“సిరివెన్నెల” గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

“సిరివెన్నెల” గారితో ముఖాముఖి

Share This

“సిరివెన్నెల” గారితో ముఖాముఖి

భావరాజు పద్మిని


ఇన్నాళ్ళకు  'సిరివెన్నెల' కురిసింది... పత్రిక పెట్టిన రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తుంటే, దైవానుగ్రహం వల్ల, ఇప్పటికి సిరివెన్నెల గారి ఇంటర్వ్యూ సంపాదించగలిగాను. ఆయనో వ్యక్తి కాదు శక్తి, ఆయన జీవితపు పరమార్ధాన్ని పూర్తిగా జీర్ణించుకున్నగొప్ప తత్వవేత్త ! ఆయనతో జరిపిన ప్రత్యేక ముఖాముఖి, ఈ నెల ప్రత్యేకించి మీ కోసం...

నమస్కారమండి, సినిమాల్లోకి రావాలని  ముందునుంచి అనుకునేవారా ?
నమస్కారం . అనుకోలేదమ్మా ! అనుకోకుండానే జరిగింది.
మీరు మొదటి సినిమా ఛాన్స్ కోసం విశ్వ నాథ్ గారిని కలిసినప్పుడు వారు ‘మణి’ అన్న వారి వద్దకు మిమ్మల్ని పంపారట ?
అవునండీ. మణి అంటే ఎవరో కాదు, మన బాలసుబ్రహ్మణ్యం గారే ! వారూ వారూ బంధువులు కనుక, చనువుగా ‘మణి’ అని ఆయన్ను పిలుస్తారు.
చక్రం సినిమాలోని ‘జగమంత కుటుంబం నాది’ అనే పాటను మీరు ఎప్పుడో రాసి పెట్టుకున్నారట ?
78 లో నా కవితలు, భావాలు అన్నింటినీ పాటలుగా రాసి పెట్టుకునేవాడిని. గీతరచన మీద మక్కువ ఎక్కువ. అలా రాసిన పాటల్లో ఇది ఒకటి.
భారతీయ తాత్వికతను ఇమిడ్చిన లోతైన విషయమిది. ఇది సినిమా గీతానికి సరిపోదు. వారి వారి అవగాహనా స్థాయిని బట్టి, అర్ధమైన వాళ్ళు, దీన్ని వారికి అర్ధమయినట్లు చూస్తారు. నిజానికి ఈ పాట నాదగ్గర చాలా కాలం నుంచి చాలామంది వింటున్నారు. వారికి దీనిపట్ల ఆసక్తి కూడా ఉంది. కానీ సినిమాల్లో పెట్టాలని ఎవరూ అనుకోలేదు. ఋషుల తాత్వికత , ఆత్మాన్వేషణ, ఉపనిషత్తులు వంటివాటి గురించి సినిమాలకు ఎవరూ రాయరు, రాసినా ఎవరూ తియ్యరు కదా ! ఇవి ఎవరి తేజస్సును బట్టి, వారు తెలుసుకోవాల్సిన అంశాలు. ఇంత లోతైన, సున్నితమైన తాత్వికత కూడుకున్న పాటకి సినిమాల్లో చోటుండదు , అనుకున్నాను.
ఈ పాట కోసం కృష్ణ వంశీ గారు నన్ను అడిగినప్పుడు నా డైరీలో అలా ఉండిపోయే బదులు, సినిమా మాధ్యమం ద్వారా బయటకు వస్తుంది కదా అనుకున్నాను. కాని సినిమాలో ఈ పాట పెట్టాలంటే దానికో కధ, సందర్భం, సోకు ఉండాలి కదా ! ఇందుకోసం కృష్ణ వంశీ గారు, వారు ఈ పాటను అర్ధం చేసుకున్నంతలో పాట చుట్టూ ఓ కధను అల్లి, సినిమా తీసారు. రేపో మాపో చనిపోబోయే అతనికి జీవితం పట్ల ఎటువంటి దృక్పధం ఉంటుంది అన్న కధాంశంతో సినిమా రూపొందించారు.
