సామాజికస్పృహ - అచ్చంగా తెలుగు

సామాజికస్పృహ

Share This

జ)వరాలి కధలు :8. 

సామాజికస్పృహ

 గొర్తి వేంకట సోమనాధశాస్త్రి(సోమసుధ)


ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సామాజికన్యాయం, సామాజిక భద్రత, సామాజికస్పృహ అన్న పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సామాజికమంటే సమాజానికి చెందిన అని నాలాంటివాడు అర్ధం చెప్పుకొనేవాడు. కానీ యిటీవల సామాజికమంటే దళితులకు లేదా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన . . . .చివరగా తన కులానికి చెందిన అన్న అర్ధం చెబుతున్నారిప్పుడు. అదే నిఘంటువులో ఉందో మనకు తెలియదు. అది రాజకీయ అంశం గనుక దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. కానీ సాహిత్యపరమైన విషయాలలో " సామాజికస్పృహ" అన్న పదాన్ని ఎక్కువగా వింటూంటాం. రాజులకాలంలో సంస్కృతభాషలోని గ్రంధాలను తెలుగులోకి అనువదించటానికే ఆనాటి కవులు ఎక్కువ తంటాలు పడేవారు. ఆ గ్రంధాలలోనే ఎక్కడో తమ రాజ్యంలోని ఆర్ధిక, సాంఘిక, సామాజికవిషయాలను పొందుపరిచేవారు. కాలక్రమేణా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన యీ గ్రంధరచన సమాజంలో ఉన్న సమస్యలను, దురాచారాలను ఎత్తిచూపే విధంగా రూపం సంతరించుకొంది. పద్యరచన పోయి కధారచన వచ్చాక ప్రజల్లో చైతన్యం వచ్చి మన దేశం సాంఘికంగా, సామాజికంగా అభివృద్ధి చెందటానికి దోహదపడింది. అనువాదధోరణి పోయి సాహిత్యకారులు తమలోని సృజనాత్మకతకు పదునుపెట్టి సమాజంలో జరుగుతున్న విషయాలనే కధ, కవిత, నవలల రూపంలో ప్రజల్లోకి పంపి ప్రజాచైతన్యానికి, సామాజిక వికాసానికి దోహదిస్తున్నారు. ఆ సందర్భంలోనే యీ సామాజికస్పృహ అనే పదం వెలుగు చూసింది. $ $ $ ఇటీవల సాహిత్యంలో సామాజికస్పృహ పేరుతో మన సంప్రదాయాలను అవహేళన జేస్తూ వస్తున్న రచనలను జూసి వరాలికి ఒళ్ళు మండిపోతోంది. అందుకే యీ సమాజికస్పృహ మీద ఒక కొత్త కధ అల్లి మరీ చెబుతూంటుంది. " ఆసుపత్రిలో ఒక కుర్రాడు పుట్టగానే ఏడవలేదట. ఆసుపత్రి నర్సులు వాణ్ణి తిరగేసి, బోర్లేసి, గిల్లి నానావిధాల ప్రయత్నించినా ఏడవలేదు. అదిచూసి డాక్టరు " పిల్లాడు ప్రాణం లేకుండా పుట్టాడు " అని నిర్ధారించేశాడు. వెంటనే అక్కడున్న బంధువులంతా ఏడవని పిల్లాడికోసం ఏడుపు లంకించుకొన్నారు. వాళ్ళలో మీలాంటి కవిసత్తముడికి ఏమి తట్టిందో! ప్రక్క