అనురాగపు విరిజల్లు
ఆండ్ర లలిత
అంతు పట్టనిది సమస్య అంతు చిక్కి
నది సఫలతే మన నిగూఢ నమ్మకములు
మన పునాదులు జీవన మలుపులందుసంశయాలకి చోట్లేదు సాగిపొమ్ము||తే.గీ||
గుఱ్ఱం మీద వచ్చి తనని ఎత్తుకుని వెళ్లిపోతాడని కలలు కన్నది ఏడు మల్లెపూలెత్తు, బయట ప్రపంచం ఎరుగని రాగిణి. మరి అలాగే పెద్దలు నిశ్చయించిన పెళ్ళి చేసుకుంది. కాని పెళ్ళి అంటే సినిమా కాదు, నిజ జీవితానికి, సినిమాకి సహస్రం తేడా అని పెళ్ళైయాక రోజు రోజుకీ అర్థమవ్వటం మొదలైనది రాగిణీకి. అసలు పెళ్ళైన మొదటరోజే, రాఘవ రాగిణి చేయి పట్టుకుని పెరట్లో మధుర సంభాషణల నడుమ “నువ్వు నా రాణీ, నీకూ నాకూ మధ్య ఏరోజూ, అయ్యో, రాఘవ నాకు ఎప్పుడూ చెప్పలేదే అనిపించకుండా ఒక విషయం చెప్పాలి. మన ఇద్దరి మధ్య దాపరికమనేది ఉండకూడదు అనేది నా నిగూఢ నమ్మకం. నేను ముందు ఒకళ్ళని ఇష్ట పడ్డాను. కాని సఫలమవ్వలేదు. మాది స్నేహంగా మిగిలిపోయింది. మేము మా హద్దులు దాటలేదు. ఈ విషయం మీద ఎప్పుడేనాసరే నీకేమి కావాలన్నా నన్ను నిస్సందేహంగా అడగడానికి నీకు పూర్ణాధికారం వుంది. నా వరకు మాత్రం అది ఒక చరిత్ర మాత్రమే. ఈ విషయం మరొకరి ద్వారా నీకు తెలిసి, నీలో కలవరము కలగకూడదు అని నా అభిప్రాయం. అది వివేకమైనదో కాదో నాకు తెలియదు. కాని నా భాగస్వామికి నా గురించి అంతా తెలియాలి అన్నది నా అభిలాష. ఒక అబధ్ధం చెబితే దాన్ని దాచడం కోసం మరికొన్ని అబధ్ధాలాడవలసి వస్తుందని మా అమ్మ చిన్నప్పటినుంచి చెబుతూ వుండేది” అని తన కళ్ళలోకి ఆతృతగా చూస్తూ సమాధానం కోసం వెతికాడు.
ఒక్కసారి నివ్వెర పోయింది రాగిణి. విధాడే నాటాకంలో ఊహించని మలుపుని ఆనందముగా స్వీకరించదలచింది. తన ప్రేమ మీద నమ్మకంతో. అనుమానాలకి తన జీవితంలో తావు లేదని నిర్ణయించుకుంది. మనసులోనే అలా అనుకుంటూ మౌనంగా నిలబడి పోయింది, మల్లెపొద దగ్గర...
“ఏవిటోయ్ మాట్లాడవే... నువ్వంటే నాకిష్టం. మనసులో ఏమి పెట్టుకోకు. పెళ్ళి అన్న పవిత్రబంధంలో దాపరికాలు, అపోహలకి చోటుండకూడదని చెప్పా..నా మనసులో నువ్వు తప్ప మరెవ్వరికీ చోటు లేదు, ఎప్పటికీ వుండదు రాగిణీ ” అని దగ్గర తీసుకున్నాడు రాఘవ.