కానీ, వాస్తవానికి ఈ పాట వెళ్ళిపోయే వాడి కోసం కాదు. భగవద్గీతను ఎవరైనా చనిపోయినప్పుడు సంతాప సూచకంగా మాత్రమే వాడుతున్నారు కదా ! కాని గీత జీవిత సార్ధకత కోసం నిర్దేషించబడింది. మనకు అందులో అర్ధమయ్యింది సంతాపం.  అలాగే కర్మ జీవన విభూతి నిండిన పాట ఇది.
ఇందులో ‘జగమంత కుటుంబం’, ‘ఏకాకి జీవితం’ అన్న పద ప్రయోగాల వెనుక ఉన్న వైరుధ్యాన్ని గమనించాలి. ఇక్కడ ఏకాకి జీవితం అంటే ఎవరూ లేరని ఏడుపు కాదు. ముందరే జగమంత కుటుంబం అంటున్నాము. అంటే, అందరూ ఉన్నారని అర్ధమేగా !అదీ నాదేనని, నన్ను నేను జగమంత కుటుంబంలో, అందరిలోనూ చూసుకుంటున్నాను అని అర్ధం. ప్రపంచంలో నన్ను నేను చూసుకోవడం, అలా చూసుకోవడం వలన మన మీద మనకు వచ్చే అవగాహన గురించి ఇక్కడ చెప్తున్నాము. మన  ఆలోచనలు, ప్రశ్నలు, అన్వేషణ మీద ఇది ఆధారపడి ఉంటుంది.
ఆలోచన అనేది మనలో ఉండాలి.  మనలో ఉండి, అదే మనల్ని మనిషిని చేసినప్పుడు ‘ఏం ఆలోచించాలి’ అని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రాణులు అన్నింటిలోనూ ప్రశ్నించుకోవడం అన్నది మనకు మాత్రమే వచ్చు. చుట్టూ ఉన్న సృష్టిని ఆశ్చర్యార్ధకమైన చూపులతో చూడడం ఒక్క మనిషికే ఉన్న వరం. అటువంటిది ఉన్నప్పుడు 'ఏం తినాలి, ఎలా తినాలి' అన్నవి ఆలోచించుకు తిరిగడం దండగ. ఎందుకంటే అలా ఆలోచించినా, ఆలోచించకపోయినా మనకు ఏదో ఒకటి దొరుకుతుంది. ప్రపంచంలో ఉన్న ఇన్ని ప్రాణులకు దొరగ్గా లేనిది మనకు దొరకదా ! 'ఏం ప్రశ్నించుకోవాలి' అన్నది ఆలోచించాలి. అందులోంచే అన్నీ వస్తాయి. అలా అనేక రకాల కోణాలు, అర్ధాలు ఉన్నాయి ఈ పాటలో.
 కవిత్వం అనేక పొరల రూపంలో ఒస్తుంది. అది ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమవుతుంది.కవిత్వానికి ఉన్న లక్షణం ఏమిటంటే అంతరంగాన్ని మీటి, అనేక రకాలైన ఆలోచనలకు, భావాలకు ప్రేరణ, ప్రచోదనం(ముందుకు కదిలేటట్టు) ఇస్తుంది. ఇస్తేనే అది కవిత్వం అవుతుంది. కొన్ని పదాల సమూహం కాని, కొంత ఆర్భాటం కాని కవిత్వం అనిపించుకోదు. కాబట్టి, కవిత్వం అనేది మానవ జీవితంలో ఉన్న అన్ని కళలలోకి అత్యుత్తమమైన కళ. ఏం ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి అనే ప్రశ్నలకు ఆలంబన ఇస్తే ఉత్తమమైన సాహిత్యం వెలికి వస్తుంది. ఇటువంటి నిగూఢమైన అర్దాలున్నది ఈ పాట.