మంచంపై పడుకున్న కుర్రాణ్ణి గిల్లాడట. నిద్రపోతున్న కుర్రాడు ఒక్కుదుటున లేచి బాధతో ఏడుపు మొదలెట్టాడట. వెంటనే ప్రాణం లేకుండా పుట్టాడనుకున్న కుర్రాడు ఏడుపు లంకించుకొన్నాట్ట. ఆ కుర్రాడి ఏడుపు విని యీ బంధువులంతా నవ్వటం మొదలెట్టారు. విషయం తెలిసిన డాక్టరు పరుగున వచ్చాడు. " ఏం చేశావయ్యా? చనిపోయాడనుకున్న పిల్లాణ్ణి ఎలా బ్రతికించావ్? " అనడిగాడు. " ఇందులో నా గొప్పేమీ లేదు. అదంతా సామాజికస్పృహ మహిమ" పెద్దమనిషి చెప్పాడు. " ఆవిడెవరు?" డాక్టరు అడిగాడు. " మనిషి కాదండీ! అదొక మానసికప్రవృతి. మీరంతా యీ పిల్లాణ్ణి కొట్టి ఏడిపించాలని చూశారు. ఫలితం శూన్యం. అప్పుడు నాకు అనిపించింది యీ కుర్రాడిలో సామాజికస్పృహ దాగి ఉందేమో అని. అందుకే ప్రక్కమంచంపై పిల్లాణ్ణి ఏడిపించాను. ఫలితం చూశారుగా! సాధారణంగా ప్రపంచంలో అందరూ తమ ఏడుపేదో తామేడుస్తారు. కాని యీ సామాజికస్పృహ కలవాళ్ళు ప్రక్కవాళ్ళు ఏడిస్తేనే ఏడుస్తారు. అంటే తమకోసం గాక పరాయివాళ్ళకోసం ఏడుస్తారన్నమాట" అన్నాట్ట. భర్త రచయిత అనగానే పొంగిపోయేవాళ్ళను చూశాను గాని వంతులవారీ యిలా నాపై బంతులు విసిరే వరాల్ని చూసి చాటుగా జుట్టు పీక్కుంటూంటాను. ముఖ్యంగా ఆమెలో నన్ను మించిన సృజనాత్మకత ఉందేమోనని అప్పుడప్పుడు అనుమానం కూడా కలుగుతూంటుంది. సరే! ఆ సంగతి ప్రక్కన పెట్టి అసలు విషయానికొస్తాను.
" సామాజికస్పృహ " అనగానే నాకు సామర్లకోట గుర్తుకొస్తుంది. స్పృహలేనివాళ్ళు ( తాగుబోతులు), నిస్పృహ లేనివాళ్ళు ( నిత్యం యుద్ధాలు చేసేవాళ్ళు) ' కోట ' ల్లో ఉన్నట్లే, నిలువెల్లా " సామాజికస్పృహ "ను జీర్ణించుకొన్న రాంబాబు సామర్లకోటలో ఉండటమే దానికి కారణం. రాంబాబు వరాలికి వరుసకు మేనల్లుడవుతాడు. వాడి నాన్న వరాలికి పిన్ని కొడుకు అంటే వరసకి అన్నయ్య. రాంబాబు వయసు పదేళ్ళయినా వాడి ఆలోచనలు అమోఘం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా విశ్లేషించి చూసే వాడంటే వరాలికి విపరీతమైన అభిమానం. ఏదైనా విషయాన్ని పెద్దల నడిగి తెలుసుకోవాలనే ఉత్సాహం, అప్పుడప్పుడు వాడికొచ్చే సందేహాలు చూసిన వరాలు భావిలో వాడు మంచి సామాజికస్పృహ గల రచయిత అయిపోతాడని కలలు గంటూంటుంది. అందుకే సామర్లకోట వెడితే వాణ్ణి ఒక్క క్షణం ఆమె విడిచిపెట్టదు. తన సందేహాలకు ఓపిగ్గా బదులిచ్చే ఆమెనూ వాడు వదిలిపెట్టడు.