“అబ్బామీరు మరీను...నాకు తెలీయదాయేంటి... అనొక చిరునవ్వుతో, దాంట్లో ఏముంది. ఫర్వాలేదు ఇప్పుడు మనము సంతోషంగా ముందుకి సాగిపోదాం” అంది. ఆ మాటలు ఊరట కలిగించాయి రాఘవకి. రాగిణి తన మనసులో అనుకుంది, రాఘవ నిజంగా శ్రీరామచంద్రుడే...రాఘవ కూడా రాగిణిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అంత చక్కటి జంట చూసి అందరూ ఎంతో మురిసిపోయేవారు. ఇంతలో రాగిణి అత్తగారు పార్వతమ్మ, మావగారు సాంబశివరావు వాళ్ళతో బస చేయటానికి వచ్చారు. “అమ్మాయ్ రేపటినుంచి మహాళయ పక్షాలు. ఉల్లిపాయి తినము. ఏకాదశౌవుతే పప్పు దినుసులు తినము. నువ్వు మరచిపోతే మీ అత్తగారు గుర్తు చేస్తారు” అంటూ సాంబశివరావు తన గదిలోంచి బయట వసరాలోకి వస్తూ భాగవతం చదివేందుకు ఒక చేతిలో పుస్తకము, మరో చేతితో కళ్ళజోడు సవరించుకుంటూ వాలుకుర్చీలో చతికిలపడ్డారు.
“మహాళయ పక్షాలెన్ని నెలలుంటాయి?” అని అడిగింది రాగిణి గుమ్మం దగ్గర వీధి కేసి తిరిగి, ఆ సూర్యనారాయణ మూర్తి వెలుగులో పంచాంగం చూసుకుంటుంన్న అత్తగారిని ఉద్దేశించి.
రాగిణి మాటలకి అత్తగారు పార్వతమ్మ మావగారు సాంబశివరావు రాగిణి కేసి తిరిగి, నివ్వరపోయి, వారు వారిని తమాయించుకుని, పార్వతమ్మ తన గొంతు సవరించుకుంటూ... “అది కాదురా. పక్షంమంటే 15 రోజులు. పాడ్యమి మొదలుకుని ఆమావాస్య వరకు”అంది పార్వతమ్మ. పార్వతమ్మకి వాళ్ళాయన మనస్తత్వం, కోపం తెలుసు. మళ్ళీ వాళ్ళాయన రాగిణి అమాయకపు ప్రశ్నలకి ఏమన్నా అంటే, కష్టంగా తోస్తుందేమోనని వాతావరణం మార్చటానికి.. “అమ్మడూ, సరేకాని ఆ కత్తిపీటందుకో వంటకి ఆలస్యంమౌతోంది. తాపిగా మధ్యాన్నం మాట్లాడుకోవచ్చు. రాగిణీ కాస్త మజ్జిగ చుక్కేసి నీళ్ళ గిన్నివ్వు” అంది పార్వతమ్మ.
అత్తగారు చక్కగా దూటని తరిగి మజ్జిగ గిన్నెలో వేసి, “ఇదిగో రాగిణి తీసుకో. కాస్త దూటకూరలో ఆవ, ఉప్పూకారాలు గూటించు. ఆ! అనట్టు మర్చిపోయాను ఆ వంటగదిలో అటకమీద ఆ పెద్ద స్టీల్ డబ్బాలో కూరవొడియాలున్నాయి. ఆఖర్న కాసిని వెయ్యి. అదేమిటే ఆ ఆవదం తాగిన మొహంతో వెఱ్ఱి చూపులు. కొంపతీసి రాదా ఏమిటి?”
సరేనా. పొద్దెక్కి పోతోంది. నీళ్ళోసుకొని వస్తా. అబ్బా కాళ్ళు పట్టేసాయ్ అంటూ, మెల్లిగా స్వాధీన పరుచుకుని లేస్తూ “అసలు దూటకూర వచ్చా రాదా?” “రాదు” “పోనిలే...నేనే చేస్తాలే. మీ అమ్మ మా అమ్మాయికి వంటొచ్చని అంటే సంబర పడ్డాను....ఏమిటో...అందుకే మావాడు ఎండు నక్కలా అయ్యాడు. హు...కాని...ఏమ్చేస్తామ్... అసలు ఆ తల్లిని అనాలి...కలికాలం” నిట్టూర్పుతో అక్కడ నుండి కదిలింది పార్వతమ్మ.
