ప్రేమతో నీ ఋషి – 18
యనమండ్ర శ్రీనివాస్
( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు.
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి.... కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు స్నిగ్ధ. అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు... ‘ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. మహేంద్రను కలిసిన ఋషి, అతని వ్యాపార ప్రతిపాదనకు అంగీకరించి, స్నిగ్దను, అప్సరను ఆఫీస్ లో కలుస్తాడు. అప్సర, ఋషిని సన్నిహితంగా చూసిన స్నిగ్ధ వారిని తిట్టి, వెళ్ళిపోతుంది. ఇక చదవండి...)
“ఎక్స్క్యుస్మీ సర్, మీరు లంచ్ కు ఏమి తీసుకుంటారు?” ఎయిర్ హోస్టెస్ స్వరంతో ఋషి ఆలోచనల నుంచి బయటపడ్డాడు.
అతను లేచి, తన సీట్ లో సర్దుకున్నాడు. స్నిగ్ధ గాఢ నిద్రలో ఉందని, అతను భావించాడు. కానీ, ఆమె కళ్ళు మూసుకుంది కాని, నిజానికి నిద్రపోవట్లేదు.
“ఆసియన్ వెజిటేరియన్ “ బదులిచ్చాడు ఋషి, “మా ఇద్దరికీ” అన్నాడు. స్నిగ్ధ ఋషి చెప్పిన దానితో విభేదించేందుకు ఎయిర్ హోస్టెస్ కు వేరేదైనా చెప్పాలని అనుకుంది. కాని కాస్త ఆలోచించి, ఆమె మౌనంగానే ఉండిపోయింది.
ఎయిర్ హోస్టెస్ వారికి లంచ్ అందించింది, స్నిగ్ధ లేచింది. ఋషితో ఏమీ మాట్లాడకుండా తిన్న వెంటనే మళ్ళీ నిద్రపోయింది.
ఋషి వ్యాకులతకు లోని కాసేపటి ముందు స్నిగ్ధ చదువుతున్న దినపత్రిక తీసుకున్నాడు. అది ఒక ఇండియన్ డైలీ. మొదటి పేజీలో న్యూస్ ముంబై లోని “గార్డెన్ హోటల్” లో అప్పట్లో జరిగిన దాడులలో అక్కడికక్కడే పట్టుబడిన తీవ్రవాదిపై విచారణ పూర్తయ్యింది అన్న అంశం . ఇది ముంబై నగరంపై అత్యంత దారుణమైన తీవ్రవాద దాడి. జరిగిన దానికి ప్రపంచం మొత్తం వణికిపోయింది. ఇది భారతీయ భద్రతా వ్యవస్థ లోని లోపాలను ఎత్తి చూపింది. తీవ్రవాదులు సముద్ర మార్గంలో, చాలా తేలిగ్గా, ఆయుధాలతో సహా దేశంలోకి ప్రవేశించారు. దేశం బయట ఉన్న వారి భాగస్వాములతో మాట్లాడేందుకు వారు వాడిన అధునాతన మాధ్యమాల పరంగా కూడా ఈ దాడికి ఉత్తమమైన టెక్నాలజీని ఉపయోగించారని తెలుస్తోంది.
ఈ దాడిలో భారత ప్రభుత్వంచే ‘చారిత్రాత్మక కట్టడం’ గా పేరొందిన “గార్డెన్ హోటల్” ఈ దాడిలో పేలిపోయేలా పధకం రూపొందించబడింది. దాన్ని వందేళ్ళ క్రితం నిర్మించడంతో అది ముంబై నగరానికి గర్వకారణంగా, ఆత్మగా ఉండేది. అది అనేక చారిత్రాత్మకమైన వేడుకలకు వేదికగా నిలిచింది, ముంబై నగరవాసులు కోరుకునే వైవిధ్యానికి, అభిరుచికి ప్రతీకగా నిలిచింది.
కాని, స్టేట్ పోలీస్ వారు సమయానికి జోక్యం చేసుకోవడం, నేషనల్ ఆర్మీ వారి సహకారం, ఈ పేలుడును నిరోధించేలా చేసాయి. ఏమైనా, భద్రతా దళాలకు, మధ్య జరిగిన పోరాటం వల్ల, ఈ దాడిలో హోటల్ బాగా దెబ్బతింది. అంతేకాక, మొట్టమొదటిసారి ఇండియాలో దాడి సమయంలోనే ఒక తీవ్రవాది పట్టుబడడంతో వెంటనే అతన్ని విచారణకు తీసుకువెళ్ళడం సాధ్యమయ్యింది. ఈ వార్తను ఋషి న్యూస్ పేపర్ లో చదువుతున్నాడు. ఇది ముగియగానే, ఋషి ఆలోచనలు ముంబైలో తాము హాజరు కాబోయే అసైన్మెంట్ దిశగా మళ్ళాయి.