ఒక సంవత్సరం ఆగస్టు నెలలో పక్షం రోజులు సెలవు పెట్టి సామర్లకోట వెళ్ళాం. ఒకరోజు నేను దినపత్రిక చదువుతూండగా రాంబాబు నాదగ్గర కొచ్చి చేతులు నలుపుకోవటం గమనించాను. " ఏం కావాలి రాంబాబూ?" అడిగాను. " వేసవికాలంలో ఉపవాసాలెందుకుండవు మామయ్యా?" అని అడిగాడు. వాడినుంచి వచ్చిన ఊహించని ప్రశ్నకు బదులేమివ్వాలో తెలియక బుర్ర గోకున్నాను. కవినని కాలరెగరేసే నేను వాడి ప్రశ్నకు జవాబివ్వకపోతే వాడి దృష్టిలో చులకనైపోనూ! అందుకే ఏదో బదులివ్వక తప్పదు. " నీరసం వస్తుందని " మెల్లిగా గొణిగాను. వాడికి నా సమాధానం సంతృప్తి కలిగించనట్లుంది. మా యిద్దరినీ కొద్దిదూరం నుంచి చూస్తున్న వరాలు రాంబాబుని తన దగ్గరకు రమ్మని సైగ చేసింది. వెంటనే ఆమె దగ్గరకెళ్ళాడు. " చూడు నాన్నా! మన దేశంలో ఎక్కువగా ఉపవాసాలుండేది ఆడవాళ్ళే! అది ఆడవాళ్ళకి చెందిన విషయం. మామయ్య నడిగితే ఏం చెబుతారు?" అంది. మామయ్యకేమీ తెలియదని వాడనుకోకూడదని చెప్పిందో, యింత చిన్న విషయం కూడా మీకు తెలియదా అని నన్ను పరోక్షంగా దెప్పిపొడవటానికి అలాగందో నాకు అర్ధం కాలేదు. తానేమి చెబుతుందో చూద్దామని చదువుతున్న దినపత్రిక నేలపై ఉంచి వారిద్దరినీ గమనిస్తున్నాను. " వేసవి కాలంలో మనం చెంబులకొద్దీ నీళ్ళెందుకు తాగుతాం?" వరాలి ప్రశ్నకు టక్కుమని బదులిచ్చాడు వాడు. " దాహమేసి " " అలా దాహమేసి నీళ్ళెక్కువ త్రాగితే కడుపు నిండిపోయి ఆకలి వేయదు. దానివల్ల తిండి తగ్గిపోతుంది కదా! "వరాలు చెప్పింది. "ఎలాగూ తక్కువ తింటాం గనుక ఉపవాసాలుండక్కర్లేదు "రాంబాబు లోని అవగాహనాశక్తికి వరాలు పొంగిపోయింది. " అసలు ఉపవాసాలెందుకుంటారత్తయ్యా? " వాడి ప్రశ్నకు నేను పొంగిపోయాను. చచ్చింది గొర్రె! వాడి ప్రశ్నకు బదులేమిస్తుందోనని ఉత్సాహంగా చూస్తున్నాను. 'నేను మీరనుకున్నట్లు ఓడిపోను ' అని నా వైపు చూస్తూ రాంబాబు తల నిమిరింది. "మనది వ్యవసాయ దేశమని నీకు తెలుసుగా! వానాకాలం, శీతాకాలాల్లో పంటలు బాగా పండి యిళ్ళకొస్తాయి. ఇంట్లో పుష్కలంగా దొరుకుతుంది గనుక కడుపునిండా తినాలనిపిస్తుంది. అలా తినడానికో సందర్భం కావాలని వానాకాలంలో పండగలని సృష్టించారు. వేసవికాలంలో నీళ్ళతో మాత్రమే నిండే కడుపు వానాకాలంలో ' ఆకలి, ఆకలి ' అని గోల పెడుతుంది. కారణం వేసవిలో త్రాగినట్లు వానాకాలంనీళ్ళెక్కువ త్రాగం కదా! అందుకే ఆ కాలంలో మన పండగలుగా పెట్టుకొన్న రోజుల్లో గుండిగలకొద్దీ తిండిని కడుపులోకి తోసేస్తాం. వేసవికాలం తిండి తక్కువ తినటం వల్ల మందకొడిగా పనిచేసే జీర్ణకోశంపై, ఒక్కసారిగా యిలా గుండిగలను పంపించేస్తే ఒత్తిడి పెరుగుతుంది కదా! స్టేషన్లో ఆగిన రైలు మెల్లిగా బయలుదేరి వేగం అందుకోవాలి గానీ మొదట్లోనే వేగం అందుకొంటే ఏమవుతుంది?" " రైలు పట్టాలు తప్పుతుంది" వాడి సమాధానానికి వరాలు మరింత పొంగిపోయింది. " మీ మామయ్య ఉన్నారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో హుషారుగా ఆఫీసులో పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారు. ఎలాగూ పని చేస్తున్నాడు కదాని బస్తాలకొద్దీ ఫైళ్ళని తెచ్చి ఆయనముందు