రాగిణికి పార్వతమ్మ మాటలు శూలాలలా గుచ్చుకున్నాయి.మనసు చెదిరిపోయింది. కళ్ళు చమర్చాయ్. పనులు తడబడుతున్నాయ్. తనని తాను ప్రశ్నించుకుంది. ఈవిడెవరు మా అమ్మని అంటానికి.. నాకొచ్చిన విద్యలు, భాషలు, కళలు ఈవిడికేమి వచ్చు. ఎంత ధైర్యం, నాతో అలా మాట్లాడటానికి. ఎమిటో కంపరమెత్తుతోంది. జీవితమంటే విరక్తి పుట్తోంది... అసలు ఈ కూర చేయటం రాకపోతే జీవితంలేదా... నాకు వచ్చినవేవో నాకు చాలు.. ఇంకొకళ్లకి ఇష్టమైనవి నేను ఎందుకు నేర్చుకోవాలి. నేను కావాలంటే నా పనులు నచ్చాలి. నచ్చకపోతే నేను ఏం చేయగలను. ఉండాలంటే ఉంటారు. వెళ్లాలంటే వెళ్తారు..అది వారి స్వయం నిర్ణయం... ఉఫ్... కడుపులో మండిపోతోంది... అంతా వీళ్ల మూలంగానే... నా ఆరోగ్యానికి వీళ్ళే బాధ్యులు...అసలు ఈవిడని నిలదీసి అడిగేయ్యాలి లేదు చెరిగేయ్యాలి అని రెండు అడుగులేసి, ఒద్దు .. అనుకుంటూనే దబదబా బాదింది స్నానాలగది తలుపు..
“అత్తయ్యగారండీ” “ఆ...ఏమిటి అమ్మడు” అంది పార్వతమ్మ. “తలనొప్పిగా ఉంది. ఒక్క 10 నిమిషాలు విశ్రాంతి తీసుకొనివస్తా” అంది రాగిణి.
“సరేనమ్మ.. తెల్లారగట్లలేస్తావ్, చలిలో పాపం.. అలిసిపోతావ్.. పడుకోమ్మా.. అనట్టు పొయ్యిమీద ఏమి పెట్టి మర్చిపోలేకదా.. చూసుకుని విశ్రాంతి తీసుకో.. వంట ఇదిగో రెండు చెంబులోసుకుని వచ్చి నే చూసుకుంటా..”
“ఏదోకటి చేసుకోండి.. I have better things to do…bye…” తనలోతను అనుకుంటూ, తన గదిలోకి వెళ్ళి పడుకుని కళ్ళు మూసుకుందికాని నిద్ర రాలేదు సరికదా మనసు గతంలోకి జారుకుంది...అసలు నే చేసిన తప్పేంటి? నన్నుచేసుకోమని ప్రాధేయ పడ్డానా..రాఘవని. కొత్తావకాయ్ కొత్త పెళ్ళి కూతురూ ఒకటే అని అంటారు.. అందరి కళ్ళు నా మీదే అయినా, మరీ ఇంతా.. ఒక మల్లె పొదలో చామంతి పూవుని వెతికితే ఎలా? ఇప్పుడు నాతో వీళ్లందరూ చేసేదదె. నువ్వు అలా ఎందుకున్నావ్. ఇదెందుకురాదు. అదెందుకు చదవలే...ఉఫ్... దేని అందం మరియు స్వభావం దానిదే.. ఏమిటో తలపగిలి పోతోంది. తలనొప్పి మాత్ర వేసుకుని పడుక్కుంటా.. ఇవాళ నా పుట్టెడు ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిందే.. రాఘవ..
