెరుస్తూ వుంటాయి.. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు . దోమ తెర వెసులుబాటు సరేసరి. అది మాఇంట మూడు తరాలుగా సేవలందిస్తోంది. దానికి అల్లిన నవారు హసన్‌పర్తి సహకార సంఘం నుండి ఆనాడు కొనుగోలు చేసింది.. స్వయంగా సుస్మిత నేసిందే. అలాంటిది దానిని నేను ఎలా వదిలి పెట్టి రాగలను?.
నా చిరునవ్వు చూసి “అంతేలే.. ‘తల్లి అల్లం.. పెళ్ళాం బెల్లం’ అనే సామెత ఊరికే పుట్టిందా.. మీ ఇష్టం బాబూ.. నడుమ నేనెందుకు కంటు కావాలి.. ఈరాత్రికి ఉండి రేపు వెళ్ళిపోతాను. అర్పిత ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వచ్చాను.. ఎలా సంసారం చేసుకుంటారో.. ఏమో.. మీ ఇష్టం..” అంది అమ్మ. మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ వెళ్ళడం బాధకలిగింది. సుస్మిత గమనించక పోవడం కొంత వరకు నామనసు ఉపశమించింది.
ఆరాత్రి నేనైమైనా అంటానేమోనని భయపడ్తున్న సుస్మితను దగ్గరికి తీసుకున్నాను.
“సుస్మితా.. గొలుసు మీ ఆనవాయితీ ప్రకారం పూజించుకో.. నాకేమీ అభ్యంతరం లేదు. కాని దానిని ఎట్టి పరిస్థితిలోనూ మన అవసరాలకోసం వాడొద్దు. కట్నం తీసుకున్న వాణ్ణి అవుతాను” అన్నాను.
సుస్మిత కృతజ్ఞతా పూర్వకంగా నా గుండెపై వాలి పోయింది.
***
ఖర్చులన్నీ లెక్కలు వేసుకొని అదనపు సంపాదనకోసం ప్రణాళికలు వేసుకోసాగాను..
నాకు బాల్యం నుండి గణిత శాస్త్రం అంటే చాలా ఇష్టం. పాఠశాలలో ‘స్వయం పరిపాలనా దినోత్సవం’ నాడు నేను లెక్కల మాష్టారుగా ప్రథమ బహుమతి కూడా సాధించాను.
ప్రస్తుతం మార్కెట్లో ‘ఎమ్సెట్’ దానికై ఫౌండేషన్ దృష్ట్యా లెక్కలకు మంచి గిరాకీ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని పదవ తరగతి పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు వేకువ ఝామున్నే ట్యూషన్లు ప్రారంభించాను. నా అదనపు సంపాదన ఆరంభమైంది..
బీద విద్యార్థులకు ఉచితంగా బోధించే వాణ్ణి..
పదవ తరగతి ట్యూషన్ క్లాసులో సుస్మితను కూడా కూర్చోమన్నాను. ఉదయం రెండు బ్యాచ్‌లు రాత్రి రెండు బ్యాచ్‌లు..
అయినా నా ఉద్యోగ ధర్మం వదల లేదు. నాడ్యూటీ సమయంలో నిస్వార్థంగా శ్రమించి పని చేసేవాణ్ణి. ఆసంవత్సరం నాకు ‘రాష్ట్ర ఉత్తమ హోంగార్డ్’ అవార్డు వరించింది...
నేను ప్రైవేటుగా ఎం.ఎస్సి. మ్యాత్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాని తెలుసుకొని నా పైఅధికారులూ నాకు సహకరించే వారు..
అలా మొదలైన నా ప్రస్థానం దిన, దినాభి వృద్ధి చెంద సాగింది..
సుస్మిత నిండు చూలాలు.. అయినా ప్రైవేటుగా పరీక్షలు రాసింది. చివరి పరీక్ష రోజున పరీక్ష హాలునుండి నేరుగా హాస్పిటల్‌కు వెళ్ళాల్సి వచ్చింది. ప్రథమ పుత్రునికి జన్మనిచ్చింది. మా ఆనందానికి అవధులు లేవు. బాబు బోసి నవ్వులతో మా శ్రమనంతా మర్చిపోయే వాళ్ళం.
పదవ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది..
