అరుదైన భవదూరుఁడగు నీతఁడు‌ - అచ్చంగా తెలుగు

అరుదైన భవదూరుఁడగు నీతఁడు‌

Share This

అన్నమయ్య  దశావతార కీర్తనలు

అరుదైన భవదూరుఁడగు నీతఁడు‌

  -డా.తాడేపల్లి పతంజలి

        
అన్నమయ్య వంశీకులు రచించిన కీర్తనల్లో దశావతార కీర్తనలు ప్రత్యేకమైనవి. నాదృష్టికి   అకారాది క్రమంలో 51 సంపూర్ణ దశావతార కీర్తనలు  వచ్చాయి.వీటిని వరుసగా అర్థ తాత్పర్య విశేషాలతో పరిశీలిద్దాం.మొదటిది “అరుదైన భవదూరుఁడగు నీతఁడు‌”
అను కీర్తనను అర్థ తాత్పర్యాలతో పరిశీలిద్దాం
పల్లవి:     అరుదైన భవదూరుఁడగు నీతఁడు‌
                అరిది భవములందునతఁడు వో యితఁడు
చ.1:        కొడుకుటెక్కెమురూపు కోరి కైకొని పెద్ద
                కొడుకు కొరకుఁగా గోరపడి
                కొడుకువైరి భక్తిఁ గూడిన యాతని
                నడవిలోఁ జంపిన యతఁడు వో యితఁడు
చ.2:        ఆలి తమ్ముని రాక కలరి మెచ్చెడిచోట‌
                ఆలుఁ దానును నుండి యందులోన
                ఆలిచంటికింద నడ్డమువడుకున్న
                ఆలవాలమువంటి అతఁడు వో యితఁడు
చ.3:        సవతి తమ్ముఁడు గోవుఁ జంపఁ బట్టుక పోయి
                సవతి తమ్మునియింట సడిఁబెట్టఁగా
                సవతులేనిపంటఁ జప్పరించివేసి‌
                అవల యివల సేసి నతఁడు వో యితఁడు
చ.4:        తొడ జనించిన యింతి దొరకొనాపద సేయ
                దొలఁగి తోలాడెడి దొడ్డవాని
                తొడమీఁద నిడి వానికడుపులో తొడవులే
                యడియాలమగు మేని యతఁడు వో యితఁడు
చ.5:        పదము దానొసఁగుచుఁ బదమడుగగఁ బోయి
                పదము వదము మౌవఁ బరగఁ జేసి
                పదముననె దివ్యపదమిచ్చి మనుమని
                నదిమి కాచినయట్టి అతఁడు వో యితఁడు
చ.6:        అత్తకొడుకుపేరి యాతనిఁ దనకూర్మి
                యత్తయింటిలోన నధికుఁ జేసి
                మత్తిల్లు తనతోడ మలసిన యాతని
                నత్తలిత్తల సేసినతఁడు వో యితఁడు
చ.7:        పాముతోడుతఁ బోరి పంతముగొనువాని
                పాముకుఁ బ్రాణమై పరగువాని
                ప్రేమపుఁ దనయుని బిరుదుగా నేలిన‌
                ఆమాటనిజముల అతఁడు వో యితఁడు
చ.8:        ఎత్తుక వురవడినేఁగెడి దనుజుని
                యెత్తుకలుగు మద మిగుర మోఁది
                మత్తిల్లు చదువుల మౌనిఁ జం.........
                అత్తలేని యల్లుఁడతఁడు వో యితఁడు
చ.9:        బిగిసి మేఁకమెడ పిసికెడి మాటలు
                పగలుగాఁగ రేయివగలు సేసి
                జగములోన నెల్ల జాటుచుఁ బెద్దల‌
                అగడుసేయఁ బుట్టినతఁడు వో యితఁడు
చ.10:     మెట్టనిచోట్ల మెట్టుచుఁ బరువులు
                పెట్టెడిరాయ....................................
                కట్టెడికాలము కడపట నదయుల(?)
                నట్టలాడించిన అతఁడు వో యితఁడు
చ.11:     తలఁకకిన్నియుఁ జేసి తనుఁగాని యాతని
                వలెనె నేఁడు వచ్చి వసుధలోన
                వెలుఁగొంది వేంకటవిభుఁడై వెలసిన
                యలవిగాని విభుఁడతఁడు వో యితఁడు   (04-అవతారములు 08)