ఇంతలో ఇక్కడ పదిసార్లు కాలుకాలిన పిల్లిలా వంటగది నుంచి రాగిణి గదిలోకి తిరిగింది పార్వతమ్మ. తన మనసు పరిపరి విధాలపోయింది. అయ్యో నీరసంగా పడుకుందేమో హార్లిక్స్ ఇవ్వనా అని ఆ గదిలోకెళ్లింది. అమ్మా రాగిణీ..మంచి గాఢ నిద్రలోనుంది.. ఆదమరచి పడుకుంది. పోనీ పడుకోమ్మా.ఆ నిద్రతోనన్నా నీ మనసు కుదుటపడితే చాలు. దుప్పటి కప్పి, ముద్దొచ్చి ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనసుననుకొని తల నిమిరి..అబ్బ ఎంత బిరుసో జుట్టు.. చమురెట్టి ఎన్ని రోజులైందో...పిచ్చి పిల్ల నెత్తికి చమురు పెట్టుకోవాలిరా.. అప్పుడు తలనొప్పిరాదు నాన్నా, అని మనసున అనుకుంటూ, గది తలుపు దగ్గరగా వేస్తూ, గోడ గడియారంకేసి చూసి ఇంకెంత, ఇంకొక అరగంట్లో వంటైపోతుంది.. అప్పుడు లేపుదామ్.. నాలుగు మెతుకులు తింటే ... శక్తొస్తుంది.
వంట గదిలోంచి వస్తూ అయ్యో అప్పుడే ఒంటిగంట.. .. అనుకుంది... అక్కడ జపతపాలు ముగించి పేరట్లో నీళ్ళ పంపు దగ్గర కాళ్ళు కడుక్కుంటూ ఏవమ్మో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి.... భోజనం తాయారౌతే చెప్పు.. వసారాలో భోజనాల బల్ల దగ్గరికి వస్తా అన్నారు సాంబశివరావు.... అయ్యింది....ఒక్క క్షణం భోజనాల బల్ల అమరుస్తున్నా... పెట్టేస్తా.. అమ్మాయికి నలతగా ఉందని పడుకుంది..చూసివస్తా.... అయ్యో, కంగారు పడకు.. అమ్మాయిని చూసుకో... నే ఆగుతా... బల్లమీద అన్నీ అమర్చి తడిచేయి తన చీర కొంగుకి తుడుచుకుంటూ గదిలోకి పార్వతమ్మ వెళ్లి నుదురుమీద ప్రేమతో చేయి పెట్టి, పక్కన కూర్చుని “అమ్మడూ లేవరా ఒళ్ళు వేడిగా ఉంది.. జ్వరం చూడనా తల్లీ” “ఉహు..లేదు చూసుకున్నా”
“పొద్దున్న బానే ఉన్నావ్. పొరపాటున నా మాటలతో నువ్వు నొచ్చుకుంటే నాతో చెప్పరా.. నేననను. నీతో కొద్ది రోజులు గడిపినా నీకూ నాకు ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది..” అని తల నిమిరింది. “అమ్మమీద బెంగా..తమ్ముడు గుర్తొచ్చాడా, మాట్లాడావా ఈవాళ?? పోనీ వెళ్తావా..”
“ఉహు..” అని పార్వతమ్మ చేయి మృదువుగా తన మీదనుంచి తీసి పార్వతమ్మ కేసి చూస్తూ అదేమిలేదు.. మీకూ మావయ్యగారికి ఆలస్యంమౌతోంది భోజనం చేసేయ్యండి..నాకాకలి లేదు...అసలు కూర్చో ఏమిటి ఆ జుట్టూ, ఉడతలు పీకిన తాటిటెంకలా..అంటూ తన గదిలోంచి చమురు తెచ్చి బాగా మర్దనా చేసి.. చక్కగా దువ్వి, జడ వేసి , పార్వతమ్మ తన కోడలికేసి చూస్తూ మురిసిపోతూ, ఏదిటు తిరుగు ఇప్పుడు లక్షణంగా ఉన్నావ్. ఎక్కడ తలనొప్పిఅక్కడికి పోతుంది, అంటూ లేచి చమురు, దువ్వెన్నా మళ్ళీ ఎక్కడవక్కడ పెట్టివస్తానమ్మా, మళ్ళీ స్థానాలు మారుస్తే అవసరమైనప్పుడు దొరకవు.. రెండగులు వేసి మళ్ళీ ఎందుకో వెనకకు తిరిగి అంత చలిలో పని చేస్తావ్ పాదరక్షలో మేజోళ్ళో వేసుకుని కాపాడుకో. రొంప పట్టి తలనొప్పొస్తుంది.. వెనకటికి మా బామ్మ అనేది.... ఇప్పటిళ్లు కాదుకదా మట్టి ఇళ్లు కదా, ఆవిడ మంచం మీద కూర్చొని , నేనూ మా మేనత్త పిల్లలు, పిన్నతల్లి పిల్లలు ఆడుకుంటుంటే, పిల్లలు అలా తడిలో ఆడద్దు... మంచంమీద కూర్చోండి. నేల చెమ్మ నెత్తికెక్కుతుందర్రా. అమ్మా రాగిణి రెండు చెంబులు నీళ్ళోసుకుని రా.. ఇంతలోకి మావయ్యగారికి అన్నంపెట్టి , వస్తా.