***
పారిస్ లోని జార్జ్ వి, హాంగ్ కాంగ్ లోని పెనిన్సులా లాగా గార్డెన్ హోటల్ ను, ప్రపంచంలోని ప్రామాణికమైన హోటల్స్ కు దీటుగా నిలిచేలా నిర్మించారు. నిర్మాణం జరుగుతుండగా, ఆయా హోటల్స్ కు గతంలో పనిచేసిన డిసైనర్లు, కాంట్రాక్టర్లనే ఎంపిక చెయ్యడం జరిగింది. సమర్ధతా అధ్యయనాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానేజ్మెంట్ స్టాఫ్ అందరినుంచి వచ్చాయి. నిర్మాణం ముగిసాకా, “ముంబై హెరిటేజ్ కాన్వర్సేషన్ కమిటీ” వారు తరచుగా దీన్ని సందర్శించి, హోటల్ కళాకృతిని భద్రపరిచేలా జాగ్రత్త వహించారు.
భారతదేశ చరిత్రలోనే అరుదైన కళాఖండాల సేకరణకు పేరొందింది ఈ హోటల్. గతంలో, స్వాతంత్ర్యానికి ముందు, ఈ హోటల్ అనేక ఎక్సిబిషన్లకు ఇది అధికారిక వేదికగా నిలిచింది. పెయింటింగ్స్ కలెక్షన్స్ లో భారత ప్రభుత్వంచే “జాతీయ కళాఖండాలు” గా ముద్రించబడ్డ వివిధ భారతీయ చిత్రకారులకు చెందిన అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి.
హోటల్ లోని 2,3 అంతస్తులు పెద్ద పెద్ద గోడలతో, వింతగా మ్యూజియం లాగా కనిపించేవి. వాటికి వేళ్ళాడుతూ లైఫ్ సైజు పెయింటింగ్స్ ఉండేవి. చివరికి ఫ్లోర్ కూడా అలాగే అలంకరించారు. మొదటి అంతస్థు నేలంతా జానపద, గిరిజన కళాకృతుల నేపధ్యాలతో నిండి ఉంటుంది. రెండో ఫ్లోర్ పై గుజరాతీ టెక్స్టైల్స్ కప్పారు.
అయినా, తీవ్రవాద దాడుల్లో హోటల్ అందులో ఉన్న పెయింటింగ్స్ తో సహా దెబ్బతింది. కొన్ని పెయింటింగ్స్ కు బుల్లెట్ల దెబ్బలు తగిలాయి. కొన్నిటికి నిప్పంటుకుంది. స్ప్రింక్లేర్స్ తో మంటలు ఆర్పేందుకు జల్లిన నీటివల్ల, కొన్ని పెయింటింగ్స్ రంగులు వెలసిపోయాయి. కొన్ని నేల మీదకు విసిరెయ్యబడగా, బెదిరిపోయి పరుగెత్తే టూరిస్ట్ ల పాదముద్రలు వాటిపై పడిపోయాయి.
ఈ దుర్ఘటనపై సీనియర్ మానేజ్మెంట్ మొదటి స్పందన, పాడైన వాటిని పునరుద్ధరిస్తాము, అని. మొదట కేవలం బులెట్ రంధ్రాలు రిపేర్ చెయ్యాలని, కాలిన మరకలు గోడల నుంచి తొలగించాలని, పాడిన చిత్రాల నుండి కాలిన మరకలు తీసెయ్యాలని అనుకున్నారు. కాని, వారు చారిత్రాత్మకమైన ఈ విభాగాన్ని పునరుద్ధరించే బాధ్యత తీసుకున్నాకా, దాడుల ముందు కూడా ఆ కట్టడం భద్రతపై దృష్టి సారించాల్సిన అంశాలను గుర్తించి, వాటిని కూడా సరిచెయ్యసాగారు.
అందుకే పునర్నిర్మాణ పనుల్లో హోటల్ లోని కీలకమైన ప్రదేశాలను దాదాపు ఆరు నెలల పాటు మూసివేసారు. హోటల్ కట్టిన తర్వాత ఈ 106 ఏళ్ళలో ఇలా మూసివెయ్యడం మొట్టమొదటి సారి. ఈ సంపూర్ణ పునరుద్ధరణ పనులకు అంతర్జాతీయ కన్సల్టెంట్స్ ను పెట్టారు. ఇది అత్యంత సాహసోపేతమైన పునరుద్ధరణ, ఎందుకంటే, ఈ కన్సల్టెంట్స్ కు జారీ చెయ్యబడిన ఆజ్ఞల్లో, కేవలం ‘పునరుద్ధరణ’ మాత్రమే కాక, ‘హోటల్ యొక్క చారిత్రాత్మక ఆత్మను పునరుద్ధరించాలి’ , అని స్పష్టం చెయ్యబడింది.
