ఆపన్నివారక హనుమా! - అచ్చంగా తెలుగు

ఆపన్నివారక హనుమా!

Share This

ఆపన్నివారక హనుమా!

 రావి కిరణ్ కుమార్ 

సుగ్రీవుని భయము బాప బ్రహ్మచారివై  పరబ్రహ్మము
ను చేరి మైత్రీ భంధం నెరపితివి  మా  భయము తీర్చి
పరబ్రహ్మము ను చేర్చ మాకభయ మొసంగవేలనే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
రామ దయను రాజ్యము పొంది రమణుల
పొందులో ఏమరిచి   మిత్ర కార్యము
మరచిన  కపి రాజును హితవచనముల
మేల్కొలిపి  శేషుని శర పరంపరల
బడనివ్వక కాచిన  బుద్దిమతి మము
యమ పాశముల  పాల్బడనీయక  పాలించవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
అమ్మ అన్వేషణకై  కపి మూకను పంపు వేళ అయ్య
మదికేమి తోచనో అంగుళీయకము నీకిచ్చెనయ్య
అంతటి ఘనుడవు మాకిన్చుక ఘనత నీయవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
సాగరం  లంఘించు  సమర్ధుడెవ్వడోయని
కపి వీరులేల్లరు కలత చెందు వేళ  గురు
వృద్ధుడు  జాంబవంతుని చే జాగృతి నొందిన
జవసత్వములచే ఉప్పొంగితివి కృంగిన మా
నవనాడుల జాగృతి తో పొంగించవయా
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
రామ కార్యము సాధించబోవు సదవకాశము చిక్కెనేయను
తలంపు తనువు తాకగ  నే   పొంగిన ఎదతో సింహనాదము
చేసితివి సత్కార్యములవైపు మము నడిపించవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
లక్ష్య సాధనలో అలసత్వము కూడదనుచు మోహింప
చేయు మైనాకుని ఆహ్వానం తోసిరాజంటివి మము
కమ్ముకున్న మోహబంధనాలేల  తెంచకుంటివి
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
మ్రింగ నెంచి నాగమాత నోరు పెంచగా అదను  చూసి
అంగుష్ట మాత్రమున అంగిట చేరి వచ్చిన బుద్దిమతి
ముంచ నెంచు కష్టముల కడలి దాటు బుద్ధి మాకొసగవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
నీడను పట్టి నిలువరించు సింహికను చేబలముతో
సాగరమున ముంచితివి నిస్సత్తువ ఆవరించిన
మా నరములకు సడలని సత్తువ నివ్వవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
సాగరము  దాటి   లంఖిణి ని కూల్చి లంకాపురిలో
కాలుమోపితివి భవ సాగరము దాటించి నా అన్న
అహము చిదిమి భక్తీ మార్గమున నడిపించవె మము
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
రతి క్రీడల సొలసిన రమణుల దేహ సౌందర్యము
చూచీ తొణకని ధీమతి తరుణీమణుల తాకిన గాలి
తాకిడికే చలించు మనసుల పట్టు నేర్పు నీయవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
పతివ్రతయగు  మండోదరిని చూచి మాత
యని బ్రమసినను తత్క్షణమే తర్కబుద్ధితో
ఛాయా కాంతి యే కాని జ్ఞానశిఖ  కాదని
గ్రహించినాడవు కుతర్కములతో పలు
బ్రమల బ్రమించు మా మనో బ్రమరముల
నేల రామ పాద పద్మములవైపు మళ్లించవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
కార్యము సఫలమయ్యేనని చిన్దులాడుతూ
చిత్తము బ్రమ నోన్దేనని తెలిసిరాగా తీవ్రమగు
నైరాస్యమున ప్రాణ త్యాగము చేయ బూని
వివేకము మేల్కొన పురుష ప్రయత్నము
నకు దైవ బలం తోడగునేని కార్య సిద్దియగు
నని అమ్మను శరణంటివి మాకును నీ
కృప నిచ్చి కార్య జయము కలిగించవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
అశోకవనిలో   అమ్మ  ఆత్మార్పణ చేయనెంచిన వేళ
రామ  స్మరణతో ముదిమి  కి మోదం కలిగించితివి
తగు మాటలాడు చాతుర్యమిచ్చి మాపై  దయచూపవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
రామ  గుణ గానముతో అంగుళీయక మిచ్చియును
అమ్మ ముదిమి  కి మోదం కలిగించితివి  వేదనల
నొందు మా మది  నెన్నడు హిత వచనముల సేద తీర్తువో
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
శత్రువుల కోటలో ప్రభువుకు జయద్వానములు చేసి
రావణ ముఖ్యుల దునుమాడి లంకా పురి దహనం
చేసి  రాముని విజయము సూచన చేసి అంగదాదు
లకు ఆనంద ముప్పొంగ కిష్కింద చేరితివి మా పురముల
నిలిచి మమ్మోడించు శత్రువుల గెలుచు శక్తి నీయవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
చూచితిని అమ్మ నని  ఆనంద నిలయునకే ఆనంద
మిచ్చినాడవు పలు ఆరాటాల అలయు మా మది
నెన్నడు అవధులు లేని ఆనంద తీరాలు చేర్తువో
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
గురు రాఘవేంద్రునకు  మంత్రాలయ మార్గము
చూపిన సద్గురు స్వరూపుడవు దారి తెన్నూ
తెలియని  మాకును సద్గురువై దారిచూపవే
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
చక్కని మాటలతో చెరగని చెలిమికి  శ్రీకారం చుట్టిన
మర్కటేన్ద్రమా  అదుపు తప్పి నర్తించు మా నాలుకపై
నిలిచి పొదుపు పలుకుల తేనియలు జాలువార్చుమా
కిరణేశ్వరి ప్రియ నందనా ! ఆపన్నివారక హనుమా!
***

No comments:

Post a Comment

Pages