“మీరు తినేయండి. నాకు ఆకలిలేదు” అంది రాగిణి. “నీకు పెట్టకుండా నేనెలా తినను అమ్మడూ.. అయ్యో పిచ్చి పిల్లా.. కాస్త దోసకాయ పప్పో, దూటకూరో.. ఇంగువ చారో ఏమి కలపను? కలిపి తెస్తా ఇక్కడికి.. ఇక్కడే కూర్చో, నోట్లొ పెడ్తా.. ఆకలికేమో తలనొప్పి..ఆకలి కూడా తెలీదు ఎలా బతుకుతావె..” ఊ...ఉహు వద్దు..నాకు నిద్ర వస్తోంది.. అని పక్కకు తిరిగి పడుకుంటే తన కేసి మళ్ళీ తిపప్పుకుని,లే....అలా సరియైన సమయానికి తినకపోతే ఆరోగ్యం పాడౌతుందిరా!
అమ్మడూ! స్నానం చేసిరా, అని సాంబశివరావు గారికి భోజనం పెట్టి, రాగిణి గదిలోకి వచ్చి, రాగిణి స్నానం చేసిందని గమనించి ,అమ్మయ్య ఇప్పుడు తేలికగా ఉంది మొహం.. నా బంగారు తల్లి. కాస్త పెరుగన్నం అరటి పండు తిని పడుకో, చలవచేస్తుంది అంటూ ఇలా వెళ్లి అలా వచ్చి గోరుముద్దలు తినిపిస్తుంటే అసలు నాకు కోపం ఎందుకు వస్తోందని రాగిణికి ఎక్కడో తన మనసులో అనిపించినా, అంగీకరించలేక అన్నం తిని పడుకుంది. ఎప్పుడు పట్టిందో నిద్ర పట్టిపోయింది. సాయంకాలం కచేరి నుంచి రాఘవ వచ్చి, ఎవరి పనుల్లో వారున్న తల్లీ తండ్రిని చూసి “అమ్మా, రాగిణి ఏది అని అడిగితే... వంటగదిలోంచి మంచినీళ్ళుతెస్తూ, అలా గట్టిగా మాట్లాడకు ఒంట్లో బాలేదు పడుకుంది... రాఘవ నివ్వెరపోయి, అమ్మా నువ్వేనా మాట్లాడేది.. కోడలొచ్చేటప్పటికి వేరు. మాకైతే ఎంత నలతగానున్నా అసురసంధ్యవేళ పడుకుంటే ఒప్పుకునేదానివా, అని గట్టిగా నవ్వుతూ తన గదిలోకి వెళ్లి నిద్రలేపాడు రాగిణిని.