ఇది సినిమాకు ఇచ్చాకా, దాని బాణీ మార్చకూడదు, వెనుక వాద్యాలు చేర్చి అల్లరి చెయ్యకూడదు. అప్పుడు అందులో సాహిత్యం గ్రిప్ పోతుంది కదా.  అందుకని నేను రాసుకున్న బాణీలోనే నీట్ గా, క్లీన్ గా స్వరపరిచారు. కాకపొతే ఆ పాడే విధానంలో ఒక విషాదం ధ్వనించింది. ఇందులో విషాదం లేదమ్మా. ఒక అనుశీలన, గాఢమైన  పరిశీలన ఉంది. ఇలా ఆలోచిస్తూ ఈ పాటని చూస్తే, అనేక రకాల కోణాల్లో కెలీడియోస్కోపిక్ గా కనిపిస్తుంది.
మీరు ఎక్కువగా విశ్వ నాథ్ గారితో, రాంగోపాల్ వర్మ గారితో పనిచేసారు కదా ! విశ్వనాథ్ గారి సినిమాలు తీసుకుంటే అవి సున్నితమైన భావోద్వేగాలతో కూడి ఉంటాయి. కాని రాంగోపాల్ వర్మ గారి సినిమాలు ఒక కటువైన సామాజిక నేపధ్యంతో కూడుకుని ఉంటాయి. ఈ ఇద్దరు విభిన్నమైన దృక్పధాలున్న దర్శకులకు అనుగుణంగా మీ కాలాన్ని మీరు ఎలా మలుచుకున్నారు ?
మలచుకోవడం ఏమీ లేదమ్మా. సినిమా కవిగా ఫ్రీ లాన్సర్ గా పనిచేస్తున్నప్పుడు ఒకరకమైన సంస్కారాలు ఉంటేనే రాయగలరు కదా ! కవికి సినిమా రంగంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే సినిమా కధలో ఆ దర్శకులు వారి వారి సంస్కారాలను బట్టి, అనేక రకాలైన పాత్రల్ని, సమస్యల్ని, సందర్భాల్ని, పాట కోసం సృష్టించి ఇస్తారు. ఇవ్వాలి కూడా ! ఇది నా ఆలోచన. ధర్మంగా అలా ఇవ్వాలి. కాని ఇవ్వట్లేదు. అలా ఇవ్వడం వల్ల, మనకు ఏం ప్రయోజనం అంటే, బాగా పాత సినిమాలు తీసుకుంటే, అక్కడ కధతో సంబంధం లేకపోయినా ఒక మంచి స్పూర్తివంతమైన గీతమో, భావగీతమో ఉండాలి అనేవారు. కవి, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శుకుడు అందరికీ కళాదృష్టి ఉండేది కనుక, వారంతా కలిసి ఒక మంచి పాటని అందించాలని చూసేవారు, ఇలా అవకాశాన్ని దొరకబట్టుకుని రాసేవి, మొదటి రకం పాటలు. రెండో రకం సినిమా పాటలు, నాయకానాయకి, వీరు వారి మధ్య ఉన్న భావాలను వెల్లడించుకోవడం, అంటే యుగళ గీతాలు అనుకోండి. ఇలా వీటన్నిటి మధ్యనుంచి ఒక అవకాశాన్ని మనకు ఇచ్చినప్పుడు, సినిమాలో ఏమున్నాయి అనకుండా, ఏమేమి ఇచ్చారు అనకుండా, వాళ్లకు కావలసిన పర్ఫెక్షన్ వచ్చేలా కష్టపడాలి. చాలా సందర్భాలు ఇటువంటివి మనకు వస్తూ ఉంటాయి.
