బ్రహ్మరాత
పోలంరాజు శారద
"అదేంట్రా! ఇంకా నెలలు నిండలేదుగా, ఈ వేళ్టప్పుడు హాస్పిటల్‌కి ఎందుకు? ఏమైనా నలతగా వుందా?" ఆదుర్దాగా అడుగుతున్న తల్లికి సమాధానం చెప్పటానికి కొంత ఇబ్బంది కలిగింది.
"మొన్ననెవరో తనని చూసి పుట్టబోయే బిడ్డ నక్షత్రం మంచిది కాదు అని చెప్పాడట. వాళ్ళంతా మంచి ముహుర్తం పెట్టించి డాక్టర్ తో మాట్లాడారు. ఆవిడ ఈ రోజు సాయంత్రం వచ్చి ఎడ్మిట్ అవుతే రేపు పొద్దున ఏడుగంటల ఇరవైఆరు నిమిషాలకు ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తానని చెప్పింది."
"అదేంట్రా. ఎవరో చెప్పటం ఏంటీ! కొన్ని నక్షత్రాలకు అట్లాగే వుంటుంది. నువ్వు మెడలో పేగుచుట్టుకొని పుట్టావు. నక్షత్రం కూడా అస్సలు మంచిది కాదు. దానికోసం జపాలు హోమాలు చేయించాము. అంతదానికి మనము జాతకాలు తిరగ రాయటానికి సాహసిస్తామా? ప్రతి చెడు నక్షత్రానికి ఏవో పరిహార జపాలు దానాలు వుంటాయి. అంతేకాని ఆరోగ్యంగా వున్న పిల్లకు ఆపరేషన్ చేయించటం ఏంటీ!"
"లేదులేమ్మా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంతే."
"బాబూ......" అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ఆవిడను, "సీతా" అంటూ పిలిచి భర్త కళ్ళతోటే సైగ చేసి వారించి, "నువ్వు వెళ్ళరా బాబూ." అని కొడుకుతో చెప్పాడు.
“ఎందుకే కంఠశోష. ఈ రోజుల్లో అంతా అదే చేస్తున్నారు. వాళ్ళ బ్రతుకులు ఎట్లా ఉన్నాయో పట్టదు. పుట్టబోయే వాళ్ళ జాతకాలు తిరగ రాయటానికి సంసిద్దులౌతున్నారు.
ఒక పక్క జాతకాలూ బూటకాలు ట్రాష్ అంటారు. మరో పక్క పిల్లలని కనటానికి ముహుర్తాలు. ........
కానీయ్ ఎట్లా జరగాల్సింది అట్లాగే జరుగుతుంది. ఈ జగన్నాటకం మనం ప్రేక్షకులగా చుస్తూ ఉండాల్సిందే.”
"అది కాదండీ...ఇంకా నెలలు నిండకుండానే....."
“అదేనే నే చెప్పేది కూడా. ఆ పుట్టబోయే బిడ్డ ఆ నక్షత్రానే పుట్టాలని రాసి ఉందేమో! మొన్నా మధ్య మీ అన్నయ్య కూతురి సంగతి ఏమయింది? వాళ్ళు కూడా ఇట్లాగే ముహుర్తాలు అంటూ అట్టహాసం ఆర్భాటం చేసారు కదా. అయినా ఆ అమ్మాయికి ఒక రోజు ముందుగానే నొప్పులు రావటం పురుడు అవటం చూసాము కదా! ఏది ఎట్లా జరగాలో ఆ దేవుడే ముందుగా రాసి ఉంచుతాడు. నువ్వు ఊరికే కంగారు పడవాక.”
************
అదొక ప్రైవేట్ హాస్పిటల్. కౌంటర్ లో నిలబడ్డ వాళ్ళను చూసి, "చెప్పండి సార్."అని అడిగింది రిసెప్షనిస్ట్.
"డాక్టర్ లీలా రేపు పొద్దున్న ఆపరేషన్ చేస్తామన్నారు. మాకు ఏ రూం ఎలాట్ చేసారో చూపిస్తే వెళ్తాము." చేతిలో పెద్ద బట్టల బాగ్ పట్టుకొని అడిగాడు రమేష్
"పేషంట్ పేరేంటి సార్"అని రికార్డులు చూసి, "సర్, ఆ పేరుతో మాదగ్గర రేపటికి ఎపాయింట్‌మెంట్ ఏది లేదు. కన్సల్టింగ్ రూం లో డ్యూటీ డాక్టర్ వున్నారు. మీరు ఒకసారి కలిసిరండి."
సమీర తల్లి చేతిలో దిండు దుప్పటితో చుట్టిన మూట అక్కడే కుర్చీలో పెట్టి "ఏమయింది సమీరా? మనకు ఏ రూం ఎలాట్ చేసారు?" అంటూ దగ్గరకు వచ్చింది.