సుస్మితకు నామాదిరిగానే పట్టుదల ఎక్కువ. చదువుపై శ్రద్ధ సడలలేదు.. ఏకాగ్రతతో చదివేది.. ఆమె చదువుకుంటూ వుండడం చూడ ముచ్చటేసేది.
ప్రైవేటుగా ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపుతో ఇప్పించాను.. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.
డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. కోసం అడ్మిషన్ తీసుకుంది.
సంసార జీవన సరళిలో మరో అమ్మాయికి జన్మనిచ్చింది.
ఖర్చులు పెరుగుతున్నాయి..
అయినా మాచదువులు ఆగిపోలేదు.
నా ఎం.ఎస్సి. పూర్తైంది.. నాకిష్టమైన లెక్చరర్ ఉద్యోగం కోసం సర్వీసు కమీషన్ నిర్వహించ బోయే పరీక్షలకు సన్నద్ధమై హాజరయ్యాను.
నాకృషి ఫలించింది.. నాకు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. పటాన్ చెరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరాను.
హైద్రాబాదు భరత్ నగర్లో కాపురం...
అప్పటి ప్రభుత్వం కల్పించిన వెసులు బాటుతో ఎంట్రాన్స్ పరీక్ష రాసి టీచర్ ట్రైనింగ్‌లో సీటు సంపాదించుకొంది సుస్మిత. రోజూ కాలేజీకి వెళ్ళి వస్తోంది.. అటూ డిగ్రీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది..
“అర్పితను హైద్రాబాదుతీసుకు వెళ్తాను.. సుస్మితతో బాటు చదువు కుంటుంది. కనీసం డిగ్రీ చేయనిదే పెళ్ళి చెయ్యవద్దు.” అని అమ్మా, నాన్నలతో మొర పెట్టుకున్నాను.
“కూతుర్ని విడ్చి ఉండలేము” అన్ని తేల్చి చెప్పేరు. ఇంట్లో గారాబంతో అర్పిత ఇంటర్ తప్పింది..
“అమ్మాయి చదివి పెద్ద పొడుగు చేసేదేముంది? పెళ్ళి చేసేస్తాం.. నువు కూడా సిటీలో పెళ్ళి సంబంధాలు చూడు’ అన్నారు.. చాలా బాధ పడ్డాను. చెల్లెలికి ఆ వయసులో పెళ్ళి చేయడం నాకు ఇష్టం లేదు..
నాన్నకు నామీద ఇంకా అనుమానం పెరుగుతుందని విధి లేక సంబంధాలు చూశాను..
“ప్రతీ నెల ఇంటికి డబ్బు పంపే కంటే అర్పిత పెళ్ళి కోసం చిట్‌ఫండ్‌లో జాయిన్ అవండి.పెద్ద మొత్తంలో ఒకే సారి డబ్బు మనం సర్దు బాటు చేయ వచ్చు” అని సుస్మిత సలహా ఇచ్చింది. నాకు నచ్చింది.. జాయినయ్యాను. కాని చాలా కష్టమైన పని.. ఇద్దరు పిల్లలను సిటీలో ప్రైవేటు స్కూళ్ళళ్ళో చేర్పించడం.. సుస్మిత చదువు ఇంకా పూర్తి కావాల్సి వుండడం.. తను డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ నిర్వహించే ఎంట్రాన్స్ పరీక్షను ఎదుర్కోడానికి కోచింగ్ ఇప్పించడం.. ఇంకా ఇంట్లో కనీసం టీ.వీ అయినా లేక పిల్లలు పక్కవారి ఇంట్లోకి వెళ్ళి చూడడం.. మనసులో అలజడి..
ఆనేపథ్యంలో నాన్నకు ఫోన్ చేసి “ నాన్నా.. అర్పిత పెళ్ళి కోసం నేను చిట్స్ వేస్తున్నాను. ఇంటికి ప్రతీ నెల డబ్బు పంపించలేను” అన్నాను.
“ఇక నువ్వు అర్పిత పెళ్ళి ఏం చేస్తావ్?.. చిట్స్ వంకతో మాకు డబ్బు పంపకుండా మీ సుఖాలే చూసుకుంటున్నారు. ఉద్యోగం పెరిగింది కదా.. కనీసం నెలకి వెయ్యి రూపాయలైనా పంపిస్తావనుకున్నాను. చిట్టీ డబ్బులు మాకే ఇస్తావని గ్యారెంటీ ఏమిటి?’’ అన్నాడు నాన్న.