'నా పాటని జనం వినాలి ' అని నేను అనుకున్నప్పుడు, వాళ్ళు సినిమా కధను మర్చిపోవాలి. ఆ బాణీని మర్చిపోవాలి. మర్చిపోతే ఆ పాట మనది అనిపిస్తుంది, అనిపించాలి అన్నది నా ఉద్దేశం. సీతారామశాస్త్రి అంటే అందరు కవుల్లా కూర్చుని, ఏదో ఒకటి రాసి, నాలుగు డబ్బులు తెచ్చుని, నా పబ్బం గడుపుకోడం నా ఉద్దేశం కాదు. అలా ఏవో ఇచ్చిన సన్నివేశాలకు పూర్తి న్యాయం చెయ్యగలగడమే నాకు ముఖ్యం. ఉదాహరణకు తల్లి మీద ఒక కవిత్వం రాయాల్సి వచ్చినప్పుడు ,"ఎవరు రాయగలరు - అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా, అను రాగం కన్న తియ్యని రాగం" - అన్న అమ్మ రాజీనామా చిత్రం లోని పాట లాంటిది పుడుతుంది. 'అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి," అన్న మాటలు, 'అమ్మ'  అన్న నేపధ్యానికి పూర్తి  ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా రూపొందించినప్పుడు, ఆ పాట ఏ సినిమాలోది అన్న ఆలోచన అనవసరం. 'నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో' అన్న మాటలు విన్నప్పుడు, ఇది ఏ సినిమాలోది అన్నది, కధేమిటి అన్నది ఆలోచించక్కర్లేదు కదా ! దర్శకుడు ఇచ్చిన "తల్లి" మీద పాట అన్న సందర్భానికి, అమ్మ దేవత, నవమాసాలు మోస్తుంది అంటూ మామూలుగా రాయకుండా,  అందరికీ అర్ధం అయ్యేలా సాత్వికంగా, ఉదాత్తంగా రాయడం ముఖ్యం. కవిత్వం అనేది స్థలము, కాలము, అనేవాటికి అతీతంగా ఉండాలి. అంటే, స్థలము, కాలము అనేవాటికి అతీతంగా మనం ఉచ్చరించగలగాలి. ఆకలి, దాహం, సూర్యోదయం, సూర్యాస్తమం వంటివి క్రీస్తు శకం ఒకలాగా, క్రీస్తు పూర్వం ఒకలాగా ఉండదు కదా. ఇటువంటి లక్షణాలను కలిగి ఉండి రాస్తేనే అది కవిత్వం అవుతుంది. ఆ సినిమాకు, ఆ సందర్భానికి, ఆ పాత్రకి సరిపోయేటట్టు రాస్తే అది సినిమా పాట అవుతుంది.
నేను దర్శకుడు ఎవరైనా కూడా, వారిచ్చిన సందర్భానికి ప్రయోజనం చేకూరుస్తూ, సమాజంలో తిరిగి అటువంటి సమకాలీన సన్నివేశాలకి, మానసిక సంఘర్షణకు సరిపోయేలా రాస్తాను. 'నీకిచ్చిన ప్రతిభను నువ్వెందుకు చులకన చేసుకుంటున్నావు? దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది నీకు ఎంత ఆనందం ఇస్తుంది'  అన్న భావం స్వర్ణకమలంలో ఉంటుంది. ఆ భావం ఆ ఒక్క పాత్రకే అన్న పరిమితి ఏమీ లేదు కదా. కాబట్టి, సినిమా వాళ్లకు ఉన్న ప్రయోజనం ఏమిటంటే కవిత్వం రాయాలి అని ఆశ ఉన్న వాడికి, రాయాగలిగే సత్తా ఉన్నవాడికి, రకరకాల సమస్యల్ని, రకరకాల సన్నివేశాల్ని బలవంతంగా ఇస్తూనే ఉంటుంది. నేనెప్పుడో చచ్చేదాకా రాస్తాను అని అనకుండా, అనేక కోణాల్ని, జీవితంలో పరిశీలించే అవకాశం ఉంటుంది. అందువల్ల నా కలాన్ని మలచుకోవడం అన్నది ఉండదు. జీవితంలో సుఖముంటుంది, దుఃఖ ముంటుంది, కష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. వాటి తాలూకు జననాలకి అంటే సార్వకాలీనము, సార్వ జనీనము, సార్వ దేశీయం అన్న ప్రయోజనాలు కలిగేలా రాయటం నా ఉద్దేశం.