"మీరు ఇక్కడే వుండండి. మేము డాక్టర్ తో మాట్లాడి వస్తాము."
లోపలికి వస్తున్న దంపతులను చూసిన డాక్టర్ నళిని తదేకంగా చూస్తున్న రిపోర్ట్ పక్కనే పెట్టి, "కూర్చోండి. ఏంటమ్మా! చెకప్ కోసం వచ్చారా?" అడిగింది.
కాస్త ఇబ్బందిగా కుర్చీలో కదులుతూ, "డాక్టర్ లీలగారు రేపు వుదయం ఆపరేషన్ చేస్తాము, ఈ రోజు ఎడ్మిట్ అవమన్నారు."
ఆవిడ అనుమానంగా మొహం కొద్దిగా చిట్లించి, "రండమ్మా చెకప్ చేస్తాను." అని లోపలి గదిలోకి దారి తీసేటప్పటికి తప్పనిసరై సమీర ఆవిడ వెనకాలే వెళ్ళింది. "మీకు ఇంకా ఒక పదిరోజుల టైం వుందమ్మా. అయినా ఇంకా నెలలు నిండకుండానే ఆపరేషన్ చేస్తానని ఎట్లా చెప్పింది?" సమీర రిపోర్ట్లు చూస్తూ అడిగింది.
"లేదు మాడమ్ డా. లీల గారికి మా సంగతి తెలుసు. ఆవిడనే కలవాలి."
"సారీ. లీల మామగారు ఈ సాయంత్రమే మరణించారని వార్త తెలిసి ఆవిడ హడావుడిగా వూరు వెళ్ళవలసి వచ్చింది. పదిహేను రోజులదాకా ఆవిడ రారు. అప్పటిదాకా ఈ క్లినిక్ నేనే చూసుకుంటాను. ఏమ్మా మీకేమైనా నొప్పులొస్తున్నట్టు గా కాని లోపల వేరే ఏదైనా ఇబ్బందిగా కాని అనిపిస్తున్నదా?" నెమ్మదిగా అడిగింది.
"ఏమీ ఇబ్బంది లేదండీ. కాని నాకు రేపు పొద్దున్న ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సిజేరియన్ చేస్తానని చెప్పారు."
ఇంగ్లాండ్ నుండి నెలరోజుల క్రితమే వచ్చిన ఆ మధ్య వయస్కురాలైన డా. నళినికి ఏమీ అర్ధం కావటల్లేదు. ఇంకా పది రోజుల టైము వుంది. ఎటువంటి ఇబ్బంది లేదంటున్నది. రేపు పొద్దున్న, అదికూడా ఏడుగంటల ఇరవై ఆరు నిమిషాలకు సిజేరియన్ అంటున్నది.
"రేపు ఏడుగంటలకు ఒక హిస్టెరెక్టమి ఆపరేషన్ వున్నది. కాని మీగురించి లీల నాకేమీ చెప్పలేదే!"
"ఒకసారి ఆవిడతో మాట్లాడి చూడండి."
"ఏదైనా ఎమర్జెన్సీ వుంటే మాట్లాడ వచ్చు కాని ఇటువంటి చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పెట్టటం నాకిష్టం లేదు. మీరు ఈ రోజుకి ఇంటికి వెళ్ళి పోండి. ఏదైనా డెలివరీ అయే సూచనలు కనిపిస్తే మళ్ళీ రండి." ఈ లోగా సమీర తల్లి బయటవుండలేక లోపలికి వచ్చింది.
"ఏ రూం ఇచ్చారో చెప్పారా?"
"లేదమ్మా రేపు ఆపరేషన్ లేదట ఇంటికి వెళ్ళి నొప్పులొచ్చినప్పుడే రమ్మన్నారు."
"అదేంటీ అన్నీ మాట్లాడి ముహుర్తం పెట్టుకొని వస్తే ఇప్పుడీ తిరకాసేమిటీ?" ఆవిడ కోపంగా అడిగింది.
డాక్టర్ ఆ మాటలకు ఆశ్చర్యంగా తలఎత్తి, "ముహుర్తం పెట్టటమేంటీ? అయినా మీరెవరూ?"
"సమీర మా అమ్మాయేనండి. పుట్టబోయే బిడ్డ జన్మ నక్షత్రం మంచిది కాదని చెప్పారు. అందుకనే ఎటువంటి శాంతి లేని మంచి నక్షత్రం చూసుకొని మరీ వచ్చాము. ఇప్పుడు కాదంటే ఎట్లా?"