నాన్న నన్ను నమ్మలేదు.
అవాళ నుండి నాన్నకు నామీద అనుమానం రెండింతలైంది. అర్పిత పెళ్లి విషయంలో నానిర్ణయాలేవైనా తోసి పుచ్చేవాడు. నా అదర్శ భావాలతో అర్పితను ఏదారిన పోయే దానయ్యకో వరకట్నం లేకుండా అంటగట్టి ఆస్తినంతా నేనొక్కడినే దోచుకుంటాననే అభిప్రాయం నాన్నలో స్థిర పడి పోయింది. నేను ప్రతీ నెల పంపిన డబ్బుతో హన్మకొండ లో వాయిదాల పద్ధతిలో ఒక ప్లాట్ కొని అర్పిత పేరున రిజిస్ట్రీ చాయించాడని అమ్మ ద్వారా తెలిసింది. మాకు సిమెంటు రేకులతో నిర్మించిన ఒక ఇల్లు తప్ప ఆస్తి అంటూ ఏదీ లేదు. ఆ ఇల్లు గూడా అర్పితకే ఇచ్చివేద్దామన్నాను.
నాన్నకు నామీద నమ్మకం లేదు..
***
అప్పుడు ఆగిపోయిన నాన్న ఫోను మళ్ళీ ఇప్పుడే మోగడం.. అదీ ఊహకందని వార్త.. ‘అర్పిత నిశ్చితార్థం’.
ముందుగా సుస్మిత వాళ్ళ ఇంటికి వెళ్తే పెళ్ళి కుమారుని గూర్చి కొంత సమాచారం తెలుస్తుంది.. అలాగే అందరం కలిసి మా ఊరు పర్కాలకు వెళ్ళ వచ్చు అనుకొని ఇద్దరు పిల్లలను తీసుకొని సుస్మిత నేను మరో రెండు రోజుల ముందుగానే హసన్పర్తికి బయలు దేరాం..
ఆపూట భోజనాలయ్యాక సుస్మిత నేను అత్తమ్మ, మామయ్యలతో అర్పిత నిశ్చితార్థం గూర్చి చెబుతూ అబ్బాయి వివరాలు అడిగాం..
వాళ్ళు ఆశ్చర్య పోయారు.. ఈవిషయమే తెలియదన్నారు.
అబ్బాయి వివరాలు ఎలాగైనా తెలుసుకోవాలనే నా ప్రయత్నంలో రాజమొగిలి పెదనాన్న గుర్తుకు వచ్చాడు.. వెంటనే సహకారసంఘానికి వెళ్ళాను. నన్ను చూడగానే సంతోషంతో పలుకరించాడు పెదనాన్న. నా అంచెలంచెల అభివృద్ధికి అభినందించాడు. ఒక పేద కుటుంబాన్ని ఆదుకున్నందుకు, సుస్మితను చదివిస్తున్నందుకు పొగడ్తలతో ముంచెత్తాడు. అర్పిత నిశ్చితార్థం విషయం చెబుతూ అబ్బాయి గూర్చి అడిగాను. పెదనాన్న ముఖంలోని మార్పులు నన్ను అందోళన పరిచాయి.
“ బాబూ సూర్యం!.. మీకు తగిన సంబంధం కాదయ్యా..” అన్నాడు. నా గుండె గుభేలుమంది...
“నాకు ఈవిషయం తెలిసాక అబ్బాయి పని చేసే కాలేజీకి వెళ్ళాను. అబ్బాయి పేరు శంకర్. భీమారం అరుణోదయ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. వాకబు చేశాను. అతను పీ.జీ క్వాలీఫైడ్ కాదు.. తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. దుర్మార్గుడు కాకపోయినా సద్గుణ సంపన్నుడేం కాదు.. వారి కుటుంబం గూర్చి కూడా తెలుసు కున్నాను.. నాకు అంతగా నచ్చలేదు..” అన్నాడు పెదనాన్న. నాకాళ్ళు భూమిలో పాతుకు పోయినట్లనిపించి నిల్చున్న చోటే కుర్చీలో కూర్చుండి పోయాను.
