రేపటి రోజు
జగదీశ్ యామిజాల
కాస్త మాట్లాడాలి
నీ అర్ధంలేని కొన్ని పనులుంటే
మానుకో
నీ నటనలోని సహజ గుణాలను
కాస్త వదులుకో....
నీతో
నేను కాస్త మాట్లాడాలి
"రేపు" అనే రోజులు
మనల్ని తోచుకోనివ్వవు
వెళ్ళడానికి వాకిలి లేని
అడవిలో దారితప్పించే రోజులు కావచ్చు
నాకు నీతో కాస్త
మాట్లాడాల్సి ఉంది
నా దీర్ఘ నిరీక్షణలో
యాదృచ్చికంగా ఓ నిర్ణయానికి వస్తున్న
రేపటి రోజు ...
ఒక కలలోనుంచి
ముందుకొస్తున్న రేపటి రోజు
అంతరాయం లేకుండా
వెన్నంటి వచ్చిన పరాజయాలను దాటి
నేను మొదటిసారిగా
గెలవబోయే రేపటి రోజు
మన కాలచక్రాన్ని
దిశ మార్చి ఓ సంఘటనకు
తెర తీయబోయే రోజు రేపటి రోజు
ఓ అనుకోని
ఉత్సాహవంతానికి పాట పడబోయే
రేపటి రోజు
ఒక మరణపు తడి ఆరని
రేపటి రోజు
ఓ భిన్నమైన రహస్య నీడలో
నాపై పడబోతున్న రేపటి రోజు
నా పురోగతికి
నువ్వు తోడ్పడబోయే రేపటి రోజు....
ఇంతకీ నేను ఎవరు అన్నది
నువ్వు తెలుసుకోబోయే రేపటి రోజు
నీతో నేను కాస్త మాట్లాడాలి
ఆ మాటకోసం నాకు కాస్త సమయం కేటాయించు
***
No comments:
Post a Comment