సద్గురు శివానందమూర్తి గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది ?
ఆయన నాకు దైవంతో సమానం అమ్మా. ఆయనకు, నాకు ఉన్న అనుబంధం దేవుడికీ, జీవుడికీ ఉన్న సంబంధం లాంటిది.
గాయం సినిమాలో 'నిగ్గదీసి అడుగు' అన్న పాట, ఆ తర్వాత కంచె సినిమాలో 'విద్వేషం పాలించే' అన్న పాట రాసారు కదా. నిగ్గదీసి అడుగు అన్న పాటకి ఇది కొనసాగింపులా ఉంటుంది అంటూ ఉంటారు. మీరేమంటారు? 
ఏమంటాను ? అలా అన్నవాళ్లకి మంచి అబ్సర్వేషన్ ఉంది అంటాను. అప్పుడు రాసినా అందులో ఆవేదన ఉంది, ఇప్పుడు రాసినా ఆవేదన ఉంది. ఈ పాట సీతారామ శాస్త్రి ఎంత గొప్పగా రాసాడు అనకుండా, ఆ పాటకి, ఈ పాటకి మధ్య ఈ 30 ఏళ్ళ కాలంలో మనం ఏమీ మారలేదు అని, ఆ పాటకి, ఈ పాటకి మధ్య సారూప్యాన్ని గుర్తిస్తే, అది సమాజంలో ఒక మార్పుకు కారణం అవుతుంది. సీతారామ శాస్త్రి అంటే ఒక వ్యక్తి కాదు కదా, సమాజం ఉన్నా, ప్రజలు అన్నా, కాలం అన్నా, ఒక ప్రవాహంలా వెళ్ళిపోతుంది. అటువంటి స్పృహ ఉన్నవారు దాన్ని ఆబ్జెక్టివ్ గా చూస్తే, అది అందరికీ ఉన్న ఆవేదనే, నా ఒక్కడిదీ కాదు కదా. 30 ఏళ్ళ తర్వాత అలాగే ఉంది కదా. 'వేట అదే వేటు అదే నాటి కథే అంతా, నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా!' అని ఆ కాలంలో అన్నాము, ఇప్పుడూ అదే జరుగుతోంది. 'విద్వేషం పాలించే దేశం ఉంటుందా ? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ?' అంటే ఇప్పుడూ అదే జరుగుతోంది. కాలంతో వచ్చిన మార్పులు వస్తే వచ్చాయి అంటే గ్లోబలైజేషన్ పరంగా, వీడియో గేమ్స్ పరంగా, టెంపుల్ రన్ లు అన్నీ వచ్చాయి కాని, సమాజంలో ఏమీ మార్పు జరగలేదు. మార్పు వచ్చిందో లేదో మనల్ని మనమే ప్రశ్నించుకుంటే దేశం అర్ధవంతంగా అవుతుంది. దీనికి సామూహికంగా, సాంఘికంగానే ప్రశ్నలు వేసుకోనక్కర్లేదు. వ్యక్తిగతంగా కూడా ప్రశ్నలు వేసుకోవచ్చు, వేసుకుంటే మన ఆలోచనల్లో మార్పు వచ్చినా మంచిదే. భక్తైనా, భావమైనా, ప్రశ్నించుకునే అలవాటు వల్ల, మన ఆర్తికి, మన ఆరాటానికి, మన దాహానికి ఒక దారి దొరుకుతుంది. ఈ పాటల్లో ఉన్నటువంటి ప్రశ్నల్ని, విని ఊరుకోకుండా, ఆ  భావాన్ని ఎవళ్ళమటుకు వాళ్ళు వేసుకుంటూ, విచారిస్తూ ఉంటే, క్రమంగా వారి ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. వస్తే అదే ప్రభావం మీ పిల్లల మీద ఉంటుంది. మీరు తిరుగాడే ప్రదేశాల మీద, మాట్లాడే వ్యక్తుల మీద, మీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది కదా, అదే తిరిగి తర్వాతి తరానికి అందుతుంది.
