శ్రీచక్రి శతకము - న్యాసావఝ్ఝుల సత్యనారాయణమూర్తి
పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం
న్యాసావఝ్ఝుల సత్యనారాయణమూర్తి గారు కాశింకోట నివాసులు. శతకాంతమున చెప్పిన కందము వలన ఈ కవి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీవత్సస గోత్రుఁడ న్యా
సావఝ్ఝుల వంశభవుఁడ జగ్గయసుతుఁదన్
గావుము నను దయతోడను
దేవా సత్యాభి దుండ దెలతుం జక్రీ
జగ్గయ్య కుమారుడు, శ్రీవత్సస గోత్రుడు అయిన ఈ కవి అనకాపల్లి మునిసిపల్ హైస్కూలులో తెలుగుపండితులుగా పనిచేసారు. వీరు బహు గ్రంధకర్తగా తోస్తున్నది.
వీరు రచించిన వానిలో మరికొన్ని గ్రంధములు 1. అమూల్యరత్నము - మైరావణ కథను అనుసరించి వ్రాసిన నవల. 2. వసంతయామినీస్వప్నము - షేక్స్పియర్ - ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ను అనుసరించి వ్రాసిన నాటకము.
ఇంతకు మించి ఈ కవి గురించిన వివరాలు ఏమియు తెలియుటలేదు.
శతక పరిచయం
"చక్రీ" అనేమకుటంతో 105 కందపద్యాలతో రచించిన భక్తిరస ప్రధానమైన శతకము. ఇందలి భాష సరళము. ప్రతి పద్యంలో భక్తి భావన తొణికిసలాడుతుంది.
క. అనయము నిన్నే తలఁచుచు
ననిశము నీనామమనెడి యమృతరసంబున్
దనియక త్రావెడి నరుఁడే
కనురా నీపదవి వేగ ఘనుఁడై చక్రీ
క. ఏరాముఁడొసఁగు సిరులను
ఏరాముఁడు కోరుకొఁనగ నిచ్చును వరముల్
వ్రాముఁ డొసఁగు వరపద
మారాముని మదిని దలఁతు ననిశము చక్రీ
క. నారాయణ నారాయణ
నారాయణ యనుచుఁ దలఁచు నరతతి తోనేఁ
గూరిమి సలుపుదు నెక్కువ
నేరము లెన్నేని యున్న నెంచను జక్రీ
ఈశతకంలోని చాలా పద్యాలలో పోతనగారి పద్యాలకు ఇతర ప్రసిద్ధ శతకాల పద్యాలకు అనుకరణలు చూడవచ్చు. క్రింది పద్యాలను చూడండి
హరి నామము స్మరియించిన
హరియించును బాప మనుచు నార్యులనుటచే
ధర స్మరియించెద నిన్నున్
హరి హరి హరి రామ రామ హరి హరి చక్రీ
హరి యను రెండక్షరములె
హరియించును నఘమ్ములనుచు నార్యులు సెప్పన్
హరి నెన్నఁడుఁ దలఁపని ము
ష్కరులకు బాపంబులెట్లు సడలును జక్రీ
(హరి యను రెండక్షరములు హరియించును పాతకమెల్లను అంబుజనాభా అను పద్యానికి అనుకరణ)
ఎవ్వఁడు సృజించె జగ మది
యెవ్వనిచేఁ బెంచఁబడెనొ యిమ్మనుజులు తా
మెవ్వనిఁ దలఁతురొ యిడుముల
నవ్విష్ణుని నేను దలఁతు ననయము చక్రీ
ఎవ్వఁడు పోసెను జలముల
నవ్వనముల వృక్షములకు నంబయుదరమం
దెవ్వఁడు పెంచెను శిశువుల
నవ్వానిని నేఁదలంతు నాత్మన్ జక్రీ
(ఎవ్వనిచేజనించు జగ మెవ్వనిలోపలయుండు లీనమై అన్న పద్యానికి అనుకరణ)
ఉన్నాఁడా జగదీశుం
డున్నాఁడా సృష్టికర్త యుండిననేఁడీ
ఉన్నాఁడున్నాఁ డనియెద
రెన్నఁడు కట్టెదుటఁ బడఁడదేమో జక్రీ
లేఁడా దీనులపాలిట
లేఁడా హరిభక్తు లందు లేఁడాశ్రీశుం
డేఁడి కవిజనముల యెడ
రాఁడాయెను గలఁడోలేఁడో రయమునఁ జక్రీ
(పోతనగారి గజేంద్రమోక్షంలోని పద్యాలు మనకు వెంటనే స్ఫురణకు వస్తాయి కదూ.)
దశావతార వర్ణనలు ఈ శతకంలో పొందుపరచారు.
మ్రుచ్చిలి వేదంబులు గొని
చెచ్చెర నాసోమకుండు సింధువుఁజొరఁగా
బచ్చదువులఁ దెచ్చితివిగ
మచ్చెమ వయి యసురఁ జంపి మహిలోఁ జక్రీ (మత్యావతారము)
తనయుఁడు హరిని భజించినఁ
గని శిక్షించెడి హిరణ్య కశిపుఁ దునుముచున్
మును ప్రహ్లాదునుఁ బ్రోచిన
ఘన నరసింహుండ వీవు కదరా చక్రీ (నరసింహావతారము)
భక్తిరస ప్రధానమైన ఈ శతకంలో నీతిప్రధానమైన పద్యాలు అనేకం. మచ్చుకి కొన్ని చూద్దాం.
కోపము కూడదు నరునకుఁ
గోపంబది మంచి మంచి గుణములఁ జెఱుచున్
కోపమును జంపకుండిన
బాపంబులు పెరుగునండ్రు ప్రాజ్ఞులు చక్రీ
విడవలె కోపము మనుజుఁడు
విడుచుచుఁ బన్నగము పొరను విడిచిన రీతిన్
దడయక యిహపరముల లోఁ
బడయఁగ వలెనండ్రు సుఖము ప్రాజ్ఞులు చక్రీ
వినవలె గురువుల మాటలు
కనవలె మాటాడు ముందు కడుదూరంబున్
జనవలె పెద్దల తోవల
మనవలె ఋణబాధ లేక మనుజుడు చక్రీ
తెలుగు నానుడులను సందర్భోచితంగా వాడటంలో ఈ కవి చతురుడు.
1. చిలుకలవలె రామాయని మెలగుట గడియైన మేలు మేదిని
2. గలపొట్తపోసికొనుటకు గలకాలము మనుటలేదె కాకము
3. మొక్కపుడు వంచకుండిన నెక్కుడు మ్రానైన వంచు టెట్టుల
4. చెఱుకుకు వంక పుట్టిన జె~ౠచునె యాచెఱుకుతీపు
వంటి అనేక ప్రాగోలను ఈ శతకంలో చూడవచ్చును.
భక్తి, నీతి, పద్యాలున్న ఈశతకం అందరూ చదవ వలసినది. మీరు చదవండి. అందరిచే చదివించండి
***
No comments:
Post a Comment