ఉద్యోగ రీత్యా అందరినీ అనుమానించే నాన్న శంకర్‌ని ఎలా నమ్మాడు?.. నాన్నకు ఈ విషయం తెలుసా?.. వారి కుటుంబం గూర్చి ఎందుకు పూర్తిగా తెలుసుకోలేదు.. అనే పలు ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి..
రేపే నిశ్చితార్థం.. ఎలాగైనా ఆపెయ్యాలి అని నాన్నకు ఫోన్ చేసి విషయం వివరించాను.
“చూడు బాబూ!.. నీమాదిరిగానే శంకర్ లెక్చరర్. ఎం.ఏ. పాసు కానిది ఎవరిస్తార్రా కాలేజీలో ఉద్యోగం.. నీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. లేకుంటే నువ్వే పెళ్ళి ఖర్చు తప్పించుకోవాలని మీ అత్తగారితో కలిసి నాటకాలు ఆదుతున్నావో... ఎవరికి తెలుసు..” అంటూ ఫోన్ కట్ చేశాడు. నేను తల పట్టుకున్నాను. నాన్న నా మాట నమ్మలేదు...
సుస్మిత నేను పడ్తున్న బాధను గమినిస్తోంది..
మామయ్య వాళ్ళు నా ఆహ్వానాన్ని మన్నించి మా వెంట పర్కాలకు వచ్చారు.
ఇంటికి వెళ్ళగానే అర్పితకు అబ్బాయి చదువు విషయం చెప్పాను..
“నాకు అన్నీ తెలుసు అన్నయ్యా.. శంకర్ చాలా మంచి వాడు.. నాకు నచ్చాడు. మీరు నాపెళ్లికి ఏమీ పెట్టకున్నా ఫర్వాలేదు కాని పెళ్లిని మాత్రం అడ్డుకోకండి.. ” అంది అర్పిత. ఇది మానాన్న నూరి పోసిన పాఠం అప్పచెప్పిందను కున్నాను.
నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయి అబ్బాయి వాళ్ళు అలా వెళ్ళారో లేదో.. అమ్మ పెళ్ళి ఖర్చుల ప్రస్తావన తీసింది. నాన్న అమ్మతో అడిగిస్తున్నట్లుగా సీను కనపడింది.
“బాబూ!.. అర్పిత పెళ్ళి మరో పది రోజులు మాత్రమే వుంది.. దాని పెళ్ళి బాధ్యత మనందరిది. నీవంతుగా ఏమిస్తావో చెప్పు..” అంది అమ్మ.
“వాని దగ్గర ఉంటే మాత్రం ఇస్తాడా?.. వాడు కట్నం కానుకలు ఇచ్చేవాడేనా.. ఎందుకు వాణ్ణి అడిగి అనవసరంగా నోరు పారేసుకుంటావ్..” అని మానాన్న, మాఅత్తమ్మ మామయ్యలను చూసుకుంటూ దెప్పిపొడిచినట్లు అనే సరికి నామనసు చివుక్కుమంది.
“అమ్మా.. మీరేమడిగినా ఇస్తాను ” అంటూ ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించాను.
“అయితే ముందుగా పదిహేను కాసుల బంగారానికి సరిపడా డబ్బులు సర్దు బాబూ.. చెల్లెలికి నగలు చేయించాలి.. ’’ అంది.
నాగొంతులో రాయి పడింది. గ్లాసు మంచి నీళ్ళు తాగాలనిపించింది. నా ముఖ కవళికలు గమనిస్తున్న సుస్మిత ముందుకు వచ్చింది.
“అత్తమ్మా.. మీరడిగినట్లు బంగారం తీసుకొనే వచ్చాం” అంటూ పదిహేను కాసుల చొక్కపు బంగారపు రెండు బిళ్ళను అమ్మకు అందించింది.
నేను ఆశ్చర్యంగా చూడసాగాను.. సుస్మిత తన కళ్ళతోనే నన్ను సమాధాన పర్చింది.
“చూశావా.. వాళ్ల దగ్గర బంగారం పెట్టుకొని మనం అడిగే దాకా ఇవ్వడం లేదు. అటువంటి కొడుకు..” అంటూ నన్ను అవమానపరుస్తున్నట్లు మాట్లాడుతుంటే సుస్మిత ఓర్చుకోలేక పోయింది.. కాని ఓర్పు వహించింది. ఈసమయంలో ఏమి చెప్పినా నాన్న నమ్మడు అని సుస్మితకూ తెలుసు.