"చూడండమ్మా మీరంతగా జాతకాలనే నమ్మే వారయితే, బ్రహ్మరాతను మార్చటానికి మానవులమైన మన వల్ల కాదన్న విషయం కూడా నమ్మాలే. అయినా అవసరం లేకుండా ఆపరేషన్ చేయటం మా మెడికల్ ఎథిక్స్ కు విరుద్దం. అటువంటి చట్ట విరుద్ధమైన పనులు నేను చేయను. ఇంక నా సమయం వృధా చేయకుండా మీరు బయలుదేరవచ్చు." నళిని కొంచం విసుగ్గా అయినా మర్యాదగానే వాళ్ళను బయటకు వెళ్ళండి అన్న సూచనగా బెల్ కొట్టి వేరే రిపోర్ట్ చూడసాగింది.
ఇంక చేసేదేమీ లేక ముగ్గురూ బయటికి వచ్చేసారు.
రాత్రి డా.లీల ఫోన్ చేసి హాస్పిటల్ లో పేషంట్స్ గురించి అడిగినప్పుడు నళిని సమీర గురించి చెప్పింది. "అమ్మయ్య మంచిపని చేసావు. మొన్ననొక రోజు వచ్చి అర్జెంట్‌గా రేపే కాన్పవ్వాలని గొంతుమీద కూర్చొని వదలకపోతే సరేలే అని చెప్పాను. రేపు అదే టైం కు హిస్టరెక్టమి కేసు వుంది కనుక వాళ్ళను ఇంటికి పంపించవచ్చు అని ప్లాన్ వేసి రమ్మన్నాను. వెళ్ళగొట్టి మంచిపని చేసావు."
"అయినా ఈ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో అదొక అలవాటైపోయింది. తడవకు ఇద్దరికన్నా తీసుకోలేరు. ఒక్కక్క పేషంట్ నొప్పులు పడుతూ రెండేసి రోజులు లేబర్ రూం లో వుంటే కష్టం. అదే వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు సిజేరియన్ చేసి మూడో రోజుకు ఇళ్ళకు పంపిస్తే డబ్బుకు డబ్బు ఇంకా చాలా మందికి ఆపరేషన్ చేయవచ్చు. నాకు తెలిసి మన కొలీగ్సే చాల మంది ఇటువంటివి ఎంకరేజి చేస్తున్నారు. పేషంట్స్ దేముంది? నొప్పులు పడే బాధ తప్పుతుంది. కాని మన హాస్పిటల్ లో మటుకు ఇటువంటివి ఎంకరేజి చేయను. థాంక్స్ వాళ్ళని మానేజి చేయటం ఎట్లాగ అనుకున్నాను"
ఈ మాటలు విన్న నళిని విస్తుపోయింది. విదేశాల్లో ఎంతో అవసరమైతే తప్ప చేయని సిజేరియన్ లు ఇండియాలో ఇంత విరివిగా ఎందుకు అవుతున్నాయో ఇప్పుడర్ధమైంది.
పది రోజుల తర్వాత సమీరకు నొప్పులొచ్చి ఎడ్మిట్ అయింది. ఒక గంటలో నార్మల్‌గా ఆవిడ చేతులమీదుగానే కాన్పు జరిగింది.
డాక్టర్ నళిని వచ్చి,"ఏమ్మా, చూశావా.నార్మల్ గా అయే కాన్పుకు అనవసరంగా ఆపరేషన్ కోసం పోదామనుకున్నావు. బాబు కూడా ఈ పదిరోజులు అమ్మ బొజ్జలో ఎంత ఆరోగ్యంగా వున్నాడో చూశావా? అదే పదిరోజుల ముందర అవుతే ప్రీమెచ్యూర్ అని ఇన్‌క్యుబేటర్ లో పెట్టాల్సి వచ్చేది."
**************
రమేష్ తల్లి పురోహితుడిని పిలిపించి “తిధి నక్షత్రం చెప్పండి” అని అడిగింది. "అమ్మా బిడ్డజన్మించింది మూల నక్షత్రం. గుండపు శాంతి. పదకొండవ రోజున పురిటి స్నానం తరువాత శాంతి చేయించి దానాలు ఇస్తే దోషం పోతుంది" అని చెప్పాడు.
పదకొండో రోజు పుణ్యాహవచనం చేయించి జపాలకు పీటల మీద కూర్చున్న రమేష్ కు తల యెత్తి తల్లితండ్రి మొహం వంక చూసే ధైర్యం లేక పోయింది.
అమ్మ చెప్పింది ఎంత నిజం. బ్రహ్మరాతని తప్పించటానికి మానవ మాత్రులం మనమేంతటి వారము!
***
informative site. Very informative article. Keep up the good work.
ReplyDeletetelugu