అందుకని ఆలోచించడం అనేది, వ్యక్తిగతంగా ప్రశ్నించడం అనేది ఉంటే ఆ పాటలో ఉన్న ప్రతి అంశం ఒక వ్యక్తి హృదయాన్ని తట్టి లేపాలని చూస్తుంది. ఆ వ్యక్తి మళ్ళీ ఎవరో కాదు, నేనే ! అందువల్లే జగమంత కుటుంబం అనే పాటలో ఏ భావం ఉందో, విద్వేషం పాలించే అన్న పాటలో కూడా అదే ఉంటుంది. 'నాతో నేనే అనుగమిస్తూ, నాలో నేనే రమిస్తూ,' మాట్లాడుకుంటూ ఉన్నాను. అలా అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే , కాని ప్రయోజనం అన్నది, ఎవరికివారు వ్యక్తిగతంగా ఆలోచిస్తేనే చేకూరుతుంది.
విమర్శల్ని, పొగడ్తల్ని మీరు ఎలా స్వీకరిస్తారు? 
విమర్శలు నాకు ఎప్పుడూ ఎదురవలేదమ్మా. ఎందుకంటే, నాకు నేనే గొప్ప విమర్శకుడిని. నేను సహజసిద్ధంగా కళాప్రదర్శన చేసి, నలుగురితో చప్పట్లు కొట్టించుకుని, ఓహో అనిపించుకుని ఆనందించేసే కళాకారుడిని కాను. ఒక ప్రయోజనం కోసం, తాత్వికమైన భావాల్ని అందిస్తూ వాటిని ఆవిష్కరించేందుకు ప్రయత్నించే తాత్వికుడ్ని కాని, ఇతరుల మనసుల్ని రంజింపచెయ్యడానికి ప్రయత్నించే కళాకారుడిని కాదు. నా ఆలోచనా విధానాలు ఎలా ఉన్నాయి అని నేనే ప్రశ్నించుకుని, నేనే పరిశీలించుకుని, అందరికంటే ముందు నేనే విమర్శ చేసుకుంటాను కనుక ఇంకొకరికి ఆ అవకాశం ఉండదు. నేను ఒక అశ్లీలాన్ని, అసభ్యతను, అవాంఛనీయ పదాలనో వాడేందుకు వ్యతిరేకిని అయినప్పుడు, నేను ముందే అటువంటివి చెయ్యకుండా ఉండాలి, ఇంకొకళ్ళ చేత ఎందుకు చెప్పించుకుంటాను ?
అవునండి, ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు 'పాడుతా తియ్యగా' కార్యక్రమంలో 'సిరివెన్నెల గారు ఇన్ని పాటలు రాసినా, ఒక్క పాట కూడా అశ్లీలంగా రాయలేదు' అన్నారు.
అది గొప్పతనం కాదమ్మా, అది నా సహజ స్వభావం. స్త్రీని గొప్పగా చూడగలను అన్న నీతి చెప్పడానికి నేను రాయట్లేదు, స్త్రీని నేను ఎలా చూస్తాను అన్నది చెప్పడానికి రాస్తున్నాను. నా పాటలు అన్నీ నా స్వగతాలు, నాతో నేను మాట్లాడుకున్నట్టు. కాబట్టి అవి ఆటోమేటిక్ గా మంచివే అయ్యి ఉంటాయి. నేను ఎలా ఆలోచిస్తానో, ఆరోగ్యకరమైన మనసులున్న మనుషులంతా కొంచెం అటూ, ఇటూగా అలాగే ఆలోచిస్తారు కదా. అందరూ కోరుకునే జీవితావసరాలు ఒక్కటే కదా. అందుకే నేను ఇతరులకి సమాధానం చెప్పకుండా, నాతో నేను మాట్లాడుకుంటే, నాకు నేను సమాధానాలు చెప్పుకుంటే, అది అందరితోటీ మాట్లాడినట్టే, అందరూ వాళ్ళకు వాళ్ళు సమాధానాలు చెప్పుకున్నట్లే అవుతుంది. అదే 'నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా' అన్న పాటలో చెప్పింది.
