నీ పాద పద్మముల వైపు నా గమ్యం గమనం
రావి కిరణ్
నడి సంధ్యకు కాయం కదిలినా
ఊహల సౌందర్య లోకం నుండి
అనుభవాల రాపిడిలో కాయం పండినా
మనసు మాత్రం పచ్చితనం వీడలేదు పుండరీక వరదా !
అలవికాని ఆలోచనలతో సతమతమవుతూ
అందుకోరాని వాటికి ఆరాటపడుతూ
ఉహాలోకంలో విహరిస్తూ వాస్తవంలో నిట్టూరుస్తూ
నీ ఉనికిని మరచి కల్లోల జగత్తులో
కాయం కరిగిపోతున్నది అజామిళోద్దారక !
పూల మకరందం కోసం అర్రులు చాచు తుమ్మేదలవలె
దీపపు కాంతుల వైపు పరుగులుతీయు చిమ్మెటల వలే
కాంతా కనకాదులకై పరితపిస్తూ శాంతిని విడచి విలపిస్తూ
పట్టవలసిన నీ పాదాలు పట్టలేక,
పతిత తీరాల వైపు పయనిస్తున్నది పురు షోత్తమా !
ఇంతటి కారు చీకటిలో కల్లోల కడలికి ఆవలి వైపున
మిరుమిట్లు గొలిపే ఆశా దీపం వెలిగిపోతున్నది
తరచి తరచి చూచిన మది కాంచెను కనకపు కాంతులతో
లలిత లావణ్య ముగ్ద మనోహరం గా ప్రకాశిస్తున్న నీ పాద పద్మం
భక్తి అనే పడవలో నీ నామమనే తెడ్డు ఊతంగా ఇచ్చి
నా గమ్యం గమనం నీ వైపుకు త్రిప్పుకో పద్మ నాభుడా !
No comments:
Post a Comment