పడేశారనుకో. వీలైనంతవరకూ ఆ పని పూర్తి చేయాలని కష్టపడతారు. అలాగని యింకా ఫైళ్ళు తెచ్చిపడేశారనో. . " " ఆ పని పూర్తి చేయలేక మామయ్యకు నీరసం వస్తుంది" చెప్పిన రాంబాబుని వరాలు దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టేసుకొంది. వాడి తెలివితేటలకు , టక్కున చెప్పే సమాధానాలకు ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది. " ఆ నీరసం వల్ల కొన్నాళ్ళు ఆఫీసుకి సెలవు పెట్టి ఏ సామర్లకోటో వెళ్ళిపోవాలనిపిస్తుంది. అనిపించటమేంటి? అలాగే చేస్తారు కూడా! మీ మామయ్యే కాదు ఆఫీసులో ఎవరైనా అదే చేస్తారు. అడుగుల్లో ఉండే మనిషే అలా చేస్తున్నప్పుడు , ఆ మనిషిలో అంగుళాల్లో ఉండే జీర్ణకోశం పనిచేయటం మానేయదా? తప్పకుండా మానేస్తుంది. దాని ఫలితమే అజీర్తి, కడుపుబ్బరం. అలా వేసవిలో మందకొడిగా పనిచేసే జీర్ణకోశం వానాకాలం తిండికి నీరసించి పని చేయనని మొరాయించే స్థితికి మనమే తీసుకొస్తాం. ఇక శీతాకాలం వచ్చేసరికి మనకే దుప్పటి ముసుగేసి పడుకోవాలని అనిపించినప్పుడు జీర్ణకోశం ముసుగు తన్నదా? అలాంటి జీర్ణకోశం చేత బలవంతంగా పని చేయిస్తే మన ఆరోగ్యానికే ముప్పు. అందుకే మీ మామయ్యకు సెలవు యిచ్చినట్లుగా, శీతాకాలంలో అప్పుడప్పుడు యీ ఉపవాసాల పేరుతో జీర్ణకోశానికి సెలవునివ్వాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలా సెలవిస్తే, అది మళ్ళీ శక్తిని పుంజుకొని తిరిగి పని చేయటానికి తను సిద్ధమన్నట్లు సంకేతాలు పంపిస్తుంది. అంటే వేసవిలో నీళ్ళతో నింపే జీర్ణకోశానికి వానాకాలంలో ఎక్కువ తిండిపడేసి చెడగొట్టటం వల్ల శీతాకాలంలో ఉపవాసాలతో తిరిగి మెరుగు చేసుకొంటామన్నమాట. అదీ ఉపవాసాల కధ." వరాలి నుంచి క్రొత్త విషయాలు తెలుసుకొన్న రాంబాబు హుషారుగా లోనికెళ్ళిపోయాడు.
వాడలా వెళ్ళగానే కన్నార్పకుండా తనవైపే చూస్తున్న నా దగ్గరకొచ్చింది వరాలు. " ఏంటలా చూస్తున్నారు?" " పల్లెటూరిలో పెరిగిన అమ్మాయిలో యింత పరిణతి ఎలా వచ్చిందాని? " అన్నాను.. " ఆ ! మా ఆయన వ్రాత కోతల్లో దిట్ట. ఆయనే నన్నిలా తయారుచేశాడు" అంది, " నువ్వు విజ్ఞానం పేరుతో వాడికేవేవో చెబుతున్నావు. భావిలో వాడికా విజ్ఞానం వికటిస్తే, నువ్వు వాణ్ణి చెడగొట్టావని మీ అన్నయ్య ఎద్దేవా చేస్తే నువ్వు బాధపడాల్సి వస్తుందేమో ఆలోచించావా? " నా మాటలను కొట్టి పారేస్తున్నట్లు చూసిందామె. " చిన్నప్పుడు మన పెద్దలు చెప్పబట్టే కదా మనం యిన్ని విషయాలు తెలుసుకొన్నాం. మరి యీ కాలం పిల్లలేమి పాపం చేశారండి? వాడిలో ఉత్సాహం చూశారా? వాడి పరిశీలనాదృష్టి, సామాజికస్పృహ గమనించారా? ఈకాలం పిల్లల్లో ఉన్న ఆ జిజ్ఞాసను పెద్దలు నిర్లక్ష్యం చేయబట్టే వాళ్ళు మూఢులుగా తయారవుతున్నారు. ఇక అన్నయ్య సంగతంటారా? నా ఎదురుగా ఏమీ అనడు. చాటుగా ఏమనుకొన్నా నాకు తెలియదు. ఆయనేదో అంటాడని రాంబాబులోని ఉత్సాహాన్ని చంపేయలేను" అని చెప్పి వరాలు వెళ్ళిపోతుంటే మౌనంగా చూస్తూండిపోయాను. ఆమె చెప్పింది నిజమే! ఈకాలం పిల్లలు మూర్ఖులుగా తయారవటానికి పెద్దలే కారణం. మేము సామర్లకోట వెళ్ళిన మూడురోజులకే రాంబాబుకి వరాలు గురువైపోయింది.