కాని నాకూ నమ్మశక్యంగా లేదు. సుస్మిత పేరంట్స్ కూడా ఆశ్చర్యంగా చూడ సాగారు.
ముందు జాగ్రత్తతో నాకూ తెలియ కుండా మేలిమి బంగారపు బిస్కట్ బిళ్ళలు సుస్మిత ఎలా తెచ్చింది? ఇది అడిగే సమయమూ కాదు.
నేను అక్కడి వాతావరణానికి అనుకూలంగా మసులు కున్నాను.
నామనసులోని ఆందోళనను గమనించిన సుస్మిత నన్ను కాస్తా పక్కకు తీసుకెళ్ళింది.
“సూర్యం.. నీకో గుడ్ న్యూస్ చెప్పనా..” అంటూ తాను సెకండరీ గ్రేడు టీచరుగా సెలెక్షన్ అయిన ఆర్డర్‌ను నాచేతిలో పెట్టింది. “అర్పిత పెళ్ళి శుభ ముహూర్తంలో మీకు చెపుతామని దాచి ఉంచాను” అంటూ నామనసుకు కొంత ప్రశాంతతను చేకూర్చాలని ప్రయనిస్తూంది. నాకు మనసులో ఎంతో సంతోషంగా ఉన్నా ఎందుకో వ్యక్తపర్చలేక పోతున్నాను. నా కళ్ళళ్ళో ఆ బంగారు కాయిన్స్ తిర్గుతున్నాయి. అవి సుస్మితకు ఎలా వచ్చాయి?...
“చూడు సూర్యం.. మనిషికి నిజమైన ఆభరణాలు ‘చదువు’, ‘సంస్కారం’. అవి నాకు ప్రసాదించావు. నీలాంటి భర్త దొరకడం నాపూర్వ జన్మ సుకృతం.. జన్మ జన్మలకు నిన్నే నా భర్తగా ప్రసాదించమని ఆభగవంతుని కోరు కుంటున్నాను..” అంది సుస్మిత.
“భార్య భర్తల మధ్య రహస్యాలు ఉందొద్దు కదా.. మరి ఆ బంగారం నీకు ఎక్కడిది? నేను అడిగే వరకు చెప్పవా?” చిరు కోపం ప్రదర్శించాను. ఆమాత్రం కోపం మొదటి సారిగా నేను సుస్మితపై ప్రయోగించాల్సి వచ్చింది.
“అది మనదే సూర్యం. నేను దేవుడి గదిలో నిత్యం పూజించే గొలుసు. మనం వాడొద్దు. అనుకున్నామే కాని అది నా ఆడపడుచుకు ఇవ్వడం నేకెంతో తృప్తికరంగా ఉంది. ఆ గొలుసు రూపంలోనే ఇస్తే అత్తమ్మ అది వంశ పారంపర్యంగా వచ్చేది కదా.. ఎక్కడ అర్పితకు అరిష్టం కల్గుతుందోననే అనుమాన పడి తీసుకుంటారో లేదో అని దానిని కరిగించి మేలిమి బంగారం బిళ్ళలుగా మార్పించాను. అర్పితకు ఇష్టమైన నగలు చేయించుటకు వీలవుతుందని. మీరు ఇంకా గిల్టీగా ఫీలవుతుంటే ఈ బాకీ కింద నాకు తిరిగి గొలుసు కొనిద్దురుగాని” అంది సుస్మిత. మొహం దైన్యంగా కనబడే సరికి నేను అభినందనతో ఆమె భుజాన్ని తట్టాను. ‘నా సుస్మిత కోసం గొలుసు ఎలాగూ కొంటాను...’ అని మనసులో అనుకున్నాను.
నాన్న దూరంగా నిలబడి మమ్మల్ని గమనిస్తున్నాడు.
నేను దగ్గరికి వెళ్ళాను.
‘‘నాన్నా.. నేను ఒక ప్రైవేటు బడి ప్రారంభించి చెల్లినీ, బావనూ భాగస్వాములను చేస్తాను. నాన్నా.. నన్ను నమ్మవూ!... ’’ అన్నాను.
***
No comments:
Post a Comment