“ఎప్పుడొచ్చారు... “ “ఇప్పుడే. మనసు బాగాలేదా? “ ఇప్పుడు కుదుటపడిందా? పడితే చెప్పు, అసలెందుకు నొచ్చుకుంది? ఆగు, అమ్మ కాఫీ కలుపుతోంది ఇద్దరికి. తాగుతూ మాట్లాడుకుందాం. ఒక్క క్షణం” అని అమ్మదగ్గరనుంచి కాఫీ అందుకుని రాగిణి దగ్గర కూర్చుని “ఇప్పుడు చెప్పు” అన్నాడు రాఘవ. “నాకు నా మనసు నొచ్చుకుని కోపం వచ్చినప్పుడు తారాజువ్వలా లేస్తుంది...” “బాబోయ్ నేను జాగ్రత్తగా ఉండాలౌతే..” అబ్బా వినండి.అప్పుడు మాత్రం అసలు ఈ సమస్యకి పరిష్కారం లేదనిపిస్తుంది. బ్రతుకు మీద విరక్తి. కాని నా మనసు శాంతింపజేసుకుని ఇంత ఆరోగ్యం మీద తెచ్చుకునే సమస్యా..ఇది! జీవణ మరణ సమస్యా !! క్షమించలేమా! అంత పెద్ద మాటా. 100 తలనొప్పి మాత్రలకు కూడా తగ్గదేమో ఇప్పుడు ! అసలు సమస్యని సాధనచేసి జయిస్తే అందరం సుఖముగా ఉండగలమేమో. కోటి విద్యలు కూటికోసమేగదా.. ఆలోచించినప్పుడు.. పరిష్కారం, నేను నేర్చుకోవటం, వంటౌవ్వనీ లేక నడవడికవ్వని. నేను, నా వాళ్లని స్వీకరించినప్పుడు జవాబు దొరకటమే కాదు..ఓస్ ఇంతేనా అనిపించింది... తలనొప్పి కూడా పోతుంది.. ఇలా మీతో మాట్లాడుతుంటే నాకొక సూక్తి గుర్తుకొస్తోంది.. తాళం చెవిలేని తాళం కప్ప, పరిష్కారం లేని సమస్యలు ఉంటాయా ఈ భగవంతుని సృష్టిలో, చేయాలనే మనసుంటే మార్గం అదే కనబడుతుంది.
మనం శాంతంగా వెతకాలంతే....మరి నా కోపం, ఆవేసం ...తలనొప్పికింద ప్రతిఫలిస్తే ఒక తలనొప్పి మాత్ర వేసి దానిని తగ్గిస్తే కాస్త ఒక్క కునుకు పట్టింది... మళ్లీ మా అత్తగారొచ్చి నుదురు మీద చేయి వేసి లేపేవరుకు మేలకువరాలేదు..ఏమిటో, ఆ క్షణికావేసం ఎంత పని చేసింది.. అత్తయ్యగారు నన్ను బతిమాలి ముద్దుచేస్తూ గోరుముద్దలు తినిపిస్తుంటే నాకు ఆవిడలో ఒక మాతృహృదయం తొంగి చూసింది. అది నా కోపాన్నీ, పిచ్చి పంతాన్ని హతమార్చింది.
“అవును కదా... సుమతీ శతకంలో చెప్పినట్లు, తన కోపమే తన శత్రువు తన శాంతమె తనకు రక్ష ....” “నిజం, అసలు ఏ మంచినీ నమ్మకాన్నీ స్నేహాన్నీ లేక ప్రేమని ఆశిస్తున్నానో మీ అందరి దగ్గరనుంచీ, అవి ముందు నాతో మొదలవ్వాలి కదండీ ..అని అంది రాగిణి, రాఘవ కేసి చూస్తూ. అన్నట్లు ఒక పాట నాకు గుర్తొస్తోంది.. రాగిణీ!! సరస్వతి రాగంలో త్యాగరాజ కృతి.. అనురాగంలేని మనసున సుజ్ఞానము రాదు..అమ్మ బాగా పాడతుంది.