తాత్పర్యము

పల్లవి:     ఆశ్చర్యముగా ఈ విష్ణువు  జన్మలకు మనలను దూరము చేయువాడు.( భక్తితో కొలిస్తే)
                కాని వింత చూసారా ! ఇతడు జన్మలు పొందుతుంటాడు. ( భక్తుల ఉధ్ధరణకు)
01.మత్యావతారం
                శ్రీ మహావిష్ణువుకు మన్మధుడు కుమారుడు.అతని ధ్వజంపై సంకేతం  చేప. (మీనం). ఆ మీన రూపాన్ని  స్వీకరించి,  పెద్ద కొడుకయిన బ్రహ్మకు సంబంధించిన వేదాల  కోసం కష్ట   పడ్డాడు.  ( బ్రహ్మ నిద్రించే సమయంలో   సోమకాసురుడు వేదాలు దొంగిలించి సముద్రంలో దాచాడు) ఇంకొక కొడుకైన మన్మథుని వైరి   శివుడు . అతని భక్తి తో   సోమకాసురుని  అడవిలాంటి గహనమైన సముద్రములో  మత్స్యావతారములో  చంపిన వాడు  ఈ వేంకటేశ్వరుడే.
02.కూర్మావతారం
          తన భార్య లక్ష్మితో పాటు పుట్టిన చంద్రుని రాకతో పొంగే సముద్రం లో- భార్యయైన లక్ష్మితో పాటు అందులో  కూర్మావతారము ఎత్తటానికి ముందే ఉన్నాడు. ఇంకొక భార్య భూదేవి వక్షంలా  వున్న మందర  పర్వతం  క్రింద అడ్డంగా పడుకొని  ఆపర్వతం  క్రుంగిపోకుండా ఆధారమైన కూర్మ రూపి ఈ వేంకటేశ్వరుడే.
03.వరాహావతారం
          సవతితల్లి దితి కుమారుడయిన  హిరణ్యాక్షుడు భూమిని  ఎత్తుకుపోయాడు.భూమికి సవతి  అయిన  లక్ష్మియొక్క  తమ్ముడు చంద్రుని ఇల్లైన సముద్రంలో దూరి గొడవ చేసాడు. అపారమైన  సముద్ర జలసంపదను  పుక్కిట పట్టి వరాహావతారంలో కల్లోలం సృష్టించిన వాడు ఈ వేంకటేశ్వరుడే.
04.నరసింహావతారము
          శ్రీమహావిష్ణువు తొడనుండి జన్మించిన ఊర్వశికి ప్రభువైన ఇంద్రునికిఆపద కలిగించి అతనిని  పారదోలుతున్న  రాక్షసుని హిరణ్యకశిపుని తొడపై పెట్టుకొని వాని కడుపులోని ప్రేగులే  తన శరీరముపై ఆనవాలుగా వేసుకున్ననరసింహావతారి  ఈ వేంకటేశ్వరుడే.
05.వామనావతారము
          బలికి తన సాన్నిధ్యం ఇవ్వటానికి   దానమడగటానికి   పోయి,తన పాదంచే అంతరిక్షపదం మ్రోగుతుండగా,మునుపు తాను పరమ పదము నిచ్చిన ప్రహ్లాదుని మనుమని బలిని ,      పాదముతో తొక్కి మోక్షం ఇచ్చిన వామనావతారి  ఈ వేంకటేశ్వరుడే.
06.పరశురామావతారము
          తన మేనత్తకొడుకైన అర్జునుని పేరు గల కార్తవీర్యార్జునుని, -  భూమిపై (సీతకు తల్లి ) ప్రసిద్ధి చేసి మదించి తనతో పోరాడిన అతనిని
ఛిన్నాభిన్నము చేసిన పరశురామావతారి ఈ వేంకటేశ్వరుడే.
07.కృష్ణావతారము
          కాళీయ మర్దనుని,     ఆదిశేషుని రూపమైన బలరామునికి ఇష్టమయిన తమ్ముని, యశోద ముద్దుబిడ్డ అని పేరు పొందినవానిని, ద్వాపరంలోయశోదకు యిచ్చిన మాట నిజం చేసేందుకు కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై వకుళాదేవిని తల్లిగా స్వీకరించిన కృష్ణావతారము పొందిన వాడు ఈ వేంకటేశ్వరుడే.
08.రామావతారము
          సీతాదేవిని ఎత్తుకుపోయిన రాక్షసుని, అతని   మదమణగేలా సర్వశాస్త్రసంపన్నుడయిన మదించిన రావణుని చంపినవాడు.
సీతాదేవి ‘అయోనిజ’ కనుక  అత్తలేని రామావతారము  పొందినవాడు ఈ వేంకటేశ్వరుడే.
09.బుద్ధావతారం
          జంతుబలిపై వున్న నాటి వైదికమతగురువుల మాటలను, బట్టబయలు చేసేందుకు రాత్రిబగలు కష్టపడిప్రపంచానికి చాటుతూ పెద్దలను, వారి ఛాందసాన్ని  దూషించుటకు పుట్టిన బుద్ధావతారము ధరించినవాడు ఈ వేంకటేశ్వరుడే.
10.కల్క్యావతారం
          కలియుగాంతంలో జనులకు కష్టాలు కలిగించే  దుష్టుల కోసం తిరగరానిచోట్లన్నీ తిరిగి  అంతం చేసిన కల్క్యావతారం కలిగినవాడు ఈ వేంకటేశ్వరుడే.
          ఇన్ని అవతారాలు ధరించిన  శ్రీమహావిష్ణువు ఇప్పుడుకూడా మరో రూపంతో వేంకటేశ్వరుడై  భూమిపై వెలిసాడు.ఆయనలీలలు వర్ణించనలవి కానివి.
                 *****

No comments:

Post a Comment

Pages