కన్సల్టెంట్స్ ప్రపంచంలోనే ఉత్తమమైన డిసైనర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్ లతో ఒక టీం ను సృష్టించారు. దాదాపు వెయ్యి మంది కలిసి, హోటల్లో లక్ష చ.అడుగుల వైశాల్యం కల చారిత్రాత్మక ప్రాంతాల్ని పునరుద్ధరించసాగారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన 23 మంది డిజైన్ కన్సల్టెంట్స్, ప్లంబింగ్, వైరింగ్ వంటి పనుల కోసం 35 మంది కాంట్రాక్టర్లు, 250 మంది కూలీలు ఇందులో పాల్గొన్నారు.
ఈ టీం సభ్యులే కాక, ఆర్ట్ రిస్టోరేషన్ కన్సల్టెంట్స్ టీం వారు కూడా ఉన్నారు. వారికి అప్పగించిన పని, హోటల్ లో ఉన్న 2000 కళాఖండాలలో ఏవి పాడయ్యాయో కనుగొని, అవకాశమున్న వాటిని పునరుద్ధరించి, అంతవరకూ ప్రజలెన్నడూ చూడని అందుబాటులో ఉన్న కొత్త పెయింటింగ్స్ ను ప్రదర్శనకు తీసుకురావడం. దాడికి ముందు, ఒక ప్రణాళిక ప్రకారం భద్రపరిచేందుకు , కొన్ని ముఖ్యమైన కళాఖండాలను స్టోర్ కు తరలించారు. దీనివల్ల, కొన్ని కళాఖండాలు భద్రంగా ఉన్నాయి. మానేజ్మెంట్ వారు అన్ని కాన్వాస్ లను ముందుగానే గ్లాస్ ఫ్రేమ్ లోపల పెట్టించడంతో కొన్నిటి ఫ్రేమ్ లు విరిగినా, పెయింటింగ్స్ భద్రంగా ఉన్నాయి.
కాని, ఈ పునరుద్ధరణ పనులు కూడా ఎటువంటి ఆటుపోట్లు లేకుండా సజావుగా సాగలేదు. సీలింగ్ ను లేక పార్టిషన్ ను తెరిచినప్పుడల్లా, ఒక ఊహించని పైకప్పో, లేక గోడో బయల్పడేది, దాన్ని మళ్ళీ డిజైన్ లో కలపాల్సి వచ్చేది. దాడికి ముందే పునరుద్ధరణ అవసరమై, షెడ్యూల్ చెయ్యబడ్డ హోటల్ అంతర్భాగం అంతా పునర్నిర్మించాల్సి వచ్చింది.
కాబట్టి, హోటల్ లోపలి గదుల్లో, కారిడార్ లలో ఉండిపోయి, ఎన్నడూ సందర్శకులు చూడని ఎన్నో కొత్త కళాఖండాలు ఈ ప్రక్రియలో గుర్తించబడ్డాయి.
పునర్నిర్మాణం తర్వాత పాత, రిపేర్ చెయ్యబడ్డ కళాఖండాలతో పాటు, కొత్త ఆర్ట్ వర్క్స్ ను కూడా హెరిటేజ్ కాన్వర్సేషన్ కమిటీ వారికి అప్పగించారు. ఈ కమిటీ ప్రభుత్వం వారికోసం ఒక మెమోరాండం ను సిద్ధం చేసి, ఈ కళాఖండాలను హోటల్ నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యబోయే వివిధ మ్యూజియంలకు తరలించేందుకు అందించింది. దీనిప్రకారం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రాంగానికి ఈ ఆర్ట్ వర్క్స్ ను రివ్యూ చేసి, వాటిని ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియంలో పెట్టవచ్చేమో పరిశీలించామన్న అభ్యర్ధన అందింది.
వాటిలో వేటిని మ్యుజియం కోసం తీసుకోవచ్చో పరిశీలించేందుకే, మహేంద్ర స్నిగ్దను ముంబై రమ్మన్నాడు. మాంచెస్టర్ వేలంలో 100 చిత్రాలను కొనుగోలు చేసాకా కూడా, వారికి ఇంకా మ్యూజియం ప్రాజెక్ట్ కోసం 100 పోర్ట్రైట్ లు కావాలి.
జాతీయ కళాఖండాలుగా గుర్తించబడని, ప్రభుత్వం స్వీకరించని పెయింటింగ్స్, ఆర్ట్ ఫండ్ కోసం పనికొస్తాయేమో చూసేందుకు , ఋషి స్నిగ్ధతో వస్తున్నాడు. తన ప్రైవేట్ క్లైంట్స్ కు ‘పెట్టుబడికోసం సేకరణ’ లుగా పనికొచ్చే పెయింటింగ్స్ ను సూచించేందుకు కూడా అతనికి ఆసక్తి ఉంది.
(సశేషం...)
No comments:
Post a Comment