“అవునా” అంటూ లేచి వెళ్లి పోతుంటే..హే రాగిణీ ఎక్కడికీ ఆ పరుగు.. రాగిణి ఒక్కసారి వెనుకకు చూసి..”రండి వసారాలోకి..”అని నవ్వింది. వసారాలో టూబ్లైట కాంతి కింద రామకోటి వ్రాస్తున్న పార్వతమ్మతో “అత్తయ్యగారండీ అనురాగంలేని మనునకు సుజ్ఞానము రాదు|| పాటపాడరా అండి.. “ అలాగే, అని పుస్తకం కలం పక్కన పెట్తూ చాలా కాలంమైనది అని కూని రాగంతీస్తూ కంఠం సవరించుకుంటూ......ఈ పాట పాడి...ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పాడలేదు...అని అందుకుంటుంటే అమ్మా ఒక నిమిషం అని రాఘవ వీడియో తీయటం మొదలు పెట్తూ” అమ్మా ఇప్పుడు పాడూ..” పార్వతమ్మ గాత్రం మొదలైన వెంటనే సాంబశివరావు తను చదివే వారపత్రిక ప్రక్కన పడేసి వసారాలో పడకకుర్చిలో కూర్చుని అందరితో ఆనందసాగరాలలో తేలిపోయారు.
“అమ్మ మరోకపాట” రాఘవ అంటం... అత్తయ్యగారు అందుకోవటం... అలా తన కంఠంతో మంత్రముగ్దులని చేస్తుంటే.. రాగిణి ఒకసారి అందరికేసి చూసి చిన్న చిన్న మనస్పర్థలులో మునిగి బాధ పడే కన్న పెద్ద పెద్ద ఇలాంటి ఆనందాలలో తన్మయత్వం చెందటము మేలేమో కదా అంది రాఘవ బుజంమీద తన తలవాల్చి రాగిణికి ఇంత అందమైన సంసారాన్ని చూసినప్పుడు మెరుపులా షేక్ స్పియర్ మాట గుర్తొచ్చింది.. ఇష్టమైన పనిని ఎవరైన చేస్తారు, కానీ గొప్పవారు మాత్రం, చేస్తున్న ప్రతీ పనినీ ఇష్టపడతారు.
“నేను ఒక్క రోజు పడుకుంటే గిలగిలలాడిపోయే నా వాళ్ళని, నే ఎలా ఒదులుకోగలను రాఘవ..” అందుకని అనురాగంతో నేను నా వాళ్ల మనసులో స్థానం కోసం మారి, చిన్న చిన్న నా మనస్పర్థలకు తావులేకుండా చూసుకుంటా.
రాఘవ రాగిణికేసి తిరిగి “జీవిత ప్రయాణంలో చిక్కు సమస్యలు సహజం. అది ఎవరంతట వారు నిదానమే ప్రధానముగా, శాంతముగా, విభజించుకొని పూర్ణంచుకోవాలి. ఎవరి సమస్యలు సఫలతలు వారివే.. మన జీవిత ప్రయాణం ఒక రణరంగమా లేక ఆనందసాగరమా అన్నది వ్యక్తిగత ప్రశ్న. మనవాళ్లు మనకి సహాయ పడగలరుకాని, తుది నిర్ణయం మనదే కాదా! సమస్య నుండి నీలా ఎదరుకోవాలి, దాని అంతరంగాలు, లోతులు తెలుసుకుని, దానిలో మనసా, వాచా,కర్మణా నిమగ్నమై మనసారా చేయాలి.. రాగిణీ, అయినా! మన మధ్యలో ఎంతటి సమస్యలైనా అనురాగపు విరియ జల్లులో కరిగిపోతాయి..ఇప్పుడు మన సంసారం ఆనందాలహరివిల్లు రాగిణీ...” అని దగ్గరకు తీసుకున్నాడు..
“అవును, ఆ ఉత్సుకత లేకపోతే సమస్యలనెలా పూర్ణించగలము రాఘవ. అయినా మనకి చిక్కుముడులు విప్పటం బ్రహ్మ విద్య కాదుగా, కూసు విద్యే”. దరహాసముతో అంటూ ఇరువురూ జీవన ప్రయాణం ముసి ముసి నగవుల సవ్వడ్లలో సాగించారు...
***
No comments:
Post a Comment