ఓకరోజు ఆ చిన్న ఊళ్ళో ఉన్న పెద్దహాలుకి సినిమా చూడ్డానికెళ్ళాం. సినిమాకెళ్ళినప్పుడు పొడిగా ఉన్న రోడ్డు తిరిగొచ్చేటప్పుడు బురదగా ఉండి వరాలికి నడవటం కష్టమనిపించింది. కాలికి అడ్డం పడకుండా కట్టుకొన్న చీర కుచ్చిళ్ళు కొంచెం పైకెత్తి నడవటం కాస్త యిబ్బందిగానే ఉంటుంది. " జాగ్రత్తమ్మా! ఇది మీ ఊరనుకొనేవు. ఇక్కడనుంచి ఎన్నికైనా, మా అసెంబ్లీసభ్యులు ఎక్కువగా రాజధానిలోనే తిష్టవేయటాన యీ పల్లెటూరి రోడ్లు బాగుపట్టం లేదు. పోనీ ఆ నిధులేవో మా పంచాయతీనాయకుల మొహాన పడేస్తారా అంటే అదీలేదు. ప్రజలనుంచి వసూలు చేసిన పన్నులే వినియోగిస్తూ, ఏదో వాళ్ళసొమ్మే ఖర్చుపెడుతున్నట్లు మాట్లాడుతారు " అన్నాడు రాంబాబు నాన్న. " ఇప్పుడంటే రాజధాని గాని నేనూ ఆ పల్లెటూరిలో పెరిగినదాన్నే కద అన్నయ్యా!" అంది వరాలు. తనకి నడవటం కొంత యిబ్బందిగా ఉండటాన నా భుజాన్ని ఆసరా చేసుకొని నడుస్తోంది. " ఈ వెధవ వాన ఎప్పుడు పడిందో గాని రోడ్డంతా పాడైంది." వరాలు విసుక్కొంది. " హీరోహీరోయిన్లు పార్కులో పాట పాడుతుంటే వాన పడింది కదత్తా!" రాంబాబు మాటలకు అందరం త్రుళ్ళిపడ్డాం.
" ఏం చెల్లెమ్మా! మావాడికి సామాజికస్పృహ ఎప్పుడో కాదు, నీదయ వల్ల యిప్పుడే వచ్చేసింది " రాంబాబు నాన్న మాటలకు వరాలు కాలు వణికి తూలి పడబోయింది. అప్రయత్నంగా నా చేత్తో ఆమె చేతిని పట్టుకొని ఆపాను. " నాతిచరామి అని పెళ్ళినాడిచ్చిన మాటను చక్కగా పాటిస్తున్నావోయి" అని చమత్కరించాడాయన. " నాతిచరామి అంటే ఏమిటత్తయ్యా?" రాంబాబు ప్రశ్నకు వరాలు సిగ్గుపడింది. " నువ్వు పెద్దయ్యాక తెలుసుకోవలసిన విషయమది" అంటున్న నన్ను చురుగ్గా చూసి, ఎవరూ చూడకుండా భుజంపై గిల్లింది.
" ఇలా జరిగిందేమిటండీ? " రాత్రి నిద్రపోయేవేళ వరాలు అడిగింది " మీ అన్నయ్య అన్నదానికి బాధపడుతున్నావా? నీ విజ్ఞానబోధకి యీ సంఘటనకి సంబంధమే లేదు. రాంబాబే కాదు. ఈకాలం పిల్లలకి సినిమాలే జీవితం, జీవితమే సినిమా. రాముడి భార్య ఎవర్రా అంటే " అంజలీదేవి " అంటారు. " అదెలారా?" అంటే " లవకుశలో ఆమెనే కదా!" అంటారు. దొంగతనాలు, బలాత్కారాలు, హత్యలు, రోడ్డుప్రమాదాలు అన్నిటికీ ప్రేరణ సినిమాలే. సినిమావాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు తప్ప మరే జ్ఞానం తెలియని యీ తరానికి సినిమాలో వాన పడినా యిక్కడ పడినట్లే అనుకోవటంలో తప్పేముంది? నీవల్ల యీ మేనల్లుడు చెడిపోలేదు. నీ పాఠాలు ఆపాల్సిన పనిలేదు" అన్నాను. నా మాటలకు మురిసిపోతూ అటు తిరిగి పడుకొందామె. అలా చెప్పకపోతే నా అవతారం ఎలా తయారయ్యేదో! పెళ్ళాం మనసుకు కళ్ళెం వేస్తే మన సుఖసంతోషాలకు గొళ్ళెం వేసినట్లే! అయినా పిల్లలకి లోకరీతిని పెద్దలు చెప్పకపోతే వాళ్ళంతా కౌరవమందలా పతనానికి దారితీస్తారు. అందుకే కుంతీదేవి పాండవులకు చేసినట్లు వారికి విజ్ఞానబోధ చేస్తుండాలి.