ఎవరినో ఎందుకు అడగడం, నీకు నువ్వే తెలుసుకోవాలి, ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకుని, సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు కోపం వస్తే, అదెందుకు వచ్చింది అని ప్రశ్నించుకుంటే, 'నాకు కోపమొస్తే నాకే నష్టం ' అని నాకు నేను సమాధానం చెప్పుకుంటే, ఇక ఎవ్వడినీ అడగాల్సిన పనేమీ ఉండదు కదా ! ఇలాగే ఆకలి, పెళ్లి, వివాహం, వంటివాటికి అన్నింటికీ ప్రశ్నలు, జవాబులు మనలోనే ఉంటాయి. ఇది మనతో మనం మాట్లాడుకుంటేనే తెలుస్తుంది తప్పితే ఇంకొకరిని అడగడానికి ఏమీ ఉండదు.
ఇన్నేళ్ళు సినీ రంగాన్ని చూసిన ద్రష్ట గా, సినీ రంగంలోకి రావాలి అనుకునే భావి కవులకి మీరిచ్చే సందేశం ఏమిటి ?
ఇప్పుడు నేను మాట్లాడింది అంతా సందేశమేనమ్మా. వేరుగాఇవ్వటానికి ఇందులో ఏమీ లేదు. ఒంటరితనంలోనే సమూహం, సమూహంలోనే ఒంటరితనం ఉంది. ఈ మాటను మీరు జాగ్రత్తగా అర్ధం చేసుకోండి. మనం కాకుండా ప్రపంచం లేదు, ప్రపంచం కాకుండా మనం లేము. కాబట్టి, నేను రాసే సంవిధానమే సందేశం. దాన్ని గమనిస్తే, మీకు సందేశం వస్తుంది. కీర్తి, డబ్బు ని ఆశించి రాస్తే, అది అక్కడికి అక్కడే చచ్చిపోతుంది. లేదు అది నా ఆర్తిని, తృష్ణని, అన్వేషణని ఆవిష్కరించేలా రాయాలి అంటే గమనించడం, ఆలోచించడం, ప్రశ్నించుకోడం అవసరం అవుతుంది. ఏ పని చేస్తున్నా కూడా, చివరికి వంట చేస్తున్నా కూడా రెండు విధాలుగా చెయ్యచ్చు. అమ్మతనం  ఎక్కువ తినాలని వండితే, రైల్వే వాడు తక్కువ తినాలని ఏవేవో కలిపి చేస్తాడు. అందుకే వస్తువులో లేదు రుచి, పెట్టే చేతిలో, పెట్టే మనసులో ఉంది అంటాము. ఏ పని చేస్తున్నా ఎవ్వరూ మనకి సందేశం ఇవ్వకర్లేదు, అన్నీ మనకు తెలుసు, మనలోపలి అంతరాత్మకు తెలుసు. చేసినదాన్ని ఆచరిస్తున్నామా లేదా అన్నది కూడా మనకే తెలియాలి కాని, మరొకరికి నిరూపించక్కర్లేదు. ఆచరిస్తున్నట్టు నటిస్తే, లోకం మెచ్చుకుంటే ఏమొస్తుంది. ఆచరించి, ఎవరూ మెచ్చుకోకపోయినా నాకు కావలసిన శాంతి నాకు వస్తుంది కదా. ఇది తెలుసుకోవాలి అంటే, నిరంతర మధనం అవసరం. ఒక విమర్శ, విశ్వాసం, అంకితభావం చాలా అవసరం.
చాలా సంతోషమండి. చాలా గొప్ప విషయాలు తెలియజేసారు. నమస్కారం.
నమస్కారమమ్మా.

No comments:

Post a Comment

Pages