* * *
ఆ రోజు ఆగస్ట్ పదిహేను, స్వాతంత్ర్యదినం కావటాన వీధులన్నీ స్కూలుకెళ్ళే పిల్లలతో హడావిడిగా తయారయ్యాయి. తన స్నేహితులతో కలిసి రాంబాబు స్కూలుకి వెళ్ళిపోయాడు. వాళ్ళింటి ఎదురుగా పార్కులో ఆ కాలనీ కమిటీ జెండా ఎగురవేస్తారని రాంబాబు నాన్న ఉదయాన్నే నన్ను నిద్రలేపి లాక్కెళ్ళాడు. పండుగదినం పేరుతో వరాలు తన వదినగారితో వంటింటి హడావిడిలో పడిపోయింది. సుమారు రెండుగంటల వ్యవధిలో పార్కులో జెండావందనం ముగియటంతో నేను యింటికొచ్చేశాను. ఆ కాలనీ కమిటీ సభ్యుడు కావటాన, అక్కడ జరిగే సభ కోసం రాంబాబు తండ్రి పార్కులోనే ఉండిపోయాడు. ఆరోజు దినపత్రిక చదువుతూ వసారాలో నేను కూర్చున్నాను.
స్కూల్లో జెండావందనం ముగించుకొని యింటికొచ్చిన రాంబాబు మెల్లిగా నావద్ద కొచ్చాడు .
'స్వాతంత్ర్యం అంటే ఏమిటి మామయ్యా?" రాంబాబు ప్రశ్న వినిపించి దినపత్రికలోంచి తలెత్తి చూశాను. వాడి ముఖం కళతప్పినట్లు ఉన్నది. " నిన్న అత్తయ్య చెప్పలేదా?" అడిగిన నాకు లేదన్నట్లు తలూపాడు. వరాలు వంటపనిలో ఉంది గనుక వాడి ప్రశ్నకు నేను బదులివ్వక తప్పదు. చదువుతున్న దినపత్రికను మడిచి నేలపై పెట్టి వాణ్ణి ఒళ్ళోకి తీసుకొన్నాను. " పూర్వం మనదేశంలో యిప్పుడు రాష్ట్రాలున్నట్లే అప్పుడు రాజ్యాలుండేవి. ఆ రాజ్యానికి రాజు పెద్ద. ఆ రాజ్యంలో ప్రజలంతా రాజుగారు చెప్పినట్లు వినాలి. రాజ్యంలో యువకులంతా యుద్ధానికి బయల్దేరండంటే, వాళ్ళింట్లో వాళ్ళకెలా ఉన్నా వాళ్ళనలాగే వదిలేసి వెంటనే బయల్దేరాలి. రాజుగారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే వెంటనే వాళ్ళను బంధించి కొరడాలతో కొట్టి, ప్రజలందరిముందు బహిరంగంగా తల నరికి చంపేసేవారు. అలా ఆ వ్యక్తి తలనరికేముందు ఆ ఊరిలో ప్రజలందరిని ఆ ప్రాంతానికి రమ్మని ముందుగా దండోరా వేసి పిలిచేవారు. అక్కడికి ఎవరైనా రాకపోతే వాళ్ళ తలలు కూడా నరికేవారు. అందుకని అందరూ భయపడి రావటమే గాక, రాజుగారి మాట వినకపోతే ఏం జరుగుతుందో కళ్ళారా చూసేవారు గనుక రాజుగారు చెప్పినట్లే చేసేవారు. ఆ రాజుల తరువాత ఆంగ్లేయులు వచ్చారు. వాళ్ళదీ అదే పద్ధతి. అధికారి ఊళ్ళోకి వస్తే ప్రజలు వాళ్ళ కాలికి దండం పెట్టాలి. వాళ్ళు చేసేదేదీ తప్పు అనకూడదు. ఆ రోజుల్లో వాళ్ళు గుర్రాలపై వచ్చేవారు. వాడు గుర్రం దిగటానికి ప్రజల్లోంచి ఒకణ్ణి పిలిచేవాడు. ఆ వ్యక్తి గుర్రం దగ్గరకెళ్ళి వంగుంటే వాడి వీపు మీద కాలుమోపి అధికారి గుర్రం దిగేవాడు. ఈ బానిసత్వాన్ని నచ్చని గాంధీగారిలాంటి నాయకులు పోరాటం చేసి 1947 ఆగస్ట్ 15 న మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. ఆ తరువాత రాజుల సంస్థానాలన్నీ రద్దు చేశారు. ఈదేశంలో అందరికీ సమానహక్కులు వచ్చాయి. ఎవరికి ఎవరూ బానిసలు కాదు. ఫలానావాడిది తప్పు అని ధైర్యంగా ఎదిరించి చెప్పవచ్చు. ఆఖరికి దేశంలో మంత్రులు తప్పుచేసినా ధైర్యంగా అతన్ని నలుగురిలో నిలదీయవచ్చు. అయిదేళ్ళకోసారి జరిగే ఎన్నికల్లో మనకి నచ్చని వాడిని ఓడించి పదవీభ్రష్టుణ్ణి చేయవచ్చు" హుషారుగా చెప్పుకొంటూ పోతున్నాను. " ఇవన్నీ వద్దు మామయ్యా! దేశంలో అందరూ సమానమే కదా! మరి అలాంటప్పుడు యీ స్వాతంత్ర్యఫలాన్ని అందరూ సమానంగా పంచుకోవాలి కదా!" రాంబాబు ప్రశ్నలో ఏదో సామాజికస్పృహ ధ్వనించినట్లనిపించింది. " నిజమే! అలా పంచుకొంటారు కూడా!" అన్నాను. "ఎక్కడ మామయ్యా? మాస్కూల్లో జెండా ఎగరేశాక అందరికీ ఒక చాక్లెట్టే యిచ్చారు. సంధ్యాటీచరు వాళ్ళమ్మాయికి నాలుగు చాక్లెట్టిచ్చారు. అది చూసి నాకూ నాలుగు చాక్లెట్లిమ్మంటే రూలు ప్రకారం ఒకటే యిస్తామన్నారు. రూలు ప్రకారం ఆ అమ్మాయికీ ఒక్కటే యివ్వాలిగా! వాళ్ళ అమ్మ స్కూలు టీచరని రూలు మార్చవచ్చా? అలాగయితే సమానత్వమెక్కడుంది మామయ్యా?" వాడి ప్రశ్నకు నా కళ్ళు తిరిగాయి. వాడికి బదులివ్వలేక జేబులోంచి వందరూపాయలిచ్చి పండగ చేసుకోమని పంపేశాను. ఒంటరిగా కూర్చున్న నా బుర్రలో రాంబాబు ప్రశ్నే గింగురుమంటోంది. హత్య చేసిన సామాన్యుణ్ణి కొడుతూ యీడ్చుకెళ్ళి జైల్లో పడేస్తారు. అదే ఏ అధికారి కొడుకో అయితే మర్యాదగా జీపులో తీసుకెళ్ళి ఒకగంటలో బెయిలుపై బయటకు వదిలేస్తారు. పైపెచ్చు ఆ నేరంపై ఏళ్ళ తరబడి విచారణ నడిపించి సరయిన సాక్ష్యాలు లేవని వాణ్ణి నిర్దోషిగా వదిలేస్తారు. మరి సమానత్వం ఎక్కడుంది? దీన్ని నిజంగానే ప్రజాస్వామ్యమని, చట్టం ముందు అందరూ సమానులేనని అనగలమా? యువతరంలో యీ సామాజికస్పృహ రాకూడదనే పాలకులు మందుపోసి మత్తులో ముంచేస్తున్నారా?
ప్రతి ఆగస్ట్ 15 కి రాంబాబు " చాక్లెట్ " ప్రశ్న గుర్తుకొస్తూనే ఉంటుంది. ఈ యువతరానికి సామాజికస్పృహ వచ్చి తాము కోల్పోతున్న సమానత్వం కోసం ఎప్పుడు పోరాడుతారో? దానికోసం మరో నేత పుట్టలేమో?. . . .ఏమో? మీరూ ఆలోచించండి.
***

No comments:

Post a Comment

Pages